Monday, August 3, 2020

ఆర్థికంగా ‘ఈడూజోడూ’ ది అదే వరస ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

ఆర్థికంగా ‘ఈడూజోడూ’ ది అదే వరస

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(అక్టోబర్ 29 - నవంబర్ 4, 2000)

          బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు మద్దతుగా వుండే థీమ్ తో సినిమాలొచ్చినా, ఇష్టంలేని వివాహం రద్దయి కోరుకున్న వానితో వివాహం జరిపించటం ఇతివృత్తంగా వుండే ఓ సామాజిక స్పృహతో సినిమా తీసిన ఖ్యాతి తిలక్ కు దక్కింది. ఈడూ జోడూ సినిమా ద్వారా, శరత్ నవల ఆధారంగా, ఉమ్మడి కుటుంబం విడిపోవటం, ఇతివృత్తంగా, ప్రేమికులను స్వార్థంతో విడతీసినవారికి బుద్ధి చెప్పే కథగా రకరకాల మలుపులతో తీసారా చిత్రాన్ని తిలక్, తన నిర్మాణ దర్శకత్వం క్రింద. ఇందులోనూ కొత్త దనాలున్నాయి. భారతీయ సంగీత వాయిద్యాలనుపయోగించకుండా పాటలు రికార్డు చేయిస్తారు. ఓ ‘గురువుల’ పాత్రను క్రియేట్ చేస్తారు. మణిమాల అనే నూతన నటిని పరిచయం చేస్తారు. తిలక్ గారి కదో ప్రత్యేకత.

         నుంగంబాకంలో సుబ్బారావు గారు అనేక వ్యాపారస్తునికి చెందిన ఓ భవంతి వుండేది. తన ఈడూ జోడూ సినిమా చాలావరకు అందులోనే తీయాలని నిశ్చయించుకున్నారు తిలక్. సుబ్బారావుగారు ఆయన కుటుంబ సభ్యులు  అంగీకరించి నోల రోజులపాటు ఇల్లంతా ఆయనకు అప్పగించారు స్నేహధర్మంగా.  భవిష్యత్ లో ఓ పెద్ద లెన్న్సెస్ ఎసైన్ మెంట్ చెక్ చేసే స్థాయికెదిగిన రామ చౌదరిగారిని ప్రప్రథమంగా  కెమెరామెన్ గా ఈ చిత్రం ద్వారా సినీరంగానికి పరిచయం చేసారు తిలక్. అప్పట్లో ఇప్పటిలాగా  హేలోజన్ దీపాలు లేవు. స్టూడియోల్లో బాగా లైటింగ్ ఏర్పాటు చేయాలంటే, గోడలకు సస్పెన్షన్ రాడ్స్ వేసి, స్టూడియో లైట్లనే తెప్పించి వాడాల్సి వచ్చింది.  టు ఇన్ వన్ టేప్ రికార్డు ప్లేయర్ లో రికార్డు చేయించి, తర్వాత డబ్బింగ్ చెప్పించటం చేసే వారు ఆయన.

         ఈడూ జోడూ సినిమా రిలీజ్ చేసేటప్పుడు కూడా ఓ ప్రత్యేక శైలికి ఒరవడి దిద్దారు. స్సెషల్ గా ఓ పుస్తకం వేయించి, నుంగం బాకం భవంతి బొమ్మ దానిపై వేయించి,  ఈడూజోడూ చిత్రం ఈ భవంతిలో జరిగిన కథ అని కాప్షన్ ఇచ్చారు. పుస్తకంలో మొత్తం సినిమా డైలాగులు, పాటలు వుంటాయి. అందరికీ పంచిపెట్టించారు. చివరకు చూసుకుందామంటే ఇప్పుడు ఒక్క కాపీ కూడా ఆయన దగ్గరలేదు. అలా లేకుండా వుండటం ఆదో సరదా తిలక్ గారికి. 

