Thursday, April 11, 2019

ఉపాధ్యాయుల పుణ్యంతో ప్రథముడిగా ఉత్తీర్ణుడినయ్యా.... వైఆర్కే బాల్యం, కుటుంబ నేపధ్యం-4 ..... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఉపాధ్యాయుల పుణ్యంతో ప్రథముడిగా ఉత్తీర్ణుడినయ్యా....
వైఆర్కే బాల్యం, కుటుంబ నేపధ్యం-4
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (12-04-2019)
హైస్కూల్ ఉపాధ్యాయులలో కొందరిని మర్చిపోలేమన్నారు. ముందుగా తెలుగు పండితులు బసవ కోటిలింగంగారి ప్రస్తావన తెచ్చారు. ఈయన తన మీద ప్రత్యేక శ్రద్ధ చూపించే వారట. ఆయన శైవుడు (మెడలో జంగాలకు వుండే లింగం వుండేది). కాని బుద్ధుడి మీద చాలా అభిమానం. వీలున్నప్పుడల్లా బౌద్ధ మత విశేషాలు వివరించేవారట. తెలుగు భాషపై శ్రద్ధ కలగడానికి ఆయన మొదటి కారణంగా చెపుతారు. తరువాత ఎస్.ఎస్.ఎల్.సీ లో "ఇంగ్లీషు చెప్పిన మాస్టారు" గురించి చెప్పారు. ఆయన భాషతో పాటు "రెన్ అండ్ మార్టిన్" ఇంగ్లీష్ గ్రామర్‍తో పూర్తి కసరత్తు చేయించేవారట. ఇక లెక్కల మాస్టారు ఆచారిగారు చక్కగా బోధించడంతో తనకు 30% అత్తెసరు మార్కుల నుండి 70% మార్కులు రావడంమొదలైందట. ఎస్.ఎస్.ఎల్.సీలో అప్పుడొక ఐఛ్చిక (Optional) సబ్జెక్ట్ కూడా వుండేది. డాక్టర్‍గారు కెమిస్ట్రీ తీసుకున్నారు. దాన్ని మాణిక్యాలరావు మాస్టారు ఎంతో బాగా చెప్పేవారు. రసాయన శాస్త్ర ప్రయోగాలు చేసి చూపించేవారట. వారికిఈ ఈనంటే చాలా ఆప్యాయత. ట్యూషన్ అంటే ఎరుగరట. గొప్ప ఉపాధ్యాయుల పుణ్యం కావచ్చు, ఆయన శ్రమ కావచ్చు.... ఎస్.ఎస్.ఎల్.సీ లో హైస్కూల్ లో ప్రధముడుగా ఉత్తీర్ణుడయ్యానని, ఆనాడది ఒక సంతృప్తిగా వుండేదని చెప్పారు.

ఇంటర్ (1943-45) - బందరు:
అప్పట్లో కృష్ణా జిల్లాలో రెండే కాలేజీలుండేవి. ఒకటి బందరులోని హిందూ కాలేజీ, రెండోది బెజవాడలోని ఎస్ ఆర్ ఆర్ కాలేజీ. హిందూ కాలేజీకి మంచి క్రమ శిక్షణ, మంచి అధ్యాపక-ఇతర సిబ్బంది కలదన్న పేరుండేది. అది పూర్తిగా "వైదికుల" కాలేజీ అనేవారు. దానికి తగినట్లే, బందరు కాలేజీలో పనిచేసే ఒక్క లెక్చరర్ కూడా మీసాలుండేవి కాదట. ఒకే ఒక మినహాయింపు పువ్వాడ శేషగిరిరావుగారని చెప్పారు. అంతకు ముందు కొంత కాలంగా ఒక వెలుగు వెలిగిన క్రిస్టియన్స్ నోబుల్ కాలేజీ, జాతీయోద్యమంలో పుట్టిన నేషనల్ కాలేజీ మూతపడి వున్నాయి. ఆ కాలేజీలో ఇంటర్ లో చేరడంతో, రాధాకృష్ణమూర్తిగారి తల్లితండ్రులు తమ కాపురం కూడా - ఆయన కోసం- బందరుకు మార్చారు. "ఇంగ్లీషు పాలెం" లో, కాలేజీకి దగ్గరలో, ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నారు.

