Sunday, August 30, 2020

జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ .... శ్రీ మహాభాగవత కథ-21 : వనం జ్వాలా నరసింహారావు

 జగత్ సృష్టి అంతా భగవత్ సృష్టే అని నారదుడికి చెప్పిన బ్రహ్మ

శ్రీ మహాభాగవత కథ-21

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

మహాకవి బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన శ్రీమహాభాగవతం ద్వితీయ-తృతీయ, పంచమ స్కందాలలో ప్రపంచోత్పత్తి గురించి, అంతుచిక్కని సృష్టి రహస్యం గురించి చాలా విపులంగా రాయడం జరిగింది.

శ్రీమన్నారాయణుడు ఒకప్పుడు చతుర్ముఖ  బ్రహ్మకు లోక సృష్టి మీద బుద్ధి కలిగించాలని సంకల్పించాడు. దానికొరకు భగవానుడు సరస్వతిని నియోగించాడు. ఆ వాగ్దేవి తనకు తానుగా బ్రహ్మను హృదయనాధుడిగా వరించింది. వేదరూపిణిగా ఆయన ముఖమండలం నుండి బయటకు వచ్చి, ఆ బ్రహ్మను తిరుగులేని సృజనాక్రియా పారంగతుడిని చేసింది. భగవంతుడు తాను స్వయంగా అంతటా వ్యాపించి ఉన్నవాడే అయినప్పటికీ, పంచభూతాల పరస్పర సంయోగంతో శరీరాలు అనే పురాలను పుట్టించాడు. పంచభూతాలలో పదకొండు ఇంద్రియాల తేజాన్ని ప్రసరింపచేసి వాటి మహాత్మ్యంతో పదహారు కళారూపాలతో వెలుగొందుతాడు.

నారదుడు తన తండ్రి బ్రహ్మను జగత్ సృష్టి గురించి అడిగాడు ఒకసారి. ‘ఈ జగాన్ని ఇలా సృష్టించాలనే తెలివి మొదట నీకు ఎవరు కలిగించారు? ఏ ఆధారంతో లోక సృష్టిని మొదలు పెట్టావు? అలా ఆరంభించడానికి కారణం ఏమిటి? దాని అవసరం ఏమిటి? దాని అసలు స్వరూపం ఎలా ఉంటుంది? ఎడతెరిపి లేని సాలెగూటి లాంటి సృష్టి క్రమాన్ని ఎలా అల్లుకుంటూ వస్తున్నావు? ఈ సృష్టి అంతటికీ నువ్వే అధిపతివి అని అనుకుంటున్నాను. అది నిజమేనా? నువ్వే సర్వాదికారివా? నీకంటే ఘనుడు, నిన్ను మించిన మహానుభావుడు మరెవరైనా ఉన్నారా? నువ్వు ఏ దేవదేవుడిని గురించి తపస్సు చేశావు? నీకు పరమ విభుడు ఎవరైనా ఉన్నారా? ఉంటే, అతడే ఈ బ్రహ్మాండం పుట్టడానికి కారణమా? ఆయన విలాసం వల్లే ఈ విశ్వం వర్ధిల్లుతూ, లయిస్తూ ఉంటుందా? ఈ సృష్టి విధానం ఆసాంతం నాకు వివరించు అని ప్రశ్నించాడు నారదుడు బ్రహ్మను.

జవాబుగా బ్రహ్మ దేవుడు ఇలా అన్నాడు: ‘ఈ చరాచర జగత్తు మొత్తాన్నీ నాకు నేనుగా సృష్టించే తెలివి నాకు ఏమాత్రం లేదు. అందుకే మొదట చాలా తడబడ్డాను. ఈ సమస్తాన్ని సమన్వయ పరచుకుని, సృష్టికి నేను యథేచ్చగా శ్రీకారం చుట్టగల అవగాహనను నాకు ఆ పరమాత్మ ప్రసాదించాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నక్షత్రాలు, గ్రహాలూ, చిన్న చుక్కల్లాగా ఈ లోకం అంతా పరమాత్మ కాంతిని అనుసరించి వెలుగుతుంది. ఈ సృష్టి అంతా భగవత్ సృష్టే. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల పుట్టుకకు కారణం ఆ వాసుదేవుడే! పద్నాలుగు లోకాలు ఆ శ్రీహరి నియమించినవే! సురలంతా ఆ దివ్య స్వరూపుడి శరీరం నుండి పుట్టినవారే! వేదాలు, యుగాలు, తపస్సులు, యోగాలు, విజ్ఞానం ఇవన్నీ నారాయణుడికి చెందినవే! సర్వాంతర్యామి, సర్వాత్ముడు, అన్నిటికీ సాక్షీభూతుడు ఆ పరమేశ్వరుడే! అతడి అనుగ్రహంతో మాత్రమే నేను సృష్టిస్తూ ఉంటాను’.

ఇంకా ఇలా చెప్పాడు బ్రహ్మ: ‘ఆ పరమ దైవం మాయకు పాలకుడు. తన మాయ వల్ల, దైవ స్థానం వల్ల లభించిన కాలం, జీవుడు-అదృష్టం (కర్మ)-స్వభావం అనే మూడు అంశాలతో, వివిధ రకాలుగా సృష్టి చేయాలని సంకల్పించి ఆ పనికి పూనుకున్నాడు. ఆయన ఆశ్రయించిన తత్త్వం “మహత్తు”. దానితో కాలాన్ని, గుణాలనూ మేళవించాడు. స్వభావానికి రూపం ఇచ్చి, దానిని సృష్టిగా మలచాడు. జీవుడి పుణ్య-పాప రూపమైన కర్మ (అదృష్టం) నుండి “జన్మ” ను కలిగించాడు. ఆ మహత్తత్త్వం రజోగుణం, సత్వగుణాలతో విస్తరించి, ఒక రూపం పొందింది. దానివల్ల తమోగుణం ప్రధానంగా కల “అహంకారం” ఏర్పడింది. ఇది పంచ మహాభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలతో కూడుకున్నది. అహంకారం, ద్రవ్యశక్తి కల “తామసం”, క్రియాశక్తి కల “రాజసం”, జ్ఞానశక్తి కల “సాత్త్వికం” అనే మూడు రూపాలుగా మార్పుచెందింది. ఈ మూడిట్లో పంచభూతాల సృష్టికి మూలం “తామస అహం”. దీని వికృతి “ఆకాశం” గా ఏర్పడింది. దీని గుణం “శబ్దం”. ఈ శబ్దం చాలా సూక్ష్మరూపం కలిగి ఉంది’.

బ్రహ్మ కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘ఆకాశం నుండి “వాయువు” ఏర్పడుతుంది. ఆకాశంతో పొందిక వల్ల “శబ్దం”, “స్పర్శ” అనే రెండు గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ప్రాణ రూపంలో ఉంటుంది. ఈ వాయువులో ఇంద్రియాల ఆరోగ్యం, మానసిక శక్తి, దేహపుష్టి ఉంటాయి. ఇవి ఓజస్సు, జీవశక్తి, బలం అనేవాటికి హేతువులై ప్రవర్తిల్లుతాయి. వాయువు నుండి “తేజస్సు” ఏర్పడుతుంది. రూపం, స్పర్శం, శబ్దం అనేవి దాని గుణాలు. తేజస్సు నుండి జలం ఏర్పడుతుంది. రసం, రూపం, స్పర్శం, శబ్దం అనేవి దీని గుణాలు. జాలం నుండి భూమ ఏర్పడుతుంది. గంధం, రసం, రూపం, స్పర్శం, శబ్దం అనే అయుదు దీని గుణాలు. వీటన్నిటికీ తామసాహంకారం మూలం. సాత్త్వికాహంకారం వికారానికి లోనైనప్పుడు “మనస్సు” పుట్టింది. దీని దైవం చంద్రుడు. అహం నుండే దిక్కులు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినీ దేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, మిత్రుడు, ప్రజాపతి అనే పదిమంది దేవతలు పుట్టారు’.

