Monday, August 24, 2020

సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం .... శ్రీ మహాభాగవత కథ-15 : వనం జ్వాలా నరసింహారావు

 సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం

శ్రీ మహాభాగవత కథ-15

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

     బ్రహ్మదేవుడి కుమారుడు స్వాయంభవ మనువుకు శతరూప ద్వారా ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. ఉత్తానపాదుడికి సునీతి, సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు. వాళ్లలో ధ్రువుడిని కన్న సునీతి అంటే రాజుకు అంతగా ప్రేమ లేదు. సురిచి మీద విపరీతమైన ప్రేమ. ఒకనాడు సురుచి కొడుకు ఉత్తముడిని తన తొడలమీద కూచోబెట్టుకుని ముద్దులు చేస్తున్న సమయంలో దగ్గరకు వచ్చిన ధ్రువుడిని పట్టించుకోలేదు. తన కొడుకులాగా అతడిని కూడా తండ్రి ముద్దాడాలంటే, విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించాలని సవతి తల్లి చెప్పింది ధ్రువుడికి. ఇదంతా ధ్రువుడి తల్లికి తెలిసి బాధపడింది. సవతి తల్లి చెప్పిన విధంగా శ్రీహరి పాదాలను ఆశ్రయించమని చెప్పింది. వెంటనే పట్టణాన్ని వదిలి బయల్దేరాడు ధ్రువుడు.   

ఈ వృత్తాంతమంతా తన దివ్య దృష్టి ద్వారా తెలుసుకున్న నారదుడు ధ్రువుడి దగ్గరకు వచ్చాడు. శ్రీహరిని, శ్రీమహావిష్ణువును యోగీంద్రులు కూడా చూడలేక పోతున్నారనీ, అతడిని చేరే మార్గాన్ని తెలుసుకోలేక పోతున్నారనీ, అతడు ఆరాధించడానికి దుర్లభుడనీ, కాబట్టి వ్యర్థ ప్రయత్నాలు మానుకోమనీ నారదుడు ధ్రువుడికి చెప్పాడు. మోక్షం మీద కోరిక వుంటే తను చెప్పే మాటలు వినమని అన్నాడు. వాస్తవానికి ధ్రువుడిని మోక్షమార్గానికి ప్రేరేపించిన వాడు వాసుదేవుడే అని కూడా అన్నాడు. ఇలా చెప్పి, యమునా నది ఒడ్డున, శ్రీహరి సాన్నిధ్యంలో, పుణ్యమైన మధు వనానికి వెళ్లమనీ, అక్కడ అతడికి శుభం కలుగుతుందనీ అన్నాడు నారదుడు. యమునానదీ పుణ్యజలాలలో స్నానం చేసి, నిష్ఠతో నారాయణుడికి నమస్కారం చేసి, యమనియమాదులను పాటిస్తూ, ఆత్మవికాసం కొరకు సాధన చెయ్యమని సూచించాడు. పురుషోత్తముడిని ఏకాగ్రతతో ధ్యానం చేయమన్నాడు. అప్పుడు పూజలందుకున్న దేవుడు, మానవులకు కొర్కెలను ప్రసాదిస్తాడని అన్నాడు. నారదుడి మాటలు విన్న ధ్రువుడు మధువనానికి వెళ్లాడు. అక్కడ నగరంలో ధ్రువుడిని అరణ్యాలకు పంపినందుకు విచారిస్తున్న అతడి తండ్రి ఉత్తానపాదుడిని ఓదార్చి విషయమంతా చెప్పాడు నారదుడు. అతడి కుమారుడు శ్రీహరిని భజించి, ఎవరికీ సాధ్యంకాని శాశ్వతపదాన్ని పొంది, మళ్లీ తిరిగి వస్తాడనీ, అతడి కొరకై శోకించవద్దనీ చెప్పాడు. 

         మధువనాన్ని సమీపించిన ధ్రువుడు యమునానదిలో స్నానం చేశాడు. సర్వేశ్వరుడిని గురించి ధ్యానం చేయసాగాడు. మొదట్లో తన శరీర స్థితిని బట్టి మూడు రోజులకు ఒక సారి ఆహారం, తరువాత నెలలో ఆరు రోజులకోసారి, నాల్గవ నెలలో పన్నెండు రోజులకోసారి ఆహారాన్ని తీసుకున్నాడు. తరువాత ఒంటి కాలు మీద ధ్యానం చేస్తూ వాయువును మాత్రమే బక్షించాడు. మొదటి నెలలో శ్రీహరిని, రెండవ నెలలో విష్ణువును, మూడో నెలలో మాధవుడిని, నాల్గవ నెలలో పుండరీకాక్షుడిని, అయిదో నెలలో పర్మాత్మను ధ్యానం చేషాడు. ఆ తరువాత ఆ శ్రీహరి రూపాన్ని తప్ప మరి దేనినీ మనస్సులో స్మరించకుండా తన చిత్తాన్ని సమాయత్తం చేశాడు. ఆ స్థితికి ముల్లోకాలు కంపించాయి. ధ్రువుడు ఏకాగ్ర చిత్తంతో ప్రాణవాయువును నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు. ఆయన కంపించగానే లోకాలన్నీ కంపించాయి. దీన్నుండి కాపాడమని లోకపాలకులంతా శ్రీమన్నారాయణుడిని వేడుకున్నారు. ఇదంతా ధ్రువుడి ధ్యానం వల్ల జరిగిందనీ, భయపడవద్దనీ చెప్పి శ్రీహరి తక్షణమే మధువనానికి వెళ్లాడు. ధ్రువుడు ఆయన్ను చూసి, మధురానుభూతి పొందుతూ, సాష్టాంగ నమస్కారాలు చేశాడు. ఆయన అనుగ్రహంతో, భగవంతుడిని ప్రతిపాదించే వేదమయమైన వాక్కులతో స్తుతించాడు శ్రీహరిని పరి-పరి విధాలుగా. అది విన్న భగవానుడు మనస్సులో సంతోషించి ధ్రువుడి మదిలో మెదిలే కోరిక తనకు తెలుసని అంటూ, దాన్ని ప్రసాదిస్తున్నానని అంటూ, ఈ విధంగా చెప్పాడు.

         "గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర రూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సపర్షులు, తారకలతో కూడి నీ చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు తిరుగుతారు. ఇతరులు చేరడానికి వీలుకానిది, అధిష్టించడానికి సాధ్యం కానిది, ముల్లోకాలు ప్రళయంలో నశించినా కూడా నశించకుండా ప్రకాశించే "ధ్రువక్షితి" (ధ్రువపదం) ని ఇరవై ఆరు వేల సంవత్స్రాల తరువాత నువ్వు పొందుతావు. అప్పటిదాకా నీ తండి రాజ్యాన్ని పాలించు. ఇహలోక సుఖాలను అనుభవించు. మరణకాలంలో నన్ను స్మరిస్తూ, అన్నిలోకాలు నమస్కరించేది, పునర్జన్మ లేనిదీ, సప్తర్షి మండలంకన్న పైనున్న నా పదాన్ని పొందుతావు" అని చెప్పి విష్ణుమూర్తి వైకుంఠానికి వెళ్లిపోయాడు.

         ఇదంతా జరిగిన తరువాత ధ్రువుడు తన రాజ్యానికి పయనమయ్యాడు. కొడుకు వస్తున్నాడని విన్న తండ్రి ఉత్తానపాదుడు సంతోషించాడు. ఎదురుగా వెళ్లి ప్రేమతో కౌగలించుకున్నాడు. ఆశీర్వదించాడు. ధ్రువుడు తండ్రి పాదాలకు మొక్కాడు. ఆ తరువాత తల్లులకు నమస్కరించాడు ధ్రువుడు. తల్లి చిరాయువుగా జీవించమని ఆశీర్వదించింది. పౌరులతో, బంధుజనులతో, అమాత్యులతో, స్నేహితులతో కలిసి పురంలోకి ప్రవేశించాడు. కొంతకాలానికి ఉత్తానపాదుడు ధ్రువుడికి రాజ్యాభిషేకం చేశాడు. ఆ తరువాత, శింశుమారుడు అనే ప్రజాపతి కుమార్తె భ్రమిని వివాహం చేసుకున్న ధ్రువుడికి కల్పుడు, వత్సరుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. అలాగే, వాయుదేవుడి కుమార్తె ఇల అనే ఆమెను వివాహం చేసుకుని ఉత్కలుడు అనే కొడుకును, మరో కూతురును కన్నాడు.

         తన సోదరుడు ఉత్తముడు వేటకై పోయి యక్షుడి చేతిలో హతం కావడం పట్ల కోపంతో కుబేరానుచరులైన గుహ్యకుల మీదికి యుద్ధానికి పోయాడు ధ్రువుడు. అతడి బాణాల ధాటికి యక్షులు తట్టుకోలేక పరాజితులయ్యారు. వారు రోషంతో విజృంభించినా ప్రయోజనం లేకపోయింది. ధ్రువుడు చిటికలో వారిని జయించసాగాడు. అప్పుడు రాక్షసులు రాక్షస మాయను ప్రయోగించారు. దాని ప్రభావం వల్ల ఆయన మీద ఆయుధాలు కురిసాయి. అప్పుడు ధ్రువుడు ఆచమనం చేసి, లక్ష్మీనాథుడి పాదపద్మాలకు నమస్కరించి, స్మరించి, శత్రుభయంకరమైన నారాయణాస్త్రాన్ని సంధించాడు. వెంటనే గుహ్యకుల మాయ చెడిపోయింది. నారాయణాస్త్రం నుండి పుట్టిన వేలాది బాణాలు యక్షులను ఢీకొన్నాయి. యక్షుల పిక్కలను, తొడలను, మెడలను, చేతులను ఖండించాడు ధ్రువుడు. అప్పుడు ధ్రువుడి తాతగారైన స్వాయంభవ మనువు ఆయన దగ్గరకు వచ్చి, యుద్ధ ప్రయత్నాన్ని విరమించుకొమ్మని సలహా ఇచ్చాడు. సర్వ శుభాలకు హాని కలిగించే రోషాన్ని విడిచి పెట్టమని కూడా అన్నాడు. ధ్రువుడు తన సహోదరుడిని చంపారని భావించి, ఎంతో మంది యక్షులను చంపాడని, కుబేరుడి పట్ల అపరాధం చేశాడని, కాబట్టి అతడిని ప్రసన్నం చేసుకోమని అన్నాడు. ధ్రువుడు యుద్ధం మానాడు. వెంటనే కుబేరుడు వచ్చాడక్కడికి. ఆయనకు అంజలి ఘటించాడు ధ్రువుడు. తాను ధ్రువుడి పట్ల ప్రసన్నుడినయ్యానని చెప్పి అంతర్థానమయ్యాడు కుబేరుడు. అప్పుడు ధ్రువుడు యక్ష, కిన్నర, కింపురుషాది గణాలతో కీర్తించబడుతూ మహావైభవంగా తన నగరానికి తిరిగొచ్చాడు.

         నగరానికి తిరిగొచ్చిన ధ్రువుడు రాజ్యపాలన చేస్తూ ఈశ్వరుడిని ధ్యానిస్తూ జీవితం గడిపాడు. అలా ఇరవై ఆరువేల సంవత్స్రాలు రాజ్యపాలన చేసాడు. తరువాత తన కొడుకుకు రాజ్య పట్టం కట్టాడు. వైరాగ్య చిత్తంతో పట్టణాన్ని వదిలి, పుణ్యాలకు పుట్టినిల్లయిన బదరికాశ్రమానికి చేరుకున్నాడు. విశాలా నదీ జలాలలో స్నానం చేశాడు. పద్మాసనం వేసుకుని శ్రీహరిని నిత్యం ఆరాధించాడు ధ్రువుడు. కొన్నాళ్లకు ఆకాశం నుండి ఒక దివ్య విమానం వచ్చింది. అందులో ఇద్దరు దేవతా శ్రేష్టులున్నారు. వాళ్లు విష్ణు కింకరులు. వాళ్లు ధృవుడిని చూసి, ఆయన చేసిన మహా తపస్సు మధుసూధనుడిని సంతృప్తి పరిచిందనీ, ఆయన పంపగా తాము వచ్చామనీ, విష్ణుమూర్తి నివాసమైన పరమపదానికి ఆయన్ను తీసుకుపోతామనీ అన్నారు. విష్ణువు పంపిన దివ్య విమానం ఎక్కడానికి ఆయనకు అర్హత ఉందనీ చెప్పారు. ధ్రువుడు స్నానం చేసి వచ్చి, అక్కడున్న మునులకు మొక్కి, వారి ఆశీర్వాదాలు తీసుకుని, విమానాన్ని ఎక్కడానికై హిరణ్మయమైన తేజో రూపాన్ని ధరించాడు. అతడి విమానానికి ముందర మరో విమానంలో అతడి తల్లి కూడా వున్నదని విష్ణు కింకరులు చెప్పారు. అది చూసిన తరువాత ధ్రువుడు విమానాన్ని ఎక్కి బయల్దేరాడు. గ్రహ మండలాన్నీ, సప్తర్షి మండలాన్నీ దాటి ఆపైన విష్ణుపదాన్ని చేరుకున్నాడు.

సత్పురుషులందరికీ సమ్మతమైన ధ్రువోపాఖ్యానం జీవితానికి ధన్యత చేకూరుస్తుంది. స్వ్రర్గప్రదాయకమైనది. కీర్తికరమైనది. ఆయుష్షును కలగ చేస్తుంది. పుణ్య ప్రదాయకమైనది. శుభకరమైనది. మంచి మనస్సునిస్తుంది. ఫ్రశంసా యోగ్యమైనది. పాపాన్ని హరిస్తుంది.  

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment