Wednesday, August 12, 2020

అందర్నీ అలరించిన ‘ధర్మవడ్డీ’ ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 అందర్నీ అలరించిన ‘ధర్మవడ్డీ’

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(డిసెంబర్ 31- జనవరి 6/ జనవరి 6-13/2001)

         తన అనుపను చలన చిత్ర బ్యానర్ క్రింద కాకుండా, ఇతరుల రూప చిత్ర కళామందిర్ బ్యానర్ క్రింద నిర్మించిన 'ధర్మవడ్డీ' సినిమాకు కూడా దర్శకత్వం వహించారు శ్రీ తిలక్.  “ అబ్బో, ఓరబ్బో ధనమండి .. దాని అవతారాలే చెబుతాం మీరంతా వినరండి -- అరేరే తళుకు బెళుకుల కులుకులతో గిలిగింతలు పెట్టే ధనమండీ....’ అనే పాట నేపథ్యంలో వినిపిస్తుంటే టైటిల్స్ ను ప్రదర్శించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు సినిమాలో తిలక్. ఆ మోస్తరు అంతకు ముందు లేదని కాదుకాని, ఈయన చూపించిన దానిలో కొంత కొత్తదనం కనిపిస్తుంది-వినిపిస్తుంది. ఆ నేపథ్యగానంలోని ప్రతి పదం వెనుక అర్థం-పరమార్థం కొట్టవచ్చినట్లు తెలుస్తుంది. ఉదాహరణకు 'బంగారానికే ప్రపంచమంతా పట్టాభిషేకం కట్టింది --పదవి మాత్రమే పరమార్థంగా, అవుసరాలనే, జీవితావసరాలనే, వ్యాపారం చేసే దళారీలనే, పెంచారండీ తకిట, తకిటద'  అనేవి చెప్పుకోవాలి టైటిల్స్ పిక్సరైజ్ చేసేటప్పుడు డాల్స్- పప్పెట్స్ కూడా వుపయోగించారు.

         ఈ సందర్భంగా తిలక్ తనకూ స్వర్గీయ త్రిపురనేని గోపీచంద్ గారికీ వున్న స్నేహాన్ని గుర్తుచేసుకున్నారు. డిసెంబర్ 30 వ తేదీన, ఏటేటా యువకళావాహిని వారు ప్రదానం చేస్తున్న గోపీచంద్ పేరిట నెలకొల్పిన ప్రతిష్టాత్మకమైన ఆవార్డును గుర్తు చేసుకున్నారు. గోపీచంద్ గారు వ్రాసిన కథానిక 'ధర్మవడ్డీ'. మరో కథ ‘గోడమీద మూడోవాడు’, ఆధారంగా తీసిన సినిమా' ధర్మవడ్డీ'. టైటిల్స్ లో ఈ ప్రస్తావన కూడా వుంది. 'స్వర్గీయ శ్రీ త్రిపురనేని గోపీచంద్ 70 వ వార్షిక సందర్భంలో ఆయన రచించిన చిన్న కథల్లోని పాత్రలు, సంఘటనలు ఆధారంగా అని ఆయన పేరు వేసినప్పుడు వ్యాఖ్యానం వినపడ్తుంది.

గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణానికి చేరుకున్న ఒక మధ్యతరగతి కుటుంబీకుని కథనే, సినిమాకు అనుగుణంగా అన్వయం చేసుకుంటూ, నిజాంసాగర్ ఆనకట్ట క్రింద భూములను సేద్యం చేసుకోవటానికి కృష్ణా జిల్లా నుండి నిజామాబాద్ జిల్లాకు చేరుకున్న ఓ రైతు పడ్డ బాధలు ఈ చిత్రంలో ప్రధాన సన్నివేశాలు. కృష్ణా జిల్లాలోని భూములను ఎక్కువ ధరకమ్ముకుని, తక్కువ ధరకు నిజామాబాద్ లో ఎక్కువ భూమిని కొనుక్కొని, పంట పొలాల్లోనే క్యాంపుల్లాంటి ఇళ్లను నిర్మించుకున్న కృషీవలుల యధార్థ గాథ ఇది. అలా వలస వచ్చిన వారిని ‘దేశం నుండి వచ్చినోళ్ల'గా పిలిచే ఆనవాయితీ అప్పట్లో నిజామాబాద్ గ్రామాల్లో, ప్రత్యేకించి బాన్సువాడ చుట్టు ప్రక్కల వుండేది. వీరిలో చాలామంది తమ సంపాదనతో చెరకు కర్మాగారాలను, రైస్ మిల్లులను నెలకొల్పి  ధనవంతులైనారు. ఈ విషయాలు సినిమాలో సందర్భోచితంగా కన్పిస్తాయి.

         సినిమా కథా, కృష్ణాజిల్లా నుండి నిజాంబాద్ ప్రాంతానికి రైతుగా వచ్చి, ఇతరుల- స్వార్థ పరశక్తుల-ప్రోద్బలంతో వడ్డీ వ్యాపారిగా మారి, వ్యవసాయం చేయకుండా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చునని భ్రమపడి, మొత్తం మీద  సంపాదించి, చివరకు మోసపోయిన ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. చివరకు తన వడ్డీ వ్యాపారం వల్లనే పైకొచ్చిన ఓ వ్యక్తి కొడుకుతో తన కూతురు విఫల ప్రేమ ఆతన్ని పిచ్చివాడుగా మారుస్తుంది. సూరయ్య పాత్రలో జగ్గయ్య చేసిన నటన బాగుంటుంది.

         టైటిల్స్ ప్రదర్శిస్తూ, నేపధ్య గానం తర్వాత వినవచ్చే కామెంట్రీ చాలా సందర్భోచితంగా వుంటుంది. అర్థవంతంగా కూడా వుంటుంది. అదిలా సాగుతుంది. ‘ఆది కాలంలో మానవుడు అన్ని జంతువులలో ఒక జంతువులాగే జీవిస్తూ వచ్చాడు. ఆహారాన్వేషణలో గుంపులు గుంపులుగా తిరుగుతూ దొరికిన దుంపలు తినేవారు. జంతువులను కూడా వేటాడి తినేవారు. ఆకాలంలో మానవునికి ఆహారమే ధనం. అనేక వేల సంవత్సరాల తర్వాత మానవుడు ఇతర జంతువులు ఏవీ సాధించలేని ఒక విజయాన్ని సాధించాడు. అదే అగ్నిమీద ఆధిపత్యం. ప్రకృతి శక్తులమీద అదే అతని ఘన విజయం. ఉన్న చోట వుండకుండా తిరుగుతు, తిండి వెతుక్కునే మనిషి నదీ తీర ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. వ్యవసాయ నాగరికతలో వస్తువుల ఉత్పత్తి పెరిగింది. ఒకరు తయారు చేసిన వస్తువులను ఒకరు మార్చుకునేవారు. ఈ మార్పిడికి కొలమానంగా తాము మచ్చిక చేసుకున్న జంతువులను వాడుకునే వారు. కొలమానంగా చేసుకున్న జంతుసంపద విపరీతంగా వృద్ధి పొందటం చూసిన మానవుడు - ఆ వృద్ధినే 'వడ్డీ' అన్నాడు. ఆ వడ్డీనే వ్యాపారం చేసాడు..... ఇలా సాగుతుంది. చివరికి మానవుడు రాతియుగం నుండి లోహ యుగానికి ప్రయాణించి ధనానికి, బంగారం పర్యాయ పదంగా మారుస్తాడు. క్రమేపీ పెట్టు బడి దారీ విధానం, దాన్ని నిర్మూలించటానికి అవతరించిన శ్రామిక - కార్మిక శక్తి గురించిన ప్రస్తావన వస్తుంది.


         సినిమాలో గోపీచంద్ గారబ్బాయి  సాయిచంద్ నటిస్తారు. జగ్గయ్య, నూతన్ ప్రసాద్, ప్రభ, కృష్ణవేణిలతో పాటు అతిథి నటులుగా కోకా రాఘవరావు, యం.యన్. రాజంలు కనిపిస్తారు. ఎందరో నూతన నటులను, నటీమణులను చిత్రంలో పరిచయం చేస్తారు తిలక్. మాటలు రాజా శివానంద్ (పాటలు కూడా) డి.వై.గిరి పాటలు వ్రాసారు. శ్రీశ్రీ పర్యవేక్షణలో నిర్మించిన ఈ సినిమా నేపథ్య గాన రచయిత కూడా ఆయనే. పెండ్యాల మ్యూజిక్, శ్రీ పివి రమణయ్య, శ్రీ అడుసుమిల్లి నాగేంద్ర ప్రసాద్ లు నిర్మాతలు.

         ధర్మవడ్డీ సినిమాలో ‘ప్రతిపక్షం’ అనే వాల్ న్యూస్ పేపర్ థీమ్ వుంటుంది. నూతన్ ప్రసాద్, చంద్రయ్య పాత్రలో ఆ పత్రికను ప్రారంభిస్తూ ‘మన గ్రామంలో కూడా ప్రతిపక్షాన్ని స్థాపించుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా వుంది. అసలు ప్రతిపక్షం అనేది లేక పోవటం వల్ల మన గ్రామం నత్తనడక నడుస్తూ స్తబ్తుగా వుంది’ అని అంటంలో అర్థం ఎంతో వుంది. ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ముఖ్యమని కూడా తెలియచెప్పే వుద్దేశ్యం.

         నూతన్ ప్రసాద్ చంద్రయ్య పాత్రలో చెప్పిన ప్రతిడైలాగు వినసొంపుగా, రాజకీయ నాయకులను ఆకర్షించుకునేదిగా వుంటుంది.

         ఉదాహరణకు కొన్ని:

          ‘ప్రజల అదృష్టం బాగుండి నీవు ఈ వూళ్లోండిపోనావుగాని, పొరపాటున ఢిల్లీలో వుంటే దేశాన్ని అమ్మేటి వాడివి. చల్లో చల్లో పోరంబోకు పట్వారి-’

          ‘సోదరుల్లారా-మన దేశంలో ఉన్నన్ని జీవనదులు మరే దేశంలోనూ లేవు. మన దేశంలో ఉన్న ఖనిజ సంపద, పశు సంపద మరే దేశంలోనూ లేవు. కానీ మన దేశంలో ఉన్నన్ని ఆకలి చావులు, ఆత్మహత్యలు మరేదేశంలోనూ లేవు’.

         ‘ఈనాడు ప్రపంచమంత వడ్డీ వ్యాపారంతోనే నడుస్తుంది. ఒక దేశం మరొక దేశానికి అసలు రూపంలో చెప్పులు పంపుతుంటే ఆదేశం తిరిగి వడ్డీ రూపంలో కప్పలు పంపుతుంది..’

         నూతన్ ప్రసాద్ సినిమాలో చెప్పిన డైలాగులు ప్రయివేటుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తన వద్ద మళ్లీ మళ్లీ చెప్పించుకుని ఆనందించే వాడట ఆ రోజుల్లో.

         ధర్మవడ్డీ సినిమా నేషనల్ ప్రీమియర్ షో న్యూఢిల్లీలో అప్పటి డి.ఎం.కె. పార్టీకి చెందిన, నాటి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ శ్రీ గోపాలకృష్ణన్ సమక్షంలో వేసారు. ఆ తర్వాత నాటి లోక్ సభ స్పీకర్ స్వర్గీయ నీలం సంజీవ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చూసారా సినిమాను.

          'ధర్మవడ్డీ' గాళ్లు ఇప్పటికింకా వున్నారని ఏదో రూపంలో వున్న అలాంటివారు అంతరించి పోయేటంతవరకు సమాజం బాగుపడదని తిలక్ అభిప్రాయం.  

(మరిన్ని విశేషాలు మరోసారి)

 

 

No comments:

Post a Comment