         ఓ పర్యాయం మహా బలిపురంలో ఔట్ డోర్ షూటింగ్ చేస్తున్న సందర్భంలో జపాన్ దేశం నుండి అక్కడకు వచ్చింది ఓ పాంస్కృతిక కళాకారుల బృందం. అప్పుడు చిత్రీకరిస్తున్న ఓ పాట సీన్ ను చూసి మళ్లీ మళ్లీ వినిపించుకున్నారా పాటను. ఆరుద్ర రచించిన ఆ చక్కటి పాటను ఘంటసాల, సుశీల పాడగా జగ్గయ్య, జమునలపై చిత్రీకరించారు. ఆ పాట

         'ఇదేమీలాహిరి ఇదేవుగారడి

         ఎడారిలోన పూలుపూసి ఎంత సందడి

         కోరుకున్న చిన్నా దాని నవ్వు

         కోటి కోటి పరిమళాల పువ్వు

         చిన్ననాటి సన్న జాజి రెండు కన్నులందు

         దాచుకున్న కలిమి

         ఆనాటి కూరిమి చలువలోని

         వేడిమి అనురాగపు మెలిమి

         రామ చిలుకు ప్రేమ మాటపలికె

         రాజహంస లాగనడిచి కులికె

         గోరువంక చిలుక చెంత వారి కొసరి కొసరి

         కన్నె మనసునేలే

         రాబోయ శ్రీమతి మది నికే బహుమతి!

         అది ఆరని హారతి

         సముద్రపు ఒడ్డున చిత్రీకరించిన ఈ పాట ఇతర పాటల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వటంలో కూడా సరిక్రొత్త ప్రయోగం చేసారు తిలక్. రిథమిక్ గా వున్నా ఈ పాటంతా ఇంగ్లీష్ స్టైల్. సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరావు గారికి నచ్చచెప్పి, భారతీయ సాంప్రదాయ వాయిద్య పరికరాలు లేకుండా, ఓ రిథమిక్ గా సాంగ్ రికార్డు చేయాలని సూచించారు. ఆర్కెస్ట్రాలో కూడా వయొలిన్ సౌండు ఓవర్ లాప్ మ్యూజిక్ లో తీసుకురావాలన్న ప్రయత్నం కూడా చేసారు.

         మరో డ్యూయట్ పాట అదీ ఘంటసాల, సుశీల నేపధ్య గానంలోనే చిత్రీకరించారు జగ్గయ్య జమునలపైన. అదీ ఆరుద్ర కలం నుండి వెలువడింది. ఈ పాటలో ఓ క్రొత్తదనం హీరో పాడుతుంటే, హీరోయిన్ గొంతు కలపటం కేవలం ‘హమ్మింగ్’ ద్వారానే. అమెకు పాటలో ఏ చరణం వుండదు. పాదం ఘంటసాలే (జగ్గయ్య) పాడుతారు. సినిమాలో రిపీట్ చేయబడిన యి పాట ఇలా సాగుతుందని పాడి వినిపించారు తిలక్. 


         ‘చిరుగాలి వంటి అరుదైన చిన్నది చెలగాటమాడి కనరాక దాగి కదలాడుతున్నది పూలకన్నా సుకుమారపు మదిలో జ్వాలలు దాచిన కోమలి వేచిన ప్రియునకు విరహపు జాము కానుక ఇచ్చే నెచ్చెలి జాబిలి వేడిన కొలదీ వేదన పెంచే ఆడనైజము వీడనిదీ వియోగ గీతిక వినోదమనుకుని వీనులవిందుగా కోరునది,  ఆశపెట్టి తానంది అందక బాసలు తీర్చని భామిని హలాహాలము అమృతరసము అందించే నవమోహిని’.

