Sunday, August 2, 2020

కాస్ట్యూమ్స్ ఇంటికి పట్టుకుపోయిన ఎన్ టి ఆర్ ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

కాస్ట్యూమ్స్ ఇంటికి పట్టుకుపోయిన ఎన్ టి ఆర్

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(అక్టోబర్ 15-21, 2000)

         అత్తా ఒకింటి కోడలే’ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడిన అవకాశాన్ని పురస్కరించుకొని జంటనగరాల్లోని సాగర్-చిత్ర థియేటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకొన్నారు. నటీ-నటులు, సాంకేతిక నిపుణులందరూ పాల్గొన్న ఆ పండుగకు ముఖ్య అతిథిగా అప్పటి శాసనమండలి అధ్యక్షులు స్వర్గీయ మాడపాటి హనుమంతరావుగారు, మెమొంటోలు ప్రదానం చేయటానికి ప్రముఖ రంగస్థల నటులు స్థానం నరసింహారావు గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా మెమొంటోలు అందుకున్న ఆర్టిస్టులు ఎంతగానో సంతోషించారు. ఆ సాయంత్రం జరిగిన ఓ విందులో, సినిమాలో ‘హీరో’ ఎవరు అనే విషయం చర్చనీయాంశమైంది. అందరూ జగ్గయ్య హీరో అన్నారు. దర్శకుడు తిలక్ మాత్రం, జగ్గయ్యగారు అక్కడేనే ఉన్నప్పటికీ, హీరో రమణారెడ్డి పోషించిన ‘సుబ్బారాయుడు’ పాత్ర అని చెప్పారు.

         ఆ సందర్భంలోనే మరింత చర్చనీయాంశమైన మరో అంశం-తిలక్ గారి స్వంత కంపెనీ, ప్రభాత్ ఫిల్మ్స్ ద్వారా కాకుండా పూర్ణా పిక్చర్స్ (సికింద్రాబాద్) ద్వారా ఎందుకు, ఆయన దర్శక-నిర్మాణంలో తీయబడిన ‘అత్తా ఒకింటి కోడలే’ చిత్రం డిస్ట్రిబ్యూట్ చేయవలసి వచ్చిందని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు తిలక్. ప్రసాద్ ప్రొడక్షన్స్ లో భాగస్వామిగా ఉండే శ్రీయుతులు చింతమనేని శేషగిరిరావు ప్రభృతులు, మరో సంస్థను స్థాపించి ‘కూతురు కాపురం’ అనే సినిమా తీద్దామనుకొని, దానికి దర్శకత్వం వహించేందుకు శ్రీ శోభనాద్రీశ్వర్ రావు అనే అతన్ని ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా పంపిణీ బాధ్యత తిలక్ తన ప్రభాత్ ఫిల్మ్స్ ద్వారా చేపట్టారు. దానికీ తగిన కారణం ఉంది. చదలవాడ కుటుంబరావు-శ్రీరామమూర్తి గార్లు అప్పట్లో గుంటూరులో థియేటర్ నడుపుకుంటుండేవారు. వారిరువురికీ చింతమనేని శేషగిరిరావు మంచి మిత్రుడు. వీరందరికీ శ్రీ వీరమాచినేని మధుసూదన రావు గారితో ఎలాగన్నా కూతురు కాపురం సినిమా డైరెక్టు చేయించాలని చెప్పమని, చింతమనేని శేషగిరిరావుతో అన్నారు తిలక్. అప్పటికీ సమర్ధుడైన వీరమాచనేని గారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇతరత్రా ఏ వ్యాపకం లేక ఉంటుండేవారు.

ఇదిలా ఉండగా తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే శ్రీ శోభనాద్రీశ్వరరావు గారు అనుభవం లేకపోయినా ప్రొడ్యూసర్ గారికి చాలా  కావాల్సిన మనిషైనందున ఆయన్తోనే ప్రథమంగా డైరెక్టు చేయించాలని నిర్ణయం తీసుకోవటంతో, అనుభవం ఉన్న మధుసూదన్ రావు గారిని తిలక్ కోరిక మేరకు అసిస్టెంట్ గా తీసుకున్నారు చింతమనేని గారు. ప్రతిగా ‘కూతురు కాపురం’ సినిమా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటానని చెప్పారు తిలక్. ఆ కారణాన, అదే సమయంలో నిర్మిస్తున్న ‘అత్తా ఒకింటి కోడలే’ సినిమా డిస్ట్రిబ్యూషన్ ను పూర్ణా పిక్చర్స్ కు అప్పగించారు. ఇదంతా యాదృచ్ఛికమే అయినా, సినిమా విజయవంతం కావడంతో తాము డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయామే అన్న బాధ ప్రభాత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలోని ఇతర భాగస్వాములకు కలిగింది. శ్రీరామమూర్తి శ్రీ చదలవాడ కుటుంబరావులు తీసిన ‘సతీ తులసి’కి మధుసూదనరావుగారే దర్శకుడు, తన మొదటి సినిమాగా.

         ఆ సాయంత్రం జరిగిన విందులోనే సరదాగా చెప్పుకున్నారు మరో విషయం. ‘గిరిజ’ను శోభ పాత్రలో పెదకాకాని గుడి దగ్గరకు తీసుకుపోయి, ఆమె అత్తగారు హేమలత పొర్లుడు దండాలు పెట్టించిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. ఆ షూటింగ్ జరుగుతున్నపుడు అక్కడనే గిరిజ తల్లి శ్రీమతి ‘దాసరి తిలకం’ గారు (ఆమే పెద్ద ఆర్టిస్టే), ‘అయ్యా మా అమ్మాయికి పిల్లలు పుట్టుతారా బాబూ’ అని తిలక్ గారిని అడిగిందట. ‘మీ అమ్మాయికి పెళ్లయితే గదా పిల్లలు పుట్టేది’ అని జవాబిచ్చారు తిలక్. ఈ విషయాన్నీ చెప్పిన తిలక్, చాలా సంవత్సరాలకు ఓరోజు గిరిజ కల్సిందనీ, తనకు పెళ్లయిందనీ, పిల్ల పుట్టిందనీ, ఆమె అమ్మగారన్నట్లు పెదకాకాని గుడిచుట్టూ పొర్లుడుదండాలు పెట్టడం వల్లనే సంతానం గలిగిందనీ తనతో అన్నదన్నారు. గిరిజ కూతురు కూడా హీరోయిన్ అయిందట. ఇవన్నీ తల్చుకొని నవ్వుకున్నారాయన.

         అత్తా ఒకింటి కోడలే’ చిత్రం శతదినోత్సవం జరిగిన తర్వాత, దాన్ని తమిళంలో కూడా తీయాలన్న కోరిక కలిగిన రోజుల్లనే వీటీఎస్ అనే క్రొత్త సంస్థ బ్యానర్ కింద ‘ఉత్తర గో గ్రహణం’ అనే సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు  తిలక్. శ్రీయుతులు వెంకట్ రెడ్డి, తిలక్, సురేంద్రరెడ్డిల కాంబినేషన్ లో వెలసిందా సంస్థ. అనుకున్నదే తడవుగా చంద్రశేఖర్ రావు గారితో స్ర్కిప్టు రాయించడం కూడా జరిగిపోయింది.

         మరోపక్కన తమిళంలో అత్తా ఒకింటి కోడలే సినిమా తీసే ప్రయత్నాలు కూడా కొనసాగాయి. మొదలు టాప్ స్టార్స్ కాంబినేషన్ లో తీద్దామనుకున్నారు. అందర్నీ సంప్రదించడం కూడా జరిగింది. ఆ కాంబినేషన్ తో,  అనుకున్న టైమ్ లో తీయలేమోనన్న అనుమానం కలిగింది తిలక్ గారికి. అందుచేత జగ్గయ్య గారికి దగ్గరి పోలికలతో ఉన్న డిఎంకె శాసనసభ్యుడు రాజేంద్ర శ్రీమతి ఎమ్ ఎన్ రాజంల కాంబినేషన్ తో సినిమా తీద్దామని మనసు మార్చుకున్నారు. లొకేషన్స్ కోసం తమిళనాడు తిరిగారు. పెరియార్ లేక్ కు వెళ్లారు. అక్కడి నుంచి త్రివేండ్రం, కొచ్చిన్ కూడా వెళ్లారు తిలక్. 

         తమిళంలో మొదలెట్టకముందు వాసన్ గారు తిలక్ ను పిలిచి ఆయన సినిమాలు చూసి, ఎం.ఎల్.ఏ, అత్తా ఒకింటి కోడలే చిత్రాలను తమిళంలో తీయటానికి హక్కులు ఇవ్వమని అడిగారు. అదేవిధంగా ఎ.వి.ఎం చెట్టియార్ కూడా అడిగారు. ఇద్దరికీ ఇవ్వలేదు. తిలక్ కు సన్నిహితంగా ఉండే శ్రీమతి జి.వరలక్ష్మి కోరినా ఒప్పుకోలేదు. ఆమె ఆ కారణాన ‘మామియారుం మరుమగళే’ అనే టైటిల్తో సినిమా తీయమని ఎవిఎం ను ప్రోత్సహించింది. తిలక్ గారి అనుపమ టైటిల్ ‘మామియారుం ఒరువీటి మరుమగళే’. ఎవిఎం గారు కూడా శ్రీమతి ఎం ఎన్ రాజంనే పెట్టారు. వాళ్లూ ఎలాగూ తీస్తున్నారు కదా అని తన సినీ నిర్మాణాన్ని కొంత జాప్యం చేశారు తిలక్. చివరకు వాళ్లు తీసారు. తనూ తీసాడు. కొంత ఆర్థిక ఇబ్బందులకు గురిచేసింది తమిళ సినిమా ప్రయోగం. పర్యవసానంగా తర్వాత స్వంత సినిమాలు తీయటంలో కొంత వ్యవధి ఏర్పడింది.


         సరిగ్గా ఈ వ్యవధిలోనే నెల్లూరుకు చెందిన ఆనం సుబ్బారెడ్డి గారి తాలూకు మొంగమూరి బ్రదర్స్ తో పరిచయం సాన్నిహిత్యం కలిగింది. మొంగమూరి బ్రదర్స్ వారు, రాజేంద్రన్ రాజన్ ల కాంబినేషన్ తో, వీ.ఎన్.రెడ్డితో ‘గంగా గౌరీ సంవాదం’ అనే సినిమాను మొదటిసారి తీయించారు. ఆ సినిమా తీస్తున్నపుడే వారితో పరిచయం ఏర్పడింది. ఇంకొక సినిమాను తమకు తీసిపెట్టమని తిలక్ ను కోరారు వారు. సరేనన్న తిలక్, చార్లెస్ డికెన్స్ ఆంగ్ల నవల ‘ఆలివర్ ట్విస్ట్’ కథను ఆధారంగా ‘చిట్టి తమ్ముడు’ సినిమా తీయాలని నిశ్చయించారు. కొండేపూడి లక్ష్మీనారాయణ గారితో స్ర్కిప్టు రాయించి దర్శకత్వ బాధ్యత తాను స్వీకరించారు తిలక్.

         స్టువర్ట్ పురం’ సెటిల్ మెంట్, చిన్నపిల్లలు రాళ్లతో కొట్టుకోవటం, నాలిక వెళ్లబెట్టటం, దొంగతనాలు చేయించటం థీమ్. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని, ఆలివర్ ట్విస్ట్ కథను బేస్ చేసుకొని రూపొందించారు  ఆ చిత్రాన్ని. రూపవాణి కార్యక్రమాలకు సంగీత దర్శకురాలిగా పనిచేసిన శ్రీమతి వక్కలంక సరళ కూతురు, డ్యాన్సర్ శ్రీమతి స్వప్న సుందరి కొడుకును చిట్టి తమ్ముడు పాత్రకు ఎంపిక చేశారు. వక్కలంక సరళ తండ్రీ కళాకారుడే. అప్పటికే మద్రాసులో స్థిరపడ్డారాయన.

         ఆ సినిమాలో తిలక్ చేసిన ప్రయోగం నుంగంబాకంలోని చీమకుర్తి జమీందారు గారికి చెందిన ఓ పాడుబడ్డ భవనాన్ని నేపథ్యంగా చేసుకొని చిత్రీకరించటమే. ‘పాణిన్’ అని దొంగతనాలు చేయించే భవనంగా దాన్ని ఉపయోగించారు ఆ సినిమాలో. అందులో విద్యుత్ సరఫరా లేదు. షూటింగ్ కొరకు జనరేటర్లను వినియోగించి, ఫ్లడ్ లైట్లను గడలకు కట్టి చిత్రీకరించారు. తిలక్ దర్శకత్వంలోని అన్ని సినిమాలకు కెమెరామెన్ గా పనిచేసిన లక్ష్మణ గోరే చిట్టితమ్ముడుకు కూడా కెమెరామాన్.

         చిట్టి తమ్ముడు సినిమాలో పాటలన్నీ చాలా బాగుంటాయని కొన్ని వినిపించారు తిలక్. ‘ముసురు ముసిరిందోయ్ మామా మళ్లీ కల్సుకుందాం’ అనే పాట ఒకటి. మరొకటి సుశీల నేపథ్యంలో పాడిన ఏస్కో నా రాజా ఏస్కో- ఆకేస్కో, వక్కేస్కో, ఆ పైన చూస్కో’ అనేది సినిమాలో రాజసులోచన పాడిన ఈ పాట రికార్డింగుకు రిహార్సల్స్ చేస్తున్నపుడు సుశీల గారి భర్త డాక్టరు ఒకటి రెండుసార్లు వచ్చారట. ఆయన ఏదోలాగ ఫీల్ అవుతుంటే ఆయన్ను బయటకు వెళ్లమని సూచించారు తిలక్. అలానే రాజసులోచనతో నాట్యం చేయిస్తూ వీధిలో పాడించిన మరో పాట కూడా చాలా బాగుంటుంది. ఆరుద్ర రచించిన ఆ పాట.. ‘మాయా బజారులోకం, బాబూ న్యాయానికి రోజులు కావూ బాబూ, హుషారు నాగుబామునీ నమ్ముకోవచ్చుకానీ, రాగి డబ్బునూ నమ్మరాదూ ఇప్పటిదాకా నీతో వుండి, చెప్పక చెయ్యక తప్పుకుపోవును’ ఆమె ప్రియుడు రాజనాల దొంగతనాలు చేయించటానికి తోడ్పడుతూ నాట్యం చేస్తూ ఈ పాటను పాడుతుంది రాజసులోచన.

         నెల్లూరు ప్రాంతంలో ‘చిట్టి తమ్ముడు’ ఔట్ డోర్ షూటింగ్ చేస్తూ, చిట్టి తమ్ముడు పారిపోయి వచ్చిన నేపథ్యంలో చిత్రీకరించిన మరోపాటను కూడా గుర్తు చేసుకున్నారు తిలక్. ‘సంగం’ డ్యామ్ దగ్గర ఓ చర్చ్ దగ్గర చిత్రీకరించిన ఆ పాట.... ‘దిక్కులేని వారికి దేముడే దిక్కు ఆ దేముడెక్కడ కనిపించడనే కదా చిక్కు’ హాస్టల్లో ఉంటున్న అనాథ విద్యార్థులకు భోజనం సరిగా పెట్టక ఇబ్బందులు పెట్తున్న నేపథ్యంలో తీసిన మరో సన్నివేశం కూడా చక్కగా ఉంటుంది. పిల్లలందరూ కూడబలుక్కొని ఓ అగ్గిపెట్టెలో పుల్లలుంచి, తలొకటి తీయాలని అనుకొని, ఎవరికి చిన్న పుల్ల వస్తుందో వారు హాస్టల్ అధికారులను నిలదీస్తూ తిండెందుకు పెట్టటంలేదో తేల్చుకోవాలి. అదీ ఆ సీన్. ఆ సీన్ లో పాట: అడగాలీ అడగాలీ అడిగేదెవరో తేలాలి.. ఆ పాటలో ఇతరులతోపాటు ఒకనాటి మేటి నటి విజయలలిత (విజయశాంతి బంధువు)ను చిన్నపిల్లగా సినీ రంగానికి పరిచయం చేస్తారు తిలక్. లోగడ తన ‘అత్తా ఒకింటి కోడలే’  సినిమాలో విజయశాంతి పిన్నిగారైన విజయతో నర్సు వేషం వేయిస్తారు తిలక్. ఆ పరిచయంతో విజయశాంతికి చిన్న రోల్ ఇచ్చారు చిట్టి తమ్ముడులో ఆ ‘పిల్లే’ పెద్ద ఆర్టిస్ట్ అయింది ఆ తర్వాత. ఈ సీన్ తర్వాత హాస్టల్ వార్డెన్లు చదలవాడ కుటుంబరావు, సూర్యకాంతంలతో ‘అయ్యో రామ.. అయ్యో రామ’ అనే డ్యూయెట్ పాడిస్తారు.

         జయలలిత తల్లిగారైన ‘సంధ్య’ చిట్టి తమ్ముడు సినిమాలో రమణారెడ్డి భార్యగా నటించింది. వారి మిత్రుడిగా సీఎస్ఆర్, అడ్వకేట్ ముస్లిం క్యారెక్టర్ గా నటించారు. కథానాయకుడు శ్రీ కాంతారావు. అదే సినిమాలో తిలక్ తీద్దామనుకుని కారణాంతరాల వల్ల పూర్తి చేయలేకపోయిన ‘కృష్ణార్జున’ అనే సినిమాకు సుభద్రార్జునుల (దేవిక-జగ్గయ్య) పై టేక్ చేసిన పాటను చిట్టి తమ్ముడు తల్లితండ్రులపై చిత్రీకరించారు. ‘నీవూ నేనూ జాబిలీ, మూవురమూ వున్నాముగా నీలో కలిగిన తొందర చూసి, నెలరాజేమో నవ్వెనులే’ అనే పాట.

         శ్రీ కృష్ణార్జున యుద్ధం మొదలెట్టి ఆపేయటం, తమిళ సినీ ప్రయోగంతో ఆర్థికంగా ఎదురుదెబ్బ తగలటం కొంత ఇబ్బందికి లోను చేస్తాయి తిలక్ గారిని. ‘ఉత్తర గో గ్రహణం’ కథకు చెందిన స్క్రిప్టు కూడా తయారైంది ఆ పాటికే. శ్రీకృష్ణార్జున స్క్రిప్టు రచయిత ఆరుద్ర. అదీ తయారైంది. శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్ ను ఎంపిక చేసుకొని కొన్ని సీన్లు కూడా చిత్రీకరించారు. జగ్గయ్య అర్జునుడు- దేవిక సుభద్ర ఆర్ట్ డైరెక్టర్  తోట సంగీత దర్శకుడు పెండ్యాల. సీన్-బై-సీన్-స్క్రిప్టును ఆర్టిస్టులకందరికీ ఇవ్వటం కూడా పూర్తయ్యింది. జగ్గయ్య – దేవికలపై పాటను చిత్రీకరించిన తర్వాత విడుదలైంది ‘గుండమ్మ కథ’ అనే సాంఘిక చిత్రం. అందులో నాగేశ్వర్ రావు, రామారావు కలసి నటించారు.

ఆ నేపథ్యంలో అక్కినేనితో అర్జునుడి పాత్ర వేయిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా కలిగింది. జగ్గయ్యని తన పాత్ర మార్చుకునేందుకు ఒప్పించటం కూడా చేసారు తిలక్. అయితే ఎఎన్ఆర్, అమ్మో ఎన్టీఆర్ సరసన మైథాలజీ సినిమాల్లో వేయటం కష్టమేమోనండీ అని తిరస్కరించారు. తర్వాత యాదృచ్ఛికంగా ఆ సినిమాను శ్రీ కెవి రెడ్డి గారు ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’గా తీయటం,  అందులో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ కల్సి నటించటం జరిగింది. ఏదో సందర్భంలో అక్కినేనిని కల్సినపుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. ‘దొంగరాముడు’ సినిమాకు మొట్టమొదట తమ ‘అన్నపూర్ణ’ బ్యానర్ పెట్టింది కెవి రెడ్డి గారు కాబట్టి ఆయనడిగితే కాదనలేక ఒప్పుకున్నాను అని సర్ది చెప్పారు తిలక్ గారికి ఎఎన్ఆర్. కెవి రెడ్డిగారు కూడా సినిమా మొదలు పెట్టే ముందు తిలక్ కు ఫోన్ చేయటం, ఆ సందర్భంలో తాను ఆ సినిమా తీసే ఆలోచన మానుకున్నట్టు తిలక్ చెప్పటం జరిగింది. తిలక్ గారు నిర్ణయించుకున్న ఆర్ట్-మ్యూజిక్ డైరెక్టర్లే కె.వి రెడ్డి గారి సినిమాకు చేసారు.

         తీయాలనుకుని పూర్తి చేయలేకపోయిన ‘శ్రీకృష్ణార్జున’లో రమణారెడ్డి క్యారెక్టర్ పాడిన ఓ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ కూడా చేసామన్నారు తిలక్. చారెడు-బారెడు-పిడికెడు అనే ఆ పాట ఆరుద్ర కలం నుంచి వెలువడింది. ఆ పాటను గుర్తు చేసుకున్నారు తిలక్. ఎంతో అర్ధవంతంగా ఉన్న ఆ పాట ఇలా సాగుతుంది.

‘చారెడు పిడికెడు బారెడు పిల్ల- బలే మంచి పిల్ల

చారెడు - కన్నులు చెంపకు చారెడు,

పిడికెడు- సన్నని నడుము పిడికెడు,

ఝూమ్మని నల్లని తుమ్మెద గుంపులు,

జడ నీలాలు బారెడు -తెగబారెడు,

కలువల సంపెంగ మల్లెల పిల్ల – భలే మంచి పిల్ల,

కలువలు- కాటుక కన్నులు కలువలు,

సంపెంగ- చక్కని ముక్కు సంపెంగ,

కిలకిల నవ్విన తళతళ మెరిసే,

పలువరుసే కద మల్లెలు-మరుమల్లెలు,

జాబిలి మెరుపుల వెన్నెల పిల్ల-బలే మంచి పిల్ల,

జాబిలి- ముద్దుల ముఖమే జాబిలి,

మెరుపులు – మేని కాంతులే మెరుపులు,

కన్నులు విందులు కమ్మగ చేసే,

వన్నెలు చిన్నెలు వెన్నెల- ఎద వన్నెల,

మహాలక్ష్మి, సరస్వతి పార్వతి సాటి – భలే మంచి పిల్ల.

మహాలక్ష్మి-కళగల మోము మహాలక్ష్మి,

సరస్వతి-కన్యక చదువుల సరస్వతి

మగని తనువులో సగమై ఎపుడూ

మనజాలుటలో పార్వతి – శివపార్వతి’

సుభద్రను వర్ణిస్తూ పాడిన పాట ఈ పాట..

         శ్రీకృష్ణుడుగా ఎన్టీరామారావుపైన ఎన్నో సీన్లు చిత్రీకరించారు. అందుకొరకై శ్రీకృష్ణ పాత్రకు పనికొచ్చే చక్కని కాస్ట్యూమ్స్ తయారు చేయించారు తిలక్. అవి ఎంతో బాగున్నాయని ఎందరో మెచ్చుకున్నారు. నటించిన ఎన్టీఆర్ తో సహా సినిమా తీయకపోయినా వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు తిలక్. ఆ తర్వాత సారధిలో నిర్మిస్తున్న కలసివుంటే కలదు సుఖం సినిమాలో ఓ సీన్ కొరకై ఆ కాస్ట్యూమ్స్ కావాలని సారధి స్టూడియో అధినేత శ్రీ చల్లపల్లి రామకృష్ణ ప్రసాద్ అడిగితే ఇచ్చారాయనకు తిలక్. షూటింగ్ ఎన్టీఆర్ మీద తీసారు. కాస్ట్యూమ్స్ ఆయన వద్దనే వుండిపోయాయి. ఎన్నిసార్లడిగినా, ఎంతకాలానికైనా అవి తిరిగి రాలేదు. తిలక్ తన సహజ ధోరణిలో అడగటం మానకుండా వత్తిడి చేయసాగారు రామకృష్ణ ప్రసాద్ గారిని. చివరకు అవి తీసుకురావటానికి ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన తిలక్ బావమరిది ప్రొడక్షన్ మానేజర్ వీరభద్రరావుతో ఎన్టీఆర్ ‘ఏమీ మీ బావగారు అంత గట్టిగా అడుగుతున్నారు ఎందుకు’ అని ప్రశ్నించి వాటిని వాపసు చేసారు.

         శ్రీకృష్ణార్జున సినిమా తీయకపోయినా స్ర్కిప్టు, కాస్ట్యూమ్స్ మటుకు మిగిలాయి తిలక్ గారికి.

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment