Friday, September 4, 2020

బ్రహ్మ సృష్టి మహిమ .... శ్రీ మహాభాగవత కథ-26 : వనం జ్వాలా నరసింహారావు

 బ్రహ్మ సృష్టి మహిమ

శ్రీ మహాభాగవత కథ-26

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         బ్రహ్మ సృష్టించడానికి పూనుకోగానే, “నేను” అనే దేహాభిమానం కల మోహం పుట్టింది. భోగాలమీద కోరిక పెరగడంతో “మహామోహం” పుట్టింది. మహామోహానికి ఆటంకం ఏర్పడే సరికి గుడ్డితనం వచ్చింది. అదే “అంధతామిశ్రం”. శరీరంమీద పుట్టిన మోహం వల్ల ఈ శరీరం నశించి పోతుందనే భయం, అంటే మృత్యు భయం పుట్టింది. ఇది “తామిస్రం”. వీటివల్ల మనసు కకావికలై పోయింది. ఇది “సిట్ట విభ్రమం”. ఈ అయిదింటికీ “అవిద్యాపంచకం” అని పేరు. ఈ అవిద్యాపంచక మిశ్రమంగా సర్వ భూతాలను పుట్టించడమే తాను చేసిన “మహాపాపం” అని పశ్చాత్తాప పడ్డాడు బ్రహ్మ.

         ఈ పశ్చాత్తాపంతో అస్ఖలిత బ్రహ్మచారులు, పరమ పవిత్రులైన సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అనే మునులను సృష్టించాడు. వారితో, వారి-వారి అంశలతో ప్రజలను పుట్టించి ప్రపంచాన్ని వృద్ధి చేయమని ఆదేశించాడు. అయితే వారు ఆయన మాటలను అపహాస్యం చేస్తూ ప్రపంచ నిర్మాణానికి వ్యతిరేక వాక్యాలు పలికారు. వెంటనే బ్రహ్మకు పట్టరాని ఆగ్రహం వచ్చింది. బ్రహ్మ కనుబొమ్మల మధ్యనుండి కోపరూపుడై, దేవతలందరకు అగ్రేసరుడైన నీలలోహితుడు బిగ్గరగా ఏడుస్తూ పుట్టాడు. పుట్టగానే ఆయన బ్రహ్మను చూసి తన పేరేమిటని, తన నివాసం ఎక్కడనీ ప్రశ్నించాడు.

అతడు పుట్టుతూనే ఏడుస్తూ పుట్టాడు కాబట్టి అతడి పేరు “రుద్రుడు” అనీ, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశం, వాయువు, జలం, భూమి, ప్రాణం, తపస్సు, హృదయం, ఇంద్రియాలు అనే పదకొండు ఆయన నివాసస్థానాలని చెప్పాడు. అలాగే, ఆయనకు మన్యువు, మనువు, మహాకాలుడు, మహత్, శివుడు, ఋతధ్వజుడు, ఉరురేతస్కుడు, భవుడు, కాలుడు, వామదేవుడు, ధృతవ్రతుడు అనే పదకొండు పేర్లుంటాయని చెప్పాడు. ధీ, వృత్తి, ఉశన, ఉమ, నియుత్, సర్పిః, ఇల, అంబిక, ఇరావది, సుధ, దీక్ష అనే పదకొండు మంది ఆయన భార్యలని కూడా చెప్పాడు. ప్రజలను సృష్టించమన్న బ్రహ్మ ఆదేశం మేరకు రుద్రుడు బలంలోను, రూపంలోను, స్వభావంలోను తనతో సమానమైన ప్రజలను కల్పించాడు.

