Tuesday, April 16, 2019

వైద్య కళాశాలలో పనిచేయాలనే కుతూహలం బలంగా వుండేది .... వైఆర్కే ప్రాక్టీసుకు నేపధ్యం .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


వైద్య కళాశాలలో పనిచేయాలనే కుతూహలం బలంగా వుండేది
వైఆర్కే ప్రాక్టీసుకు నేపధ్యం
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (17-04-2019)
రాధాకృష్ణమూర్తిగారిని దత్తత తీసుకున్న పెదనాన్న యలమంచిలి సీతారామయ్యగారు, బాగా చదువుకున్న వారే కాకుండా, సంఘ సంస్కర్త కూడా. దత్తత పోవడంతో తనకు దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ కాగలిగారు రాధాకృష్ణమూర్తిగారు. దరిమిలా అన్నతో సహా, తమ్ములను కూడా పైకి తీసుకో రావాల్సిన బాధ్యత ఆయనపై పడింది. ఆ బాధ్యత నేపధ్యంలో, ఎంబిబిఎస్ పూర్తయిన తర్వాత, వైద్యంలో ఉన్నత చదువులు చదివే అవకాశం లేకుండా పోయింది. రాధాకృష్ణమూర్తి ఎంబిబిఎస్ సహాధ్యాయులందరూ పోస్టు గ్రాడ్యుయేషన్ చేసి, ప్రొఫెసర్స్ స్థాయికి ఎదిగిన వారే. 1950లో, ఆంధ్ర ప్రాంతం మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోవడానికి ప్రయత్నాలు జరుగుతున్న రోజుల్లో, ఆయన ఎంబిబిఎస్ చదువు పూర్తయింది. ఆయన చదువుకున్న కళాశాలలో అధ్యాపకులందరూ, బ్రిటీష్ వారు కాని, తమిళ, మళయాళీలు కాని వుండే వారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆ అధ్యాపకులందరూ, మద్రాస్ రాష్ట్రంలో వుండిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ కారణాన, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ప్రొఫెసర్లుగా పనిచేయాలంటే, అవసరమైన పోస్టు గ్రాడ్యుయేషన్ చదువు కొరకు, దరఖాస్తు చేసుకున్న ప్రతి అభ్యర్థికి సీటు దొరికింది. అప్పట్లో ఉద్యోగం చేసుకుంటూ పీజీ చేసే అవకాశం కలిగించారు. కొందరిని, ప్రభుత్వమే ఖర్చులు కూడా భరించి, విదేశాలకు పంపించింది ఉన్నత చదువుల కొరకు. అలాంటి వారిలో ప్రఖ్యాత వైద్యులు, న్యూరో చికిత్స నిపుణులు డాక్టర్ బాల పరమేశ్వరరావును ఇంగ్లండ్ పంపించింది. రాధాకృష్ణమూర్తిగారి కంటే ఒక సంవత్సరం జూనియర్ అయిన, డాక్టర్ వెంకట రావును కూడా ఇంగ్లాండుకు పంపించింది అలానే. ఆయన ప్రధాన అనస్థటిస్టుగా ఉస్మానియా ఆసుపత్రిలో పని చేశారు. యలమంచిలి సహాధ్యాయులు, సీనియర్లు, జూనియర్లందరూ ప్రొఫెసర్లుగానో, ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగానో, వైద్య శాఖ డైరెక్టర్ల గానో పనిచేశారు.

1950 డిసెంబర్‍లో ఎంబిబిఎస్, 1951-1952ల్లో హౌజ్ సర్జన్‍షిప్ పూర్తవుతున్నప్పుడు, తదుపరి ఏం చెయ్యాలనే ప్రశ్న వచ్చింది ఆయనకు. ఇంకా పై చదువు (ఎం. డి) చదివి, వైద్య కళాశాలలో పనిచేయాలనే కుతూహలం బలంగా వుండేది డాక్టర్ గారికి. అప్పుడు ఆయనకు సీటు లభించడం సమస్యే కాదు. కాకపోతే, 2,3 సంవత్సరాలు విశాఖ పట్నంలో సొంత ఖర్చుతో చదువుకోవాలి. అంత ఆర్థిక స్థోమత లేదు. భూస్వామి - భాగ్యవంతుడైన మామ గారు మౌనం వహించారు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగం వస్తే, అది చేసుకుంటూనే చదువుకునే అవకాశం వచ్చేది. కాని, ఇంకా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో, ఆ పోస్టులకు ఎంపిక ప్రక్రియ ఆరంభం కాలేదు.

ఆ సమయంలోనే, ఆర్మీలో షార్ట్ సర్వీస్ రెగ్యులర్ కమీషన్ కు పిలుస్తే ఢిల్లీ వెళ్లి, ఇంటర్వ్యూలో నెగ్గి, సెలెక్టయి వచ్చారు. పిలుపు కోసం వేచి వున్నారు. కలకత్తాలోని "స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్" లో సీట్ కొరకు దరఖాస్తు చేస్తే, డి.టి.ఎం లో సీటొచ్చింది. సదరన్ రైల్వే మెడికల్ ఆఫీసర్స్ కోసం ప్రకటన వస్తే, మద్రాస్ వెళ్ళి, సెలెక్టయ్యారు. అంతా ఒక చౌరాస్తాలాగ వుందప్పుడాయనకు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో, తన అభిమాన ప్రొఫెసర్ డాక్టర్ అనంతా చారి గారిని సలహా కొరకు సంప్రదించారు. తన ప్రధమ ఆప్షన్ ఎం. డి చదవడంగా వుండాలన్నారు. ఆర్థిక స్థోమత లేదన్నారీయన. మిలిటరీ ఉద్యోగం అసలే చేయొద్దన్నారు. కలకత్తా డి.టి.ఎం కోర్సు తనకు చాలా చిన్నదని సూచించారు. ఇవేమీ కాకుంటే, తిన్నగా వెళ్ళి తనకు దగ్గరలో వున్న పట్టణంలో ప్రాక్టీసు పెట్టుకుంటే, మంచి ఫలితాలను సాధిస్తావని భరోసాగా - నమ్మకంగా చెప్పారు. ఇంకా రాష్ట్ర సర్వీస్ పై ఆశ పోని డాక్టర్ గారు, అప్పటికే పిలుపొచ్చిన రైల్వే సర్వీసులో, తాత్కాలికంగా చేరారు. మద్రాస్ పెరంబూర్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రిలో పోస్టింగ్ వస్తే చేరారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సహాధ్యాయులు కూడా అక్కడే చేరారు. అక్కడి నుండి మద్రాస్ సెంట్రల్ స్టేషన్ డిస్పెన్సరీ, ఆవడి డిస్పెన్సరీ, చివరకు ఆర్కోణం జంక్షన్ లో వున్న కాస్తంత పెద్ద డిస్పెన్సరీకి మార్చుకుంటూ వచ్చారు.


రైల్వే ఉద్యోగంలో వుండగా...అలనాటి అనుభూతులను, అప్పటి పరిస్థితులలో తనకు అనుభవంలో కొచ్చిన కొన్ని నగ్న సత్యాలను నెమరేసుకున్నారు డాక్టర్‌గారు. తాను అనుకున్న-కోరుకున్న ఉద్యోగం దొరకక అప్పటికి ఏదో ఒకటి లెమ్మని రైల్వే ఉద్యోగంలో చేరారు డాక్టర్‌గారు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం లాగానే, అప్పట్లో, ఉమ్మడి సదరన్ రైల్వే (ఇంకా దక్షిణ మధ్య రైల్వే ఏర్పడలేదు) ప్రధాన కార్యాలయం (మద్రాస్ పెరంబూర్ లో వుండేది) ఆసుపత్రిలో డాక్టర్‌గారు, ఆయన మిత్రుడు-క్లాస్ మేట్ కె. విశ్వనాథరావు ఏకకాలంలో రిపోర్టు చేశారు. వారి జీతం నెలకు రు. 200 +రు. 100 కరువుభత్యం. ఆ మొత్తంలో ఒక రూపాయి రెవెన్యూ స్టాంపుకు మినహాయించుకొని, చేతికి రు. 299 లు ఇచ్చేవారు. అప్పటికి మిత్రుడు బ్రహ్మాచారే. డాక్టర్‌గారు తప్పనిసరి బ్రహ్మచారి. ఇద్దరికీ వుండడానికి కాంపస్‌లోనే క్వార్టర్స్ ఇచ్చారు. అరవ హోటల్లో భోజనం 60 టికెట్ కూపన్ల పుస్తకానికి (ఒకేసారి కొంటే) రు. 55.

         ఆసుపత్రిలో ఔట్ పేషంట్‍లో డ్యూటీ. వారికి అరవం బొత్తిగా రాదు. పేషంట్లంతా అరవంలోనే మాట్లాడేవారు. అటెండరే దుబాసీ. నెమ్మదిగా చిన్నచిన్న మాటలు అర్థం చేసుకోవడం మొదలైంది. "వైత్‍వరి"(వళ్లు నొప్పులు), "మారువలి"(ఛాతినొప్పి), "వాంగో, ఉకారు"(రండి, కూర్చోండి), ఎన్న, ఎంగి, అప్పడియా, పార్కలాం, ఇరికె పదాలతోపాటు భోజనానికి వెళ్లినప్పుడు అవసరమయ్యే మాటలను కూడా నేర్చుకున్నారు. సాపాటు, సాంబార్, కూట్, మోర్, మోర్ కొళింబి, పోరుం, వేండా లాంటి కొన్ని నేర్చుకోక తప్పలేదు.

డాక్టర్‌గారు మద్రాస్‌లో వుండగానే పొట్టి శ్రీరాములుగారి ఆమరణ నిరాహార సత్యాగ్రహ దీక్ష మొదలైంది. ఆయన ప్రాణత్యాగం (ఆంధ్రా నాయకుల మొండితనం) చూశామన్నారు. ఆ తరువాత జరిగిన సంతాప సమావేశాలు, ఆగ్రహావేశాలు, ప్రదర్శనలు మౌన సాక్షులుగా గమనించారు.

అవి "హిందీ-చీనీ భాయీ-భాయీ" అనుకునే రోజులు. అప్పట్లో (బహుశా) కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు, చైనా సాంస్కృతిక బృందం ఒకటి మిగతా నగరాలతోపాటు మద్రాస్‌కు కూడా వచ్చిందట. ఆ సందర్భంగా ఒక పెద్ద స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రదర్శనను ప్రస్తావించారు. సంగీతం, నాటకం, నృత్యం, ఏక్రోబాటిక్స్ లాంటివెన్నో రెండు-మూడు గంటలపాటు అద్భుతంగా ప్రదర్శించారట. ప్రతి ఐటమ్‍కు, హాజరైన నలబైవేల మంది ప్రేక్షకులనుండి మిన్నంటే కరతాళ ధ్వనులు వినిపించాయట. వారు విముక్తి చెంది అప్పటికింకా నాలుగు సంవత్సరాలేనని, బహుశా వారి సాంస్కృతిక సంపదకు నూతన ప్రభుత్వం చాలా మెరుగులు దిద్ది వుండాలని అంటారు డాక్టర్‌గారు. (సశేషం)

No comments:

Post a Comment