Wednesday, April 10, 2019

గుడివాడలో చదువుతున్నప్పుడు జరిగిన ముఖ్య ఘటనలు .... వైఆర్కే బాల్యం....కుటుంబ నేపధ్యం-3 : వనం జ్వాలా నరసింహారావు


గుడివాడలో చదువుతున్నప్పుడు జరిగిన ముఖ్య ఘటనలు
వైఆర్కే బాల్యం....కుటుంబ నేపధ్యం-3
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (11-04-2019)

బంధువులు:
ఊరిలో కమ్యూనిస్ట్ కార్యకర్తలుండేవారు. మిక్కిలినేని వెంకటేశ్వరరావు, కొల్లి (అంజయ్యగారి)సుబ్బారావు, జాస్తి పున్నయ్య, ఎన్.వీ.ఎస్.ప్రసాదరావు వీరిలో ముఖ్యులు. "స్వతంత్ర భారత్" అనే సైక్లో పత్రిక రహస్యంగా పంచేవారు. ఆసక్తి కొద్దీ దాచుకుని చదువుతుంటే (ఏమీ అర్థం అయ్యేది కాదు) తండ్రిగారు చూసి, "నీకవన్నీ ఎందుకు? పుస్తకాలు చదువుకో" అని మందలించేవారట. ఆ సమయంలో జిల్లా బోర్డు ఎన్నికలు వచ్చాయి. జస్టిస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య పోటీ వుండేదని, అభ్యర్థులెవరో మాత్రం గుర్తు లేదనీ అన్నారు డాక్టర్‍గారు. ఆ రోజుల్లో జస్టిస్ పార్టీ అంటే చల్లపల్లి రాజావారు. ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకుల్లో ముదునూరు గ్రామానికి చెందిన అన్నె అంజయ్యగారి పేరు చెప్పుకునేవారు. (ఆయనగారి కుమార్తే, "అన్నే రాజ్యం సిన్హా". భగత్ సింగ్ సహచరుడు విజయ్‍కుమార్ సిన్హాను వివాహం చేసుకుని రాజ్యం సిన్హా అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార పౌర సంబంధాల డైరెక్టర్‍గా పనిచేశారు). అలానే, పక్క వూరు - పెద పారుపూడిలోని మాలపల్లెకు చెందిన వేముల కూర్మయ్యగారి పేరు ప్రముఖంగా వినపడేది. (ఆయన తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ఐనా ఆయన నివాసమైన గుడిసెలో ఏ మార్పు కనిపించలేదు). ఓటింగ్‍కు రెండు పెట్టెలుండేవి. ఒకదానికి ఎర్ర కాగితం అంటించి వుండేది. అది జస్టిస్ పార్టీ రంగు. రెండో దానికి పసుపు రంగు కాగితం వుండేది. అది కాంగ్రెస్ గుర్తు. ఎక్కువమంది పసుపు రంగు కాగితం వున్న పెట్టెలోనే వేసినట్లు చెప్పుకునేవారు.

స్కూల్‍లో మంచి ఉపాధ్యాయులుండేవారు. ప్రధాన ఉపాధ్యాయులు చెన్నుంబొట్ల గోపాలరావుగారు, దింటకుర్రులోనే తాత్కాలికంగా వుండేవారట. అలాగే తెలుగు మాస్టారు, డ్రిల్లు, డ్రాయింగ్ మాస్టార్లు కూడా వుండేవారు. లెక్కలు "పొట్టి వెంకటేశ్వర్లుగారు" చెప్పేవారు. రాధాకృష్ణమూర్తిగారికి లెక్కల్లో 30-35 శాతం మించి మార్కులు ఎన్నడూ వచ్చేవి కాదట. ఆ పంతులు గారు ఆయనను, "ఏరా కమ్మ బ్రాహ్మడూ!" అని సరదాగా పిలిచేవారట. అది కోపంతో కాదు, బహుశా వేళాకోళమేమో అంటారు డాక్టరుగారు.

పక్క వూరు – ముదునూరు - గోపరాజు రామచంద్ర రావు (గోరా) గారి స్వగ్రామం. ఒకటి రెండు సార్లు ఆయన బందరు కాలేజీ నుండి డిస్మిస్ అయిన తరువాత, ఆ స్కూల్‍లో మీటింగ్ పెట్టారట.

పాఠశాలకు రెండొందల గజాల దూరంలో కాలవ గట్టు మీద, ఒక పొట్టి తాటి చెట్టుండేదట. దాని కింద కూర్చొని, కొందరు పిల్లలు, మధ్యాహ్నం పూట అన్నాలు తిని, కాలవలో చేతులు కడుక్కునేవారు. ప్రత్యేకత ఏమిటంటే, ఆ చెట్టుకు తలలో ఎన్నో మొవ్వులుండేవట. దానిని "నూరు మొవ్వుల తాడి" అనేవారు. కొన్నాళ్లకు పక్క పొలంలో ఆసామి, దానికి దైవత్వం వుందని ప్రచారం చేసి, పూజలు మొదలు పెట్టారు. జనం విరివిగా రావడం మొదలైంది. ఒక రాత్రి ఎవరో (గోరా గారి శిష్యుల పనే అని చెప్పుకునేవారట!) ఆ చెట్టును నరికేశారు.

మరొక విశేషం - స్కూల్ కు ఒకటి-రెండు మైళ్ల దూరంలో, ఒక చెట్టేదో, పగలు సగం వంఘి వుండి, రాత్రికి నిలువుగా వుండేదని, ప్రచారం సాగి, దానికి దైవత్వం ఆపాదించడం మొదలెట్టారు కొందరు. గోరాగారు దానికి శాస్త్రీయమైన కారణం చెప్పి, వరసగా కొన్నాళ్లు నీళ్లు పోయించిన తరువాత, అది ఎప్పుడూ తిన్నగా నిలబడే వుండేదని చెప్పుకునేవారట!


ఎన్.వీ.ఎస్ ప్రసాదరావును (కారణం తెలియదు) కమ్యూనిస్ట్ పార్టీ బహిష్కరిస్తే, కాంగ్రెస్‍లో చేరి, మరో ఇద్దరితో సహా (భూపతి రావు, రాజ్యం) యువజన కాంగ్రెస్ నేతలుగా - మంచి ఉపన్యాసకులుగా పేరు తెచ్చుకున్న విషయం చెప్పారు డాక్టర్‍గారు. ఆయన తరువాత కాలంలో, గోపాలరెడ్డిగారి ప్రాపకంతో, కొంతకాలం రేడియో కేంద్రంలో పనిచేసి, కొన్నాళ్లు రవీంద్రభారతి మేనేజరుగా పని చేశారట.

ఉన్నత పాఠశాల (1941-43) - గుడివాడ:
వానపాములలో ఎనిమిదో తరగతి వరకే వుంది. హైస్కూల్ చదువుకు గుడివాడ వెళ్లాలి. తండ్రి సీతారామయ్యగారు, దత్తుడుని ఒంటరిగా పంపడం ఇష్టం లేక, కాపురం గుడివాడకే మార్చారు. ’పాటిమీదకొల్లి కోటయ్య గారి ఇళ్ల కాంప్లెక్స్‍లో ఒక ఇంట్లో అద్దెకు చేరారు. కోటయ్యగారు ధరణికోట ఆశ్రమం నిర్వహిస్తూ, వేదాంతిగా పేరు తెచ్చుకున్నారు. కాని అక్కడంతా కమ్యూనిస్ట్ వాతావరణం. వారి పెద్దబ్బాయి డాక్టర్ గురునాధరావు, రెండొతను ప్రత్యగాత్మ, మూడవవాడు హేమాంబరం. (ప్రత్యగాత్మ, హేమాంబరం తరువాత సినీరంగంలో డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్నారు). అల్లుడు మల్లిఖార్జునరావు. అందరూ పార్టీ వారే! వారి మధ్యనే మూడు సంవత్సరాలు గడిపారు డాక్టర్‍గారు. గుడివాడలో చదువుతున్నప్పుడు జరిగిన రెండు-మూడు ముఖ్య ఘటనలను కూడా గుర్తు చేసుకున్నారాయన.

మొదటిది, 1942, 8 ఆగస్టున మొదలైన క్విట్ ఇండియా ఉద్యమం. పట్టణమంతా గొడవలు - అల్లర్లు జరుగుతుండేవి. వీళ్లను బయటకు వెళ్లకుండా ఇంట్లో కట్టడి చేశారు పెద్ద వాళ్లు. అప్పుడు గుడివాడలో కాంగ్రెస్ నాయకులుగా వినిపించే పేర్లలో ముఖ్యమైనవి లాయర్ కేతవరపు నర్సింహంగారిది, ఫొటో స్టూడియో స్వామి (తరువాత ఖమ్మంలో "మెట్రో స్టూడియో"గా అభివృద్ధి చేసుకున్నారు)గారిది, హోమియో డాక్టర్ గుర్రాజు (గుడివాడ హోమియో కళాశాల స్థాపకులు) గారిది. రెండో సంఘటన, రవీంద్రనాథ్ టాగోర్ మరణం ( ఆగస్ట్ 7, 1941) నాడు తమ హైస్కూల్ లో జరిగిన సంతాప సభ. ఉపాధ్యాయులు కొందరు ఆయనను గురించి చాలా గొప్పగా చెప్పడంతో, టాగోర్ రచనలను ఎప్పుడైనా చదవాలన్న ఆలోచన తన మనసులో పడిందంటారు. మూడవది, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరిగారి గజారోహణ ఉత్సవం. వారి రచనలను విరివిగా అందుబాటులోకి తెచ్చారు. రాధాకృష్ణమూర్తిగారి తండ్రి ఆయన అభిమాని కావడంతో, ఆ పుస్తకాలన్నీ తమ ఇంట్లో వుండేవట. అప్పట్లో కొన్ని, తరువాత చాలా వరకు చదివినట్లు చెప్పారు డాక్టర్‍గారు (సశేషం).

No comments:

Post a Comment