Saturday, April 20, 2019

సీతను బలాత్కారంగా ఎత్తుకుని పోయిన రావణుడు, ఏడ్చిన సీతాదేవి ...... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-57 : వనం జ్వాలా నరసింహారావు


సీతను బలాత్కారంగా ఎత్తుకుని పోయిన రావణుడు, ఏడ్చిన సీతాదేవి
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-57
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (21-04-2019)
రావణుడికి కఠినంగా జావబిస్తూ సీత, “ఏమిరా! దేవజాతులైన యక్షులకు, గుహ్యకులకు నాతుడై సర్వ భూతవంధ్యుడైన కుబేరుడి తమ్ముడివై, ఇలాంటి పాపపు పని చేయదల్చావు. ఛీ, సిగ్గులేనివాడా! ఇంద్రియాలను జయించలేని నిన్ను రాజుగా కలవారైనందున నీ మూలాన్న రాక్షసులందరూ చస్తారు. ఓరీ! ఇంద్రుడి భార్య శచీదేవిని అపహరించినా ఎదో ఒక విధంగా బతికితే బతకవచ్చేమో కాని రామచంద్రమూర్తి భార్యను అపహరించి మళ్లీ బతకడం నీకు సాధ్యమా? (చెప్పిన మాటే మళ్లీ-మళ్లీ చెప్తూ సీత) ఓరీ! చెడ్డ మనస్సు కలవాడా! ఇంద్రుడి భార్యని హరించినా బతకవచ్చేమో కాని రామచంద్రుడి భార్యనైన నన్ను నీచపు మాటలు అనడం వల్ల నువ్వు అమృతం తాగినా మోక్షం రాదు. ఇక హరిస్తే ఏమవుతావో ఆలోచించు. మృత్యువు నుండి నీకు విడుదల లేదు” అన్నది. 

         సీతాదేవి ఇలా కఠినంగా రావణుడిని నిందించగానే రావణుడు కోపంతో శరీరం తెలియకుండా, భుజాలు ఎగురవేస్తూ అన్నడిలా. “బుద్ధిలేనిదానా! నా పరాక్రమం చెప్తా విను. నేను ఆకాశంలో నిలబడి భూమిని రెండు చేతులతో పైకి ఎత్తమంటావా? మృత్యుదేవత మొర్రో అని ఏడుస్తూ వుండేలా యుద్ధంలో మొట్టమంటావా? హిమవత్పర్వతాన్ని బద్దలయ్యేట్లు కొట్టమంటావా? సూర్యుడిని నేలమీదికి తోయమంటావా? సముద్రంలోని నీళ్లన్నీ తాగమంటావా? ఓసీ! మూఢురాలా! కోరిన రూపాన్ని దరించగలిగి, మన్మథాకారం కల నన్ను, సర్వ సుఖాలను కలిగించే నన్ను, నాథుడిని, నా నిజ స్వరూపం చూడు” అని అంటూ సీతను భయపెట్టడానికి తన నిజ స్వరూపాన్ని చూపించాడు.

         దొంగ సన్న్యాసి వేషాన్ని వదిలి ఆ దుష్టుడు పదితలల, ప్రళయకాలంలో సూర్యాగ్నిలాగా మితిమించిన తేజం కల, బంగారు కుండలాల, కోపంతో కూడిన, నల్లటి మేఘంతో సమానమైన, విల్లు-బాణాలు కల కాలుడితో సమానమైన తన శరీరాన్ని చూపించాడు. ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి కళ్ళతో, ఎండాకాలంలోని సూర్య తేజస్సు వేడిమితో, విజృంభించి, కఠినమైన మాటలతో రావణుడు సీతాదేవితో ఇలా అన్నాడు.

         “వినవే సీతా నా మాట! నీ మనస్సులో నీ యోగ్యతకు సరిపోయే భర్తను, ముల్లోకాలలో ప్రసిద్ధికెక్కిన వాడిని కావాలనుకుంటున్నావా? కళ్యాణీ నన్ను చూడు. నేను అలాంటి పొగడ్త కలవాడిని. నీమీద ప్రేమ వున్నవాడిని. నీకిష్టం కాని పని ఎన్నడూ చేయను. నామాట విని ఆ మనుష్యుడిని మరిచిపోయి దనుజుడనైన నన్ను కూడి నాకు శుభం కలిగించు. ఓసీ! బుద్ధిలేనిదానా! నువ్వు తెలివికలదానివనుకుంటున్నావు కాని నీకు తెలివేలేదు. నీకు తెలివే వుంటే, ఒక ఆడదాని మాట ప్రకారం, రాజ్యాన్ని, స్నేహితులను, బంధువులను, అందరినీ వదిలి, క్రూర సర్పాలు, ఏనుగులు, మృగాలు, రాక్షసులు సంచరించే అడవిలో తిరుగుతూ, శత్రువులను ఎదిరించి రాజ్యాన్ని సంపాదించుకునే ధైర్యంలేని దరిద్రుడిని ఎలా మొహిస్తావు? ఏం గుణాలు చూసి మెచ్చావే?”. ఇలా  అని అంటూ రావణాసురుడు, అయ్యో! వీడు చెడిపోతున్నాడే? అని స్నేహభావంతో మంచిమాటలు చెప్తున్న సీతను కామంతో పరవశుడై, పట్టుకున్నాడు.