రుద్రుడు కల్పించిన ఆ రుద్రగణం ఈ విశ్వాన్నంతటినీ అనాయాసంగా మింగేసింది. ఆ ఉపద్రవ శాంతి కోసం రుద్రగణాలను బ్రహ్మ పిలిచి, ఇక వాళ్ల సృష్టి చాలనీ, తన మాట విని అరణ్యాలకు పోయి తపస్సు చేసుకోమనీ సూచించాడు. వాళ్లు ఆయన మాట ప్రకారం అరణ్యాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లారు. అప్పుడు బ్రహ్మ జనులందరికీ శరణ్యులు, బుద్ధిమంతులలో శ్రేష్ఠులు అయిన వారిని సృష్టించాడు. బ్రహ్మతో సమానమైన ప్రభావం కల పదిమంది కొడుకులు పుట్టారు. ఆ పదిమంది ఎవరంటే: బ్రహ్మ బొటన వేలు నుండి దక్షుడు, తొడ నుండి నారదుడు, నాభి నుండి పులహుడు, చెవుల నుండి పులస్త్యుడు, చర్మం నుండి భృగువు, చేతి నుండి క్రతువు, ముఖం నుండి అంగిరసుడు, ప్రాణం నుండి వశిష్టుడు, మనస్సు నుండి మరీచి, కన్నుల నుండి అత్రి ఆవిర్భవించారు. ఇంకా కుడివైపు స్తనం నుండి ధర్మం, వెన్ను నుండి విశ్వభయంకరమైన మృత్యువు, అధర్మం, ఆత్మా నుండి కాముడు జన్మించారు.        

బ్రహ్మ దేవుడి కనుబొమ్మల నుండి క్రోధం, పెదవుల నుండి లోభం, ముఖం నుండి వాణి, పురుషాంగం నుండి సముద్రాలు, అపానం నుండి పాపాలకు స్థానమైన నిరృతి, నీడ నుండి దేవహూతి, ఆమె భర్త అయిన కర్దముడు పుట్టారు. తన దేహం నుండి పుట్టిన భారతిని చూసి ఆమె అందానికి మోహావేశుడయ్యాడు. ఆమె కన్నకూతురనే విషయం పక్కకు పెట్టి ఆమె వెంట పడ్డ బ్రహ్మను చూసి మునులు వారించారు. కన్నకూతురునే కామించావని నిందించరా అని ప్రశ్నించారు. బ్రహ్మ సిగ్గుతో తల వంచుకుని తన దేహాన్ని విడిచి పెట్టాడు. ఆ తరువాత ధైర్యాన్ని కోల్పోకుండా ఇంకొక దేహాన్ని ధరించాడు. కాని సృష్టికి పూర్వం తన దగ్గర వున్న సృజన శక్తి, నేర్పు ఇప్పుడు లేకపోవడంతో ఆత్మలో విచారించసాగాడు. అలా వుండగానే ఆయన నాలుగు ముఖాల నుండి ధర్మ స్వరూపమైన నాలుగు వేదాలు పుట్టాయి. యజ్ఞాలు, పుణ్యకర్మలు, తంత్రాలు, ప్రవర్తన, ఆశ్రయాలు మొదలైనవన్నీ ఆయన నాలుగు ముఖాల నుండి పుట్టాయి.

బ్రహ్మ తూర్పు ముఖం నుండి ఋగ్వేదం, దక్షిణ ముఖం నుండి యజుర్వేదం, పశ్చిమ ముఖం నుండి సామవేదం, ఉత్తర ముఖం నుండి అధర్వ వేదం ఆవిర్భవించాయి. ఉపవేదాలలో ఆయుర్వేదం తూర్పు ముఖం నుండి, ధనుర్వేదం దక్షిణ ముఖం నుండి, గాంధర్వ వేదం పశ్చిమ ముఖం నుండి, శిల్పవేదం ఉత్తర ముఖం నుండి ఉత్పన్నమయ్యాయి. పంచమ వేదమైన ఇతిహాస పురాణ సముచ్చయం బ్రహ్మదేవుడి అన్ని ముఖాల నుండి ఆవిర్భవించింది. కర్మ తంత్రాలైన షోడశి-ఉక్థ్యం, చాయణం-అగ్నిష్టోమం, ఆప్తోర్యామం-అతిరాత్రం, వాజపేయం-గోసవం అనే నాలుగు జంటలు, ధర్మ పాదాలైన విద్య, ధనం, దానం, తపస్సు అనేవి క్రమంగా విధాత నాలుగు ముఖాల నుండి పుట్టాయి. బ్రహ్మచర్యం, గార్హస్త్యం, వానప్రస్తం, సన్యాసం అనే ఆశ్రమ చతుష్టయం కూడా చతుర్ముఖుడి నాలుగు ముఖాల నుండి జనించాయి.

అన్వీక్షకి, త్రయి, వార్తా, దండనీతి అనే నాలుగు న్యాయ విద్యలు బ్రహ్మదేవుడి నాలుగు ముఖాల నుండి పుట్టాయి. “భూ: , భువః, సువః” అనే వ్యాహృతులు బ్రహ్మ ముఖాల నుండి ఉదయించాయి. అతడి హృదయంలోని ఆకాశం నుండి ఓంకారం పుట్టింది. రామాల నుండి ఉష్ణిక్ ఛందస్సు, చర్మం నుండి గాయత్రి ఛందస్సు, మాంసం నుండి త్రిష్టుస్ ఛందస్సు, స్నాయువు వల్ల అనుష్టుప్ ఛందస్సు, ఎముక నుండి జగతీ ఛందస్సు, మజ్జవల్ల పంక్తి ఛందస్సు, ప్రాణం వల్ల బృహతీ ఛందస్సు పుట్టాయి.

హల్లులో ‘క వర్గం మొదలు ‘ప వర్గం వరకు అయిదు వర్గాలతో స్పర్శాత్మకుడైన జీవుడు, అకారాది అచ్చులతో స్వరాత్మకమైన దేహం, ‘శ, ష,,,’ లతో ఊష్మవర్ణాత్మకాలైన ఇంద్రియాలు ఏర్పడ్డాయి. ‘య,,, అనే అంతస్థాలు; షడ్జం, ఋషభం, గాంధారం, మాధ్యమం, పంచమం, దైవతం, నిషాదం అనే సప్త స్వరాలు, ఆత్మా బలమైన శబ్ద బ్రహ్మం ఇవన్నీ చతుర్ముఖుడి లీలా విశేషాల వల్ల పుట్టాయి. పరమేశ్వరుడికి వ్యక్తం, అవ్యక్తం అనే రెండు రూపాలున్నాయి. వ్యక్తరూపం ‘వైఖరీవాక్కు. అలాగే ‘పర, ‘పశ్యంతి, ‘మధ్యమ అనే వాక్కులు అవ్యక్త రూపం. ఈ వ్యక్తావ్యక్త రూపాలు రెండింటికీ ప్రణవమే ఆత్మ. భగవంతుడు అవ్యక్తాత్ముడు కావడం వల్ల పరిపూర్ణుడు. వ్యక్తాత్ముడు కావడం వల్ల ఇంద్రాది శక్తి సంయుక్తుడై కనిపిస్తాడు.

ఋషుల సంతానం సవిస్తారమై వృద్ధి కాలేదని తలచాడు బ్రహ్మ. ఆయన తన మొదటి శరీరాన్ని వదలుకున్నాడు. నిషిద్ధంకాని కామం మీద ఆసక్తికల మరొక దేహాన్ని ధరించాడు. నిత్యం ప్రజాసృష్టి చేయడం మీద ఆసక్తి కనపర్చాడు. అయినా ప్రజాభివృద్ధి జరగలేదు. కారణం తెలియక ఆశ్చర్య పడ్డాడు. అదెలా వృద్ధి కావాల్నో అని ఆలోచించాడు. దీనికి దైవానుకూలం అవసరం అనుకుంటూ దైవాన్ని స్మరించాడు. వెంటనే బ్రహ్మదేవుడి దేహం రెండు భాగాలయింది. అందులో ఒకటి “స్వరాట్టు” అయిన “స్వాయంభువ మనువు” గా, మరొకటి అతడి భార్య “శతరూప” అనే అంగనగా రూపొందాయి. ఆది మిధుమైన ఆ దంపతులకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు. వారిలో ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. ఈ దంపతులవల్ల కలిగిన అనంత ప్రజాసంతతుల వల్ల జగత్తంతా నిండి నిభిడీకృతమైంది.

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

No comments:

Post a Comment