Tuesday, September 15, 2020

వృత్రాసుర వృత్తాంతం, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం .... శ్రీ మహాభాగవత కథ-36 : వనం జ్వాలా నరసింహారావు

 వృత్రాసుర వృత్తాంతం, ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం

శ్రీ మహాభాగవత కథ-36

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         తన కుమారుడైన విశ్వరూపుడిని ఇంద్రుడు చంపాడని తెలుసుకున్న అతడి తండ్రి త్వష్ట ప్రజాపతి దుఃఖంతో, రోషంతో మండిపోయాడు. తక్షణమే ఆయన మొదలుపెట్టిన మారణహోమ కుండంలో నుండి యముడి కంటే భీకరమైన ఒక భూతం బయటకొచ్చింది. ఆ భూతాకారం నుండి ఎర్రటి మీసాలతో, శిరోజాలతో, భయంకరమైన చూపులతో వృత్రాసురుడు జన్మించాడు. వాడు భయాన్ని కలిగిస్తూ తళ-తళ మెరిసే ఒక శూలాన్ని ధరించాడు. వాడి శరీరం నేలా, నింగీ తాకుతున్నది. వాడి శిరస్సునుండి వెలువడే అగ్నిజ్వాలలకు గ్రహాలు జారిపడుతున్నాయి. నోటితో ఆకాశాన్ని చప్పరిస్తూ, నాలుకతో గ్రహసముదాయాన్ని నాకుతూ, లోకాలన్నీ మింగుతూ, కోరలను తిప్పుతూ దేవతా శత్రువైన వృత్రాసుడు దారుణంగా విజృంభించాడు. వాడి ధాటికి దేవతల బాణాలు తట్టుకోలేకపోవడంతో వారు పారిపోయారు. దిక్కుతోచక పుండరీకాక్షుడిని శరణు వేడుదామని నిర్ణయించుని, దేవతలు ఆయన దగ్గరకు వెళ్లారు. క్షీరసాగరంలో వున్న శ్రీమన్నారాయణుడిని  సమీపించి దేవతలంతా దేవదేవడైన ఆయన్ను అనేకవిధాలుగా స్తోత్రం చేసారు.   

వృత్రాసురుడి వల్ల కలిగిన ఆపద నుండి తమను రక్షించమని శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు దేవతలు. అలా వేడుకుంటున్న దేవతలకు శ్రీహరి ప్రసన్నుడై దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చిన భగవంతుడికి దేవతలంతా సాష్టాంగ దండ ప్రణామాలు చేసి మరీ-మరీ స్తుతించారు. వృత్రాసురుడు తమ తేజస్సుతో పాటు ఆయుధాలను కూడా మింగాడనీ, భీకరాకారుడైన వాడిని అణచివేసి తమను రక్షించమని వేడుకున్నారు దేవతలు. ఇలా తనను ఆశ్రయించి స్తుతిస్తున్న దేవతలను చూసి పరమేశ్వరుడైన శ్రీహరి ఇలా అన్నాడు. "ధధీచి అనే ఋషి వున్నాడు. మీరంతా అతడి తేజోవంతమైన శరీరాన్ని అడిగి పుచ్చుకోండి. అతడే ఒకప్పుడు అశ్వినీ దేవతలకు ’అశ్వశిరం’ అనే విద్యను, త్వష్ట ప్రజాపతి కొడుకు విశ్వరూపుడికి ’నారాయణ కవచం’ స్తోత్రాన్ని అనుగ్రహించాడు. మీరు అశ్వినీ కుమారులను ముందు నిలబెట్టి అడుగుతే అతడి దేహాన్ని మీకిస్తాడు. ఆ దేహం శల్యాలతో విశ్వకర్మ నూరు అంచులుకల ఆయుధాన్ని తయారు చేస్తాడు. ఆ ఆయుధంతో వృత్రాసురుడి శిరస్సు ఖండించండి. దానివల్ల మీరు తిరిగి మీ తేజస్సు, ఆయుధాలు, సిరి సంపదలు పొందుతారు". ఇలా చెప్పి ఆయన అదృశ్యమయ్యాడు. 

శ్రీహరి సలహా మేరకు దేవతలు దధీచి మహాముని దగ్గరకు పోయి ఆయన దేహాన్ని ఇవ్వమని ప్రార్థించారు. అడగరానిది అడిగామని, అయితే తమకు పట్టిన గతికి అడగక తప్పలేదని అన్నారు. మొదట కొంత సందేహించినప్పటికీ చివరకు దేవతలకు తన దేహం ఇవ్వడానికి అంగీకరించాడు దధీచి మహర్షి. దేవతల్లాంటి ఉత్తములకు సంతోషం కలుగుతుందని అంటే తన శరీరాన్ని వారికి అర్పించడం కంటే తనకు ఇష్టమైనది మరేదీలేదని అన్నాడు. కుక్కలకు, నక్కలకు గురికాకుండా తన శరీరం దేవతలకు ఉపకరించడం తనకు సంతోషంగా వుందన్నాడు. ఇలా నిశ్చయించుకున్న దధీచి, తత్త్వాన్ని దర్శించి, అన్ని బంధాలు తెంచుకుని, అన్నీ భగవంతుడి మీద ఏకీభూతం చేసి, శరీరాన్ని విడిచిపెట్టాడు. అప్పుడు విశ్వకర్మ దధీచి ఎముకలను తీసుకుని నూరు అంచులుకల వజ్రాయుధాన్ని చేసి దాన్ని దేవేంద్రుడికి ఇచ్చాడు. అది తీసుకుని ఇంద్రుడు సమస్త పరివారంతో వృత్రాసురుడి మీదకు యుద్ధానికి పోయాడు. వృత్రాసురుడు పెద్ద కొండలా దేవేంద్రుడి మీదకు దూకాడు. ఇరివురి సైన్యాలు ఢీకొన్నాయి భీకరంగా.

దేవతలకు, రాక్షసులకు మధ్య భయంకరమైన మహా సంగ్రామం జరిగింది. అస్త్రశస్త్రాలతో మంటలు చెలరేగేలా యుద్ధం చేశారు. ఇరు సైన్యాలు సమానమైన బలపరాక్రమాలతో వున్నాయి. అందువల్ల ఇద్దరికీ జయాపజయాలు సమానంగా వున్నాయి. యుద్ధరంగం అంతటా నెత్తుటి వరదలు పారసాగాయి. ఈ విధంగా దేవదానవులు, నర్మదానదీ తీరంలో, కృతయుగంలో మొదలు పెట్టి త్రేతాయుగం వరకూ పోరు దారుణంగా చేస్తూనే వున్నారు. దేవతల ధాటికి రణరంగాన్ని వదిలి పారిపోతున్న రాక్షసులను పురికొల్పి, హెచ్చరించి యుద్ధానికి ప్రోత్సహించాడు వృత్రాసురుడు. ఇలా తనవారిని ప్రోత్సహిస్తూ ప్రళయకాల రుద్రుడిలాగా భయంకరంగా విజృంభించాడు వృత్రాసురుడు దేవతల మీదికి. ఆ రాక్షసరాజు పాదాల కింద దేవతల దేహాలు రూపు మాసిపోయాయి. అలా ఆశ్చర్యంగా క్రీడిస్తున్న వాడిమీద ఇంద్రుడు నూరు వజ్రాయుధాలకు సమానమైన గదాదండాన్ని విసరివేశాడు. దాన్ని వృత్రాసురుడు తన ఎడమచేత్తో పట్టుకుని, దాంతోనే కఠినంగా ఇంద్రుడి ఐరావతాన్ని చావమోదాడు. ఆ దెబ్బకు ఐరావతం కుప్పకూలింది. దాన్ని మళ్లీ తన అంకుశంతో అదుపులోకి తెచ్చాడు ఇంద్రుడు. ఇంద్రుడిని తన ఎదురుగా చూడగానే కోపంతో వూగిపోతూ వృత్రాసురుడు, తన అన్న గారు, ఇంద్రుడి గురువైన విశ్వరూపుడిని చంపిన అతడిని చంపి అగ్రజుడి ఋణం తీర్చుకుంటానని అన్నాడు.  

ఇంద్రుడిని రకరకాల హెచ్చరించసాగాడు వృత్రాసురుడు. "యుద్ధరంగంలో నిన్ను చంపి పిశాచాలకు తృప్తిగా విందు చేస్తాను. అలా కాకుండా నువ్వే నీ వజ్రాయుధంతో నన్ను చంపితే ఈ పంచ భూతాలలో కలిసి శూరుల చరణ దూళిలో భాగం అవుతాను. సందేహించకుండా నీ వజ్రాయుధాన్ని ప్రయోగించు. అది చాలా విశిష్టమైనది. శ్రీమహావిష్ణువు తేజస్సుతో, దధీచి మహర్షి వీర్యాతిశయం వల్ల ఉద్భవించినది. అందువల్ల శ్రీహరిచేత నియంత్రితుడవై నన్ను జయించు. శ్రీమహావిష్ణువు ఎక్కడ వుంటే అక్కడ జయం వుంటుంది. కాబట్టి నేను భక్తవరదుడు, కమలాక్షుడు, సర్వేశ్వరుడైన భగవంతుడి పాదాల మీద నా మనస్సు భద్రంగా వుంచుతున్నాను. నీ వజ్రాయుధం వేటుకు నారాయణ దాసుడనైన నేను శరీరాన్ని విడిచి భగవంతుడి సన్నిధి చేరుకుంటాను" అని అంటూ వృత్రాసురుడు ఆ పరమేశ్వరుడిని ఉద్దేశించి ప్రార్థించాడు.

