Showing posts with label కె. చంద్రశేఖర రావు. Show all posts
Showing posts with label కె. చంద్రశేఖర రావు. Show all posts

Thursday, October 4, 2012

హియర్ ఈజ్ తెలంగాణా!: వనం జ్వాలా నరసింహారావు


హియర్ ఈజ్ తెలంగాణా!

సూర్య దినపత్రిక (07-10-2012)
దారులు వేరైనా గమ్యమొక్కటే 
నమస్తే తెలంగాణ (07-10-2012)
వనం జ్వాలా నరసింహారావు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ ఏళ్లతరబడి సాగుతున్న ఉద్యమం మరో మలుపు తిరిగింది. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఢిల్లీలో సుమారు నెల రోజులపాటు భైటాయించి తనదైన శైలిలో లాబీయింగ్ చేయడం, మరో వైపు, ఆయన కనుసన్నలలో కాకుండా, ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సాగర హారం చోటుచేసుకోవడం ఆ మలుపులో కీలక ఘట్టాలు. "ఇదిగో తెలంగాణ"-"అదిగో తెలంగాణ" అంటూ చంద్రశేఖర రావు గత కొంతకాలంగా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తాను జరిపిన చర్చలపట్ల సంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారాయన. తాము చర్చలకు వ్యతిరేకం కామంటూనే, కేవలం చర్చలద్వారానే మాత్రం కాకుండా ఉద్యమాలు కూడా కొనసాగాలని ఐక్య కార్యాచరణ పట్టుబట్టి మరీ సాగర హారాన్ని నిర్వహించింది. తెలంగాణ రాష్ట్రం కావాలని ఉద్యమిస్తున్న-లాబీయింగ్ జరుపుతున్న నేతల మాటే మో కాని, ప్రజల మాట మాత్రం ఒకటే! రాష్ట్రం ఎవరి ద్వారా-ఎలా ఏర్పాటు అవుతుందనేది వారికి అనవసరం. వారికి కావలసిందల్లా తమ రాష్ట్రం తమకు కావాలి-అంతే! ఈ నేపధ్యంలోనే లాబీయింగైనా, సాగర హారమైనా విశ్లేషించుకోవాలి.


సుమారు నెల రోజుల క్రితం, తనకు కాంగ్రెస్ నేతల దగ్గర నుండి ఆహ్వానం అందిందని చెపుతూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడానికి, చర్చల నిమిత్తమై చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఆయన (ఆయన మాటల్లోనే చెప్పుకోవాలంటే) అందరికీ తెలిసిన విధంగా కాంగ్రెస్ అధిష్టానం దూతలైన వయలార్ రవిని, గులాం నబీ ఆజాద్‌ని, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలుసుకుని చర్చలు జరిపారు. కొందరిని ఒకసారి కంటే ఎక్కువ సార్లు కూడా కలుసుకున్నారు. అందరికీ తెలియకుండా మరెందరినో కలుసుకున్నానని స్వయంగా ఆయనే అంటున్నారు. ఒకవైపు హైదరాబాద్ లో సాగర హారం నిర్వహిస్తుంటే, బాధ్యతగల నాయకుడిగా ఆయన ఢిల్లీలో వుండిపోవడం విమర్శలకు దారితీసింది. ఆయనేదో తప్పు చేస్తున్నట్లు పలువురు మాట్లాడారు కూడా. అసలు సాగర హారంలో తెలంగాణ రాష్ట్ర సమితి పాల్గొనే విషయం కూడా మొదట్లో ప్రశ్నార్థకం ఐంది. సాగర హారం మరో ఐదారు రోజుల్లో జరగబోతుందనగా, తెరాస నాయకుల ప్రకటనలు దానికి అనుకూలంగా వెలువడ్డాయి. చివరకు కేసీఆర్ కూడా తన మద్దతు ప్రకటించారు. సాగర హారం విజయవంతంగా ముగిసింది.


ఐతే, సాగర హారానికి ఎదురైన అడ్డంకులు ఇన్నీ-అన్నీ కావు. ప్రజాసంఘాలను, రాజకీయ పార్టీలను, వ్యక్తులను, ఉద్యమకారులను, వివిధ వ్యవస్థలను కలుపుకుపోవడానికి ఐకాస నాయకులు చేసిన కృషి అభినందనీయం. నిర్వహణ మరో వారం రోజులుందనగా, ప్రభుత్వం రక-రకాల పద్ధతులతో తనదైన శైలిలో మోకాలడ్డుకోవడం ఆరంభమైంది. అంతర్జాతీయ స్థాయి జీవ వైవిధ్య సదస్సు ఆరంభానికి, వినాయక నిమజ్జనానికి మధ్యన, సెప్టెంబర్ 30 న తలపెట్టిన సాగర హారాన్ని వాయిదావేసుకొమ్మని ప్రభుత్వం ఒత్తిడి తెచ్చింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందన్న ప్రచారాన్నీ లేవదీసింది. శాంతి-భద్రతల సమస్య తలెత్త వచ్చన్న అనుమానాన్నీ బయట పెట్టింది. వాయిదా వేసుకోవాలని ఐకాస నాయకులకు నచ్చ చెప్పే బాధ్యతను తెలంగాణ ప్రాంత మంత్రులపై పెట్టాడు ముఖ్యమంత్రి. ససేమిరా అన్న ఐకాస నాయకులు, సాగర హారం నిర్వహణకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నాలు చేశారు. పోలీస్ కమీషనర్‌ను, ఇతర పోలీసు ఉన్నతాధికారులను కలిసి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అనుమతి ఇవ్వడానికి నిరాకరించిన పోలీసు పెద్దలు, తమదైన శైలిలో ఒక అనుమానాన్ని కూడా బయట పెట్టారు. నగరంలోని సీమాంధ్రుల ఆస్తులపై దాడి జరిగే ప్రమాదం ఉన్నదని దాని సారాంశం. మరోవైపు తెలంగాణ మంత్రులను తెర పైకి తెచ్చారు ఐకాస నాయకులు. అనుమతి ఇప్పించే బాధ్యతను వారికి అప్ప చెప్పారు వారు. ప్రభుత్వ అనుమతితో మార్చ్ నిర్వహిస్తే, శాంతిభద్రతల సమస్య అంతగా వుండదని ఐకాస నాయకులు భావించి వుండవచ్చు. అదే విషయాన్ని ప్రభుత్వానికీ, తమ పక్షాన వకాల్తా పుచ్చుకున్న తెలంగాణ మంత్రులకు వారు చెప్పి వుండవచ్చు



ఏదేమైతేనేం....మంత్రుల కృషి ఫలించింది. ముఖ్యమంత్రి చొరవతో పోలీసు అధికారులు సాగర హారానికి అనుమతి ఇచ్చారు. అది షరతులతో కూడిన అనుమతి అని వారంటే, కాదు....తామే షరతులకు అంగీకరించలేదని ఐకాస నాయకులన్నారు. కాని.. చివరకు జరిగిందేంటి? ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో కనీ-వినీ ఎరుగని రీతిలో పోలీసుల అరాచకం చోటు చేసుకుంది. నిర్భంద కాండ రాజ్యమేలింది. ఎక్కడికక్కడ బారికేడ్లు, చెక్ పోస్టులు వెలిశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో భీభత్సంగా యుద్ధకాండ చోటుచేసుకుంది. సాగర హారం జరిగే చోటుకు ర్యాలీగా వెళ్లకూడదన్న ఆంక్షలు విధించిన పోలీసులు, ఎక్కడివారిని అక్కడే నిలిపి వేశారు. ఒక్కరొక్కరే సాగర హారం నిర్వహించే స్థలానికి చేరుకోవాలన్న అసంబద్ధ నిబంధనను విధించి దారుణంగా ప్రవర్తించారు. మార్చ్ జరపాల్సిన స్థలాన్ని "జలియన్‌వాలాబాగ్" చేశారు. అన్ని వైపుల నుంచీ అక్కడకు చేరే మార్గాలను మూసి వేశారు. ఐనప్పటికీ, పోలీసు కంచెలను చేదించుకుంటూ, బారికేడ్లను అధిగమించుకుంటూ, వందల-వేల సంఖ్యలో తెలంగాణ వాదులు-ఉద్యమకారులు సాగర తీరానికి చేరుకున్నారు. లక్షలాది మంది సమక్షంలో మార్చ్ విజయవంతంగా నిర్వహించబడింది. చివరకు, పోలీసుల భాష్పవాయువు ప్రయోగం, లాఠీ ఛార్జ్ సాగర హార స్థలానికి కూడా చేరుకునే దాకా పరిస్థితి వచ్చింది. నేతల ఉపన్యాసాల అనంతరం, రాత్రి పొద్దుపోయింతర్వాత మార్చ్ ముగిసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. మొత్తం మీద ఐకాస నాయకుల పరంగా శాంతియుతం గాను, పోలీసుల పరంగా అశాంతియుతంగాను సాగర హారం సమాప్తమైంది. బహుశా ప్రపంచ చరిత్రలోనే అత్యంత శాంతియుతంగా నిర్వహించిన మార్చ్ లాగా చరిత్రపుటల్లోకి ఎక్కిందంటే అతిశయోక్తి కాదేమో! సాగర హారం పిలుపిచ్చినప్పటినుంచి ఆ రోజున ఏదో జరగబోతోందన్న ఆశ చాలామంది తెలంగాణ వాదులలో మొలకెత్తింది. తెలంగాణకు సంబంధించి ఏదో ఒక ప్రకటన మార్చ్ మొదలెట్టక ముందే వెలువడవచ్చన్న ఆశా కలిగింది. ఇవేవీ జరగలేదు. చివరకు లక్షలాది మంది ఉద్యమకారులు-తెలంగాణ వాదులు పీవీ ఘాట్ వద్ద గుమికూడినప్పటికి కూడా అలాంటిదేమీ జరగలేదు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే మార్చ్ కు అనుమతినిచ్చినప్పటికీ, ఐకాస నాయకులు, ఆ స్థలాన్ని వీడలేదు. ఏదో ఒక ప్రకటన ప్రభుత్వం నుంచి వెలువడేంతవరకు అక్కడ నుంచి కదలడం లేదని ఐకాస అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. దీనికి కినుక వహించిన తెరాస నాయకులు సభాస్థలి నుంచి నిష్క్రమించారు. బహుశా వారి వెంటనే తెరాస పార్టీ అభిమానులు కూడా ఒక్కరొక్కరే వెళ్లిపోయి వుండాలి. మొత్తం మీద, వ్యూహం మార్చుకున్న ఐకాస నాయకులు అర్ధరాత్రి సమయానికి మార్చ్ ను నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అక్కడికది సమాప్తమయింది. కధ సుఖాంతమయ్యేటప్పటికి నిర్వాహకులతో సహా, పోలీసు వర్గాల వారు కూడా వూపిరి పీల్చుకున్నారు. వాస్తవానికి ప్రభుత్వ అనుమతే లభించక పోయినట్లయితే, పరిస్థితి మరో విధంగా వుండే అవకాశాలుండేవి. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పినట్లు మార్చ్ ప్రశాంతంగానే ముగిసిందనాలి. పోలీసులు తెలంగాణా వాదుల మీద కనబర్చిన అతి ఉత్సాహం మాత్రం పలు విమర్శలకు దారితీసిందనాలి.


హైదరాబాద్‌లో పరిస్థితి ఇలా వుంటే అక్కడ ఢిల్లీలో వున్న చంద్రశేఖర రావు కాలికి బలపం కట్టుకుని మరీ తన లాబీయింగ్ కొనసాగించాడు. భారత దేశం పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యంలో-అందునా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లాబీయింగ్ చేయడం, ప్రభుత్వంపై ఒత్తిడులు తేవడం సర్వ సహజం. అదే పని చంద్రశేఖర రావు చేస్తే తప్పేంటి? వాస్తవానికి చంద్రశేఖర రావు, తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటినుంచీ లాబీయింగ్ చేస్తూనే వున్నారు. ఒకవైపు పన్నెండేళ్లు ఉద్యమాన్ని మొక్కవోని ధైర్యంతో నడుపుతూనే, మరోవైపు తనదైన శైలిలో ఢిల్లీ స్థాయిలో రక-రకాల పద్ధతుల్లో లాబీయింగ్ చేసుకుంటూ వస్తున్నారు. జాతీయ స్థాయిలోని అత్యధిక రాజకీయ పార్టీల మద్దతును తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కూడగట్టగలిగారు. ఆ మాటకొస్తే భారతీయ జనతా పార్టీ కాని, భారత కమ్యూనిస్ట్ పార్టీ కాని ఈ రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ ఉద్యమంలో దూకిందంటే అది చంద్రశేఖర రావు లాబీయింగే అనాలి. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా మార్చాలన్న ఉద్దేశంతోనే 2004 లో కాంగ్రెస్ పార్టీతోను, 2009 లో తెలుగు దేశం పార్టీతోను ఎన్నికల ఒప్పందం కుదుర్చుకున్నాడు చంద్రశేఖర రావు. ఈ రోజున కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు కాని, తెలుగుదేశం తెలంగాణ ఎమ్మెల్యేలు కాని తెలంగాణకు అనుకూలంగా ఉద్యమిస్తున్నారంటే అది చంద్రశేఖర రావు లాబీయింగే అనాలి. ఆ లాబీయింగ్‍లో భాగంగానే ఆయన వయలార్ రవిని, ఆజాద్‌ను, ఆస్కార్ ఫెర్నాండెజ్‌ను కలిసుండాలి. కాకపోతే రెండు నాల్కల ధోరణి అవలంబించే వయలార్ రవి లాంటి కాంగ్రెస్ నాయకులు "వేరీజ్ తెలంగాణ" అంటూ ఎకసెక్కం చేయడం, ఆ తరువాత సారీ చెప్పడం మామూలే.


ఈ నేపధ్యంలో ఒక్క సారి గతం నెమరేసుకుంటే మంచిదేమో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టబడిందనాలి. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగు వారందరికీ న్యాయం జరుగుతుందని (ఆనాడు) కొందరు భావిస్తే, తమను-తమ ప్రాంత ప్రజలను తెలంగాణే తరులు దోపిడీకి గురిచేస్తారని-తమ సామాజిక, సాంస్కృతిక, భాషా విలువలను ఇతర ప్రాంతాల "తెలుగువారు" ఎద్దేవా చేస్తారని, తెలంగాణ కావాలని కోరుకున్న పలువురు (ఆనాడే) అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు గడిచినా, కారణాలు ఏమైనా-సహేతుకమైన వైనా, కాకపోయినా-తెలంగాణ ప్రాంత వాసులందరికి కాకపోయినా, చాలామందికి, విడిపోయి, "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగుతే మంచిదన్న భావన మటుకు బలంగా నాటుకు పోయింది. అలా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకుంటున్న వారిలో ఐదు దశాబ్దాల క్రితమే ఆ నినాదం లేవనెత్తిన ఆ తరం వారితో సహా, తరాలు మారినా రెండో తరం-మూడో తరం వారూ, ఒక వంశపారంపర్య నినాదంలాగా-లక్ష్యం, ధ్యేయం లాగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాలని కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి


ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని కేవలం "భావించడం" మాత్రమే కాకుండా, దాన్ని సాధించడం కొరకు, క్రమేపీ, రకరకాల మార్గాలను ఎంచుకోవడం ఆరంభమయింది 1956 నుంచే. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలు మూడూ, ఆంధ్ర ప్రదేశ్ లో కలిసున్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన రాయితీలను తెలంగాణ ప్రాంతం వారికి మాత్రమే చట్ట రీత్యా కలిగించడం ద్వారా, తెలంగాణ వే()ర్పాటు నినాదాన్ని, పాలక పక్షం విజయవంతంగా పక్కదారి పట్టించగలిగింది మొదట్లో. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. తెలంగాణ ప్రాంతానికి వలసవచ్చిన కొందరు తెలంగాణే తరులు , ఎప్పుడైతే తమ "పరోక్ష దోపిడీ" విధానాన్ని "ప్రత్యక్ష దోపిడీ" విధానంగా మార్చడం మొదలయిందో, అప్పుడే దోపిడీకి గురవుతున్న తెలంగాణ ప్రజలలో "దోపిడీకి ఎదురుతిరగాలన్న కాంక్ష బలీయం కావడం మొదలయింది. క్రమేపీ ఉద్యమరూపంగా మార్పుచెంద సాగిందా కాంక్ష. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో బ్రహ్మాండమైన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని నడిపాయి. నాడు ఉవ్వెత్తున లేచిన ఉద్యమం మోసంతో అణచబడింది. నాయకులు మోసం చేస్తున్నా, తాము మోసగించ బడుతున్నామని తెలంగాణ వాసులు గ్రహించినా, అధిక సంఖ్యాక ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలన్న కోరిక, సాధించి తీరాలన్న పట్టుదల మాత్రం పెరిగిందే కాని తగ్గలేదు. కాకపోతే సరైన సమయం కొరకు ఎదురుచూచారు. నాయకులెవరైనా ఉద్యమం మళ్లీ ఆరంభించి-నడపక పోతారానని ఎదురు చూడసాగారు. రాజకీయ స్వార్థం కోసమైనా ఎవరైనా తమకండగా వుండకపోతారానని భావించసాగారు. వారి కోరిక నెరవేరింది


కె. చంద్రశేఖర రావు, "తెలంగాణ రాష్ట్ర సమితి" ని స్థాపించడంతో, తెలంగాణ కావాలని కోరుకుంటున్న వారిలో మళ్లీ ఆశలు చిగురించాయి. కేసీఆర్ వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఒకరకంగా ఏకాభిప్రాయాన్ని సమకూర్చు కొనడంలో, మునుపెన్నడూ-ఎవరూ సాధించని విజయాన్ని సాధించారని చెప్పాలి. 2004 ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో, వై ఎస్ ఆర్ నాయకత్వంలోని ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కుదుర్చుకుని, ఇటు శాసనసభలోనూ-అటు పార్లమెంటు లోనూ బలమైన శక్తిగా కేసీఆర్ ఎదిగి, టీ ఆర్ ఎస్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు తేగలిగాడు. కేంద్రంలో సోనియా దృష్టిని ఆకర్షించి, ఆమెకు సన్నిహితుడై, మంత్రివర్గంలో కీలకమైన పదవిని పొంది, ఢిల్లీ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర సాధనకు మార్గం సుగమం చేసుకుంటూ పోగలిగాడు. పార్టీలో తనకు ఎదురు తిరిగిన ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయగల సమర్థుడుగా ఎన్నో మార్లు నిరూపించుకున్నాడు. అవసరమైనప్పుడు సోనియాకు ఎదురు తిరిగి తనంటే ఏంటో నిరూపించి చూపాడు. తన సత్తా చూపడానికి ఎన్ని మార్లైనా పదవికి అలవోకగా రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించగలిగాడు. తనకు తానే సాటి అని చెప్పకనే చెప్పాడు


బహుశా ఈ నేపధ్యంలో, ఒకవైపు చంద్రశేఖర రావు లాబీయింగ్, మరోవైపు ఐకాస లాంటి ప్రజా సంఘాల ప్రత్యక్ష ఉద్యమాలు తెలంగాణ రాష్ట్ర సాధనకు దోహదపడతాయని భావించవచ్చు. "వేరీజ్ తెలంగాణ" అనే వారికి ఇదే సమాధానం! "హియర్ ఈజ్ తెలంగాణా"!

Sunday, January 2, 2011

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు - ఎక్కడి గొంగళి అక్కడే నా?: వనం జ్వాలా నరసింహారావు

జనవరి 6, 2011 న అఖిల పక్ష సమావేశం జరుగనున్న నేపధ్యంలో ...
తారు మారైన "అభిప్రాయం - అధ్యయనం - తీర్పు" ప్రక్రియ
వనం జ్వాలా నరసింహారావు
(ఆంధ్ర జ్యోతి, 4-01-2011)

ఏమిటీ జాగు? ఎందుకీ జాగు? ఏడాది క్రితమే చిదంబరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతుందని “ప్రభుత్వ తీర్పు” గా ప్రకటించి, వెనక్కు తగ్గి, మళ్లీ అభిప్రాయ సేకరణకు, అధ్యయనానికి తెర లేపారు. అంతవరకు బాగానే వుంది... అభిప్రాయం , అధ్యయనం జరిగిన తర్వాత, తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కమిటీ దన్నా కావాలి, లేదా, ప్రభుత్వానిదన్నా కావాలి తప్ప, రాజకీయ నాయకులది ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. పరిష్కారం ప్రభుత్వం చేతుల్లో వుంటే, శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఆధారంగా, తీర్పు ప్రకటించాలి. అలా కాదు... రాజకీయ నాయకుల చేతుల్లో వుందని ప్రభుత్వం భావిస్తే, వారు శ్రీకృష్ణ కమిటీకి వెల్లడించిన అభిప్రాయాల సారాంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేయాలి. కాదు... తీర్పు ప్రజలదే అనుకుంటే, గతంలోకి ఒక్క సారి తొంగి చూడాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయ తల్చుకుంటే, పార్లమెంటులో సంబంధిత ప్రక్రియకు శ్రీకారం చుట్టాలి.... పార్లమెంటులోని వివిధ పార్టీల నాయకులతో సంప్రదింపులు జరపాలి. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచడమే ప్రభుత్వ నిర్ణయమైతే, ధైర్యంగా బయట పెట్టాలి... పర్యవసానానికి ఎదురు చూడాలి!

కథ మళ్లీ మొదటికొచ్చింది. కర్ణుడి చావుకు ఎందరో కారణమైనట్లు నేతి ఈ దుస్థితికి కూడా అందరూ కారకులే. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, నవంబర్ 2009 ఆఖరు వారంలో, తన చివరి పోరాటంగా ప్రకటించి, "తెలంగాణ రాష్ట్రం" ఏర్పాటు ప్రకటన వెలువడేంతవరకు, వెనక్కు తగ్గేది లేదని అంటూ, ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. దీక్షకు కూచునే లోపునే ఆయన్ను అరెస్టు చేయడం, ఖమ్మం జైలుకు తరలించడం, అక్కడి జైలులోనే ఆయన దీక్ష కొనసాగించడం-ఆసుపత్రిలో చేర్పించడం, దీక్ష విరమించాడని ప్రకటించడం, దాన్ని ఆయన ఖండించడం నాటకీయంగా ఒకదాని వెంట ఒకటి జరిగాయి. చివరకు, మానవ హక్కుల కమీషన్ ఆదేశాల మేరకు కె.సీ.ఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు 108 అంబులెన్స్ లో తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో, ఆందోళన చెందిన అఖిల భారత కాంగ్రెస్ నాయకత్వం-యూపీఏ ప్రభుత్వం, డిసెంబర్ 9, 2009 న కేంద్ర హోం మంత్రి చిదంబరంతో కర్ర విరగ కుండా-పాము చావకుండా వుండే రీతిలో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం" అన్న అర్థం వచ్చే ఒక ప్రకటన చేయించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు, "సమైక్యాంధ్ర-ప్రత్యేకాంధ్ర" ఉద్యమాల పేరుతో హింస చెలరేగడంతో మరో ప్రకటన వెలువడింది. అనంతరం, తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి జనవరి 5, 2010 న చిదంబరం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించి, సమస్య పరిష్కారాన్ని కనుగొనడం రాజకీయ పార్టీల బాధ్యతగా చిత్రీకరించి, తాత్కాలికంగా చేతులు దులిపేసుకున్నారు. ఆ నాడు సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధుల్లో (పార్టీకి ఇద్దరు చొప్పున) ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు తప్ప మిగతా ఎవరూ, స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. కాకపోతే ఆ పార్టీ నాయకులతో సహా అందరు కూడా చర్చల కొన సాగింపుకు "ప్రత్యక్షంగానో, పరోక్షంగా నో" అంగీకరించడంతో దరిమిలా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. కాలయాపనకు శ్రీకారం చుట్టడం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన నాడే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజలు “తమ తీర్పు” ను ఆ నాడే ప్రకటించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు జరిగి ఐదు దశాబ్దాలు దాటినా, తెలంగాణ ప్రాంత వారందరిలో, విడిపోయి- "తెలంగాణ" రాష్ట్ర ఏర్పాటు జరిగి, ఏ ప్రాంతం వాళ్లు ఆ ప్రాంతంలోనే వుంటూ, అన్నదమ్ములలాగా మెలుగు తే మంచిదన్న భావన బలంగా నాటుకు పోయింది. ఆ నినాదమే, ఒక లక్ష్యంగా - ధ్యేయంగా, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగి తీరాల్సిందే అన్న స్థాయికి చేరుకోవడం "తమ తుది తీర్పు" గా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారంటే, పాలకవర్గాలు ఆ నినాదానికున్న ఆదరణను సరిగ్గా అంచనా వేయడం లేదనే అనాలి. కాకపోతే డిసెంబర్ తొమ్మిదో తేదీన, అప్పట్లో నెలకొన్నపరిస్తితులు చేజారిపోతుంటే, వ్యూహాత్మకంగా చిదంబరంతో యు పీ ఏ సర్కారు ఒక కంటి నీటి తుడుపు ప్రకటన చేయించి, ఉద్యమాన్ని పక్కదారి మళ్లించి, రాష్ట్రంలో చిచ్చు రగిలించి, మళ్లీ వెనక్కు తగ్గి, మరో ప్రకటన ఆ చిదంబరంతోనే చేయించి చోద్యం చూస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ వేయడాన్ని తెలంగాణ ప్రజలు ఓర్పుతో, సహనంతో, భవిష్యత్ మీద నమ్మకంతో సహించి అంగీకరించారే తప్ప రాష్ట్రాన్ని సాధించుకోవడం చేతకాక ఒప్పుకో లేదు. కమిటీ నివేదిక తర్వాత కూడా మళ్లీ ఆట మొదలెడితే ఫలితాలు ఎలా వుండబోతున్నాయో ఎవరూ వూహించలేరేమో!

తెలంగాణ రాష్ట్రం తప్ప ఇంకేమిచ్చినా అంగీకరించడానికి ససేమిరా ఒప్పుకోని ఆ ప్రాంతంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు, ప్రత్యేకమైన రాయితీలను చట్ట రీత్యా - రాజ్యాంగ పరంగా కలిగించడం ద్వారా, తెలంగాణ వే(ఏ)ర్పాటు నినాదాన్ని మరో మారు పక్కదారి పట్టించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటే అంతకంటే దారుణం ఇంకోటి లేదు. పెద్దమనుషుల ఒప్పందమనీ, ఫజలాలీ సంఘం నివేదికనీ, ముల్కీ నిబంధనలనీ రకరకాల మార్గాలద్వారా తెలంగాణ కోరుకునే వారిలో కొన్ని ఆశలు రేకెత్తించి, కొన్నేళ్లు ఉద్యమాన్ని బలహీనపరచగలిగింది (కాంగ్రెస్) ప్రభుత్వం. ఇక ఇప్పుడా అవకాశం లేనే లేదు. మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో "తెలంగాణ ప్రజా సమితి" పేరుతో, 1971 సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీగా బరిలోకి దిగిన తెలంగాణలోని అన్ని స్థానాలకు పోటీచేసి, 11 స్థానాలను గెలుచుకొని చరిత్ర సృష్టించింది. ప్రజాభిప్రాయం తెలంగాణ ఏర్పాటేనని స్పష్టంగా ఓటర్లు తెలియచేశారు. అంత కంటే " తుది తీర్పు" ఇంకేమైనా వుందా? ఆ తీర్పు తర్వాత ఇంకా ప్రజాభిప్రాయ సేకరణ, అధ్యయనం చేయాల్సిన అవసరం వుందా? ఐనా శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటుకు పరిణితి చెందిన తెలంగాణ ప్రజలు ఒప్పుకున్నారు. ఆ కమిటీ తీర్పు తెలంగాణ ఏర్పాటుకు విరుద్ధంగా వుంటే వారు ఒప్పుకుంటారని ప్రభుత్వం భావించడం కన్నా పొరపాటు మరొక టి లేదు.

కె. చంద్రశేఖర రావు "తెలంగాణ రాష్ట్ర సమితి" (టీ ఆర్ ఎస్) ని స్థాపించి ప్రత్యేక రాష్ట్ర వుద్యమాన్ని వ్యూహాత్మకంగా, అహింసా మార్గంలో, మేధావులను కలుపుకుని పోతూ, యావత్ భారతదేశంలోని భిన్న దృక్పధాల రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ, ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తూ, పదేళ్లు గా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. అడపాదడపా ఇతర పార్టీల మీద, పార్టీ నాయకుల మీద దురుసుగా విరుచుకుని పడినా, లక్ష్య సాధన కొరకు అందరితో రాజీ పడుతున్నారు. మహబూబాబాద్ పర్యటనకు వెళ్తున్న జగన్ ను అడ్డుకునే విషయంలోను, విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తి వేయించే విషయంలోను, అలాంటి మరి కొన్ని ఉమ్మడి అంశాలలోను కాంగ్రెస్ పార్టీ వారికి మద్దతు ప్రకటించడానికి వెనుకాడ లేదు. తనకు అప్రతిష్ఠ తెస్తున్నదని భావించిన తాగుడుకు స్వస్తి చెపుతున్నట్లు టీవీ ఛానళ్లద్వారా ప్రకటించాడు. చావో-తెలంగాణా రాష్ట్ర సాధనో తేల్చుకుంటానన్నాడు. ఆమరణ నిరాహార దీక్ష చేబట్టబోతున్న విషయాన్ని నెలరోజులముందే ప్రకటించాడు. అనుకున్నట్లే-అనుకున్న రోజునే-అనుకున్న చోటునే నిరాహారదీక్ష చేసేందుకు వెళ్తున్న ఆయన్ను నిర్భందంలోకి తీసుకుంది ప్రభుత్వం. ఖమ్మం జైలుకు తరలించింది. నిరాహార దీక్ష కొనసాగుతుండగానే, ఆయన ఆరోగ్యం క్షీణించింది. హైదరాబాద్ "నిమ్స్" కు కోర్టు ఆదేశాల మేరకు-మానవహక్కుల సూచనమేరకు తీసుకొచ్చింది ప్రభుత్వం. తెలంగాణ అంతా నిరసన జ్వాలలు పెల్లుబుకాయి. శాంతి-భద్రతల పరిస్థితి క్షీణించసాగింది. పరిస్థితి చేజారిపోతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం-యూ పీ యే ఛైర్ పర్సన్ సోనియా, చక్కదిద్దే ప్రయత్నం చేశారు. చిదంబరంతో "తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ మొదలవుతుంది" అన్న ప్రకటన చేయించింది కేంద్రం. కేసీఆర్ దీక్ష విరమించాడు. తెలంగాణ వస్తుందని భావించిన వారందరికీ అప్పటికి నిరాశే మిగిలింది.

ఆంధ్ర ప్రాంతంలో, "ప్రత్యేక ఆంధ్ర" కావాలని కోరిన ఒకనాటి నాయకులు, పంథాను మార్చుకొని, "సమైక్య ఆంధ్ర" అన్న నినాదం లేవదీశారు. విజయవాడ లోక్ సభ సభ్యుడు ఒక అడుగు ముందుకు వేసి "సమైక్య ఆంధ్ర" కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం-మానుకోవడం జరిగిపోయింది. ఆంధ్ర-రాయలసీమకు చెందిన అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు-ఎంపీలు రాజీనామా అస్త్రాలను సంధించారు. సమావేశమైన రాష్ట్ర శాసనసభ అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. ఆంధ్ర-రాయలసీమలో శాంతి భద్రతలు క్షీణించాయి. కేంద్రం మీద ఒత్తిళ్లు పెరిగాయి. చిదంబరం మరో ప్రకటన చేయాల్సివచ్చింది. అన్ని వర్గాల వారిని సంప్రదించిన తర్వాత ఏకాభిప్రాయ సాధనతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని దాని సారాంశం. అదెప్పుడో అప్పటికీ-ఇప్పటికీ "చిదంబర రహస్యం" గానే మిగిలిపోయింది. ఇంతలో తెలంగాణకు చెందిన అన్ని పార్టీల వారు ఒకటయ్యారు. చట్ట సభలకు ఎన్నికైన వారితో సహా, అన్ని స్థాయిలలో ఎన్నికైన తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు సమర్పించారు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటైంది.

ఎనిమిది వందల పేజీల శ్రీకృష్ణ కమిటీ నివేదికలో, అఖిల పక్షం సమావేశానికి చిదంబరం ఆహ్వానించిన రాజకీయ పార్టీల అభిప్రాయాలు లేవా? అవన్నీ క్రోడీకరించి, రెండు-మూడు పేజీల సంక్షిప్త సమాచారంగా చేసి, ప్రభుత్వ అభిప్రాయాన్ని- ముసాయిదా తీర్పును దానికి అనుబంధంగా చేర్చి, పార్లమెంటులోని వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి, తమ నిర్ణయం ప్రకటించి, వారి సమాధానం తెలుసుకొని, ముందుకు సాగుతే మంచిది. అలా కాకుండా, జనవరి 5, 2010 నే పునరావృతం చేస్తే ఫలితం శూన్యం. అంతగా పిలవ తల్చుకుంటే, ఇదే ప్రక్రియను రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీల అధ్యక్షులతో మాత్రమే చేస్తే సరిపోతుంది. "ఒక పార్టీ-ఒక అభిప్రాయం" అన్న సిద్ధాంతాన్ని పాటించాలి తప్ప, అఖిల పక్ష సమావేశం ఒక చర్చా వేదికగా మార్చే ప్రయత్నం చేయకూడదు. అలా చేయడమంటే, ప్రభుత్వ నిర్ణయం వాయిదా వేసి, శాశ్వతంగా ఉద్యమానికి అంకురార్పణ చేయడమే! శాశ్వతంగా శాంతి భద్రతల సమస్యను ప్రభుత్వ పరంగా సృష్టించడమే! అంటే, ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చినట్లే!

చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలి.... కాదను కుంటే...ధైర్యంగా చేయమని చెప్పాలి... జరగబోయే పరిణామాలకు బాధ్యత వహించాలి. నాన్చు డు ధోరణి ప్రజాస్వామ్యానికే విఘాతం.