Monday, August 10, 2020

మరాఠీ స్టైల్ లో పంతాలు పట్టింపులు .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 

మరాఠీ స్టైల్ లో పంతాలు పట్టింపులు

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(డిసెంబర్ 10 - 16, 2000)

         ఉయ్యాల జంపాల సినిమా తర్వాత దగ్గుబాటి లక్ష్మీ నారాయణ గారి కోరికపై ‘పంతాలు పట్టింపులు’ అనే సినిమాతీసారు తిలక్. అప్పటికే దగ్గుపాటి శంభు ఫిల్మ్స్ నుండి విడిపోయారు. తిలక్ గారు మరాఠీ చిత్రాల్లో 'తమాషా’కు సంబంధించిన పిక్చర్స్  ఇష్టపడేవారు. అలాంటి తమాషా సినిమానే పంతాలు పట్టింపులు. ఈ సినిమాలో మంచి పాటలున్నాయి. శ్రీశ్రీ, కొసరాజులు వ్రాసారు పాటలు. కథలో ప్రధాన పాత్రధారి శోభన్ బాబు. అతడికీ ప్రధాన పాత్రధారిణికీ తమాషాకు చెందిన ఓ వీధి నృత్యంలో మాటా మాటా పెరిగి పంతానికి దారి తీసే పట్టింపులొస్తాయి. ఆ పంతంతో,  శోభన్ బాబు ఇద్దరు దొమ్మరి అమ్మాయిలను తీసుకుని వచ్చి, తాను సవాలు చేసిన డ్యాన్సర్ తో పోటీగా తయారు చేస్తాడు. అదీ మెయిన్ థీమ్. దొమ్మరమ్మాయిల తండ్రిగా గుమ్మడి నటిస్తాడు చాలా చక్కగా. దొమ్మరమ్మాయిలుగా వాణిశ్రీ, గీతాంజలి పోటీపడి తమ పాత్రలకు న్యాయం చేస్తారు. మరాఠీ చిత్ర పరిశ్రమకు చెందిన 'లీలాగాంధీ' అనే నటీమణిని తన తెలుగు సినిమాలో పరిచయం చేస్తారు తిలక్ ఇందులో. ఇక రమణారెడ్డితో హార్మోనిస్ట్ పాత్ర వేయించారు.

         సినిమాలో పాటలన్నీ ప్రశ్న-జవాబు తరహాలో ఉంటాయి. అర్ధవంతంగా, భావగర్భితంగా, తమాషాగా, పొడుపు కథల్లాగా అందరికీ నచ్చేరీతిలో వున్నాయి. ‘ఈనాటిదా, ఒకనాటిదో- ఏనాటిదో, ఈ సిరుల కొరకు సాగేటిపోటి- ఈ కుడి ఎడమలతో, నడిచిన పోటి-దేవదానవుల కాలంనాటి తెరపిలేని పోటి-పాలకడలికేచని-ఆట నానాబాధలుపడి-సరిసమానమైన శ్రమల కోర్చి తుదకమృతభాండ మనుకుని-దే మాదని-అంత వరకు తామన్నదమ్ములు-కాలం గడిపిన సురాసురులు-సైసై అంటే సై అంటూ ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొని హోరాహోరీగా పోరాడినకథ-నేటిదా, ఒకనాటిదా’.  కలిసిమెలిసి వుంటూ పంధానికి దిగితే ఎలా కత్తులు దూసుకుంటారో చెప్పే పాట ఇది.

         వాణిశ్రీ (జమ్మి), గీతాంజలి (సోనీ) ఇద్దరూ శోభన్ బాబునే ప్రేమించుతారు. ఒకరికి తెలియకుండా మరొకరు శోబన్ బాబును కృష్ణుడుగా వూహించుకుని పొగడ్తూ పాడేపాట చాలా చక్కగా రాసారు శ్రీశ్రీ.  జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన ఆ పాట:

జమ్మీ: ఆటాపాటల కృష్ణుడెంతవాడే

యశోద నికొడుకెంతవాడే

సోని: అందాల కొడుకెంతవాడే

సందేల రమ్మని గెంతులాడే

జమ్మీ: పొన్న చెట్టునీడ క్రింద

పొంచిపొంచి తక్కిరారి

కనుసైగ చేసి చెంగులాగుతాడే

సోనీ: తానాలాడే వేళ వచ్చి, సన్నగా నా వెన్నుతట్టె

వెన్నముద్దలియ్యమని వేడుతాడే

జమ్మీ: పాలు పితుకువేళవచ్చి, వాలుగా నాకళ్లు మూసి

నేను తిరిగి చూడగానే కులుకుతాడే

సోనీ: ఏమేమో గోము చేసి

నామోములోకి చూసి

ఎన్నెన్నో ముద్దు ముద్దు మాటలాడుతాడే!


