ఐదు
దశాబ్దాల క్రితం నాటి హైదరాబాద్ జ్ఞాపకాలు
వనం
జ్వాలా నరసింహారావు
నమస్తే
తెలంగాణ దినపత్రిక (11-09-2014)
1964 జూన్ నెలలో నేను, నాన్న గారు కలిసి
మొదటిసారి హైదరాబాద్ చేరుకున్నాం. ఖమ్మంలో మధ్యాహ్నం
పన్నెండు గంటలకు బస్సెక్కితే హైదరాబాద్ గౌలిగూడా బస్ స్టాండ్ చేరుకునే సరికి
సాయంత్రం ఏడు దాటింది. అప్పట్లో ఎక్స్ ప్రెస్ బస్సు కాదది.
ఒకరకమైన ఫాస్ట్ పాసింజర్ లాంటిది. కండక్టర్
ఇష్టమొచ్చిన చోట బస్సును ఆపేవాడు. చిక్కడపల్లి వెళ్లడానికి
గౌలిగూడా నుంచి రిక్షా కుదుర్చుకున్నాం. రిక్షా వాడిని మొదలు
"చల్తే క్యా" అని అడగాలి.
అంతా హింది-ఉర్దూ కలిసిన భాష. "కహా జానా సాబ్" అని వాడు అడగడం...మేం చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ"
అని చెప్పడం, అంగీకరించిన రిక్షా వాడు "బారానా" (75 పైసలకు సమానం) కిరాయి అడుగుతే, మేం "ఛె
ఆనా" (వాడడిగిన దాంట్లో సగం) ఇస్తామనడం,
చివరకు "ఆఠానా" కు కుదరడం జరిగిపోయింది. గౌలిగూడా, ఇసామియాబజార్, సుల్తాన్ బజార్, బడీ చావిడి, కాచి గుడా చౌ రాస్తా, వై.ఎం.సి.ఏ మీదుగా చిక్కడపల్లి "దేవల్ కి బాజు గల్లీ"
లో వున్న మామయ్య ఇంటికి సుమారు ఎనిమిది గంటల రాత్రి సమయంలో
చేరుకున్నాం. అలా మొదలైంది నా హైదరాబాద్ అనుభవం.
1964 జూన్ నెలలో న్యూ సైన్స్ కాలేజీలో బిఎస్సీ డిగ్రీ రెండో సంవత్సరంలో చేరాను.
విద్యా నగర్ అడ్డీకమేట్ లో ఒక గది అద్దెకు తీసుకున్నాను. నెలసరి అద్దె పది రూపాయల లోపే! అప్పట్లో నాన్న గారు
నాకు నెలకు వంద రూపాయలు ఖర్చులకొరకు పంపేవారు. రెండు నెలలు
శెలవులు పోగా, మిగిలిన పది నెలల మొత్తం మీద వెయ్యి రూపాయలు
వచ్చేవి. ఫీజులకు పోను, నెలంతా
ఖర్చులకు పోను, ఇంకా నెలకు పది-పదిహేను
రూపాయలు మిగిలేవి. అవి దాచుకునేవాడిని. శెలవుల్లో ఇంటికి వెళ్లేటప్పుడు తమ్ముళ్లకు-చెల్లెళ్లకు
ఏమన్నా కొనుక్కోపోయేవాడిని. ఎన్ని కొన్నా ఇంకా డబ్బులు
మిగిలేవి. అప్పట్లో, నారాయణ గుడాలోని "యాక్స్" టైలర్ దగ్గర కాని, "పారగాన్" టైలర్ దగ్గర కాని బట్టలు కుట్టించుకునేవాడిని. అప్పట్లో కుట్టు
కూలీ ఐదారు రూపాయల కంటే మించకపోయేది. ఇప్పటి లాగా అప్పట్లో "రెడీ మేడ్" దుస్తులు ఎక్కువగా లభించకపోయేవి.
ఎక్కువగా "టెరిలీన్", "వులెన్" దుస్తులు లభించేవి. కాటన్ తక్కువే. మొదట్లో "బాటం
వెడల్పు" గా వుండే పాంట్లు కుట్టించుకునే వాళ్లం.
ఆ తరువాత "గొట్టం" పాంట్ల ఫాషన్ వచ్చింది. అవి పోయి "బెల్ బాటం" వచ్చాయి. పాంటు
కింద భాగంలో మడతతో కొన్నాళ్లు, మడత లేకుండా కొన్నాళ్లు ఫాషన్‌గా
వుండేది.
విద్యా
నగర్ లో వున్నంత కాలం భోజనం సమీపంలోని చెలమయ్య హోటెల్ లో తినేవాడిని. చెలమయ్య హోటెల్
ఇడ్లీలు కూడా తినేవాడిని ఉదయం పూట. విద్యా నగర్ నుంచి
కాలేజీకి వెళ్లడానికి "3-డి" బస్సు ఎక్కి, నారాయణ గుడాలో దిగి, నడుచుకుంటూ, విఠల్ వాడీ మీదుగా వెళ్లేవాడిని.
ఒక్కో సారి "చారనా" బాడుగ ఇచ్చి "చార్మీనార్ చౌ రాస్తా"
(ఇప్పటి ఆర్. టి. సి.
క్రాస్ రోడ్స్) వరకు రిక్షాలో వచ్చి, అక్కడ నుంచి "7-సి" బస్సెక్కి,
వై.ఎం.సి.ఏ దగ్గర దిగి నడుచుకుంటూ వెళ్లేవాడిని కాలేజీకి. చార్మీనార్
చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండేదప్పట్లో. చార్మీనార్
సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే)
కర్మాగారం అక్కడే వుండేవి. చార్మీనార్ చౌ
రాస్తా నుంచి విద్యానగర్‍కు వెళ్లడానికి పక్కా రోడ్డు లేదప్పట్లో. ఆ మార్గంలో సిటీ బస్సులు నడవకపోయేవి. విద్యా నగర్
పక్కనే జమిస్తాన్ పూరాకు వెళ్లడానికి "రామ్ నగర్ గుండు"
మీద నుంచి వెళ్లే వాళ్లం. చార్మీనార్ చౌ
రాస్తా-ఆర్. టి. సి.
క్రాస్ రోడ్స్ నుంచి (ఇప్పుడున్న) టాంక్ బండ్‍ను కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు
టాంక్ బండ్‍ను కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. దానిని తొలగించడానికి అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మొదట్లో సాధ్యపడలేదు. ఇందిరా పార్క్ అసలే లేదు.
ధర్నా చౌక్ కూడా లేదు. ఇందిరా పార్క్ దగ్గర
నుంచి టాంక్ బండ్ పక్కగా ప్రస్తుతం వున్న "ఫ్లయిఓవర్"
కూడా లేదప్పుడు. ఆ రోజుల్లో హైదరాబాద్‌లో
కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని
ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. డ్రైవర్
కాకుండా ముగ్గురికంటే ఎక్కువగా టాక్సీలో కూర్చోనీయక పోయే వాళ్లు. ఆటోలు కూడా వుండేవి కాని అంత పాపులర్ కాదు. ఆటోలలో
ఇద్దరు పాసింజర్లకే పర్మిషన్. టాక్సీలకు కిలోమీటర్‌కు పావలా
చార్జ్ వున్నట్లు గుర్తు.
