Thursday, August 13, 2020

పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడి దేహత్యాగం ..... శ్రీ మహాభాగవత కథ-3 : వనం జ్వాలా నరసింహారావు

 పరీక్షిత్తు జననం, ధృతరాష్ట్రుడి దేహత్యాగం

శ్రీ మహాభాగవత కథ-3

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

          భీష్మాచార్యుల మరణానంతరం, ఆయనకు ధర్మరాజాదులు అంతిమ సంస్కారాలు చేసిన తరువాత, శ్రీకృష్ణుడు హస్తినాపురంలో మరి కొన్ని రోజులున్నాడు. తరువాత ద్వారకానగారానికి ప్రయాణమయ్యాడు. సుభద్ర, ద్రౌపది, కుంతి, ఉత్తర, గాంధారి, ధృతరాష్ట్రుడు, విదురుడు, ధర్మరాజు ఇలా అందరూ శ్రీకృష్ణుడు బయల్దేరి పోతుంటే, ఆయనకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. యమునా నదీ తీరంలోని కురుజాంగల, పాంచాల, శూరసేన దేశాలు దాటాడు. బ్రహ్మావర్తాన్ని, కురుక్షేత్రాన్ని, మత్స్య, సారస్వత, మరుధన్వ, సౌవీర, అభీర, సైంధవ దేశాలను దాటి, ద్వారకలో అంతర్భాగమైన ఆవార్త మండలానికి చేరుకొని అక్కడ నుండి ద్వారక నగరాన్ని చూసి, సూర్యాస్తమయం సమయానికి ద్వారక నగారానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. ఆయన రాకకు పురజనులంతా అమితంగా ఆనందపడ్డారు. ఇక ముందు ఆయన ఎక్కడికీ వెళ్లకుండా ద్వారకలోనే ఉండాలని ప్రార్థించారు వారంతా. ద్వారక రాజమార్గం ద్వారా ప్రయాణం చేసి, ఆయన, తల్లిదండ్రుల నివాసాలలోనికి వెళ్లి, దేవకికి, ఇతర ఏడుగురు తల్లులకు మొక్కాడు. అనంతరం ఏక కాలంలో పదహారువేల నూట ఎనిమిది మంది భార్యల భవనాలలోకి వెళ్లాడు. వాళ్ళతో సరససల్లాపాలు ఆడాడు.

         ఇదిలా ఉండగా, అశ్వత్థామ కోపంతో ప్రయోగించిన బ్రహ్మశిరోనామ అస్త్రం బారినుండి ఉత్తర గర్భం శ్రీకృష్ణుడి దయవల్ల బతికింది కదా! గర్భస్థ శిశువును వాసుదేవుడు ఎలా రక్షించాడు? అలా రక్షించబడిన బాలుడు ఈ భూమ్మీద ఎన్ని సంవత్సరాలు జీవించాడు? అతడు ఎలాంటివాడు? ఏమి సాధించాడు? ఆయన తనువును ఎలా చాలించాడు అనే విషయాలను వరుసగా చెప్పడం ప్రారంభించాడు సూతుడు శౌనకాది మహా మునులు వింటుంటే.

         అభిమన్యుడి భార్య గర్భంలో ఉన్న శిశువు పదినెలలు నిండేసరికి అశ్వత్థామ ప్రయోగించిన బాణానికి అంతులేని బాధపడుతూ ఆక్రోశించాడు. అలా ఆ బాలుడు చింతిస్తున్న సమయంలో అంగుష్ఠమాత్ర దేహంతో ఒక గద ధరించి విష్ణువు ఆ శిశువు ముందు ఆవిర్భవించాడు. అశ్వత్థామ వేసిన బ్రహ్మాస్త్రం వేడి తగలకుండా, గదను గిరగిరా తిప్పుతూ, శిశువుకు రక్షణ కలిగించి ఆనందాన్ని చేకూర్చాడు. బాణాగ్నిని గదతో ముక్కలు చేశాడు. చేసి, అదృశ్యమయ్యాడు. ఇది జరిగాక ఒక శుభ లగ్నంలో కుమారుడు పుట్టాడు ఉత్తరకు. విష్ణువు రక్షించడం వల్ల పుట్టాడు కనుక విష్ణురాతుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కుతాడని బ్రాహ్మణులు చెప్పారు. ధర్మరాజు అతడి భవిష్యత్ గురించి అడిగిన ప్రశ్నకు జవాబుగా, వారు, అతడు అఖండమైన కీర్తి గడిస్తాడని, విష్ణు భక్తుడు అవుతాడని చెప్పారు. చాలా సంవత్సరాలు జీవించిన తరువాత తక్షకుడు అనే సర్పం విషాగ్ని వలన తనకు మరణం ఉందని తెలుసుకుంటాడని అంటారు. శుకయోగి ద్వారా ఆత్మజ్ఞాన సంపన్నుడై, గంగానదీ తీరంలో శరీరాన్ని విడిచి పెడుతాడు అని జాతక ఫలం చెప్పారు.

         తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసిన విభుడు, ఈ విశ్వమంతా ఉన్నాడు కాబట్టి, అతడే నిత్యం పరీక్షించాడు కాబట్టి, అతడిని ‘పరీక్షిత్తు అన్నారు. ఆ బాలుడు క్రమేపీ పెరిగి పెద్దవాడై, అన్నిటా పూర్ణుడయ్యాడు.

         తదనంతరం, ధర్మరాజు బంధువులను కౌరవ-పాండవ యుద్ధంలో చంపినందుకు దోష పరిహారంగా అశ్వమేధయాగం చేయాలనుకున్నాడు. యజ్ఞానికి అన్నీ సమకూర్చుకుని శ్రీకృష్ణుడిని ఆహ్వానించాడు. ఆయన్ను ఉద్దేశించి మూడు యజ్ఞాలు చేశాడు. ఆ తరువాత అర్జునుడితో కలసి ద్వారకకు వెళ్ళిపోయాడు కృష్ణుడు. కొంతకాలానికి విదురుడు మైత్రేయ ముని దగ్గర పరమార్థ జ్ఞానానికి సంబంధించిన విషయాలను తెలుసుకుని హస్తినాపురానికి వచ్చాడు. లోకంలోని వార్తలు ఏమిటని ఆయన్ను ధర్మరాజు అడిగాడు. అప్పుడాయన మేలు కలిగించే లోకంలోని సమస్త విషయాలను విశదంగా చెప్పాడు. కీడు వార్తలు ఏవీ చెప్పలేదు.


         ధర్మరాజు రాజ్యభారాన్ని వహించి తన తమ్ములు, తానూ, మనుమడిని ముద్దు చేస్తూ, చాల కాలం మహావైభవంగా పాలన చేశాడు.

         కొంతకాలానికి, ఒకనాడు, విదురుడు ధృతరాష్ట్రుడికి విరక్తి మార్గాన్ని ఉపదేశించాడు. అప్పుడాయన జ్ఞాన మార్గంలో హిమవత్పర్వతం దిశగా గాంధారి సమేతంగా వెళ్లాడు. విదురుడు కూడా వారితో వెళ్లాడు. ఆ మర్నాడు ఈ విషయం తెలియని ధర్మరాజు వారెక్కడికి పోయారని సంజయుడిని అడిగాడు. అలా ఇద్దరూ ఎటూ పాలుపోక దుఃఖిస్తున్న సమయంలో నారదుడు వచ్చాడు. ఆయన్ను వీరి గురించి అడిగాడు ధర్మరాజు. జవాబుగా నారదుడు:

         ‘కాలాన్ని దాటడం ఎవరికీ శక్యం కాదు. చింత అక్కర లేదు. ధృతరాష్ట్రుడు గాంధారీ, విదురులతో హిమవత్పర్వత దక్షిణ భాగంలో ఉన్న ఒక మునివనానికి వెళ్లారు. అక్కడ సప్త మహర్షులకు సంతోషం కలిగించడానికి ఏడు ప్రవాహాలుగా ప్రవహిస్తున్న ఆకాశగంగ పుణ్య తీర్థంలో విష్ణువు గూర్చి ప్రార్థన చేస్తున్నాడు. నేటికి ఐదవ నాడు శరీర త్యాగం చేయబోతున్నాడు. ఆ తరువాత గాంధారి కూడా అగ్నిలో పడి భస్మమైపోతుంది. అది చూసిన విదురుడు చింతించి,  తీర్థయాత్రలకు పోతాడు’ అని విదుర, గాంధారీల వృత్తాంతాన్ని ధర్మరాజుకు చెప్పి, నారదుడు స్వర్గానికి వెళ్లిపోయాడు.     

              (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment