Saturday, August 8, 2020

శ్రీ మహాభాగవతము, ఏకాదశ, ద్వాదశ స్కందాలు:వనం జ్వాలా నరసింహారావు

 

శ్రీ మహాభాగవతము, ఏకాదశ, ద్వాదశ స్కందాలు

భగవదనుగ్రహంతో చదవడం పూర్తయింది

వనం జ్వాలా నరసింహారావు

          కంII    చదివెడిది భాగవతమిది,

                   చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                   చదివినను ముక్తి కలుగును

                   చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

శ్రీ మహాభాగవతం అనే ఈ మహా పురాణాన్ని సహజ పాండిత్యుడు, బమ్మెర పోతనామాత్యుడు రచించాడు. చివరి రెండు ఏకాదశ, ద్వాదశ స్కందాలను వెలిగందల నారాయణ (నారయ కవి) సంస్కృతం నుండి తెనుగులోకి అనువదించారు. డాక్తర ఏల్చూరి మురళీధర రావు గారు తాత్పర్య, వ్యాఖ్యాన సహితంగా తెలుగు అనువాదం చేశారు. ఏకాదశ  స్కందం 73 పేజీలు , ద్వాదశ స్కందం 51 పేజీలు  ఉన్నాయి. ఏకాదశ స్కందంలో, ఋషి శాప కారణాన యదుకులంలో ముసలం పుట్టడం దగ్గరనుంచి, శ్రీకృష్ణ, బలరాములు వైకుంఠ౦ చేరడం వరకు 13 అంశాలున్నాయి. ద్వాదశ స్కందంలో ఉపోద్ఘాతం పేరుతో భవిష్యత్ దర్శిని దగ్గరనుండి ద్వాదశాదిత్యుల క్రమం తెలపడందాకా వివరంగా 6 అంశాలున్నాయి. క్లుప్తంగా ఆ 19 అంశాల వివరమైన వివరాలు:

         ఏకాదశ స్కందంలో, శ్రీకృష్ణుడు భూభారాన్ని తగ్గించి యాదవులకు పరస్పర వైరాన్ని కలగచేసి వారందరినీ అంతమొందించాలని అనుకోవడం; ఋషి శాప కారణాన యదుకులంలో ముసలం పుట్టడం; విశ్వామిత్రుడు, వశిష్టుడు, నారదుడు మొదలైన మహర్షులు శ్రీకృష్ణుడిని దర్శించడం; విదేహరాజుకు ఋషభపుత్రులైన నవయోగులతో జరిగిన చర్చ; నారాయణ ముని చరిత్ర; నారదుడు పురాతనమైన విదేహర్షభ సంవాదాన్ని చెప్పడం; ఋషభ కుమారుడైన కవి విదేహుడికి పరమార్థాన్ని బోధించడం ఉన్నాయి.

ఇంకా ఈ స్కందంలో, హరి ముని, అంతరిక్షుడు చేసిన భాగవత స్వరూప ఉపదేశం; అవిర్హోత్ర, ద్రమీళుల భాషణ, నారాయణ ఋషి కథ; చమనకరభాజనులు చేసిన పరమార్థ ఉపదేశం; బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుడిని వైకుంఠానికి రమ్మని చెప్పడానికి రావడం; కృష్ణుడు దుర్నిమిత్తాలను చూసి యాదవులందరినీ ద్వారక నుండి ప్రభాస తీర్థానికి పంపడం; కృష్ణుడు ఉద్దవుడికి పరమార్థ ఉపదేశం చేయడం; ధర్మ నిరూపణార్థం పెక్కు ఉపాఖ్యానాలను బోధించడం; అవధూత-యదు సంవాదం; నారాయణుడి లీలా విలాసమంతా తెలుసకుని దారుకుడు వచ్చి ద్వారకా నగర వాసులకు చెప్పడం; శ్రీకృష్ణ, బలరాములు వైకుంఠానికి చేరడం ఉన్నాయి.

ద్వాదశ స్కందంలో యుగధర్మం, ప్రాకృతిక మొదలైన నాలుగు రకాల ప్రళయాల వివరణ; కలియుగరాజుల జన్మ వృత్తాంతాలు; శ్రీవాసుదేవుడి లీలావతార విభూతులు; కలియుగంలో ధర్మచ్యుతి కలిగే తీరు; బ్రహ్మ ప్రళయ సంవిధానం; ప్రళయభేదాలు; తక్షకుడి కాటువల్ల పరీక్షిత్తు మృతి, జనమేజయుడి సర్పయాగం; వ్యాసుడు వేదాలను, పురాణాలను లోకానికి అందించడం; వేదాల విభాగ క్రమం; పురాణాల అనుక్రమణిక; పురాణాల శ్లోకసంఖ్యలు; మార్కండేయోపాఖ్యానం; సూర్యుడు ప్రతిమాసం భిన్న-భిన్న నామాలతో పరిజనులతో రథ సంచారం చేసే క్రమం; చైత్రాది మాసాలలో సంచరించే ద్వాదశాదిత్యుల క్రమాన్ని తెలపడం ఉన్నాయి.  


ఏకాదశ స్కందంలోని అవధూత కథ అతడు తన ఇరవై నల్గురు గురువుల వద్ద నేర్చుకున్న పాఠాలను స్పష్టం చేస్తుంది. ద్వాదశ స్కందంలో కలియుగ లక్షణం, మార్కండేయోపాఖ్యానం, శ్రీమద్భాగవత మహాత్మ్యం వివరించబడ్డాయి.

అలాగే, ఏకాదశ స్కందంలో, నారదుడు పురాతనమైన విదేహర్షభ సంవాదాన్ని చెప్పడం అనే అంశంలో, భారత వర్షం అన్న పేరు ఎలా వచ్చిందో వివరణ ఉన్నది. స్వాయంభవ మనువుకు ప్రియవ్రతుడు అనే కొడుకు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు అనే కుమారుడు పుట్టాడు. అతడికి నాభి అనే వాడు పుట్టి బాలి చక్రవర్తితో స్నేహం చేశాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి. అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరుమీద ‘భారతవర్షం అని ఏర్పడి, క్రమేపీ జగత్ప్రసిద్ధం అయింది.

ద్వాదశ స్కందంలో, ద్వాపర యుగం ముగిసిన కలియుగం వచ్చిన తరువాత జరుగనున్న పరిణామాలను చెప్పమని పరీక్షిత్తు శుక మహామునిని అడిగినప్పుడు రాబోయే కాలపు పోకడలను వివరించి చెప్పాడు. అందులో భాగంగా, కలియుగంలో రాబోయే శివనాగ వంశం గురించీ, నవ నందుల గురించీ, మౌర్య-శుంగ వంశాల గురించీ, కణ్వులు-ఇతర రాజుల గురించీ, ఆ ఆయా రాజులు స్వప్రయోజనాలను ఆశించి అధికారం చేపట్టే విధానం గురించీ వివరించాడు. సదసద్వివేకం లేని మరి కొందరు కలియుగ రాజుల గురించి కూడా చెప్పాడు. సుశర్ముడు అనే కణ్వవంశపు రాజును వృషలుడు అనే ఆంధ్ర జాతీయుడు వధించి అధర్మ మార్గంలో రాజరికం చేసే విషయాన్ని, ఆ తరువాత ఆతడి వంశీయులు 456 సంవత్సరాలు పరిపాలించబోయే సంగతి కూడా చెప్తాడు. అలాగే యవన తురుష్కాదుల గురించి, మురుండులు గురించీ, గురుండులు గురించీ, మౌన వంశ రాజుల గురించీ, అభీరాదుల గురించీ, బాహ్లికుల గురించీ వివరిస్తాడు. చివరకు కాళీ ప్రభావం వల్ల ధర్మచ్యుతి ఎలా జరగనున్నదో వివరిస్తాడు. కల్కి అవతారం గురించీ, కృతయుగ ధర్మారంభం గురించీ, సప్తర్షి మండలం గురించీ చెప్తాడు.     

ఇలాంటి విషయాలన్నీ ఏకాదశ, ద్వాదశ స్కందాలలో చదవగలగడం, ఆవిధంగా పన్నెండు స్కందాల శ్రీమహాభాగవతం పూర్తిగా చదవడం  నా పూర్వజన్మ సుకృతం.  

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీత

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ)

No comments:

Post a Comment