Sunday, April 7, 2019

మిత్రులకు, శత్రువులకు కూడా ప్రీతిపాత్రుడైన వైఆర్కే ...... అనుభవాలే అధ్యాయాలు (జీవన యాన) పుస్తక పరిచయం


మిత్రులకు, శత్రువులకు కూడా ప్రీతిపాత్రుడైన వైఆర్కే
అనుభవాలే అధ్యాయాలు (జీవన యాన) పుస్తక పరిచయం
ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (08-04-2019) 
మనదేశంలో స్థానిక చరిత్రలకు ప్రాధాన్యత చాలా తక్కువ. సమకాలీన సమాచారం గురించి పత్రికలలో చదవడం, రేడియో వినడం, టెలివిజన్‌లో చూడడం తప్ప, గ్రంధస్థం ఐన ఆనవాళ్లు చాలా తక్కువ. స్వాతంత్ర్యోద్యమ కాలంలో పలువురు నాయకులు తమ ఆత్మకథలను, స్వీయచరిత్రలను రాసుకున్నారు. అవన్నీ ఉద్యమ కాలానికి సంబంధించినవే. ఆ విధంగా, స్వాతంత్ర్యోద్యమాన్ని అవగాహన చేసుకోవడానికి, ఆత్మకథలు-స్వీయచరిత్రలూ లభ్యమవుతాయి. కాని, స్వాతంత్ర్యం వచ్చాక, పాత తరంవారు తప్ప, కొత్తగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన వారెవ్వరూ స్వీయచరిత్రలు రాయడానికి సాహసించలేదు. ఎవరైనా ఒకరిద్దరు రాసినా, స్వోత్కర్షలు-తమ గొప్పదనం చెప్పుకోవడానికి మాత్రమే ఉపయోగించారు. కాని, సమకాలీన సమాజంలో మార్పులు-చేర్పులు, పార్టీల కుటిల రాజకీయాలు, తెర వెనుక భాగోతాలు పెద్దగా వెలుగు చూడలేదు. ఈనాటి తరం యువకులకు సమాజం అంటే సినిమాలు, టీవీలు, సెల్‌ఫోన్లే గాని నడుస్తున్న రోజులను సద్వినియోగం చేసుకుందామన్న ఆలోచనకు అంతగా ప్రాధాన్యం లేదు. అందుకు తగ్గట్టుగా తెలుగులో పుస్తకాలు రావడంలేదు. సామాజిక శాస్త్ర అధ్యాపకుడిగా, పరిశీలకుడిగా ఇది నా ఆలోచన.

ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రజలకు చిరపరిచితులు, దాదాపు ఆరు దశాబ్దాలుగా జిల్లా సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఆరోగ్య-వైద్య రంగాలను నిశ్శబ్దంగా-నిశితంగా గమనిస్తున్న డాక్టర్ యలమంచిలి రాధాకృష్ణమూర్తిగారు తాను అనుభవించి చూసిన విషయాలను గ్రంధస్థం చేయడం చాలా ముదావహమైన విషయం. ఆయనను అందరూ పూర్తిపేరుతో పిలవడం చాలా తక్కువ. డాక్టర్‍గారుగా, వైఆర్‍కెగానే పరిచయం. అయితే ఇది ఆయనగారు స్వంతంగా రాసిన కథనం కాదు. ఆయన స్వయంగా మంచి వచన రచయితే. ఐనా ఎందుకో గ్రంధస్థం చేయడానికి ప్రయత్నం చేయలేదు. తన జీవితం గ్రంధస్థం చేసి, ఇతరులతో చదివించేటంత గొప్పదేమీకాదని ఆయన అభిప్రాయం. చివరకు జ్వాలా ద్వారా తాను గడిపిన, చూసిన, అనుభవించిన వాటిని గ్రంధస్థం చేయ సంకల్పించడం భావితరాల వారికి సామాజిక స్పృహ కలిగించడానికి దోహదపడేవిధంగా వుంది. స్వంతంగా రాస్తే స్వీయచరిత్ర-ఆత్మకథ అంటాం. తాను చెప్పింది చెప్పినట్లుగా గ్రంధస్థం చేయడం సమకాలీన సామాజిక, రాజకీయరంగాల అధ్యయనానికి బాగా ఉపకరిస్తుందనాలి. ఆంగ్ల సాహిత్యంలో ఉద్దండ పండితుడైన డాక్టర్ జాన్సన్ జీవితచరిత్రను తు. చ. తప్పకుండా గ్రంధస్థం చేసి ప్రపంచానికి తెలియచేసిన వ్యక్తి బాస్వెల్. ఒకరకంగా చెప్పాలంటే, ఓపికగా విని, అక్షర రూపం ఇచ్చి, డాక్టర్‌గారితో చదివించి, చర్చించి, మార్పులు-చేర్పులు చేసి, వారి అంగీకారంతో తుది రూపం ఇచ్చి, ఇలా పుస్తకంగా వెలువడుతున్నది-మనముందుకు వస్తోంది. జ్వాలా నిమిత్తమాత్రుడు. అసలు కథానాయకుడు డాక్టర్‌గారు. వారు చెప్పిన చరిత్రను మనందరం చదువుకోడానికి వీలుగా, డాక్టర్‍గారి వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా అంచనావేసే విధంగా గ్రంథరూపం సంతరించుకుంది.


డాక్టర్‌గారు పుట్టి పెరిగింది ఖమ్మం కాదు. కాని ఆయన జీవనయానమంతా ఖమ్మంలోనే గడిచింది. మిత్రులకు, శత్రువులకు కూడా ప్రీతిపాత్రుడయ్యారు. పుట్టిన వూళ్లో మొదలైన విద్యాభ్యాసం వైజాగ్ మెడికల్ కాలేజీలో వైద్యుడిగా తీర్చిదిద్దింది. చిన్నతనంలో గడిపిన గ్రామాన్ని, చదువు చెప్పిన గురువులను, తీర్చిదిద్దిన తల్లిదండ్రులను(జన్మనిచ్చిన, దత్తత తీసుకున్న), వారిద్వారా సంక్రమించిన వారసత్వ సువాసనలను పుస్తకంలో సవివరంగా ప్రస్తావించడం డాక్టర్‍గారి విజ్ఞతకు నిదర్శనం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, భూదేవికి ఉన్న సహనం-ఓర్పు, మెండుగా సంతరించుకున్న వ్యక్తి డాక్టర్‌గారు. దత్తత తీసుకున్న తండ్రి జ్ఞాన తృష్ణ, జ్ఞానసంపద, సంస్కరణాభిలాష ఆయన అలవోకగా అలవరచుకున్నారు.

వృత్తి పరంగా అంతగా పోటీలేని ఖమ్మం పట్టణానికి వచ్చి వైద్య వృత్తిని ఎంచుకోవడం యాదృచ్ఛికం కాదు. వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా వున్న ఖమ్మం అనువైందన్న బంధుమిత్రుల ప్రోత్సాహంతో ఆయనకు ఖమ్మం స్వగ్రామం ఐంది. ఆయనలోని జ్ఞాన తృష్ణ, వైద్య వృత్తిలో తరతమ భేదాలు లేకుండా చేసింది. అదే ఆయనకు విజయం చేకూర్చింది. ఆయన వ్యక్తిత్వం ఆయనకు తరగని సంపదైంది. పర్యవసానంగా, ఎలాంటి అరమరికలు లేకుండా, రోగులు డాక్టర్‍గారి వైద్యానికి ఆకర్షితులయ్యారు. ఆయన వ్యక్తిత్వంలో అల్మరాలోని అరలులా వివిధ భాండారాలున్నాయి. వృత్తిరీత్యా డాక్టర్. వైద్యం విషయంలో రోగుల పాలిటి అజాతశత్రువు. మానవత్వం-మానవ విలువలపట్ల అపారమైన గౌరవం వున్నాయి. ఒకవైపు వైద్య వృత్తిలో నైపుణ్యంకొరకు తహతహలాడడంతోపాటు, గ్రంథపఠనం, పార్టీకి చేతనైనంత సహకారం అందించడం, రాజకీయ భావాలు ఎలావున్నా వాటితో సంబంధం లేకుండా ఎవరినైనా పలకరించడం ఆయనలోని ప్రత్యేకత. (సశేషం)

No comments:

Post a Comment