Tuesday, April 9, 2019

పెంపుడు తండ్రి దగ్గర నేర్చుకున్న చదువు, సంస్కారం ..... బాల్యం, కుటుంబ నేపధ్యం-2 .... అనుభవాలే అధ్యాయాలు


బాల్యం, కుటుంబ నేపధ్యం-2
పెంపుడు తండ్రి దగ్గర నేర్చుకున్న చదువు, సంస్కారం
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు 
విజయక్రాంతి దినపత్రిక (10-04-2019)
జమీ దింటకుర్రులో చిన్న రామాలయం వుంది. అందుకేనేమో, ఆ వూళ్లో చాలా మంది రామయ్యలున్నారు. వాళ్లను పిలవాల్సి వచ్చినప్పుడు, పేరు ముందర గుర్తుగా, ఇంటి పేరో-తండ్రి పేరో-అలవాట్లో... ఏదో ఒకటి కలిపేవారు. డాక్టర్‍గారిది మధ్య తరగతి కుటుంబం. అన్నదమ్ములు ఎనిమిది మంది, అక్కచెల్లెళ్లు ముగ్గురు. వారికున్న చిన్న మామిడి తోట, ఏడెనిమిది ఎకరాల మాగాణిపై వచ్చే ఆదాయంపైనే కుటుంబ జీవనాధారం. తల్లి పెద్దమ్మ అచ్చమ్మగారు-భర్త సీతారామయ్యగారు, రాధాకృష్ణమూర్తిని తొమ్మిది (9) మాసాల పిల్లవాడుగా దత్తత తీసుకుని పెంచుకున్నారు. ఆమెను అచ్చమ్మగారని కొందరు, లక్ష్మీ నర్సమ్మగారని మరి కొందరు సంబోధించే వారు. వారిది కూడా అదే గ్రామం. వారింటి పేరు "యలమంచిలి" కావడంతో, డాక్టర్‍గారి పేరు యలమంచిలి రాధాకృష్ణమూర్తి అయింది. సీతారామయ్య దంపతులు ఆయనను కన్న బిడ్డకంటే ఎక్కువగా చూసుకుని, పెంచి పెద్ద చేశారు. పెంచుకున్న వారిని అమ్మ-నాన్నని పిలవడం అలవాటై, సొంత తలిదండ్రులను చిన్నమ్మ-చిన్నాన్న అని పిలిచే వారు.

జన్మనిచ్చిన తండ్రికి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం మెండుగా వుండేది. ముక్కు సూటిగా మాట్లాడే మనస్తత్వం. పొదుపరి. బంధు ప్రీతి-దాతృత్వ హృదయం కలవాడు. స్వయంకృషి ఆయన నినాదం. రైతుగా స్వయానా కృషీవలుడైన కొల్లి రామయ్యగారు ఆ రోజుల్లోనే వరి నారు మడిని వాణిజ్యపరంగా మార్కెట్ చేసిన వ్యవసాయదారుడు. సమీప బంధువులందరూ ఆయనను "పెద్ద మనిషి" గా పిలిచే వారు. తన ఇంటికి వచ్చిన వారందరి ముందు తన పని తాను చేసుకుంటూ, వారిని కూడా పని చేయమని పురమాయించేవాడు. అదొక తరహా క్రమశిక్షణకు ఆయన పర్యాయపదం అనాలి. "రామయ్యగారు పందిరి గుంజకు కూడా పని చెబుతాడు" అనేవారు! సొంత తలితండ్రులిద్దరికీ భూదేవికున్న సహనం-ఓర్పు వుండేది.

దత్తత తీసుకున్న తండ్రి మరో రకమైన గొప్పవాడు. అయన తరహా, శైలి నిరుపమానమైందనాలి. బాగా చదువుకున్న వ్యక్తి. పండితుడు. స్వచ్చమైన భాష ఆయన సొంతం. స్వామి దయానంద సరస్వతి సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడైనారు. ఆర్య సమాజం ప్రభావం కూడా అయన మీద పడింది. త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం వుంది. "స్వసంఘ పౌరోహిత్యం" అలవరచుకుని, షోడశ కర్మలతో సహా, పౌరోహిత్యం చేసేవారాయన. బ్రాహ్మణ వేషధారణతో, కమ్మ బ్రాహ్మణుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయనతో పౌరోహిత్యం చేయించుకోవడానికి ఎక్కడెక్కడివారో తీసుకెళ్లేవారు. ఒక అధ్యాపకుడుగా పక్కనున్న వేంట్రప్రగడ గ్రామంలో, ఘంటశాల గ్రామంలో చాలామందికి వేద పాఠాలు నేర్పేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య లాంటి రాజకీయ మిత్రులు, గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారి లాంటి సాహితీ మితృలతో పరిచయాలుండేవి. ఘంటసాలలోని శివాలయంలో అర్చకత్వం కూడా రెండు సంవత్సరాల పాటు చేశారు. ఆయన చనిపోయేంతవరకు ఘంటసాల గ్రామంతో, గ్రామస్తులతో సంబంధాలు పెట్టుకున్నారు.


