Saturday, April 27, 2019

రావణుడిని అడ్డుకున్న జటాయువు .....శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-58 : వనం జ్వాలా నరసింహారావు


రావణుడిని అడ్డుకున్న జటాయువు
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-58
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (28-04-2019)
         రామలక్ష్మణులను తలచుకుంటూ ఏడుస్తున్న సీతాదేవికి, ఒక పెద్ద చెట్టుమీద వున్న గద్దరేడు జటాయువు కనిపించింది. రామవియోగ దుఃఖంతో, రామచంద్రమూర్తికి ఏమైందో అన్న భయంతో, బాధ పడ్తూ వున్న సీత పెద్ద గొంతుతో గట్టిగా జటాయువును పిలిచింది. పిలుస్తూ...”తండ్రీ! జటాయూ! ఇదిగో చూడు. ఈ పాపాత్ముడు రావణుడు క్రూరకార్యం తలపెట్టి, నేను ఏడుస్తున్నా వదలక, దయాహీనుడై దిక్కులేనిదానిలాగా నన్ను తీసుకుపోతున్నాడు. వీడు చాలా బలవంతుడు. విజయాలతో ప్రసిద్ధిగాంచినవాడు. దయాదాక్షిణ్యం లేనివాడు. నువ్వు వాడిని జయించడం సాధ్యం కాదు. ఎందుకంటే, వీడు సాయుధుడు. నీవు నిరాయుధడవు. పాపపు మనస్సుకలవాడు కాబట్టి నిరాయుధుడిని కొత్తకూడదన్న ధర్మజ్ఞానం లేనివాడు. అన్నా! తండ్రీ! జటాయువా! పాపాత్ముడైన ఈ రాక్షసుడు నన్నీవిధంగా బలవంతంగా పట్టుకునిపోతున్నాడు. యుద్ధం చేయవద్డంటివి కదా? మరేం చేయమంటావా? సందేహం వద్దు. ఇప్పుడే శీఘ్రంగా పోయి, నా పరిస్థితి రామలక్ష్మణులకు చెప్పు. మహాత్మా! ఇంతమాత్రం సహాయం చేసి ఈ దీనురాలిని రక్షించు”. అంటుంది సీతాదేవి.

         (జటాయువు దాస్య విధానం తెలుసుకోవాలి. స్వామికార్యం ప్రతిఫలాపేక్ష కోరక నిబద్ధతతో చేసేవాడు దాసుడు. దాసుడికి స్వామికార్యంలో నీచామనేది తెలియదు. ప్రాణభయం వుండదు. సిగ్గుపడడు. ఈ పని చేయగలనా? చేయలేనా? నా శక్తి ఏంటి? శక్తికి మించిందా? అని ఆలోచించడు. యధాశక్తి పనిచేయడం తన వంతు అనుకుంటాడు. జయాపజయాలు భగవంతుడి మీద భారం వేసి వుంటాడు. ఇలాంటివాడు కాబట్టే, ముసలివాడైనా, నిరాయుధుడైనా, అసహాయుడైనా, జటాయువు తన ప్రాణం ఇచ్చి రామసేవ చేశాడు. కాబట్టే మోక్షఫలం లభించింది. అంటే, మోక్షమనేది కేవలం మనుష్యులకే కాకుండా భూతకోటికందరికీ లభిస్తుంది.

         అలాగే, ఎంత కష్టాలలో వున్నా ధర్మాత్ములు ధర్మ బుద్ధి వదలరు. అధర్మ మార్గాన నడవరు. యుద్ధం చేసి తనను విడిపించమని సీత జటాయువును కోరలేదు. అది ఆపాయమని ఆమెకు తెలుసు. రామలక్ష్మణులకు తన సంగతి చెప్పమని మాత్రమే అడిగింది.   ఆమె కోరిక నెరవేర్చాడు కాని తక్షణమే వెళ్లలేదు. ఎందుకంటే, తానూ వాళ్ల దగ్గరకు పోయి తీసుకొచ్చేలోపల రావణుడు లంకకు చేరుతాడు. ఏం ప్రయోజనం? అనుకున్నాడు. కొంతసేపైనా వాడిని ఆపుచేస్తే మంచిదని, ఇంతలో రామలక్ష్మణులు రావచ్చని భావించి యుద్ధానికి దిగుతాడు).


         కొంచెం-కొంచెం తూగుతున్న జటాయువు, సీత చేస్తున్న అరుపులు వింటాడు. మహాకాయుడైన రావణుడిని, వాడి అంకంలో వున్నా సన్నని సీతను చూసి, వాడికి అడ్డంగా పోయి, “రావణా! నేనెవరని అనుకుంటున్నావో? శాశ్వతమైన, శ్రేష్టమైన భగవద్దాస్యం అనే ధర్మకార్యం అంటే ప్రీతికలవాడిని. సత్యస్వరూపుడైన భగవంతుడంటే ధ్యానరూపకమైన బుద్ధికలవాడిని. కాబట్టి అలాంటి భగవంతుడి భార్యను నువ్వు అపహరించుకుని పోతుంటే, నా దాస్యధర్మం నిర్వహించడానికి వచ్చాను. గద్దలకు రాజును. పక్షీ...నువ్వేమి చేయగలవు? అంటావేమో? మహాబలుడైన నాపేరు జటాయువు. నేను జీవించి వుండగా, నువ్వు ఆమెను అపహరించలేవు”.

         “ఓరీ! నా సంగతి చెప్పాను. ఇక శ్రీరామచంద్రమూర్తి స్వరూప స్వభావాలను చెప్తా విను. రాముడంటే ఏమనుకుంటున్నావో? సమస్త ప్రపంచంలోని భూతాలకు మేలు కోరేవాడాయన. కాబట్టి నీ మేలూ కోరేవాడే! అలాంటి నీ మేలు కోరేవాడికి కీడు చేయవచ్చా? చేస్తే నువ్వు కృతఘ్నుడివి కావా? ప్రపంచ క్షేమం కోరేవాడు భగవంతుడు కదా! అంటావేమో? ఆ భగవంతుడే దశరథకుమారుడనే పేరుతొ కనపడుతున్నాడు. మేలు చేయాలని వుంటే చాలా అంటావేమో? ఆ ఆలోచన కార్యరూపంలో పెట్టగల బుద్ధిబలం కలవాడు. ఆయనలోనే సుత్రామ, వరుణ శబ్దాలు అన్వయిస్తాయి. ఇంద్రుడు తూర్పుకు, వరుణుడు పడమరకు రాజులు కాగా, ఈయన సమస్త ప్రపంచానికి రాజై వున్నాడు. ఆయన దేవతలకే రాజు కాదు...నీకు కూడా ఆయనే ప్రభువు”.

         “అంత ప్రసిద్ధికెక్కి, అంతటి మహిమకల జగన్నాథుడి భార్యను, మహాసాధ్విని, జగన్మాతను, అపహరించడం నీకు సమంజసమేనా? ఆమె అంటే నీకు అలాంటి గొప్ప అభిప్రాయం లేదంటావా? నువ్వు రాజువు కదా? రాజు ధర్మ పద్ధతిలో నడవాలికకదా? అలాంటప్పుడు రాజు పరస్త్రీని, ఎలాంటిదైనా అపహరించవచ్చా? రాజు భార్య తల్లికదా? తల్లిని కాపాడినట్లే, రాజభార్యలను కాపాడాలికదా? ఇతర స్త్రీలను అపహరిస్తే ఏమైతుంది అంటావేమో? పరుల సొత్తు కొంచెమైనా అపహరించడం నీచకార్యం అయినప్పుడు, పరుల భార్యలను అపహరించడం ఎంత నీచమో ఆలోచించావా? ఇలాంటి నీచకార్యం నీకు విశేష హాని కలిగిస్తుందని ఆలోచించావా? పరుల భార్యలను కోరడం వల్ల నీకు ఆయుక్షయం అని తెలియదా? నువ్వు ఆమెను తీసుకునిపోవడం నీకు మంచిది కాదు. వదిలి పెట్టు. ఓరీ! క్రూరుడా! నీ భార్యను ఎలా ఇతరులు తాకకూడదో, ఇతరుల భార్యను కూడా తాకరాదని తెల్సుకో”.

No comments:

Post a Comment