Monday, April 8, 2019

భావితరాలకు ఇదొక కరదీపిక....బాల్యం కుటుంబ నేపధ్యం డాక్టర్ వైఆర్కే


భావితరాలకు ఇదొక కరదీపిక
విజయక్రాంతి దినపత్రిక (09-04-2019)
డాక్టర్‌గారు తనగురించి చెప్పదల్చుకున్నవన్నీ నిష్కర్షగా చెప్పారు. పార్టీపరమైన విషయాలు చెప్పడానికి పార్టీ క్రమశిక్షణ ఆటంకమన్నారు. చాలామందికి తెలియని విషయాలెన్నో చెప్పారు. పార్టీ సభ్యుడు కాకుండానే, శత్రువర్గాల చేత పార్టీ ముద్ర వేయించుకుని జైలుకెళ్లారు. పార్టీ సభ్యుడయ్యాక తాను ఏ ఆస్తినీ సమకూర్చుకోలేదన్న వాస్తవాన్ని కూడా చెప్పారు. ఎన్నికలకు విముఖుడైనా పార్టీ ఆదేశం మేరకు, మూడు సార్లు అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోవడాన్ని కూడా ప్రస్తావించారు. రాజ్యసభ టికెట్‌కు తనను ఎంపిక చేసిన పార్టీ నిర్ణయం తెలుసుకున్న ఆయన, తనకెందుకులే అని వ్యాఖ్యానించిన సహృదయుడు. కొందరు తమ గురించి గొప్పగా చెప్పుకుంటారు. కొందరు తామే గొప్ప అన్నట్టుగా వ్యక్తీకరించుకుంటారు. డాక్టర్‌గారు చెప్పిన విషయాలలో ఎక్కడా స్వోత్కర్ష లేదు. తను చేయని-చేయలేని పనిని వక్రీకరించి చెప్పలేదు. "కుటుంబసభ్యులతో పాటు స్నేహితులను, సహచరులను ప్రేమిస్తాను. అభిమానిస్తాను. కాని అది ప్రదర్శించలేను. స్వాభిమానం పాలు ఎక్కువ" అని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం లేకున్నా పార్టీ ముద్ర ఆయనమీద మొదట్నుంచీ పడింది. ఖమ్మం జిల్లాలో పార్టీ నిలదొక్కుకోడానికి ఆయన చేసిన కృషి అపారమైంది. ప్రజలకు సన్నిహితం కావడంలోనే పార్టీకి మేలు జరుగుతుందన్న తపన ఆయనలో వుంది. తనను జైలుకు పంపినవారి అవసరాలను కూడా అలవోకగా తీర్చిన మానవీయ వ్యక్తి. ఆదివారం సంఘాలు, స్టడీ సర్కిళ్లు, చర్చలు, విభిన్న దృక్ఫదాల రచయితలతో సాహితీ సమావేశాలు నిర్వహించిన వ్యక్తిత్వం ఆయనది.

ఒకవిధంగా చూస్తే ఇది ఆయన స్వీయచరిత్ర మాత్రమే కాకుండా, జ్ఞానాభివృద్ధికి దోహదపడే ఒక డాక్యుమెంటు అనవచ్చు. పార్టీకొరకు పనిచేసేవారు నిర్మాణాత్మకంగా కృషిచేయడానికి ఎన్నో రకాల సూచనలు కనిపిస్తాయిందులో. పార్టీపట్ల నిబద్ధత అంటే ఏమిటో ఇది  చదివినవారికి తెలుస్తుంది. ఒక వ్యక్తి బహుముఖ రంగాలలో పనిచేయడం ఎలా సాధ్యమవుతుందో కూడా అవగతమవుతుందిందులో. ఖమ్మం జిల్లాలోని రాజకీయ మార్పుల అవగాహనకు ఇదొక ప్రామాణిక పుస్తకం. ఇందులోని ఆత్మీయ స్వగతాలు, వ్యాఖ్యలు, అభిప్రాయాలు భావితరాల వారికి ఎంతగానో ఉపయోగపడతాయి.

వామపక్ష నిబద్ధత వున్నా, స్వంత అభిప్రాయాల విషయంలోను, జ్ఞాన సముపార్జన విషయంలోను హద్దులు గీసుకోలేదు డాక్టర్‌గారు. అపార జ్ఞాన సంపన్నుడు. క్రియాశీలక కార్యక్రమాలు, వైద్యం, పార్టీ పనులనుండి స్వచ్చందంగా విరమణ చేసుకున్నా, ప్రవృత్తైన పుస్తకపఠనం, రచనా వ్యాసంగం, సన్నిహితులతో కబుర్లు ఆయన నిత్యకృత్యంగా వుందింకా. వస్త్రధారణలో కాని, నిత్య కార్యక్రమాలలో కాని రాజీ పడలేదాయన. ప్రజారంగంలో ఇంత నిబద్ధత కలవారు అరుదుగా వుంటారు. ఈ పుస్తకం ఆయన స్వీయచరిత్ర అనడంకన్నా ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్ర అంటే బాగుంటుందేమో. ఆ కోణంలో ఇదొక ఉపయుక్త గ్రంధంగా పనికొస్తుందనాలి. భావితరాల వారికి ఇదొక కరదీపిక అనవచ్చు. ఆయన చెప్పినా, జ్వాలా రాసినా, చదువరులను ముందుకు నడిపించేరీతిలో వుందిది.


చివరగా... రాజకీయ నిబద్ధత లేకుండా, రాజకీయాలను అధ్యయనం చేసి, అధ్యాపకుడిగా జీవనం సాగిస్తున్న నాకు, ఈ పుస్తక పరిచయ వాక్యాలు రాయడమన్నది అందివచ్చిన గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్‌గారితో నాకున్న పరిచయం, జ్వాలాతో వున్న సాన్నిహిత్యం నన్ను పరిచయం రాయడానికి కారణమని భావిస్తున్నాను.
అనుభవాలే అధ్యాయాలు (జీవన యాన) పుస్తక పరిచయం
-ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు

 బాల్యం-కుటుంబ నేపధ్యం
విజయక్రాంతి దినపత్రిక (09-04-2019)
డాక్టర్ గారి కుటుంబ సభ్యులంతా కలిసి వంద మంది పైన వుంటారు. అన్నలు-తమ్ములు, అక్కలు-చెల్లెళ్లు, తల్లి వైపు-తండ్రి వైపు సమీప బంధువులు, బావా-మరుదులు, వదినా-మరదళ్లు, మామయ్యలు, బాబాయిలు, చిన్నాయనలు-పెద నాన్నలు, కజిన్లు....అందరూ కలుస్తుంటారు అప్పుడప్పుడు. సందడే-సందడి. అంతా కలుపుగోలుగా వుంటారు. కలవడానికి సందర్భం కొరకు వేచి చూస్తుంటారు. పెళ్లిళ్లలో-పేరంటాలలో, ప్రత్యేక సందర్భాలలో కలవడానికి అదనంగా, అడపాదడపా కూడా కలుస్తుంటారు. కలిసినప్పుడు గతంలోకి పోతుంటారు. అలాంటి గత స్మృతులు డాక్టర్ వై ఆర్ కె వర్ణిస్తుంటే, వినేవారు పరాయివాళ్లైనా సరదాగా వుంటుంది. ప్రముఖ రచయిత బోడెలె చెప్పిన "బాల్యం అనుభవాలను (తెలిసిన వారంతా) కలిసినప్పుడల్లా స్మరించు కోవడమే మేలు" అన్న వాక్యాలను, ఇటీవల అనుపమ్ ఖేర్ చెప్పిన "The memories of our happy days work as powerful trigger" (ద మెమొరీస్ ఆఫ్ అవర్ హాపీ డేస్ వర్క్ యాజ్ పవర్ ఫుల్ ట్రిగ్గర్) అన్న వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకునే డాక్టర్ గారు, "Memories can also be painful" (మెమొరీస్ కెన్ ఆల్సొ బి పెయిన్ ఫుల్) అంటారు. చిన్నతనంలో చదువుకున్న మాధవపెద్ది గారి ఖండ కావ్యం "పంచవటి"లోని ఊహాజనిత సన్నివేశంలో, కవి లక్ష్మణుడుని ఉద్దేశించి "ఎప్పుడు ఒకే సుఖంబై యుండెడి దేవతలకన్న కష్ట సుఖముల కలగల్పు గల్గు మనుజులన్నచే ప్రీతి జనించు లక్ష్మణా!" అన్న పద్యభాగాన్ని ప్రస్తావించారు. రామ-లక్ష్మణులకు ఎలా కష్టాలు-సుఖాలు ప్రాప్తించాయో, ఆయన జీవితంలోనూ, అలానే కష్ట-సుఖాలు కలగాపులగంగా ఎదురయ్యాయన్న భావం ఆయన మాటల్లో వ్యక్తమైంది.

రాధాకృష్ణమూర్తి స్వగ్రామం, కృష్ణా జిల్లా, గుడివాడకు నాలుగైదు కిలోమీటర్ల దూరంలో వున్న "జమీ దింటకుర్రు". అదొక్కప్పుడు ఒక జమీందారుకు చెందిన వూరు. అక్కడి గ్రామ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులను నూజివీడు జమీందారుకు పంపడం ఆనవాయితీగా వుండేది. కుగ్రామంలాంటి ఆ వూరి జనాభా వంద కుటుంబాలకు మించదు. అందులో చాలా వరకు కమ్మ కులానికి చెందిన వారే కావడం, ఒకరికొకరు బంధువులు కావడం విశేషం. ఇక పన్నులు వసూలు చేసుకుని తీసుకుపోయే జమీందారు, మేకా రంగయ్యప్పారావుగారి పూర్వీకులైన రాజా రంగయ్యప్పారావుగారు. ఆ వూరి సరిహద్దు గ్రామం పెదపారుపూడు ("ఈనాడు" అధినేత రామోజీరావు సొంత వూరు), మరోవైపు "వానపాముల" వుండేవి. చుట్టూ సారవంతమైన-నల్ల రేగడి వ్యవసాయ భూములు, మాగాణి భూములు వున్నాయి. పుష్కలంగా సాగు నీరు లభ్యమయ్యే వసతి కూడా వుంది. జమీ దింటకుర్రుకు చెందిన కొల్లి రామయ్య-నాగరత్నమ్మ దంపతుల పదకొండు మంది సంతానంలో రాధాకృష్ణమూర్తి రెండో వారు. (సశేషం)

No comments:

Post a Comment