Showing posts with label తెలంగాణ. Show all posts
Showing posts with label తెలంగాణ. Show all posts

Monday, July 27, 2015

విశ్వ నగరంగా భాగ్యనగరం:వనం జ్వాలా నరసింహారావు

విశ్వ నగరంగా భాగ్యనగరం
వనం జ్వాలా నరసింహారావు
ఆంధ్రజ్యోతి దినపత్రిక (28-07-2015)
          భాగ్యనగరంగా పిలువబడే  తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ 1591లో మహ్మద్‌ కులీకుతుబ్ షా నిర్మించాడు. ఈ నగరానికి 400 ఏళ్ల కు పైగా చరిత్ర ఉంది. నగర చరిత్రకు చార్మినార్, గోల్కొండ కట్టడాలు మకుటాయమానం. 1948 సైనిక చర్య తర్వాత హైదరాబాద్ భారత దేశంలో అంతర్భాగమైంది. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధికెక్కాయి. ప్రస్తుతం నగరం గ్రేటర్ హైదరాబాద్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా, సాంకేతికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తోంది. ముఖ్యంగా ఐటీ హబ్‌గా వర్థిల్లుతోంది. ఇబ్రహీం హుస్సేన్ సాగర్‌ను నిర్మించి ప్రజలకు మంచి నీటి సౌకర్యం కల్పించాడు. మూసీ నదిలో కలిసే మూడు చిన్న చిన్న ఏరులకు అడ్డకట్ట (టాంక్‌బండ్) వేయించడంతో ఈ సరస్సు ఏర్పడింది. దీని పేరు దాని నిర్మాత అయిన ఇబ్రహీం పేర ఇబ్రహీం సాగర్‌గానే కుతుబ్‌షాహీ రికార్డుల్లో వుందట. అయితే, దాని నిర్మాణానికి రూపకల్పన చేసి దానిని అమలు పరచడంలో ప్రముఖపాత్ర వహించిన హుస్సేన్‌ షా వలి పేరు మీద హుస్సేన్‌సాగర్ గా ప్రసిద్ధికెక్కింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి మహమ్మద్ కులీకుతుబ్ షా హిందూ, ముస్లిం పంచాంగాలను అనుసరించి ముహూర్తం పెట్టించాడని అంటారు. చంద్రుడు సింహరాశిలోను, బృహస్పతి తన స్వస్థానంలో ఉన్న శుభ ముహూర్తంలో ఈ నగర శంకుస్థాపన జరిగిందని కూడా ప్రచారంలో వుంది.
అలా అలనాడు నిర్మించబడిన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత బహుశా మున్నెన్నడూ కనీ-వినీ ఎరుగని రీతిలో అభివృద్ధిపధాన సాగుతోంది. ఒకవైపు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన, మరోవైపు దానిలో పడే మురికి నాలాల మళ్లింపు, హుస్సేన్ సాగర్ పరిసరాలలో-నగరంలోని ఇతర ప్రదేశాలలో భారీ బహుళ అంతస్తుల నిర్మాణానికి రూపకల్పన, విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిగ్నల్ ఫ్రీ మల్టీ లెవెల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వ నిర్ణయం, అంతర్జాతీయ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుకు సన్నాహాలు...ఇలా ఎన్నెన్నో పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది.
                బహుళార్థ సాధకుడుగా పేరు తెచ్చుకున్న మందుముల నరసింగరావు రాసిన "ఏబై సంవత్సరాల హైదరాబాద్" అలనాటి విషయాలకు సంబంధించిన ఒక విజ్ఞాన సర్వస్వం. ఆయన తన పుస్తకంలో అలనాటి విషయాలను ఎన్నో వివరించారు. అప్పట్లో, హైదరాబాద్ లో పెద్ద భవంతులు-దేవిడీలు వుండేవి. పత్తర్ ఘట్టి నగరంలోని ప్రధాన వర్తక కేంద్రం. 1908 నాటి మూసీ వరదల అపార నష్టాన్ని పూరించుకునేందుకు హైదరాబాద్ పట్టణాభివృద్ధి మొదలైంది. 1918 లో ఉస్మానియా విశ్వ విద్యాలయం స్థాపించడం జరిగింది. 1914-1918 మధ్య కాలంలో జరిగిన ప్రధమ ప్రపంచ సంగ్రామ ప్రభావం హైదరాబాద్ పాలనపై కూడా పడింది. విద్యారంగంలో, "హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్" ను మౌల్వీ మహమ్మద్ ముర్తజా స్థాపించారు. 1916 లో వివేక వర్ధని హైస్కూల్ స్థాపన జరిగింది. సుల్తాన్ బజార్ లోని శ్రీకృష్ణదేవరాయలు ఆంధ్ర భాషా నిలయం, సికిందరాబాద్ లోని ఆంధ్ర సంవర్ధనీ గ్రంధాలయం, తెలంగాణ ప్రాంతంలో చైతన్యం కలగడానికి దోహద పడ్డాయనాలి. 1923 ప్రాంతంలో ఉస్మాన్ సాగర్ నుంచి హైదరాబాద్ పౌరులకు మంచినీటి వసతి కలిగించడం జరిగింది.
అలాగే, 40-50 సంవత్సరాల క్రితం నాటి విషయాలు కొన్ని గుర్తు తెచ్చుకుంటే ఆసక్తికరమైన అంశాలుంటాయి. అలనాటి హైదరాబాద్ నగరం-దాని సంస్కృతి కొంత అవగతమౌతుంది. విద్యానగర్‍లోని చెలమయ్య హోటెల్ ఇడ్లీలునేటి ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్ ను "చార్మీనార్ చౌ రాస్తా" గా పిలవడం, చార్మీనార్ చౌ రాస్తా చుట్టుపక్కలంతా పారిశ్రామిక వాడగా వుండడం, సమీపంలో వున్న చార్మీనార్ సిగరెట్ కర్మాగారం (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ), గోలకొండ సిగరెట్ (నీలం రంగు పాకెట్ లో వచ్చే) కర్మాగారం ...ఇలా ఎన్నో వున్నాయి. చార్మీనార్ చౌ రాస్తా (ఆర్. టి. సి. క్రాస్ రోడ్స్) నుంచి టాంక్ బండును కలిపే రోడ్డు కూడా అప్పట్లో లేదు. ఇప్పుడు టాంక్ బండును కలిపే స్థలంలో కొంచెం అటు-ఇటుగా ఒక "కల్లు కాంపౌండ్" వుండేది. ఇందిరా పార్క్ అసలే లేదు. ధర్నా చౌక్ కూడా లేదు. ఆ రోజుల్లో హైదరాబాద్ లో కనీసం పాతిక-ముప్పై వేల రిక్షాలన్నా వుండేవి. మీటర్ టాక్సీలుండేవి కాని, బేరం కుదుర్చుకోని ఎక్కించు కోవడం తప్ప మీటర్ ఎప్పుడూ వేయక పోయేవారు. టాక్సీలకు కిలోమీటరుకు పావలా చార్జ్ వున్నట్లు గుర్తు. సిటీ బస్సుల్లో హాయిగా ప్రయాణం చేసే వాళ్లు. "ఆగే బడో" అనుకుంటూ కండక్టర్ సున్నితంగా చెపుతుంటే ప్రయాణీకులు క్రమ శిక్షణతో దొరికిన సీట్లలో కూచోవడమో, లేదా, ఒక క్రమ పద్ధతిన నిలబడడమో చేసేవారు. సింగిల్ బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు వుండేవి. కండక్టర్ చేతిలో టికెట్ ఇచ్చే మిషన్ వుండేది. బర్రున తిప్పి ఒక చిన్న టికెట్ ఇచ్చేవాడు. టికెట్ ఖరీదు పైసల్లోనో, అణా-బేడలలోనో వుండేది.
ఇరానీ రెస్టారెంటులో 15 పైసలిస్తే ఇరానీ "చాయ్" దొరికేది. "పౌనా" కూడా దొరికేది. 5 పైసలకు ఒక సమోసా, లేదా, ఒక బిస్కట్ కొనుక్కుని తినే వాళ్లు. అప్పట్లో "పానీ పురి" ఖరీదు కూడా 5 పైసలే. మిర్చి బజ్జీ కూడా 5 పైసలకే దొరికేది. అలానే మిఠాయి భండార్ లో "గులాబ్ జామూన్", "కలకంద" తిని, "హైదరాబాద్ మౌజ్" కలుపుకుని పాలు-పౌనా తాగే వాళ్లు. పావలాకు అర డజన్ మౌజ్-అరటి పళ్లు దొరికేవప్పుడు. 36 రూపాయలిస్తే 60 భోజనం కూపన్లు ఇచ్చేవారు. తడవకు 18 రూపాయలిచ్చి 30 కూపన్లు కొనుక్కోవాలి. కూపన్ పుస్తకంలో "అతిధులకు" అదనంగా రెండు టికెట్లుండేవి. నెలకు అలా నలుగురు గెస్టులను ఉచితంగా భోజనానికి తీసుకెళ్ల వచ్చు. ఇక భోజనంలో "అన్ లిమిటెడ్" పూరీలు ఇచ్చేవారు. సైజు చిన్నగా వుండేవి. వూరగాయ పచ్చళ్లతో సహా తీరు-తీరు రుచులతో భోజనం, పరిశుభ్రంగా పెట్టేవారు హోటెల్ వారు. ఇప్పుడు 36 రూపాయలకు "ప్లేట్" ఇడ్లీ కూడా రాని పరిస్థితి! హిమాయత్ నగర్, అశోక్ నగర్ మధ్య ఇప్పుడున్న "బ్రిడ్జ్" అప్పుడు లేదు. వర్షాకాలంలో మోకాలు లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చేది. అశోక్ నగర్ లో ఇప్పుడు బ్రహ్మాండంగా వెలిగిపోతున్న "హనుమాన్" గుడి అప్పుడు లేదు. కేవలం ఒక విగ్రహం మాత్రం రోడ్డు మధ్యలో-కొంచెం పక్కగా వుండేది. పీపుల్స్ హైస్కూల్ దాటిన తరువాత మలుపు తిరిగి చిక్కడపల్లి వైపు పోతుంటే, ఇప్పుడు సిటీ సెంట్రల్ లైబ్రరీ భవనం వున్న చోట ఒక కల్లు కాంపౌండ్ వుండేది. ఆ రోజుల్లో ఇప్పుడున్నన్ని సినిమా టాకీసులు లేవు. వున్నవాటిలో ఎయిర్ కండిషన్ థియేటర్లు కాని, ఎయిర్ కూల్డ్ థియేటర్లు కాని దాదాపు లేనట్లే. ఆబిడ్స్ లో వున్న "జమ్రూద్" టాకీసు ఒక్కటే జనరేటర్ బాక్-అప్ వున్న ఎయిర్ కండిషన్ థియేటర్. అలానే వి. వి. కాలేజీ పక్కనున్న "నవరంగ్" థియేటర్ ఒకే ఒక్క ఎయిర్ కూల్డ్ థియేటర్.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడంతో మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బాధ్యతలు చేపట్టడం, వెనువెంటనే ఆయన ప్రాధాన్యతాంశాలలో హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికా రచన జరగడం జరిగింది. హైదరాబాద్ విషయంలో రాజీ పడితే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో వచ్చేదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా రాజీ పడే ప్రసక్తే లేదని, తాను చెప్ప బట్టే హైదరాబాద్ తో కూడిన తెలంగాణ వచ్చిందని ముఖ్యమంత్రి ఎన్నో సార్లు అంటుంటారు. హైదరాబాద్‌కు ఎంతో చరిత్ర, ప్రాముఖ్యతలు వున్నాయని, అవి చెదిరిపోకుండా అభివృద్ధి జరగాలన్నదే తన ధ్యేయం అనీ ముఖ్యమంత్రి అంటారు. అందుకే నగరాన్ని ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలనే తపన తెలంగాణ ప్రభుత్వానికి కలిగింది. ఆ దిశగా తొలుత హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏటేటా నగరంలో పెరుగుతున్న సుమారు 10-15 లక్షల జనాభా అవసరాలకు అనుగుణంగా, నగరం నాలుగు దిక్కులా ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం, ఆకాశ రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన ప్రదేశాలలో రింగ్ రోడ్ల నిర్మాణాలు కూడా చేపట్టనుంది ప్రభుత్వం. వాహనాల "గ్రిడ్ లాక్" లను అరికట్టే విధంగా రహదారుల అభివృద్ధి జరుగబోతోంది. వాహనాల రద్దీ ఎక్కువగా వుండే పలు రూట్‌లను హై ప్రెషర్ కారిడార్లుగా గుర్తించింది ప్రభుత్వం. వాహనాలు ఆగకుండా సిగ్నల్ ఫ్రీ తరహా రవాణా వ్యవస్థకు రూపకల్పన జరుగుతోంది. రహదారుల, ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ దశలోనే భూగర్భ డ్రైనేజీ, భూగర్భ కేబుల్ వ్యవస్థపైనా దృష్టి సారించడం జరుగుతుంది. బంజారా హిల్స్, ఖైరతాబాద్, చాదర్ ఘాట్, కోఠి, ప్యారడైజ్, నాంపల్లి లాంటి జనం రద్దీ ఎక్కువగా వుండే 20 జంక్షన్ లలో మల్టీ లెవెల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి  రు. 2631 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది.  

హైదరాబాద్‌లో తెలంగాణ కళా భారతి నిర్మాణం జరుగనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళా భారతిలో వేరువేరు వేరు సామర్ధ్యాలతో కలిగిన ఆడిటోరియాలు ఉంటాయి. 500 మంది పట్టే ఒక చిన్న ఆడిటోరియం, 1000, 1500మందికి సరిపడా మీడియం ఆడిటోరియాలు, 3000 మంది పట్టే పెద్ద ఆడిటోరియం ఇందులో ఉంటాయి. 125-125 చదరపు మీటర్ల వైశాల్యంలో లక్షా ఇరవై ఐదు వేల చదరపు అడుగుల మేర కళా భారతి నిర్మిస్తారు. ఈ కళా భారతిలో ఆహ్లాదాన్ని కలిగించే పచ్చిక బయళ్లు, చల్లదనం చేకూర్చే నీటి కొలనులు, కను విందు, చేసే ఫౌంటేన్‌లు నిర్మిస్తారుదీనిలో అంతర్భాగంగా అత్యాధునిక థియేటర్, ప్రివ్యూ థియేటర్, కళాకారుల శిక్షణ, రిహార్సల్స్ కోసం ప్రత్యేక హాళ్లు, లైబ్రరీ, ఆర్ట్ మ్యూజియం, పెయింటింగ్ గ్యాలరీ, శిల్ప కళాకృతుల గ్యాలరీ, విఐపి లాంజ్, మీడియా లాంజ్ ఉంటాయి. 25, 50, 100 మందితో సదస్సులు నిర్వహించుకోడానికి 3 ప్రత్యేక సెమినార్ హాళ్లు, డార్మెటరీ సౌకర్యం, అతిథి గృహాలు, 3 రెస్టారెంట్లు, 40 గదులు, 10 సూట్స్, 1000 మంది పట్టే ఫుడ్ కోర్టు ఉంటాయిలలిత కళా అకాడమీ, సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ లాంటి విభాగాల నిర్వహణ కోసం కార్యాలయాల నిర్మాణం కూడా ఇందులోనే చేస్తారు. 3000 వాహనాలకు సరిపోయేలా పార్కింగ్ ఏర్పాటు చేస్తారు. 10వేల మందితో ఒకే సారి సమావేశాలు నిర్వహించుకున్నా సరిపోయేలా కళా భారతి డిజైన్ రూపొందించారు. తెలంగాణ సాంస్కృతిక వికాసానికి ప్రతిబింబంగా ఈ కళా భారతి ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు.

హైదరాబాద్ నగరంలోని బంజారా హిల్స్ ప్రాంతంలో, ఎనిమిదెకరాల స్థలంలో, అత్యంత ఆధునికమైన హంగులతో, అంతర్జాతీయ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం జరుగనుంది. నగరానికి ఒక ఐకాన్ భవనంగా మారనున్న ఈ సెంటర్‌లో, రెండు టవర్లతో కూడిన అద్దాల భవనం వస్తుంది. ఒక టవర్ 16 అంతస్తులు, మరో టవర్ 24 అంతస్తులుంటాయి. రెండు టవర్ల మధ్య వంతెన వుంటుంది. టవర్లపైన హెలిపాడ్ సౌకర్యం, సోలార్ రూఫ్ కూడా వుంటాయి. వేయి మంది పట్టే ఆడిటోరియం, వీడియో వాల్స్, లాండ్ స్కేపింగ్, వాటర్ ఫౌంటెన్స్ వుంటాయి. 600 వాహనాలు పట్టే పార్కింగ్ స్థలం వుంటుంది.

ప్రస్తుతం రవీంద్ర భారతి వున్న స్థలంలో హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను చాటే విధంగా మరో కట్టడం వచ్చే అవకాశం వుంది. మూసీ నదికి ఇరువైపులా అద్భుతమైన పార్కులకు ప్రణాళికలు తయారవుతున్నాయి. నది ప్రక్షాళన, సుందరీ కరణ పనులకోసం కూడా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. నిజాం రాజులు కట్టించిన మోండా మార్కెట్‌ను ఆధునీకరించి అభివృద్ధి పర్చాలని ముఖ్యమంత్రి సంకల్పం. 143 సంవత్సరాల క్రితం 1872 లో నిర్మించిన మోండా మార్కెట్ ఇప్పటికీ చెక్కు చెదర లేదు. సికిందరాబాద్ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చి దిద్దే ప్రయత్నంలో భాగంగా, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక అధ్యయనం చేయించింది ప్రభుత్వం. రెండు కోట్ల జనాభా నివసించేందుకు అనువుగా, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ తయారైంది. 150 కూరగాయల మార్కెట్ల నిర్మాణానికి, 80 మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ ల ఏర్పాటుకు, 136 బస్ బే ల నిర్వహణకు, అనువైన స్థలాలను ఎంపిక చేసింది నగరపాలక సంస్థ. స్మశాన వాటికల ఆధునీకరణ, దోభీఘాట్ల నిర్మాణం, పబ్లిక్ టాయ్ లెట్ల ఏర్పాటు కూడా ఇందులో భాగమే.

హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో, ఏడెనిమిది వేల ఎకరాల విస్తీర్ణంలో, జాతీయ రహదారికి-రైల్వే లైనుకు దగ్గరలో, అద్భుతమైన ఫార్మా సిటీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా అక్కడ పనిచేసే వారికి నివాస గృహాల వసతి కూడా జరుగనుంది. అలానే నగర సరిహద్దుల్లో ఒక క్రీడా నగరాన్ని కూడా నిర్మించే ఆలోచనలో వుంది ప్రభుత్వం. అలా నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో జాతీయ-అంతర్జాతీయ క్రీడల పోటీల నిర్వహణతో పాటు, ఒకనాటికి ఆ సిటీ ఒలింపిక్ పోటీలను నిర్వహించే స్థాయి కూడా ఎదగాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. బంజారా హిల్స్ ప్రాంతంలో బంజారా భవన్, కొమరం భీమ్ భవన్ పేర్లతో ఆదివాసీలకు రెండు ప్రత్యేక భవనాలు నిర్మించనుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగర పరిధిలో నివసిస్తున్న సుమారు రెండు లక్షల మంది పేద కుటుంబాలు గుడిసెలు, రేకుల షెడ్డులు వేసుకుని ఇరుకు ఇళ్లల్లో, మురికివాడల్లో వుంటున్నారని గుర్తించిన ప్రభుత్వం, వారికి మెరుగైన ఆవాసాలను కలిగించనుంది.
హైదరాబాద్ నగరానికి హుస్సేన్‌సాగర్ ఒక వరమని భావించిన ముఖ్యమంత్రి, దానిని ఒక మంచినీటి సరస్సుగా మార్చడానికి, దాంతో పాటు దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలను నిర్మించడానికి సంకల్పించారు. సాగర్ చుట్టూ నిర్మించనున్న భారీ టవర్స్ నగరానికే ఒక మణి హారంలాగా కానున్నాయి. తెలంగాణ అభివృద్ధికి, ఆర్థిక స్థితికి, సంకేతంగా ఈ ఆకాశ హర్మ్యాలుంటాయి. సాగర్ ప్రక్షాళణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో కార్యదర్శుల ఉపసంఘాన్ని కూడా ఇందుకోసం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. సాగర్ లోకి వివిధ ప్రాంతాల నుంచి నాలాల ద్వారా వచ్చే మురుగు నీటి వల్ల జల కాలుష్యం జరగకుండా నివారించేందుకు చర్యలు కూడా చేపట్టింది ప్రభుత్వం. హుస్సేన్ సాగర్‌లోకి పోయే 5 నాలాలతో సహా హైదరాబాద్ లో మొత్తం 77 నాలాలున్నాయి. మిగిలిన 72 నాలాలు మూసీ నదిలో కలుస్తాయి. ఇవన్నీ కూడా దారుణమైన నిర్వహణలో వున్నందున వాటిని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్ట్ హైదరాబాద్ నగరానికి అత్యంత ఆవశ్యకమైన ఆధునిక సదుపాయం. ఉమ్మడి రాష్ట్రంలో నత్తనడకలాగా సాగిన మెట్రో రైలు నిర్మాణ పనులు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వేగంగా సాగుతున్నాయి. అదొక సమగ్ర ప్రాజెక్టుగా హైదరాబాద్ ప్రజలకు సేవలందించనుంది. నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడిన చిహ్నాలు చెదిరిపోకుండా మెట్రో రైలు ప్రాజెక్ట్ నిర్మాణం కొనసాగుతోంది.
చారిత్రక ఆనవాళ్లు చెదిరిపోకుండా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలి. హైదరాబాద్ అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో కట్టబడిన అపురూపమైన నగరం. నిజాం నవాబులు చార్మినార్, గోల్కొండ, ఫలక్ నుమా, చౌ మహల్లా ప్యాలస్, మక్కా మస్జీద్, సాలార్‌జంగ్ మ్యూజియం, అసెంబ్లీ, హైకోర్ట్ లాంటి అద్భుతమైన భవనాలు నిర్మించి నగరానికి ప్రపంచ ఖ్యాతిని తెచ్చిపెట్టారు. తదనంతరం వచ్చిన పాలకులు ఆ వారసత్వాన్ని కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిజాం నవాబుల అద్భుత నిర్మాణాలకు అదనంగా-అనుబంధంగా మరిన్ని కట్టడాలు తేవాల్సింది పోయి, దానికి బదులుగా నగరాన్ని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చారు ఆ పాలకులు. అందుకే గత వైభవం ఉట్టిపడేలా నూతన నిర్మాణాలు రావాల్సిన అవసరం వుంది. ఇదొక యూనిక్ సిటీగా రూపాంతరం చెందాలి. దానర్థం హైటెక్ సిటీ లాంటి సాధారణ కట్టడాలు కాదు. ఏ ప్రాంతంలో ఎలాంటి కట్టడం రావాలి? ఎంత విస్తీర్ణంలో ఆ నిర్మాణం జరగాలి? వాటిని ఎలా-ఎందుకోసం ఉపయోగించాలి? అనే అంశాలపై సమగ్ర అధ్యయనం జరగాలని, తదనుగుణంగానే ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి అంటారు. హైదరాబాద్ నగరమంతా ఒకే రకంగా లేదు. వాటి చారిత్రక నేపధ్యం, సామాజిక పరిస్థితుల ఆధారంగా మాత్రమే కొత్త నిర్మాణాలు జరగాలన్నదే ముఖ్యమంత్రి కోరిక. మూసీ నదికి దక్షిణ భాగంలో వున్న పురాతన నగరం, ఉత్తర భాగంలో వున్న నగరం, బంజారా హిల్స్-జూబ్లీ హిల్స్-మాధాపూర్ లాంటి ప్రాంతాలు, పారిశ్రామిక వాడల ప్రాంతాలు, ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు, మురికివాడలు...ఇలా వేటికవే ఆయా ప్రాంతాల ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి చెందాలని అంటారు ముఖ్యమంత్రి. నగరంలో అనేక చోట్ల ఫ్లయ్ ఓవర్లు వున్నప్పటికీ, అవేవీ నగర ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా లేనందున వాటి స్థానంలో మల్టీ లేయర్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణ ఆవశ్యకత వుందంటారు ముఖ్యమంత్రి.

          భౌగోళికంగా, వాతావరణ పరంగా, సామాజికంగా, హైదరాబాద్ నగరానికి ఒక ప్రత్యేకత వుంది. నగర వాతావరణ సమతుల్యతను కాపాడడం అత్యంత అవసరమని కూడా ముఖ్యమంత్రి అంటారు. నగర పరిధిలో వున్న లక్షకు పైగా అటవీ భూమిని రక్షించుకోవడంతో పాటు, దానిని అందమైన ఉద్యానవనాలుగా తీర్చి దిద్దాలని, లంగ్ స్పేస్ పెంచాలని, పార్కుల కోసం కేటాయించిన స్థలాలను అందుకే ఉపయోగించాలని, వీటన్నిటి పర్యవేక్షణకు పౌర సంఘాలు ఏర్పాటు కావాలని ముఖ్యమంత్రి అంటారు.
ముఖ్యమంత్రి ఆలోచనలకు-ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా, విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి కార్యాచరణ పథకం రూపుదిద్దుకుంటున్నది. అమలకు రంగం సిద్ధమౌతోంది. అనతి కాలంలోనే భాగ్యనగరం రూపురేఖలు మారనున్నాయి. విశ్వ నగరంగా భాగ్యనగరం కాబోతోంది.End


Wednesday, December 26, 2012

తెలుగు భాష - సాహిత్యాల కలయిక నేపధ్యమే మానవతావాదం: వనం జ్వాలా నరసింహారావు


తెలుగు భాష - సాహిత్యాల 
కలయిక నేపధ్యమే మానవతావాదం

వనం జ్వాలా నరసింహారావు

 మానవతావాదం అనాదిగా సాగుతున్న ఒక మహోద్యమం. సంస్కృతీ-సాహిత్యాల సాంప్రదాయిక నేపధ్యం మీద ఆధారపడి వుండే రీతిలో మానవతావాద ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. మేధావులు, సాహిత్యాభిలాషులు, శాస్త్రీయ దృక్ఫధంతో ఆలోచన చేసిన పలువురు, శతాబ్దాల పూర్వమే, మానవ విలువల పరిరక్షణకు ఆరంభించిన ఆ మహోద్యమం ఈ నాటికీ ప్రత్యక్షంగా-పరోక్షంగా వాటిని కాపాడేందుకు దోహదపడుతూనే వుంది. క్రైస్తవమత మానవతావాదమనీ, సాంస్కృతిక మానవతావాదమనీ, సాహితీ మానవతావాదమనీ, రాజకీయపరమైన మానవతావాదమనీ, మతపరమైన మానవతావాదమనీ రకరకాల పేర్లతో-ఎవరికి నచ్చిన విధంగా వారు పిలువసాగారు. రామరాజ్యమైనా, గ్రామరాజ్యమైనా, కార్మికరాజ్యమైనా, శ్రామికరాజ్యమైనా.. .. ... ... మానవతా దృక్పథం కలిగిందైతేనే, మానవ విలువలకు అర్థముంటుంది. అలా కానప్పుడు, ఏదో ఒక రూపంలో, మానవ విలువలు కాపాడబడేందుకు నిరంతర పోరాటం జరుగుతూనే వుంటుంది. ఆ పోరాటానికి మొదలు-చివర అంటూ ఏమీలేదు. మానవ విలువల పరిరక్షణకు అసలు-సిసలైన సాధనం మాత్రం సాహిత్యమే. పండితులైనా-పామరులైనా సంభాషించుకునేది వ్యావహారిక భాషలోనే గాని గ్రాంథికంలో కాదు. రచయితకు, పాఠకుడికి మధ్య వుండాల్సిన సంబంధం సంభాషణ లాంటిదే. ఇరువురు మాట్లాడుకుంటున్నప్పుడు ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థంకాకపోతే సంభాషణకు అర్థంలేదు. రచయిత రాసింది పాఠకుడికి అర్థంకాకపోతే అసలు భాషే కాదంటాడు జీన్ పాల్ సాత్రే "సాహిత్యం అంటే ఏంటి" అన్న తన పుస్తకంలో. "వాక్యం రసాత్మకం కావ్యం" అన్న విషయం అందరికీ తెలిసిందే. రచయిత తన మేథస్సునుండి పెల్లుబుకిన ఆలోచనను, పాఠకులు అర్థంచేసుకుని-ఆకళింపు చేసుకునే రీతిలో వాక్యంగా మలిచినప్పుడే, ఆ రచనకు గుర్తింపు వస్తుందంటాడు జీన్ పాల్ సాత్రే. నలుగురితో చదివించలేని రచన చిత్తుకాగితంతో సమాన మంటాడు. రచనంటే కేవలం సాహితీ ప్రక్రియ మాత్రమే కాదు-ఉత్పత్తిదారుడుకీ (రచయిత), వినియోగదారుడుకీ (పాఠకుడు) మధ్య తలెత్తనున్న ఘర్షణ.

అతి ప్రాచీనకాలంనాటి నుంచి ఇప్పటికీ వాడుకలో వుండి, వ్యావహారిక భాషగా, సాహిత్యంగా ఉపయోగంలో వున్న వాటిలో తమిళం, తెలుగు భాషలను పేర్కొనాలి. సంస్కృతం, లాటిన్ భాషల్లో సంభాషించు కోవడం దాదాపు లేనట్లే. కొద్ది మార్పులతో గ్రీకు భాష ఇంకా వాడుకలో వుందనాలి. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో తెలుగు ఒకటి. తెలుగు వారుంటున్న ప్రాంతంలోనే ఆది మానవుడు తొలుత సంచరించాడని, దక్షిణా పథానున్న తూర్పు కోస్తా ప్రాంతంలో తిరిగి, తర్వాత పంజాబుకు తరలిపోయాడని చరిత్రకారులంటారు. రాతియుగం నాటి మానవుడు సంచరించిన ప్రీతిపాత్రమైన ప్రదేశంగా కూడా ఆంధ్ర ప్రాంతాన్ని పేర్కొన్నారంటారు. తెలుగువారిప్పుడు నివసించని ప్రదేశమంటూ లేదు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు, అమెరికాతో సహా ప్రపంచంలోని పలు దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న తెలుగువారు ఎందరో వున్నారు. ముక్కోటి ఆంధ్రులల్లా ఆరుకోట్లకెదిగి, ఎనిమిదికోట్లు దాటి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు చేరుకున్నారని. అమెరికా కాలిఫోర్నియా లోని సిలికాన్ వాలీనిప్పుడు ఆంధ్రా వాలీగా-తెలుగువాడి వాలీగా పిలవాలి. ఇదిలా వుంటే, తెలుగువారుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ పేర్లతో పిలిచే మూడు ప్రాంతాలున్నాయి. ఈ మూడు ప్రాంతాల్లో భిన్నమైన యాసలో తెలుగు మాట్లాడే వారుకూడా వున్నారు.


నవంబర్ 1, 1956న తెలుగువారుండే ప్రాంతాలన్నీ కలపాలని రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం నివేదిక ఆధారంగా విశాలాంధ్ర ఏర్పాటయింది. తెలుగు వారందరూ కలిసుందామని అనుకున్నారో-లేదో తెలియదుగాని, కలిసుందామనుకున్న అలనాటి మద్రాస్ తెలుగువారు-తమిళులు మాత్రం విడిపోయారు. భాషాపరంగా ఒకరిమీద పడ్డ ఇంకొకరి ప్రభావం అలానే చెక్కు చెదరకుండా వుంది. ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే ఏ ప్ర్రాంతం వారైనా మాట్లాడే భాషను "ఆంధ్రము" అని, "తెనుగు" అని, "తెలుగు" అని అంటాం. ప్రాచీనకాలంనాటి సంస్కృత రచనల్లో ఆంధ్రులను గురించి ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు "ఆంధ్ర" అనో, "అంధక" అనో పేర్కొనేవారు. ఆ ప్రాంతంలో నివసించేవారిని ఒక తెగగానో, సమాజంగానో, దేశీయులుగానో గుర్తించేందుకు బహుశా అలాంటి పదప్రయోగం చేసుండాలి. భాషాపరమైన పదప్రయోగాలు చాలాకాలం తర్వాతే వాడబడ్డాయి. ఆంధ్ర ప్రాంతం గురించిన ప్రస్తావన రామాయణంలోను, బౌద్ధాయనంలోను, మనుస్మృతిలోను, మత్స్యపురాణంలోను కనిపిస్తుంది. దక్షిణ దిక్కును తెలిపే "తెన్" అనే ద్రావిడ పదం ఆధారంగా "తెనుగు" ఉత్పన్నమైందని కొందరు భాషా కోవిదుల అభిప్రాయం. ద్రావిడులు తెలుగుదేశానికి ఉత్తర దిక్కుగా నివసించారని తెలియచేసే ప్రయత్నంలోనే, దక్షిణాది వారు మాట్లాడే భాషను "తెనుగు" అని సూచించారు. కాకపోతే శాస్త్రీయమైన సాక్ష్యాధారాలు ఆ సూచనకంతగా లభ్యంకాలేదు. "త్రి లింగ" నుండి తెలుగు ఆవిర్భవించిందని అందరూ అనుకుండేదే. త్రి లింగ కూడా "త్రి-కళింగ" నుండి వచ్చిందే. ఆంధ్రులను "మస్సాలియ" అని, "మైసోలియ" అను గ్రీకులు సంబోధించేవారు. కృష్ణానదిని కూడా వారు అలానే పిలిచేవారు "మసూలీపట్నం", "మచిలీపట్నం", "బందర్" అన్న పేరుతో ఇప్పటికీ కృష్ణా జిల్లా ప్రధాన కేంద్రాన్ని పిలుస్తాం.

విశ్వామిత్ర మహర్షి కోపానికి గురై, దేశ బహిష్కృతులైన ఆయన ఏభైమంది కొడుకుల వారసులే ఆంధ్రులయ్యారని అయితరేయ బ్రాహ్మణంలో చెప్పబడింది. వారందరు ఆర్యావర్తం సరిహద్దుల్లోకి, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లోకి వ్యాపించారు. ఆర్యులనీ, ద్రావిడులనీ వాడుకలో వున్న పదాలు ఎందుకు ఉపయోగించారో ఇదమిద్ధంగా తెలియదు. ఒక తెగవారినో, భాష మాట్లాడేవారినో, సంస్కృతిని పాటించేవారినో పరోక్షంగా ప్రస్తావించడానికి అలా వాడి వుండవచ్చు. లేదా గుర్తించడంలోనే పొరబడి వుండవచ్చు. ఇదిలా వుండగా, ఆంధ్ర వాల్మీకి రామాయణంలో, తురకలపూర్వీకులైన ఇరానీయులు ఆర్య శబ్దంనుండి పుట్టినవారేనని రాయబడింది. ఆర్యన్ కు వికృతి "అయిరాన్: అనీ, అదే ఇరాన్ గా మారిందనీ చెప్పబడింది. మధ్య ప్రాంత ద్రావిడ జాతికి చెందిన గోండ్-భిల్లీ భాషలకు, తెలుగుకు అవినాభావ సంబంధముందని కొందరంటారు. ప్రాచీనకాలంలో ఆంధ్ర రాజ్యానికి శ్రీకాకుళం రాజధానిగా వుండేదట. మతపరంగా అధ్యయనం చేసి, విశ్లేషణ చేసిన మరికొందరు పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మౌర్యులకు పూర్వమే ఆంధ్ర ప్రాంతంలో జైనమతం ప్రచారంలో వుంది. అశోక చక్రవర్తి కాలంలో వైభవంగా వర్ధిల్లిందని అనుకునే బౌద్ధమతం కంటే ముందే జైనమతాన్ని అనుసరించినవారెందరో వున్నారు. క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం-క్రీస్తు శకం ఆరవ శతాబ్దం మధ్య కాలంలో ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధమత ప్రభావం ఎక్కువగా వుండేది. బౌద్ధమతం బోధించిన సర్వ మానవ సిద్ధాంతం, మానవ విలువలు, ప్రజలమధ్యనున్న అంతరాలను తొలగించి, అన్నిజాతులవారిని-తెగలవారిని కులమతాలకు అతీతంగా ఐకమత్యం చేసింది. అత్యంత బలీయమైన, శక్తివంతమైన శాతవాహన రాజుల పాలన స్థాపనకు దారితీసింది.

దక్కన్ పీఠభూమినే దక్షిణాపథం అనేవారు. దానికి ఆగ్నేయ దిక్కుగా ఆంధ్ర ప్రాంతముంది. వింధ్య పర్వతాలను దాటి దక్షిణ ప్రాంతానికి తొలుత వలస వచ్చిన ఆర్యుడు అగస్త్య మహాముని అంటారు. శివలింగాన్ని మొదట కనుగొన్నది ఆయనేననీ, అందువల్లనే ఆంధ్రలోని ఎన్నో శివాలయాలలో వున్న శివలింగాలను అగస్త్యేశ్వరం అనికూడా పిలుస్తారని అంటారు. ఆపస్తంబ ధర్మ సూత్రాల ప్రకారం, క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దంలో, ఆంధ్ర ప్రాంతంలో వైదిక మతం వేళ్లూనుకోసాగింది. భగవత్-భాగవత మతం కూడా ప్రచారంలోకి వచ్చింది. శ్రీకృష్ణుడి బోధనలను తెలియచేస్తూ, క్రమేపీ వైష్ణవ మతంగా రూపాంతరము చెందిందే భాగవత సిద్ధాంతం. సాంఖ్య-యోగ ఆధారంగా భాగవతమతం వుందని భావించినప్పటికీ, దాంట్లో తాత్త్విక చింతనకు సంబంధించిన పలు అంశాలు నిగూఢంగా వున్నాయి వాస్తవానికి. కులాలకు అతీతంగా, అన్ని కులాలవారు పాటించే మతంగా భాగవతం మొదట్లో ప్రచారంలో వున్నప్పటికీ, బ్రాహ్మణుల జోక్యంతో, బ్రాహ్మణ్యం ఆవిర్భవించడంతో, భాగవత మతం, బ్రాహ్మణ్యం కలిసిపోయాయి. కులాల గుర్తింపు మొదలయింది. ఆంధ్ర ప్రాంతంలో అతిపురాతనమైంది, ఎక్కువమంది అనుసరించేది శైవమతం. దాని ప్రభావం కూడా ఎక్కువే. అలానే శాక్తేయ మతాన్ని కొందరు అనుసరించేవారు. వీరశైవం వున్నా దాని ప్రభావం అంతగా లేదనవచ్చునేమో. బ్రాహ్మణుల మూలాన భాగవతమతం వారి చేతుల్లోకి పోయినప్పటికీ, బ్రాహ్మణుడి కర్తవ్యం సాధారణంగా వైదిక పూజలు జరిపించడానికే గాని, కులాధిక్యతకు ప్రతిరూపం కావడం మాత్రం కాదనాలి.

ఆంధ్రుల మతపరమైన నమ్మకాలు-సంప్రదాయాలు తెలుగు భాషమీద, అదేవిధంగా తెలుగు భాష మతపరమైన చారిత్రాకాంశాలమీద ప్రభావం చూపించి వుండాలి. రాజుల-చక్రవర్తుల ప్రోత్సాహంతో, స్వయంగా వాళ్లే ఒక మతాన్ని నమ్మి అనుసరించడంతో, దాని ప్రభావం జన బాహుళ్యం పైనా, వారి జీవన శైలి పైనా, మానవ విలువల పైనా స్పష్టంగా పడసాగింది. పర్యవసానంగా వైదిక మతం మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానంగా, ఎవరికైనా ఆ సిద్ధాంతాలు పాటించడం తేలికైనటువంటిదిగా, అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది. అదే హిందు మతంగా వాడుకలోకొచ్చింది. బహుశా ఎన్నో మతాలకు మాతృకయింది. ప్రపంచ భాషలకు సంస్కృతం ఎలానో, ప్రపంచంలోని మతాలన్నిటికీ హిందు మతం అలానే మాతృకనాలి. అందుకేనేమో మార్క్స్ తన గతి తార్కిక భౌతికవాదంలో ఎన్నో సందర్భాల్లో పరోక్షంగా వైదిక సిద్ధాంతాలను అన్వయించుకుంటాడు.

కృతయుగంలో కూడా "ఆంధ్రము" అనే విషయానికి సంబంధించిన ప్రస్తావన వుంది. అగ్నిమిత్ర అనే ఒక రాజుండేవాడు. ఒక వేసవికాలంలో ఎండల తీవ్రతకు ఆయనకు దృష్టి లోపం వచ్చి, కళ్లు కనిపించలేదు. సూర్య భగవానుడిని ప్రార్థించాడట. అగ్నిమిత్రకు ఆయన ప్రత్యక్షమై, తనను కొలిచేందుకు ఒక కొత్త భాషను నేర్పాడంటారు. సూర్యుడిని అగ్నిమిత్ర అదే భాషలో ప్రార్థించడంతో, ఆ భాషకున్న పదజాల ప్రభావంతో, అగ్నిమిత్రకు పోయిన దృష్టి తిరిగొచ్చింది. సంస్కృతంలో "అంధ" అంటే "గుడ్డి" అని-చీకటి అని అర్థమొస్తుంది. చీకటిని తొలగించి, గుడ్డి తనాన్ని పోగొట్టగలిగింది కాబట్టి ఆయన నేర్చుకున్న భాషకు "ఆంధ్ర భాష" అని పేరొచ్చింది. ఒక్కో యుగంలో ఒక్కోరకంగా తెలుగు భాష వాడుకలో వుందని కొందరి నమ్మకం. ఈ నమ్మకం ఆధారంగా కలియుగంలో తెలుగును "కళింగ ఆంధ్ర భాష" అనీ, "రౌద్ర ఆంధ్ర భాష" అనీ ఏర్పాటుచేసింది శాతకర్ణులకు చెందిన నంది వర్ధనుడు-ఆయన శిష్యుడు దేవల రాయ అని అంటారు. ఆంధ్ర భాషకు రావణాసురుడు వ్యాకరణం రాశాడంటారు. ఆ రాసిన రావణుడు, రామాయణంలో పేర్కొన్న రావణుడే కావాలని లేదు-కాకూడదనీ లేదు. ఆంధ్ర దేశానికి, సింహళ దేశానికి మధ్య మతపరమైన అవినాభావ సంబంధాలున్నందున, తెలుగు భాషకు ఆ దేశానికి చెందిన ఒకవ్యక్తి వ్యాకరణం రాశాడంటే నమ్మ దగ్గ విషయంగానే భావించాలి. ఈ నమ్మకాల్లో, గాథల్లో, మౌఖికంగా ప్రచారంలో వున్న వాటిల్లో, కొంతలో కొంత వాస్తవం వుందనేది మాత్రం వాస్తవమే. భాషకున్న వ్యాకరణ నిర్మాణం-నిబంధనలు-మౌలికమైన పదజాల ఒరవడిని పరిగణలోకి తీసుకొని, తెలుగు భాషను అతి ప్రాచీనమైన ద్రావిడ జాతి భాషలకు చెందినదిగా శాస్త్రవేత్తలు-పరిశోధకులు-భాషా కోవిదులు-పండితులు నిర్ణయించారు. మధ్య ప్రాంత ద్రావిడ జాతి భాషల్లో బహుశా తెలుగు ఒక్కటే అతిపెద్ద వాడుక భాషగానూ, భౌగోళికంగా ప్రత్యేకమైన గుర్తింపు పొందిన భాషగానూ, ఉత్తర-దక్షిణాల మధ్య వారధిగా వుండే భాషగానూ, ఆర్యుల-ద్రావిడుల మధ్య వారధిగా వుండే భాషగానూ పేర్కొనడం అతిశయోక్తికాదేమో.

పింగళి లక్ష్మీకాంతం గారు చెప్పినదాని ప్రకారం, భాషాపరంగా, తెలుగు భాషారంభం-అభివృద్ధి నన్నయకు పూర్వం-క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో మొదలై, ఆధునిక కాలం నాటి క్రీస్తుపూర్వం 1875 వరకు, ఆ తర్వాత కొనసాగింది-కొనసాగుతూనే వుంది. ప్రాచీనకాలంలో నాటి తెలుగు నాలుగు దశల్లో అభివృద్ధి చెందిందనవచ్చు. అవి: తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగుకు పూర్వం నెలకొన్న దశ, గ్రాంథిక తెలుగు దశ, సాహిత్య దశలుగా విభజించవచ్చు. తెలుగుకు పూర్వపు దశ అంటే క్రీస్తుశకం 200 వరకే సాగిందనాలి. క్రీస్తుశకం 200-600 మధ్యకాలం వరకు గ్రాంథిక తెలుగుకు పూర్వ దశ కొనసాగింది. గ్రాంథిక దశ-వివిధ రకాల వాడుక శైలి దశ క్రీస్తుశకం 600-900 మధ్య కాలానికి చెందింది. దీని ఆధారంగా, తెలుగు భాష దక్షిణాది ద్రావిడ భాషల్లోంచి ఉద్భవించిందేననీ, ఒక ప్రత్యేకమైన భాషగా క్రీస్తుపూర్వం ఎన్నో శతాబ్దాల క్రితంనుండే వాడుకలో వుందనీ, బల్ల గుద్ది మరీ చెప్పొచ్చు. "సాలంకాయనులుల" శాసనాల ఆధారంగా, అతి పురాతనమైన తెలుగు లిపి "వెంగి"-"తెలుగు కన్నడ" లభ్యమయిందని తెలుస్తోంది. ద్రావిడ భాషకు చెందినదే అయినప్పటికీ, తెలుగుపై సంస్కృత భాష ప్రభావం అధికంగా వుంది. వాడుకభాషపైనా, గ్రాంథిక భాషపైనా కూడ ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అచ్చ తెలుగులో రచనలు చేసినవారు అరుదనాలి. అందుకే మనందరికీ కవిత్రయం నన్నయ-తిక్కన-ఎర్రా ప్రగడ అయితే, శ్రీ శ్రీ గారి కవిత్రయం మాత్రం తిక్కన-వేమన-గురజాడలు. తెలుగు భాషపై సంస్కృతం ప్రభావం పడకుండా అభిమానం చూపిన మొదటి వాడు తిక్కన అని శ్రీ శ్రీ అభిప్రాయం. ఇక ఆధునిక కాలంలో తెలుగు భాష వాడకంలో-ఉపయోగంలో హద్దులనేవి గాని, ఎల్లలనేవి గాని అసలు లేనేలేవు. ఒక వైపు సంస్కృతం ప్రభావం ఇంకా తెలుగు మీద పడుతున్నప్పటికీ, ఎక్కువ ప్రభావం ఆంగ్ల భాషదే అనాలి. నాగరికులందరూ ప్రస్తుతం మాట్లాడుతుండే తెలుగును "తెంగ్లీష్" అనాలి-ఎందుకంటే, అది ప్రధానంగా తెలుగు-ఇంగ్లీషులు కలిపిన భాష కాబట్టి. తమిళం అంతే. ఇంగ్లీష్ పదజాలం లేకుండా ఈ రోజుల్లో బహుశా ఏ భాషా లేదేమో. "వేర్ సెంచరీస్ కో ఎగ్జిస్ట్" అనే భారత ఆంగ్ల సినిమాను రూపొందించిన కృష్ణస్వామి "ఇంగ్లీష్ భారతీయ భాషనీ-దక్షిణ భారతీయ భాషనీ" అంటాడు.

ఇలా మతం, భాష, సాహిత్యం దేని కవే మానవ విలువల పరిరక్షణకు దోహదపడుతున్నాయి. మనిషి తాను భగవంతుడితో మమేకం కావడానికి, తన మూర్తిని భగవంతుడిలో-ఆయన మూర్తిని తనలో చూసుకుంటూ, తద్వారా క్రమశిక్షణతో మెలుగుతూ, తోటి మానవ విలువలను కాపాడేందుకు నిరంతరం పాటుపడుతూనే వుంటాడని ఆశించుదాం.

Thursday, December 13, 2012

కాలయాపనకే అఖిల పక్షాలు: వనం జ్వాలా నరసింహారావు


వనం జ్వాలా నరసింహారావు
          
తెలంగాణ సమస్యపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చి దాదాపు రెండేళ్లు పూర్తి కావస్తోంది. తదనంతరం అఖిల పక్ష సమావేశాలూ జరిగాయి. ఇంతవరకూ ఏమీ తేలలేదు. మళ్లీ అఖిల పక్ష సమావేశ మంటున్నారు. అసలా మాటకొస్తే ఆ కమిటీ చేసిందంతా అఖిల పక్ష సమావేశాలే కదా? విస్తృత స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమైన తరువాతే నివేదిక ఇచ్చినప్పుడు మళ్లీ అఖిల పక్ష సమావేశం కావాల్నా?

నివేదిక ఇస్తూ శ్రీకృష్ణ కమిటీ సభ్యులు తమకు “అప్పజెప్పిన పని సులభమైంది కాదని” అనడం కన్నా, బాధ్యత తీసుకునే ముందే, తమకంతగా చేతకాని బాధ్యత నెత్తిన వేసుకుంటున్నామని అనుకుంటే బాగుండేదేమో. పదకొండు నెలలుగా చేసిన విస్తృత సంప్రదింపులు, బృహత్తర పరిశోధనలు చివరకు ఏమైనా తేల్చిందా? తేల్చనప్పుడు-తేల్చలేమని గుర్తించినప్పుడు, ఆ సంగతే చెప్పాలి కాని, శాశ్వత ప్రతిష్ఠంభన దిశగా సూచనలివ్వడం ఎంతవరకు సబబు? పైగా తాము చెప్పలేని దానికి, పోనీ పదే-పదే చెప్తూ వస్తున్న దానికి (అందరికీ ఆమోద యోగ్యమైన నివేదిక ఇస్తాం!) పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ప్రసంగంలోని సూక్తులను పేర్కొనడం ఒక తెలివైన ఎత్తుగడ తప్ప మరోటి కాదు. కమిటీ చేసిన "బెస్ట్" లేదా "సెకండ్ బెస్ట్" సూచనలలో ఏ ఒక్క దాన్ని ప్రభుత్వం అంగీకరించినా, ఆ నిర్ణయం, నిజంగా శ్రీకృష్ణ కమిటీ చెప్పినట్లు "ఎవరికీ పరాజయం లేకుండా అందరికీ సమానంగా విజయం చేకూరినట్లు" అవుతుందా? సూచన-ఐదుకు ప్రభుత్వం అంగీకరించితే అది సమైక్య వాదులకు అపజయమే కదా! సూచన-ఆరుకు ఒప్పుకుంటే, ఇటు తెలంగాణ కోరుకునే వారికి, అటు సమైక్య వాదులకు అపజయమే కదా! జవహర్లాల్ నెహ్రూ చెప్పిన బుద్ధుడి ప్రవచనాలను శ్రీకృష్ణ కమిటీ నిజంగా గౌరవించిందా? న్యాయమూర్తి అనేవారెవరైనా "ధర్మ సమ్మతమైన న్యాయం" చెప్పి సమస్యను పరిష్కరించే సూచనలివ్వాలి కాని, సమస్యను మరింత జటిలం చేయొచ్చా? పైగా అందరికీ విజయం చేకూరుస్తున్నామని చెప్పడం తగునా?


          నివేదికలో ఏం చెప్పినా ఇష్టంగానో-అయిష్టంగా నో, మనసులో మాట మాత్రం దాచుకోలేక పోయారు శ్రీకృష్ణ కమిటీ సభ్యులు. మహాభారత యుద్ధం పూర్వ రంగంలో, కౌరవ-పాండవ యుద్ధం నివారించడానికి శ్రీకృష్ణుడు హస్తినకు రాయభారానికి వెళ్లినట్లు వర్ణించడం జరిగినా, వాస్తవానికి, యుద్ధాన్ని ఖాయం చేసేందు కొరకే వెళ్లాడనే ది జగమెరిగిన సత్యం. అదే జరిగింది శ్రీకృష్ణ కమిటీ నివేదిక విషయంలో కూడా. ఏభై నాలుగేళ్ల ఆంధ్రా నిలువెత్తు దోపిడీకి నిదర్శనంగా నేటికీ మిగిలిపోయిన తెలంగాణ ప్రాంతం వారు చేయబోయే ఆధునిక మహాభారత యుద్ధానికి తెరలేపింది శ్రీకృష్ణ కమిటీ "కృష్ణ రాయభారం తరహా నివేదిక". నాటి శ్రీకృష్ణుడు పాండవ పక్షం-ధర్మం పక్షం వహిస్తే, నేటి శ్రీకృష్ణుడి నివేదిక సమైక్యానికి మొగ్గు చూపినట్లు భావన కలిగించినా, ఆసాంతం, మనసులో వున్న మాటగా, విభజన పలుకులే పలకడం విశేషం. మరో విధంగా చెప్పాలంటే, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల న్యాయమైన కోర్కె సమంజసమని-సమర్థించాలని మనసులో వున్నా, చేసిన ఆరు సూచనలలో వద్దనుకుంటూనే నాలుగు సూచనలు విభజనకు సంబంధించినవి కావడం విశేషం. అంటే, విభజన సమస్య పరిష్కారానికి సరైన మార్గమని ఆయనకు తెలిసినా అసంబద్ధమైన విభజనలను మొదలు సూచించి, చివరకు అసలు సిసలైన రాయభారం తరహాలో... ఐదూళ్లిచ్చిన చాలును... అన్న చందాన పనికిమాలిన సూచనతో సహా, అసలు సిసలైన ఒకే ఒక్క సూచన చేశారు. ఆయన చెప్పిన విధంగా, ఐదో సూచనకు అనుగుణంగా తప్ప, వేరే రకంగా విభజనకు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. "అనివార్యమైతే - అంతా ఒప్పుకుంటేనే పరిశీలించాలి" అని కమిటీ వ్యాఖ్య చేసిన "రాష్ట్రాన్ని సీమాంధ్ర-తెలంగాణగా విభజించి... హైదరాబాద్‌ను తెలంగాణ రాజధానిగా ఉంచడం, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు చేయడం" అన్న దానికి ప్రభుత్వం ఒప్పుకుని, దానికి అనుగుణమైన చర్యలు చేపట్టి తేనే, బహుశా మహాభారత యుద్ధం లాంటిది నివారించవచ్చేమో! శ్రీకృష్ణ కమిటీ సభ్యులంతా "మనసా-వాచా" తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు న్యాయమైందని భావించినా, "కర్మనా" అనుకూలంగా లేకుండా-ప్రతికూలంగా కాకుండా తీర్పు లాంటి సూచన ఇవ్వడం అన్యాయం లాంటిదే!
          
ఒక వైపు సూచనలు చేస్తూనే అవే సూచనలు "ఆచరణ యోగ్యమైన వి కావు" అని అనడం కూడా ఎంతవరకు సబబు? "కలిసి ఉండటమే ఉత్తమం" అంటూనే, అదే "అత్యుత్తమమైన మార్గం" అని చెప్తూనే, సమైక్యాంధ్రకు అనుకూలమైన ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదిస్తే తెలంగాణలో నిరసనలు తప్పక పోవచ్చని, పలు ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురవుతుందని వ్యాఖ్యానించడంలోని ఆంతర్యం ఏంటి? సమైక్యంగా వుండడానికి తెలంగాణ ప్రాంతం వారు అంగీకరించ రనే కదా? అంటే శ్రీకృష్ణ కమిటీ మనసులోని మాట ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాదా? ఇంకొంచెం లోతుగా నివేదికను విశ్లేషిస్తే,"అనివార్యంగా రాష్ట్రాన్ని విభజించాల్సి వస్తే తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడదీయాలని, సీమాంధ్ర సొంత రాజధానిని అభివృద్ధి చేసుకునే దాకా హైదరాబాద్‌నే ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని" మరో సూచన కనిపిస్తుంది. ఇది కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసిందనాలి కదా? ఏదేమైనా, ‘‘ఇదేమంత అభిలషణీయమైన పరిష్కారం కాదు. అయినా సరే అనివార్యంగా విభజించాల్సి వస్తే అది మూడు ప్రాంతాల ప్రజల ఆమోదంతో జరగాలి’’ అని చెప్పకనే చెప్పింది ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయమని ప్రభుత్వానికి. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించడానికి ఇంతకంటే ఇంకేం కావాలి ప్రభుత్వానికి". ఇతర సూచనలకు కూడా "తెలంగాణ ప్రాంతం నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది" అని కమిటీ అభిప్రాయ పడడమంటే, నర్మ గర్భంగా తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పడమే కదా? కాకపోతే, ఎందుకో, ఏ కారణానో, "సందిగ్ధత లేని" తరహాలో మనసులో మాట చెప్పడానికి జంకింది శ్రీకృష్ణ కమిటీ.
          
మొదటి నాలుగు సూచనలలో “ఆచరణసాధ్యం కాని” ఒక సూచన, తెలంగాణలో ఒప్పుకోనందున “అసాధ్యమని భావించిన” మరో సూచన, ఏ ప్రాంతం వారికి “ఆమోదయోగ్యం కాని” ఇంకొక సూచన, నక్సలిజం పెరగడానికి అవకాశమున్నందున-ఏకాభిప్రాయం సాధ్యం కానందున “పనికి రాని” ఒక సూచన చేసిన కమిటీ, మిగిలిన రెండు సూచనలు సార్వజనీన సమ్మతమైన వని చెప్పడానికి సాహసించలేదు. ఒకటి పరిశీలనకు తగిందిగా, మరొక టి సమస్యలకు దారి తీసే దిగా కమిటీ మాటల్లోనే స్పష్టమవుతోంది. "రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ ప్రాంత సామాజిక, ఆర్థికాభివృద్ధికి, రాజకీయ సాధికారతకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం-చట్టబద్ధమైన అధికారాలతో తెలంగాణ ప్రాంతీయ అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయడం" ఏబై సంవత్సరాల క్రితం చెప్పి వుంటే కొంతైనా అమలయ్యేదేమో కాని ఇప్పుడు అత్యంత అసాధ్యమైన విషయం. 1956 లో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందం స్ఫూర్తితో "తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు" చేయమని సూచించడం కన్నా తిరోగమన మార్గం లేదనాలి. ఇన్నేళ్లు జరగంది, ఇప్పుడు జరుగుతుందన్న నమ్మకం, విశ్వాసం భవిష్యత్ "సీమాంధ్ర నాయకులు" ఎన్ని రాజ్యాంగ భద్రతలు కలిగించినా, తెలంగాణ ప్రజల్లో కలిగించడం జరగని పని. చట్టబద్ధమైన సంప్రదింపులను ప్రాంతీయ మండలి నిర్వహించడం కాని, ప్రాంతీయ మండలికి-రాష్ట్ర ప్రభుత్వానికి-శాసనసభకు మధ్య ఎప్పుడైనా, ఏవైనా అభిప్రాయభేదాలు తలెత్తినపుడు... “గవర్నర్ ఆధ్వర్యంలో అత్యున్నత కమిటీ” ని ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించుకునే అవకాశం కాని ఎండమావుల లాంటి ఆలోచనలు. తెలంగాణ ఏర్పాటై, తెలంగాణకు చెందిన వారు ముఖ్యమంత్రి కావాలనుకునే తెలంగాణ ప్రజలకు, తమ ప్రాంతం వాడే మో "కేవలం కేబినెట్ మంత్రిగా" మిగిలి పోవడం ఆమోదయోగ్యమైన ప్రతిపాదన కానే కాదు. ముఖ్యమంత్రి లేదా ఉప ముఖ్యమంత్రి పదవి లేదా కీలక మంత్రిత్వ శాఖలను తెలంగాణ ప్రాంత నేతలకు కేటాయించడం జరుగు తే, ప్రాంతీయ మండలి అధ్యక్షుడి హోదా ఏం కావాలి? బహుశా ఆచరణ యోగ్యం కాని సూచనలలో అగ్ర భాగాన నిలిచే సూచన ఇదేనేమో!
          
అన్నింటి కన్నా ఘోరమైంది, రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా నామినేటెడ్ పోస్టులో నియమించబడిన గవర్నర్ కు, ఈ ప్రతిపాదన ద్వారా విస్తృత అధికారాలను కట్టబెట్టడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విఘాతం.
          
శ్రీకృష్ణ కమిటీ మాటల్లోనే, తెలంగాణ-సీమాంధ్ర లుగా రాష్ట్రాన్ని విభజించడం, అత్యధిక తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించినట్లన్న భావన వుంది. తెలంగాణ లోని మెజారిటీ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారన్న వాస్తవం కూడా కమిటీ చెప్పింది. "తప్పని పరిస్థితుల్లో-అన్ని ప్రాంతాల వారికి ఆమోదయోగ్యమైతేనే" రాష్ట్ర విభజన జరగాలని కమిటీ అభిప్రాయపడడం, పరోక్షంగా, అలాంటి పరిస్థితులు కలుగుతాయని హెచ్చరించడమేనా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావాలన్న చిరకాల డిమాండ్ నేపధ్యంలో, రాష్ట్ర విభజన జరగకపోతే, ఉద్యమం కొనసాగే ప్రమాదముందని కమిటీ హెచ్చరిస్తుంది. "నేర్పుగా, చాకచక్యంగా, దృఢంగా" ప్రభుత్వం ఉద్యమాన్ని” అదుపు చేయగలిగితే" తప్ప ఉద్యమం ఎదుర్కోవడం కష్టమవుతుంది కనుక, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమే ఉత్తమం అని సూచన చేసింది. (…”Likelihood of the agitation continuing in case the demand is not met-unless handled deftly, tactfully and firmly as discussed under option six-consideration has to be given to this option.)
          
రాష్ట్ర విభజన చేసేందుకు నిర్ణయం తీసుకుంటే, రాజ్యాంగంలోని మూడవ ప్రకరణం కింద చెప్పిన విధంగా, ముందుకు సాగితే మంచిదని కూడా కమిటీ సూచించింది. అంటే, రాష్ట్ర రాజకీయ నాయకులతో సంప్రదింపులు అనవసరం అన్న భావన వుంది కదా! ఎలాగూ చిదంబరం డిసెంబర్ తొమ్మిది ప్రకటనలో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలయిందని స్పష్టంగా చెప్పారు. కమిటీ అదే సూచించింది. ఇంకెందుకు ఆలశ్యం? పార్లమెంటులో బిల్లు పెడితే ప్రధాన ప్రతిపక్షం బిజెపి-దాని ఎన్డీఏ మిత్ర పక్షాలు సమర్థించడం ఖాయం కనుక, ఆ దిశగా అడుగులు వేస్తే అందరికీ మేలు.ఇంకా అఖిల పక్ష సమావేశాలు ఏర్పాటు చేయడం అనవసరం!

Saturday, November 19, 2011

రెండో ఎస్సార్సీ అవసరమా ?: వనం జ్వాలా నరసింహా రావు

సూర్య దినపత్రిక (19-11-2011)

వనం జ్వాలా నరసింహా రావు

{పొంతన లేని కాంగ్రెస్‌ ప్రతినిధుల ప్రకటనలు; యూపీతో లంకె ఎందుకు?; మాట మారుస్తున్న కాంగ్రెస్‌ నేతలు; తడబడుతున్న భారతీయ జనతా పార్టీ; అన్ని రాష్ట్రాల ఏర్పాటుకు ఎస్సార్సీ వేశారా?; తెలంగాణ’కు మాత్రం ఎస్సార్సీ ఎందుకు? .... ఎడిటర్ సూర్య}

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అంశంపై తనదైన శైలిలో కాంగ్రెస్‌ నాయకత్వం - యుపిఎ ప్రభుత్వం నాన్చివేత ధోరణి కొనసాగింపుగా, రెండో ఎస్సార్సీ ఏర్పాటును తెర పైకి తెచ్చింది. బోడి గుండుకు మోకాలు ముడిపెట్టే చందాన, ఉత్తర ప్రదేశ్‌ ఎన్నికలను, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేయాలన్న డిమాండును, తెలంగాణ అంశానికి లంకె వేసింది. సూర్య దినపత్రిక పేర్కొన్నట్లు ఉత్తరప్రదేశ్ లో "ఎన్నికలు ముగిసి, ఫలితాలలో పార్టీ అదృష్టం బయట పడిన తర్వాతే తెలంగాణ విషయంలో కసరత్తును పునరుద్ధరించాలని ఏఐసీసీ నాయకత్వం భావిస్తున్నట్టు" స్పష్టమైన సంకేతాలందిస్తోంది కేంద్రం. ఒకవైపు పార్టీ అధికార ప్రతినిధి రషీద్ అల్వీ నేమో రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేసి రాష్ట్రాల పునర్విభజన జరపాలా వద్దా అని నిర్ణయించడమే అఖిలభారత స్థాయిలో కాంగ్రెస్ విధానమని ప్రకటిస్తే, దానికి భిన్నంగా, ఇప్పుడిప్పుడే రెండవ ఎస్సార్సీ లాంటి ప్రతిపాదనలేవీ ఉండబోవని మరో సీనియరు నాయకుడు ప్రణబ్‌ ముఖర్జీ తాజాగా ప్రకటన చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి చేసిన డిమాండ్‌ను దిగ్విజయ్‌ సింగ్‌ సమర్థిస్తే, ప్రణబ్ ముఖర్జీ వ్యతిరేకించారు. కాంగ్రెస్‌ విధానం చిన్న రాష్ట్రాల ఏర్పాటా? కాదా? కాకపోతే అసలు దాని విధానమేంటి అనేది భగవంతుడికే తెలియాలి! అంతలోనే తెలంగాణ విషయంలో త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని మళ్లీ మాట మారుస్తున్నారు అదే ప్రణబ్ ముఖర్జీ. వారికి ఇదొక ఆటలాగా - రాజకీయ క్రీడలాగా ఐపోయిందనాలి.

రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన వాస్తవానికి, ఒక అర్థరహిత, అసమంజస, కారణ రహిత, విడ్డూరమైన అసంబద్ధ రాజకీయ తెలివితక్కువ ఆలోచన అనాలి. తెలంగాణ సమస్యకు ఇది పరిష్కారమార్గం కానే కాదు. కాజాలదు కూడా. సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు ఈ ఆలోచన నచ్చి స్వాగతించారే మో కాని, ఒక్కరంటే ఒక్క తెలంగాణ వాది కూడా పిసరంత మాత్రమైనా అంగీకరించిన దాఖలాలు లేనే లేవు. అంగీకరించే సమస్యే ఉత్పన్నం కాదు. మాయావతి ఆలోచనకు ముందస్తుగా అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదేమో కాని, పరోక్షంగా తన గోతి తానే తవ్వుకుంటున్నదన్న సంగతి మర్చిపోతోంది. అదేం విచిత్రమో కాని, తెలంగాణ ఏర్పాటుకొరకు రెండో ఎస్సార్సీ అవసరం లేదని వాదిస్తూ వచ్చిన, తెలంగాణ విషయంలో స్పష్టమైన వైఖరితో ముందుకొచ్చిన, పార్లమెంటులో చర్చకు సహితం నోటీసిచ్చిన ఏకైక జాతీయ పార్టీ - భారతీయ జనతా పార్టీ కూడా, ఉత్తర ప్రదేశ్ సంగతి వచ్చేసరికల్లా, రెండో ఎస్సార్సీ ఏర్పాటు చేయాల్సిందేనని కేంద్రానికి సూచన ఇవ్వడం జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర సమితి, రాజకీయ ఐక్య కార్యాచరణ నాయకులు, తెలంగాణ టిడిపి-కాంగ్రెస్ నాయకులు ఎస్సార్సీ ఏర్పాటు ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.

మొదటి పర్యాయం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ ఏర్పాటు చేయడానికి ఒక చారిత్రక నేపధ్యం, పాలనాపరమైన అత్యవసర ఆవశ్యకత వుండేది. అలాంటిదేమీ ఇప్పుడు కించిత్తైన లేదు. ఆంగ్లేయుల పాలనలోని భారతావని (1858–1947), స్వాతంత్ర్యోద్యమం (1857–1947), దేశ విభజన (1947), స్వతంత్ర్యానంతరం రాజకీయ సమగ్రతల పరిరక్షణ (1947–49) నేపధ్యంలో మొదటి ఎస్సార్సీ ఆవశ్యకత కలిగింది. భారత దేశంలోని వివిధ రాష్ట్రాలను, ప్రాంతాలను, భౌగోళికంగా హద్దుల ఏర్పాటు చేసేందుకు, పాలనా సౌలభ్యంగా వాటిని మలిచేందుకు, మొదటి ఎస్సార్సీ చట్టం 1956 లో తీసుకుని రావడం జరిగింది. అదో ప్రాముఖ్యత సంతరించుకున్న రాజకీయ సంస్కరణ. ఆ చట్టం మూలాన, భౌగోళికంగా హద్దులు నిర్ణయించడానికి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును ప్రాతిపదికగా తీసుకున్నారు. స్వతంత్రం రావడానికి పూర్వం ఆచరణలో వున్న మూడు రకాల (ఎ, బి, సి) రాష్ట్రాల స్థానంలో ఒకే తరహా రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి మొదటి ఎస్సార్సీని ఉపయోగించుకుంది ప్రభుత్వం. తరువాత కొన్ని రాష్ట్రాలను మరో మారు విభజించినప్పటికీ, ఇంతవరకూ, ఎన్నడూ ఎస్సార్సీ లను ఏర్పాటు చేసి ఆ పని చేయలేదు. ఇప్పుడలా చేయాల్సిన అవసరమూ లేదు. స్వతంత్ర భారత దేశంలో ఒకే ఒక్క సారి ఇంతవరకు ఎస్సార్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మరిప్పుడెందుకు చేయాలి?

భారత దేశానికి స్వతంత్రం రాక పూర్వం, బ్రిటీష్ ఇండియాలో రెండు విధాలైన దేశ భూభాగాలుండేవి. లండన్ లోని ఇండియా కార్యాలయం కింద, భారత గవర్నర్ జనరల్ కింద నేరుగా అధీనంలో వున్న బ్రిటీష్ ఇండియా ప్రదేశాలు కొన్నైతే, వారసత్వ పాలనలో వున్నటువంటి ప్రిన్సిలీ రాష్ట్రాలు మరి కొన్ని వుండేవి. వాటిపై అంతర్జాతీయ సంబంధాల విషయంలో మాత్రమే బ్రిటీష్ ప్రభుత్వ అజమాయిషీ వుండేది. అదనంగా, ఫ్రెంచ్, పోర్చుగల్ అధీనంలో వున్న వలస ప్రాంతాలు కూడా వుండేవి. వీటన్నిటినీ ఒకే గొడుగు కింద తెచ్చే రాజకీయ సమాకలనం - రాజకీయ ఏకీకరణ, అలనాటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో సర్దార వల్లభాయ్ పటేల్, బ్రిటీష్ ఇండియాలో అత్యున్నత స్థానానికి ఎదిగిన భారతీయ సివిల్ సర్వెంట్ వి. పి. మీనన్ చేసిన అవిరళ కృషి ఫలితంగా, దాదాపు చాలా ప్రిన్సిలీ రాష్ట్రాలతో సహా అన్నీ భారత దేశంలో విలీనం కావడానికి అంగీకరించాయి. ఫ్రెంచ్, పోర్చుగల్ అధీనంలో వున్న వలస ప్రాంతాలు కూడా విలీనం దిశగా నడిచాయి. కాశ్మీర్, హైదరాబాద్, మణిపూర్, త్రిపురలాంటి కొన్ని రాష్ట్రాలు స్వతంత్రంగా వుండేందుకు ప్రయత్నాలు చేసినా చివరకు ఫలించలేదు. చిట్ట చివరి బ్రిటీష్ వైస్రాయ్ లార్డ్ మౌంట్ బేటన్ లాంటి వారు కూడా భారత జాతీయ కాంగ్రెస్ ప్రయత్నాలలో సహాయ పడ్డారు. ఆగస్ట్ 15, 1947 న బ్రిటీష్ ఇండియా, భారత పాకిస్తాన్ దేశాలుగా విడిపోయి, భారత దేశానికి స్వాతంత్ర్యం లభించింది.

జనవరి 26, 1950 న భారత దేశానికి కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చింది. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారత దేశం అవతరించింది. అలా అవతరించిన దేశంలోని వివిధ ప్రాంతాలను కొన్నింటిని రాష్ట్రాలుగా, మరి కొన్నింటిని కేంద్ర పాలిత ప్రాంతాలుగా పిలవడం ప్రారంభించారు. రాష్ట్రాలకు స్వతంత్రంగా పాలన చేసుకునే అధికారాన్ని, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండే విధంగాను పాలనాపరమైన వీలు కలిగించింది రాజ్యాంగం. కాకపోతే వీటన్నిటినీ, మూడు రకాల రాష్ట్రాలుగా పాలనా సౌలభ్యంకొరకు విభజించడం జరిగింది. "ఎ" విభాగం కింద బ్రిటీష్ ఇండియాలో సరాసరి గవర్నర్ జనరల్ అజమాయిషీ కింద వుండే రాష్ట్రాలకు ఎన్నికైన గవర్నర్, ఎన్నికైన ప్రజా ప్రతినిధుల శాసన సభలుండేవి. అలాంటి తొమ్మిది రాష్ట్రాలలో అస్సాం, పశ్చిమ బెంగాల్, బీహార్, బాంబే, మధ్య ప్రదేశ్ (గతంలోని కేంద్ర ప్రావిన్సులు, బీరార్ ప్రాంతం), మద్రాస్, ఒరిస్సా, తూర్పు పంజాబ్, ఉత్తర ప్రదేశ్ (యునైటెడ్ ప్రావిన్సెస్) వున్నాయి. "బి" విభాగంలో గతంలోని ప్రిన్సిలీ రాష్ట్రాలుండేవి. రాష్ట్రపతి నియామకం చేసిన రాజప్రముఖ్, ఎన్నికైన శాసన సభల ఆధ్వర్యంలో పాలన సాగే దక్కడ. అవి హైదరాబాద్, సౌరాష్ట్ర, మైసూర్, ట్రావన్‍కోర్-కొచ్చిన్, మధ్య భారత్, వింధ్యా ప్రదేశ్, పాటియాలా, పెప్సు, రాజస్థాన్ రాష్ట్రాలు. ఢిల్లీ, కచ్, హిమాచల్ ప్రదేశ్, బిలాస్ పూర్, కూర్గ్, భోపాల్, మణిపూర్, అజ్మీర్-మేర్వార్, త్రిపుర రాష్ట్రాలు "సి" విభాగం కింద వుండేవి. జమ్ము-కాశ్మీర్ కు కొంతకాలం ప్రత్యేక ప్రతిపత్తి కొనసాగింది. అండమాన్-నికోబార్ దీవులను కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో ఏర్పాటైంది ఎస్సార్సీ.

భారత దేశానికి స్వతంత్రం వచ్చిన వెంటనే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అక్కడక్కడా ఉద్యమాలు మొదలయ్యాయి. మద్రాస్ రాష్ట్రం నుంచి తమను విడదీయాలని తెలుగు మాట్లాడే వారు ఉద్యమించడంతో, 1953 లో, తెలుగు మాట్లాడే పదహారు జిల్లాలను మద్రాస్ రాష్ట్రం నుండి విడదీసి, "ఆంధ్ర రాష్ట్రం" గా ఏర్పాటు చేయడం జరిగింది. 1950-1956 మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న భౌగోళిక మార్పులు చేసి కొన్ని రాష్ట్రాల సరిహద్దులను మార్చడం జరిగింది. జులై నెల 1954 లో హిమాచల ప్రదేశ్ లో బిలాస్ పూర్ ను విలీనం చేశారు. 1955 లో ఒకనాటి ఫ్రెంచ్ కాలనీ చందర్ నగర్ ను పశ్చిమ బెంగాల్ లో కలిపారు. ఫజల్ అలీ, కవలం మాధవ ఫణిక్కర్, హెచ్. ఎన్. కుంజ్రు సభ్యులుగా మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ ఏర్పాటైంది. 1955 లో "ఎస్సార్సీ నివేదిక" సమర్పించడం, అందులో మిగతా వాటితో పాటు తెలంగాణ ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. నివేదికలోని 369 నుండి 389 పేరాలలో హైదరాబాద్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం, మద్రాస్ నుండి విడదీసిన ఆంధ్ర రాష్ట్రం కలిపి "ఆంధ్ర ప్రదేశ్" రాష్ట్రం గా ఏర్పాటు కావడానికి సంబంధించిన అంశాలున్నాయి.

స్సార్సీ నివేదిక ఆధారంగా నవంబర్ 1, 1956 న అమలులోకి వచ్చిన కొత్త రాష్ట్రాల ఏర్పాటులో "ఎ, బి, సి" విభాగాలు లేకుండా అన్ని రాష్ట్రాలకూ ఒకే రకమైన పాలనా పరమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అనే రెండు రకాలు మాత్రం కొనసాగాయి.

ఇక ఆ తరువాత పంజాబ్ నుంచి హర్యానాను విడదీసినప్పుడైనా, మధ్య ప్రదేశ్ నుంచి ఛత్తీస్‌ఘడ్ ను ఏర్పాటు చేసినప్పుడైనా, లేదా జార్ఖండ్, ఉత్తరాంచల్ విషయంలోనైనా ప్రస్తావనకు రాని ఎస్సార్సీ ఇప్పుడెందుకు రావాలి? ఏ ప్రయోజనం కొరకు ఆ అంశాన్ని ఎవరు లేవనెత్తుతున్నారు? ఉత్తర ప్రదేశ్ ను విడదీసినా, విదర్భ ఏర్పాటు చేసినా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా ఎస్సార్సీ వేయనక్కర లేనే లేదు. End

Tuesday, November 15, 2011

సమస్యను జటిలం చెయ్యడమే కాంగ్రెస్ సంస్కృతి! : వనం జ్వాలా నరసింహారావు

ఇదీ కాంగ్రెస్ సంస్కృతి

నమస్తే తెలంగాణ (17-11-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణపై సాక్షాత్తు ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా మాట మారుస్తూ చాలా కాలం తరువాత పెదవి విప్పారు. ఏ చిదంబరమో, ఆజాదో, సింఘ్వీనో లేదా ప్రణబ్ కుమార్ ముఖర్జీనో అలాంటి ప్రకటనలు చేస్తే కొట్టి పారేయవచ్చు. "ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వలేం" అని సూటిగా, స్పష్టంగా ప్రధాని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో-ఏమో కాని, ఆయన సహితం మాట తప్పడంలో మిగతా వారికి తీసిపోను సుమా అని చెప్పకనే చెప్పారు. గతంలో విదేశీ పర్యటనల నుంచి వచ్చినప్పుడు చెప్పినదానికి ఇప్పుడు చెప్పిన దానికీ తేడా వుంది. అలా అని వుండాల్సింది కాదు. ఏకాభిప్రాయమని, విస్తృతాభిప్రాయమనీ, చోటా మోటా నాయకుల లాగా మాట్లాడడం ఏమంత బాగా లేదు. తెలంగాణపై ఇంత కఠినమైన మాట ప్రధాని నోట వెలువడటం ఇదే మొట్ట మొదటిసారి! తెలంగాణ అంశంపై ప్రధాని మన్మోహన్ చేసింది సంచలన ప్రకటనే అనడంలో సందేహం లేదు. ప్రధాని ప్రకటన ప్రభావం రాబోయే పార్లమెంటు సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపుతుందనడంలోనూ సందేహం లేదు. ఇప్పటికే ఘాటుగా (కనీసం పైకన్నా) విమర్శిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇప్పటికైనా కనువిప్పు కావాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని "అభ్యర్థించడం" మానుకుని, "ఎందుకివ్వరు" అని ప్రశ్నించాలి-నిలదీయాలి.

కాంగ్రెస్ పార్టీకో సంస్కృతి వుంది. ఇది ఈ నాటిది కాదు. జవహర్లాల్ నెహ్రూ హయాం నుంచి, ఇందిర, రాజీవ్ ల పాలనలో కొనసాగిన ఆ సంస్కృతే, సోనియా గాంధీ సైతం తన కోటరీపైనా అదే సంస్కృతితో వ్యవహరిస్తుందా? ఒకవేళ అదే నిజమైతే, ఏ క్షణంలోనైనా, సోనియా తన పార్టీ నాయకులు ప్రధాని స్థాయి వరకూ చేసిన ప్రకటనలకు విరుద్ధంగా, తెలంగాణకు సానుకూలమైన ప్రకటన చేసే అవకాశం వుందనాలి. ఎవరిష్టమొచ్చినట్లు వాళ్లను మాట్లాడనిచ్చి, తన మనసులో మాట బయట పెడుతుందా? వాహనం కొనిచ్చి, స్టీరింగ్ చేతికిచ్చి, ఇష్టమొచ్చినట్లు తిరగమని చెప్పి, చివరకు తన కాంపౌండులో ఆ వాహనాన్ని పార్కు చేయించే సంస్కృతి కాంగ్రెస్ అధినాయకులకుంటుంది. కాకపోతే, అలా చేయనివారి విషయంలో అప్రమత్తంగా వుండేందుకు, వాహనం బ్రేకులను తన అధీనంలోనే వుంచుకుండే ఏర్పాటుంటుంది. అదే తెలంగాణ విషయంలో జరగొచ్చుననే ఆశ, రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవేమోననే భయం సోనియాలో వుండవచ్చుననే ధైర్యం మనకున్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాక తప్పదు.

తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, యుపిఎ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం, చాలా సీరియస్‌గా ఉందని, ఏ క్షణంలోనైనా దానికి అనుగుణంగా ఒక ప్రకటన వెలువడవచ్చని, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నోట్లో నుంచి వచ్చిన మాట తడి ఆరకముందే, పరిష్కారం మాట దేవుడెరుగు... సమస్యను మరింత జటిలం చేసే ప్రకటనలు వెలువడుతున్నాయి. ఆ ప్రకటనలు మొదట్లో కర్ర విరగకుండా, పాము చావకుండా, ఆ తరువాత కొంత అస్పష్టంగా వుంటే, ప్రధాని నోట మాత్రం ఒక రకమైన (అదో రకమైన అస్పష్టత!) స్పష్టత వచ్చింది.

రెండో "ఎస్సార్ సీ" ఏర్పాటుచేయడమే "తెలంగాణ సమస్యకు పరిష్కారం" అనీ, భారత దేశం మొత్తానికీ కాంగ్రెస్ పార్టీ విధానమిదేనని, "తెలంగాణకు మినహాయింపు లేదు" అనీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ దేశ రాజధానిలో ఒక ప్రకటన చేశారు. తెలంగాణ సమస్యకు, మాయావతి ఉత్తరప్రదేశ్ ను విభజించాలని చేసిన డిమాండుకు (బోడిగుండును, మోకాలును తలపై లేని జుట్టుతో కలిపి ముడివేసే ప్రయత్నం చేసినట్లు గా) సంబంధం కలిపారాయన ఆ సందర్భంగా. దేశంలోని పలు రాష్ట్రాలలో, ఏక కాలంలో, విభజన ఉద్యమాలు జరుగుతున్నట్లు, ఆ డిమాండ్లను పరిష్కరించడానికి, రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటు మినహా మరో దారి లేదన్నట్లు ఆయన ఒక విచిత్రమైన కథనం అల్లారు. కాంగ్రెస్ పార్టీ మినహా మరే ఇతర పార్టీ కూడా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవి కాదన్న తరహాలో రషీద్ అల్వీ మాట్లాడడం, "జాతీయ దృక్ఫధం" ఒక్క కాంగ్రెస్ పార్టీకే వున్నట్లు కూడా అయన కలర్ ఇచ్చారు. బహుశా బొత్సా ప్రకటనకు అర్థం ఇదేనేమో!

ఇంతలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి బాంబ్ పేల్చనే పేల్చింది. రాష్ట్రాన్ని నాలుగు భాగాలుగా విడదీయాలని, తీర్మానం చేసి, కేంద్రానికి పంపుతూ, హెచ్చరిక కూడా చేసింది. ఒక తేదీ ఖరారు చేసి, ఆ తేదీలోపున విభజన జరగకపోతే, నాలుగు ప్రాంతాల శాసనసభ సభ్యులు, వేర్వేరుగా సమావేశమై తీర్మానాలు చేసి పంపుతాం జాగ్రత్తా సుమా అని వార్నింగ్ ఇచ్చింది. తానొక ప్రాంతానికే పరిమితం కానని, యు. పి. లోని అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పరోక్షంగా సూచన చేసింది. తెలంగాణ విషయంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా ఇది సూచన అనుకోవచ్చు.

తెలంగాణపై నవంబర్ పన్నెండు తరువాత కేంద్రం వైపు నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో రషీద్ అల్వీ చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. రాష్ట్ర విభజన విషయంలో ఎటూ తేల్చుకోలేకుండా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం నెమ్మది నెమ్మదిగా ఎస్సార్ సీని తెర పైకి తెచ్చి, తెలంగాణ అంశాన్ని మరుగున పడవేసే దిశగా పావులు కదుపుతున్న అనుమానాలూ బలపడుతున్నాయి. మొదటి పర్యాయం ఎస్సార్ సీ వేయడానికొక చారిత్రక నేపధ్యం వుంది. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రాల పునర్విభజన అత్యవసరం ఐన నేపధ్యంలో, ఒక యూనిఫార్మిటీ కోసం చేసిన ఏర్పాటది. ఇప్పుడంత అవసరం లేదు. ఒక్కొక్క ఏర్పాటు ఉద్యమానికి ఒక్కో నేపధ్యముందిప్పుడు. మాయావతి డిమాండును, యావత్ తెలంగాణ ప్రజల డిమాండుకు ముడి పెట్టడం, అందుకొరకు ఏకంగా ఎస్సార్ సీని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేయడం దుర్మార్గం. రషీద్ అల్వీ రాజకీయ నేపధ్యం కూడా, పొంతనలేని ఆయన వ్యాఖ్యల లాగానే వుందనాలి. అందుకేనేమో, తక్షణమే స్పందించారు ఆయన పార్టీ ప్రముఖులు కొందరు. అదీ నిజమేకదా! రషీద్ అల్వీ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. పార్టీలు మార్చడంలో దిట్ట. కాంగ్రెస్‌లో చేరడానికి ముందు సమాజ్‌ వాదీ పార్టీలోనూ, తరువాత బిఎస్పీలోనూ, కొంతకాలం జనతాదళ్ లోను వున్నారాయన. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మాజీ ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ కూడా ఉత్తరప్రదేశ్ విభజన అంశాన్ని రెండో ఎస్సార్ సీయే తేల్చాలన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్ మాత్రం తెలంగాణ ఇస్తున్న ధోరణిలో (ఎలానో చెప్పకుండానే) మాట్లాడుతూనే వున్నారింకా.

ఇంకేముంది...తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా గుర్రుమన్నారు. గరం గరంగా (అధిష్టానాన్ని అనే ధైర్యం లేదు కదా!) రషీద్ అల్వీని సున్నితంగా విమర్శించసాగారు. విపరీతార్థాలు వెతక సాగారు. అంగీకరించే ప్రసక్తే లేదన్నారు కొందరు. ఒకవిధంగా అన్ని పార్టీల వారూ ఐక్యంగానే విమర్శించారనవచ్చేమో! అందులో ఎవరు ముందు భాగంలో వున్నారో, చెప్పడం కష్టమేమో కాని, మొత్తం మీద...టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ నేతలు గట్టిగా గొంతు పెంచారు. ఈ నేపధ్యంలో ప్రణబ్‌ ముఖర్జీతో బొత్స మంతనాలు చేశారు. మరికొందరేమో, పార్టీ వైఖరి ఎస్సార్ సీయే ఐనప్పటికీ, తేల్చేది మాత్రం యుపిఎ ప్రభుత్వమే అని భాష్యం చెప్పుకున్నారు. ఏదేమైనా, రషీద్ వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంపైనా, కేంద్ర ప్రభుత్వంపైనా, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌ రావు కారాలు-మిరియాలు నూరారు. "తెలంగాణపై ఎంతో కసరత్తు చేశాక, కొండంత రాగం తీసి... ఏదో పాట పాడినట్ల్లు ఎస్సార్ సీ... బిస్సార్సీ అంటే అంగీకరించం'' అనీ, పిచ్చి వాగుడు మానుకోవాలని హెచ్చరించారు. ఏదేమైనా, ఎవరెన్ని చెప్పినా, ఎంతవరకైతే, ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన తెలంగాణను (హైదరాబాద్ ను రాజధానిగా చేయడంతో సహా) ఇవ్వకపోతే మరో తుపాను సృష్టిస్తామని కుండ బద్దలు కొట్టి మరీ హెచ్చరించారు కెసిఆర్. "సకల జనుల సమ్మె సమయంలో మెడపై కత్తి పెట్టి నిర్ణయం తీసుకోమంటే ఎలాగని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి గులాంనబీ ఆజాద్ అన్నారనీ, ఇప్పుడు అన్నీ సర్దుకున్నాయి కనుక, రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేయొచ్చు కదా?'' అని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎటువంటి ప్రకటన చేసినా ప్రభుత్వాలు కూలక తప్పదని కూడా హెచ్చరించారు. పనిలో పనిగా "సమైక్యవాద టీడీపీ భూస్థాపితం" చేయాలనీ, జేఏసీ తరఫున "కాంగ్రెస్‌కో ఖతం కరో.. తెలంగాణకో హాసిల్ కరో" అనే నినాదం తీసుకొచ్చి, తెలంగాణ రాష్ట్ర సమితిని ఒక "బలమైన రాజకీయ శక్తి" గా మలచనున్నట్లు కూడ ఆయన అన్నారు.

తెలంగాణ అంశంపై తమ పార్టీ వారే అయినా దిగ్విజయ్‌ సింగ్, రషీద్ అల్వీ వంటి వారి వ్యాఖ్యలను పట్టించుకోబోమని, సోనియాగాంధీ, గులాంనబీ ఆజాద్ మాట్లాడితేనే పరిగణనలోకి తీసుకుంటామని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ (ఇంకో రూట్ నుంచి) శల విచ్చారు. తెలంగాణ అంశాన్ని రెండో ఎస్సార్ సీకి నివేదించే ఉద్దేశం కేంద్రానికి అసలు లేనే లేదని, కేవలం ఉత్తరప్రదేశ్ విషయంలో మాత్రమే అది వర్తిస్తుందని మరో రకమైన కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇదో రూట్. ఇంతకూ, శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన సిఫారసుల ఆధారంగా, తెలంగాణపై కేంద్రం ఒక నిర్ణయం తీసుకోబోతున్నాదా? గ్రేటర్ హైదరాబాద్ పరిధిని విస్తరించి కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశాలేమైనా వున్నాయా? లేక రెండు ప్రాంతాలకూ వేర్వేరు రాజధానులను ప్రకటించవచ్చా? పోనీ, హైదరాబాద్‌ను ప్రస్తుతానికి ఉమ్మడి రాజధానిగా నిర్ణయించి, తరువాత సీమ+ఆంధ్ర=సీమాంధ్రకు వేరే రాజధాని (నులను)ని ప్రకటించడమా? ఏదీ కాకుండా, ఇంకా నాన్చుడు ధోరణేనా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలు. సమాధానం దొరికీ దొరకని ప్రశ్నలు. సార్క్ సమావేశాలకు వెళ్లిన మన్మోహన్ సింగ్ స్వదేశానికి తిరిగి వచ్చిన తరువాత ఏమన్నా తేలనుందా? ఏం తేల్చినా, అది పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందేనా? అంతా అయోమయం. స్పష్టత లేదు.

ఇదిలా వుంటే చర్చల జోరు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీతో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ "కీలక చర్చలు" జరిపారు. ఒకసారి కాదు...పలుమార్లు! ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌తో వారు చర్చలు చేశారు. టెలివిజన్ ఛానళ్ల లాగానే (ప్రత్యేకంగా బైట్) సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేశవరావు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రషీద్ అల్వీని కల్సి చర్చించారు. కేశవరావు ప్రణబ్ ముఖర్జీతో కూడా చర్చించారు. ప్రణబ్‌ను కలిసే ముందు బొత్స, కేశవరావు చర్చలు జరిపారు! తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్ర శేఖరరావుతో కూడా కోర్ కమిటీ సభ్యుడొకరు చర్చలు జరిపారట. ఇక తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ రోజువారీ చర్చలుండనే వున్నాయి. చర్చోఫ చర్చలైతే జరుగుతున్నాయి కాని ఫలితం శూన్యం. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ-ప్రధానమంత్రి కార్యాలయం తెలంగాణ అంశంపై తీసుకోవాల్సిన నిర్ణయం గురించి సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నట్లు మరో వార్త. నిజంగా వీళ్ళు త్రికరణ శుద్ధిగా చర్చలు చేస్తుంటే, ఈ పాటికి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడో ఏర్పాటయ్యేదికదా!

అసలు సమస్య చర్చలు కాదు. సమస్య పరిష్కారం దొరక్క కూడా కాదు. మనసుంటే మార్గముంటుందంటారు. హృదయమంటూ వుంటేనే స్పందన వుంటుంది. ప్రజాస్వామ్యంలో నమ్మకమున్న వారికే దాని విలువ అర్థమవుతుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవారికి మాత్రమే మాటకు కట్టుబడి వుండే అలవాటుంటుంది. పార్టీపరంగా కాని, వ్యక్తుల పరంగా కాని, కాంగ్రెస్ కు, ఆ పార్టీ నాయకులకు ప్రజాస్వామ్యం పట్ల ఏ మాత్రం అవగాహన లేదనాలి. ఎన్నికల ప్రణాళికలో, కనీస ఉమ్మడి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని చేర్చిన విషయం కాంగ్రెస్ అధిష్టానానికి కాని, ఆ పార్టీ నాయకులకు కాని తెలియదా? ఎన్నికల ప్రణాళిక రచనలో తెలంగాణ అంశాన్ని చేర్చిన సంగతి ప్రణబ్ ముఖర్జీకి గుర్తులేదా? అలా చేర్చడంలో ఆయన పాత్ర లేదా? ఆయనకు తెలియకుండానే కనీస ఉమ్మడి కార్యక్రమంలో దాన్ని పెట్టారా? పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంలో ఆ విషయాన్ని చేర్చిన సంగతి ఈ నాయకులెవరికీ తెలియదా? ప్రధాన మంత్రి చేసిన వాగ్దానం ఆయనకూ గుర్తులేదా? ఒకసారి దక్షిణాఫ్రికా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో తన వెంట వచ్చిన పాత్రికేయులతో మాట్లాడుతూ, తెలంగాణ అంశంపై స్పష్టంగా, పార్టీ పరంగా-ప్రభుత్వ పరంగా తమ ప్రాధాన్యతా అంశం అని ప్రధాని చెప్ప లేదా? ఎన్ని సార్లు ...ఇంకెన్ని సార్లు మాట మారుస్తారు వీళ్లు?

ఇంతెందుకు. రెండేళ్ల క్రితం నాటి డిసెంబర్ తొమ్మిది ప్రకటన, పార్లమెంటులో చేసిన వాగ్దానాలు మర్చిపోయారంటే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనట్లే! ఇలా మరో రెండేళ్లు గడుపుతారేమో కాని, శాశ్వతంగా అపవాదు మూటకట్టుకుంటున్నామన్న సంగతి మర్చిపోతున్నారు కాంగ్రెస్-యుపిఎ నాయకులు. నిర్ణయం తీసుకోవాల్సిన సోనియాగాంధీని ఇంత వ్యూహాత్మకంగా తప్పుదోవ పట్టిస్తున్న వారెవరో కాని వారికి జోహార్లు పలకాల్సిందే! చీటికీ-మాటికీ ప్రకటనలు గుప్పిస్తున్న ఈ ఛోటా-మోటా నాయకులకు, అసలామె అనుమతు వుందో-లేదో? సోనియాకు సమస్య తీవ్రతను వివరించిన దాఖలాలు లేవనిపిస్తోంది. బహుశా రేపో-మాపో యౌవరాజ్య పట్టాభిషేకం జరుగుతుందన్న వార్తలొస్తున్నాయి. యువరాణిగారు కూడా రంగప్రవేశం చేయబోతున్నట్లు కథనాలు వినవస్తున్నాయి. సోనియాకు చెప్పని వారు, వీరికి చెపుతారన్న నమ్మకం ఏంటి? వీరికి అర్థమయ్యేలోపున ఎన్నికలొస్తాయి. ఇక ఆ తరువాత ఏం జరుగుతుందో భగవంతుడికే తెలియాలి. సమస్యకు దొరికేది పరిష్కారం కాదు. దాన్ని మరింత జటిలం చెయ్యడమే! End