Monday, April 22, 2019

రెవెన్యూ లో సంస్కరణలు రావాలె : వనం జ్వాలా నరసింహారావు


రెవెన్యూ లో సంస్కరణలు రావాలె
వనం జ్వాలా నరసింహారావు
నమస్తే తెలంగాణ దినపత్రిక (23-04-2019)
రెవెన్యూ వ్యవస్థలో భారీ సంస్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆసాంతం అవినీతిమయమైన రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి అనేక అవతవకలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోషల్ మీడియాలో వచ్చిన పిర్యాదులకు స్పందించి, సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి, వారి సమస్యలను పరిష్కారం చేసిన సందర్భాలు కూడా వున్నాయి. 

లోకసభ ఎన్నికల సభల్లో అనేక పర్యాయాలు రెవెన్యూ అవినీతి గురించి ప్రస్తావించకుండా వుండలేకపోయారు సీఎం. ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో కూడా రెవెన్యూ వ్యవస్థ అవినీతిని అంతం చేసే విషయాలపైనే ప్రత్యేకంగా చర్చించారు. కొత్త చట్టాలను తేవాల్సిన ఆవశ్యకత గురించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని తెలియచేశారు. ఈ నేపధ్యంలో, గతంలో వ్యవస్థలు-ముఖ్యంగా గ్రామీణ స్థాయి నుండి రెవెన్యూ వ్యవస్థ ఎలా పనిచేసేదో తెలుసుకోవాల్సిన అవసరం వర్తమాన, భావి తరాల వారికి ఎంతైనా వుంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సంస్కరణలను చేపట్టే ప్రయత్నం చేస్తే మంచిదేమో!!

అంబేడ్కర్ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఆచార్య మారంరాజు సత్యనారాయణరావు “గ్రామాయణం” పేరుతో రచించిన చిన్న పుస్తకంలో వీటికి సంబంధించిన అనేక విషయాలను వెలుగులోకి తెచ్చారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతంలోని భూసంబంధాలు, గ్రామీణ పాలనా వ్యవస్థ, భూ రికార్డులకు సంబంధించిన పటేల్-పట్వారీ వ్యవస్థ, శిస్తు విధానం, రెవెన్యూ విధానం లాంటి విషయాలను సత్యనారాయణరావు కూలంకషంగా విశదీకరించారు. బహుశా ఈ విషయాలను అవలోకిస్తే జవసత్వాలు కోల్పోయిన నేటి గ్రామీణ-రెవెన్యూ వ్యవస్థ, గ్రామీణుల కనీస అవసరాల మేరకైనా, ఇప్పటికంటే మెరుగ్గా పనిచేయడానికి కావాల్సిన ఆధారాలు దొరకవచ్చు. రెవెన్యూ సంస్కరణలంటే గ్రామీణ రైతాంగం బాగోగులే కదా!! వివరాల్లోకి పోతే.....  

ప్రాచీన కాలం నుండి కూడా వ్యవసాయ ఆధారిత గ్రామీణ వ్యవస్థ భూ ఆధారిత జనావాసాల కొనసాగింపే. ప్రతి గ్రామం ఒక రిపబ్లిక్ లాంటిది. గ్రామంలో తలెత్తే సమస్యలను గ్రామస్థులే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు ప్రతి చిన్న సమస్యకూ కింది కోర్టుల నుండి పై కోర్టుల దాకా ఆశ్రయించని పల్లెటూరువాడు లేడంటే అతిశయోక్తి కాదేమో! 19వ శతాబ్దం దాకా గ్రామాల మధ్య సరిహద్దులు కానీ, వ్యవసాయ భూములకు హద్దులు కానీ వుండేవి కాదు. 19వ శతాబ్దం మధ్యకాలం వరకూ తెలంగాణ జిల్లాలలో ఒక నిర్దిష్టమైన ప్రభుత్వ వ్యవస్థ లేదనాలి. మొఘల్ చక్రవర్తులు కానీ, షేర్షా కానీ, వ్యవసాయ భూముల కొలతలు వేయించారు కాని భూమి రికార్డులకు శాశ్వతత్వం కలిగించలేదు. ఆసఫ్ జాహీ వంశ స్థాపకుడు, మొదటి నిజాం, నిజాముల్ ముల్క్, ఆయన తరువాత వచ్చిన వారు పాలనా వ్యవస్థ స్థాపన గురించి పెద్దగా పట్టించుకోలేదు. 1830 లో సాలార్జంగ్ ప్రధాని పదవి చేపట్టేవరకు ఇలాగే సాగింది. బ్రిటీష్ వారి అధీనంలో వున్న ప్రాంతాలలో మాత్రం పటిష్ట పాలనా వ్యవస్థ దిశగా శిస్తు వసూలు చేయడానికి “కలెక్టర్” ను నియమించుకున్నారు.   

రాజుకు ధనం చేకూర్చే ఉద్దేశంతో నిజాం రాజ్యంలో ఏర్పడ్డ జాగీర్దార్, పాయగా, దొరల వ్యవస్థ సొంత లాభాలు చూసుకునే వ్యవస్థగా మారిపోయింది. ఇది 20వ శతాబ్దం ఆరంభం నాటి తెలంగాణ గ్రామాల పరిస్థితి. కాకతీయుల పాలనదాకా గ్రామ లెక్కలు, శిస్తు వసూళ్లు జైనులు చేసేవారు. గణపతి దేవుడి కాలంలో బ్రాహ్మణులలో ఒక ఆరువేల మందికి శిక్షణ ఇచ్చి, గ్రామ కరణాలుగా తయారుచేశారు. వీరినే ఆరువేల నియోగులు అంటారు. వీరు అతి తక్కువ సమయంలో గ్రామీణ లెక్కలు తయారుచేయగల సామర్థ్యం వున్నవారిగా పేరు తెచ్చుకున్నారు. ఆ విధంగా గ్రామ వ్యవసాయ ఆదాయ-వ్యయ లెక్కలు వీరికి అప్పచెప్పారు. శాంతి-భద్రతల పరిరక్షణకు తెలంగాణా గ్రామాలలో పటేల్ (మునసుబు) వుండేవాడు. కరణానికి, పటేల్ కు జీతాలుండేవి కాదు. గ్రామ ఆదాయంలో కొంత ప్రభుత్వానికిచ్చి కొంత ధనం తమకు కేటాయించుకునేవారు.

1853 లో అప్పటి నిజాం రాజు, సాలార్జంగ్ ను ప్రధానిగా నియమించారు. ఆయన ప్రధాని పదవి చేపట్టేనాటికి నిజాం రాజ్యం అస్తవ్యస్త పరిస్థితుల్లో వుంది. 30 సంవత్సరాలు ముగ్గురు నిజాంల దగ్గర పనిచేశాడు సాలార్జంగ్. బ్రిటీష్ వారి పలుకుబడిలోగల పాలనా వ్యవస్థ ఏర్పాటుకు అంకురార్పణ చేశారు. ఆయన చేపట్టి, అమలు పర్చిన పాలనా సంస్కరణలు నిజాం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చాయి. ఆయన ప్రారంభించిన “జిల్లా బందీ” విధానమే ఇటీవలి కాలం దాకా కొనసాగింది. నిజాం రాజ్యంలోని భూములను కూడా సర్వే చేయించారు. క్రమబద్ధమైన రికార్డులు తయారయ్యాయి. సర్వేకు ముందు ఏ రైతు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నాడో అన్న విషయం ఒక్క గ్రామాధికారికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అప్పటివరకూ గ్రామ వ్యవసాయ భూములకు నిర్దేశిత సరిహద్దులు లేవు. “పట్టాదారు” అన్న పదం సాలార్జంగ్ సర్వే-సెటిల్మెంటు ద్వారా స్థిరత్వం పొందింది.


సాలార్జంగ్ మొదట నాలుగు సుభాలను అంతర్గతంగా జిల్లాలుగా విభజించాడు. జిల్లాల సరిహద్దులు నిర్ణయించాడు. జిల్లాను తాలూకాలుగా విభజించి దానికి అధికారులుగా తహసీల్దార్లను నియమించాడు. అతడి కింద సేగేదార్లుగా పేష్కార్లను నియమించాడు. క్షేత్ర స్థాయిలో గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి గిర్దావర్లను నియమించాడు. ఇక గ్రామస్థాయిలో పట్వారీ, పోలీస్ పటేల్, మాలీ పటేల్ అని ముగ్గురు అధికారులను నియమించారు. వీరికి సహాయకుడిగా షేక్ సింధీని నియమించాడు. వీరే కాకుండా నీరడి, బారబలోత్దార్ కూడా వుండేవారు. వీరెవరికీ సర్కారు జీతాలివ్వలేదు. భూమి శిస్తు నుండి స్కేల్ ప్రకారం ఏటా కొంత ముట్టేది. 1956 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యేవరకు ఈ పద్ధతే కొనసాగింది.

పట్వారీ తనకున్న అదికారంతో, మంచితనంతో, గ్రామ రైతులందరినీ తన పక్షానే వుండేట్లు జాగ్రత్త పడేవాడు. శిస్తు వసూలు చేసేటప్పుడు “అడుక్కోళ్ళు” అన్న సంప్రదాయం వుండేది. గ్రామాదికారులకు అప్పట్లో జీతాలు లేవు కాబట్టి, శిస్తు వసూలు చేసేటప్పుడు రైతుల నుండి అరకకు ఇంత అన్న లెక్కన వసూలు చేసేవారు. ఇది (ఇప్పుడు వసూలు చేస్తున్న తరహా) లంచం కాదు. రైతులు చాలా ఉదారంగా ఇచ్చేవారు. శిస్తు చెల్లించినందుకు  “పావుటీ బహీ” అన్న పేరుతో రసీదు ఇచ్చేవారు. పట్వారీకి తాలూకా కార్యాలయంలో సముచిత స్థానం వుండేది. గ్రామానికి సంబంధించిన ఏ విషయమైనా పట్వారీని సంప్రదించకుండా తాలూకా అధికారులు చేసేవారు కాదు. ఇప్పటి విలేజ్ రెవెన్యూ అధికారికి ఆ గౌరవం లభించక పోవడానికి కారణాలు చెప్పుకోవాలంటే ఒకటి కాదు వంద వున్నాయి.     
                
సాలార్జంగ్ పుణ్యమా అని రైతుల భూమి సర్వే జరిగి, భూముల సారవంత గుణాన్ని అప్పటి అణాల లెక్కలో “ఆనావారి” రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. భూముల “నక్షా” (పటం)ను శాశ్వత ప్రాతిపదికగా వుండేట్లు సిల్క్ గుడ్డ మీద నల్ల సిరాతో ఏర్పాటు చేశారు. అవి నేటికీ చెక్కుచేదరకుండా వున్నాయి. వీటి ఆధారంగానే ప్రభుత్వం వివిధ సందర్భాల్లో భూములను బేరీజు వేసుకునేవారు. ప్రతి గ్రామానికి గ్రామకంఠం కింద కొంత భూమి, పశువుల దాణా కోసం గ్రామ విస్తీర్ణంలో నాలుగో వంతు భూమి “బంచరాయి” గా, ఎందుకూ పనికిరాని భూమిని “పోరంబోకు” గా నియంత్రించారు. ఇప్పుడు బంచరాయి కానీ, పోరంబోకు భూమి కానీ ఏ గ్రామంలోనైనా ఒక్క కుంట కూడా కనిపించదు. రైతుల భూముల్లోని రాళ్లు, రప్పలు, గుంటలు, వ్యవసాయానికి పనికిరాని భూమిని “ఫూట్ కరాబ్” గా పిల్చి దానికి శిస్తు వసూల్ చేయలేదు. ఇప్పుడు రైతుబందు సహాయానికి ఫూట్ కరాబ్ లెక్కలోకి తీసుకుంటున్నట్లు లేదు. తెలంగాణ జిల్లాల్లో రైతుల భూములకు మాత్రమే రికార్డులు వుంచి, ప్రభుత్వ భూములకు రికార్డులను ప్రతిపాదించలేదు. కాకపోతే ఆదాయం వచ్చే భూములకు సర్వేరాళ్లు వేసి ప్రభుత్వమే దాని బాధ్యత చేపట్టింది.

ఈ విధమైన సర్వ్-సెటిల్మెంటు తరువాత రికార్డులను కాపాడే బాధ్యత తెలంగాణ ప్రాంతంలో గ్రామ పట్వారికి అప్పచెప్పింది ప్రభుత్వం. గ్రామాధికారులు వంశపారంపర్యంగా గ్రామస్తుల రికార్డులను శిస్తు వసూల్ బాధ్యతను మాలీ పటేల్ కు అప్పచెప్పేవారు. గ్రామంలోని వ్యవహారాలను పరిశీలించడానికి పోలీసు పటేల్ కు అధికారం వుండేది. ఇతడు ప్రతివారం సమీపంలోని పోలీస్ స్టేషన్ కు “రోజునాంచ” సమర్పించాలి. ఇందులో జనన మరణాలు, అంటురోగాలు, తగాదాలు, కొట్లాటలు, రహదారి చిట్టీల వివరాలు లాంటివి వుండేవి. 1960 దశకం దాకా ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం వ్యవసాయ భూములమీద వసూలు చేసే శిస్తు. ఇప్పుడా శిస్తు లేదు కాబట్టి అలాంటి రెవెన్యూ వ్యవస్థ కూడా అవసరం లేదేమో!!! అలాగే చాలా కాలం దాకా “కరోడ్గిరి” సుంకం కూడా. పంచాయితీరాజ్ వ్యవస్థలు వచ్చేంత వరకు గ్రామాలలో ప్రభుత్వాధికారం అంతా పట్వారీ, పటేల్ కనుసన్నల్లోనే వుండేది.

వ్యవసాయ భూముల యాజమాన్య వివరాలు, శిస్తువివరాలు రికార్డు చేయడం పట్వారీ ప్రధాన బాధ్యత-విధి. ఆయన తయారుచేసిన రికార్డులే ప్రభుత్వానికి ఆధారం. సాలార్జంగ్ సర్వే అనంతరం ప్రతి రైతు వ్యవసాయ భూమి వివరాలన్నీ ఒక శాశ్వత రిజిస్టర్ గా వ్యవస్థీకరించారు. దాన్నే “సేత్వారీ” అని అంటారు. ప్రతి భూకమతానికి ఇచ్చిన నంబర్లను “సర్వే నంబర్” అన్నారు. ఈ సర్వే నంబర్ల వివరాలన్నీ పట్వారీ దగ్గర, తహసీల్దార్ దగ్గర, సర్వే అధికారి దగ్గర మాత్రమే వుండేవి. దీని ఆధారంగా ప్రతి సంవత్సరం పట్వారి “పహాణీ, చౌఫస్లా” అనే రెండు రిజిస్టర్లు రాసి తహసీల్దార్ సంతకాన్ని చివరి పేజీ మీద తీసుకునేవాడు. ప్రతి పేజీ మీద తహసీల్దార్ ముద్ర వేసేవారు. ఈ రికార్డుల్లో సర్వే నంబర్ వారీగా దాని విస్తీర్ణత, వర్గీకరణ, దున్నేవాడి పేరు, పంట వివరాలు, ఇన్స్పెక్షన్ వివరాలు, నాలుగు పంటల వివరాలు లాంటివి వుండేవి. వీటి ఆధారంగా సంవత్సరాంతంలో జరిగే “జమాబందీ” లో ఫలానా గ్రామం నుండి వసూలు అయ్యే శిస్తు నిర్ణయించేవారు. ఇప్పుడు శిస్తు ప్రసక్తే లేదు కాబట్టి జమాబందీ అవసరమే లేదు.  

గ్రామాల్లో రికార్డులు తయారుచేయడానికి ఆంగ్ల సంవత్సరం కానీ, తెలుగు సంవత్సరం కానీ, ఉర్దూ కాలెండర్ కానీ అనుసరించకుండా పర్షియన్ సంవత్సరం “ఫస్లీ” ని ప్రాతిపదిక చేశారు. వ్యవసాయ పనులు ఆరంభమయ్యే జూన్ 7వ తేదీ నుండి రైతులు సాగుచేసే భూములను పట్వారీ ప్రత్యక్షంగా (తనిఖీ చేసి) చూసి పహాణీలో నమోదు చేసేవాడు. ఇప్పటి పట్టాదారు పాసు పుస్తకం లాగా ఒకప్పుడు పహాణీ ఒకరకమైన ప్రాధమిక హక్కు పత్రం. శిస్తు వసూలుకు ప్రాతిపదికైన రికార్డు పహాణీ. కాకపొతే శిస్తు లేని ఈ రోజుల్లో పట్టాదారు పాసు పుస్తకం రైతుబందు సహాయానికి, భూ యాజమాన్య నిర్ణయానికి ప్రాతిపదిక, హక్కు పత్రం. అప్పట్లో, పట్వారీ నాలుగు నెలలకు చేసే తనిఖీని “చారుమహీ తనిఖీ” అనేవారు. ఆ తరువాత చేసే తనిఖీని “హస్తు మాయి తనిఖీ” అనేవారు. ఈ తనిఖీల పర్యవేక్షకుడు గిర్దావర్. గ్రామాల్లోని చెర్వులకు వచ్చే నీళ్ల వివరాలతో “బారిష్ తక్తా” తయారు చేసేవాడు పట్వారీ. పహాణీ, బారిష్ తక్తాల ఆధారంగా జమాబందీ జరిగేది. జమాబందీ ఆధారంగా “పైసల్ పట్టీ” తయారు చేసేవారు. ఎంత శిస్తు రావాలో, ఖజానాకు వచ్చిందో తేలిపోయేది.  పట్టేదారులు చనిపోయి వారసత్వం సరిగ్గా వున్నప్పుడు రికార్డుల్లో మార్పులు చేసే విషయం జమాబందీలో నిర్ణయం అయ్యేది. వారసుల మధ్య తగాదాలను కూడా అప్పుడే పరిష్కరించేవారు. దీని తరువాత రెండవ పంట వేయడానికి వీలుందా? లేదా? అని నిర్ణయించి దానికి అనుగుణంగానే రైతు నడుచుకునేవాడు.