సిటీ
బస్సుల్లో ప్రయాణం ఇప్పటి లాగా కష్టంగా వుండేది కాదు. హాయిగా ప్రయాణం
చేసే వాళ్లం. "ఆగే బడో" అనుకుంటూ
కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో
కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన
నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్
బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున
తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో,
అణా-బేడలలోనో వుండేది. కనీస చార్జ్ ఒక "అణా"-ఆరు "నయాపైసలు"
వున్నట్లు గుర్తు. ఉదాహరణకు విద్యా నగర్ నుంచి
నారాయణ గుడాకు కాని, చార్మీనార్ చౌ రాస్తా నుంచి వై.ఎం.సి.ఏ కు కాని "అణా" లేదా ఆరు పైసలు రేటుండేది. ఇంతకీ "అణా" ఏంటనే
ప్రశ్న రావచ్చు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో
కొన్నాళ్ల వరకు-బహుశా ఒక ఆర్నెల్ల వరకనుకుంటా, ఇంకా అణా-బేడలు చలామణిలోనే వుండేవి. అందుకే ఇక్కడ కొంత మన నాణాల గురించి ప్రస్తావిస్తే బాగుంటుందేమో! ఆగస్ట్ 15, 1947 భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజుల్లో అమల్లో వున్న కరెన్సీ
నాణాలు "దశాంశ" తరహా నాణాలు కావు. రూపాయను పదహారు "అణా” లుగా,
ఎనిమిది "బేడ” లుగా,
నాలుగు "పావలా” లుగా,
రెండు "అర్థ రూపాయ” లుగా విభజించి చలామణిలో వుంచారు. ఒక "అణా” కు నాలుగు పైసలు...రూపాయకు
64 పైసలు. 1957 లో "డెసిమల్"
పద్ధతిలోకి చలామణిని మార్చింది ప్రభుత్వం. అయితే
1964 (నేను హైదరాబాద్
వచ్చిన కొత్త రోజుల) వరకు, నాన్-డెసిమల్ (అణా, బేడ, పావలా...), డెసిమల్ పద్ధతులు రెండింటినీ వాడకంలో
వుంచారు. అణా గుండ్రంగా, బేడ నాలుగు పలకలుగా-పచ్చ
రంగులో వుండేవి. ఆ తరువాత నాన్-డెసిమల్
నాణాల వాడకం ఉపసంహరించింది ప్రభుత్వం. ఇప్పుడు మనం పైసలుగా
వ్యవహరిస్తున్న నాణాలను 1957-1964 మధ్య కాలంలో "నయా పైస” లుగా పిలిచేవారు.
1, 2, 5, 10, 20, 25, 50 (నయా) పైసల నాణాలు చలామణిలో వుండేవి.
విద్యా
నగర్ లో ఎక్కువ రోజులుండలేదు. అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి రావడం ఇబ్బందిగా వుండడంతో
మకాం మార్చి, హిమాయత్ నగర్ లో ఒక గది అద్దెకు
తీసుకున్నా. అద్దె పది రూపాయలు. ఇద్దరం వుండేవాళ్లం. చెరి ఐదు రూపాయలు. కాలేజీకి వెళ్లే
దారిలో వై.ఎం.సి.ఏ
కి ఎదురుగా "ఇంద్ర భవన్" అనే
ఇరానీ రెస్టారెంటులో ఆగుతుండేవాళ్లం ఒక్కొక్కప్పుడు. అక్కడ
కాకపోతే, కాలేజీ ఎదురు గుండా (ఇప్పటికీ
వుంది) "సెంటర్ కెఫే" కి
పోయే వాళ్లం. ఇరానీ "చాయ్"
(బహుశా) 15 పైసలిచ్చి తాగే వాళ్లం. ఒక్కోసారి "పౌనా" తాగే
వాళ్లం. 5 పైసలకు ఒక సమోసా,
లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లం.
అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే సాయంత్రాలు చిక్కడపల్లి
వెళ్లి "సాయిబాబా మిఠాయి భండార్" లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్
మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే
వాళ్లం. పావలాకు అర డజన్ మౌజ్-అరటి
పళ్లు దొరికేవప్పుడు. చిక్కడపల్లి రోడ్డు మీద వున్న మరో
హోటెల్ "గుల్షన్ కెఫే" కి
కూడా వెళ్తుండేవాళ్లం. గుల్షన్ కెఫే సమీపంలో "రూబీ ఆర్ట్ స్టూడియో" వుండేది. పక్కనే "ప్రజా ఫార్మసీ మెడికల్" షాప్, దానికి ఎదురుగా "మహావీర్
మెడికల్ షాప్" వుండేవి. చిక్కడపల్లి
మా మామయ్య ఇంటికి పోయే సందులోనే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జి. వెంకట స్వామి ఇల్లుండేది. ఆయనను తరచుగా
చూస్తుండేవాళ్లం. శెలవుల్లో హిమాయత్ నగర్‌లో వున్న "గాయత్రీ భవన్" కు కాని, నారాయణ
గుడాలో వున్న తాజ్ మహల్ కు కాని టిఫిన్ తింటానికి వెళ్లే వాళ్లం. ఇక భోజనం ఎప్పుడూ నారాయణ గుడా తాజ్ మహల్ హోటల్లోనే. అప్పట్లో
తాజ్ మహల్ లో 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కునే వాళ్లం. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు
గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్లగలిగే వాళ్లం. ఇక
భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు
ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ
పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. నేను
స్టూడెంటుగా వున్నంతకాలం ఒక్క తాజ్ మహల్ హోటెల్ లోనే భోజనం చేశాను. క్రమేపీ రేట్ పెరుక్కుంటూ పోయింది. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్"
ఇడ్లీ కూడా రాని పరిస్థితి!
నారాయణ
గుడా తాజ్ మహల్ హోటెల్ లో సాయంత్రాలు కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్
బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా
అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట
పడే వాళ్లం. తాజ్ మహల్ నుంచి బయటికొచ్చి, కాసేపు నారాయణ గుడా బ్రిడ్జ్ పక్కనున్న పార్క్ లో కూచుని కబుర్లు
చెప్పుకునే వాళ్లం. ఒక్కో సారి స్నేహితులతో కలిసి, హిమాయత్ నగర్ మీదుగా, పీపుల్స్ హై స్కూల్ పక్కనుంచి
నడుచుకుంటూ, చిక్కడపల్లి దాకా పోయి, తిరిగి
తాజ్ మహల్ హోటెల్ కు వచ్చి భోజనం చేసి రూమ్ కు వెళ్లే వాడిని. మధ్య-మధ్య నారాయణ గుడా నుంచి నడుచుకుంటూ వై.ఎం.సి.ఏ మీదుగా, బడీ చావడీ, సుల్తాన్ బజార్, కోఠి
తిరిగి వచ్చే వాళ్లం. తిరుగు ప్రయాణం, ఒక
వేళ అలిసిపోతే, బస్సులో చేసే వాళ్లం. హిమాయత్
నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో
మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లే వాళ్లం. అశోక్ నగర్
లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్"
గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం
రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్
హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది.
దాని ముందర నుంచి చీకటి పడిన తరువాత వెళ్లాలంటే కొంచెం భయమేసేది
కూడా.
హైదరాబాద్‌లో
ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు
కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్
థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్. ఇవి కాకుండా
నారాయణ గుడాలో "దీపక్ మహల్", హిమాయత్ నగర్ లో "లిబర్టీ", సికిందరాబాద్ లో "పారడైజ్", "తివోలీ" థియేటర్లుండేవి. సికిందరాబాద్
లో ఎక్కువగా ఇంగ్లీష్ సినిమాలు చూపించేవారు. ఆర్టీసీ క్రాస్
రోడ్డులో ఇప్పుడున్న థియేటర్లు ఏవీ అప్పుడు లేవు. ముషీరాబాద్‌లో
"రహమత్ మహల్" టాకీసుండేది.
అలానే నారాయణ గుడా దీపక మహల్ పక్కన "రాజ్
కమల్" బార్ అండ్ రెస్టారెంట్ (ఇప్పటికీ
వుంది) వుండేది. బహుశా అందులో మద్యపానం
అలవాటు చేసుకోని వారు అరుదుగా వుంటారేమో! నాకు బాగా
గుర్తుంది….. డిగ్రీ పరీక్షల్లో, చివరిగా,
మాడరన్ ఫిజిక్స్ పేపర్ అయిపోయిన తరువాత, మధ్యాహ్నం
పూట, మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్
బార్‌కు వెళ్లి, "గోల్డెన్ ఈగిల్" బీర్ తాగాను. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు
రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను
వదలలేదు. మరో మూడేళ్లలో నా తాగుడికి "గోల్డెన్ జూబ్లీ" సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో!
అప్పుడు మూడు రూపాయల ధర మాత్రమే వున్న బీర్ బాటిల్ ఇప్పుడు వంద దాటి
పోయింది...అప్పట్లో కేవలం గోల్డెన్ ఈగిల్ లాంటి ఒకటి-రెండు బ్రాండులే వుండగా, ఇప్పుడు లెక్క లేనన్ని
వున్నాయి!
నేను డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో
వున్నప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుల మధ్య, ఉపకులపతి
(వైస్ ఛాన్స్ లర్) డి. ఎస్. రెడ్డి వ్యవహారంలో
బాగా గొడవలు జరిగాయి. ఒక
గ్రూపుకు మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి, కె. కేశవరావు (మొన్నటి వరకూ
ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు...ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి
ప్రధాన కార్యదర్శి) మార్గదర్శకత్వం వహించగా, మరొక గ్రూపుకు నాటి విద్యార్థి నాయకులు ఎం. శ్రీధర్
రెడ్డి, పుల్లారెడ్డి, (జన సంఘ్)
నారాయణ దాస్, కమ్యూనిస్టు పార్టీ అనుబంధ
విద్యార్థి సంఘ నాయకులు నాయకత్వం వహించారు. 1966 లో, నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, 1957 నుంచి ఉపకులపతిగా పని చేస్తున్న డి. ఎస్. రెడ్డిని పదవి నుంచి తప్పించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు కాలేజీ ప్రిన్సిపాల్ (పేరు
గుర్తుకు రావడం లేదు) ను నియమించడం కూడా జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకోవడానికి రావడం, విద్యార్థుల ఆందోళన
మధ్య వెనక్కు తిరిగిపోవడం నా కింకా గుర్తుంది. బ్రహ్మానందరెడ్డి
తీసుకున్న చర్యకు మద్దతుగా జైపాల్ రెడ్డి, కేశవరావులు
ఉద్యమించగా, వ్యతిరేకంగా విద్యార్థి నాయకులు ఉద్యమించారు.
ఇంతకు, డి. ఎస్. రెడ్డి చేసిన తప్పేంటి అంటే...ఆయన ఉస్మానియా
యూనివర్సిటీకి స్వయం ప్రతిపత్తి కావాలని ప్రతిపాదించడమే! అది
నచ్చని బ్రహ్మానందరెడ్డి ఉపకులపతిని తొలగించడానికి చట్టాన్ని సవరించే ప్రయత్నం
కూడా చేశాడు. డి.ఎస్. రెడ్డి హైకోర్టుకు, సుప్రీం కోర్టుకు న్యాయం కోసం
వెళ్లాడు. చివరికి కోర్టులో ఆయన పక్షానే తీర్పు వచ్చింది.
1969 వరకు ఆయనే వైస్ ఛాన్స్ లర్‍గా కొనసాగారు. 1968 లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమానికి అంకురార్పణ జరుగుతున్నప్పుడు
ఆయనే వైస్ ఛాన్స్ లర్. ఉద్యమం వూపందుకునే సరికి రావాడ
సత్యనారాయణ ఆయన స్థానంలో వచ్చారు. వైస్ ఛాన్స్ లర్‍గా డి.ఎస్. రెడ్డి కొనసాగించాలని న్యాయస్థానం తీర్పు
ఇచ్చిన నేపధ్యంలో, డిగ్రీ విద్యార్థులకు పరీక్షల్లో "గ్రేస్ మార్కులు" ప్రకటించింది యూనివర్సిటీ.
నేను పరీక్ష రాయకపోయినా, కేవలం హాజరైనందుకు
నాకు అన్ని సబ్జెక్టుల్లో 15 మార్కులొచ్చాయి!
Sir! very interesting and worthful
ReplyDeleteVenkata Sitaramasai
Great rememberance
ReplyDeleteKautoori Durgaprasad
I followed your foot steps exactly 2 years later i.e.1966 in letter and spirit from Gowliguda Bus Depo to Chikkadpally, Praja Pharmacy Lane i.e. adj.lane to Venkateswara Swamy Temple lane. All you said match with my feelings, experience, exposure. It may be the same feeling of all our contemporaries who stayed in and around Chikkadapally during 60s-80s. There is not even one per cent variance with your sweet memories. From that time till this day I am staying in this area(now Ashok Nagar Extension-Gandhi Nagar) even though I stayed in New Delhi, Bengaluru, Tirupati, Vijayawada in between on my transfer on elevations to higher positions. Like us there must be many recollecting the sweet memories in the educational institutions associated be it for academic or extra curricular activities viz.NCC(weekly parades in Nizam College grounds), debating competitions etc.Vivek Vardani, Badruka, Law College or University Campus during strikes/agitations.
ReplyDeletePsr Murthy
chaalaa baagundi
ReplyDeleteVijaysankar Turlapati
nice memories
ReplyDeleteVimalanand Annapragada
Nice sir
ReplyDeleteArza Prasad
Great Pedananna.............Chala Baga Vivarincharu...............
ReplyDeleteNaga Harshini Komaragiri
Very nice Sir Jwala garu to so many details of olden days in Hyderabad. I came to Hyderabad in June 1967 and studied in New Science College (Evening) during 1972-73 for final B.Com.
ReplyDeleteMangapati Rao Komaragiri
the narration, remembrance are wonderful
ReplyDeleteSuguna Prasad Kalvala
baraana daggaranunchi baaga gurthupettukuni vrasaaru sir
ReplyDeleteAnjaneyulu Vsr
back to memory lane. I was studying 1st year Medicine in Osmania in 1964 and living in Vidyanagar and not far from Chalamayya Hotel and Ramayya just joined him. The one hour vice chancellor of Osmania University was Dr Pinnamaneni Narasimha Rao from Guntur.
ReplyDeleteHari Gopal from United Kingdom
JWALA GARU REALLY MANCHI MEMORIES ARTICLE CHADIVINA VENTANE NENU ESAMIYABAZAR LO ROOM LO VUNDI CHUSINA CINEMALU GNAPAKANIKI VAC CHAYI ATLE MITO PATU G KRISHNA GARI INTLO ANDARITO PATU GADIPINA KSHANALU GNAPTIKI VACCHAYI THANKS FOR YOUR ARTICLE
ReplyDeleteShareeff Mohammed
Great remembrance Jwala garu
ReplyDeleteBhaskarasarma Sarma
Jwala garu -your are an expert in gigging old memories.Very Very interesting and a bit of history.
ReplyDeleteVenkataratnam Venigalla
Extraordinary memory. I too reached Hyderabad in 1969 and joined in The New Kinder Garden and Upper Primary Shool in 5 th class situated at Himayatnagar. Our principal was Sri Gregory Reddy. My GOD FATHER SRI BHANDARU RAMACHANDRA RAO BROUGHT ME HYDERABAD FROM EDULAPUSAPALLY,MAHABUBABAD TALUK, WARANGAL DIST. EVERY DAY HE USED TO GIVE ME 20 PAISA FOR BUS FARE. I USED TO WALK AND SAVE THOSE 20 PAISA AND WITH THAT USED TO SEE MOVIES. CINEMA TICKET WAS 50 PAISA. RAHAT MAHAL, BALAJI (NOT EXISTING NOW ) DEEPAK WERE THE THEATRES FREQUENTLY WENT..
ReplyDelete.
డియర్ జ్వాలా,
ReplyDeleteతాజ్ మహల్ హోటెల్ వారు భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం పరిశుభ్రంగా పెట్టేవారు.
నారాయణగుడా తాజ్ మహల్ హోటెల్ లో సాయంత్రాలు కబుర్లు చెప్పుకుంటూ, ఒక ప్లేట్ "ముర్కు" తిని, "వన్ బై టు" కప్పు కాఫీ తాగి (బహుశా అంతా కలిపి అర్థ రూపాయ కన్నా తక్కువ బిల్లు అయ్యేదేమో!) బయట పడే వాళ్లం.
అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది.
మొట్ట మొదటి సారిగా, రాజ్ కమల్ బార్‌కు వెళ్లి, "గోల్డెన్ ఈగిల్" బీర్ తాగాను. అప్పట్లో బీర్ బాటిల్ ధర కేవలం మూడు రూపాయలే! 1966 లో అలా మొదలైన ఆ అలవాటు ఇప్పటికీ నన్ను వదలలేదు. మరో మూడేళ్లలో నా తాగుడికి "గోల్డెన్ జూబ్లీ" సెలబ్రేషన్స్ చేసుకోవచ్చేమో! నిజమే మరి.
ఆ నాటి జ్ఞాపకాలు వివరం గా రాసిన నీకు నా శుభాకాంక్షలు.
జూపూడి హనుమంతరావు