         ఈ సినిమాలో చలం నూతన నటి మణిమాల మరో ప్రేమికుల జంట. ఇద్దరూ మేనత్త మేనమామ పిల్లలు. మణిమాల తల్లి సూర్యకాంతం, తన కూతురును డాక్టర్ చదువుతున్న జగ్గయ్యకిచ్చి పెళ్లి చేయాలన్న తాపత్రయం. అందుకు ఎన్నో అడ్డదారులు తొక్కుతుంది. చీటికి మాటికి ‘పరమాత్మ’ అంటూ, తన భర్తను చెప్పు చేతల్లో వుంచుకుంటుంది. చలం తండ్రిగా, మరో ప్రముఖ హాస్యనటుడు రమణారెడ్డి, ఆయన తల్లిగా పువ్వుల లక్ష్మీకాంతమ్మ నటించారు. చలం మణిమాల కాలేజీలో కలిసి చదువుకుంటారు. ఇద్దరూ కాలేజీకి తిరగటానికి సైకిల్ పైనే వెళ్తారు. ఓ సందర్భంలో చలం సైకిలు తీయగానే తనకు లిఫ్ట్ ఇవ్వమని తండ్రి రమణారెడ్డి ఆడిగి కూర్చొంటాడు సైకిలు కడ్డీపైన.  టైర్ లో గాలి తగ్గుతుంది. ఉపాయంగా తండ్రితో పంపుకొట్టించి గాలెక్కిస్తాడు చలం. సైకిలు పంచరవుతుంది. అటువైపుగా వస్తున్న మరదలు మణిమాల సైకిలుపై ఇద్దరూ పోతుంటే దానికి పంచర్ అవుతుంది. వాళ్లు ఇద్దరూ కలిసి సైకిలు ఎక్కగానే ఈడూ జోడు బాగుందని అనుకుంటాడు రమణారెడ్డి.  పంచరైన సైకిలు ప్రక్కనపెట్టి అటువైపుగా వస్తున్న కాలేజీ బస్సులో ఎక్కుతారు ప్రేమికులిద్దరూ. బస్సుకూ పంచర్. ఈ నేపథ్యంలో ఓ చక్కని పాట పెట్టారు ఆ సీన్ లో.

         ‘పంచరు పంచరు పంచరు ఆ పంచరు తలకో మోస్తరు ప్రపంచమందున ప్రతి విషయమూ పంచరంగులు గమనించరు’.

          బస్తీకెళ్లే అబ్బాయి గారు, బలాదూరుగా తిరిగితే-

         పల్లె పట్టున తల్లిదండ్రుల బంగరుకలలే పంచరు.

         ఆడ పిల్లలకు ప్రేమలేఖలు అందించును నవయువకుడు

         పెద్దవాళ్ళకు రిపోర్టు ఇస్తే- ప్రేమా గీమా పంచరు-

          ప్రజలమేలుకై పన్నులు పెంచి- ప్లానులువేయును ప్రభుత్వం

         కంట్రాక్టర్ల కైంకర్యంతో కమ్మనిప్లానులు పంచరు

         ఎన్నికలందున ఎన్నో చెప్పి-నిలిచిన గెలిచినమెంబరు

         రాజధానిలో మోజులు మరిగితే-ప్రజాజీవితం పంచరు

         అడుగు అడుగుగా రిపేరొచ్చినా ఆగదు మానవజీవితం

         ఆశయాలు గల మంచి మనస్సు-అవనే ఆవదు పంచరు.!

         ఆరుద్రరచించిన ఈ పాటను పి శ్రీనివాస్ బృందం నేపద్యగానం ఇచ్చారు. పాటలో సందేశమూ ఇచ్చారు. జరుగుతున్న విషయాలను విడమర్చి చెప్పారు చక్కగా.  ఈ పాట చిత్రీకరణ కొంత భాగాన్ని సన్నిహితుడు శ్రీ కె ఎస్ ప్రకాశరావు గారి దర్శకత్వంలో చేయించారు పనుల భారంవల్ల తిలక్ గారు.

