Monday, August 10, 2020

మేధో పాలనాదక్షుడు : వనం జ్వాలా నరసింహారావు

 మేధో పాలనాదక్షుడు

వనం జ్వాలా నరసింహారావు

ఆంధ్రజ్యోతి దినపత్రిక (11-08-2020)

(హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా భాస్కర్ పనిచేస్తున్నప్పుడు ఆయన పంపిన ఒక ఆర్థిక సంబంధమైన ప్రతిపాదనను అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యదర్శిగా ఉన్న దువ్వూరి సుబ్బారావు అంగీకరించలేదు. దీంతో భాస్కర్ వ్యక్తిగతంగా సుబ్బారావును కలిసి దాని అవసరాన్ని వివరంగా చెప్పి, ఆ ప్రతిపాదనను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని సుమారు రెండు గంటలకు పైగా వాదించారు. చివరకు తనకు  ఆ ప్రతిపాదనను ఆమోదించక తప్పలేదని సుబ్బారావు గుర్తు చేసుకున్నారు-సంపాదకుడు)

‘ఒకఐఏఎస్ అధికారికి, ఒక ఆదర్శ పౌర సేవకుడికి అవసరమైన అన్ని సద్గుణాలను కలిగి ఉన్న అరుదైన వ్యక్తి’ అని దువ్వూరి సుబ్బారావు (రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్) ప్రస్తుతించిన ఆదర్శ పాలకుడు (ఈ నెల 4న కీర్తిశేషుడైన) వెంకటరమణి భాస్కర్. ప్రముఖ జర్నల్స్లో పన్నులు, పబ్లిక్ ఫైనాన్స్, గవర్నెన్స్, ఎనర్జీ రెగ్యులేషన్స్, పాలసీ మేకింగ్ తదితర అంశాలపై ఆలోచనలను రేకెత్తించే వ్యాసాలు రాసిన విద్యాధికుడు, స్వతంత్ర పబ్లిక్ పాలసీల రూపశిల్పి, రాజనీతి శాస్త్ర సంబంధిత అంశాల విశ్లేషకుడు, 1981 బ్యాచ్ ఐఎఎస్ అధికారి వెంకటరమణి భాస్కర్. హైదరాబాద్ పరిసరాలలో ఉన్న బీహెచ్ఇఎల్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో నేను లైబ్రేరియన్‌గా పనిచేసిన రోజుల నుండి, ఇంచుమించు 45ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు, సన్నిహితుడు. డూన్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిగా పాఠశాల చదువు పూర్తి చేసిన భాస్కర్ మంచి చెస్ ఆటగాడు.

భాస్కర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం (జాన్ ఎఫ్ కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్) నుండి మాస్టర్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి మాస్టర్స్ ఇన్ సైన్స్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందారు. విధాన రూపకల్పన, అమలు, ఆర్థిక విశ్లేషణ, విద్యుత్ రంగ సమస్యలలో విస్తృతమైన అనుభవంతో పాటు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ అమరికలలో ఆయనకు అపారమైన అనుభవం ఉంది. పదమూడవ ఆర్థిక సంఘంలో కీలక పాత్ర పోషించారు. అతని దృష్టి ఎప్పుడూ ఆర్థిక సమాఖ్య, కేంద్ర-రాష్ట్ర ఆర్థిక సంబంధాలు, వస్తువులు, సేవా పన్ను, విద్యుత్ రంగం సమస్యలు, నియంత్రణ సవాళ్లు, విపత్తు నిర్వహణ, వృద్ధి సంబంధిత సమస్యలపైనే కేంద్రీకృతమై ఉండేది.