         తమాషా తరహా చిత్రాల్లో పొడుపు కథ వస్తే ఎదుటి వారు విప్పాలి. విప్పకపోతే ఓడిపోయినట్లు ప్రశ్నలన్నీ గమ్మత్తుగానే వుంటాయి. పదజాలమంతా తమాషాగా వుంటుంది. శోభన్ బాబు, లీలా గాంధీలు, నావల్లే నువ్వుపైకొచ్చారంటే-నావల్లే నువు వచ్చావని, ఒకరికొకరు పోటీపడ్తారు. నువ్వేంటి గొప్ప, నేనే ఇద్దరు డాన్సర్లను తయారు చేస్తానని సవాల్ చేసి, శోభన్ బాబు దొమ్మరమ్మాయిలకు శిక్షణనిప్పించి పోటీకి తయారు చేస్తుంటాడు. ఇద్దరు అక్కా-చెల్లెళ్లలో ఒకమ్మాయిని ‘లీల’ తీసుకుని పోయి తన వద్ద వుంచుకుని సోదరికి వ్యతిరేకంగా చేస్తుంది. ఆ అపార్థాల నేపథ్యంలో ‘గంగా గౌరీ సంవాదం’ భావం వచ్చే రీతిలో  ఓ పాటుంటుంది. రంజనికి (లీలాగాంధీ) జమ్మీకి (వాణి) పోటీ జరుగుతుంది. ఒకరిపై ఒకరు సవాలు విసురుతుంటారు. చాలా సేపు వాదప్రతివాదాలు జరుగుతాయి. రంజనికి మద్దతుగా విడిపోయిన చెల్లెలు సోనీ (గీతాంజలి), జమ్మీతో పాటీ పడి పాడిన పాటే గంగాగౌరీ సంవాదం.

         అది ఎలా సాగుతుందంటే:

         జమ్మీని సోనీ ప్రశ్నిస్తుంద: ‘పరమశివుని భార్యలలో గంగ ఎక్కువ? గౌరి ఎక్కువ? ఎవరే ఎక్కువ’ అని జవాబుగా జమ్మీ పరమశివుని ప్రేమించిన పార్వతినై చెపుతున్నాను. నేనే ఎక్కువ అంటుంది. కాదు పరమ శివుని ప్రేమించిన గంగను నేనవుతున్నానే- నేనే ఎక్కువ అని ఎదురు చెప్తుంది. సోనీ, ఈ తమాషాలో మిగిలిన ప్రశ్నలు-జవాబులు సవాళ్లులాగా ఇలా సాగిపోతాయి. అవి:

‘చిరతపస్సు చేసినేను శివుని భార్యనైనానే’

‘శిరస్సున వేడితగ్గించగ శివుడే నన్నుకోనే’

‘దక్షుడు నా కన్నతండ్రి అతడి వీడివచ్చానే’

‘స్వర్గం నా జన్మభూమి అదేవదిలి వచ్చానే’

‘సర్వేశుని దేహంలో సగభాగం పొందానే’

‘ఈశ్వరుని శిరస్సున ఇల్లు కట్టుకుని వున్నానే - నేనే ఎక్కువ’

‘గౌరీ శంకరులంటారే, గంగాశంకరులనరే’

‘గంగా-గౌరీ అంటారే, గౌరీ - గంగా అనబోరే!’

         పాట తర్వాత, స్వరశబ్దాలతో నాట్య పోటీ జరుగుతుంది. తండ్రి గుమ్మడి మురళీ (శోభన్ బాబు) ని చంపాలని ప్రయత్నిస్తాడు. పొరపాటున ఆ కత్తి తన కూతురు సోనీ మీద పడి ఆమె చనిపోతుంది.

         సినిమాలో శ్రీశ్రీ గుమ్మడికో పాట వ్రాసాడు. ఇద్దరు పిల్లలు తన్ను వదిలి వెళ్ళిన తర్వాత కల్లుపాకకు మకాం మారుస్తాడు. కల్లు బాగా త్రాగుతుంటాడు. త్రాగుతూ పాడుకుంటాడు.

‘ఇనుకోరా, ఇనుకోరా, ఈ మల్లన్న మాట వినుకోరా

ఇనుకుంటే అది మంచికిరా-ఇనకుంటే కథ కంచికిరా’ అని పాడుతూ. ఓ సత్యం చేప్తాడు.

