Thursday, September 17, 2020

విష్ణు వైరి హిరణ్యకశిపుడికి బ్రహ్మవరాలు .... శ్రీ మహాభాగవత కథ-38 : వనం జ్వాలా నరసింహారావు

 విష్ణు వైరి హిరణ్యకశిపుడికి బ్రహ్మవరాలు   

శ్రీ మహాభాగవత కథ-38

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

          పూర్వం ధర్మారాజు రాజసూయ యాగం చేసినప్పుడు తనను నిందించిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు చక్రాయుధంతో సంహరించగా, అతడు తేజోరూపంలో శ్రీహరి దేహంలో ప్రవేశించాడు. అది చూసి ఆశ్చర్యపడ్డ ధర్మరాజు, సభలో వున్న నారదుడితో, పుణ్యాత్ములైనా ప్రవేశించ వీలుకాని విష్ణుతత్త్వంలో శత్రుభావం కల శిశుపాలుడు, ఎల్లప్పుడు తమ్ముడితో కలిసి గోవిందుడిని నిందించే శిశుపాలుడు, ఎలా ఐక్యంకాగలిగాడని ప్రశ్నించాడు. ఎలా విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగాడని అడిగాడు ధర్మరాజు. జవాబుగా నారదుడు సర్వప్రాణులలోనూ వున్న శ్రీహరికి స్వపర భేదభావం లేదన్నాడు. కోపంతో కాని, స్నేహంతో కాని, కోరికతో కాని, బంధుత్వంతో కాని, భయంతో కాని, నిరంతర హరినామ స్మరణ చేసేవారు శ్రీహరిని చేరవచ్చన్నాడు. శిశుపాలుడు, అతడి తమ్ముడు దంతవక్త్రుడు పూర్వం వైకుంఠానికి కావలివారని, బ్రాహ్మణ శాపం వల్ల పదవిని పోగొట్టుకుని భూమ్మీద జన్మించారని చెప్పాడు.   

ఆ వివరాలన్నీ చెప్పమని ధర్మరాజు అడగ్గా ఇలా చెప్పాడు. ’ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాదులు దిగంబురులై వైకుంఠంలో ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అడ్దగించారు. వెంటనే వారిని రాక్షసులై పుట్టమని శపించారు మునులు. దుఃఖంతో మునిగున్న ద్వారపాలకులను చూసిన మహాత్ములు, మూడు జన్మలలో వైరభావంతో వున్నతరువాత భగవత్సాన్నిధ్యం లభిస్తుందని చెప్పారు. శాపగ్రస్తులైన వారు హిరణ్యాక్ష-హిరణ్యకశిపులుగా దితికి జన్మించారు. విష్ణువు వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, నృసింహరూపంలో హిరణ్యకశిపుడిని సంహరించాడు. ద్వారపాలకులు రెండవ జన్మలో కైకసికి రావణ-కుంభకర్ణులుగా జన్మించి శ్రీరాముడి చేతిలో హతమయ్యారు. మూడవ జన్మలో సాత్వతికి శిశుపాల-దంతవక్త్రులుగా జన్మించారు. వైరభావంతో వీరిద్దరూ ఎప్పుడూ శ్రీహరి ధ్యాసలోనే వుండేవారు. శ్రీకృష్ణుడు వారిని సుదర్శన చక్రంతో సంహరించగానే సకాదుల శాపఫలాన్ని అనుభవించి విష్ణు సన్నిధానంలో సారూప్యాన్ని పొందారు’.    

నారదుడు హిరణ్యకశిపుడిని గురించి కూడా చెప్పాడు. ’విష్ణువు చేతిలో తన తమ్ముడు హిరణ్యాక్షుడు చంపబడ్డాడని తెలుసుకున్న హిరణ్యకశిపుడు మండిపడ్దాడు. అతడెక్కడున్నా వెతికి పట్టుకుని, చంపి, అతడి రక్తంతో తన సోదరుడికి తర్పణం వదిలి విజయుడిగా రాక్షసులకు ఆనందం కలిగిస్తానన్నాడు.  బ్రాహ్మణ మాన్యాలతో కూడిన ప్రదేశాలకు పోయి, యజ్ఞాలు, తపస్సు, వేదపఠనం, మౌనవ్రతం చేస్తున్నవారిని వెతికి సంహరించమని రాక్షసులకు చెప్పాడు. అలా చెప్పడంతోనే రాక్షసులు భూమండలం మీద పడ్దారు. చీకాకు పరిచారు. దేవతలు, బ్రాహ్మణులు పారిపోయారు. హిరణ్యాక్షుడి మరణానికి శోకిస్తున్న తన తల్లిని ఓదార్చుతూ విష్ణువును దూషించాడు. హిరణ్యకశిపుడు ఆమెకు సుయజ్ఞోపాఖ్యానం చెప్పి ఓదార్చాడు. అతడి మాటలకు దితి దుఃఖం మానింది’.

హిరణ్యకశిపుడు తనకు వృద్ధాప్యం, మరణం లేకుండా, ముల్లోకాలలోను తనని ఎదిరించేవాడు లేకుండా, శత్రువుల మీద విజయాన్ని, సింహబలాన్ని కోరుకున్నాడు. ఇది సాధించడం కోసం మందర పర్వతం దగ్గరికి పోయి, ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఆయన తపస్సు ముల్లోకాలకు తాపం కలిగించింది. తపస్సు విజృంభణను సహించలేక దేవతలు బ్రహ్మ దగ్గరకు పోయారు. దానికి ప్రతిచర్యను ఆలోచించమని వేడుకున్నారు. దేవతల ప్రార్థనకు ఆయన మనస్సు కరుణతో పొంగిపోయింది. దేవతలతో కలిసి మందర పర్వత ప్రాంతానికి వచ్చాడు బ్రహ్మ. హిరణ్యకశిపుడి ఘోరతపస్సుకు మెచ్చానని, ఆయన అభీష్టాలేవో కోరుకుంటే అనుగ్రహిస్తానని అన్నాడు.  

బ్రహ్మదేవుడి మాటలకు హిరణ్యకశిపుడు తపస్సు చాలించాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. పరిపరి విధాల స్తుతించాడు. ’గాలిలో, నేలమీద, అగ్నిలో, నీటిలో, ఆకాశంలో, రాత్రులలో కానీ, పగటి వేళ కానీ, చీకటిలో కానీ, జలచరాలు, రాక్షసులు, క్రూరమృగాలు, పాములు, వేల్పులు, మానవులు మొదలైన వారితో యుద్ధాలలో కానీ, సమస్త అస్త్రశస్త్రాల సమూహంతో కానీ మరణం లేని జీవనాన్ని’ తనకు ప్రసాదించమని కోరాడు హిరణ్యకశిపుడు. యుద్ధాలలో తనకు ఎదురులేని పరాక్రమాన్ని, లోకపాలకులను దండెత్తి జయించే సామర్థ్యాన్ని, ముల్లోకాలలో విజయాన్ని హిరణ్యకశిపుడు కోరాడు. ఆయన కోరికలు ఎవరికీ పొందరానివని, ఇంతకు పూర్వం ఎవరూ కోరలేదని, ఆయన మీద అనుగ్రహంతో అవన్నీ అనుగ్రహిస్తున్నానని బ్రహ్మ చెప్పాడు హిరణ్యకశిపుడికి. జ్ఞాన సంపదతో శుభదృష్టి కలవాడిగా ప్రవర్తించమని సూచించాడు.

తన సోదరుడు హిరణ్యాక్షుడిని సంహరించాడనే పగతో రాక్షసరాజు హిరణ్యకశిపుడు విష్ణువు పట్ల శత్రుత్వం వహించాడు. గంధర్వ సమూహాన్ని, దేవతలను, నాగలోకవాసులను, నవగ్రహాలను, యక్షజాతిని, పక్షిజాతిని, సిద్ధపురుషులను, మనుషులను, కిన్నర, కింపురుష, గగనచర, సాధ్య, చారణ, ప్రేత, భూత, పిశాచ, వన్యమృగ, విద్యాధరాదులను తీవ్రమైన కష్టాలకు గురిచేసాడు వరగర్వంతో హిరణ్యకశిపుడు. దానవుడి ధాటికి అందరూ దాసోహం అన్నారు. ఆ క్రమంలో దేవేంద్రుడి సౌధాన్ని ఆక్రమించాడు. ఆయన సింహాసనాన్ని అధిష్టించాడు. భూమ్మీద పండితులు యజ్ఞాలు చేస్తున్నప్పుడు హవిస్సులు దేవతలకు దక్కకుండా తానే సంగ్రహించాడు. ముల్లోకాధిపత్యం వహించాడు. సకల చరాచర భూమండలం ఆయన ఆజ్ఞానుసారం నడుచుకుంది. క్రమేపీ ఆయన నియమ మార్గాన్ని, శాస్త్రవిధిని  అతిక్రమించాడు. అలా చాలా కాలం అధికారాన్ని ప్రదర్శించాడు.

దేవతలంతా రక్షించమని శ్రీమహావిష్ణువును ఆశ్రయించారు. సమయం వచ్చినప్పుడు హిరణ్యకశిపుడిని సంహరిస్తానని అభయమిచ్చాడు. అతడిని అడ్డుకోవడానికి ఇంకా సమయం రాలేదని చెప్పాడు. అందుకే తాను ఓర్పు వహించానని అన్నాడు. విష్ణుమూర్తి మాటలకు సంతృప్తి చెందిన దేవతలు తమ-తమ నివాసాలకు వెళ్లిపోయారు.            

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment