Saturday, April 20, 2019

పార్టీవారే కాకుండా కాంగ్రెస్ ప్రముఖులతో పరిచయాలు ..... వైఆర్కే పరిచయాలు - ఆప్యాయతలు ..... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


పార్టీవారే కాకుండా కాంగ్రెస్ ప్రముఖులతో పరిచయాలు
వైఆర్కే పరిచయాలు - ఆప్యాయతలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (20-04-2019)
అప్పటికే స్థానికంగా మంచి పేరున్న అడ్వకేట్ కేవి సుబ్బారావు, మరో అడ్వకేట్ బోడేపూడి రాధాకృష్ణలతో సంబంధాలు-స్నేహం కుదిరి బలపడ సాగింది. వారిరువురు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు చెందిన పోలీసు కేసులను చూస్తుండేవారు. వాళ్లతో పాటు గోకినేపల్లి గ్రామానికి చెందిన కమ్యూనిస్ట్ నాయకుడు రావెళ్ల సత్యంగారితో, పార్టీ కార్యదర్శి నల్లమల గిరిప్రసాద్, చిర్రావూరి, మంచికంటి, బొంబే ప్రసాద్, రజబ్ అలీ, రాయల వీరయ్య, బోడేపూడి వెంకటేశ్వరరావు, బోజెడ్ల వెంకట నారాయణ, పర్సా సత్యనారాయణ, టీవీఆర్ చంద్రంగార్లతో కూడా పరిచయం కలిగింది. పార్టీ వ్యక్తిగా డాక్టర్ రాధాకృష్ణమూర్తిగారిని గుర్తించడం వల్ల, పరిచయాలు పెరిగాయి. తల్దారుపల్లి తమ్మినేని సుబ్బయ్య గారితో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది.

తమ్మినేని సుబ్బయ్య్(తెల్దారుపల్లిగారిని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ ప్రాంత గ్రామాలలో ఒక "పెద్ద మనిషి" గా, తెల్దారుపల్లి జాగీర్దారుకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రక పోరాటానికి నాయకత్వం వహించినవాడు గా పేరున్నది. తను వచ్చిన కొత్తలోనే, డాక్టర్‍గారికి వారితో పరిచయం కలిగింది. ఆయనకు ఎందుచేతనో డాక్టర్‍గారిపై ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. సోదరులు నలుగురికి ఉద్యోగాలు దొరకడంలో వారి సహాయం, వారు చూపించిన ఆప్యాయత, మరిచిపోలేనిదని కృతజ్ఞతాపూర్వకంగా అన్నారు డాక్టర్ వై.ఆర్.కె.

ఆ నాటికి పట్టణంలో చిర్రావూరి లక్ష్మీనరసయ్యగారు మునిసిపల్ ఛైర్మన్‍గా వున్నారు. పట్టణ పార్టీ వారి నాయకత్వంలోనే నడిచేది. ఆనాడు పట్టణ పార్టీ ప్రముఖులుగా వున్న మిగతా వారినీ గుర్తుచేసుకున్నారు డాక్టర్‍గారు. వారు: మాణిక్యాల నర్సయ్య, పిల్లుట్ల వెంకన్న, గాజెల రాఘవయ్య, వడ్డెల్లి రామయ్య, బెందారపు యాకయ్య, కమ్మాకుల జోగయ్య, ఐతరాజు వెంకన్న, అంకిత నర్సింహం, ఎర్రా వెంకన్న, పిల్లి చెన్న కృష్ణ, చిల్లంచర్ల రాములు, "ఆఫీసు" రాఘవయ్య, వెంపటి సూర్యనారాయణ, పిట్టల రామచంద్రం, కస్తూరి గోపాలం, కుక్కల నారాయణ, గుడ్ల కాశయ్య, గుడ్ల చంద్రయ్య, కూతురు వెంకన్న, మేకల నారాయణ, వంకాయలపాటి దాసయ్య తదితరులు. వీరిలో ఎవ్వరూ "హోల్ టైమర్స్" కారు. అందరూ తమ వృత్తులు చేసుకుంటూ, పూర్తిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వారికి వ్యక్తిగతమైన స్వల్ప బలహీనతలుండవచ్చు. అది వారి సమాజం పట్టించుకోనివే. వారు "మాస్ లీడర్స్". జనాన్ని కదిలించగల శక్తిమంతులు. చిర్రావూరి మాట వారికి వేదవాక్కు.

అలాగే పాటిబండ్ల రఘుపతి రావు(జానకీపురం), రావెళ్ల జానకి రామయ్య, చుండూరి నర్సింహారావు, తమ్మారపు గోవిందు, కొండబోలు వెంకయ్య, చింతనిప్పు నర్సయ్య (వేలాద్రి), తుళ్లూరి సత్యం, దొండపాటి వెంకయ్య, నల్లమోతు పిచ్చయ్య, రావి వీరయ్య, రేగళ్ల చెన్నారెడ్డి, బోడేపూడి రామకోటేశ్వరరావు, కర్నాటి కృష్ణయ్య, వెంపటి రామకోటయ్య, వాసిరెడ్డి వెంకటపతి(మధిర), బి.ఎస్. రాములు, వై. సీతారామయ్య, బండారు చంద్ర రావు, నాగేశ్వర రావు(అల్లీనగరం), అడపా గోపాల కృష్ణమూర్తి, మోరంపూడి రంగారావు(వేంసూరు), కమ్మకోటి రంగయ్య, దొండేటి ఆనంద రావు, మల్లెల వెంకటేశ్వర రావు, తుమ్మా శేషయ్య (వరంగల్ జిల్లా), మంగపతి రావు (గార్ల), తొండేటి కొమరయ్య (గార్ల), కొణిదిన సీతారామయ్య (గొల్లెనపాడు), జొన్నలగడ్డ రామయ్య, పారుపల్లి పుల్లయ్య, పయ్యావుల లక్ష్మయ్య, వెంకట నర్సయ్య (గోకినేపల్లి), గంగాధర రావు (నేలకొండపల్లి) తదితరులను డాక్టర్ వై.ఆర్.కె గుర్తుచేసుకున్నారు.


పట్టణంలోని ప్రముఖ వ్యాపార కుటుంబాల వారు వై.ఆర్.కెను ఫామిలీ డాక్టర్‍గా చూసుకునేవారు. ఫీజులకు మించిన ఆప్యాయత, గౌరవం, అభిమానం లభించేది. అలాంటి కొన్ని కుటుంబాలను గుర్తుచేసుకున్నారు. అర్వపల్లి వారి నలుగురు సోదరుల(పెద్ద వ్యాపార) కుటుంబాలు, శిరం కృష్ణమూర్తి, పెనుగొండ భాస్కరరావు, సుందర్ టాకీస్ మద్ది పిచ్చయ్య, వీరభద్రం సోదరులు, వెంపటి కోటేశ్వరరావు, పిల్లి చెన్న కృష్ణ, చిల్లంచర్ల రాములు, సర్వదేవభట్ల రాజయ్య, సుగ్గల అక్షయ లింగం వారి సోదరుల కుటుంబాలు, గెల్లా లక్ష్మీనారాయణ సోదరులు, నోముల రాజయ్య గార్ల కుటుంబాల ఆప్యాయతలను గుర్తుచేసుకున్నారు. వ్యాపార కుటుంబాలు గాని, గ్రామాల నుండి వచ్చే రైతాంగ కుటుంబాలు గాని, పార్టీల వారి కుటుంబాలు గాని, వారి-వారి స్త్రీలు, పిల్లలను తీసుకుని వచ్చినప్పుడు తమ పుట్టింటికి వచ్చినంత చనువుగా - సంతోషంగా తన ఆసుపత్రికి వచ్చేవారని, ఇప్పటికీ తనకిదే గొప్ప తృప్తి అనీ చెబుతారు డాక్టర్‍గారు.

ఈ నేపధ్యంలో విజయవంతంగా ఆయన ప్రాక్టీస్ కొనసాగిస్తున్న రోజుల్లో, కమ్యూనిస్ట్ పార్టీ చీలిపోవడంతో సీపీఐ-సీపీఎం మధ్య చోటుచేసుకున్న రాజకీయ పోరు ప్రభావం డాక్టర్ గారిపై కొంత పడింది. వారి నాయకుల మధ్య జరుగుతున్న పోరుతో సంబంధం లేని అమాయక ప్రజలను ఇబ్బందులకు గురి చేసే దిశగా అప్పటి సీపీఐ నాయకత్వం అడుగు వేసింది. రజబలీ చెప్పు చేతల్లో వున్న చుట్టు పక్కల గ్రామాల కమ్యూనిస్ట్ సానుభూతి పరులను, వైద్యం నిమిత్తం రాధాకృష్ణమూర్తిగారి దగ్గరకు పోకుండా కట్టడి చేసింది. నష్టపోయింది అమాయక రోగులే కాని, నాయకులు కాదని గ్రహించడానికి చాలా కాలం పట్టింది. ఆ తర్వాత కొంతకాలానికి, సీపీఐ కి చెందిన కొందరు స్థానిక నాయకులు, తామలా చేసినందుకు, డాక్టర్‍గారిని బాయ్‍కాట్ చేయమని సలహా ఇచ్చినందుకు పశ్చాత్తాప పడుతున్నామని ఆయనతో అన్నారు. ఆ పేర్లు వెల్లడించడం వారికి ఇబ్బందికరం కావచ్చునన్నారు.

క్రమేపీ వ్యాపారులు, పార్టీకి చెందినవారే కాకుండా, కాంగ్రెస్ పార్టీ ప్రముఖుల పరిచయాలు - స్నేహాలు లభించాయి డాక్టర్‍గారికి. పెరవల్లి వెంకట రమణయ్య(ఈయన తొలుత కమ్యూనిస్టే. తరువాత కాంగ్రెస్ లో చేరారు), కొమరిగిరి నారాయణరావు, గెల్లా కేశవరావు, కోనా పట్టాభి రామయ్య, హీరాలాల్ మోరియా, కోట పున్నయ్య, గురుమూర్తి, కత్తుల శాంతయ్య, రావెళ్ళ శంకరయ్య, మానికొండ బుచ్చయ్య(బాలపేట), చౌదరిగార్లతో స్నేహం కుదిరింది. వీరంతా కాంగ్రెస్ నాయకులు - లేదా - గాంధేయ వాదులు ఐనప్పటికీ, వ్యక్తిగతంగా తనను తమ వాడిగానే చూసుకునేవారని డాక్టర్ వై.ఆర్.కె అన్నారు.

 "ప్రచండ వేగంతో సాగిపోయే జీవిత ప్ర్వాహంలో అప్పుడప్పుడు కష్టాలు, కలతలు వస్తూనే వుంటాయి. అంతమాత్రాన కుంగిపోతే-ఆ జీవితానికి అర్థం, పరమార్థం వుండదు. రాపిడిలేనిదే రత్నం ఎలా ప్రకాశించదో, కష్టాన్ని-కలతల్ని తట్టుకోలేని మనిషి జీవితానికి పరిపూర్ణత చేకూరదు. మానవజన్మ నిడివి పరిమితమే కావచ్చు. ఈ విలువైన సమయాన్ని ఈర్ష్యాద్వేషాలతో, అసూయలతో, ప్రతీకారం, పగలతో గడపడంకంటే, ప్రేమిస్తూ-పొందుతూ గడపాలి"-ఈనాడు 29-11-2010 పత్రిక లో "అంతర్యామి" శీర్షిక కింద.

No comments:

Post a Comment