రావణుడు, ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, శీఘ్రంగా పట్టుకుని, తన మాయారథం అక్కడికి రాగానే, ఆ క్రూరుడు భయంకరమైన బెదిరించే మాటలతో బెదిరించి, బలాత్కారంగా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, రథంలో వేశాడు. ఆ సమయంలో యముడితో సమానమై, తీక్షణంగా ప్రకాశించే కోరలతో, పర్వతమంత శరీరంగల ఆ రాక్షసుడిని చూసి వనదేవతలు భయంతో  అడవుల్లోకి పరుగెత్తారు. ఈ విధంగా ఆకాశంలో శీఘ్రంగా పోయే రథం మీద కడుబాధతో సీతాదేవి పిచ్చిపట్టినట్లు భ్రమచెందిన దానిలాగా ఏడ్చింది.

(సీతాదేవిని రావణుడు ప్రత్యక్షంగా తాకాడా? లేదా? అనే విషయం చర్చనీయాంశం. వాల్మీకి రామాయణంలో రావణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. రామచంద్రమూర్తి మాయామృగం వెంట పోయినప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్రమంలో వుంచాడనీ, రావణుడు తాకింది ఆమెనేననీ కొందరి వాదన. సీతాదేవి చుట్టూ గిరిగీసి, దానిని సీత దాటిపోవలదని లక్ష్మణుడు, రాముడికొరకై పోయేటప్పుడు చెప్పినట్లు మరికొందరి వాదన. రావణుడు పెళ్లను తీసుకుపోయాడే కాని సీతను తాకలేదని వారంటారు. రావణుడు అపహరించినది మాయా సీత అనడానికి వాల్మీకి రామాయణంలో ప్రమాణం లేదు).

         రావణుడు ఎత్తుకుపోతున్న సీత రామలక్ష్మణులను తలచుకుంటూ ఏడ్చిందిలా. “అయ్యో! లక్ష్మణా! పెద్దల పాదసేవ చేయడంలో ఆసక్తి వున్నవాడా! మీరు ఖరాదులను చంపాడన్న కోపంతో ఈ పాపాత్ముడు బలవంతంగా నన్ను దొంగిలించి ఎవరి అడ్డం లేకుండా పోతున్నాడు. మహా భుజబలం కలవాడా! ఇది నీకు తెలియదా? ఆశ్రిత రక్షణార్థివైన రామచంద్రా! నీ ఆశ్రితురాలైన నన్ను వీడు ధర్మం తప్పి తీసుకుపోవడం చూడలేదా? రామా! న్యాయాన్ని ధిక్కరించి తిరిగే దుష్టులను శిక్షించే నువ్వు నన్ను దొంగిలించిన ఈ దుష్టుడిని ఎందుకు వదుల్తున్నావు? పాపాత్ముడా! రావణా! నీ పాపఫలం వెంటనే అనుభవానికి రావు. కొంతకాలానికి అవి పక్వాలై ఫలితమిస్తాయి. నువ్వు చేసే పాపాని ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. నీకు చెడిపోయే కాలం దాపరించినందున రావణా! ఇలాంటి పాపకార్యం చేయడానికి వచ్చావు. కాబట్టి శత్రువులకు మృత్యువైన శ్రీరాముడి చేతిలో నీ ప్రాణాలు పోతాయి”.

         “అయ్యో! కైక మాకు ఇలాంటి ఆపద రావాలని కోరికదా, మమ్మల్ని అడవులకు పంపింది? ధర్మాత్ముడైన రాముడి భార్యను నన్ను, ఈ నీచుడు అపహరించడం వల్ల కైక కోరిక నెరవేరింది కాబట్టి, ఇక ఆమె తనకు కావాల్సిన వాళ్ళతో పూర్తిగా సుఖపడుతుంది. అడవిలోని పూలతో, పండ్లతో నిండివున్న వృక్ష సమూహాల్లారా! తీగలారా! ఆకాశాన సంచరించే వాళ్లూ, మీరు రాముడిని చూసినప్పుడు సీతను రావణుడు అపహరించాడని దయతో చెప్పండి. మాల్యవంత పర్వతమా! దేవా విరోధి అయిన రావణుడు నీ భార్యను అపహరించి తీసుకుని పోతున్నాడని రాముడికి చెప్పు. గోదావరీ నదీ! నీకు దండం..దండం. కోదండ ధరుడైన రాముడితో నీ భార్యను రావణుడు అపహరించాడని చెప్పు. అడవిలోని చెట్లమీద వుండే దేవతా సమూహాల్లారా! దండకలో నివసించే నానా విధమైన పక్షినాయకులారా! మృగ నాయకులారా! మీకు నమస్కారం. నామీద దయవుంచి శ్రీరాముడి దగ్గరకు పోయి నాగతి ఇదీ అని చెప్పండి. మీకు దయ వుంటే త్వరగా చెప్పండి. ఓ పర్వతాల్లారా! తన ప్రాణం కంటే ఎక్కువైనా సీతను రావణుడు హరించాడని, రక్షించమని శ్రీరాముడికి చెప్పండి. పర్వతాల్లారా! నామీద దయవుంచి ఈ మాత్రం మాట సహాయం చేస్తే, ఆ తరువాత నేను స్వర్గంలో వున్నా, యమలోకంలో వున్నా, రామచంద్రమూర్తి నన్ను విడిపిస్తాడు”.

No comments:

Post a Comment