Friday, April 26, 2019

తెనాలి సదస్సుకు హాజరైన వారు మార్క్సిస్ట్ పార్టీలోకి ..... వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


తెనాలి సదస్సుకు హాజరైన వారు మార్క్సిస్ట్ పార్టీలోకి
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (27-04-2019)
         "తెనాలి సదస్సుకు సంబంధించి లభించిన ఫోటోల ప్రకారం దేశవ్యాపితంగా సుమారు 140 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఆంధ్ర ప్రదేశ్‌నుండి 24 మంది, బెంగాల్‌ 22, తమిళనాడు 20, కేరళ 19, ఉత్తర ప్రదేశ్‌10, రాజస్థాన్‌7 మంది హజరవగా పంజాబ్‌, అస్సాం ఇతర రాష్ట్రాలనుండి సుమారు 40 మంది ప్రతినిధులు హాజరైనారు. సిపిఐ జాతీయ కౌన్సిల్‌నుండి వాకౌట్‌చేసిన 32 మంది సభ్యులు ఈ సదస్సుకు హాజరైనారు. అయితే సదస్సు సందర్భంగా దిగిన ఫోటోలో 30 మంది మాత్రమే ఉన్నారు. బసవపున్నయ్య, మరొకరు ఫోటోలో లేరు. వాకౌట్‌ చేసిన వారిలో తరువాత మార్క్సిస్టు పార్టీ తొలి పొలిట్‌బ్యూరోకు ఎన్నుకోబడిన పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య, ఎకె గోపాలన్‌, ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌, జ్యోతి బాసు, ప్రమోద్‌ దాస్‌ గుప్త, హరికిషన్‌ సింగ్‌ సూర్జిత్‌, పి. రామమూర్తి ఉన్నారు. సిపిఐ(ఎం) తొలి పొలిట్‌ బూరోలో సభ్యుడైన బిటి రణదివే జైలులో ఉన్నందున సదస్సుకు హాజరు కాలేదు. వీరితో బాటు పంజాబ్‌ నుండి జగ్‌ జిత్‌ సింగ్‌ లాయల్‌పురి, బెంగాల్‌ నుండి ముజఫర్‌ అహ్మద్‌, హరేకృష్ణ కోనార్‌, తమిళ నాడు నుండి ఎంఆర్‌ వెంకటరా మన్‌, శంకరయ్య, కేరళ నుండి ఇకె నయనార్‌‌, కనరన్‌, రాజస్థాన్‌ నుండి మోహన్‌ పునామియా తదితరులున్నారు".

         "వాకౌట్‌చేసిన కౌన్సిల్‌సభ్యుల్లో మన రాష్ట్రం నుండి పుచ్చలపల్లి సుందరయ్య, బసవపున్నయ్యలతోబాటు నండూరి ప్రసాదరావు, మోటూరు హనుమంతరావు, తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, గుంటూరు బాపనయ్య, ఉద్దంరాజు రామం ఉన్నారు".

"ఆంధ్రప్రదేశ్‌ నుండి హాజరైన ప్రతినిధుల్లో పైన పేర్కొన్న ఎనిమిది మంది సభ్యులతోబాటు గుంటూరు జిల్లానుండి కొల్లా వెంకయ్య, కృష్ణా జిల్లా నుండి సనకా బుచ్చికోటయ్య, మానికొండ సుబ్బారావు, పశ్చిమ గోదావరి జిల్లా నుండి అన్నే వెంకటేశ్వరరావు, నెక్కల పూడి రామారావు, ఖమ్మం జిల్లా నుండి పర్సా సత్యనారాయణ, చిర్రావూరి లక్ష్మీనర్సయ్య, నల్గొండ జిల్లా నుండి భీమిరెడ్డి నర్శింహారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా నుండి కానేటి మోహన రావు, జి. ఎస్‌. బాలాజీ దాస్‌, వరంగల్‌ జిల్లా నుండి ఎం. ఓంకార్‌, విశాఖ జిల్లా నుండి కోడుగంటి గోవిందరావు, చిత్తూరు జిల్లా నుండి వజ్రవేలు చెట్టి, శ్రీకాకుళం జిల్లానుండి రామలింగాచారి ఉన్నారు. వీరు కాకుండా నిజామాబాద్‌ నుండి ఒక కామ్రేడ్‌ పాల్గొన్నారు".


"తెనాలి సదస్సుకు హజరైన ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధుల్లో అత్యధికులు చివరివరకు మార్క్సిస్టు పార్టీలో పనిచేశారు. కొందరు 1967-68 నక్సలైట్‌ చీలికలో వెళ్లి పోయారు. అలా నక్సలైట్‌ల వైపుకు పోయిన వారిలో తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సనకా బుచ్చికోటయ్య, వజ్రవేలు చెట్టి, అన్నే వెంకటేశ్వరరావు, నెక్కల పూడి రామారావు, కొల్లా వెంకయ్య, రామలింగాచారిలు ఉన్నారు. అన్నే వెంకటేశ్వరరావు తరువాత తిరిగి మార్క్సిస్టు పార్టీలోకి వచ్చారు. కానేటి మోహన రావు తరువాతి కాలంలో పార్టీ పనిలో చురుకుగా లేరు. ఓంకార్‌, భీమిరెడ్డి నర్సింహారెడ్డి కొంతకాలం మార్క్సిస్టు పార్టీ నాయకత్వంలో ఉండి పార్టీని విడిచిపెట్టారు. కోడుగంటి గోవిందరావు ఎక్కువ కాలం మార్క్సిస్టు పార్టీలో లేరు. ఆయన తరువాత సిపిఐలో చేరారు. తెనాలి సదస్సుకు హజరైన ప్రతినిధులు అందరూ కలిసి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా విడివిడిగా ఫోటోలు దిగారు. ఉత్తర ప్రదేశ్‌ ప్రతినిధుల్లో భగత్‌ సింగ్‌ సహచరుడైన శివవర్మ, పశ్చిమ బెంగాల్‌ ప్రతినిధుల్లో, సరోజ్‌ ముఖర్జీ, వినయకృష్ణ చౌదరి, కేరళ ప్రతినిధుల్లో సుశీలా గోపాలన్‌ తదితరులు కూడా ఉన్నారు".

No comments:

Post a Comment