Saturday, August 1, 2020

తిలక్ సినిమా పై ‘సోమర్ సెట్ మామ్’ ప్రభావం....స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు : వనం జ్వాలా నరసింహారావు

తిలక్ సినిమా పై ‘సోమర్ సెట్ మామ్’ ప్రభావం

బాపు ఆర్ట్ గ్యాలరీలో చోటు చేసుకుంటున్న అనుపమ చిత్రం

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(అక్టోబర్ 8-14, 2000)

         తిలక్ దర్శక-నిర్మాతగా తీసిన 'అత్తా ఒకింటి కోడలే' హస్యరస ప్రధాన చిత్రంగా, ఆ ఏడాది నిర్మించి, రిలీజ్ కాబడిన సాంఘిక చిత్రాలలో కెల్లా అత్యంత మెరుగైనదిగా, అగ్రశ్రేణికి చెందినదిగా పలువురి మన్ననలనందుకొంది. ఇక సినిమా కథ విషయానికొస్తే, రమణారెడ్డి భార్య హేమలత, వారి కొడుకు జగ్గయ్య- భార్య గిరిజ, రమణారెడ్డి తల్లి పువ్వుల లక్ష్మీకాంతమ్మ, ఓ కుటుంబానికి చెందిన ‘అత్తా-కోడలు-అత్తా-కోడలు' టీమ్. మరో కుటుంబంలో అత్తగారిగా సూర్యకాంతం కొడుకు, కోడళ్లుగా, రమణమూర్తి దేవికలు నటించారు. సూర్యకాంతం కూతురుగా గిరిజ, ఆమె భర్తగా జగ్గయ్య నటించారు. కట్నం ఇవ్వలేదన్న మిషలో ఇంటికి రానీయని ఆమె (సూర్యకాంతం) కోడలు దేవికకు తండ్రిగా పెరుమాళ్లు నటించారు. ఇలా అందరూ అద్భుతంగా, సహజంగా, పదహారణాల తెలుగుదనం వుట్టిపడేలా పోషించారు తమతమ పాత్రలను అదే తనకెంతో తృప్తినిచ్చిందని అంటాడు తిలక్.

         మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకోవటమే కాకుండా, కొంతకాలం ఏలూరు పురపాలక సంఘం సభ్యురాలిగా పనిచేసిన శ్రీమతి పువ్వుల లక్ష్మీకాంతం గారిని ఈ సినిమాలో రమణారెడ్డి తల్లిగా ఆసలు సిసలైన అత్తగారి పాత్రలో నటించేందుకు నూతన నటిగా పరిచయం చేశారు.

         అన్ని వేళలవుండు మాకాప్తుడగుచు-అనుపమహితుడకవుగాక ఆత్మశాంతి' అనే నేపధ్య కవితతో ఈ సినిమాను స్వర్గీయ గోగినేని వెంకటేశ్వరరావు (పెద్దబ్బాయి) గారి పవిత్ర స్మృతికి అంకితం చేస్తారు తిలక్.

         సృష్ట్యాదినాటి అత్తాకోడళ్లు-ఆదిదేవతలైన లక్ష్మీ-సరస్వతులు ఎందుకు ఒక్క చోట ఇమడలేరనే ప్రార్థనతో మొదలవుతుంది. సినిమా. శ్రీమహాలక్ష్మి’ కోరిన సిరులనిచ్చు- చదువులిచ్చు జనని సరస్వతియెగాని -ఒకరు మసలెడెచోట వేరొకరు పోరు- అత్తకోడండ్రు వారలైనందువలన' అన్న ఆరుద్ర రచన ఎంతో చక్కగా చెప్పబడుతుంది.

         ప్రార్థనతోనే, రమణారెడ్డి ఇంట్లో కూర్చొని పురాణం చదువుతున్న సీన్ చూపిస్తారు. ‘పూజనీయులట్ల పోట్లాడుతుండ పుడమిస్త్రీల మాట చెప్పనేల-అత్తలేని కోడలు ఉత్తమురాలను మాట సార్థకంబు' అని ఆయన విశదీకరిస్తుండగానే మొదలవుతుంది. అత్తా కోడళ్ల సంవాదం, తల్లి పార్వతమ్మ తన కోడలు (రమణారెడ్డి భార్య) తాయారమ్మ నుద్దేశించి ‘అత్తగారి నంతతేలికగా తీసియకు నువ్వూ అనుభవించే రోజు వస్తుంది' అని అంటే, జవాబుగా ‘నీలాంటి దాన్ని నేనెప్పుడూ కాను కోరుకున్న కోడలు తెచ్చుకుంటాను' అని చెప్పింది తాయారమ్మ. చిలికి చిలికి గాలివానైన ఆ సంవాదంలో ప్రధాన మలుపు పార్వతమ్మ ఇల్లొదిలి దూరపు చుట్టం రంగయ్య పంచన చేరుకోవటం. కాపురానికి రానీయకుండా ఇబ్బందులు పెట్తున్న రంగయ్య కూతురు లక్ష్మీ (దేవిక)ని వుద్దేశించి పార్వతమ్మ, ‘అత్తవెళ్లగొట్టిన కోడలువు నువ్వు-కోడలు వెళ్ళగొట్టిన అత్తను నేను’ అని అంటుంది. లక్ష్మీ అత్తగారు సుందరమ్మను (సూర్యకాంతం) శాపనార్థాలు పెడ్తూ కాలం వెళ్లదీస్తుంటుంది పార్వతమ్మ.

         పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారి భార్య సుందరమ్మ, అహంకారం ఆమె సొత్తు. కొడుకు రమణమూర్తికి ఫిడేలు పిచ్చి, దానికి తోడు మతి మరుపు. కట్నం తేలేదని కాపురానికి రానీయని కోడలుగా దేవిక పాడుకునే ఓ పాట చాలా చక్కగా వుందంటూ, పాడి వినిపించారు తిలక్,  కొన్ని చరణాలను.

         అశోకవనమున సీత-శోకించే వియోగము చేత

         కంటికి మంటికి ఏకధారగా-కారెను వేడి కన్నీరు

         ఆకన్నీరే లంకాపురమున - అయినది పెద్దకోనేరు

         పతినీ తనను విడదీసి-చెరపట్టెను క్రూరరావణుడు

         భరించలేని నరకమది - విడిపించునురాడా రాముడు

         శీలవతీ, ఆ సీతగతి- చూసిన శీలలే ద్రవించెను

         నాధుని కొరకై సాధ్విరోదన నాలుగు దిశలను దహించెను

         రమణారెడ్డి కొడుకుగా నటించిన జగ్గయ్య (రఘురాం) సూర్యకాంతం కూతురు గిరిజ (శోభ) కాలేజీలో సహాధ్యాయులు.  సినిమా ఆరంభంలోనే ఇరువురు పార్టీలు పాడిన పాట అప్పటికీ-ఇప్పటికీ టీనేజ్ వారు పాడుకునే పాపులర్ సాంగ్.

         ‘పైలాపైలా పచ్చీస్-పరువంలోని లేడీస్-మగాళ్ళతోటి సమానమంటూ ఎక్కారండి సైకిల్స్- హీరోలైన జీరోస్-వెంట తిరుగుతూ వెక్కిరించితే చేస్తారండీమాలిష్- నోటికి పవరు జాస్తి-దానికి తాళం నాస్తి- పోట్లాడేందుకు మాటల ఈకలు ఆడవాళ్లకు ఆస్తి-అల్లరి బుద్ధీపోదు-తిన్నని మాటరాదు-మీమగవారి మాటల చేతలు వేపకాయలా చేదు-సమానహక్కులకోసం-హోరాహోరీ పోరాటం-రైలుబండిలో, సినిమాహాల్లో స్థానం మాత్రం ప్రత్యేకం - ఆతయాలకే మీరు-నిలబడతారని పేరు-కట్నం కోసం పట్నం చదువులు చదివే మొనగాళ్ళు’


