Saturday, April 20, 2019

21మందితో కార్యవర్గం ఎన్నిక ..... వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


21మందితో కార్యవర్గం ఎన్నిక
వైఆర్కే కు కమ్యూనిస్ట్ పార్టీతో పరిచయాలు - 1958 రాష్ట్ర సభలు
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (21-04-2019)
భారత కమ్యూనిస్ట్ (ఉమ్మడి) పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎనిమిదవ (8 ) మహాసభ, డిసెంబర్ 30, జనవరి 1-2 తేదీలలో ఖమ్మం పట్టణం వెంకట లక్ష్మీ టాకీసులో జరిగింది. 212 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

తొలుత, ఉన్నవ లక్ష్మీ నారాయణ, జోవియట్ క్యూరి, చక్రయ్య చెట్టియార్ల మృతికి సంతాపం ప్రకటించి, తెలంగాణ మృత వీరులకు జోహార్లు అర్పించారు.

పార్టీ అఖిల భారత కార్యదర్శి అజయ్ కుమార్ ఘోష్ ప్రారంభ ఉపన్యాసం చేశారు. ప్రజాస్వామ్యవాదులందరితో కూడిన విశాల ఐక్య సంఘటన ఏర్పరచాలన్నారు. చండ్ర రాజేశ్వరరావు నివేదిక ప్రవేశ పెట్టారు. సోషలిస్టు నమూనా సమాజం గురించిన ఆశలు నెరవేరడం లేదనీ, ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందనీ అన్నారు. 1955 లో జరిగిన ఎన్నికలలో పార్టీ తిన్న దెబ్బ నుండి తిరిగి కోలుకుంటున్నదని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వ అభివృద్ధి నిరోధక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా తంత్ర శక్తులతో కూడిన ఐక్య సంఘటన నిర్మించాలనీ, కుల-మత తత్వాలను ప్రతిఘటించాలనీ పిలుపునిచ్చారు.

7 గురు కార్యదర్శులతో సహా 21 మందితో కూడిన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా చండ్ర రాజేశ్వరరావును, కార్యదర్శులుగా పుచ్చలపల్లి సుందరయ్య, రావి నారాయణ రెడ్డి, మోటూరు హనుమంతరావు, బద్దం ఎల్లారెడ్డి, వై.వి. కృష్ణా రావు, తమ్మారెడ్డి సత్యనారాయణలను ఎన్నుకున్నారు. ప్రదేశ్ కమ్యూనిస్ట్ సమితి కార్యవర్గంలో కె. ఎల్. నర్సింహం, మగ్దుం మొహియుద్దీన్, గుంటూరు బాపనయ్య, చలసాని వాసుదేవరావు, నీలం రాజశేఖరరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, సంకు అప్పారావు, వై. విజయకుమార్, కొల్లా వెంకయ్య, కడియాల గోపాలరావు, నెక్కలపూడి రామారావు, గోళ్ల రాధాకృష్ణమూర్తి, జి. యల్లమందారెడ్డి, నల్లమల గిరిప్రసాద్ లను తీసుకున్నారు.

అజయ్ ఘోష్ కల్చరల్ క్లబ్ వారు ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో మానవుడు సాధించిన మహత్తర పురోభివృద్ధిని సమాజ పరం చేయడానికి మార్క్సిజం ఒక్కటే మార్గం అన్నారు.

నాలుగవ తేదీ రాత్రి పెద్ద బహిరంగ సభ జరిగింది. మద్దుకూరి అధ్యక్షత వహించారు. సుందరయ్య, రావి నారాయణరెడ్డి, బసవ పున్నయ్య, చండ్ర రాజేశ్వరరావు మాట్లాడారు. కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం -ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అజయ్ ఘోష్ డాక్ట్రర్‍గారింట్లో నాలుగు రోజులు బస చేశారు.


మహాసభ డెలిగేట్లకు అవసరమైన వైద్య సహాయం వై.ఆర్.కె ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసారు.

సీపీఎం ఆవిర్భావం
భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ, పరిణామక్రమం గురించి ఇక్కడ కొంత తెలుసుకోవాలి. ఇరవయ్యో శతాబ్దపు మలి దశాబ్దంలో, ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభం, పలు దేశాలను కలవర పెట్టింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన బ్రిటన్ లాంటి దేశాలలో కార్మికుల సమ్మెలు సుదీర్ఘంగా సాగాయి. ఆ కాలంలోనే, భారత దేశంలో కూడా కార్మికవర్గ ఉద్యమాలు ఊపందుకుని, పలువురిని కమ్యూనిజం వైపు మళ్లడానికి ఊతమిచ్చాయి. అదే రోజుల్లో, 1917 నాటి రష్యన్ విప్లవ తదనంతర రాజకీయ-సామాజిక పరిణామాలు ఎన్నో దేశాలపై ప్రభావం చూప సాగాయి. 1919లో మాస్కోలో ఆవిర్భవించిన మూడవ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సంస్థ-కోమిన్టార్న్, ప్రపంచవ్యాప్తంగా, బూర్జువా వ్యవస్థకు వ్యతిరేకంగా, అన్ని రకాల పోరాటాలు సలిపి, అంతర్జాతీయ సోవియట్ రిపబ్లిక్ స్థాపనకు ఉద్యమించాలని పిలుపునిచ్చింది. ఎం.ఎన్ రాయ్ మాస్కో సందర్శించిన సందర్భంలో, సోవియట్ కమ్యూనిస్ట్ నాయకుడు లెనిన్ కు ఆయన పట్ల ఏర్పడ్డ విశ్వాసం, ఆయనను కమ్యూనిస్ట్ పార్టీ స్థాపనకు ప్రోత్సహించడం, అక్టోబర్ 17, 1920న తాష్కెంటులో, భారత కమ్యూనిస్ట్ పార్టీని నెలకొల్పడం జరిగింది. దేశంలోని వామ పక్ష భావాలున్న వారిపై కూడా కోమిన్టర్న్ ప్రభావం పడే ప్రమాదం వుందని భావించి, భారత దేశాన్ని పాలిస్తున్న బ్రిటన్, పలువురి పై తప్పుడు కుట్ర కేసులు పెట్టి జైళ్లలో పెట్టే ప్రయత్నాలు చేసింది. ఎం.ఎన్ రాయ్ తో సహా, వామ పక్ష భావాలకు ఆకర్షితులైన డాంగే, ముజఫర్ అహ్మద్, నళిని గుప్త, షౌకత్ ఉస్మాని, సింగరవేలు చెట్టియార్, గులాం హుస్సేన్ లాంటి నాయకులపై "కాన్పూర్ కుట్ర కేసు" పెట్టి, బ్రిటీష్ ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. మార్చ్ 17, 1924న బనాయించిన చారిత్రాత్మక కాన్పూర్ కుట్రకేసు, పరోక్షంగా, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావానికి దోహద పడింది.

వామ పక్ష భావాల పట్ల ఆకర్షితులైన పలువురు నాయకులు, తమ పట్ల బ్రిటీష్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా, డిసెంబర్ 1925లో కాన్పూర్‌లో సమావేశమై, "వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీల" పేరుతో బహిరంగ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకుని, కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేయసాగారు. వారి పురోగతిని అడ్డుకునేందుకు, వారందరి పైనా "మీరట్ కుట్ర కేసు" పెట్టింది బ్రిటీష్ ప్రభుత్వం. ఆ కేసు విచారణ కమ్యూనిస్ట్ పార్టీ పట్ల కార్మికుల్లో అభిమానాన్ని పెంచ సాగింది. జనవరి 1933లో, "బోల్షవిక్కులని" ప్రభుత్వం ముద్ర వేసిన కేసులోని నిందితులందరికి కఠిన శిక్షలు పడ్డాయి.

No comments:

Post a Comment