ఆ విధంగా రాధాకృష్ణమూర్తి చదువు-సంస్కారం పెంపకపు తండ్రి దగ్గర నేర్చుకుంటే, శారీరక కష్టం చేయడం, వ్యవసాయం పనులు చేయడం సొంత తండ్రి దగ్గర నేర్చుకున్నారు. సమాజంలో ఆయన ఉన్నత స్థితికి చేరుకోవడానికి, తలిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు ఎంతో సహాయం చేశారంటూ, ఘంటసాలలోని లక్ష్మయ్య మాస్టారును జ్ఞప్తికి తెచ్చుకున్నారు. ఆయన ప్రేమాభిమానాలను కూడా గుర్తుచేసుకున్నారు. దయాకరరావు, వెంకటేశ్వర్లుగార్లు తమతో నాటకాలు వేయించిన విషయం గుర్తు చేసుకున్నారు. చింతామణిలో చిన్ని కృష్ణుడు వేషం, బొబ్బిలి యుద్ధంలో రంగారావు కుమారుడు వేషం వేసారాయన చిన్నతనంలో . పెంచిన తండ్రికి చదువు విలువ బాగా తెలుసు. అందుకే రాధాకృష్ణమూర్తిని బాగా చదివించారు. ఇంగ్లీష్ విద్యతో పాటు భారతీయ ప్రాచీన గ్రంధాలలోని అంశాలను నేర్పించారు. బాల్యంలో గుండెలమీద పడుకోబెట్టుకుని, సుమతీ శతకంతో అనేక శతకాలను, మంత్ర పుష్పాన్ని కంఠతా పాఠం చేయించారు. పుస్తక పఠనం అలవాటు ఆయన చలవే. చిన్నతనంలోనే గోరా రచించిన "దేవుడు లేడు", త్రిపురనేని రాసిన "శంభుక వధ", "సూత పురాణం" లాంటివి చదవ గలిగారు.

విద్య:
వై.ఆర్.కె మూడు-నాలుగు తరగతుల వరకు ఘంటసాలలో పూర్తి చేసి, వానపాములలో మాధ్యమిక విద్యనభ్యసించారు. శెలవుల్లో, తీరిక సమయాల్లో సొంత తండ్రి పురమాయించుటతో వ్యవసాయ పనులు చేయడంలో ఆయనకు తోడ్పడే వారు. నాట్లు వేయడం, కోతలు కోయడం, ఎరువులు చల్లడం, నారు మళ్లు తడపడం, పశువులకు మేత వేయడం అలవాటైంది. కుప్పనూర్పుళ్లకు వెళ్లేవారు. ఎండాకాలం తాటి ముంజలు తినడం సరదాగా వుండేదని, తాటికాయ పండ్లు వేరుకుని, ఇంటికి తెచ్చుకుని వుడకబెట్టుకుని తింటుంటే మహదానందంగా వుండేదని రాధాకృష్ణమూర్తిగారు చెప్పారు. కుటుంబ వ్యవసాయ కార్మిక పనుల్లో చేదోడుగా-వాదోడుగా వుండడం ఆయనకు చాలా ఇష్టంగా వుండేది. వాస్తవానికి, అందులో భాగంగా, వరి పొలానికి "యాతాంతో నీళ్లు తోడి పారిస్తుంటే" తనకు మెడికల్ కాలేజీలో సీటొచ్చిన సంగతి తెలిసిందని గర్వంగా తెలిపారాయన.

జన్మస్థలమైన జమీదింటకుర్రు నుండి, రెండు మైళ్ల దూరంలో ఉండే ఎస్.ఆర్.ఆర్. మిడిల్ స్కూల్లోనే 5 నుండి 8 తరగతుల వరకు చదువు సాగింది.  ఆ పాఠశాల చుట్టుపక్కల 4-5 గ్రామాల నుండి (పెద పారుపుడి, దింటకుర్రు, వానపాముల, వెంట్రప్రగడ, అప్పికట్ల, ముదునూరు) పిల్లలు వస్తుండేవారు. మంచి స్కూల్ అని పేరుండేది. పగలు స్కూల్, సాయంకాలం (శెలవుల్లో రోజంతా) పొలం పని. రాత్రిళ్లు కిరసనాయిలు లాంతరుతో చదువు. ట్యూషన్లు అంటూ లేవుకాని, ఆ వూరిలోనే వుండే, జాస్తి పున్నయ్య గారింటికి వెళ్ళి ఇంకా మరికొందరితోపాటు చదువు చెప్పించుకునేవారు. ఆయన అప్పటికే స్కూల్ ఫైనల్ పాసయ్యారు. (సశేషం)

No comments:

Post a Comment