సర్వాత్ముడు, అగణిత గుణుడైన శ్రీహరిమీద వృత్రాసురుడు తన మనస్సును కేంద్రీకరించాడు. భయంకరంగా లంఘించి, శూలాన్ని ధరించిన వృత్రాసురుడు ఇంద్రుడి మీదికి దూకాడు. అతడు విసిరిన శూలాన్ని వజ్రాయుధంతో ఖండించాడు ఇంద్రుడు. వెంటనే అతడి భుజాన్ని కూదా నరికాడు. ఏకహస్తుడైన వృత్రాసురుడు ఇనుప గుదియతో ఇంద్రుడి చెంపను కఠినంగా నొప్పించాడు. ఐరావతం కుంభస్థలాన్ని బద్దలు చేశాడు. ఇంద్రుడు ధైర్యం కోల్పోయి వజ్రాయుధాన్ని నేల విడిచాడు. ఆయుధం చేతలేని ఇంద్రుడి దైన్యావస్థ చూసి యుద్ధ ధర్మాన్ని ఎరిగిన వృత్రాసురుడు అతడిమీద దాడి చేయలేదు. ఆయుధాన్ని తీసుకోమని ఇంద్రుడికి సూచించాడు. ఇంద్రుడు వృత్రాసురుడి ధర్మగుణానికి శిరస్సు వంచుకున్నాడు. అప్పుడు వృత్రాసురుడు, యుద్ధంలో ఆయుధం విడిచిపెట్టిన వాడిని, శరణు అన్న వాడిని తాను చంపనని, చేజారిన ఆయుధాన్ని తీసుకోమని, వైరిని జయించమని అన్నాడు ఇంద్రుడితో. యుద్ధం అనే ద్యూత క్రీడలో జయాపజయాలు దైవాధీనమనీ, తాత్త్వికమైన దృష్టితో ఆలోచించమనీ, అంతా కమల లోచనుడి లీల అనీ, జగత్తంతా మహావిష్ణువు మాయాతంత్రంతో ఆడించబడుతుందనీ, అది అర్థం చేసుకోమనీ చెప్పాడు.

వృత్రాసురుడి మాటలు విన్న ఇంద్రుడు అతడిని దైవసమానుడిగా భావించాడు. కిందకు వంగి తన వజ్రాయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. వృతాసురుడితో ఇలా అన్నాడు ఇంద్రుడు: "ఓ దానవేంద్రా! నీ బుద్ధి వేదాంతాన్ని కలిగి వున్నది. తత్త్వ జ్ఞానంతో ప్రకాశిస్తున్నది. ఆది పురుషుడైన ఆ శ్రీహరికి నువ్వు మహాభక్తుడివి అని అర్థం చేసుకున్నాను. విష్ణుమాయను నువ్వు నీ చిత్తంతో తెలుసుకున్నావు. ఇక ఈ భయంకరమైన రాక్షస రూపాన్ని వదిలి పురాణ పురుషుడి రూపాన్ని ధరించు". ఇలా అంటున్న ఇంద్రుడిని వృత్రాసురుడు యుద్ధానికి పురిగొల్పాడు. భీకరంగా ఇరువురూ యుద్ధం చేస్తుండగా, రాక్షస రాజు నాలుక సాచి ఐరావతాన్నీ, ఇంద్రుడినీ కలిపి మింగాడు. గర్భంలో వున్న ఇంద్రుడు వైష్ణవీ విద్యను జపిస్తూ కదలకుండా వున్నాడు. తన వజ్రాయుధంతో వృత్రాసురుడి ఉదరాన్ని ఛేదించాడు. ఐరావతంతో సహా బయటకు వచ్చి వజ్రాయుధంతో అతడి శిరస్సు ఖండించాడు. వృత్రాసురుడి శరీరం నుండి ఒక దివ్యతేజం వెలువడి విష్ణులోకంలో ప్రవేశించింది.

వృత్రాసురుడిని చంపిన ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది. అది చండాల రూపంలో ఇంద్రుడి వెంటపడింది. దాన్నుండి తప్పించుకోవడానికి దేవేంద్రుడు పరుగెత్తసాగాడు. ఆకాశం, భూమి, దిక్కులూ అన్నీ తిరిగాడు. చివరకి మానస సరస్సులోకి ప్రవేశించి, వేయి సంవత్సరాలు చింతాగ్రస్తుడై గడిపాడు. పరమేశ్వరుడి భయం వల్ల, అక్కడికి బ్రహ్మహత్యా పాతకం వెళ్లలేక పోయింది. అదే సమయంలో నహుషుడు స్వర్గాధిపత్యం చేపట్టి శచీదేవిని తనకు భార్యవు కమ్మన్నాడు. బ్రహ్మర్షులు మోస్తున్న పల్లకీ ఎక్కి వస్తే అతడితో వుంటానన్నది. నహుషుడు అలాగే చేసి వారి శాపానికి గురై స్వర్గ భ్రష్టుడయ్యాడు. ఇంతలో మానస సరస్సులో నుండి ఇంద్రుడు వచ్చాడు. వేయి సంవత్సరాలు గడిచేసరికి, బ్రహ్మహత్యా పాతకం క్రమంగా క్షీణించింది. ఇంద్రుడు బ్రహ్మర్షులతో కూడి అశ్వమేధానికి దీక్ష చేబట్టి నారాయణుడిని సంతృప్తి పరిచాడు. శ్రీమన్నారాయణుడిని ఆరాధించి తన కల్మషాలన్నింటినీ పోగొట్టుకుని వర్ధిల్లాడు.     

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment