Saturday, April 6, 2019

అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (07-04-2019)
కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలను తు. చ తప్పకుండా పాటిస్తూ, నాలుగు దశాబ్దాలు పార్టీ సభ్యత్వం లేకపోయినా-తీసుకోక పోయినా, ఒకనాటి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీకి, చీలిక తర్వాత భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీకి పనిచేసి, ఆ తర్వాత పార్టీ ఆదేశం మేరకు సభ్యత్వం తీసుకుని, గత పాతికేళ్లుగా పార్టీకి సేవ చేస్తూ, సమాజం తనకు అప్ప చెప్పిన ఇతర బాధ్యతలను నెరవేరుస్తున్న ఎనభై రెండేళ్ల కమ్యూనిస్టు యోధుడు-పౌర హక్కుల ఉద్యమ ఆద్యుడు-ప్రజా వైద్యుడు-మాజీ రాజ్య సభ సభ్యుడు, ఖమ్మం జిల్లాలో నివసిస్తున్న "సీమాంధ్ర-తెలంగాణ" వాసి, డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి జీవన యానం కమ్యూనిస్టులకు-కమ్యూనిస్టే తరులకు ఆదర్శప్రాయం. సీపీఎం దిద్దుబాటు ఉద్యమానికి ఆయన లాంటి వారి అరుదైన జీవితం ప్రామాణికం. సీపీఎం పార్టీ తలపెట్టిన "దిద్దుబాటు" కార్యక్రమంలో భాగంగా స్పందించని వారు తప్పనిసరిగా డాక్టర్ జీవిత కథ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే మరి.

గుణవంతుడు, కృతజ్ఞుడు, సత్య శీలుడు, సమర్థుడు, నిబద్ధత కల వాడు, నిశ్చల సంకల్పుడు, కమ్యూనిస్టు సదాచారం మీరనివాడు, ప్రజలకు మేలు చేయాలన్న కోరికున్నవాడు, సాహిత్యాభిలాషి, కోపమంటే ఎరుగనివాడు, ప్రతిభావంతుడు, వృత్తిలో నిపుణుడు, ప్రవృత్తిలో అసూయ లేనివాడు, వేదికపై ఉపన్యాసం ఇస్తే వైరి వర్గాలు కూడా మెచ్చుకునే సామర్థ్యం కలవాడు, మానవ విలువలకు కట్టుబడిన వాడు, పౌర హక్కులను కాపాడగలనని నిరూపించిన "షోడశ కళల" ను పుణికి పుచ్చుకున్న అరుదైన మహామనిషి డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి.

"వైఆర్‍కె"గా, "డాక్టర్ గారు"గా అందరూ పిలిచే ఈ మనిషి చిన్నతనం ‍నుండే నిరీశ్వరవాది. గోరా ప్రభావంతో హేతువాదం కూడా జోడైంది ఆయనలో. సహధర్మచారిణి కూడా, ఆయన బాటలోనే, వివాహమైన కొద్ది కాలంలోనే పయనించడంతో, ఇంట్లో పూజలు-దేవుళ్ల బొమ్మలు లేవు. ముగ్గురు పిల్లలకూ ఆయన అలవాట్లే అబ్బాయి. ఇంటికొకరు అన్నట్లు, పెద్ద కోడలు మాత్రం మంచి భక్తురాలైంది. అయితే, సాహిత్యాభిలాషైన వైఆర్‍కె పుస్తక పఠనం విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను నిరీశ్వర వాదాన్ని-హేతువాదాన్ని అంటిపెట్టుకునేంత "కన్సర్వేటివ్" కాదనాలి. ఆయన కన్సర్వేటివిజం అంతా, ఆహార పానీయాల్లోను, వేష భాషల్లోను, అలవాటున్నంతవరకు ధూమపానం చేయడంలోను మాత్రమే. ఐదు పర్యాయాలు జైలు జీవితం గడిపిన డాక్టర్ గారు, వరంగల్ జైలులో వున్నప్పుడు, తోటి ఖైదీల దగ్గర షడ్దర్శనాలు, భగవద్గీత, ఇస్లాం మతం, ఆయుర్వేద రహస్యాలు లాంటి విషయాలను ఆసక్తిగా నేర్చుకున్నారు.

1985లో పార్టీ సభ్యత్వం తీసుకున్న డాక్టర్ వైఆర్కె, పాతికేళ్లు సీపీఎం రాష్ట్ర కమిటీలో, కార్యదర్శి వర్గంలో వున్నప్పటికీ, ఎన్నడూ ఆర్థికపరమైన బాధ్యతలు తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత "ఆస్తి" సమకూర్చుకోలేదు. పార్టీ నుంచి ఒక్క పైసా తీసుకోలేదు. పార్టీలో ఏ పదవినీ ఆశించని ఆయన, ఇచ్చిన బాధ్యతను ఎన్నడూ కాదనలేదు. వంట్లో శక్తి వున్నంతవరకు పార్టీకి సేవ చేసిన యలమంచిలి, ఎన్నికల పదవులపట్ల కూడా విముఖత చూపించినా, మూడు పర్యాయాలు ఖమ్మం లోక్ సభ స్థానానికి పోటీ చేయక తప్పలేదు. రెండుసార్లు సభ్యత్వం లేకపోయినా పార్టీ ఆదేశాల మేరకు "బాధ్యత" గా ఒప్పుకున్నారు. రాజ్యసభ సభ్యుడు కావాలని కూడా ఆయనెప్పుడూ కోరుకోలేదు సరి కదా, ఊహించనూలేదు. 1996 ఫిబ్రవరి నెలలో హాస్పిటల్లో పని చేసుకుంటున్నప్పుడు, మోటూరు హనుమంతరావు విజయవాడ నుంచి ఫోన్ చేశారు రాధాకృష్ణమూర్తిగారికి. తెలుగు దేశం పార్టీతో అప్పట్లో వున్న అవగాహన ప్రకారం సీపీఎం కు కేటాయించే రాజ్యసభ స్థానానికి ఆయన పేరు ప్రతిపాదించనున్నందున, దానికి ఆయన అంగీకారం తెలపాల్సిందిగా కోరారు మోటూరి. తనకెందుకన్న వైఆర్‍కెతో, "రాజ్యసభకు పంపుతామంటే వద్దంటారేంటి" అని ప్రశ్నించారాయన. చివరకు భార్యా పిల్లలను సంప్రదించి, సంకోచంగానే సమ్మతి తెలియ చేశారు డాక్టర్.


రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర పార్టీ నిర్ణయం మేరకు నెల నెలా పార్టీకి జమ కట్టాల్సిన మొత్తం పోను, మిగాతాదాంట్లో, తన కుటుంబ నిర్వహణకు ఖర్చుచేసి, మిగిలిందంతా "చిత్త శుద్ధి" తో పార్టీకి జమచేశారు. సభ్యత్వం అయిపోయిన తర్వాత వస్తున్న పెన్షన్ మొత్తాన్ని పార్టీకి ఇవ్వడంతో పాటు, తన తదనంతరం తన భార్యకు పంపితే, అది కూడా పార్టీకే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 1985 కు పూర్వం, అదీ సభ్యత్వం తీసుకోక ముందు, డాక్టర్ గారు సంపాదించిన ఆస్తిని ఆయనకు హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత ఇద్దరు కుమారులకు బదిలీ చేసి, ఎటువంటి ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా జీవిస్తున్నారాయన. పిల్లలు సమకూర్చిన పైకంతో ఆయన వ్యక్తిగత అవసరాలు తీర్చుకుంటున్నారు. పుస్తక పఠనం, రచనా వ్యాసంగం, మిత్రులతో కబుర్లు, పార్టీకి అవసరమైనప్పుడు సూచనలు-సలహాలు ఇస్తూ కమ్యూనిజాన్ని అభిమానిస్తూ, అందులోని మంచిని పది మందికి తెలియచేస్తూ, ప్రశాంత జీవితం గడుపుతున్న ఆయన జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమే! ఆయనలోని అధ్యయనం, ఆదర్శం, సేవా దృక్ఫధం, వృత్తి, ప్రవృత్తి, స్నేహ భావం, ఇతరులపై అభిమానం నన్ను కాదన లేకపోయాయి. నా వెంట వున్న బాబాయి, ఆయన అభిమాని వనం నరసింగరావు ప్రేరణ మా ప్రయత్నానికి ఊతమిచ్చాయి. ఫలితంగా డాక్టర్‍గారి అనుభవాలను, జ్ఞాపకాలను పదిమందితో పంచుకునే వీలు ఇలా కలిగింది.

నేను పుట్టి బాల్యంలో పెరిగింది, ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, వనంవారి కృష్ణా పురం (ముత్తారం రెవెన్యూ గ్రామం). హైస్కూల్, కాలేజీ ఆరంభ చదువు ఖమ్మం పట్టణంలో. వ్యవసాయం, కరిణీకం వృత్తిగా పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో, సరైన రహదారి సౌకర్యంకూడా లేని  ఆ కుగ్రామంలో నివసిస్తుండే, ఒక శుద్ధ ఛాందస కుటుంబంలో పుట్టాను నేను. నిజాం నవాబుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల తెలంగాణా సాయుధపోరాటం ఒకపక్క, వల్లభాయి పటేల్ ఆదేశాలతో పోలీస్ యాక్షన్ మరోపక్క జరుగుతున్న రోజులవి. మా కుటుంబం కాందిశీకులుగా ఆంధ్ర ప్రాంతంలో వున్న సరిహద్దు గ్రామం గండ్రాయిలో తలదాచుకుంటున్న రోజుల్లో పుట్టాను. కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రం కూడా భారత దేశంలో విలీనం కావడంతో మా కుటుంబం సొంత గ్రామానికి తిరిగొచ్చింది. నా బాల్యం చాలావరకు అమ్మా-నాన్నల దగ్గర, సొంత వూళ్లోనే గడిచింది. అయిదో తరగతి దాకా గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నాను.

మా కుటుంబం నిప్పులమీద నీళ్లు చల్లుకుని శుద్ధి చేసుకునేటంత ఛాందస కుటుంబం. పుట్టి-పెరిగిన గ్రామ పరిసరాల భౌగోళిక-చారిత్రక నేపథ్యంలో, సాహిత్యం గురించి-మానవ విలువల గురించి, కొన్ని ప్రాథమిక పాఠాలను-మౌలికాంశాలను అనుభవంతో నేర్చుకున్నాను. కుగ్రామమైన మా వూళ్లో హైస్కూల్ చదువుకు అవకాశం లేకపోవడంతో, ఖమ్మం రికాబ్-బజార్ హైస్కూల్లో చేరాను. బహుశా, డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు సొంత ఇంటికి మారిన సంవత్సరానికి ఒక రెండేళ్ల ముందర, నేను ఖమ్మం చదువుకు వచ్చి వుండవచ్చు. వారు ఇప్పుడున్న ఆసుపత్రికి మారిన మరుసటి సంవత్సరం హెచ్.ఎస్.సీ పూర్తి చేశాను. పియుసి చదువుతుండగా, కాలేజీకి (అప్పట్లో ఎస్. ఆర్ అండ్ బి.జి.ఎన్.ఆర్ కళాశాల) ప్రతిరోజూ డాక్టర్‍గారి ఆసుపత్రి పక్కనుంచే వెళ్లే వాళ్లం. అలా వారి గురించి వినడం మొదలైంది. ఆ మాటకొస్తే, మా నాన్నగారు డాక్టర్‍గారి గురించి చాలా సార్లు చెప్పేవారు.

డిగ్రీ చదువు పూర్తైన తరువాత రెండు-మూడేళ్లు మా వూళ్లో వుండాల్సిన పరిస్థితులు కలిగాయి. ఆ మూడేళ్లు మా గ్రామంలో, వనం నరసింగరావు స్ఫూర్తితో కమ్యూనిస్ట్ రాజకీయాలలో, ఒక విధంగా చెప్పాలంటే, చాలా చురుగ్గా పాల్గొన్నాననే అనాలి. మా గ్రామ పంచాయితీ ఎన్నికలలో పోటీ చేయకుండా (నాకింకా అప్పటికి ఓటింగ్ వయసు రాలేదు), మొట్ట మొదటిసారిగా, మా గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారానికి విరుద్ధంగా, కాంగ్రేసేతర అభ్యర్థిని సర్పంచ్ చేయగలిగాం. ఆ రోజుల్లోనే చుట్టుపక్కల గ్రామాలలోని పలువురు కమ్యూనిస్ట్ నాయకులతో పరిచయాలు, వారి ద్వారా డాక్టర్‍గారిని గురించి అనేక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.

ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత, ప్రయివేట్ ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ, గతంలో కంటే కొంచెం ఎక్కువగా తీరు బడి లభించడం మొదలైంది. లోగడ కంటే ఎక్కువ సార్లు ఖమ్మం, పక్కనున్న మా గ్రామం వెళ్లి వచ్చే వీలు కలుగుతోంది. అలా రాకపోకలు సాగిస్తున్న అనేక సందర్భాలలో, డాక్టర్ గారిని కలిసే అవకాశం కూడా పలు సందర్భాలలో కలిగింది. ఆయన కలిసిన ప్రతి సందర్భంలోనూ, అనేక కొత్త విషయాలు తెలుసుకునే వీలు కలగ సాగింది. దానికి తోడు, ఖమ్మంలో కమ్యూనిస్ట్ (మార్క్సిస్టు) పార్టీ పరంగా చోటు చేసుకుంటున్న కొన్ని పరిణామాలను నిశితంగా గమనిస్తున్న నాకు, ఎక్కడో అక్కడ ఏదో ఒక లోటు కనిపించ సాగింది. తప్పొప్పులెవరివైనా, ఎందుకిలా జరుగుతుందా అని ఆందోళన చెందేవారిలో నేనూ ఒకడినైనాను. నాకెంతోకాలంగా పరిచయమున్న బంధువులను, మిత్రులను, వారు పార్టీకి చేసిన సేవలు మరిచి, బహిష్కరణకు గురిచేయడమో, వారంతట వారే పార్టీని వీడిపోవడమో గమనిస్తున్నాను. ఈ నేపధ్యంలో, ఖమ్మం జిల్లా కమ్యూనిస్ట్ రాజకీయాలపైనా, ప్రత్యేకించి డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారికి ఆ పార్టీతో అరవై దశాబ్దాల సుదీర్ఘ అనుబంధంపైనా, ఈ రెండింటికి ఏదైనా సంబంధం వుండవచ్చా అన్న అంశంపైనా ఆసక్తి కలిగింది. బాబాయ్ నరసింగరావును, ఇద్దరం కలిసి డాక్టర్ వై.ఆర్.కేగారిని, కదిలించాను.

"క్రమశిక్షణ, నిబద్ధత" లకు లోబడి అన్ని విషయాలను మాట్లాడడానికి డాక్టర్‍గారు అంగీకరించినట్లు భావించాను. ఆయన చెప్పిందంతా రికార్డు చేయడానికి డాక్టర్‍గారు అంగీకరించారు. మొదట్లో, ఏవో కొన్ని విషయాలే అనుకున్నాను. పోను-పోనూ పరిధి విస్తరించ సాగింది. పరిమిత విషయాలకంటే, ఆయన జీవిత చరిత్ర లాగా రాస్తే బాగుంటుందనిపించింది. ఆయన కూడా అంగీకరించారు. అందులో భాగంగానే సమకాలీన రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలతో పాటు డాక్టర్‍గారి అనుభవాలను, పార్టీతో ఆయన అనుబంధాన్ని గ్రంధస్థం చేస్తే మంచిదనిపించింది.

డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారు ఒక రచయితగా ఆయన అనుభవాలను నేరుగా రాయకపోయినా, వాటిని అన్వయించుకుంటూ, కొన్ని పుస్తకాలు రాశారు. ఆయన వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఉపన్యాసాల ప్రాతిపదికగా "పదం-దృక్ఫదం", "పార్లమెంటులో ఆయన చేసిన ప్రసంగాలు”, “అమెరికాలో ఆయన అనుభవాలుపుస్తక రూపంలో వచ్చాయి. వాటిలో చెప్పిన విషయాలకు "పూరక-అను పూరక" అంశాలుగా చెప్పిన మరికొన్ని ఇందులో రాయడం జరిగింది. "ఆలోచన" మకుటంతో వివిధ అంశాలపై రాసిన వ్యాసాల సంకలనం, 2008లో వచ్చింది. "ప్రజారోగ్యం -వివిధ దేశాల అనుభవాలు" పేరుతో, కేవలం ఆరోగ్యంపై రాసిన వ్యాసాల సంకలనం 2010లో వచ్చింది. అమెరికా వెళ్లిన అందరిలా కాకుండా ఆయన విభిన్న కోణంలో అక్కడున్న కొన్ని ప్రదేశాలను సందర్శించారు. కమ్యూనిస్టు అభిమానిగా, ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే మే దినోత్సవంతో అనుబంధం వున్న "హే మార్కెట్"ను చూడడానికి పనిగట్టుకుని వెళ్లారు. అక్కడ మే దినోత్సవానికి గుర్తుగా మిగిలిందేమిటో చూశారు. ప్రాణత్యాగం చేసిన కార్మికుల గుర్తుగా అక్కడే ఏమీ లేకపోగా, ఇల్లినాయిస్ రాష్ట్రాన్ని "కార్మికుల దాడి నుంచి కాపాడిన సైనికుల జ్ఞాపకార్థం" వేసిన స్మారక చిహ్నం వుండడం ఆయనను నిరాశకు గురి చేసింది. డాక్టర్‍గారు అక్కడకు వెళ్లి-వచ్చిన సంగతులను "అమెరికా వెలుగు నీడలు" పేరుతో యాత్రావర్ణన రూపంలో పుస్తకంగా రాశారు.

ఆయన అనుభవాలను చెప్పిన డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తి, తానెందుకు ఐదు పర్యాయాలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది, ఎలా ఐదు సెంట్రల్ జైళ్లను చూసింది, ఎలా తాను రాజ్యసభకు నామినేట్ కాబడింది, రాజ్యసభ సభ్యుడుగా ఏం చేసింది, ఎలా ఎంపీ నిధులను సద్వినియోగం చేసింది, ఎలా జీవితంలో ఎదిగింది, ఎలాంటి కష్ట-సుఖాలను అనుభవించింది, వైద్య విద్యను అభ్యసించినప్పుడు ఏం జరిగింది... లాంటి విషయాలెన్నో చెప్పారు.

కాకపోతే, డాక్టర్ గారు చెప్పిన విషయాలలో కొన్నిటిని నా అభిప్రాయానికి-ఆలోచనా సరళికి అన్వయించుకుంటూ పాఠకులకు అందించే ప్రయత్నమే ఇది. ఎక్కడా, ఎవరి మనోభావాలను నొప్పించాలన్న ఉద్దేశం లేదు.

"వెయ్యి పున్నములు చూసిన వాళ్లు చాలామందే వుండవచ్చు. చుట్టూ వుండే వాళ్లకు, నూరు వసంతాలను అందివ్వగలిగిన వారు మాత్రం అరుదుగా వుంటారు. అలాంటివారే ధన్యులు"

No comments:

Post a Comment