   బ్రహ్మ ఇంకా కొనసాగించాడు. కొనసాగిస్తూ ఇలా అన్నాడు: ‘రాజసాహంకారం తేజస్సుకు సంబంధించినది. దీన్నుండే పది ఇంద్రియాలు ఏర్పడ్డాయి. వీటికి మూలం పదిమంది సాత్త్వికాహంకార దేవతలు. త్వక్కుకు దిక్కు, నాలుకకు సూర్యుడు, ముక్కుకు అశ్వినీ దేవతలు, చేయికి అగ్ని, పాదానికి ఉపేంద్రుడు, గుడానికి మిత్రుడు, మర్మాంగానికి ప్రజాపతి దేవతలు. ప్రజ్ఞను పుట్టించే ఇంద్రియాలలో ఒకటి బుద్ధి. క్రియను పుట్టించే ఇంద్రియం ప్రాణం. ఇలాంటి పది జ్ఞానేంద్రియాలతో కూడిన పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలు అనే వస్తు సంచయం ఉన్న ఇవి విడి-విడిగా వేటికవే ఉండడం వల్ల బ్రహ్మాండపు శరీరాన్ని రూపొందించగల సామర్థ్యం లేకుండా పోయాయి. పంచభూతాల, పంచేంద్రియాల, మనస్సుల గుణాలతో, ప్రాకృతిక శక్తి ప్రేరేపణలతో, అన్నీ ఏకీకృతమైనాయి. ఇవి అన్నీ కలిసి చేతన-అచేతన రూప బ్రహ్మాండాన్ని సృజించేవి అయ్యాయి. అలా ఏర్పడ్డ బ్రహ్మాండం కోట్లాది సంవత్సరాలు నీళ్లలోనే ఉండిపోయింది. ఆ పరమాత్మ జీవం లేనిదాన్ని జీవవంతం చేశాడు. ఆ దివ్యాత్ముడు జీవరూపంలో చక్కగా చుట్టూ చుట్టుకుని ఉన్న నీళ్లలో పడివున్న బ్రహ్మాండంలో జొరబడి వాటిని బాగా విస్తరింప చేశాడు. ఆ తరువాత అందాన్ని బద్దలు చేసి బయటపడ్డాడు.

నారదుడి ప్రశ్నకు జవాబు కొనసాగిస్తూ బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు. ‘ఆ పరమేశ్వరుడు, ఈశుడు జగదాకారుడు. అనంతమైన బ్రహ్మాండాన్ని విపులమైన పద్నాలుగు లోకాలు (భువనాలు) గా చేశాడు. బహురూపాలు దాల్చిన ఆ పరమయోగి ఎన్నో పాదాలు, తొడలు, భుజాలు, ముఖాలు, నేత్రాలు, శిరస్సులు, నోసళ్ళు, చెవులతో కూడి ఉంటాడు. ఆయన సృష్టించిన భువనాలలో మీద ఉన్న ఏడు లోకాలు నడుము నుండి పైన ఉన్న శరీర భాగం. దిగువనుండి ఏడు భువనాలు విష్ణువుకు దిగువనున్న శరీర భాగం. ప్రపంచమే పరమాత్ముడి దేహం. ఆ పురుషుడి నోటి నుండి బ్రహ్మణకులం, చేతులనుండి క్షత్రియ కులం, తొడల నుండి వైశ్యకులం, పాదాల నుండి శూద్రకులం పుట్టాయని చెప్తుంటారు. ఆయన మొలచుట్టూ ప్రదేశం “భూలోకం”. హృదయం “సువర్లోకం”. ఎదురు రొమ్ము భాగం “మహర్లోకం”. మెడ మూలం “జనలోకం”, రెండు స్తనాలు “తపోలోకం”, శిరో భాగం బ్రహ్మ నివసించే “సత్యలోకం”, కటి భాగం “అతలం”, తొడలు “వితలం”, మోకాళ్లు “సుతలం”, పిక్కలు “తలాతలం”, చీల మండలం “మహాతలం”, కాలి ముని వేళ్లు “రసాతలం”, అరికాళ్లు “పాతాళం”. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు ఉర్ధ్వలోకాలలో వ్యాపించి ఉన్నాడు. అమరులు, అసురులు, మునులతో సహా నీళ్లలో, ఆకాశంలో, తిరిగే ప్రాణులు అంతా విష్ణుమయమే. బ్రహ్మాండం అంతా అతడి శరీరంలో 12 అంగుళాల ప్రమాణంలో పొందుపడి ఉంటుంది. అంతా ఆయనే.

బ్రహ్మ ఇంకా ఇలా చెప్పాడు: ‘అచ్యుతుడు, బ్రహ్మాండం లోపల ఉంటూనే లోపలా, బయటా వెలుగులు నింపుతాడు. అలాంటి లోకాత్ముడి బొద్దు నుండి ఒక తామర పూవు పుట్టింది. దాని నుండి నేను (బ్రహ్మ) పుట్టాను. ఆ పరమాత్మ ఈ లోకాన్ని నిర్మించడం కొరకు ఒక మాయను సృష్టించాడు. ఆ మాయ వల్లే అతడు భగవంతుడయ్యాడు. ఆ విష్ణువు జగత్తే ఆత్మ కలవాడు. ప్రపంచానికి ఈశుడు. అతడు నియమించడాన్ని బట్టి నేను స్థావర జంగమాత్మకమైన ప్రాణులతో ఈ సృష్టి క్రమాన్ని విస్తరిస్తాను. విష్ణువు సుస్థితిని కలిగించి రక్షిస్తుంటాడు. శివుడు గిట్టింప చేస్తాడు. విష్ణువు సృష్టి, స్థితి, లయలనే మూడు శక్తులు కలిగి ఈ సమస్తానికీ తానె మూల భూతమై ఉన్నాడు. శ్రీమహావిష్ణువు అంతరంగాన్ని అనుసరించి ఈ ప్రపంచాన్ని, జీవులను సృష్టించడమే నా విధి. ఈ సమస్త ప్రపంచానికి ఆధారభూతమైనది కేవలం పరమమైన బ్రహ్మమే!’.

బ్రహ్మ ముగింపుగా మరికొన్ని విషయాలను చెప్పాడు నారదుడికి ఇలా: ‘ఆదిపురుషుడి తోలి అవతారం నుండి కాలం, కర్మం, స్వభావం అనే మూడు శక్తులు పుట్టాయి. వీటిల్లో నుండి ప్రక్రుతి ఏర్పాటైంది. దాన్నుండి మహత్తు అనే తత్త్వం కలిగింది. దాన్నుండి పుట్టిన రాజసాహంకారం నుండి ఇంద్రియాలు, సాత్త్వికాహంకారం నుండి అధిష్టాన దేవతలు, తామసాహంకారం నుండి పంచభూతాలకు కారణమైన శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం జనించాయి. వీటి నుండి ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనే పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. వీటి నుండి జ్ఞానేంద్రియాలైన చర్మం, నేత్రం, చెవి, నాలుక, ముక్కు; కర్మేంద్రియాలైన మాట, చెయ్యి, కాలు, మలావయవం, మూత్రావయం, మనస్సు ఉదయించాయి. వీటన్నిటి నుండి ఆ విరాట్పురుషుడు జన్మించాడు తనకు తానే. అతడి నుండి ఈ లోకం పుట్టింది. దాంట్లో నుండి సత్త్వరజస్తమోగుణాత్మక రూపాలలో విష్ణువు, నేను, శివుడు పుట్టాం. అందులో నుండి సమస్త లోకం, అందులో జీవించే వారు పుట్టారు. ఇలాంటి విశ్వం మొదటి పుట్టుకను “మహాత్తత్త్వ సృష్టి” అంటారు. రెండోది అండంతో కలిగిన సృష్టి. మూడోది సమస్త ప్రాణులకు చెందిన సృష్టి. అలా, ఆ పద్మాక్షుడి లీలావతారాలు అనంతం.       

(బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

    

 

No comments:

Post a Comment