భాస్కర్ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ గా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫైనాన్స్ గా, జాయింట్ సెక్రటరీ 13వ ఫైనాన్స్ కమిషన్ గా, ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అడ్వైజర్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీగా, మెట్రో వాటర్ ఎండీగా, వైజాగ్, అనంతపూర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో భాస్కర్ సీనియర్ సహోద్యోగిగా ఉన్న దువ్వూరి సుబ్బారావు ఆయనతో తన అనుబంధాన్ని నెమరేసుకుంటూ, ‘ఫాంటసీ చేయడం అనేది ఒక సాధారణ మానవ బలహీనత. నా ఫాంటసీలలో ఇది ఒకటి. ఒకవేళ ప్రధాని లేదా సీఎం నాకు ప్రత్యేక పనిని ఏదైనా అప్పగిస్తే, నన్ను నా బృందాన్ని ఎంపిక చేసుకోమని చెప్తే, మిగతా సభ్యుల విషయంలో మార్పులు-చేర్పులు ఉన్నప్పటికీ, ఒక్క భాస్కర్ మాత్రం శాశ్వతంగా, నిరంతరం నా జాబితాలో ఉంటాడు’ అని అన్నారు.

భాస్కర్ ఒక తెలివైన, సమర్థుడైన వ్యక్తి. పరిణతి చెందిన అధికారి. కనుకనే ఒక ముఖ్యమంత్రి లేదా ఒక ప్రధాన కార్యదర్శి ఎలాంటి సవాలు విసిరే పనిని నెరవేర్చవలసి వచ్చినా, ముందుగా భాస్కర్ ను ఎంపిక చేసుకుంటారనీ సుబ్బారావు అన్నారు. భాస్కర్‌ను తమ జట్లలో చేర్చుకోవటానికి మంత్రులు, సీనియర్ అధికారులు పోటీ పడ్డారంటే ఆశ్చర్యం లేదు. భాస్కర్ తో తన సొంత అనుభవం నుండి గుర్తుచేసుకున్న సుబ్బారావు ఇలా అన్నారు: ‘ఐఎఎస్ ఒక సాధారణ సేవ అని, అధికారులు ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి మారినప్పుడు డొమైన్ పరిజ్ఞానాన్ని సంపాదించడానికి కష్టపడుతుంటారు. అయితే భాస్కర్ ఈ విషయంలో ఒక మినహాయింపు. ఎక్కడ పోస్ట్ చేసినా భాస్కర్ తన దక్షతను నిరూపించుకున్నాడు’.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థలో పని చేస్తుప్పుడు భాస్కర్ అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక వ్యవస్థ పరిణామాలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. ఫైనాన్స్ కమిషన్‌లో సంయుక్త కార్యదర్శిగా ఆర్థిక ప్రొఫెషనలిజం సూక్ష్మ నైపుణ్యాలను ఒక ప్రొఫెషనల్ ఎకనామిస్ట్ కంటే ఎక్కువగా, బాగా అర్థం చేసుకున్నాడు. వాణిజ్య పన్నుల కమిషనర్‌గా, అతను పరోక్ష పన్ను వ్యవస్థను బాగా నేర్చుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అమోఘమైన సేవలను అందించారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే రాజకీయాలపై ఆయనకు చాలా పరిణతి చెందిన అవగాహన ఉండేది అని సుబ్బారావు అభిప్రాయ పడ్డారు.

హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా భాస్కర్ పనిచేస్తున్నప్పుడు ఆయన పంపిన ఒక ఆర్థిక సంబంధమైన ప్రతిపాదనను అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక కార్యదర్శిగాఉన్న సుబ్బారావు అంగీకరించలేదు. దీంతో భాస్కర్ వ్యక్తిగతంగా సుబ్బారావును కలిసి దాని అవసరాన్ని వివరంగా చెప్పి, ఆ ప్రతిపాదనను తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని సుమారు రెండు గంటలకు పైగా వాదించారు. చివరకు తనకు ఆ ప్రతిపాదనను ఆమోదించక తప్పలేదని సుబ్బారావు గుర్తు చేసుకున్నారు. అదీ భాస్కర్ పట్టుదల, నిబద్ధత, క్రమశిక్షణ. వర్తమాన ఐఏఎస్ అధికారులకు, భావి తరం యువ అధికారులకు వెంకటరమణి భాస్కర్ ఒక రోల్ మోడల్.

No comments:

Post a Comment