పంచాయితీరాజ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడంతో గ్రామీణ రాజకీయ, సామాజిక జీవనంలో కొత్త పోకడలు అంకురించాయి. గ్రామాదికారుల ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. చివరకు ఎన్టీఆర్ పుణ్యమా అని వంశపారంపర్య వతన్దారీ వ్యవస్థ రద్దుకు దారితీసింది. వంశపారంపర్యంగా పనిచేస్తున్న వారి స్థానంలో కొత్త అధికార గణాన్ని ఏర్పాటు చేసింది నాటి ఎన్టీఆర్ ప్రభుత్వం. ఇంతకు ముందు వతన్ దారులుగా వున్న వారు గ్రామాల్లోనే వుంటూ గ్రామస్థులందరికీ అందుబాటులో వుండేవారు. వతన్ దారీ వ్యవస్థ రద్దు కావడంతో గ్రామ రికార్డుల తయారీలో అనేక రకాల లోటుపాట్లు చోటు చేసుకోవడం మొదలైంది. కొత్తగా ఏర్పడ్డ గ్రామాధికార వ్యవస్థకు ఏ విధమైన అవగాహన, శిక్షణ లేకపోవడంతో రైతులకు, గ్రామాదికారులకు మధ్య అగాధం నెలకొన్నది. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కొత్తగా నియమించబడ్డ గ్రామాదికారులకు జీతాలు, బదిలీలు వుండడంతో గ్రామ సంక్షేమానికి బదులు వారు తమ స్థానాన్ని పదిలపర్చుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపడం మొదలైంది. తహసీల్దార్, పట్వారీ మధ్యనున్న సంబంధాలు నేటి ఎమ్మార్వో, వీఆర్వో మధ్య లేవు.  

అలా మార్పులు చోటు చేసుకున్న గ్రామీణ-రెవెన్యూ వ్యవస్థను సంస్కరించడానికి ఎవరూ ముందుకు రాలేదింతవరకు. రైతు భూమితో ముడిపడి వున్న రెవెన్యూ వ్యవస్థ సంస్కరించడానికి కూడా ఎవరూ ముందుకు రాలేదు ఇంతవరకు. అదే పనికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. గ్రామస్థాయి వీఆర్వో నుండి, ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయిదాకా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలి. రైతు తాను అనుభవిస్తున్న తన భూమిపై సర్వ హక్కులు తనవే అన్న నమ్మకం ప్రభుత్వం కలిగించాలి.

1 comment:

  1. >>>రెవెన్యూ లో సంస్కరణలు రావాలె.

    అంతే కదండీ? మీ కేసీఆర్ ప్రభువు గారు ఏది రావాలంటే అది రావాలీ ఏది పోవాలంటే అది పోవాలీ మరి! రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?

    >>>రైతు తాను అనుభవిస్తున్న తన భూమిపై సర్వ హక్కులు తనవే అన్న నమ్మకం ప్రభుత్వం కలిగించాలి

    ఏమో నండీ. మాకైతే ఈ వాక్యం వేరేలా అనిపిస్తోంది. రైతు అనుభవిస్తున్న తన భూమిపై సర్వ హక్కులు తనవే అన్న నమ్మకం కేసీఆర్ గారికి కలిగించాలి సంస్కరణలు అని. ప్రజలకోసం బంగారు తెలంగాణా అన్న మాటకు చివరికి కేసీఆర్ & సన్స్ తెలంగాణా అని అర్థం వచ్చిందా లేదా? ఈ సంస్కరణల వెనుక ఉద్దేశమూ అలాంటిదే అని గట్టిగా అనుకోకుండా ఉండలేం

    ReplyDelete