Saturday, September 19, 2020

త్రిపురాసుర సంహారం, చతుర్విధ వర్ణాశ్రమ ధర్మాలు ..... శ్రీ మహాభాగవత కథ-40 : వనం జ్వాలా నరసింహారావు

 త్రిపురాసుర సంహారం, చతుర్విధ వర్ణాశ్రమ ధర్మాలు

శ్రీ మహాభాగవత కథ-40

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

మయాసురుడి వల్ల ఒకానొక సందర్భంలో మహేశ్వరుడి మహిమాన్వితమైన యశస్సుకు మచ్చకలిగింది. వివరాల్లోకి పోతే.... దేవతల పరాక్రమానికి తట్టుకోలేని రాక్షసులు ఒకడుగు వెనక్కు వేసి, మయుడి చాటున దాక్కున్నారు. దుర్మార్గుడైన మయుడు బలిష్టమైన పూడు పురాలను రాక్షసులకు నిర్మించి ఇవ్వడంతో వారందులో ప్రవేశించి యథేఛ్చగా తిరుగుతూ లోకాలను ఇబ్బందులకు గురిచేశారు. లోకపాలకులు మహేశ్వరుడి శరణుజొచ్చారు. ఆయన వారికి అభయమిచ్చి ఒక దివ్యబాణాన్ని త్రిపురాలమీద వేశాడు. దాన్నుండి అనేక వేల బాణాలు పుట్టి త్రిపురాలను కప్పివేశాయి. ప్రాణాలు కోల్పోయిన రాక్షసులను మయుడు సిద్ధరసం బావిలో పడేయడంతో వారు బతికి మరింత రెచ్చిపోయారు. అప్పుడు విష్ణుమూర్తి పాడి ఆవు రూపం ధరించి, బ్రహ్మను గోవత్సంగా మార్చి, బావిలోని అమృతాన్ని తాగాడు. రాక్షసులు, వారితోపాటు మయుడు దుఃఖించసాగారు. అప్పుడు శివుడు విడిచిన ఒక బాణం దెబ్బకు త్రిపురాలు కాలిపోయాయి. త్రిపురాసుర సంహారంతో సమస్త ప్రజలు సంతోషించారు. శివుడు కైలాసానికి వెళ్లిపోయాడు. 

త్రిపురాసుర సంహార విషయాన్ని ధర్మరాజుకు చెప్పిన నారదుడు, దానికి కొనసాగింపుగా, ఆయన నారాయణుడి ద్వారా బదరీవనంలో విన్నసనాతన ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాలను గురించి వివరించాడు. నారదుడు చెప్పిన విషయ సారాంశం: అన్ని వర్ణాలవారికి సత్యం, దయ, ఉపవాసం మొదలైన దీక్షలతో పాటు, సదాచారం, ఓరిమి, మంచి-చెడ్దల తెలివి, సంతృప్తి, మృదు స్వభావం, ప్రాణుల్లో పరమాత్మను దర్శించడం, శ్రీమన్నారయణ స్మరణ లాంటి ముప్ఫై లక్షణాలు కలిగి వుండాలి. సంస్కారాలకు భంగం కలగకుండా బ్రాహ్మణుడు మంత్రయుక్తంగా కర్మలు చేయాలి. శాస్త్రంలో విధించబడ్డ యజ్ఞాలు చేయడం-చేయించడం లాంటి ఆరు కర్మలు బ్రాహ్మణుడు విధిగా నిర్వహించాలి. అలాగే క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు శాస్త్రం చెప్పిన రీతిలో వారి-వారి ధర్మాలను నెరవేర్చాలి.  దొంగతనం, హింస లాంటివి ఎవరికీ తగవు. స్త్రీ తన ధర్మాన్ని, పురుషుడు తన ధర్మాన్ని శాస్త్రం చెప్పిన రీతిలో ఆచరించాలి. సాత్త్విక ధర్మంతో ఎప్పుడూ వంశాచార క్రమంగా తనకు విధించబడ్డ ధర్మాన్ని తప్పక ప్రవర్తించే మానవుడు మెల్లగా స్వభావసిద్ధమైన కర్మాచరణను విడిచి, ముక్తిని పొందుతాడు. పుట్టుకతో మానవుడి కులాన్ని నిర్ణయించాల్సిన అవసరం లేదు. అంతరింద్రియ, బహిరింద్రియ నిగ్రహాదులు మొదలైన లక్షణాల ఆచరణతో గుర్తించాలి.

