Monday, August 10, 2020

 

హిందీలో ఒక ‘బ్రేక్’ ఛోటీ బహూ !

స్వర్గీయ కేబీ తిలక్ జ్ఞాపకాలు-అనుభవాలు

వనం జ్వాలా నరసింహారావు

ప్రజాతంత్ర, సంపూర్ణ స్వతంత్ర వారపత్రిక

(డిసెంబర్ 17 - 23,  2000)

         తెలుగు-తమిళ చిత్రాలు విజయవంతంగా నిర్మించి, దర్శకత్వ బాధ్యతను చేపట్టిన తిలక్ దృష్టి 'పంతాలు పట్టింపులు' సినిమా తీసిన తర్వాత హిందీ ఫీల్డ్ వైపు మళ్లింది. తెలుగులో తీసిన ముద్దుబిడ్డ, ఈడూ జోడూ సినిమాలను ఆ ప్రయోగం కొరకు ఎంచుకున్నారాయన. సైరాబాను హిందీ సినిమాలను పంపిణీ చేస్తుండే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శ్రీచంద్ జైన్ ఈయన ముద్దుబిడ్డ సినిమా చూసి, బాగా నచ్చి, హిందీలో తీద్దామనుకుని, దానికి స్క్రిప్ట్ రచయితగా శ్రీ విశ్వామిత్ర ఆదిల్ ను ఎంపిక కూడా చేసుకోవటం జరిగింది. తీలక్ ను, ఆదిల్ ను తీసుకొని చంద్ జైన్ ప్రశాంతంగా స్క్రీప్ట్ తయారు చేసేటందుకు జైపూర్ వెళ్లారు. అక్కడ ప్యాలెస్ హోటల్లో మకాం చేసారు. ఆ హోటలుకు ప్రతిరోజూ సాయంత్రాలు, ప్రొద్దున్న నెమళ్లు, పావురాలు చేరుకునేవి. హోటలు వారు బసచేసే వారికి డబ్బులు తీసుకుని జొన్నలు, గోధుమలు ఇచ్చేవారు. సరదాగా వాటిని నెమళ్లకు, పావురాలకు ఆహారంగా ఆ గింజలను వేసేవారు. తిలక్ గారు ఆ సరదాను అనుభవించారు అక్కడున్నన్ని రోజులు. అంతటితో ఆగకుండా ఒంటె పాలను గూడ ఆరగించే వారు అక్కడి రాజస్తానీ సాంప్రదాయం ప్రకారం. ఒంటెలతో తయారైన పెరుగునూ తిన్నారు.

         జైపూర్ స్క్రిప్ట్ వ్రాయటం పూర్తి చేసుకొన్న తదుపరి మకాం ముంబాయికి మార్చారు. అక్కడ వెస్ట్ ఎండ్ అనే విలాసవంతమైన హోటల్లో బసచేసారు. ఆదో పురాతనమైన భవంతి. అక్కడ ధరలన్నీ ఎక్కువే. నిరంతరం వేడి నీళ్లు సరఫరా వున్నందున తిలక్ గారు కోడి గ్రుడ్లను బయటినుండి తెచ్చుకుని నీళ్లలో వుడికించుకుని తినేవారు బాయిల్డ్ ఎగ్స్ ను, దగ్గర్లోని మెట్రో సెంటరు నుండి పాలుకూడా కొనుక్కునే వారు హోటల్లో త్రాగటానికి.  ఆదో జీవితం అంటారాయన. ఉండీ-లేనీ విలాస పేదరికం. ఆ రోజుల్లోనే తిలక్ కజిన్, రిజర్వ్ బ్యాంక్ లో వ్యవసాధికారిగా పనిచేస్తుండే నాగేశ్వరరావుగారు కూడా బొంబాయిలోనే వుండేవారు. ఆయన దగ్గరకీ, ఇతర మిత్రులవద్దకూ తరచూ వెళ్తుండేవారు కాలక్షేపం కొరకు.

         'ఛోటీబహు’ (ముద్దుబిడ్డ హిందీవర్షన్) తీయటమనే నిర్ణయం జరిగింతర్వాత నటీ నటవర్గాన్ని ఎంపికచేసే విషయం చర్చకొచ్చింది. అప్పట్లో ప్రముఖ హిందీ చలన చిత్ర నటుడు, హీరో, రాజేష్ ఖన్నా చేతనానంద్ తీస్తున్న ఆఖరీఖత్ సినిమాలో నటిస్తున్నాడు, దాదాపు పూర్తయ్యిందా సినిమా. చేతనానంద్, ఆయన సోదరుడు విజయానంద్, రచయిత విశ్వామిత్ర ఆదల్ కు మంచి స్నేహితులు. వాళ్ల మేనకోడలు సుష్మా ఎప్పుడూ ఆదల్ గారింట్లోనే వుంటుండేది. ఆ అమ్మాయినే విజయానంద్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత, ఆర్టిస్టుల ఎంపికలో భాగంగా చేతనానంద్ తీసిన ఆఖరీఖత్ సినిమా రషెస్ చూద్దామన్నాడు ఆదిల్. సాధారణంగా ఎవరికీ చూపించని చేతనానంద్ వీళ్లకొరకు రషెస్ వేసాడు. అది చూసి రాజేష్ ఖన్నాను (జగ్గయ్య పోషించిన పాత్రకు ఎంపిక చేసుకున్నారు, ఆయన పాత్ర ఆఖరిఖత్ లో నచ్చినందున). అదే విధంగా శ్రీచంద్ జైన్ ను సైరాబానుతో వున్న పరిచయం ఆధారంగా, ఆమెనూ (జమున పాత్ర) పోషించటానికి కుదుర్చుకున్నారు. ఇన్ని జరిగిన తర్వాత అనివార్యకారణాల వల్ల శ్రీచంద్ జైన్ ఆ సినిమాను తీయటం జరుగలేదు. ఇది తెల్సుకున్న బాంబేకే చెందిన మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శ్రీ బి సి శంకర్ తనకు కావాలని చెప్పి హక్కులు తీసుకున్నాడు శ్రీ చంద్ జైన్ దగ్గర నుండి. ఆయనో సింధీ కావటంతో మరి కొందరు సింధీ వ్యాపారస్తులను భాగస్వాములుగా చేసుకున్నాడు. సిరూమల్, గోప్లా, దింషా...ఇలా అందులో భాగస్వాములుగా చేరారు.

         దిలీప్ కుమార్, సైరాబానూ వీళ్లకు కూడా పరిచయమైనందున, రాజేశ్ ఖన్నా సరసన నటించేందుకు ఆమెనే ఫిక్స్ చేసుకున్నారు. హిందీ సినీరంగ ఆనవాయితీ ప్రకారం సినిమా ప్రారంభానికి ముందర శ్రీ బిసి శంకర్ తన గెస్ట్ హౌస్లో ఓ జల్సాచేసాడు, అదో లావిష్ పార్టీ. రాజేష్ ఖన్నా, సైరాబాను ఇతర ఆర్టిస్టులందరూ పాల్గొన్నారందులో. అప్పట్లో రాజేష్ ఖన్నాకు ఓ రవాణా కంపెనీ కూడా వుండేదట.

         విశ్వామిత్ర ఆదిల్ స్క్రిప్ట్ నే వుంచుకుని, సంగీత దర్శకునిగా కల్యాణ్ జీ ఆనంద్ జీని పెట్టుకున్నారు. ఖైఫీ ఆజ్మీ వ్రాసిన ఓ పాటనే వుంచుకున్నారు. కొన్ని ఇతరులతో వ్రాయించారు. శ్రీచంద్ జైన్ తీద్దామనుకున్నప్పుడు ఖైఫీ ఆజ్మీతో వ్రాయించిన పాట 'రుక్ జా, రుక్ జా, వఖత్ చలేజాయే.... రాజేష్ ఖన్నాతో చిత్రీకరించారు. తెలుగులో జగ్గయ్యకు లేదీపాట. ముద్దుబిడ్డను సైరాబాను (ఆ తర్వాత షర్మిలా టాగూర్) పెంచుతూ ఆడిస్తున్నప్పుడు, రోమాంటిక్ గా వుంటుందని ఈ పాటను పెట్టారు హిందీలో. భార్య ముద్దుబిడ్డతో గడుపుతూ తన దగ్గరకు రాకపోవటంతో, రాత్రి గడిచిపోయి, తెల్లవారుతున్నదని భావం వచ్చే తరహాలో భర్తగా రాజేష్ ఖన్నా పాడినపాట. ఛోటీ బహులో ఇదొక ఆదనపు సీన్. శ్రీ బిసి శంకర్ ముద్దు బిడ్డను 'ఛోటీ బహన్'గా తీద్దామనుకున్నప్పుడు సైరాబాన్ నే కంటిన్యూ చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో పడ్డప్పుడు, 'మౌసిమీ ఛటర్జీ' అవుతే ఎలా వుంటుందన్న భావనతో తిలక్ గారు కలకత్తా వెళ్లారు ఆ పనిమీద. ఆదే ఆయనకు మొదటి ట్రిప్ ఆ నగరానికి.  అప్పుడప్పుడు తన పాత పరిచయస్తులతో పాటు, ఎంతో మంది బెంగాల్ కళాకారులను కల్సారు. మౌసమీ ఛటర్జీని కల్సిన తర్వాత. ఆమెకన్నా సైరాబాన్ అయితేనే ఆ పాత్రకు బాగుంటుందన్న నిశ్చయానికొచ్చారు. చివరకు ఆ పాత్రను పోషించింది మరో బెంగాలీ ఆర్టిస్ట్.


         ఇదిలా జరుగుతుండగా, మద్రాసులో ఎవిఎమ్ స్టూడియోలో షూటింగ్ చేసారు. అదీ రంజాన్ దినాల సందర్భంగా. సైరాబాన్, దిలీప్ కుమార్లు మద్రాసులోనే వున్నారప్పుడు. ఎవిఏమ్ స్టూడియోలో ఓ పాటను సైరాబాన్ పై చిత్రీకరించారు. ఆ పాట రికార్డు చేస్తున్నప్పుడు, సైరాబాన్ సరదాగా, ‘ఏమండీ మా ఆయన నన్ను కొట్తాడేమో. రంజాన్ రోజుల్లో షూటింగ్ లో నాతోటి పాట పాడిస్తున్నారు' అన్నదట. లేదమ్మ అలా ఏం జరుగదు అని స్వతంత్రంగా, చెప్పాను అన్నారు తిలక్.

         అనారోగ్య కారణాల వల్ల సైరాబాను ‘చోటీబహు'లో నటించటం మానుకోవాల్సి వచ్చింది. ఆమెను తీసివేయలేక తప్పలేదు. శస్త్ర చికిత్స కొరకు విదేశాలకు వెళ్లి పోయిందామె. ఆమె పాత్రకు శ్రీమతి షర్మిలా టాగూర్ ను ఎంపిక చేసుకుని తిరిగి షూటింగ్ చేయాల్సి వచ్చింది ఆమె ఉన్న సన్నివేశాలను. అదేంటో, తెలుగులో ముద్దు బిడ్డ ఎనిమిది రీళ్ల షూటింగ్ తర్వాత జి వరలక్ష్మీని మార్చి లక్ష్మీరాజ్యంను ఎంపిక చేసుకుని మళ్లీ చిత్రీకరించిన కారణం ఒకటైతే, మరో కారణాన హిందీలో రీ షూటింగ్ తప్పలేదు తిలక్ గారికి.

         రాజేష్ ఖన్నా- షర్మిలా టాగూర్ కాంబినేషన్ లో 'చోటీబహు’ కన్న ముందే శక్తి సామంత్ ఓ పిక్చర్ తీసారు. అది హిట్ అయింది. ఆదో రొమాంటిక్ చిత్రం. అయితే, తిలక్ గారిది సెంటిమెంటల్ చిత్రం. హిట్ కాక పోవటానికి ఏదో కారణముండాలికదా!

         ఛోటీబహులో 'ముద్దు బిడ్డ' పాత్రను పోషించిన ‘బేబీ సారిక' ప్రముఖ బహు భాషా చలన చిత్ర కథానాయకుడు శ్రీ కమలహాసన్ ను పెళ్లి చేసుకుంది. సూర్యకాంతం తెలుగులో వేసిన పాత్ర శశికళ, కొడుకుగా మొహమూద్, రమణారెడ్డి పాత్రను, ఐఎస్ జోహార్, నాగయ్య వేషం కరణ్ బోస్, లక్ష్మీరాజ్యం పాత్రను నిరుపరాయ్ లు పోషించారు.

         హిందీ సినిమాలు ఔట్ డోర్ షూటింగ్ కొరకు సాధారణంగా కాశ్మీర్ లోయకు వెళ్తారు. అదో ఆనవాయితి. చోటీబహు ఔట్ డోర్ ఆంధ్రలో, అది హైదరాబాద్ లోనే జరగాలని పట్టు పట్టాడు తిలక్. ఇలాంటి విషయాల్లో ‘ఎడమెంట్' మనస్తత్వం ఆయనది. అప్పట్లో హైదరాబాద్ ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మధ్యలో ఉంది. ఆ రోజుల్లో ‘చిత్రపురి' (హయత్ నగర్-హైదరాబాద్)లో శ్రీ ఎల్ వి  ప్రసాద్ గారికి ఓ స్టూడియో వుండేది. అందులో షూటింగ్ చేయించారు కొంత భాగాన్ని. ‘దాలి బోలె మాలీసే -మాలీబో లేదాలీసె' అన్న హిందీ పాట నమూనాలో ‘తుజ్ సాకోహీనహీ నన్నే మున్నే..’ అనే పాటను (తెలుగులో 'చిట్టి పాట్టి వరాలమూట--) చిత్రీకరించారు. ఈ పాట మద్రాసులో సైరాబాన్ పైన చిత్రీకరించి రికార్డు చేసారు. హైదరాబాద్ లో షర్మిలపైన.

ఆ షూటింగ్ సందర్భంగా, ఇప్పటి కంట్రీ క్లబ్ భవనం స్వంత దారులు, షర్మిలాపటౌడీ నవాబు బంధువులైనందున, ఎందరో షూటింగ్ స్థలానికి వచ్చేవారు. హయత్ నగర్ ప్రాంతంలోని ఓ గుడి సమీపాన మరో పాటను చిత్రీకరించారు. అప్పట్లో మాజీ ఆంధ్రప్రదేశ్ హోమ్ మంత్రి శ్రీ కె ప్రభాకర్‌రెడ్డి, ఓ లోకల్ లీడర్ ఆ ప్రాంతానికి ఆయన సహకరించారు. 'ఎవరుకన్నారు, ఎవరుపెంచారు...? అన్న తెలుగులోని పాటను, 'కిస్ కూ కహేగా’ పాటగా హిందీలో కిశోర్ కుమార్ పాడగా వల్ల నరసింహారావుపైన చిత్రీకరించారు. తెలుగులో వేరే విధంగా చేసారుదాన్ని, ఆ పాటను రికార్డు చేసేటప్పుడు కిశోర్ కుమార్, కళ్యాణ్ జీ,  ఆనంద్ జీకి ఇష్టమైన బెంగాలి డ్రెస్ లో వచ్చేవాడు. సినిమాలో కొన్ని పాటలను లత పాడింది. తెలుగులో వేసినవారే డప్పుల నృత్యాన్ని, పులి వేషాన్ని హిందీలో కూడా వేశారు.

         ‘చోటీబహు’ తిలక్ కు హిందీలో ఓ  బ్రేక్.

(మరిన్ని విశేషాలు మరోసారి)

 

 

 

 

No comments:

Post a Comment