Tuesday, August 25, 2020

భూమి నుండి ఓషధులను పితికిన పృథుచక్రవర్తి .... శ్రీ మహాభాగవత కథ-16 : వనం జ్వాలా నరసింహారావు

 భూమి నుండి ఓషధులను పితికిన పృథుచక్రవర్తి

శ్రీ మహాభాగవత కథ-16

వనం జ్వాలా నరసింహారావు

కంII             చదివెడిది భాగవతమిది,

చదివించును కృష్ణు, డమృతఝరి పోతనయున్

                             చదివినను ముక్తి కలుగును,

చదివెద నిర్విఘ్నరీతి ‘జ్వాలా మతినై

         ధ్రువుడి వంశ పరంపరలో అంగుడనే రాజుకు వేనుడు అనే కొడుకు పుట్టాడు. అంగుడు అధర్మ మార్గంలో సంచరిస్తున్న తన కొడుకు దుశ్శీలాన్ని చూసి రాజ్యాన్ని వదిలి ఒంటరిగా ఎక్కడికో వెళ్లిపోయాడు. అప్పుడు మునీశ్వరులు కోపించి, వేనుడిని చావమని శపించారు. లోకం రాజులేని రాజ్యమైంది. అప్పుడు హరి భక్తులు, మహావీరులు, మునులు మొదలైనవారు ప్రాణాలు కోల్పోయిన వేనుడి కళేబరం వద్దకు వచ్చి,  అతడి ఊరువులను మథించగా, అందులోనుండి ఒక నిషాదుడు జన్మించాడు. దరిమిలా అతడి వంశంలో జన్మించిన వారంతా నిషాదులై అడవులలో, కొండలలో తిరుగుతూ, వేనుడి దుష్కీర్తిని సూచించే ప్రతీకలయ్యాయి. మునులు వేనుడి బాహువులను మథించగా, స్త్రీ-పురుషుల జంట జన్మించింది. మళ్లీ బాహువులను మథించగా నారాయణాంశతో ’తొలిచక్రవర్తి’ గా ప్రసిద్ధికెక్కిన పృథుడు జన్మించాడు. లక్ష్మీదేవి అంశతో అర్చి అనే ఒక దేవతా స్త్రీ జన్మించింది. ఆమె ఆ పృథు చక్రవర్తినే వరించింది. వివాహం చేసుకుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన బ్రహ్మాదిదేవతలు నారాయణాంశ సంభూతుడైన పృథుచక్రవర్తికి శాస్త్రబద్ధంగా రాజ్యాభిషేకం చేశారు.

         పృథుచక్రవర్తి ఆజ్ఞ ఎదురులేనిద్గా లోకాలోక పర్వతం దాకా విస్తరించింది. యావత్ భూమిని తన గుణాలతో లోకాలను రంజింప చేశాడు. ప్రజలను కన్నతండ్రిలాగా ప్రేమిస్తూ రాజ్యాన్ని పాలిస్తున్నాడు. అలా ఉందగా ఒకనాడు, తన రాజమందిరానికి సమీపంలో ఉద్యానవనానికి వెళ్లి, అక్కడ మహనీయుడు సనత్కుమారుడిని చూశాడు. ఆయన్ను భక్తితో పూజించాడు. ఆ మహర్షి దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఆయనతో పాటు అక్కడున్న బ్రహ్మవేత్తలంతా సనత్కుమారుడి ఉపదేశాన్ని పొందారు. పృథుచక్రవర్తి పరాక్రమం గురించి ప్రజలు కథలు-కథలుగా చెప్పుకునేవారు.   

అలా పృథుచక్రవర్తి రాజ్యాన్ని పాలిస్తున్నప్పుడు ఒకనాడు ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లి తాము ఆకలి బాధతో పీడించబడుతున్నాం అని అన్నారు. దయతో తమకు అన్నం పెట్టి రక్షించమని నమస్కరించారు. రాజు వెంటనే, ప్రజల బాధను పరిష్కరించడానికి ధనస్సున బాణాన్ని ఎక్కుపెట్టాడు. పృథుచక్రవర్తిని చూసిన భూమాత, ఆవురూపాన్ని ధరించి, పరుగెత్తింది. ఇది చూసిన పృథుచక్రవర్తి కళ్లు ఎర్రబడ్డాయి. భూమాత ఎక్కడికిపోతే అక్కడికి వెంబడించాడు. అప్పుడామె ఏ దిక్కూ కనబడక చక్రవర్తిని రక్షించమని వేడుకుంది. జీవకోటికి నౌకలాగా ఆధారభూతమైన దృఢమైన శరీరం తనదనీ, అలాంటి తనను చంపితే భూమ్మీద ఉన్న ప్రజలందరినీ నీటిలో మునగకుండా ఎలా రక్షిస్తావనీ చక్రవర్తిని ప్రశ్నించింది.

జవాబుగా పృథుచక్రవర్తి ఇలా అన్నాడు: "ఓ భూదేవీ! నువ్వు నా ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నావు. నువ్వు ధాన్యాన్ని వృద్ధి చేయకుండా ఆవు రూపాన్ని ధరించి గడ్డి మేస్తూ, పాలను పితకకుండా నీలోనే దాచుకుంటున్నావు. నీలో వున్న ఓషధీబీజాలు బ్రహ్మ సృష్టించినవే! వాటిని నీలోనే పెట్టుకుని లోకానికి బహిర్గతం చెయ్యని మూర్ఖురాలివి నువ్వు. దురాత్మురాలివైన నిన్ను నా బాణాలతో సంహరిస్తాను. నీలాంటి దాన్ని చంపడం పాపం కాదు. నీ శరీరంలోని మాంసంతో ప్రజల ఆకలి బాధ తీరుస్తాను. ప్రాణికోటిని ఉద్ధరిస్తాను". అప్పుడు ఆ పృథుచక్రవర్తిని చూసి గోవు రూపంలో వున్న భూదేవి వణకుతూ ఆయన్ను అనేక విధాలుగా కీర్తించసాగిందిలా:

"ఓ కరుణాభరణా! నీకంటే వేరెవ్వరిని శరణు వేడుకుంటాను? నీ మాయామహిమతో ఈ చరాచర సృష్టిని నిర్మించావు. బ్రహ్మను సృష్టించి, ఆయనతో సమస్త లోకాలను సృజింప చేస్తావు. ఈ లోకాల సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడవైన నీకు నమస్కరిస్తున్నాను. నాకు అభయం ప్రసాదించు. నీకోపాన్ని ఉపశమించి, కరుణించి, నా విన్నపాన్ని విను. బ్రహ్మ సృష్టించిన ఓషధులను పాపపత్ములు తినడం చూసి ఎవ్వరూ అడ్డుకోకపోతే బాధపడ్దాను. యజ్ఞానికి సంబంధించిన కర్మకాండలు లేకపోవడంతో నేను అనాదరణకు గురయ్యాను. కాబట్టి, కావాలనే ఆ ఓషధీ సమూహాన్ని మింగాను. అవి నాలో జీర్ణమై పోయాయి. నాకొక దూడను ఇస్తే, నీ ప్రజలకు కావాల్సిన వాటిని అనుగ్రహిస్తాను. మిట్టపల్లాలుగా వున్న నన్ను (భూమిని) సమతలంగా చెయ్యి".

అప్పుడు పృథుచక్రవర్తి స్వాయంభవ మనువును దూడగా చేసి, తన చేతిని పాత్రగా అమర్చి, స్వయంగా తానే సకల ఓషధులను భూమి నుండి పితికాడు. ఋషులంతా ఒకచోట చేరి బృహస్పతిని దూడగా చేసి తమ ఇంద్రియాలు అనే పాత్రలో ఛందోమయమైన క్షీరాన్ని పిండుకున్నారు. దేవతలు ఇంద్రుడిని దూడగా చేసి, అమృతమయమైన క్షీరాన్ని పొందారు. దైత్య-దానవులు ప్రహ్లాదుడిని దూడగా చేసుకుని, ఇనప పాత్రలో పుల్లటి కల్లు రూపంలో పాలను పితికి పొందారు. అప్సరసలు, గంధర్వులు గాంధర్వమనే క్షీరాన్ని పిండుకున్నారు. ఇలా పృథుచక్రవర్తి మొదలుకొని, ఒక్కొక్కరు, తమ-తమ అవసరాలకు అనుగుణంగా తగిన క్షీరాన్ని వేర్వేరు దూడలతో భిన్న-భిన్న పాత్రలలో పిండుకున్నారు. అప్పుడు పృథుచక్రవర్తి సంతోషించి భూమాతను తన కుమార్తెగా స్వీకరించాడు. భూమండలాన్నంతా చదును చేసి శాశ్వత కీర్తి పొందాడు. భూమండలాన్ని బ్రహ్మాండంగా పరిపాలించాడు.

         (బమ్మెర పోతన శ్రీమహాభాగవతం, రామకృష్ణ మఠం ప్రచురణ ఆధారంగా)

 

No comments:

Post a Comment