Tuesday, April 23, 2019

పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన పధ్ధతి కాదు.... వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన పధ్ధతి కాదు
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (24-04-2019)
ఒక్క ముద్దలోనే అన్నీ కలుపుకుని తినరాదని, ఒకే పర్యాయం శత్రువులందరినీ ఎదుర్కోవడం తగదని, తొలుత బ్రిటీష్ సామ్రాజ్య వాదులను-వాదాన్ని వదిలించుకోవాలని విప్లవ పాఠాలు బోధించాడు స్టాలిన్. అదే సిద్ధాంతం భూస్వామ్య జమీందారుల విషయంలోనూ వర్తిస్తుందన్నాడు. బ్రిటీష్ పాలన కాలంనాటి చిహ్నాలైన జమీందారీ వ్యవస్థను తొలుత వ్యతిరేకించాలన్నది ఆయన అభిప్రాయం.

"జాతీయ బూర్జువాలు" అంటే ఏమిటన్న బసవ పున్నయ్య ప్రశ్నకు, సామ్రాజ్యవాదమంటే, ఇతర దేశాలను ఆక్రమించుకోవడమేనని, జాతీయ బూర్జువాలకు అది చేత కాదని, చిన్న-పెద్ద-మధ్య కారు బూర్జువాలందరు (ధనికులు) జాతీయ సంపదను-వనరులను మాత్రమే దోపిడీ చేయగలరని, వారికి వ్యతిరేకంగా మూకుమ్మడిగా పోరాటం చేయ తగదని వివరణ ఇచ్చాడు స్టాలిన్. జాతీయ బూర్జువాలలో చాలా మంది, కమ్యూనిస్ట్ ఆలోచనా విధానంతో అంగీకరించే అవకాశం వుందని, వారిని కలుపుకుని పోవడం మంచిదని అంటాడు. అత్యంత సంపన్న వర్గాలకు చెందిన బూర్జువాలు బ్రిటీష్ తొత్తులుగా పనిచేసినందున వారిని వ్యతిరేకించాలంటాడు. "పాకిస్తాన్, భారత దేశం, శ్రీ లంక" లకు చెందిన ప్రజలు ఉమ్మడిగా తమ-తమ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి విప్లవంలో భాగస్వాములయ్యే అవకాశాల గురించి కూడా మాట్లాడుతూ, "బెంగాల్ ప్రాంతం పాకిస్తాన్ నుంచి విడిపోతుంది" అని జోస్యం చెప్పాడు. ఆయన చెప్పిన పాతికేళ్ళకు బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా వివరించుకుంటూ పోయిన స్టాలిన్, గొరిల్లా పోరాటానికి భారత దేశంలో అవకాశాలు అసలే లేవని, చైనా పరిస్థితులను భారత దేశ పరిస్థితులతో పోల్చడం సరైందికాదని అంటాడు. చైనా కు చెందిన చి యాంగ్‍కై-షేక్ ఆ దేశంలో వున్నంతవరకు అమెరికన్ల కీలుబొమ్మ కాదని, ఎప్పుడైతే, ఫార్మోజా (తైవాన్) కు వెళ్లాడో, అప్పుడే కీలుబొమ్మగా మారాడని అంటూ, జవహర్ లాల్ నెహ్రూను ఆయనతో పోల్చడం సరికాదంటాడు. నెహ్రూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదుల చేతుల్లో కీలుబొమ్మగా అయ్యే అవకాశాలు అసలే లేవని అంటాడు. ఆయన పట్ల ప్రజల్లో అభిమానం వుందని, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొరిల్లా యుద్ధం జరపడం సరైన వ్యూహం కాదని స్పష్టం చేశాడు స్టాలిన్.

భూస్వాములకు-జమీందారులకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనను, వ్యవసాయ కూలీల సమ్మెను, కౌలు దార్ల హక్కుల పోరాటాన్ని, మిగులు భూముల ఆక్రమణను కమ్యూనిస్టుల ఉద్యమంలో భాగం కావాలని చెప్పాడు. కార్మికుల హక్కుల కొరకు కూడా పోరాడాలని అంటాడు. అలా కార్మిక-కర్షక వర్గాలను సమీకరించి పోరాటాలు సలపాలిగాని, "అంతర్యుద్ధం" చేయడానికి సమయం ఆసన్నమైందని భ్రమ పడవద్దని హెచ్చరించాడు. తెలంగాణా సాయుధ పోరాట ఫలితాలను కార్మిక-కర్షక వర్గాలు అనుభవించేందుకు నిరంతర పోరాటం సలపాలని సలహా ఇచ్చాడు. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుల పార్టీ వ్యతిరేక కలాపాలకు మరణ దండన విధించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు. వ్యక్తిగత హింసను కూడా ఆయన వ్యతిరేకించాడు.


అంతర్గతంగా వుండిపోయిన భారత కమ్యూనిస్ట్ పార్టీలోని విధానపరమైన అభిప్రాయ భేదాలు, భారత-చైనా యుద్ధం జరిగినప్పుడు బహిర్గతమయ్యాయి. డాంగే, ఆ సమయంలో పార్లమెంట్ లోక్‍సభలో కమ్యూనిస్ట్ పక్షం నాయకుడు. చైనా పట్ల అవలంబించాల్సిన వైఖరి విషయంలో, పార్టీ నాయకత్వంలో తీవ్రమైన చర్చలు జరిగాయి. డాంగే ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూకు ఇచ్చిన మద్దతును తీవ్రంగా వ్యతిరేకించారు జోషి నాయకత్వంలోని మరో వర్గం. ప్రారంభ దశలో డాంగే వాదనకే మెజారిటీ సభ్యుల ఆమోదం లభించింది. ఎప్పుడైతే, "అంతర్జాతీయ కమ్యూనిజం" విషయంలో, డాంగే తనదైన నిర్వచనం చెప్పాడో, మౌలిక పరమైన కమ్యూనిజం విధానాలను వ్యతిరేకించడం ఇష్టపడని పలువురు, ఆయనకు తొలుత మద్దతిచ్చినప్పటికీ, క్రమేపీ ఆయనకు దూరమయ్యారు. సీపీఐ సెక్రెటేరియట్ లోని సభ్యుల్లో రణదివే-జోషి లు చైనా అనుకూలురైన "అతివాదులుగా", డాంగే నెహ్రూకు అనుకూలుడైన "నిరోధక వాద శక్తుల ప్రతినిధి"గా, అజయ్ ఘోష్-జ్యోతి బసులు మధ్యే వాదులుగా, భూపేష్ గుప్త ఎటూ తేల్చుకోని వాడిగా బయట పడ్డారు. చైనా ఏకపక్షంగా యుద్ధ విరమణ చేసిన తర్వాత, రాజీ మార్గంలో నడిచిన కమ్యూనిస్ట్ నాయకత్వం, మితవాద వర్గానికి చెందిన డాంగేను పార్టీ చైర్మన్(అంతకు ముందు లేని పదవి)గా, మితవాద-అతివాద వర్గాలకు సమాన దూరంలో వున్న ఇఎంఎస్ నంబూద్రిపాద్ ను సెక్రెటరీ జనరల్‍గా నియమించింది.

ప్రప్రధమ ప్రధానమంత్రి స్వర్గీయ జవహర్‌లాల్‌నెహ్రూ చైనా పర్యటించి పంచశీల సూత్రం పఠిస్తూనే, సోవియట్‌యూనియన్‌తో మైత్రీ సంబంధాలు పెంపొందించుకుంటూ వచ్చారు. చైనా-సోవియట్‌దేశాలతో భారత దేశం కొనసాగిస్తున్న సత్సంబంధాలతో నిమిత్తం లేకుండానే (ఉమ్మడి) భారత కమ్యూనిస్ట్ పార్టీ, ప్రభుత్వ విధానాలను కొన్నింటిని ఘాటుగా వ్యతిరేకించేది. సోవియట్‌యూనియన్‌, చైనా కమ్యూనిస్ట్ పార్టీల మధ్య తలెత్తిన సైద్ధాంతిక విబేధాల దరిమిలా కారణాలు ఏవైనా చైనా- భారత సరిహద్దు వివాదం మొదలైంది. ఆ వివాదంలో తటస్థ వైఖరిని అవలంబిస్తున్నట్టు నాటి సోవియట్‌ప్రభుత్వం ప్రకటించడం విశేషం. సరిహద్దు తగాదా పర్యవసానంగా భారత చైనా దేశాల మధ్య 1962లో యుద్ధం జరిగింది. అప్పట్లో ఉమ్మడి భారత కమ్యూనిస్ట్ పార్టీలోని ఒక వర్గం భారత ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ప్రకటించగా, మరో వర్గం (భవిష్యత్ లో సీపీఐ-ఎంగా పిలువబడ్డ)ఆ యుద్ధాన్ని "ఇంతకు పూర్వం ఖచ్చితంగాలేని సరిహద్దు విషయంలో ఏర్పడ్డ వివాదంతో ఏర్పడ్డ సంఘర్షణగా పేర్కొనడంతో, పరోక్షంగా చైనా సానుభూతిపరులుగా ముద్రపడ్డది.

No comments:

Post a Comment