తెలుపురంగు సత్యానిది, నలుపు రంగు చీకటిది

పసుపురంగు పైత్యానిది, ఎరుపురంగు ఆకలిది

ఈకాలే కాలే కడుపు కల్లుముంతతో చల్లార్చుకోరా!

         ఆకలి చంపుకోవాలంటే చవకగా దొరికే కల్లు సేవించటం పేదవారికి అలవాటు. ఆరకంగా, ఆర్థం స్ఫూరించే రీతిలో శ్రీశ్రీ ఈ చక్కటి పాట వ్రాసారు.

         రామాయణం కథ అంతా ‘రవి’క తో మొదలయిందనే చరణం ఒకటి వున్నది. గిరిజన మహిళలు రవిక లేకుండా ఎందుకుంటారనే ప్రశ్నకు, రవిక కోసమే లేడిని చంపటానికి రాముడెల్లాడనీ... అట్లా సమస్యలు-పూరణలు, అష్టావధాన ప్రక్రియలాగా ఉంటాయి. సవాళ్లలో కొన్ని ఆసక్తికరమైనవి. వాటికి  సవాలులాంటి జవాబులు:

సవాలు : మొగలి పూవుపై పాముంటుందని అంతా అనటం విన్నావా?

             పాము మీదనే పరుచుకుండే మొగలిపువ్వును కన్నావా?

జవాబు : పామువంటిదే నీజడకాదా? దానిపై మొగలిపువ్వే కాదా?

సవాలు: పగలు దాగి, రాత్రిసాగి, వీపుమీద దీపముంచి

            వెలుగు మనకు పంచుతుంది-ఎవరే ఆ ప్రాణి?

జవాబు : మిణుగుడు పురుగని గ్రహించుకోవే

             మిడిసిపాటు నీకెందుకు లేవే!

సవాలు : ఆడామగా అనే తేడాతో లోకంలో గల జాతులు రెండని

            నీకు తెలుసు నాకు తెలుసు. - ఈ జాతులు రెండింటి అందంలో ఎవరే ఎక్కువ?

జవాబు : పక్షిని చూడు పసుపును చూడు

            కోడిని చూడు లేడిని చూడు

            పురివిప్పుకుని ఆడే నెమలిని చూడు

            అరణ్యాన వేటాడే సింగం చక్కదనం మగజాతిదెకాదా?

             ఆడజాతికొక అందముందా?

సవాలు : నీతి నియమం - సిగ్గూ బిడియం

            నాతికి లక్షణమన్నారు-ఆ నీతిని నీటను కలిపేసి

            మీ దేశదిమ్మరులు- రవికలనే వదిలేశారేమే !

జవాబు : ఆరవిక వల్లనే సీతమ్మ బ్రతుకు రౌరౌ నరకమ్మాయెనే

            రంగురంగుల రవికకోసమే-బంగరు లేడిని కోరింది

            ఆమెభర్తను పొమ్మని వేడింది- ఆరవికవల్లనే రామాయణం కథ

            అల్లిబిల్లిగా సాగింది - సీతమ్మకు సోకం తెప్పించింది.

            అందుచేత మాదేశ దిమ్మరులు

            అసలే రవికను వదిలేసారే!

         ఇలా అన్ని పాటలు సరదాగా సాగేవే. శ్రీశ్రీ-కొసరాజుల పాటలకు సంగీత దర్శకత్వం వహించిన పెండ్యాల నాగేశ్వర రావుకు ఇది మ్యూజికల్ గా మంచి హిట్ పిక్చరే. ఆయనకు అఖిల భారత స్థాయిలో అవార్డు కూడా తెచ్చిపెట్టిన సినిమా.

         మొదలు ఈ సినిమాలో హీరోగా కృష్ణను అనుకున్నారు. తద్వాత శోభన్ బాబును పెట్టారు. ఓ రోజు సెట్స్ కు ఆలస్యంగా వస్తే శోభన్ బాబును మందలించారు తిలక్.

         ఈ సినిమాలో తమాషాకు చక్కగా వుపయోగపడే ‘డోలక్’ వాయించటానికి  సి రామచంద్ర గారి దగ్గర పని చేసే అతన్నే ఇందులోనూ పెట్టారు. మరాఠీ సినిమాల కంటే తమాషా స్టైల్స్ లో తీసిన పంతాలు పట్టింపులే బాగుందని అందరూ - ముఖ్యంగా సి రామచంద్ర మెచ్చుకున్నారు. అదే తృప్తి తిలక్ కు.

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment