Saturday, April 13, 2019

తన స్వరూపం చూపి సీతను భయపెట్టిన రావణుడు .... శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-56 : వనం జ్వాలా నరసింహారావు


తన స్వరూపం చూపి సీతను భయపెట్టిన రావణుడు 
శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం...అరణ్యకాండ-56
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రభూమి ఆదివారం సంచిక (14-04-2019)
         తన కులం, బలం వర్ణిస్తూ రావణాసురుడు, సీతతో ఇలా అంటాడు. “చలించే జింక కళ్ళదానా! ఈశ్వరుడి స్నేహితుడైన కుబేరుడికి నేను సహోదరుడిని. దశకంఠుడిని….నీ మగడికి ఒకటే తల వుంటే, నాకు పది తలలున్నాయి. రావణుడు అనే సార్థక నామధేయం కలవాడిని. గంధర్వులు, పన్నగులు, గరుడులు నన్ను చూసి భయపడతారు. మృత్యువును చూసినట్లు ఎవరిని చూస్తే పరుగెత్తుతారో, యుద్ధంలో ఎవరిని చూసి కుబేరుడు పరుగెత్తాడో, ఎవరికి భయపడి తన పట్టణమైన లంకను విడిచి కుబేరుడు కైలాసం చేరాడో, ఎవరు పుష్పక విమానాన్ని లాక్కొని తన వాహనంగా చేసుకున్నాడో, అలాంటి నా ముఖాన్ని చూసి ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా పరుగెత్తుతారు. నేనున్న చోట గాలి కదలదు. సూర్యుడు చంద్రుడిలాగా చల్లగా అయిపోతాడు. ఎక్కడెక్కడ నేను నిలుస్తానో అక్కడ చెట్లమీద ఒక్క ఆకైనా భయంతో కదలదు. నదులుకూడా వాతి వేగాన్ని వదిలి కట్టుబడి నిలుస్తాయి”.

         “క్రూరులు, భయంకరాకారం కల రాక్షసులు, సర్వ పదార్థాలు, చుట్టబడిన ప్రాకారాలు, బంగారుమయమైన తొట్టికట్లు, ఏనుగులు, రథాలు, గుర్రాలు, మణులతో చేయబడిన తోరణాలు, మంగళవాద్యాల ధ్వనులు, దేవతల ఉద్యానవనంలో అన్ని ఋతువులూ కాచే పూలు-పండ్ల చెట్లతో సముద్రమధ్యంలో, ఇంద్రపురితో సమానమైన లంక అనే పేరుగల నా పట్టణం వుంది. కుసుమకోమలా! చూడడానికి రా. ఈ పాడు అడవులు చూసి-చూసి మంచివస్తువులను చూడగోరే నీ కళ్ళకు లంకను చూస్తే సంతోషం కలుగుతుంది. నువ్వు సంతోషంతో నా పట్టణంలో, నాతో, ఆనందిస్తే మళ్లీ మనుష్య స్త్రీల సాంగత్యం మనసునందైనా స్మరించవు. నువ్వు అయోధ్యలో మనుష్య సుఖాలను అనుభవించానని చెప్పావు. నువ్వు లంకకు వస్తే మనుష్య సుఖాలు, దేవతల సుఖాలు కూడా అనుభవించవచ్చు. వాటికి అలవాటు పడితే, ఆ తరువాత, ఇప్పుడు నువ్వు గొప్పవాడు అనుకుంటున్న మనుష్యమాత్రుడైన రాముడిని, నీ వియోగం వల్ల చచ్చేవాడిని, నీచుడిని, బలహీనుడిని, దరిద్రుడిని తలచుకోనైనా తలచుకోవు”.

         “తన ముద్దులకొడుకు భరతుడికి పట్టాభిషేకం చేసి, నీ మామ పెద్దవాడైన నీ మగడిని, న్యాయంగా రాజ్యం రావాల్సిన వాడిని, అయోధ్యనుండి వెడలగొట్టితే, రాజ్యం సాధించే బలం లేని కారణాన అడవులకు వచ్చాడు రాముడు. న్యాయంగా తనకు రావాల్సిన రాజ్యాన్ని దక్కించుకునే శక్తిలేని బలహీనుడిని, ఊళ్లోకూడా వుండనీయకుండా తరిమికొట్టితే రాజ్యాన్ని వదిలినవాడిని, క్షీణించిన ఆయుషు కలవాదిని, ఊళ్లో వుంటే చంపుతారన్న కారణాన అడవులపాలై ఒంటిగా ఇక్కడికి వచ్చి దాగినవాడిని, మునివేషం వేసుకుని అడవుల్లో దుఃఖపడుతున్నవాడిని కోరడం అందమైన నీకు తగునా? సీతా నువ్వెంత కఠిన స్వభావం కలదానివే? అలాకాకపోతే, మన్మథ బాణాలతో కలతచెందిన మనసు కలవాడనైన నన్ను, ఎంతో ఆశపడి నీతో సుఖం అనుభవించ కోరిన నన్ను, రాక్షస లోకానికంతా ప్రభువైన నన్ను, గడ్డిపోచను చూసినట్లు అలక్ష్యంగా అవమానకరంగా చూస్తున్నావే? ఇది నీకు ధర్మమా? ఎదుటివాళ్ల పరువు ఆలోచించావా?


         “పిరికిదానా! ఇప్పుడు, లోకానికో, మగడికో, బందువులకో భయపడి నన్ను తిరస్కరిస్తున్నావు. కాని ఆ తరువాత నువ్వే మన్మథ తాపంతో పరితపిస్తావు. నీలాగే పూర్వం ఊర్వశి తనను కోరిన పురూరవుడిని కాలితో తన్ని, ఆ తరువాత అయ్యో! ఎంత పొరపాటు చేశాను, అలాంటివాడిని పోగొట్టుకున్నానే? ఇప్పుడు నా తాపం ఎవరు తీరుస్తారు? అని పశ్చాత్తాప పడలేదా? నీ గతీ అంతే అవుతుంది. రాముడేమో మహాబలపరాక్రమసంపన్నుడని అంటున్నావు. నా గోటికి కూడా సమానం కాదు. నన్ను, లోకాలన్నీ హాహా అని ఏడిపించే వాడినైన నన్ను, దేవతా స్త్రీల గర్భాలను నా పేరు చెప్పి మాత్రమే విచ్చిత్తి చేయగల నన్ను, పది తలల వాడినైన నన్ను, కైలాస పర్వతాన్ని ఎత్తిన నన్ను, కుబేరుడిని ఓడించి పుష్పక విమానాన్ని పొందిన నన్ను, ఇంద్రుడిని బందీచేసిన నన్ను, బ్రహ్మ-శివుడి వరాలు పొందిన నన్ను, ముల్లోకాలు జయించిన వాడినైన నన్ను చేరడానికి నీకు సందేహమెందుకే? నువ్వే నన్ను ప్రార్థించాలి కాని నేనై నిన్ను వచ్చి వేడుకోవాలా?

         “నీ పూర్వ పుణ్యం ఫలించడం వల్ల సీతా! నేను వచ్చాను. కాబట్టి నన్ను నిరాకరించవద్దు. నన్ను నిరాకరించడం అంటే నువ్వు నీ పూర్వపుణ్య ఫలాన్ని అనుభవించకపోవడమే! కాబట్టి నన్ను అంగీకరించు” అని రావణుడు అనగానే, ఒంటరిదాన్నే, పురుష సహాయం లేనిదాన్నే, కఠినంగా మాట్లాడితే వీడేమి చేస్తాడో అని భయంతో, కోపంతో, సీతాదేవి కఠినంగానే జవాబిచ్చింది.

         (ఇతర పురుషులు తనను సకామ దృష్టితొ చూసినా, ఇచ్చకాల ఆశకలిగించినా, తాకినా, ఎవరైతే వికారానికి గురికారో ఆమె నిజమైన పతివ్రత. ఎవరైతే మనోవాక్కాయలలో నైనా పర పురుషుడిని సేవించదో, ఇతరులు ధనమిస్తానని అన్నా ఆశపడదో, ఆమె పతివ్రత. ఆమె జనజనభూషణం అనబడుతుంది. దీనులై ఇతరులు ప్రార్థించినా, బలాత్కారంగా ఈడ్చినా, వస్త్రాదులు తెచ్చి ఇచ్చినా, పతివ్రత ఇతరులను కామించదు. ఇతరులు తనను చూసి నవ్వినా నవ్వదు. తనను వాడు చూసినా చూడదు. పలుకరించినా పలకదు. అలాంటిది పతివ్రత. సౌందర్యం, యవ్వనం కలదైనా, పండితురాలైనా, ఎవరైతే మనస్సులో వికారం చెందదో ఆమె పతివ్రత. సుందరుడు, వయస్కుడు, స్త్రీజన మనోహరుడు, ప్రియుడు అయిన పురుషుడిని ఎవరైతే కోరదో ఆమె మహాపతివ్రత. మగడు తింటేనే తాను తింటుంది. మగడు దుఃఖపడితే ఆమె దుఃఖపడుతుంది. మగడు సంతోషిస్తే ఆమె కూడా సంతోషపడుతుంది. మగడు గ్రామాంతరం పొతే ఆమె మాలిన వస్త్రం కడుతుంది. మగడు నిద్రించిన తరువాత పడుకుంటుంది. ఆయనకంటే ముందే నిద్ర లేస్తుంది).

No comments:

Post a Comment