బందరు చాలా చరిత్ర కలిగిన పురాతన పట్టణం. అంతటా ఇసుక మైదానాలు, సరివి తోటలు, సముద్ర తీరం. ఓడ రేవున్నందున మొదలు డచ్చివారు, తరువాత ఫ్రెంచ్ వారు, ఆ తరువాత ఆంగ్లేయులు ఆ ఓడ రేవులతో వ్యాపారాలు కొనసాగించేవారు. అందుకే ఇప్పటికీ డచ్చి పేట, ఫ్రెంచి పేట, ఇంగ్లీషు పాలెంలు వున్నాయి. దానికి మఛిలీ పట్నం (మఛిలీ అంటే "చేప") అని పేరుంది. ఇంగ్లీషులో "మసులీపటం’" గా పిలిచారు. ఉప్పు తయారీకి బందరు ఒక పెద్ద కేంద్రం. ఆప్పటికే ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ వుండేది. చాలా స్వచ్చమైన, కాలుష్యం లేని బీచుల్లో మంగినపూడి బీచ్ ఒకటి. ఆ ఊరిలోనే వున్న "చిలకల పూడి" రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు ప్రసిద్ధి. "బందరు లడ్డూ" ఆంధ్ర దేశపు స్పెషాలిటీలలో ఒకటి! విశాఖ మెడికల్ కాలేజీలో, బందరు విద్యార్థులను, కొత్తలో చేరినప్పుడు, "బందరు లడ్డూ" అని రాగింగ్ చేసేవారట. అది జాతీయోద్యమ అగ్రనాయకులలో ఒకరైన డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్యగారి ఊరు. జాతీయోద్యమ పాత్రికేయులు మట్నూరి కృష్ణారావుగారు అక్కడ నుండే ప్రసిద్ధ "కృష్ణాపత్రిక" నడుపుతుండేవారు. ఆ పేర్లు, ఆ చరిత్ర, ఆనాడు వినడమే కాని, వారిని చూసే అవకాశం తనకు కలగలేదంటారు డాక్టర్ గారు.


ఇక కాలేజీ విషయానికొస్తే, ప్రిన్సిపాల్ శివరామకృష్ణయ్య గారంటే పిల్లలందరికీ హడల్. ఆయన క్రమశిక్షణకు మారుపేరని, కాస్తంత కోపంగా విద్యార్థులు ఆయనకు "అత్తరు సాయిబు" అని నిక్ నేమ్ పెట్టారని చెప్పారు డాక్టర్‍గారు. ఆయనకు మంచి స్ఫూర్తినిచ్చిన మరికొంతమంది లెక్చరర్లను గుర్తుచేసుకున్నారు. ముందుగా షేక్ స్పియర్ పాఠాలు చెప్పిన ముత్తు అయ్యర్ గారి విషయం చెప్పారు. ఆయన నల్లగా, పొట్టిగా, బొద్దుగా వుండేవారు. తల పాగా, ధోవతి లోకి చొక్కా, పైన బెల్టు, ఆపైన నల్ల కోటు వేసుకునే వారు. వేషం ఎలా వున్నా, ఆయన పాఠం చెప్పే తీరు మాత్రం అద్భుతం అంటారు డాక్టర్‍గారు. ఆయనకు షేక్‍స్పియర్ (Shakespeare) రచనలు - నలభై - నాటకాలు కంఠతా వచ్చట. ఇంటర్ పాఠ్య గ్రంధం "As You Like It" నాటకం కాని, "Othello", "Macbeth", "Merchant of Venice", కాని Extensive గా Quote చేస్తూ, ఆయా పాత్రలకు అనుగుణంగా స్వరం,  Accent మార్చి నాటకీయంగా తరగతి నడిపేవారట. అలాగే శివకామయ్య మాస్టారు విషయం చెప్పారు. ఆయన ఇంగ్లీషు గద్య భాగం చెప్పేవారు. అతి కష్టంగా వుండే RL Stevenson రచనలను, పండు వలిచినట్లు చెప్పేవారట. ఆ ఇద్దరి పాఠాలు వింటుంటే, ఏ విద్యార్థికైనా ఇంగ్లీషు భాషపై ఆసక్తి కలగాల్సిందేనట! (సశేషం)

No comments:

Post a Comment