Saturday, August 8, 2020

కోన ప్రభాకర్ రావు గారి చివరి సినిమా ..... స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

 

కోన ప్రభాకర్ రావు గారి చివరి సినిమా

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(నవంబర్ 26 – డిసెంబర్ 3, 2000)

         చేయని తప్పుకు, తనకు శిక్ష విధించారన్న బాధతో ఇల్లొదిలి వెళ్తాడు రవి (జగ్గయ్య) నిజానికాతప్పు చేసింది అన్న మధు. ఇల్లొదిలి వెళ్లిన తమ్ముడు కోపం చల్లారిన తర్వాత తనే తిరిగి వస్తాడని తండ్రిని ఊరడిస్తాడు మధు. ఆ నేపథ్యంలో ఓ పాటుంటుంది. ఎంతో సందర్భోచితంగా ఉన్న ఆ పాట.

         ఏటిలోని కెరటాలు లావు - ఏరు విడచిపోవు.

         ఎదలోపలి మమకారం ఎక్కడికి పోదు

         ఊరు విడిచి, వాడునిడిచి ఎంతదూరమేగినా

         సొంతవూరు, జనవారు-అంతరాన వుండురోయ్

         తెంచుకున్న కొలది పెరుగు - తీయని అనుబంధము

         గాయపడిన హృదయాలను - జ్ఞాపకాలె బతుకునోయ్

         కనులనీరు చిందవే - మనసు తేలి కానుకే

         తనకూ, తనవారికి ఎడబాటేలేదులే......

         పినిశెట్టి సలహా మీద ఉయ్యాల జంపాల సినిమా షూటింగ్ కొరకు నర్సాపూర్ పరిసర ప్రాంతాలను ఎంపిక చేసుకున్నతిలక్ అక్కడి వారితో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారు. ఓలేటి వారు అనే ఓ నాయుడుగారి కుటుంబంతో బాగా పరిచయం పెరిగింది. వారి సోదరులంతా ఎంతో సహకరించారు. వాళ్ల ఇంట్లోనే మకాం పెట్టారు. ఆ రోజుల్లో చేగొండి హరిరామ జోగయ్య (మాజీ  మంత్రి) ఇంకా జిల్లా రాజకీయాలకే పరిమితం. ఆయనా సన్నిహితుడైనారు. ఓలేటి  నాయుడుగారి కుటుంబం మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శి శ్రీ ఐ జి నాయుడిగారికి బంధువులు కూడా.

         అప్పట్లో ఉయ్యాల జంపాల సినిమా తీస్తున్న రోజుల్లో తిలక్ ఆర్థిక పరిస్థితి డోలాయమానంగా వుంది. ఆ స్థితుల్లో ఆయనకు అండగా ఉన్న వారిలో నవభారత్  సంస్థ అధినేత సర్వారాయుడు చౌదరి గారు, కె ఎ రంగారావు గారు ముఖ్యులు. తిలక్ యూనిట్ మొత్తానికి సినిమా షూటింగ్ అయ్యే వరకు సౌకర్యాలు కల్పించటమే కాకుండా కార్లు ఇతర వాహన సౌకర్యాలు కల్పించారు సర్వారాయుడు గారు. కృతజ్ఞతాపూర్వకంగా సినిమా టైటిల్స్ లో ఆయన పేరు వేసినందుకు ఆయన కొంత నొచ్చుకున్నారు. కారణం, ఇతర నవభారత్ భాగస్వాములు తనను తప్పుపట్టే ప్రమాదముండవచ్చునన్న సందేహమే.

         ఔట్ డోర్ షూటింగ్ మొత్తం బ్యాక్ డ్రాప్ గా, నర్సాపూర్ దగ్గర్లో గోదావరి నది ప్రాంతంలోనే చేసారు. అప్పట్లో నర్సాపూర్‌లో ఓడలు తయారు చేసే కార్మికులుండేవారు. ఉయ్యాల జంపాల మ్యూజికల్ గా సాంగ్స్ అన్నీ కంపోజ్ చేసుకున్న తర్వాతనే, సిచ్యువేషన్స్ కు తగ్గట్టుగా స్క్రిప్ట్ తయారు చేసుకుంటూ పోయారు. చాలా చాలా మంచి పాటలు, చాలా వరకు ఆరుద్ర వ్రాసినవే వున్నాయిందులో.

         ప్రభాకరరెడ్డి ఇందులో ‘విగ్’ లేకుండా నేచురల్ గా  కనిపిస్తారు. అప్పటికే సినీరంగాన్ని వదలి,  ప్రాక్టీస్, పాలిటిక్స్ లో  నిమగ్నమై శ్రీ కోన ప్రభాకరరావుతో  మళ్లీ వేషం వేయిస్తారు తిలక్ ఇందులో.

         షూటింగ్ చేసేముందరే కోనసీమంతా, రాజోలు ప్రాంతంతో సహా, కలియ తిరిగారు తిలక్. అలా తిరిగిన గ్రామాల్లో  నర్సాపూర్ సమీపంలోని లక్ష్మీపురం గ్రామం కూడా వుంది. మొదట్నించి ప్రజల్తో మెలగాలి, వాళ్లను కలుపుకొని పోవాలి, వాళ్లను ఇన్వాల్వ్ చేసే సినిమా తీయాలన్న ధ్యాసున్న తిలక్ లక్ష్మీపురంలో సహజ వాతావరణంలో  అక్కడ గ్రామీణ స్త్రీలతో ఓ సీన్ ను చిత్రీకరించారు. సాధారణంగా రాజుల ఇళ్లల్లో గృహిణులు ఇల్లొదిలి బయటకు రారు. ఓ పద్ధతి ఘోషా, అట్లతద్ది రోజున వాయినాలు ఇచ్చే సీన్ పెడ్తారు సినిమాలో. ‘ఇస్తినమ్మావాయినం’-‘పుచ్చుకుంటినమ్మావాయినం’, అనే డైలాగులను రాజుల కుటుంబాలకు చెందిన గృహుణులతో చెప్పించారు. ఆ సీన్ లోనే ఓ  చక్కటి పాట కూడా వుంది.

         రుక్మిణమ్మ, రుక్మిణమ్మ

         కృష్ణమూర్తితో నువ్వు కులకావమ్మా......

         కన్నెపిల్ల మనసు, మీ అన్నకేమి తెలుసు

         శిశుపాలుడికన్న, ఆ కృష్ణుడు మిన్న

         రమణి ప్రేమ సొంపు, నువురాయబారమంపు

         చిలుకచేత కబురు పంప

         చెలుడు రాకపోడమ్మా, బాలకృష్ణుడు....

         కోరుకున్న మొగుడి కొరకు పో, బాలమ్మా

         గౌరీపూజ చేసి, ఆగర్బ గుడిలో లేచి

         ఎదురు చూడవమ్మా, నీ బెదురు మానవమ్మా

         రుక్మిణమ్మా .... ఎంత మంచినోము నోచావమ్మా

         అట్లతద్దేరోజు ఆడపిల్లల మోజు - బాలరుక్కమ్మ..

         పాట చివరిలో వుయ్యాలలూగే సన్నివేశం వుంటుంది. 

         ఉయ్యూలా, జంపాలా... అంటూ పాడుకుంటూ వున్నసందర్భంలోనే కథ మరో మలుపు తిరిగే సందర్భం ఉంటుంది.


         అంతకు ముందే టైటిల్ సాంగున్న మరో చక్కటి సీన్ వుంటుంది. కథానాయకుడు, భావుకుడు, కవి. ఓ కుర్చీలో కూర్చొని, పాట రాసుకుంటూ, పాడుకుంటుండగా, కథానాయిక ఓ మర్రిచెట్టు తొర్రలోంచి వుత్తరాన్ని తీసుకుని, చదువుకుంటూ, అదే పాటను పాడుతుంటుంది. ‘ఝూలా’ హిందీ సినిమా ఇన్స్పిరేషన్ తో తీసినప్పటికీ, ఉయ్యాల జంపాల తెలుగు సినిమాలో మాత్రం మక్కీకిమక్కీ కాపీ కొట్టలేదు. సన్నివేశాలను. అయితే ఒకటి, రెండు, సందర్భోచితంగా వుంచారు. అందులో ఒకటి ‘పోస్ట్రన్నర్ ' కారెక్టర్. హిందిలో ఆశోక్ కుమార్ చేసిన పాత్రను, తెలుగులో చదలవాడ కుటుంబరావు (సుబ్బయ్య) పోషిస్తారు. మర్రి చెట్టు తొర్రలో వుత్తరాలు వేయాల్సిన సీన్ ను కూడా హింది నుండి అనుకరించారు. జగ్గయ్య (రవి) ఇల్లొదిలిన తర్వాత, శశి(కృష్ణకుమారి) వూరికొచ్చి, ఓ టీచర్ గా (గోపి పేరుతో) ఆమెకు పరిచయమయ్యి, ఆమె తన ఫోటో తీసిన, ఆమె వూహల్లోనే రవికి వుత్తరాలు పంపేటందుకు, మర్రిచెట్టు తొర్రనుపయోగించుకుంటుంది. రవి-గోపి ఒకరేనని తెలుసుకోవటానికి కొంత టైము పట్తుంది. తనకు అవసరమైన చెట్టు తొర్ర కొరకు, తిలక్ గారు తిరిగి - తిరిగి, ఓ మొండి చెట్టును కనుక్కొని దాన్ని నరికించి, ట్రాక్టర్ పైన లొకేషన్ కు తెప్పించి, తొర్ర చేయించి మరీ వుపయోగించారు. కార్యదక్షత తిలక్ ప్రత్యేకత.  ఈ నేపథ్యంలోని ఆ చక్కటి పాట:

         నీలోన ఊగే, నాలోన వూగే

         చూడచక్కటి, ఊయలొక్కటి

         ఉయ్యాలా ... జంపాలా ...

         ఊగి, ఊగి, పైకిపోయె, ఊహలెన్నియో

         ఆగి ఆగి, భువికి దిగెను అందమెంతయో

         మింటి చందమామకు-కొంటె కలువభామకు

         ముడివేసి, జతగూర్చె, తూగుటుయ్యాల..ఆ ..

         మనసులోని భావాలకు రూపుకలిగెను

         కనులలోని కోరికలకు కాంతి పెరిగెను

         బిడియ పడె మనసుకు-వెలుగుతున్న కనులకు

         తొలిప్రేమ తెలిపింది- తూగుటుయ్యాల ... ఉయ్యాలో

         నర్సాపూర్ చదువుకుంటున్న ఓ స్కూల్ విద్యార్థికి అప్పట్లో ఓ చిన్న మెమెంటో ఇచ్చారు తిలక్. షూటింగ్ సందర్భంలో నిర్వహించిన ఓ కాంపిటేషన్లను పురస్కరించుకుని ఆ విద్యార్థి, ఎన్టీ రామారావు దగ్గర పౌరసంబంధాల అధికారిగా పనిచేసిన శ్రీ గోటేటి రామచంద్ర రావుగారి సోదరుడని, ఆ తర్వాత వీరిద్దరికీ పరిచయమైన తర్వాత తెలిసింది.

         నర్సాపూర్లో ఆ రోజుల్లో ఓ చిన్న వ్యవసాయ క్షేత్రం వుండేది. వాళ్లు తిలక్ గారిని ఆహ్వానించారు ఓ సందర్భంలో. సహకారరంగంలో వ్యవసాయం చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆయనకు. దరిమిలా, అక్కడి వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వారందరితో పరిచయం చేసుకుని సన్నిహితం అయ్యారు తన సహజ ధోరణిలో తిలక్.

(మరిన్ని విశేషాలు మరోసారి)

 

No comments:

Post a Comment