         ఈ పాటతో వాళ్ల కాలేజీ చదువులు పూర్తయి ప్రక్క ప్రక్కనే వున్నవారి-వారి వూళ్ళకు చేరుకుంటారు. ఇద్దరూ ఒకర్నొకరు ప్రేమించుకుంటున్నారన్న సంగతి వేరే చెప్పనక్కరలేదు. ఓ రోజున రెండూళ్ల మధ్యనున్న శివాలయంలో ఇద్దరాడవాళ్ళు (అత్తా కోడలు) తగవులాడ్తుంటారు. అక్కడే వున్న తాయారమ్మ-శోభ, వారిని విడదీసి కోడల్ని, కూతురులాగా చూసుకోవాలని నచ్చ చెప్పి వెళ్తారు. శోభ గురించి  వాకబుచేయటం, భర్తను ఒప్పించి కొడుకు రఘురాంకు ఆమెను పెళ్లిచేసుకోవాలని నిశ్చయానికి రావడం జరుగుతుంది. రఘురాం తన తల్లికి రెండు కండిషన్లు పెట్టాడు. ఒకటి పెళ్ళికి ముందే బామ్మను (పార్వతమ్మ) ఇంటికి తీసుకురావాలని, రెండోది సూర్యకాంతం తన కోడలు దేవికను కాపురానికి తీసుకురావాలని, అటు శోభ (గిరిజ) కూడా పట్టుపడ్తుంది తన వదినను కాపురానికి తేవాలని, మొత్తం మీద వివాహం జరుగుతుంది. అది మరో మలుపు.

         ఒకే స్త్రీ, తల్లిగా-అత్తగారిగా తేడా చూపించే ఓ సీన్ లో డైలాగులు కూడా బాగుంటాయి. శోభ-రఘుల పెళ్లయిన తర్వాత, తన కూతుర్ను, సరిగ్గా చూసుకోమని ఆమె అత్తగారు తాయారమ్మను కోరుతుంది సుందరమ్మ. ఈపని నువ్వెందుకు చేయటం లేదని ప్రశ్నిస్తుంది అక్కడే ఉన్న పార్వతమ్మ. కూతురు, కోడలు ఒకటేనా అని ప్రశ్నిస్తుంది సుందరమ్మ పాత్రలోని సూర్యకాంతం.

         సినిమాలో-సినిమా కథలో అడుగడుగునా వైవిధ్యం కనబడుంటుంది. ఒకవైపున ఓ కుటుంబంలో కోడల్ని (దేవిక) రాచిరంపాన పెడున్న అత్త (సూర్యకాంతం). గర్భిణి అని కూడ ఆలోచించకుండా ఇంటి చాకిరి చేయిస్తుంది. మరో కుటుంబంలో కోరుకున్న కోడలును తెచ్చుకున్నానన్న గర్వంతో, అతిప్రేమ వలుక పోస్తుంటుంది కోడలు (గిరిజ) పైన అత్త (హేమలత). ఏదో ఆలస్యం జరిగిపోయినట్లు, పిల్లలు కలగాలని కోడలుతో నానారకాలపూజలు, చన్నీళ్ల  తల స్నానాలు, గుళ్లో దండాలు చేయిస్తుంటుంది ఆ అత్త. ఈ స్నానాలతో పూజలతో పెత్తనం చలాయిస్తున్న అత్తపై కోపం పెంచుకుంటుంది కోడలు. చివరకు చెట్టుకొకరు పుట్టకొకరు అవుతారు ఇరు కుటుంబాల్లో.

         ఓ సన్నివేశంలో అత్త సూర్యకాంతం పై ఎదురు తిరిగి తన బిడ్డతో సహా వెళ్లిపోతుంది కోడలు దేవిక.

         అందర్నీ కలిపే ప్రయత్నంలో జగ్గయ్య త్రాగుబోతు అల్లుడుగానూ, రమణారెడ్డి తల్లి దయ్యం పట్టిన మనిషిలాగానూ మారి హాస్యం కురిపిస్తారు. సుందరమ్మ (సూర్యకాంతం) కు త్రాగుబోతులంటే భయం. అమె వెళ్లగొట్టిన కోడలును ఇంటికి తీసుకురావాలని అలా ఆలోచించి ఓ పథకం వేస్తాడు. ఆ సన్నివేశానికి అనువుగా ఘంటసాల గారిలో ఓ పాశ్చాత్య శైలిపాటను పాడిస్తారు తిలక్. ఆరుద్ర వ్రాసిన ఆ పాట ఓ రిథమిక్ స్టైల్ లో ఉంటుంది.

ఆపాట:

         జోడుగుళ్ల పిస్తోలు ఠ నేను ఆడి తప్పనివాణ్ణి యోహో, హద్దుమీరువారు శిక్షించబడుదురూ - బుద్దిమంతులెపుడూ రక్షించబడుతురూ - ఆఫీసరు భార్యననీ ఆహం కూడదూ - అధికారం చెలాయిస్తే ఇంకచెల్లదూ - తొండముదిరితే ఊసరవెళ్లి అత్తా - అహం ముదిరితే హళ్లికి హళ్లీ - కాకిపిల్ల కాకికి కడుముదుద - అది అందుచేత కాకూడదు మొద్దు - ఎవరి గొప్పవాళ్లవద్ద ఆగకున్నచో అత్తా -దేహశుద్ధి కొండకచో జరుగుట కద్దు- నోరు మంచిదైతే నీవూరు మంచిది - పోరునష్టం ఎప్పుడూ పొందు లాభం - ఇది కోర్టుకెక్కితే అంతా అభాసు అత్తా - నీజోరు తగ్గకపోతే కొంపక్లోస్ అత్తా...’

         పాట రికార్డింగ్ జరుగుతున్నప్పుడు మొదలు రిహర్సల్స్ చేసేవారప్పుడు. ఆర్కెస్ట్రా వారు కూడా రిహార్సల్స్ లో విధిగా పాల్గొనేవారప్పుడు. ఇప్పడంటే కొత్త కొత్త టెక్నాలజీలున్నాయి. భరణి కోటేశ్వరావుగారు ఆ పాటకు రికార్డిస్ట్. తిలక్ కు మంచి స్నేహితుడు సన్నిహితుడు. పెండ్యాల సంగీత దర్శకుడు. రికార్డింగ్ ప్రక్రియ ఆరంభమైంది. ఎవరూ గమనించకుండా ఘంటసాలకూ, పెండ్యాలకు తెలియకుండా పూర్తిపాటను రిహార్సల్స్ లోనే రికార్డు చేయించారు తిలక్. తేలియకుండానే టేక్ చేశారు. ఘంటసాలగారు తానూ బాగాపాడాలని, మధ్య మధ్య టేక్,టేక్ కూ మధ్య బయటకువెళ్లి, చుట్టకాల్చుకుని పాడుతాను గురువుగారూ' అని అనేవారు. అలా నాలుగైదు టేకులైనది. ఇంకా చాలునండి, రికార్డు చేయటమైపోయిందండి  అని తిలక్, ఎవరికి తెలియకుండా తాను రికార్డు చేయించిన పాటను వినిపించారు. 'అమ్మబాబాయ్ ఎంత పనిచేసారు' అని అంటూనే ఘంటసాల, బాగుందని ఓకే చేసారు. రికార్డింగ్ అప్పుడు, ఒక్కోసారి సింగర్ కాంషస్ అయ్యి పాటను చెడగొట్టే ప్రమాదముండవచ్చునని అంటారు తిలక్. పాట మూడు చరణాలను మూడు షాట్లలో తీసారు.

         ఆత్తా ఒకింటికోడలే’ సినిమా తీసే రోజుల్లో తిలక్ గుంటూరు జిల్లాలోని సంగం జాగర్లమూడి, తెనాలి ప్రాంతాలకు పోయి చిత్రీకరణ చేస్తుండేవారు. ఈ సినిమా తీసినా జనంతో వుండాలన్న తాపత్రయం వుండేది ఆయనకు సంగం జాగర్లమూడిలో షూటింగ్ జరుపుతున్నప్పుడు ‘శాంబాబు' అనే ఒకతనితో బాగా పరిచయం అయింది. ఇద్దరత్తలు-సూర్యకాంతం, హేమలతలు-వేరువేరు కారణాలవల్ల, ఇల్లోదిలి పడవమీద కలుస్తారు. పోట్లాడుకుంటారు. ఏట్లోపడిపోతారు. ముగింపుకు ముందు రమణారెడ్డి సాధువు వేషంలో తత్వాలు చదువుతాడు.

         బుద్దొచ్చెనా నీకు మనసా-మంచి బుద్దొచ్చెనా నీకు మనసా..

         చిత్తమొచ్చిన రీతి అత్తగారిని తిట్టి- చేతులారా నీవు చేసుకున్న ఖర్మ- కొడుకూ, కోడల్నీ కొట్టి తగలేసారు- కూతుర్ని, అల్లున్ని రప్పించారు- ఆడువారెపుడూ అణకువగా వుండాలి- అత్తయూ ఒక ఇంటి కోడలని మరువకు’

         అని ఇద్దరు అత్తలకు బుద్ధి చెబుతాడు. కథ సుఖాంతం.

         ఇది నిజమైన సమస్యాత్మక చిత్రం. ప్రతి కుటుంబంలోనూ జరుగుతుండే వ్యవహారమని అంటారు తిలక్. ఇంగ్లీషు వాళ్లు చూసి కావాలన్నారు. హిందీలో తీస్తామన్నారు. సోమర్ సెట్ మామ్ కథ ‘మదర్’ ప్రభావం తన చిత్రకథపై కొంత పడిందంటారు తిలక్. అది మదర్ ఎటాచ్ మెంట్. ఇక మన సంసారాల్లో అత్తా కోడళ్లు ఎందుకు కలవరంటే స్త్రీది పొసెసివ్ నేచర్ కావటమే కారణం.

         ఈ సినిమాలో తడకె రాయబారం థీమ్ తో ఓ చక్కని పాట వినిపిస్తారు. పిఠాపురం నాగేశ్వర్ రావు, జిక్కీలు పడిన ఆ పాటకు చదలవాడ కుటుంబరావు, సీత చాలా చక్కగా -సోగ్గా నటించారు. వారిరువురూ సినిమాలో పనిమనుషులు. ఒకరంటే ఇంకొకరికి వల్లమాలిన ప్రేమ. అయినా రాయబారం అవసరమైంది.

         ఆ పాటనూ వినిపించాడు తిలక్.

         ‘మాయదారి కీచులాట మామధ్య వచ్చింది-రాయబారం చేయవే తడికో తడిక- నువ్వు రాయబారం చేయవేతడికోతడిక-వాడి వగలమారి మాటలకు వళ్లంతా మండుతుంది- రాయబారమెందుకే తడికో తడిక – ఈ రాయబారమెందుకే తడికో తడిక. నేను ముక్కు పుడక తెచ్చాను ముంత గూటిలో పెట్టాను-దాన్ని పెట్టుకోమని చెప్పవే తడికో తడికె – నేను పట్టు చీరె తెచ్చాను. పెట్టిలో పెట్టాను – కట్టుకోమని చెప్పవే తడికో తడికె’

         ఆరుద్ర పాటలొక ఎత్తైతే, పినిశెట్టి మాటలు మరో ఎత్తు. అతను బాగా చదువుకున్నవాడని స్ర్కిప్టు రాయడంలో అతనికి జీవితంలో వున్న అనుబంధం- సంబంధం ప్రస్ఫుటిస్తాయని తిలక్ అన్నారు. అంతకుముందు ఆయన నాటకాలు రాశారు.  అయితే, అత్తా ఒకింటి కోడలే స్క్రిప్టు అతనికెంతో పేరు తెచ్చిపెట్టింది.

         రమణారెడ్డి ఈ సినిమాలో వల్లించే పద్యాలు-తత్వాలు అర్ధవంతమైనవి. సంసార చక్రం గురించి చక్కటి తత్వం చెప్తాడు. పురాణాలు చదివి, విడమర్చి చెప్పే అలవాటున్న ఆ‘వర్డి సుబ్బారాయుడు’ ఓసారి చెప్తాడు. పిల్లలు పుట్టగానే వారికి పెళ్లిళ్లు చేయాలని, వారికి పుట్టగానే ఆ పెళ్లాళ్లూ చూడాలని, ఇలా సంసార చక్రం అంతం లేకుండా తిరుగుతుంటుందని సందేశాత్మకంగా చెప్తాడు.

         జానపద గీతాలను సినిమాలో చొప్పించడం మొట్టమొదటిసారిగా తిలక్ ఈ సినిమా ద్వారానే చేసారు. మద్రాసు సిస్టర్స్ గా పిలువబడే శశి-కళ ఇందులో డ్యాన్సర్స్ గా కనిపిస్తారు. సుశీల, జిక్కి, స్వర్ణలత, ఘంటసాల, పిబి శ్రీనివాస్, పిఠాపురం నేపథ్య గాయకులు నృత్యం వేణుగోపాల్.

         తన ఈ సినిమా బాగా విజయవంతమైందన్నారు తిలక్. సేన్ గుప్తా (విజయా స్టుడియోస్ లేబరేటరీ) అనే ఓ సన్నిహితుడికి సినిమా బాగా నచ్చింది. అమ్మిపారేసి డబ్బు చేసుకోమని సూచించాడు. ఇల్లు కొనుక్కోమన్నాడు. తనకు అలాంటి ఆలోచన లేదన్నాడు తిలక్. దాన్ని అన్ని భాషల్లో తీయాలని తిలక్ కోరిక. తమిళంలో మొదలు శివాజీ గణేషన్, బి సరోజల కాంబినేషన్ లో తీద్దామనుకున్నారు. మనసు మార్చుకొని రాజేంద్రన్ (డీఎంకే ఎమ్మెల్యే) ఎం ఎస్ రాజం కాంబినేషన్ లో తీసారు. తమిళం ద్వారానే మంచి బ్రేక్ వచ్చింది. హిందీకి కావాలని చాలామంది అడిగారు.  ఎల్ వి ప్రసాద్ గారు అగ్రిమెంట్ పంపారు. అయితే తన బ్యానర్ మీద ప్రసాద్ గారు దర్శకత్వం వహించినా, లేదా ఆయన బ్యానర్ మీద తాను దర్శకత్వం వహించినా, ఆ అగ్రిమెంట్ కు ఒప్పుకుంటానన్నారు తిలక్ జరగలేదు అలా.

          చివరకు సుందర్ లాల్ కావాలంటే ఏదో ఆర్ధిక ఇబ్బందుల వలన ఇవ్వటం జరిగింది. ఆయన తీయకపోతే వాసు మీనన్ తీసారు. మధుసూదనరావును దర్శకుడిగా పెట్టుకున్నారు. అయితే దాన్ని పూర్తి చేయడానికి తిలక్ గారు వెళ్లాల్సి వచ్చింది.

         అదే రోజుల్లో తిలక్ గారికి పిఠాపురం రాజాగారితో పరిచయం అయింది. ఆయన తన స్థలాన్ని (మద్రాసులో) తిలక్ కు ఇచ్చి ఏమన్నా చేసుకోమన్నాడు. కాసేపు సినిమా ఆపుచేసి, ఆ ఫీల్డ్ లోకి దిగుదామనుకొని కూడా మనసు మార్చుకున్నారు.

         బిల్డర్ కాలేకపోయిన తిలక్, ‘సినీ బిల్డర్’ గానే కొనసాగారు.

(మరిన్ని విశేషాలు మరోసారి)

No comments:

Post a Comment