Thursday, August 13, 2020

నక్సలైట్లమీద మొదటి సినిమా ‘భూమికోసం’ .... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 నక్సలైట్లమీద మొదటి సినిమా ‘భూమికోసం’

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(జనవరి 14 - 20, 2001)

         'భూమికోసం-భుక్తికోసం, సాగే రైతుల పోరాటం-అనంత జీవిత సంగ్రామం’ అని నమ్మిన శ్రీ కెబి తిలక్, ఆ పోరాటానికి ‘ఆరంభమే కాని అంతం వుండదు' అని తెలియ చెప్పుతూ చేసిన విప్లవాత్మక-సామాజిక దృక్పథ చిత్రమే ‘భూమికోసం’. తిలక్ తీసిన చిత్రాలన్నింటిలో ఆయన ధోరణి కొంత కన్పించినా, ఆయన వామపక్ష సిద్ధాంతాల ధోరణి ప్రస్పుటమయిన చిత్రం మాత్రం ‘భూమికోసం’ అనొచ్చు. తమ్ముడు ‘కొర్లిపర రామనరసింహారావుకు, అతనిలాగే భూమికోసం, భుక్తికోసం తరతరాలుగా ఉండే చరిత్రను సృష్టిస్తూ అమరజీవులైన అనేకానేక సోదర సోదరీమణులకూ అంకితమిచ్చారీచిత్రాన్ని తిలక్. నక్సలిజం బలపడుతున్న ఆ రోజుల్లో, అదే ఇతివృత్తంగా సినిమా తీయటం అప్పట్లో కొంచెం ధైర్యమైన పనిగా చెప్పుకోవాలి. అంతకంటే ధైర్యం ఆ సినిమాను ఎన్కౌంటర్లో చనిపోయిన తమ్ముడే అయినప్పటికీ, ఓ నక్సలైట్ కు అంకితమివ్వటం సాహసమైన పనే. వ్యాపార ధోరణిలోకి దిగినా, తిలక్ కు వామపక్ష వాసన ఇంగువకు మల్లే వదల్లేదంటానికి భూమికోసం ఓ ఉదాహరణ.

         'భూమికోసం' టైటిల్స్ చూపుతూ కన్నెగంటి హనుమంతు, గున్నమ్మ, మునగాల రైతుల చిత్రాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తూ ఇచ్చిన వ్యాఖ్యానం చాలా బాగుంటుంది. ‘పల్నాడులో కన్నెగంటి హనుమంతు పన్నుల నిరాకరణ ఉద్యమంలో నాటి బ్రిటీషు పాలకుల చేతిలో ప్రాణాలర్పించింది దేనికోసం?’ అనీ, మందసాలో నిండు గర్భిణి గున్నమ్మ తుపాకి గుండ్లకు బలి అయినది దేని కోసం? అని ‘మునగాల రైతు పోరాటంలో పేద రైతులు కష్టనష్టాలకు గురై జైళ్లపాలైంది దేనికోసం?’ దేనికోసం?... ‘దేనికోసం, దేనికోసం....’ అని ప్రశ్నిస్తారు ప్రేక్షకులను.  'భూమికోసం' అని సమాధానంగానూ, సినిమా టైటిల్ గానూ చూపించటం జరుగుతుంది. మహాకవి శ్రీశ్రీ, సుంకర, దర్శకుడు తిలక్ లు సంయుక్తంగా రూపొందించిన కథ ఇది. స్క్రీన్ ప్లే కూడా సమిష్టిగానే చేసారు.

         శ్రీశ్రీ రచించిన అపురూప విప్లవ గేయం నేపథ్యంలో కనిపిస్తాయి. టైటిల్స్ ఆసాంతం, ‘భూమికోసం - భుక్తి కోసం సాగే రైతుల పోరాటం - అనంత జీవిత సంగ్రామం’-రాజులు మారె రోజులు మారి- పాలన చేసే పద్ధతి మారి-మారని దొకటేరా - అది దున్నే రైతుల బ్రతుకేరా- సంపద పెంచే తీరులు మారి- పంపకాలలో రీతులు మారి- మారని దొకటేరా - అది పేదల ఆకలి మంటేరా’ అన్న ఆ పాట ఎన్నటికీ మరువలేని, మరువతగని మంచిపాట. భూమిని ఆరుగాలం దున్ని, శ్రమించి, కష్టపడి పండించిన తన పంటను అనుభవించలేని రైతుకూలీకి, వారిని దోపిడీ చేసే భూకామందుకు జరుగుతున్న పోరాటం ఈనాటిది కాదనీ, బ్రిటిషు కాలంలోనూ, స్వతంత్ర భారతావనిలోనూ ఆ పోరాటం  కొనసాగుతూనే వస్తున్నదనీ, దోపిడీ  ఆగిందాకా ఆ పోరాటం ఆగదనీ తెలియ  చెప్పే సినిమా భూమికోసం. స్వతంత్ర భారతానికి చెందిన ఆంధ్రప్రదేశ్ లోని అనేకానేక గ్రామాల్లో కొనసాగుతున్న ఆ పోరాట స్ఫూర్తితో వాటిలోని ఓ గ్రామాన్ని ఎంచుకుని, అక్కడి అమర జీపుల పోరాట పటిమను తెలియచేసే ప్రయత్నం చేస్తారు తిలక్.

         తిలక్ గారు సినిమా తీసేనాటికి రాష్ట్రంలో వామపక్షాలు, అందునా కమ్యూనిస్టు పార్టీ, కుడి-ఎడమలుగా, అతివాద-మితవాదులుగా, మార్కిస్టు-లెనినిస్టులుగా, మావోయిస్టులుగా, అధికార పక్ష కమ్యూనిస్టులుగా, పీపుల్స్ వార్ గ్రూలుగా.....ఇలా ఎవరికి వారే, వారికి తోచిన రీతిలో యమునా తీరయ్యారు. వామ పక్ష భావాలతో స్వతంత్ర పోరాటంలో అంతో ఇంతో భాగం పంచుకున్న తిలక్ కు వీరంతా ఏకమయితే బాగుంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. దీనికి తోడు ఆయన అమితంగా ప్రేమించిన సోదరుడు నరసింహారావు ఎన్కౌంటర్లో మరణించటం మనస్థాపానికి గురిచేసింది. అయితే, ఈయన చెప్తే వినేదెవరు? సినిమా ప్రజల్లోకి చొచ్చుకుపోయే ఒక శక్తివంతమైన మాద్యమమనీ, తనకు చేతనయింది ఆదేనని, ఆ థీమ్ తో భూమికోసం సినిమా తీసే ప్రయత్నం చేసారు. స్వతంత్ర పోరాటం నుండి, తాను సినిమా తీసే నాటికి జరిగిన పోరాటాలు, ముఖ్య ఘటనలు తీసుకుని, ఓ కథలాగా మలచి, ఉడుకు రక్తంతో ఉరకలేస్తున్న యువతీయువకులు, సమసమాజ స్థాపన కోసం 'విడిగా కాకుండా’, ఐక్య పోరాటం చేసేటందుకు తోడ్పడుతుందని భావిస్తూ, తన కథను ఆ విధంగా మలచుకున్నారాయన.

         సినిమా తీసేముందు తెలంగాణా జిల్లాలన్నీ తిరిగానంటారు తిలక్. ఆయా ప్రాంతాలలోని ప్రతి గుట్ట, ప్రతి మెట్టుపై ఒక్కొక్క అమరవీరుని చరిత్ర తనకు కన్పించిందని, విన్పించిందని ఆయనంటారు. చిత్ర నిర్మాణంలో నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోని పలు ప్రాంతాలలో తిరిగి నాలుగు నెలలు నిర్విరామంగా చిత్రీకరణ చేస్తారు.

         సినిమా తీయటానికి పూర్వం బెజవాడలో మద్దుకూరె చంద్రశేఖరరావు గారిని కలిసారు తిలక్. అప్పటికే స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య గారు వ్రాసిన ‘తెలంగాణా సాయుధ పోరాటం-అనుభవాలూ, జ్ఞాపకాలు’ పుస్తకం ప్రచురించటం జరిగింది. ఆ తర్వాత స్వర్గీయ రావినారాయణ రెడ్డి గారి పుస్తకం కూడా వెలువడింది. ఈ పుస్తకాలన్ని చాలా ఆలస్యంగా రావటంవల్ల కొంత నష్టం జరిగిందని తిలక్ అన్నారు మద్దుకూరెతో.


         జిల్లాల్లో, తాలూకాల్లో, గ్రామాల్లో జరిగిన భూ పోరాటాలలో అసువులర్పించిన అనేకానేక అమరవీరుల గాథలు, కథలు-కథల్లాగా వెనువెంటనే ప్రచురించినట్లైతే భావి పౌరులకుపయోగపడేవనీ, అలా చేయకపోవటం వల్ల యువత సరియైన మార్గంలో నడవక పోవటం జరిగిందనీ అంటారు తిలక్.

         వామపక్ష ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలు, సరియైన త్రోవలో నడిచి వున్నట్లైతే యువతకు లాభమయ్యేదనీ, వీరంతా ఎవరి దారిన వారు నడుస్తుండటంతో ఏ మార్గం ఎంచుకోవాలో తెలియక యువత కొంత తికమకకు గురయ్యారనీ అంటారాయన. నక్సలిజం లాంటి ఇజాలు ఆవిర్భవించటానికి ఈ పరిస్థితులు దారి తీసాయని ఆయన ఉద్దేశం.

         తెలంగాణా సాయుధ పోరాటంలో, ప్రజా ఉద్యమాలను అణచే ప్రయత్నం చేసిన కొందరు జమీందార్ల-వారి వారసుల గడీల్లోనూ, భవంతులోనూ, తన సినిమా షూటింగ్ సందర్భంగా, గడిపారు అడపా దడపా తిలక్. ఈ విషయం చెప్తూ, ఆయన, ఆ జమీందార్లే తన సినిమా చేస్తున్న రోజుల్లో తనకు ఆతిథ్యం ఇచ్చేందుకు ముందుకు వచ్చేవారనీ, అదే తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. జీవితంలో పోరాటాలు, ఎన్ని చేసినా పాల్గొన్న ఇరు పక్షాల వారు, ‘హైడ్ ఆండ్ సీక్’ గేమ్ ఆడుతుంటారనీ, వారి మధ్య ఆసలైన ఆత్మీయతుండదనీ, ఆంతా కపటమేననీ అంటారాయన. అప్పటికేదో పబ్బం గడుపుకునే రీతిలో వ్యవహరించటం సర్వసాధారణంగా జరిగే విషయమేననీ, దానికి వారూ వీరూ అనే తేడాలు లేవని చెప్పారు.

         చిత్రీకరణ సందర్భంగా ఏ ప్రాంతానికి వెళ్లినా, అక్కడి జనంతో కల్సిమెల్సి తిరుగుతూ, తెలంగాణ సాయుధ పోరాటం గురించి తెలియచేస్తూ, తానీ సినిమాను ఎందుకు తీస్తున్నానో చెప్పే ప్రయత్నం చేసేవారు తిలక్. ఎక్కువ భాగం షూటింగు నూజివీడు జమీందారు గారుండే బంగ్లాలో తీసారట. సినిమా తీయడమంతా ఒక ఎత్తైతే, ప్రేక్షకుల వద్ద నుండి విమర్శలను ఆహ్వానిస్తూ ఆయన గుంటూరు, రాజమండ్రి, ఏలూరులలో బహిరంగ సమావేశాలను నిర్వహించారు. ప్రజలనుంచి మంచి స్పందన వచ్చింది. ఆ విషయంలో, చండ్ర రాజేశ్వర రావు గారు ఈ సినిమా గురించి తిలక్ తో మాట్లాడుతూ, తాను ప్రేక్షకుల స్పందన తెలుసుకునేందుకు థియేటర్లోనే అన్ని తరగతుల్లోనూ కూర్చొని (ఒక్కసారి ఒక్కో తరగతిలో) సినిమా చూసానన్నారట. సుందరయ్య గారు ఈ సినిమా చూసి, 'ఏమండీ తిలక్ గారూ, నాయకులను నమ్మే కాలం కాదు అని ఎందుకు డైలాగు చెప్పించారు' అని ఆడిగారట.

         తాను అంకిత మిచ్చిన నరసింహారావు పాత్ర కాని, ఆయన జీవితానికి ప్రత్యక్షంగా సంబంధించిన సంఘటనలు కాని సినిమాలలో ఎక్కడా పెట్టలేదు తిలక్.

         తెలుగులో మొట్టమొదటిసారిగా ప్రఖ్యాత హిందీ నటుడు శ్రీ అశోక్ కుమార్, భూమికోసంలో ఓపాత్రను పోషించారు. జగ్గయ్య-జమునల తండ్రిగా, ఓ జమీందారు వేషం వేస్తారాయన. ఆయన షూటింగప్పుడు, తెలుగును హిందీ లిపిలో వ్రాసుకుని, డైలాగులు చెప్పారు. అయితే జగ్గయ్యతో గొంతు మార్పించి, డబ్బింగ్ వాయిస్ ఇప్పిస్తారు ఆ తర్వాత. ఆ విషయంలో తాను తప్పుచేసాననీ, ఇంకెవరితోనన్నా డబ్బింగ్ వాయిస్ ఇప్పించాల్సిందనీ అంటారు తిలక్.

          న్యూఢిల్లీ అజయ్ భవన్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారో పర్యాయం. మరోసారి అక్కడనే, ఎడిట్ వర్షన్ ను తూర్పు యూరోప్ దేశాల కళాకారుల బృందాలకు చూపించారు. ఇంగ్లీషులో ఓ నోట్ ఇచ్చారు వారికి. అది చూసిన రష్యన్ బృందంలోని ఓ ప్రతినిధి తిలక్ తో శ్రీశ్రీ వ్రాసిన 'తూర్పు దిక్కున వీచేగాలి' అనే పాటను గురించి ప్రస్తావిస్తూ, చైనాను దృష్టిలో పెట్టుకుని వ్రాసిందా ఆ పాట? అని అడుగుతారు. (ఆపాటికే, రహస్యంగా, వారు ఈ చిత్రాన్ని గురించిన సమాచారాన్ని సేకరించి వుండవచ్చు) అదికాదనీ, ఆంధ్రప్రాంతంలో వీస్తుండే తూర్పు గాలి, పడమర గాలికి వున్న చల్లదనంలోని తేడాను గురించి వివరించారు తిలక్.

         ‘ప్రజలతో సినిమా-సినిమాతో ప్రజలు’  అనే దృక్పథంతో ఓ సర్కస్ కంపెనీలాగా తన యూనిట్‌ను తన వెంట తిప్పుకుంటూ చిత్రీకరించారు భూమికోసం సినిమాను తిలక్.

(మరిన్ని విశేషాలు మరోసారి)

 

 

No comments:

Post a Comment