Friday, August 28, 2020

సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు .... శ్రీ మహాభాగవత కథ-19 : వనం జ్వాలా నరసింహారావు

 సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు

శ్రీ మహాభాగవత కథ-19

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         రాకుమారుడైన ప్రియవ్రతుడు నారద మహర్షికి ప్రియశిష్యుడు. ఒకసారి అపూర్వమైన సత్రయాగం చెయ్యాలనే ఉద్దేశంతో దీక్షవహించాడు. తండ్రి స్వాయంభువ మనువు రాజ్యపాలన చెయ్యమని కొడుకును ఆజ్ఞాపించాడు. కాని దానివల్ల రాగద్వేషాలు పెరిగి భగవత్ జ్ఞానం పోతుందనే భయంతో ప్రియవ్రతుడు ఒప్పుకోలేదు. ఈ సంగతి బ్రహ్మదేవుడికి తెలిసింది. ఆయనకు రాజ్యపాలన మీద మనస్సు పుట్టించాలని నిర్ణయించుకుని, బయల్దేరి, గంధమాదన పర్వత లోయల్లో వున్న ప్రియవ్రతుడు, నారదుడు, స్వాయంభవ మనువుల దగ్గరికి వచ్చాడు. వచ్చి, ప్రియవ్రతుడితో, విష్ణుమూర్తి మాటలుగా, ఆయన శాసనంగా కొన్ని విషయాలు చెప్పాడు. "మనమంతా సర్వేశ్వరుడు నడిపించినట్లు నడుస్తున్నాం. శరీరాన్ని ధరించడం, ప్రారబ్దాన్ని అనుభవించడం, ఎవరూ తప్పించుకోలేరు. ఇంద్రియ నిగ్రహం లేకుండా అడవికి పోయినా సంసార బంధం వున్నట్లే. ఇంద్రియ నిగ్రహం కలిగి, ఆత్మస్వరూపం తెలిసి, బ్రహ్మనిష్ట కలిగినవారికి గృహస్తు అయినా మోక్షం లభిస్తుంది. నువ్వు కూడా భగవంతుడు నీకు కలిగించిన భోగాలను అనుభవించు. వీటి పట్ల సంగం లేకుండా ప్రవర్తిస్తూ ముక్తిని పొందు" అన్నాడు బ్రహ్మదేవుడు. ప్రియవ్రతుడు బ్రహ్మ సలహాను గౌరవంతో అంగీకరించాడు. ఇలా చెప్పి బ్రహ్మ వెల్లిపోయాడు.

స్వాయంభవ మనువు తన కొడుకు ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేసి అరణ్యానికి వెళ్లాడు. బ్రహ్మ చెప్పిన ప్రకారం ప్రియవ్రతుడు రాజ్యపాలన చేస్తున్నాడు. విశ్వకర్మ ప్రజాపతి కుమార్తె బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల పదిమంది కొడుకులను, ఒక కూతురును పొందాడు. కొడుకుల పేర్లు: అగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, సవనుడు, మేధాతిథి, వీతిహోత్రుడు, కవి. కూతురు పేరు ఊర్జస్వతి. కొడుకుల్లో కవి, మహావీర, సవనులు బాల్యం నుండే పరమహంసలయ్యారు. మనస్సులో భగవత్ సాక్షాత్కారం పొందారు. ప్రియవ్రతుడికి ఇంకో భార్యవల్ల ఉత్తముడు, తామసుడు, రైవతుడు అనే ముగ్గురు కొడుకులను కన్నాడు. వారు చాలా గొప్పవారై, మన్వంతరాలకు అధిపతులయ్యారు. ఈ ముగ్గురూ పరమహంసలైన కవి, మహావీర, సవనుల స్థానాన్ని పొందారు. ఇలా ప్రియవ్రతుడు పదకొండు కోట్ల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించాడు.   

         ఇలా రాజ్యాన్ని చక్కగా పాలిస్తున్నప్పుడు, ఒకనాడు ఒక అతిమానుషమైన పని చేశాడు. సూర్యుడు మేరుపర్వతానికి ఒకవైపున చీకటి కలిపించే సందర్భంలో, ఆ చీకటిని పోగొట్టడానికి, సూర్యుడి రథంతో సమానమైన వేగం, తేజస్సు కలిగిన రథాన్ని ఎక్కి, రాత్రులను పగలుగా చేస్తానని ఏడురోజులపాటు రెండో సూర్యుడిలాగా రథాన్ని పోనిచ్చాడు. రథ చక్రం తాకిడికి భూమ్మీద గోతులు ఏర్పడ్డాయి. అవే సప్త సముద్రాలయ్యాయి. ఆ సముద్రాల మధ్య భాగం ఏడు దీపాలయ్యాయి. మేరుపర్వతం చుట్టూ ప్రియవ్రతుడు తన రథంతో ఏడుసార్లు ప్రదక్షిణం చేశాడు కాబట్టి సముద్రాలు, ద్వీపాలు సప్త సంఖ్యలో వచ్చాయి.

ఆ సప్త ద్వీపాలు: జంబూ ద్వీపం, ప్లక్ష ద్వీపం, శాల్మలి ద్వీపం, కుశ ద్వీపం, క్రౌంచ ద్వీపం, శాక ద్వీపం, పుష్కర ద్వీపం. వీటిలో జంబూ ద్వీపం లక్ష యోజనాల పరిమితి కలది. అక్కడి నుండి ఒక్కొక్క ద్వీపం ముందుదాని కంటే తరువాతది రెండు రెట్లు పెద్దగా ఉంటుంది. ఇక సప్త సముద్రాలు ఇవి: లవణ సముద్రం, ఇక్షు సముద్రం, సురా సముద్రం, ఘృత (నేతి) సముద్రం, పాల సముద్రం, దధి (పెరుగు) సముద్రం, జల సముద్రం. సముద్రాలు ద్వీపాలకు అగడ్తల లాగా ఉన్నాయి. సముద్రాలు, ద్వీపాలు ఒకదానితో ఇంకొకటి కలిసి పోకుండా, సరిహద్దులు పెట్టినట్లు వరుస తప్పకుండా ఏర్పడడం చూసి, సకల జీవులూ విస్తుపోయాయి.

ప్రియవ్రతుడు తన ఏడుగురు కుమారులైన అగ్నీధ్రుడు, ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహువు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, మేధాతిథి, వీతిహోత్రుడులను ద్వీపాలకు పరిపాలకులుగా నియమించాడు. కుమార్తె ఊర్జస్వతిని శుక్రాచార్యుడికిచ్చి పెళ్లి చేశాడు. వారి కూతురే దేవయాని. క్రమేపీ ప్రియవ్రతుడికి సంసారం మీద విరక్తి కలిగింది. విరాగయ్యాడు. కొడుకులకు రాజ్యాన్ని ఇచ్చాడు. భార్యను విడనాడాడు. సూర్యుడికి రెండవ సూర్యుడిలాగా వెలుగొందిన ప్రియవ్రతుడు చివరకు, శ్రీహరిని ధ్యానించడానికి గంధమాదన పర్వతానికి వెళ్లాడు.

ఆ తరువాత అగ్నీధ్రుడు జంబూద్వీపాన్ని పరిపాలించి ప్రఖ్యాతికెక్కాడు. సంతానం కోసం బ్రహ్మదేవుడిని ప్రార్థించాడు. బ్రహ్మ సంతోషించి పూర్వచిత్తి అనే అప్సరసను అగ్నీధ్రుడి దగ్గరికి పంపాడు. ఆమెను చూసి అగ్నీధ్రుడు కామ పరవశుడయ్యాడు. తనతో కలిసి తపస్సు చెయ్యమనీ, సంసారం చెయ్యమనీ కోరాడామెను. పూర్వచిత్తి అంగీకరించింది. లక్ష సంవత్స్రరాలు అతడితో కలిసుండి స్వర్గభోగాలను అనుభవించింది. వారికి నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావృతుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురుడు, భద్రాశ్వుడు, కేతుమాలుడు అనే తొమ్మిదిమంది కొమారులు పుట్టారు. ఆ తరువాత పూర్వచిత్తి పిల్లల్ని, అగ్నీధ్రుడిని వదిలి బ్రహ్మలోకానికి వెళ్లిపోయింది. ఆమెనే తలపోస్తూ అగ్నీధ్రుడు కూడా పిల్లలకు రాజ్యాన్ని అప్పచెప్పి బ్రహ్మలోకానికి వెళ్లాడు. ఆయన తొమ్మిది మంది కొడుకులు మేరువు కుమార్తెలను వివాహం చేసుకున్నారు.

అగ్నీధ్రుడి కొడుకైన నాభి, తన భార్య మేరుదేవితో కలిసి వాసుదేవుడిని కొలిచాడు. ఆయన నాబీమేరుదేవులకు ప్రత్యక్షమయ్యాడు. వారాయనను పరిపరి విధాలుగా స్తుతించారు. ఆయన లాంటి కొడుకు కావాలని నాభి, అతడి పక్షాన ఋత్విక్కులు భగవంతుడికి కోరారు. నాభి భార్య మేరుదేవికి తాను జన్మిస్తానని చెప్పి అంతర్థానమయ్యాడు. అన్నట్లే, మేరుదేవి గర్భంలో ప్రవేశించాడు నాభిమీద దయతో. ఋషభుడు అనే పేరుతో ఆమె ద్వారా అవతరించాడు శ్రీమన్నారాయణుడు. చాలా గొప్పవాడయ్యాడు. ఇంద్రుడు ఋషభుడి మహిమలను విని అసూయతో ఆయన రాజ్యంలో తీవ్రమైన అనావృష్టిని కల్పించాడు. ఇది తెలుసుకున్న ఋషభుడు తన మాయతో రాజ్యం అంతటా సమృద్ధిగా వర్షం కురిపించాడు. నాభి కొన్నాళ్లకు కొడుకుకు రాజ్యాన్ని పూర్తిగా అప్పగించి బదరికాశ్రమానికి వెళ్లి, శ్రీహరిలో లీనమయ్యాడు. ముక్తిపొందాడు నాభి.

ఋషభుడు జయంతి అనే కన్యను వివాహమాడాడు. ఆమెవల్ల భరతుడు మొదలైన వందమంది కొడుకులను పొందాడు. ఎన్నో పురాలు, ఆశ్రమాలు, కొండలు, చెట్లు మొదలైన వాటితో నిండిన ఈ వర్షానికి అతడి (భరతుడి) పేరుమీదే ’భారత వర్షం’ అనే పేరొచ్చింది. ఆ మహాభారత వర్షంలో ఋషభుడు తన కొడుకులలో తొమ్మిదిమందిని భూభాగాలకు వారి-వారి పేర్లతో ప్రధానులుగా చేశాడు. మరో తొమ్మిది మంది భాగవత ధర్మాన్ని లోకంలో ప్రచారం చేయడానికి భాగవత ధర్మనిష్టులయ్యారు. మిగిలిన 81 మంది తండ్రి ఆజ్ఞానుసారం యజ్ఞాలు చేస్తూ బ్రాహ్మణోత్తములయ్యారు. 

కొడుకులకు సమస్త రాజ్యాన్ని ఇచ్చివేసి ఋషభుడు బ్రహ్మావర్త దేశానికి వచ్చాడు. ఒకనాడు కొడుకులను దగ్గరికి తీసుకుని, వారితో, కోరికలమీద బుద్ధి పెట్టవద్దనీ, వృద్ధులను, దీనులను ఆదుకోవాలనీ, పాపాలకు మూలమైన కామాన్ని కోరవద్దనీ, మోక్షసాధనకు కావాల్సిన ఉపాయాలను అన్వేషించమనీ, సమస్త జీవులపట్ల సానుభూతి చూపాలనీ, భగవంతుడి కథలను వినాలనీ, ఆధ్యాత్మయోగం కలిగి ఉండాలనీ, భగవద్ విషయాలనే మాట్లాడాలనీ, సాత్త్విక స్థితిలో వుండాలనీ, వీటన్నిటి ద్వారా లింగ శరీరాన్ని జయించి నిత్య శాశ్వత సుఖాన్ని పొందాలనీ బోధించాడు. అందరిలోకి పెద్దవాడైన భరతుడిని తండ్రిలాగా చూడమని చెప్పాడు.

ఇంకాఇలా అన్నాడు: విష్ణువు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడనీ, అందువల్ల మానవుడికి బ్రాహ్మణుడు దైవమనీ, బ్రాహ్మణుడితో సమానమైన దైవం లేడనీ, అగ్నిలో హోమం చేయడం కంటే బ్రాహ్మణులకు సమర్పించిన దానినే భగవంతుడు సంతోషంగా తీసుకుంటాడనీ అన్నాడు. బ్రాహ్మణులలో తాత్త్విక చింతన, మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, సత్యసంధత, తపస్సు, ఓరిమి వుంటాయనీ, ఇవన్నీ వున్న బ్రాహ్మణుడు తనకు సద్గురువనీ, అలాంటి బ్రాహ్మణుల శరీరంలో అందుబాటులో వుంటాననీ, బ్రాహ్మణులను భక్తితో పూజించడమే భగవంతుడిని ఆరాధించదం అనీ అన్నాడు సాక్షాత్ భగవత్ స్వరూపుడైన ఋషభుడు. బ్రాహ్మణ జాతిని పూజించేవాడు ఈ భూమ్మీద మోక్షమార్గాన్ని తెలుసుకుంటాడని, ఇది సత్యమని స్పష్టం చేశాడు.  

ఆ తరువాత ఋషభుడు లింగ శరీరం నుండి విముక్తుడై, మనస్సులో దేహాభిమానాన్ని విసర్జించాడు. ఇలా వుండగా ఆయనున్న అడవిలో దావాగ్ని రగిలి, అడవి తగులబడి, అందులో ఋషభుడి శరీరం కూదా దగ్దమైంది. ఋషభుడు సకల వేదాలకు, లోకాలకు, దేవతలకు, బ్రాహ్మణులకు, గోవులకు పరమగురుడు. సాక్షాత్తు భగవానుడు. అలాంటి ఋషభదేవుడి చరిత్రే హరిభక్తికి తాత్పర్యం. సాక్షాత్తు విష్ణువైన ఋషభుడు తన శరీరాన్ని వదిలి లయమయ్యాడు. అలా ముగిసింది ఋషభదేవుడి అవతారం.

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

No comments:

Post a Comment