Wednesday, April 17, 2019

ఖమ్మం పట్టణంలో ప్రయివేట్ ప్రాక్టీస్ ప్రారంభం ... వైఆర్కే ప్రాక్టీసుకు నేపధ్యం-2 .... అనుభవాలే అధ్యాయాలు : వనం జ్వాలా నరసింహారావు


ఖమ్మం పట్టణంలో ప్రయివేట్ ప్రాక్టీస్ ప్రారంభం
వైఆర్కే ప్రాక్టీసుకు నేపధ్యం-2
అనుభవాలే అధ్యాయాలు
వనం జ్వాలా నరసింహారావు
విజయక్రాంతి దినపత్రిక (18-04-2019)
స్నేహితులిద్దరు కలిసి ప్రతిరోజూ సాయంత్రం బజారుకెళ్లేవారు. ఒకనాడు చైనా బజారు, ఒకరోజు మౌంటు రోడ్డు (ఇప్పటి అన్నాసలై), మరోనాడు ట్రిప్లికేన్ బీచ్‍లో తిరిగి, తరువాత సినిమా చూసి వచ్చే వాళ్లు. ఆ రోజుల్లోనే జరిగిన విదేశీ సినిమాల పనోరమా గుర్తుచేసుకున్నారు. పరుశువాకంలోని ఒక సినిమాహాలులో రెండు రోజులు ఇటలీ సినిమాలు, రెండు రోజులు జపాన్ సినిమాలు చూసే అవకాశం కలిగింది వారికి. వాటిలో ఇటాలియన్ ప్రసిద్ధ దర్శకుడు(Vittorio De Sica) తీసిన "బైసికిల్ థీఫ్", జపాన్ ప్రసిద్ధ దర్శకుడి(Akira Kurosawa) "రోషోమోన్" తనకిప్పకిటికీ జ్ఞాపకం వున్న మాస్టర్ పీసెస్‍ అన్నారు డాక్టర్‌గారు.

డాక్టర్‌గారి మిత్రుడు విశ్వనాధరావుది విజయనగరపు సనాతన బ్రాహ్మణ కుటుంబం. ఆయన మాత్రం మంచి మాంస ప్రియుడట. వారుండే అడ్డాలోని బుఖారీ హోటల్లో తినేవారు. కొన్నాళ్ల తరువాత ఆవడి డిస్పెన్సరీకి, ఆ తరువాత మరో వూరు ఆర్కోణం జంక్షన్‌కు డాక్టర్‌గారిని ట్రాన్స్‌ఫర్ చేశారు. అక్కడ డాక్టర్‌గారికంటే సీనియర్ అసిస్టెంట్ సర్జన్ ఒకరుండేవారు. ఆయన తమిళ బ్రాహ్మణుడు. మంచి వ్యక్తి. కానీ వ్యవస్థలోని లోటుపాటులకు అలవాటు పడిపోయారట. ఆయన దగ్గర కొచ్చే పేషంట్లు చాలామంది లీవ్ సర్టిఫికేట్ కోసమే వచ్చేవారట. రైల్వే ఉద్యోగంలో పెళ్ళికైనా-చావుకైనా శెలవులు దొరకడం కష్టమట. అందుకోసం డాక్టర్ సర్టిఫికేట్లకు గిరాకీ. ఐదు రూపాయలు కాగితం బల్లమీద పెట్టి అడిగేవారు. డాక్టర్‌గారికి అది చూస్తే చాలా అసహ్యమనిపించేది. ఇక జూనియర్ డాక్టర్ "ఆన్ కాల్ డ్యూటీ” లో వుండేవారు. అవసరమొచ్చినప్పుడల్లా బయటకెళ్లాలి. ఆర్కోణం స్టేషన్‌కు టెలిగ్రాం వస్తుందట. ఫలానా స్టేషన్ వున్న వూళ్లో రైల్వే క్వార్టర్స్ లో ఫలానా ఉద్యోగికి సుస్తీగా వుందని దాని సారాంశం. వెంటనే అటెండ్ కమ్మని, రాత్రయినా-పగలైనా, ఏ రైలు దొరికితే అది పట్టుకుని, ఏదీ లేకపోతే గూడ్సు బండైనా ఎక్కి వెళ్లాల్సి వుండేదట. చాలా సార్లు వెళ్లారట కూడా. తీరా అక్కడకు వెళ్లిన తరువాత, పేషంటుగా కనిపించాల్సిన వ్యక్తి లుంగీ సర్దుకుంటూ, తలుపు తీసి దర్శనం ఇచ్చేవాడు. నవ్వుకుంటూ, పది రూపాయల నోటు జేబులో పెట్టి, "శెలవు కావాలి సార్" అని అడిగేవాడు. అది చాలా ఇబ్బందికరంగా వుండేదట. ఇవన్నీ చెప్పి, ఏం చెయ్యాలని సీనియర్‌ను అడిగితే, "ఎడ్జెస్ట్ అవడం ఇద్దరికీ మంచిది" అని సమాధానం వచ్చేది. డాక్టర్‌గారు రాజీనామా కాగితం పంపితే, డి.ఎం.ఓ వచ్చి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. ఇక తన వల్ల కాలేదన్నారు. ఉద్యోగంనుంచి వైదొలగారు. డాక్టర్‌గారితో పాటు చేరిన వారి క్లాస్ మేట్స్ విశ్వనాధరావు, సత్యనారాయణ దక్షిణ మధ్య రైల్వేలో మంచి ఉన్నత స్థాయిలో, రైల్వే లాలా గూడా ఆసుపత్రిలో పదవీ విరమణ చేశారు.

"ఎడ్జెస్ట్ కాకపోతే ఎక్కడైనా సరే ఇబ్బందులు తప్పవు అని చెప్పిన ఆ పాఠం ఇప్పటికీ నాకు ఒంటపట్టలేదు" అంటారు డాక్టర్‌గారు.   

రైల్వే ఉద్యోగంలో వుండగానే, రాష్ట్ర సర్వీస్ కమీషన్ మెడికల్ ఆఫీసర్స్ సెలక్షన్ కు పిలిచారు. కాని ఆయన విషయంలో పోలీసు రిపోర్టు సెలక్షన్‍కు అడ్డుపడింది. ఆ నాడు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఆంధ్ర జిల్లాలుండేవి. రాష్ట్ర ముఖ్య మంత్రిగా శ్రీమాన్ చక్రవర్తుల రాజగోపాలాచారి వుండేవారు. ఆయన కమ్యూనిస్టులను తన మొదటి శత్రువు గాను, పి.డబ్ల్యు.డి శాఖ వారిని రెండో శత్రువు గాను వర్ణించేవారు. రాధాకృష్ణమూర్తి గారు తన మెడిసిన్ నాలుగో సంవత్సరంలో వుండగానే (1949) అరెస్టు కాబడి, కమ్యూనిస్ట్ గా ముద్రపడి వున్నాడు. ఆ రికార్డంతా ప్రభుత్వం దగ్గర, సెలక్షన్ కమిటీ దగ్గర వుంది. ఆయన మెడిసిన్ చదువుతున్నప్పుడు సర్జరీ ప్రొఫెసర్ గా పనిచేసిన డాక్టర్ రమణమూర్తి గారే సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా వున్నారు. ఐనా ఆశ ఆవిరైపోయింది. రైల్వే ఉద్యోగం నచ్చలేదు. రాజీనామా చేసి, డాక్టర్ గారు, భార్య సరళా దేవి, ఒకటిన్నర సంవత్సరాల వయసున్న కూతురు నిర్మలతో ఖమ్మం పట్టణానికి వచ్చి, ప్రయివేట్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు.


గాంధీ చౌక్‍లో, గాంధీ విగ్రహానికి సరిగ్గా ఎదురుగా వుండే ఒక బంగళాలో, క్రింద పోర్షన్ లో క్లినిక్ పెట్టుకునేందుకు, నెలకు రు. 25 అద్దెకు కుదిరింది. సరిగ్గా అదే బంగళాపైన కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యాలయం వుండేది. ఆ భవనం షరాబు మల్లయ్య గారనే స్థానిక వైశ్య ప్రముఖుడి ది. ఆయన గారు అప్పటికే వయసులో చాలా పెద్దవారు. వారి పెద్దబ్బాయి రామ్మూర్తి డాక్టర్ గారిలాగానే దత్తుడు. పెద్దాయన ప్రేమ, రామ్మూర్తి స్నేహం యలమంచిలిని ఎంతగానో ఉత్సాహపరిచింది. వుండడానికి, మామిళ్లగూడెంలో లక్ష్మారెడ్డి గారి డాబాలో, ఒక పోర్షన్ దొరికింది. వీరు తీసుకున్న పక్క పోర్షన్ లో, స్థానిక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న యలమాటి సిద్దయ్య గారి కుటుంబం వుండేది. ఆయన చాలా గౌరవనీయులు. అందరికీ సహాయపడే స్వభావం కల వ్యక్తి. మంచి కుటుంబ నేపధ్యం. వారి కుటుంబంతో రాధాకృష్ణమూర్తి కుటుంబానికి  అప్పుడేర్పడిన సాన్నిహిత్యం, నేటికీ కొనసాగడం ఒక ప్రత్యేకతగా చెప్పారాయన. వారి పెద్దబ్బాయి విద్యాసాగరరావు, తర్వాత డాక్టరై, ఉస్మానియా ఆసుపత్రిలో సర్జన్‍గా పని చేసి రిటైర్ అయ్యారు. రెండవ కుమారుడు సత్యనారాయణ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో పి హెచ్ డి చేసి, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పని చేసి, మంచి పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా రిటైర్ అయ్యారు. కూతుళ్లు కొందరు అమెరికాలో, కొందరు దేశంలో స్థిరపడ్డారు. లక్ష్మారెడ్డి గారింట్లో అద్దెకున్న కొద్ది మాసాల్లో, సిద్దయ్య గారి కుటుంబం యలమంచిలి యువ దంపతుల మీద కనబరిచిన ఆప్యాయత-సహాయం మరువలేనిదంటారాయన.

మామిళ్లగూడెం ఇల్లు క్లినిక్‍కు దూరం అనిపించింది. ఆ రోజుల్లో ఖమ్మంలో రిక్షాల సౌకర్యం కూడా లేదు. ఒకటి-రెండు గుర్రపు బగ్గీలు మాత్రం వుండేవి. క్లినిక్‍కు వెళ్లి రావడం ఇబ్బందిగా వుండేది. దగ్గరగా వుండేందుకు, డాబాల బజారులో, మొదటి బిల్డింగైన, నోముల రాజయ్యగారింట్లో, పై అంతస్తులో, ఒకటిన్నర గదుల చిన్న పోర్షన్‍కు మారారు.  డాక్టర్‍గారి పెద్ద కుమారుడు రాంకోటేశ్వరరావు 1953లో, చిన్న కుమారుడు రవీంద్రనాథ్ 1955లో అక్కడ వీరుండగానే కలిగారు. నెలకు రు. 21 అద్దె ఇచ్చే వారు. ఎందుకో తెలియదుగాని, రాజయ్యగారికి, డాక్టర్‍గారి కుటుంబం మీద ప్రత్యేకమైన అభిమానం వుండేది. ఏ చిన్న సదుపాయం కావాలన్నా నిమిషాలలో చేయించి పెట్టేవారు. వీరుండే ఇంట్లోనే, పక్క పోర్షన్లలో తూము హైమావతమ్మ గారు, వారి తోటి కోడలు, ఆర్టీసి ఉద్యోగి రంగారావు గారు, ఇండియన్ బాంక్ ఉద్యోగి కుటుంబం వుండేవారు. "మేమంతా కలిసి మెలిసి ఎంతో ప్రేమగా వుండేవారమని" చెప్పారు డాక్టర్‍గారు. 1957లో ఇప్పటి సొంత ఇంటికి మారారు. 1960లో ఇప్పటి ఆసుపత్రి భవనంలోకి మారారు.

"నా సహచరులూ, నా కింద పనిచేసేవారూ, నా ప్రవర్తన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకున్న తరువాత నేను దిగ్భ్రాంతి చెందాను. నేను అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకునేవాడిని’ అనుకుంటూ వుండేవాడిని. కాని, నా కింద పనిచేసేవారు, ’నేను ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో వ్యవహరిస్తానని’ అనుకునేవారు. నేను అందరినీ స్వేచ్ఛగా మాట్లాడనిస్తానని అనుకునేవాడిని. కాని, నా బాడీ లాంగ్వేజ్ ద్వారా మాట్లాడేవారిని అడ్డుకుంటానని నా సహచరులు అనుకునేవారు. ఇలా నేను నా బలాలుగా ఏ ఏ అంశాలుగా భావించానో, అవన్నీ నా బలహీనతలుగా తరువాత బయట పడ్డాయి" - ఆర్. గోపాలకృష్ణన్ "టాటా రిఫ్లెక్షన్స్" - ఏ మేనేజర్ గివ్స్ హిజ్ ఎక్స్ పీరియెన్సెస్: బుక్ - "వెన్ ద పెన్నీ డ్రాప్స్" లో.

No comments:

Post a Comment