         జమున తల్లి (మాలతి) మణిమాల తల్లి (సూర్య కాంతం) తోటికోడళ్ళు. ఉమ్మడి కుటుంబం. జమున తండ్రి చనిపోతాడు. రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో వేర్వేరు భాగాల్లో వుంటుంటారు. జగ్గయ్య జమునను ప్రేమిస్తుంటే, జగ్గయ్యకు తన కూతురు మణిమాలను ఇచ్చి వివాహం చేయాలని పథకం వేస్తుంటుంది సూర్యకాంతం. ఇంతలో జమున తల్లి జబ్బున పడి చనిపోతుంది. లేని ప్రేమను వలుకపోసి తన ఇంటికి తీసుకువస్తుంది జమునను ఆమె పిన్ని సూర్యకాంతం. ఏదో విధంగా ఎవరికైనా ఇచ్చి జమున వివాహం జరిపించితే లైన్ క్లియర్ అవుతుందని ఆలోచన చేస్తుంది.

         ఈ సినిమాలో గుమ్మడిది విలక్షణమైన జమీందారు పాత్ర. భార్య చనిపోవటంతో అదీ వైద్య సేవలందక చనిపోవటంతో ఆసుపత్రి కట్టించాలని అనుకుంటాడు జగ్గయ్య. డాక్టర్ కావటానికి సహాయపడ్తాడు. ఆయనదో ఉదార పాత్ర ఎప్పుడూ ఒక్కడే చెస్ ఆడుకుంటూ, మద్యం సేవిస్తుంటాడు. త్రాగుడుకు బానిసవుతాడు.

         ‘లక్ష్మీపతి'గా సినిమాలో పిలువబడ్డ ఈపాత్ర నిజానికి సినిమాలో కథా నాయకుని పాత్ర అని చెప్పాలి. జమిందారు లక్ష్మీపతికి జమునను ఇచ్చి వివాహం జరిపించే పథకాన్ని అమలు పర్చటానికి గురువుల పాత్రను సృష్టిస్తారు ఈ సినిమాలో తిలక్. గురువు పాత్రలో కనిపిస్తారు. శ్రీ కె వి శర్మ, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, బృందం కలిసి పాడుతున్న భక్తిగీతంతో మొదలవుతుందా సీన్. మాధవపెద్ది సత్యం బృందం నేపధ్యగానమిచ్చిన ఆ కీర్తన ఇలా సాగుతుంది.

         ‘విష్ణు పాదము మేము విడవముమరి వేరే ఒక్కరి పేరు నుడువము

         వెర్రిగ తీర్థాలు ముట్టము, ఖలుల విత్తము కొంగున గట్టము

         పాప ఢర్ములగడపమెట్టము పతిత పావనుడె మాకు చుట్టము’

         భజన జరుగుతుండే స్థలం లక్ష్మీపతి జమీందారుగారి ఇల్లు. ఆయనో గదిలో కూర్చొని యథా ప్రకారం త్రాగుడు చెస్ ఆటలో నిమగ్నమై వుంటాడు. ఎందుకు లక్ష్మీపతి ముఖంలో కళాకాంతులు లేవని శిష్యులను ప్రశ్నిస్తారు. గురువులుగారు. ప్రత్యేకించి రమణారెడ్డిని అడుగుతారు. తనను లక్ష్మీపతి గదిలోకి తీసుకెళ్లమని చెప్పుతాడు. ఆ విషయం చెప్పటానికి వెళ్లిన పనివాడిని వాసన వస్తుందా? అని నోరు తెరిచి చూపి అడుగుతాడు గుమ్మడి. అప్పుడే అక్కడకు వచ్చిన గురువుగారు ‘అంతర్ రూపం ఆవేదనకు గురిచేస్తే నీవు క్షమార్హుడవు కావు నధర్మం మరిచిపోయి ప్రవర్తిస్తున్నావు’ అని అంటారు గుమ్మడితో. ధర్మార్థ కామమోక్షములు ధర్మపత్ని అవసరం పెళ్లి చేసుకో అని సూచించి, కళ్యాణమస్తు అంటూ దీవించి అందుకు రమణారెడ్డిని పురమాయిస్తాడు. సలక్షణమైన కన్యను తెచ్చి వివాహం చేయటం ద్వారా సంజీవిని తెచ్చి లక్ష్మీపతిని పునర్జీవిని చెయ్యి అని బోధిస్తాడు. దాన్నే ఆదేశంగా భావించిన రమణారెడ్డి సోదరి సూర్యకాంతంతో లాలూచీపడి జమునకు గుమ్మడితో వివాహం జరిపించేటందుకు రంగం తయారు చేస్తాడు. జగ్గయ్య తల్లి హేమలతలు వ్రాసిన పుత్తరాలు చేతులు మారి జమునకు, జగ్గయ్య నుండి దూరం కావాలన్న భావన కలుగుతుంది. అటు జగ్గయ్య జమున ఉదాసీనత పట్ల బాధ పడుతుంటాడు. గుమ్మడితో పెళ్లి తనకిష్టం లేదని చెప్తుంది జమున. సూర్యకాంతం బలవంతం జగ్గయ్యకు దూరం కావాలన్న స్వయం నిర్ణయం, పెళ్లికి అంగీకరింపచేస్తాయి జమునను. పెళ్లి పీటల మీద ‘మాంగల్యం తంతునాని' అని బ్రాహ్మడు చదువుతుంటే, తప్ప త్రాగిన గుమ్మడి మాంగల్యం కట్టులేకపోవటం, లైట్లు ఆపుచేసి చీకట్లో సూర్యకాంతం జమున మెళ్లో తాళి కట్టటం నేపథ్యంలో జరుగుతాయి. ఇవ్వేవి ఎవరికీ తెలియవు. గుమ్మడి పట్టించుకునే పరిస్థితిలో లేడు. తెలిసిన రమణారెడ్డి నోరు విప్పుడు.

         శోభనం నాటి రాత్రి పోనీ పెళ్లయిన తర్వాత మొదటి రాత్రికి కాని గుమ్మడి లక్ష్మీపతికి మత్తు వదలదు. తన గదిలో ఓ పరాయి వుండటం గమనించిన అతను, పరిస్థితిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. తాను బయటపడుకుంటానని అంటాడు. అయితే జమున అతనికి ప్రశాంతత అవసరమని అర్థం చేసుకుని తానే బయటకు వెళ్తుంది. లక్ష్మీపతికి జరిగిన విషయాలు ఒక్కటొక్కటే అవగాహన కాసాగాయి. ఒకరోజు రాత్రి ప్రొద్దు పోయినా మద్యం సేవిస్తున్న లక్ష్మీపతిని భోజనానికి రావల్సిందిగా నచ్చచెప్తూ చేతులో గ్లాసులాక్కుంటుంది. తొందరపడి చేయి చేసుకుని బాధ పడ్తాడు లక్ష్మీపతి. చేతిని తలుపు మధ్య నుంచి గాయపర్చుకుంటాడు పశ్చాతాపంతో. గాయాన్ని కడిగి, తడిగుడ్డకట్టి, తన చేత్తో భోజనం పెట్తుంది శాంతి. ఆ క్షణంలో ఆమెలో తన తల్లిని, కూతురును చూస్తాడు లక్ష్మీపతి పాత్రలోని గుమ్మడి.

         అదే రోజు రాత్రి తన ఆస్తి మొత్తానికి ఆమెను అధికారిగా చేస్తూ తాళం చేతుల గుత్తి అందిస్తాడు గుమ్మడి. తనకు వాటి అవసరం లేదంటుంది.‘ఈడూ జోడూ’ కాని పెళ్లి ఇష్టంకొద్దీ ఇచ్చిన డబ్బుల ప్రస్తావన తెస్తూ ఆమెకు తననుండి ఏం కావాలని, ఎందుకు తనను పెళ్లి చేసుకున్నావని అడుగుతాడు. తనకేమీ వద్దని, త్రాగుడుమాని మంచిగావుంటూ, ఆరోగ్యం కాపాడుకోవటమే అతనినుండి తాను కోరుకుంటున్నానని అంటుంది శాంత. తక్షణమే గ్లాసు పగులగొట్టి, నాటి నుంచి త్రాగుడు మాని మళ్లీ మామూలు లక్ష్మీపతి అవుతాడు.

         జగ్గయ్యకు శాంత (జమున) పెళ్లి విషయం తెలియనీయరు. లక్ష్మీపతి కట్టించిన ఆసుపత్రిలో డాక్టరుగా చేరేటందుకు వస్తూ జమున కొరకు చీర తెస్తాడు. ఆమెకు లక్ష్మీపతి (గుమ్మడి)తో పెళ్లయిందని సూర్యకాంతం ద్వారా తెల్సుకుని ఆమె దగ్గరకెళ్లి దూషిస్తాడు నిందిస్తాడు. ఎందుకలా చేసావని నిలదీస్తాడు. అంతా నీ మంచికోసమే అని చెప్పినా వినకుండా నీచురాలివి పతితవు అని అభాండం వేస్తాడు. కోపంతో, స్మృతి మర్చి మాట్లాడుతున్నావని చెంప పగల కొడ్తుంది జగ్గయ్యను జమున. ఫలితంగా పిచ్చోడయి తిరుగుతుంటాడు.  చివరకు అన్నివిషయాలు బయటపడ్డాయి. జమన జగ్గయ్యలు ప్రేమికులని, పెళ్లి చేసుకోలేకపోయారని తెలుసుకున్నగుమ్మడి, ఓ నిర్ణయానికి వచ్చి, వారిద్దరికీ పెళ్లి చేయాలన్న నిర్ణయానికొస్తాడు. రమణారెడ్డి సహకారంతో చాకచక్యంగా జగ్గయ్యకు మణిమాలకు జరుగుతున్న పెళ్లిలో పెళ్లికొడుకును మార్పించి జగ్గయ్యి స్థానంలో చలంను కూర్చోపెట్తారు లైట్లు ఆపి చలంతో కోరుకున్న మరదలు మెళ్లో పుస్తె కట్టిస్తారు. అదే సమయంలో జగ్గయ్య జమునల వివాహం జరిపిస్తారు మరో చోట. అడ్డు చెప్పి ఎదురు తిరిగిన సూర్యకాంతం నోరు మూయిస్తారు. చీకట్లో ఆమె జమున మెళ్లో తాళి కట్టిన సంగతి బయటపెట్తారు.

         జమునను జగ్గయ్యతో వివాహం జరిపించేటందుకు నిర్ణయించుకున్న తర్వాత ఆమె మెళ్లో తాళీ తీయించే సీన్ వుంటుంది సినిమాలో. గుమ్మడి జమునను బెదిరించి నేను కట్టని తాళి నీ మెళ్లో వుంటానికి వీల్లేదు అంటాడు. ఈ సీన్ చూపిన నాటి సెన్సార్ అధికారి శ్రీ జి పి శాస్త్రి గారు, తిలక్ ను తప్పుచేస్తున్నావని హెచ్చరిస్తాడు. అట్లా తీయకుండా, సెంటిమెంట్లను దెబ్బతీయకుండా, ప్లాష్ బ్యాక్ లో విడాకులు ఇప్పించినట్లు చూపించమంటాడు. ఎట్లాగో ఆ సీన్ ను మానేజ్ చేస్తాడు తిలక్.

         గుమ్మడి జమునలు చాలా కాంపిటీటివ్ గా నటించారీ సినిమాలో. ఈడూ జోడూ సినిమాలోని ఓ డ్యూయెట్ సైంటిఫిక్ స్టైల్ పాట. చలం మణిమాలలు పాడుతారు ఆ పాట.

         ‘సూర్యుని చుట్టూ తిరుగుతుంది భూగోళం ఈ సుందరిచుట్టూ తిరుగుతుంది నా హృదయం తనలో తాను తిరుగుతుంది భూగోళం నీ తలలా తిరుగును ఏమో తెలియని గందరగోళం....’ తెలుగు చలన చిత్ర రంగానికి తన ప్రతి సినిమాలో ఏదో ఒక రకమైన కొత్తదనాన్ని అందించే తిలక్ తీసిన సినిమాలన్నింటి లాగానే ఈడూ జోడు కూడా ఆర్థికంగా విజయం సాధించక పోయినా, అందరి మన్ననలు, ప్రశంసలు పొందింది.

          (మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment