Tuesday, August 18, 2020

యజ్ఞవరాహవతారం, దితి-కశ్యపుల వృత్తాంతం .... శ్రీ మహాభాగవత కథ-9 : వనం జ్వాలా నరసింహారావు

 యజ్ఞవరాహవతారం, దితి-కశ్యపుల వృత్తాంతం  

శ్రీ మహాభాగవత కథ-9

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         బ్రహ్మ కుమారుడైన స్వాయంభవ మనువు ఈ సృష్టికి మొదటి చక్రవర్తి. ఆయన భార్యాసమేతంగా బ్రహ్మకు మొక్కి, జీవరాశుల చావు-పుట్టుకలకు కారణభూతుడైన ఆయన, తన కర్తవ్యం ఏమిటో తెలపమని అడిగాడు. యజ్ఞాలు చేస్తే మాధవుడు ఆనందిస్తాడు కాబట్టి, మనువును యజ్ఞాలు చేయమని చెప్పాడు బ్రహ్మ. అలా చేస్తే ఆయన మనస్సు శుభస్థితిని పొందుతుందనీ, అలాగే ధర్మ మార్గంలో పరిపాలన చేస్తూ సత్పురుషులను రక్షించమనీ చెప్తాడు. అలాగే చేస్తాననీ, కాని తనకు-తన కొడుకులకు నివసించడానికి తగిన స్థలం లేదనీ, మునిగి పోయిన భూమిని పైకెత్తే ఉపాయం ఆలోచించమనీ బ్రహ్మను కోరాడు.

         అనంత జలరాశి మధ్య లీనమై ఉన్న భూమండలాన్ని పైకి తెచ్చే ఉపాయం ఏమిటని, నీళ్లలో మునిగిన ఈ భూమి ఎలా రక్షించబడుతుందని, పురుషోత్తముడిని, పుండరీకలోచనుడిని, లక్ష్మీపతిని తన మనస్సులో ధ్యానించసాగాడు బ్రహ్మ. అప్పుడు, ఆయన ముక్కు రంధ్రాల నుండి యజ్ఞవరాహమూర్తి బొటన వేలంత దేహంతో జన్మించి గగనానికి ఎగిరి, క్షణంలో ఏనుగంత అయ్యాడు. అది చూసి, ప్రజానీకాన్ని సృష్టించడానికి నియుక్తులైన మరీచి మొదలైన మునులు, మనువు, ఆయన కుమారులు ఆశ్చర్యపోయారు. అప్పుడా మాయామయ వరాహమూర్తి దిక్కులు పిక్కలిల్లేట్లు గర్జించగా, బ్రహ్మాండమనే తొర్ర ఛేదించబడింది. ఆ శబ్దాన్ని విన్న మునులు ఋగ్యజుర్సామవేద మంత్రాలతో యజ్ఞవరాహాన్ని వినుతించారు.

పృథ్వీమండలాన్ని రక్షించడానికి ఆవిర్భవించిన ఆ వరాహమూర్తి అనేక రకాలుగా చెలరేగిపోయాడు. ఇలా చెలరేగుతూ, యజ్ఞరూపంలో యజ్ఞవరాహతారాన్ని పూనిన సర్వేశ్వరుడు, రసాతలంలోకి వెళ్లిపోయిన భూమిని పెళ్లగించడానికి సముద్ర జలాలలోకి ప్రవేశించాడు. ఆయన వేగాన్ని సహించలేని సముద్రుడు తనను రక్షించమని ప్రాధేయపడ్డాడు. రసాతలంలో భూమిని చూశాడు. అక్కడ ఆయనకు ఉగ్రరూపంలో ఉన్న ఘోర రాక్షసుడు ఎదురయ్యాడు. ఆ రాక్షసుడు, ధాత్రీ మండలాన్ని వెతుకుతూ వచ్చిన యజ్ఞావరాహాన్ని చూశాడు. చూసి, తన గదను సాచి వరాహమూర్తి మీదకు విసిరాడు. దాన్ని తప్పించుకున్న యజ్ఞవరాహం ఉగ్రమైన తన కోరలతో రాక్షసుడిని సంహరించాడు. భూమండలాన్ని తన కోర చివర ధరించి, ఆ జలరాశిని విడిచి బయటకు వచ్చాడు.

ఆ యజ్ఞవరాహమూర్తిని చూసి బ్రహ్మాదులు స్తుతించారు. అనంతరం ఆ యజ్ఞవరాహమూర్తి మహా సముద్ర జలాలను తన కాలి గిట్టలతో ఆక్రమించి, తిరిగి, ధరాతలాన్ని విశ్రాంతిగా నీళ్లమీద నిలిపి, అంతర్థానమయ్యాడు.

ఈ హరికథ అంతా మైత్రేయుడి ద్వారా విన్న విదురుడు, శుక మహర్షి ద్వారా విన్న పరీక్షిన్మహారాజు, యజ్ఞవరాహ రూపంతో హిరణ్యాక్షుడిని చంపి, ఆ వరాహం తన కోరచివర భూమండలాన్ని ధరించిన విధానం, శ్రీహరికి హిరణ్యాక్షుడితో వైరానికి కల కారణం, వివరంగా చెప్పమని కోరారు. అప్పుడు ఆవిషయాలను వివరంగా తెలియచేశారు వారికి మైత్రేయ, శుకులు.

దక్షప్రజాపతి కూతురైన దితి, ఒక సందర్భంలో, సంతాన కాంక్షతో భర్త కశ్యప ప్రజాపతిని తనకు సంతానం ప్రసాదించమని వేడుకుంది. రుద్ర పూజలో వున్న ఆయన అప్పుడు ఆమె కోరిక తీర్చడానికి సమయం కాదని, కొంచెం సేపు ఆగమనీ చెప్పాడు. ఆ సమయంలో చెయ్యకూడని పని అని భర్త చెప్తున్నా వినకుండా కామంతో ఆయన వస్త్రాన్ని పట్టుకుని లాగింది. భార్య చేసిన బలవంతపు పని కాదనలేక ఈశ్వరుడికి ఒక నమస్కారం చేసి, ఏకాంతంలో తన భార్య కోరిక తీర్చాడు. తీర్చి సనాతమైన బ్రహ్మ గాయత్రిని జపించాడు. చేయకూడని పని చేసినందుకు మనస్సులో సిగ్గుపడ్డ దితి, ఈశ్వరుడు తనను రక్షించుగాక అని నమస్కారం చేసుకుంది. పిల్లలు లేని ఆమె తనకు నాథుడి వల్ల గర్భం కలిగినందుకు పట్టరాని సంతోషంతో ఉంది.

సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న కశ్యపుడు భార్యకు గర్భం వచ్చినందుకు సంతోషపడకుండా, తప్పు పని చేసినందుకు విచారిస్తూ, భార్యతో ఆమెకు పుట్టబోయే కొడుకులను గురించి చెప్పాడు. భద్రుడు, అనుభద్రుడు అనే ఇద్దరు దుష్టులు ఆమెకు పుట్టుతారనీ, వారి దురాగతాలను సహించలేక శ్రీహరి వాళ్లను సంహరిస్తాడనీ చెప్పాడు. అయితే ఆమె మనస్సులో దీనికి బాధపడవద్దని కూడా చెప్పాడు. ఆమెకు పుట్టబోయే కొడుకుల్లో హిరణ్యకశిపుడి వల్ల జన్మించబోయే సంతానంలో ధార్మికుడైన ఒకడు పుడతాడని, అతడు విష్ణు భక్తుడై వంశానికి కీర్తి ప్రతిష్టలు తెస్తాడని అంటాడు. అతడి కీర్తిప్రతిష్టలు ఈ జగత్తంతా వ్యాపిస్తాయి అని కూడా చెప్పాడు. భర్త మాటలు విన్న దితి, తన మనుమడు సజ్జనుల చేత పొగడబడే పరమ భాగవతుడు అవుతాడని పరమానందాన్ని పొందింది.

క్రమేపీ దితి గర్భం దినదిన ప్రవర్ధమానమయింది. నూరు సంవత్సరాలు గర్భాన్ని ధరించింది. ఆమె గర్భం నుండి, పరమ రమణీయాకృతితో ఒక తేజస్సు బయటకు వచ్చింది. అది భూమ్యాకాశాలను సైతం కప్పేసింది. జరగబోయే విపత్తు నుండి రక్షించమని దేవతలు బ్రహ్మదేవుడిని ప్రార్థించారు. అలా ప్రార్థించిన దేవతలకు బ్రహ్మ సనక సనందనాదుల వృత్తాంతం చెప్పాడు.               

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

No comments:

Post a Comment