బ్రహ్మచర్యంలో వున్నవాడు మంచి నడవడితో, మూడు సంధ్యలలో బ్రహ్మరూప గాయత్రి మంత్రాన్ని జపించాలి. దేవతార్చన చేయాలి. ఇంద్రియాలను వశపర్చుకుని సత్యాన్నే మాట్లాడాలి. ఆత్మస్వరూపం తెలుసుకున్న జీవుడు తానూ ఈశ్వరుడు ఒకటేనని గ్రహించాలి. సత్ప్రవర్తనతో తన ధర్మం నిర్వర్తించిన వాడే ఉత్తమ గృహస్తుడు. బ్రాహ్మణుడు గృహస్తాశ్రమాన్ని స్వీకరించి, గురువుల వద్ద విద్యనభ్యసించి, నియమనిష్టలతో వుండాలి. అలాగే, వానప్రస్థ జీవనంలో వున్నవారికి కూడా మునులు కొన్ని ధర్మాలను బోధించారు. అవి విధిగా నెరవేర్చాలి. గృహస్థ ధర్మాన్ని వదిలిన తరువాతే వానప్రస్థ ధర్మాన్ని స్వీకరించాలి. దైవయోగం వల్ల వృద్ధాప్యం వచ్చిన తరువాత, అంతా పరమాత్మలో లయం చేయాలి. పరబ్రహ్మంలో లీనం కావాలి. వానప్రస్థ ధర్మాలను ఆచరిస్తూ ఇంకా బతికున్నట్లయితే అన్ని బంధాల నుండి విడివడి సన్న్యసించాలి. ఇక అప్పటి నుండి దేహమాత్రావిశిష్టుడై జీవించాలి. పరమాత్మలో విశ్వాన్ని చూస్తూ, సత్యాసత్యమైన విశ్వంలో పరబ్రహ్మమైన ఆత్మను చూస్తూ, మృత్యువు సత్యమని తెలుసుకుంటూ, కాలనికై ఎదురు చూస్తూ, పరమహంస తత్త్వాన్ని పొంది జీవబ్రహ్మైక్య భావనతో మెలగాలి.

నారదుడు చెప్పడం కొనసాగిస్తూ చతుర్విధ ఆశ్రమాల ధర్మాలను చెప్పాడిలా: గృహస్థ ధర్మంలో వున్నవాడు చేసే పనులన్నీ వాసుదేవార్పణంగా చేయాలి నారాయణుడి దివ్యమైన అవతార కథలను వినాలి. ధన, ధాన్య నిధులు దైవ సంకల్పం అనుకుని వాటి పట్ల అభిమానం పెంచుకోకూడదు. పంచ యజ్ఞాలు చేసి, అనంతరం పరమాత్మను అర్చించి, జీవుడు బతుకు సదుపాయాన్ని చక్కగా నిర్వర్తించాలి. అతిథి శుశ్రూష చేసి ధర్మమార్గంలో ఈశ్వరుడిని గెలవాలి. అందరినీ సంతృప్తి పరచాలి. ముఖ్యమైన రోజుల్లో ఆయా తిథుల ప్రకారం పుణ్యకాలాలలో జపహోమ స్నాన వ్రతాలను చేయాలి. దేవతలకు, బ్రాహ్మణులకు పూజలు సంతర్పణలు చేయాలి. శ్రాద్ధ కర్మలు విధిగా చేయాలి. కురుక్షేత్రం, ప్రయాగ, కాశి, రామేశ్వరం లాంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలి.   

సమస్త లోకాలకు విష్ణువే దైవం. ఇక ఆ విష్ణువుకు దైవం, మూడు వేదాలను చదివిన, సర్వ ప్రాణుల్లోను అచ్యుతుడిని దర్శించిన, ముల్లోకాలను తన పాదధూళితో పవిత్రం చేయగల బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి సంతోషంగా సంతర్పణ జరిగితే అధికంగా శ్రాద్ధవిధి చేయాల్సిన అవసరం కూడా వుండదు. బ్రాహ్మణులు వారి-వారి కర్మలను మాత్రం యధావిధిగా ఆచరించాలి. ఏ ఆశ్రమంలో చేయాల్సినవి ఆ ఆశ్రమంలో తప్పక చేసి తీరాలి. బ్రహ్మచారి తన ఆశ్రమవిధికి తగిన ఆచారమైన వ్రతాన్ని విడువకూడదు. గృహస్థ ధర్మాన్ని ఆచరించేవారు ప్రతిదినం చేసే పనులు మానాకూడదు. వానప్రస్థుడై తపస్సు చేయాలనుకునేవాడు జనపదంలో నివసించకూడదు. సన్న్యాసికి, అంటే సర్వసంగపరిత్యాగికి స్త్రీ సాంగత్యం పనికిరాదు.

శరీరమే ఒక రథం. దాన్ని నడిపే సారథి బుద్ధి. ఇంద్రియ సమూహం గుర్రాలు. మనస్సు పగ్గం. ప్రాణాలైన పదివాయువులు బండి ఇరుసు. ధర్మ-అధర్మ వర్తనాలు బండి చక్రాలు. చిత్తం పెద్ద మోకు ముడి. శబ్ద స్పర్శ రూపాదికాలు రథం తిరిగే ప్రదేశాలు. ’నేను-నాది’ అనే అహంకారంతో కూడిన జీవుడు రథంలో వుండే పురుషుడు. మహనీయమైన ఓంకారం విల్లు. నిర్మలుడైన జీవాత్మ బాణం. శుభాన్ని చేకూర్చే బ్రహ్మం తగిన లక్ష్యం. రాగద్వేషాలు, లోభ-మోహ-మద-మాత్సర్యాదులు బద్ధ శత్రువులు. మానవ శరీరమైన రథాన్ని తన వశంలో వుంచుకోవాలి. రాగద్వేషాది శత్రువులను శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో సంహరించాలి. ఓంకారమనే విల్లులో నిర్మలుడైన జీవుడనే బాణాన్ని ఎక్కుపెట్టి బ్రహ్మమనే లక్ష్యం మీద గురిపెట్టాలి. అహంకార రథంలోని జీవుడు దాన్ని నడిపే ప్రయత్నం మాని, సహజమైన బ్రహ్మానందంలో వుండాలి. అలాంటి భాగ్యం దొరకనప్పుడు జీవుడనే రథికుడిని కర్మమార్గంలో నడిపించి విషయాలనే శత్రువుల మధ్య పడవేస్తాయి. అప్పుడు జీవుడిని సంసారం అనే నూతిలో పడవేస్తారు శత్రువులు.     

వేదంలో ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం అని రెండు విధాలు చెప్పబడింది. ప్రవృత్తి మార్గం వల్ల పునర్జన్మలు కలుగుతే, నివృత్తి మార్గం వల్ల మోక్షం లభిస్తుంది. ప్రవృత్తి కర్మలలో ఇష్టం, పూర్తం అని రెండు మార్గాలున్నాయి. అందులో వున్నవాడు మళ్లీ-మళ్లీ జన్మలను ఎత్తుతుంటాడు. నివృత్తి మార్గంలో వున్నవాడు ఇంద్రియాలను జయించి, ఆత్మస్వరూపుడై మోక్షాన్ని పొందుతాడు. ప్రవృత్తి, నివృత్తి మార్గాలను ఎవరైతే అర్థం చేసుకోగలరో వారు మోహాన్ని పొందరు. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని మూడున్నాయి. కార్యకారణాలలో వస్తువు ఒకటే అని తెలిసి, ఏకత్వభావనతో, భేదం లేదని నిశ్చయించడం భావాద్వైతం. మనస్సుతో, వాక్కుతో, శరీరంతో చేసిన కర్మలన్నీ ఫలాల తారతమ్యం ఎంచక పరబ్రహ్మకు అర్పించడం క్రియాద్వైతం. కొడుకులు, మిత్రులు, భార్య మొదలైన జీవులకు, తనకు, దేహానికి లోపల పంచభూతాత్మకత్వంతో అనుభవించేవాడు ఒకడే అనే పరామర్థ లక్షణంతో, కోరికలు-ద్రవ్యం ఇవి ఒకటే అని భావించడం ద్రవ్యాద్వైతం. ఆత్మతత్త్వానుసంధానం చేసేవాడు ఈ భేదాలను వదులుకోవాలి. 

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

 

No comments:

Post a Comment