Showing posts with label కిరణ్ కుమార్ రెడ్డి. Show all posts
Showing posts with label కిరణ్ కుమార్ రెడ్డి. Show all posts

Wednesday, April 3, 2013

కాగ్ నివేదిక పరమార్థం: వనం జ్వాలా నరసింహారావు


కాగ్ నివేదిక పరమార్థమే!
వనం జ్వాలా నరసింహారావు

నమస్తే తెలంగాణ దినపత్రిక (08-04-2013)

శాసనసభలో ప్రవేశపెట్టిన కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలో, 2006-2011 మధ్య ఐదు సంవత్సరాల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జరిపిన భూముల కేటాయింపులలో రు.50 కోట్ల పైగా విలువ గల భూమి అక్రమ పద్ధతుల్లో అన్యాక్రాంతం జరిగిందని తేలింది. కాగ్ ఆడిట్ జరిపిన ఐదు సంవత్సరాల మధ్య కాలంలో తొలుత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వ్యవహరించగా, ఆ తరువాత 15 నెలల పాటు రోశయ్య ముఖ్య మంత్రిగా పాలించాడు. అప్పట్నుంచీ  ప్రస్తుత ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాం కొనసాగుతూ వచ్చింది. ఈ ముగ్గురి పాలనలోనూ భూ కేటాయింపులలో అవినీతి జరిగిందని కాగ్ నివేదిక ద్వారా తెలుస్తోంది. భూముల కేటాయింపులు ప్రధానంగా రాజశేఖర రెడ్డి హయాంలోనే జరిగినప్పటికీ అప్పటి నిర్ణయాలను తదుపరి ముఖ్యమంత్రులు కొనసాగించారు. రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అక్రమ కేటాయింపులను రద్దు చేయడానికి గానీ, సరి చేయడానికి గానీ వారు పూనుకోలేదు. కాగ్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఆర్ధిక పరమైన ఆస్తులకు సంబంధించిన చట్టాలను, నిర్దేశిత విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అనేక కేసుల్లో పూర్తిగా విస్మరించిందని చెప్పింది. తీవ్రస్థాయిలో అక్రమాలు చోటు చేసుకున్నాయని తేల్చింది. తాత్కాలిక ప్రాతిపదికన, యధేఛ్చగా, విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు, అత్యంత తక్కువ ధరలకు భూములు పందేరం పెట్టారని వెల్లడించింది.  భూముల పందేరంలో రాష్ట్ర ప్రజల ఆర్ధిక భవితవ్యాన్నీ, సామాజికార్ధిక ప్రయోజనాలను పరి రక్షించడంలో విఫలం అయ్యారని పేర్కొన్నది. అదే విధంగా విద్యుత్ వ్యవహారంలో కూడా కాగ్ అక్షింతలు వేసింది. కాకపోతే, కాగ్ నివేదిక బైబిల్, భగవద్గీత, ఖురాన్ కాదని సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. కాగ్ నివేదికలో పలు అంశాలు వాస్తవ విరుద్ధంగా ఉంటున్నాయన్నారు. కాగ్ చెప్పినవన్నీ నిజాలు కావని, మళ్లీ, కాగ్ నివేదికపై పీఏసీ పరిశీలన చేసి నివేదిక ఇస్తుందన్నారు. కాగ్ విషయంలో ముఖ్యమంత్రి ఇంత తేలికగా ఎలా మాట్లాడగలిగారనేది అంతుపట్టని విషయం. ఈ నేపధ్యంలో కాగ్ కు సంబంధించిన పూర్వాపరాలను గురించి తెలుసుకోవడం అవసరం.



పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, కార్యనిర్వాహక వ్యవస్థపై చట్టసభలకు ఆధిపత్యం వుందని-వుండాలని తెలియచేస్తూ, తద్వారా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ఆచరణలోకి తేవడానికి ఉపయోగపడే అసలు-సిసలైన ఆయుధం, ప్రభుత్వపరమైన ఆదాయ-వ్యయ లెక్కల తనిఖీ అనే ప్రక్రియ మాత్రమే. ద్రవ్య వినియోగ విషయంలో చట్టసభలదే తుది తీర్పు, అత్యున్నత అధికారం అనే విషయాన్ని కూడా స్పష్ట పరిచేందుకు, ఆదాయ-వ్యయ లెక్కల తనిఖీ వ్యవస్థలు నెలకొల్ప బడి వేళ్లూనుకోసాగాయి. ఇవి అనాదిగా అమల్లో వున్న వ్యవస్థలు. చట్టసభలకు సంక్రమించిన ఈ అధికారానికి రెండు మౌలికాంశాలు ప్రధానంగా తోడయ్యాయి. ఒకటి ప్రభుత్వం తన మనుగడ సాగించడానికి అవసరమైన నిధులను సమకూర్చుకోవడం కాగా, రెండోది ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని పర్యవేక్షించే అధికారం. ఏనాడో 1866 లోనే, "ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖ" ను రాజ్యాంగపరంగా ఒక చట్టంగా ఏర్పాటు చేయడం ద్వారా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటీష్ ప్రభుత్వం ఈ నాడు అమల్లో వున్న ప్రభుత్వ ఆడిట్ విధానానికి శ్రీకారం చుట్టిందనాలి. ఎక్స్ చెక్కర్ అండ్ ఆడిట్ శాఖ చట్టం కింద, ప్రతి ప్రభుత్వ శాఖ విధిగా ఏటేటా, తన శాఖకు చెందిన ద్రవ్య వినియోగ పద్దులను-ఆదాయ గణనలను పార్లమెంటు ముందుంచి తీరాలి. అదే చట్టం కింద మొట్టమొదటి సారిగా, "కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్" (కాగ్) అనే వ్యవస్థను ఏర్పాటుచేయడం జరిగింది. అలా కాగ్ కు నాంది-ప్రస్తావన జరిగిందనాలి. ప్రభుత్వ ఆదాయ-వ్యయాలపై కాగ్ నిర్వహించే దర్యాప్తు ఫలితాలను స్వతంత్ర ప్రతిపత్తిగల బాధ్యతాయుతమైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అనే పార్లమెంటరీ కమిటీ పరిశీలించి, తద్వారా, ద్రవ్య వినియోగంపై పార్లమెంటరీ ఆధిపత్యాన్ని నెలకొల్పడం జరుగుతుంది.

                ప్రభుత్వ పరమైన ఆదాయ-వ్యయ సంబంధిత లెక్కలు చూడడం, తనిఖీ చేయడం కొరకు ఉద్దేశించిన ఈనాటి ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖ వ్యవస్థాగత ఏర్పాటు బ్రిటీష్ ప్రభుత్వ నమూనాలో, బ్రిటీష్ వారసత్వంగా మనకు సంక్రమించిందే. ఎప్పుడో-ఏనాడో 1858 లోనే, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను హస్తగతం చేసుకున్న నాటి బ్రిటీష్ ప్రభుత్వం, ప్రభుత్వ ఆదాయ-వ్యయ వ్యవహారాలు చూసేందుకు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను నియమించింది. 1919 లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సంస్కరణలు, ఆడిటర్ జనరల్ పదవికి చట్టబద్ధత కలిగించడానికి దోహదపడ్డాయి. 1935 నాటి భారత ప్రభుత్వ చట్టం, ఆడిటర్ జనరల్ పదవికి మరింత ప్రాముఖ్యత కలిగించింది. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత, "కాగ్" కు 148 నుంచి 152 ప్రకరణల ద్వారా ప్రత్యేక హోదాను కలిగించడంతో పాటు, రాజ్యాంగపరమైన భద్రత కలిగించడం జరిగింది. 1971 కాగ్ చట్టం ద్వారా, ఆ వ్యవస్థకు వుండాల్సిన బాధ్యతలు, అధికారాలు, హక్కులు స్పష్టంగా క్రమబద్ధీకరించడం జరిగింది. రాజ్యాంగం 151 వ ప్రకరణలో చెప్పినట్లు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినంతవరకు కాగ్ నివేదికలన్నీ భారత రాష్ట్రపతికి అందచేయాలి. ఆయన ఆదేశాల మేరకు ఆ నివేదికలను భారత పార్లమెంటు ఉభయ సభల ముందుంచాలి. రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఆయా రాష్ట్రాల గవర్నర్లకు వారి ద్వారా శాసనసభలకు సమర్పించడం జరుగుతుంది. కాగ్ పదవికి సర్వసాధారణంగా ఇండియన్ ఆడిట్ అక్కౌంట్స్ సర్వీసెస్ కు చెందిన సీనియర్ అధికారులనే నియమించే సంప్రదాయం చాలాకాలం వుండేది. 1978 తరువాత ఐఏఎస్ కు చెందిన అధికారులను ఆ పదవిలో నియమించే ఆనవాయితి మొదలైంది. ఇది తరచూ విమర్శలకు దారితీసింది కూడా. విమర్శించిన వారిలో పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీ అధ్యక్షుడు, మీడియా, సామాజిక కార్యకర్తలు ఇతరులు పలువురు వున్నారు. కాకపోతే, భారత రాజ్యాంగంలో కాగ్ పదవికి ఫలానా పూర్వ ఉద్యోగార్హతలుండాలని ఎక్కడా చెప్పడం జరగలేదు. ఐతే, రాజ్యాంగ సభలో దీనిపై చర్చలు జరిగాయి. ఆర్థిక, ఆదాయ-వ్యయ వ్యవహారాలలో అనుభవం గడించినవారిని మాత్రమే ఆ పదవిలోకి తేవాలని సూత్రప్రాయంగా అంగీకరించారప్పట్లో.

ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ శాఖాధిపతినే కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్ (కాగ్) అని పిలుస్తారు. ఈ శాఖ కార్యాలయాలు దేశవ్యాప్తంగా వున్నాయి. సంఖ్యాపరంగా చూస్తే, 34 కేంద్ర ప్రభుత్వ ఆడిట్ కార్యాలయాలు, 60 రాష్ట్ర స్థాయి కార్యాలయాలున్నాయి. ఆయా కార్యాలయ అధిపతిగా డైరెక్టర్ జనరల్ కాని ప్రిన్సిపాల్ ఆక్కౌంటెంట్ జనరల్ కాని వ్యవహరిస్తారు. సుమారు 60000 మంది సిబ్బంది కల ఈ కార్యాలయాలలో గ్రూప్-ఏ కు చెందిన ఇండియన్ ఆడిట్-అక్కౌంట్స్ సర్వీసెస్ అధికారులు సుమారు 500 మంది వుంటారు. ఈ శాఖల వార్షిక బడ్జెట్ సుమారు రు. 850 కోట్లవరకుంటుంది. చట్టసభలకు కాని, కార్య నిర్వాహక వ్యవస్థకు కాని చెందక పోయినా రాజ్యాంగం ద్వారా నియమించబడిన వ్యక్తి అయి వుంటారు కాగ్. భారత రాష్ట్రపతి కాగ్ ని నియమిస్తారు ఆ పదవిలో. మూడింట రెండు వంతుల మంది పార్లమెంట్ సభ్యులు ఓటింగ్ ద్వారా మాత్రమే కాగ్ ను ఆ పదవి నుంచి వైదొలగించ వీలవుతుంది. కాగ్ పాలనాధికారాలను ఆయన సలహా సూచనలతో మాత్రమే రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ప్రస్తుత కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌గా వినోద్ రాయ్ వ్యవహరిస్తున్నారు. 11 వ కాగ్‍గా ఆయన నియామకం 7, జనవరి 2008 న జరిగింది. టు-జి స్పెక్ట్రం, బొగ్గు గనుల స్కాం లాంటి పలు కీలకమైన అవినీతి ఆరోపణల వ్యవహారంలో వినోద్ రాయ్ వార్తల్లోకి ఎక్కారు చాలా సార్లు.

కాగ్ బాధ్యతలు అపారమైనవనవచ్చు. కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల సంచిత నిధినుంచి వ్యయం చేసిన ప్రతి పైసా అది ఉద్దేశించబడిన దాని కొరకే ఖర్చు చేయబడిందా? లేదా? అని నిర్ధారించే బాధ్యత కాగ్‍కు వుంది. ఆ మాటకొస్తే ఫలానా దాని కొరకు వ్యయం చేయదల్చుకున్న నిధులు చట్ట రీత్యా ప్రభుత్వానికి అందుబాటులో వుందీ-లేంది కూడా కాగ్ నిర్ధారిస్తుంది. అదే విధంగా కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల అత్యవసర నిధులనుంచి, ప్రభుత్వ పద్దుల నుంచి జరిగే అన్ని రకాల లావాదేవీల వ్యవహారంలో కూడా చట్టబద్ధత నిర్ధారించేది కాగే. ఆయా ప్రభుత్వ శాఖల ఆర్థిక లావాదేవీలను, రాబడులను, వ్యయాన్ని, నిధుల వినియోగాన్ని, దుర్వినియోగాన్ని విశ్లేషించేది కూడా కాగ్ మాత్రమే. కేవలం ప్రభుత్వ శాఖల ఆదాయ వ్యయాలు మాత్రమే కాకుండా, ప్రభుత్వం నుంచి గణనీయమైన మోతాదులో నిధులను పొందిన ప్రభుత్వేతర సంస్థల ద్రవ్య లావాదేవీలను కూడా పరిశీలించే హక్కు కాగ్ కు వుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలకు విడుదలయ్యే నిధుల సక్రమ వ్యయం జరిగిందా? లేదా? అని చూసేది కూడా కంప్ట్రోలర్-ఆడిటర్ జనరలే. కంపెనీ చట్టం కింద నెలకొల్పబడిన ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయ గణన కూడా కాగ్ పరిధిలోకే వస్తుంది. రాజ్యాంగంలోని 151 వ ప్రకరణకు అనుగుణంగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రకరకాల ఆడిట్ నివేదికలను కాగ్ రూపొందించి, ఆ నివేదికలను పార్లమెంటుకు, సంబంధిత రాష్ట్రాల శాసనసభలకు పరిశీలనకు సమర్పిస్తుంది. అదే విధంగా కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ద్రవ్య వినియోగ పద్దులను, ఆర్థిక పద్దులను ధృవీకరించి ఆ పత్రాన్ని చట్టసభల ముందుంచడానికి రాష్ట్రపతికి, గవర్నర్లకు పంపుతుంది కాగ్. ఈ అధికారాలన్నీ రాజ్యాంగపరంగా కాగ్‍కు సంక్రమించినవే.

ఇంత చరిత్ర వున్న కాగ్‍ను బైబిలా, ఖురానా, భగవద్గీతా అని హేళన చేసినట్లు మాట్లాడడం ముఖ్యమంత్రికి తగదు. శివుడాజ్ఞ లేనిది చీమైనా కదలదన్నట్లు, కంప్ట్రోలర్-ఆడిట్ జనరల్ చేయి బడకుండా కేంద్ర రాష్ట్రాల ఆదాయ వ్యయాల లెక్కలు ఒక కొలిక్కి రానేరావు. బడ్జెట్‌లో అనేక రకమైన అంచనాలుంటాయి. పద్దులుంటాయి. వాటన్నిటినీ ఖర్చు చేసే విధానం కూడా తెలియచేయడం జరుగుతుంది. మరి నిజంగా వీటన్నింటికీ చట్టబద్ధత వుందా? లేదా? అని చెప్పాల్సిన బాధ్యత ఎవరి మీదో ఒకరి మీద వుండాలి కదా! ఆ పనే రాజ్యాంగం కంప్ట్రోలర్-ఆడిటర్ జనరల్‌కు అప్ప చెప్పింది. కాగ్ అటు పార్లమెంటుకు కాని, ఇటు రాష్ట్రాల శాసనసభలకు కానీ సమర్పించే నివేదికలు అనేక రకాల వడపోతలకు గురైన తరువాతే బయటకొస్తాయి. అవేవో ఆషామాషీగా తయారయ్యే లెక్కలు కావు. ఆ నివేదికలు కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ శాఖలకు, ప్రభుత్వ రంగ సంస్థలకు, ప్రభుత్వేతర  సంస్థలకు సంబంధించిన ఆదాయ-వ్యయాలకు అసలు సిసలైన కొలబద్దలే! బైబిల్, ఖురాన్, భగవద్గీతలతో సమానమే!


Saturday, April 7, 2012

"చేతులు" కలిసినట్టేనా?: వనం జ్వాలా నరసింహారావు




సూర్య దినపత్రిక (07-04-2012)


వనం జ్వాలా నరసింహారావు

మొత్తం మీద అంతా అనుకున్నట్లు గానే-అనుకున్న విధంగానే జరిగింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య తలెత్తిన వివాదాన్ని గులాం నబీ ఆజాద్ తనదైన అధిష్టానం దూత శైలిలో ప్రస్తుతానికి సమసిపోయేట్లు చేశారు. ఇకపై వారిద్దరిలో ఎవరు కూడా ఒకరికంటే మరొకరి అధికులు కారని, ఇద్దరూ ఆజాద్‍ కనుసన్నలలో పనిచేయాలని నిర్ణయం జరిగినట్లు మీడియా కధనాలొచ్చాయి. తగాదా లేకుండా కలిసిమెలిసి పనిచేయాల్సిన వారిద్దరూ, అనవసరంగా ఒకరితో మరొకరు తగవులా డి, తానెక్కువంటే తానే ఎక్కువని కయ్యానికి కాలుదువ్వి, చివరకు, ఇద్దరూ తక్కువనే రీతిలో ఆజాద్ కింద పనిచేయాల్సిన స్థితికి చేరుకున్నారు. రాజీ కుదిరించే మార్గంలో, ఆజాద్ పదే-పదే మేడం ప్రస్తావన తీసుకొచ్చారు. ఆమె గారు కిరణ్-బొత్సలపై కోపంగా వున్నారని కూడా చెప్పాడు. త్వరలో జరగబోయే ఉపఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి ధీటుగా పోటీ ఇవ్వకపోతే. వారిద్దరితో పాటు తానూ ఇంటిదారి పట్టాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు వార్తలొచ్చాయి. పనిలో పనిగా కిరణ్ కుమార్‌కు మరికొన్ని పాఠాలు కూడా చెప్పారట. అదే విధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్ల జాబితా తయారుచేసి తన ఆమోదం కొరకు పంపాలని బొత్సకు సూచించారు. నామినేటెడ్ పదవుల పందేరాలు మొదలెట్టాలని, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ల నియామకం విషయంలో ఉపముఖ్యమంత్రితో, బొత్సతో చర్చించాలని సీఎంను ఆదేశించారు. ఉపఎన్నికలలో విజయం సాధించడానికి, నియోజకవర్గాల వారీగా కమిటీలను ఏర్పాటు చేయాలని కూడా చెప్పారు. అంటే, ఇక అంతా ఆజాద్ పాలనే కొనసాగనున్నదన్న మాట! ఏదేమైనా, తామంతా ఒకటే జట్టు అని, అంతా కలిసి కట్టుగా వుంటామని బొత్స-కిరణ్ ప్రకటించడం గమనించాల్సిన విషయం!

ఈ తతంగం నమ్మాలంటే, బొత్స-కిరణ్ "కలిసి పోయారని" భావించాలంటే, కనీసం ఒక్క సారన్నా, వారిద్దరూ ఢిల్లీకి "కలిసి పోవాలి". అదెలాగూ జరుగదు కనుక వీరిద్దరి మధ్య రాజీ తాత్కాలికమే! దానికి ఉదాహరణగా, ఏసిబి లో చోటుచేసుకుంటున్న పరిణామాలనే తీసుకోవాలి. బాధ్యతాయుతమైన పదవిలో వున్న ఒక ఏసిబి అధికారిని పదోన్నతిపై బదిలీ చేయడం, ఆయనను రిలీవ్ చేసేది లేనేలేదని ఆయన పై అధికారి అనడం, అవసరమైతే తానే శెలవుపై వెళ్తాననడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో సర్దుమణిగినట్లే కనిపించి మరింత వివాదానికి దారి తీయడం, ఇదంతా జరుగుతుండగానే బొత్స మనుషులు అనుకున్న తెల్ల రేషన్ కార్డుల వారిపై మరి కొన్ని దాడులు జరగడం, కిరణ్‌కు-బొత్సకు మధ్య రాజీ పెట్టిందే కాని అతుక్కున్నది కాదని అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగిస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు సంక్షోభం వచ్చినా, అది కేవలం వచ్చినంత వేగంగా సర్దుమణగడానికేనేమో అనిపిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం నుంచి కూడా ఇదే ఆనవాయితీ కొనసాగుతూ వుంది. అదే మళ్లీ మరో మారు జరుగుతోందిప్పుడు. కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ మధ్య చిచ్చు పుట్టినట్లే పుట్టి, వెంటనే ఆరినట్లే ఆరిపోయింది. కనీసం పైకన్నా అలా జరిగింది. ఇక ముసళ్ల పండుగ ముందుందా? ప్రస్తుతానికి కథ కంచికేనా? అంటే దానికి సమాధానం అంత తేలిగ్గా దొరికేది కాదు. మొత్తం మీద అధిష్టానం ముగ్గురినీ ఢిల్లీకి పిలిచి, పెట్టాల్సిన చివాట్లు పెట్టి, పనిలో పనిగా గుంజాల్సినంత గుంజి, తలంటు పోసి, రాజకీయ రాజీ కుదిర్చి, ఇక ఇప్పటికిది చాలులే అని హైదరాబాద్‌కు సాగనంపారు. అధిష్టానానికి కావాల్సింది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల మధ్య, దాని కనుసన్నలలో కొనసాగే వైరం కాని, సయోధ్య కానే కాదన్న సంగతి, కిరణ్‍కూ, బొత్సకూ, దామోదరకూ తెలుసు. అందుకే వారు ఈ తతంగాన్ని పెద్ద శిక్షగా కానీ, అభిశంసనగా కానీ భావించడం లేదు. వెళ్లిన పని ఇప్పటికి ఐందికదా అని ఊపిరి పీల్చుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.

ఇంతకూ రాష్ట్ర కాంగ్రెస్-సంబంధిత రాజకీయాలలో ఏం జరుగుతోంది? ఏం జరుగబోతోంది? కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేతగా ఏడాదిన్నర కింద కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసి, ముఖ్యమంత్రిగా ఇన్నింగ్స్ ప్రారంభించమని అనడం వెనుక కొంత నేపధ్యం వుండి తీరాలి. ఆ నేపధ్యం ఆయనంటే గిట్టనివారికి ప్రతికూలంగా వుండి వుండాలి. ఆ ప్రతికూలతే, ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పుడో-ఎప్పుడో ఒకప్పుడు ఆశించిన వారికి, మధ్య మధ్య గుర్తుకొస్తుండవచ్చు. దాని పర్యవసానమే, కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తికి కారణమై వుండి వుండవచ్చు. ఇంతకీ ఆ నేపధ్యం ఏమై వుండవచ్చు?

రాజశేఖర రెడ్డి అకాల మరణంతో సుమారు మూడేళ్ల కింద రాష్ట్ర రాజకీయాలలో, అందునా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలలో, అర్థంకాని శూన్యత హఠాత్తుగా చోటుచేసుకుంది. ఆయన స్థానంలో, అంతటి పటిష్టమైన నాయకుడు అప్పట్లో (ఆ మాటకొస్తే ఇప్పటికీ!) ఎవరూ అధిష్టానానికి కనపడలేదు. ఆయన వారసుడుగా వద్దామనుకున్న పటిష్టమైన (వై ఎస్ జగన్మోహన్ రెడ్డి?) నాయకుడు అధిష్టానానికి పనికి రాలేదు. మధ్యేమార్గంగా, సీనియారిటీని తెర పైకి తెచ్చి, అనధికారికంగా రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో "నంబర్ టు" గా వున్న రోశయ్యను ముఖ్యమంత్రిని చేసింది అధిష్టానం. అది గిట్టని వారు గింజుకున్నారు-గొణిగారు కాని అసంతృప్తి స్థాయికి ఎదగలేదు. మధ్యలో జగన్ గొడవ కొంత సాగింది. ఆయనకు మద్దతు ప్రకటించిన అనేక మంది మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారానికి రామని కూడా మారాం చేశారు. రోశయ్యగారు, ఆయనకు మద్దతుగా అధిష్టానం దూతలు, నయానో-భయానో నచ్చ చెప్పి, అప్పట్లో-ఆ తరువాత ఒక ఏడాది కాలం పాటు అసంతృప్తిని ఎవరి గుండెలలో వారే పదిలంగా వుంచుకునేట్లు చేయగలిగారు. అడుగడుగునా అధిష్టానం పేరు చెప్పుకుంటూ రోశయ్య, అత్యంత భారంగా, ఒక ఏడాది పాటు పదవిలో వుండగలిగారు. తన సీనియారిటీకి రాష్ట్ర రాజకీయాలు తగవని నిర్ధారించుకున్న మరుక్షణం, రోశయ్య అత్యంత గౌరవ ప్రదంగా, స్వచ్చందంగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని, అనతి కాలంలోనే గవర్నర్‍గా స్థిరపడిపోయారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలని ఆలోచన చేసిన అధిష్టానం దృష్టికి వచ్చిన పేర్లలో, ఆసక్తికరంగా, కిరణ్ కుమార్ రెడ్డి ముందు వరుసలో నిలబడ్డాడు. ఆయన ముఖ్యమంత్రి కావడం, పరిశీలనలోకి వచ్చిన ఇతర పేర్లలో ఒకరు ఉప ముఖ్యమంత్రి కావడం, మరొకరు దరిమిలా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కావడం అందరికీ తెలిసిందే. ఐతే, అందరిలోకి కిరణ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఎక్కువ మార్కులొచ్చాయి?

ఈ ప్రశ్నకు సమాధానం అంత సులువు కాదు. ఐనా దొరకబుచ్చుకున్నారు విశ్లేషకులు. రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో సభ్యులు కానివారికి మొదటి ప్రాధాన్యత ఇద్దామనుకుంది అధిష్టానం. దానికి సరైన కారణం లేకపోలేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఆయన చేసిన భూపందేరాలలాంటి అనేకానేక అవినీతి వ్యవహారాలు ఎప్పుడో ఒకప్పుడు బయటపడక తప్పవన్న భావనలో వుంది అధిష్టానం. ఆ వ్యవహారం బయటపడిన తరువాత, కేవలం అది రాజశేఖర రెడ్డితోనే ఆగదని, అది ఆయన మంత్రివర్గంలో పనిచేసిన అందరి మెడలకీ చుట్టుకుంటుందని అధిష్టానం నమ్మింది. ఆ క్రమంలోనే రోశయ్యను తప్పించినప్పుడు, వైఎస్‌కు సన్నిహితుడిగా వున్నప్పటికీ, ఆయన మంత్రివర్గంలో సభ్యుడు కాని కిరణ్ కుమార్ రెడ్డిమీద కు దృష్టి మరల్చింది. వాస్తవానికి అదే బొత్సకు మైనస్ పాయింట్ అయింది. ఇక దామోదర రాజ నరసింహకు రాకపోవడానికి కారణం ఆయన తెలంగాణ నేపధ్యమే! ఆ నేపధ్యమే ఆయనకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. ఇంతవరకూ బాగానే వుంది కాని, ఆ తరువాత జరుగుతున్న కథే అర్థం కావడం లేదు అధిష్టానానికి. తమవాడనుకున్న కిరణ్ కుమార్ రెడ్డి తామనుకుంటున్న తరహాలో-మోతాదులో, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కోవడం లేదన్న అనుమానం రాసాగింది. బొత్సను రంగంలోకి దింపింది. ఆయన కూడా వైఎస్ జగన్‌ను డీ కొట్టడానికి బదులు కిరణ్‌తో తల పడ్డాడు. ఇక దామోదర రాజనర్సింహ ఎందుకు పెంచుకున్నాడో-ఏమో కాని ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఈ ముగ్గురి మధ్య ఇతరులు తలదూర్చడం మొదలైంది. ఇక శంకర రావు లాంటి వారు, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి వారు ఎలాగూ ఎప్పుడూ వుంటూనే వుంటారు. ఈ నేపధ్యంలో మొదలైంది అవినీతి నిరోధక శాఖ వారి మద్యం ముడుపుల దాడులు. దాంతో వాతావరణం మరింత వేడెక్కింది.

గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సిండికేట్‌ల పైన, ఎక్సైజ్ అధికారుల పైన, శాంతిభద్రతల విభాగం పోలీసులపైన, అవినీతి నిరోధక శాఖ చేస్తున్న దాడుల విషయంలో, మిగతా వారి సంగతి ఎలా వున్నా పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పరిస్థితి మాత్రం, అంటకాగుతున్న పెనంలో పెట్టిన వస్తువులాగా తయారైంది. ఆ దాడులకు ప్రధాన బాధ్యుడైన పోలీసు అధికారిని ఆ పోస్టులోంచి తొలగించే దాకా బొత్సకు నిద్దురపట్టలేదనాలి. తనవారనుకున్న వారిపై దాడులకు ప్రేరణ ముఖ్యమంత్రి నుంచేనని ఆయన అనుమానం. ఆ సందర్భంగానే, ఒకానొక సందర్భంలో ఢిల్లీనుంచి ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, నిష్టూరాలు ఆడాడని మీడియాలో కధనాలొచ్చాయి. సరే, ఆ తరువాత, బొత్స వాటిని ఆనవాయితీ ప్రకారం ఖండించడం కూడా జరిగింది. ఆ నేపధ్యంలోనే, తనపై వచ్చిన అపవాదునుంచి తప్పించుకోవడానికి, కిరణ్ కుమార్ రెడ్డి, ఏసిబి అదనపు డైరెక్టర్‌ను ఆ స్థానం నుంచి తప్పించారంటున్నారు. ఏదేమైనా మద్యం సిండికేట్‌ల పైనా ఈ పాటికే చాలా లోతుగా దర్యాప్తు జరిగింది. మద్యం సిండికేట్‌ల వెనుక భారీ ఆర్థిక కుంభకోణం వుందని కూడా అనుమానాలు వచ్చాయి. ఎప్పుడైతే సిండికేట్‌ల భాగోతం విజయనగరం జిల్లాకు చేరుకుందో అప్పుడే రాజకీయ దుమారం మొదలైంది. ఆ దుమారంలో కీలక అంశం బొత్స మనుషులుగా చెప్పుకుంటున్న ముప్పై మందికి పైగా తెల్ల రేషన్ కార్డుల వారి పేరుతో షాపులుండడం. సహజంగానే బొత్సకు ఈ వ్యవహారం నచ్చలేదు. అలా మొదలైన బొత్స-కిరణ్ ప్రచ్చన్న-పరోక్ష యుద్ధం ప్రస్తుతానికి వాయిదా పడ్డా, ఇద్దరిలో ఏ ఒక్కరన్నా-లేదా ఇద్దరన్నా పదవి కోల్పోయిందాకా ఆగదనేది అక్షర సత్యం. అందుకే అటు బొత్స ఇటు కిరణ్ ఇద్దరూ కూడా ఆ తరువాత తమ పరిస్థితి ఏంటి అన్న దానిపైనే దృష్టి సారించారని, రాష్ట్రంలో కోల్పోనున్న పదవుల స్థానంలో రాబోయే ఎన్నికలలో వారిద్దరూ లోక్ సభ నుంచి రంగంలోకి దిగాలని ఆలోచిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే, అవసరమైతే ప్రస్తుతం ప్రత్యర్థులని భావిస్తున్నవారి మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నంలో వున్నారని ఒక వార్త ప్రచారంలో వుంది. వారిద్దరూ ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం లేదని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వారితో విచారణ జరిపిస్తున్నది అధిష్టానం అని కూడా వార్త ప్రచారంలో వుంది. పాపం-పుణ్యం భగవంతుడికే తెలియాలి!

Friday, March 23, 2012

ఉప సమరం నేర్పిన గుణపాఠాలు: వనం జ్వాలా నరసింహారావు



సూర్య దినపత్రిక (25-03-2012)
వనం జ్వాలా నరసింహారావు

కోస్తాంధ్రలో ఒక్క సీటుకు, ఉత్తర-దక్షిణ తెలంగాణాలో ఆరు సీట్లకు ముగిసిన ఉప ఎన్నికలలో ఓటర్లు ఇచ్చిన తీర్పు అమోఘం. అందరికీ అంతో-ఇంతో గుణపాఠం చెప్పకనే చెప్పారు. ఒక పక్క తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరరావును, మరోపక్క వైఎస్సార్ సీపీ నేత జగన్మోహన్‌ రెడ్డిని హీరోలుగా అంగీకరించుతూనే, తస్మాత్ జాగ్రత్త అంటూ ఇతోధికంగా చురకలు కూడా వేశారు ఓటర్లు. ఇక ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి స్పష్టమైన హెచ్చరికలు చేశారు. అదే క్రమంలో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు, తాజా కాంగ్రెస్ నాయకుడు చిరంజీవికి, వారి-వారి జిల్లాలలో ప్రచార బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్-తెలుగుదేశం నేతలకు తగు సంకేతాలిచ్చారు. పార్టీల పరంగా తెరాసకు, తెలుగుదేశానికి, కాంగ్రెస్‌కు, భారతీయ జనతా పార్టీకి కొన్ని సంకేతాలిచ్చారు. ఐదు చోట్ల పోటీ చేసిన టీఆర్ఎస్‌ పార్టీ నాలుగు చోట్ల గెలిచి, తెలంగాణా సెంటిమెంటును ఎంత బలంగా నిరూపించిందో, అంతే మోతాదులో బీజేపీ పోటీ చేసిన ఒకే ఒక్క మహబూబ్‌నగర్ స్థానాన్ని కైవసం చేసుకుని నిరూపించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేసిన ఒక్క సీటునీ కైవసం చేసుకుని, సమీప భవిష్యత్‍లో జరుగనున్న పద్దెనిమిది శాసనసభ స్థానాల ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి, తెలుగు దేశానికీ ధీటుగా నిలవబోతోంది. పాలక, ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్‌, తెలుగుదేశం ఏడు చోట్లా పోటీ చేసి, ప్రతి చోటా ఓటమి చవిచూశాయి. కాంగ్రెస్‌ పార్టీ నాలుగు చోట్ల రెండో స్ధానంతోను, మూడు చోట్ల మూడో స్ధానంతోను సర్దుకోవాల్సి వచ్చింది. తెలుగు దేశం పార్టీ ఒక చోట నాలుగో స్ధానంలో, రెండు చోట్ల రెండో స్ధానంలో, నాలుగు చోట్ల మూడో స్ధానంలో ఉంది. రెండు చోట్ల డిపాజిట్ కూడా కోల్పోయింది.  ప్రతిష్టాత్మకమైన మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఇక్కడ టీఆర్ఎస్‌ ద్వితీయ స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నెల్లూరు జిల్లాలోని కోవూరు గతంలో తెలుగుదేశం అధీనం లో ఉండేది. ఇప్పుడది జగన్‌ పార్టీ పరమైంది.

ఇంతకూ, గెలుపెవరిది? ఓటమి ఎవరికి? కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు సంబంధించినంతవరకు, కేవలం ఓటమి మాత్రమే కాకుండా, ఆ పార్టీల ప్రతిష్ట కూడా పూర్తిగా దిగజారి పోయిందనాలి. 2009 లో కాంగ్రెస్ గెల్చుకున్న రెండు స్థానాలను, ఇండిపెండెంటుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన మరో సభ్యుడి స్థానాన్నీ, మొత్తం మూడు స్థానాలనూ కోల్పోయింది. పడ్డ ఓట్లు కూడా అంతంత మాత్రమే! తెలుగుదేశం దీ అదే పరిస్థితి. 2009 లో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలలో దారుణంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ ప్రతిష్టా మంట కలిసింది. భవిష్యత్‍లో తెలంగాణ ప్రాంతంలో జరగబోయే ఏ ఎన్నికైనా తెలంగాణ వాదంతోనే బలంగా ముడిపడి వుంటుందన్నతరహా తీర్పిచ్చారు ఓటర్లు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆ పార్టీలకు చెందిన ఇతర నాయకులు, వాస్తవానికి, తమ వంతుగా తెలంగాణ వాదాన్ని మొన్నటి ఉపఎన్నికలలో వినిపించే ప్రయత్నం చేశారు కూడా. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని బాబు, తెలంగాణ సెంటిమెంటు గణనీయంగా వుందని, ఐనా ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమే అని కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వాదానికి అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేయబట్టే, ఆ మాత్రం ఓట్లన్నా రాలాయి. ఆ రెండు పార్టీల భవిష్యత్ తెలంగాణకు సంబంధించినంతవరకు ఇక ప్రశ్నార్థకమే! సమైక్య్తవాదానికి కట్టుబడి పోటీ చేసిన ఏకైక పార్టీ సీపీఎం సోదిలోకి లేకుండా పోయింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక తెలంగాణ వాదాన్ని వినిపించడానికి నడుం బిగించిన భారతీయ జనతా పార్టీని, మహబూబ్‌నగర్‌లో, తెరాస కంటే ఎక్కువగా నమ్మారు ఓటర్లు. భవిష్యత్‍లో తెలంగాణ సాధన ప్రక్రియలో, కేవలం రాజకీయ ఐకాసలో కల్సి వుండడమే కాకుండా, ఎన్నికలలో కూడా, తెరాస-బీజేపీ అవగాహన కుదుర్చుకోవాలన్న సంకేతాన్ని కూడా ఓటర్లు మహబూబ్‌నగర్ స్థానం ఫలితం ద్వారా ఇచ్చారు.

తెలంగాణలో కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పుట్టగతులు లేకుండా పోతుంటే, సీమలో-ఆంధ్రలో కూడా దాదాపు అదే పరిస్థితి నెలకొన్నదనాలి. కోవూరు ఫలితమే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఏనాడైతే దివంగత ముఖ్యమంత్రి వారసుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని భారత జాతీయ కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదో, ఆ నాడే, కాంగ్రెస్ తన అస్థిత్వాన్ని కోల్పోవడానికి తానే స్వయంగా బాటలు వేసుకుందనాలి. రాజశేఖర రెడ్డి వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన రోశయ్య కానీ, ఆయన వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి కానీ, జగన్ దూకుడుకు కళ్లెం వేయ లేకపోయారు. 154 మంది కాంగ్రెస్ శాసనసభ సభ్యుల మద్దతుతో-సంతకాలతో ప్రారంభమైన ఆయన అసమ్మతి ప్రస్థానం, "గోపీ" ల పుణ్యమా అంటూ,  17 కు పడిపోయినా, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ మాత్రం వీసమెత్తైనా పడిపోలేదు. ఓదార్పు పేరుతో ఆయన చేపట్టిన వేలాది కిలోమీటర్ల రాష్ట్రవ్యాప్త ప్రజా యాత్ర, ఆబాలగోపాలాన్ని జగన్ చెంతకు చేర్చింది. ఏం జరిగినా-ఎంత ప్రజాదరణ జగన్మోహన్ రెడ్డికి వున్నా, కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోక పోవడంతో, విసిగివేసారిన జగన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసి, తన తల్లి విజయమ్మతో కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించారు. తరువాత జరిగిన ఉపఎన్నికలలో కడప-పులివెందులల నుంచి అఖండ విజయం సాధించి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు ఆనాడే సవాలు విసిరారు జగన్. ఆ ఎన్నికలలో పోటీ చేసి ఘోర ఓటమి పాలై-డిపాజిట్ కూడా కోల్పోయిన మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అప్పట్లో రాజీనామా చేయాలని తోచలేదు పాపం! దరిమిలా జగన్ అక్రమాస్తుల వ్యవహారం, సీబీఐ దర్యాప్తు ప్రక్రియ, శాసనసభలో అవిశ్వాస తీర్మానం అంశం లాంటివి జగన్ వెంట నడిచే నిఖార్సైన ఎమ్మెల్యేల-ఎంపీల సంఖ్యను తేల్చింది. ఎంపీ రాజమోహన రెడ్డి రాజీనామాతో సహా, పదిహేడు మంది జగన్ వర్గ ఎమ్మెల్యేలు సభ్యత్వం కోల్పోవడంతో జగన్ వర్గం మరింత బలపడ సాగింది. ఆ నేపధ్యంలో వచ్చిందే కోవూరు శాసనసభ ఉప ఎన్నిక. కడప-పులివెందుల ఫలితం ప్రభావం కోవూరు మీద స్పష్టంగా పడింది. భారీ మెజారిటీతో కాకపోయినా మంచి మెజారిటీతో ప్రసన్న కుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి, కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలకు పెను సవాలు విసిరారు. తెలంగాణలో సెంటిమెంటుకు, (సీమ) ఆంధ్రలో సెంటిమెంటుకు కొంత తేడా వున్నప్పటికీ, అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం ఓటమి పాలు కావడానికి ఆ రెండు సెంటిమెంట్లే కారణమయ్యాయి. రాజశేఖర రెడ్డి వారసుడిగా, ఆయన సంక్షేమ పథకాలను ముందుకు తీసుకుపోదగ్గ వ్యక్తిగా, భావి ఆంధ్ర ప్రదేశ్ యువతరం నాయకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటర్లు తీర్పిచ్చారు. ఇక ఆయనదే హవా!

అధికార పక్షానికి చెందినంతవరకు, ఉప ఎన్నికలలో ఓటమికి బాధ్యత ఎవరిది అన్న అంశంపై, సమ్మతి-అసమ్మతి రాగాలు ఆరున్నొక్క శ్రుతిని దాటాయి. అసమ్మతి రాగాల మాట అటుంచితే, సాక్షాత్తు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-చార్జ్ గులాం నబీ ఆజాద్ రాజ్యసభ సభ్యుడు సుబ్బరామిరెడ్డితో అన్నట్లుగా చెప్పుకుంటున్న మాటలు కొంచెం ముఖ్యమంత్రిని ఇబ్బందిలో పడేసి విగా వున్నాయనాలి. "ఉపఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రిది కాకపోతే ఎవరిది బాధ్యత అవుతుంది?" అని ఆజాద్ వ్యాఖ్యానించారట. అసమ్మతి గళం విప్పినవారిలో అగ్రగణ్యుడు మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి. కడప లోక్ సభ స్థానానికి ఓడినప్పుడు కూడా అంతగా బాధపడని డీఎల్, ఈ ఉపఎన్నికలలో ఓటమికి చాలా కలత చెందారు పాపం! మంత్రి మండలి మొత్తం రాజీనామా చేయాలన్న డిమాండుతో సరిపుచ్చుకోకుండా. ఆయన తన రాజీ-నామా పత్రాన్ని అధినేత్రి సోనియాగాంధీకి పంపారు. కిరణ్ కుమార్ రెడ్డి మీద, బొత్స మీద పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి, తనదైన "క్రికెట్ స్టయిల్ లో" ఈ ఆటలో ఓడామని వ్యాఖ్యానించి సరిపుచ్చుకున్నారు. బొత్స కూడా రాజీనామా చేసే వరకు వ్యవహారం పోయిందంటారు. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కూడా కిరణ్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఇక కే కేశవరావు, ఎంపీ వివేక్‌లు సరే సరి. ఇంత జరిగినా తప్పెవరిది అంటే అంతా గప్ చిప్!

ఒకరి మీద మరొకరి విమర్శనాస్త్రాలు తీవ్రతరమౌతున్నాయి. విభేదాలు పెరిగిపోతున్నాయి. హస్తంలో కీచులాటలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ప్రకంపన లింకా ఆగలేదు. సరికదా ఊపందుకుంటున్నాయి. పార్టీలో సంపూర్ణ ప్రక్షాళన-దాదాపు కామరాజ్ నాడార్ ప్రణాళిక లాంటిది అవసరమనేంతవరకూ వెళ్లింది వ్యవహారం. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ కార్యవర్గం మొత్తం రాజీనామా చేయాలంటూ సీనియర్ నేత, మాజీ మంత్రి శంకర్రావు డిమాండుతో మీడియా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి బలహీనుడని, ఆయన పదవిలో కొనసాగాలా-వద్దా అనే విషయం ఆయన విజ్ఞతకే వదిలివేస్తున్నానని ఎంపీ వివేక్ వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు సహితం ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. సీఎం పక్షాన మాట్లాడేవారే కరవయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఇలా ఒక్కొక్కరు-ఒక్కొక్కవిధంగా మాట్లాడడం సరికొత్త అసమ్మతికి తెరలేపినట్లయింది. ఐనా, పూర్తిగా ముఖ్యమంత్రిదే ఓటమికి బాధ్యత అనడం ఎంతవరకు సబబు? ఆయనను ఆయన మానాన ఎన్నడన్నా వదిలేశారా ఇలా మాట్లాడుతున్న నాయకులు? ఉపఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి, ప్రచార బాధ్యతలను నెత్తిమీద వేసుకోవడం దాకా, ఏ కాంగ్రెస్ నాయకుడు ఎంతవరకు తమ వంతు పాత్రను సక్రమంగా పోషించారో వారికి వారే బేరీజు వేసుకోవడం మంచిది. మరోవైపు ముఖ్యమంత్రికి సన్నిహితంగా మెలుగుతున్నవారు, అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న సీనియర్ నేతలపై యుద్ధాన్ని ప్రకటించేందుకు ప్రయత్నాలు ప్రారంభించడంతో, చివరకు పరిస్థితి ఎటు నుంచి ఎటు వైపునకు దారి తీస్తుందోనన్న ఆందోళన అధిష్ఠానానికి పట్టుకుంది. రాష్ట్రంలో అసమ్మతి నిప్పులపై నీళ్లు చల్లేందుకు అధిష్ఠానం రంగంలోకి దిగవలసిన అవసరం ఏర్పడింది.

ఏదేమైనా, ఆద్యతన భవిష్యత్‍లో సీమాంధ్రలో జరుగనున్న పదిహేడు శాసనసభ స్థానాల ఉపఎన్నికలు, తెలంగాణలోని ఒక స్థానానికి జరగనున్న ఎన్నిక రాష్ట్ర రాజకీయ రంగంలో ఒక కీలకమైన మలుపుకు దారితీయనున్నది. కోవూరు ఓటమితో సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి పక్షానికి వలస పోయే అవకాశాలు రోజు-రోజుకూ పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ ప్రాంతంలో, తెలుగుదేశం నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి తెరాసలోకి వలసలు మొదలవుతాయి. ఒకవేళ అందరూ ఊహించినట్లుగానే, ఉపఎన్నికలు జరుగనున్న పద్దెనిమిది స్థానాలలో మెజారిటీ (లేదా అన్నింటిలో) స్థానాలలో కాంగ్రెస్-టీడీపిలు ఓటమి పాలైతే, ఇక ఆ పార్టీల పరిస్థితి, 2014 ఎన్నికలొచ్చే సరికి అగమ్యగోచరం అనక తప్పదు!

Friday, February 17, 2012

అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?: వనం జ్వాలా నరసింహారావు


అలనాటి ఆర్థిక మంత్రుల బడ్జెట్ స్ఫూర్తి ఇదేనా?


రాష్ట్ర శాసనసభలో 2012-2013 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్‌లో పన్నుల ప్రస్తావన లేకపోయినప్పటికీ, పరోక్షంగా చెప్పకనే చెప్పారు మనసులో మాట ఆర్థిక శాఖామాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి. ఉదాహరణకు వాణిజ్య పన్నుల శాఖ ఆదాయాన్ని పెంచుకుంటామని అనడం అంటే, పన్నులు విధించబోతున్నట్లే కదా! మద్యం అమ్మకాల ద్వారా మరి కొన్ని కోట్ల అదనపు వనరుల సేకరణ జరుపుకుంటాం అని చెప్పడమంటే, ప్రజల నెత్తిన మరికొంత భారాన్ని వేయడమే కదా! మరి, ఇవేవీ లేకుండా లక్షా నలబై ఐదు కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించడమంటే, కనీసం రాష్ట్రాన్ని రుణ వూబిలోకి నెట్టడమే కదా! ఆదాయ వనరుల సేకరణ సజావుగా సాగడానికి, పన్నులన్నా వుండాలి, అప్పులన్నా చేయాలి. ఈ రెండింటి లో ఏం చేయదల్చుకున్నారో ఆర్థికామాత్యులు ప్రత్యక్షంగా ప్రస్తావించకపోయినా, చెప్పదల్చుకున్నది దాచగలిగినా, చెప్పకుండా మాత్రం వుండలేకపోయారు. అది ఆయన ఒక్కడి తప్పు కాదు. ఆ పాపం ఆనాటి నుంచీ నేటిదాకా కొనసాగిస్తున్న గత ప్రభుత్వాలది కూడా. ఏళ్ల తరబడి పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వ రధ సారధులది, ఆ ప్రభుత్వాలలో పని చేసి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆయన పూర్వీకులది, కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రుల అడుగు జాడలలో నడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రులదీ కూడా! ఏదేమైనా కిరణ్ కుమార్ రెడ్డిని, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కొంత అభినందించాల్సిందే.
కిరణ్ సర్కారు మానస పుత్రికలైన మూడు పథకాలు... యువజనులకు ఉపాధి సంక్షేమం, మహిళల కోసం స్త్రీ నిధి, రైతుల కోసం వడ్డీలేని రుణాలకు ఆర్థిక మంత్రి బడ్జెట్ ద్వారా సాధికారత కల్పించారు. కిరణ్ కుమార్ రెడ్డి-ఆనం రామనారాయణ రెడ్డిలు రాష్ట్ర బడ్జెట్‌ను సమ్మోహనాస్త్రంగా ప్రయోగించారు. ఎన్నికల నాటికి వైఎస్‌ను మరిపించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. "యువజనులు, స్త్రీలు, రైతులు" లక్ష్యంగా తీర్చిదిద్దిన బడ్జెట్ ఇది అన్న ముద్ర పడే విధంగా జాగ్రత్త పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞంతో పాటు నిరుపేద వర్గాల కోసం ఆరోగ్య శ్రీ, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాటిని కొంత మేరకు కొనసాగిస్తూనే, యువజనులు, రైతులు, మహిళలను ఆకట్టుకునే కొత్త పథకాలపై దృష్టిపెట్టారు. అలానే "రాజీవ్ యువ కిరణాల" కు పెద్ద పీట వేశారు. లక్షకు పైగా ఖాళీగా వున్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ చెప్తున్న ముఖ్యమంత్రి మాటలకు అనుగుణంగా కొత్త ఉద్యోగుల వేతనాలకు బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. అంటే చెప్పింది చెయ్యబోతున్నారన్న మాట. మహిళలకు పావలా వడ్డీని కూడా తీసివేసి "వడ్డీ లేని రుణాలు" ఇస్తామంటూ ప్రకటించారు. స్వయం సహాయ బృందాల సభ్యులు, రైతులు బ్యాంకుల నుంచి తెచ్చుకునే లక్ష రూపాయల లోపు రుణానికి జీరో వడ్డీ అని, రైతులు పావలా వడ్డీకే రూ.3 లక్షల వరకు రుణం తెచ్చుకోవచ్చని, దానికి అనుగుణంగానే బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ అంకెల్లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. రూపాయికే కిలో బియ్యం పథకం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. విద్యుత్ సబ్సిడీని పెంచారు. స్కాలర్‌షిప్‌‍లకు, ఫీజు రీ ఇంబర్స్ మెంట్‌కు, బీసీ సంక్షేమానికి, సాంఘిక సంక్షేమానికి, గిరిజన సంక్షేమానికి, మైనారిటీ సంక్షేమానికి, విద్య, వైద్యం, గృహ నిర్మాణంకు కేటాయింపులు కొద్ది మొత్తాలనుంచి, భారీ మొత్తాలకు పెంచడం జరిగింది. రాజకీయంగా పట్టు సాధించేందుకు "ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి" ని మరింత బలోపేతం చేశారు. ఇంతకీ ఈ కేటాయింపులలో వాస్తవికత ఎంత? బడ్జెట్‌లో కేటాయించిందే సంబంధిత శాఖలకు ఖర్చు చేస్తారా? కేటాయించని వాటి కింద అసలు ఖర్చే కాదా? అన్న ప్రశ్నలకు మళ్లీ వచ్చే ఏడాదే సమాధానం దొరకాలి. ఉదాహరణకు గత ఏడాది జలయజ్ఞంకు కేటాయించిన నిధులలో మూడు వంతులు మాత్రమే వినియోగించడం జరిగింది. మిగాతావి మురిగిపోయినట్లే కదా? అలా ఎందుకు జరిగిందో వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మొత్తం మీద ఈ ఆర్థిక సంవత్సరంలో, నీటి పారుదల రంగానికి, పాఠశాల విద్యకు అధికంగా కేటాయింపులు జరిగాయనేది వాస్తవం. అవి ఖర్చు చేస్తే మంచిదే!
ఇలా కేటాయింపులు చేయడం, రాజకీయాలను దృష్టిలో వుంచుకుని ప్రాధాన్యతలను నిర్ధారించడం, బడ్జెట్‌లో రాజకీయ ఉపన్యాసాలు చేయడం, ఆనవాయితీగా వస్తున్నదే. ఈ విషయంలో తెలుగుదేశం వారు, కాంగ్రెస్ వారు ఒకరికంటే మరొకరు మిన్న అని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2001-2002 ఆర్థిక సంవత్సరానికి నాటి తెలుగుదేశం హయాంలో, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, విజన్ 2020 భవిష్యత్ దర్శిని లక్ష్య సాధనకు కంకణం కట్టుకున్న తమ ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిరూపమే ఆ సంవత్సరపు బడ్జెట్ అన్నారు. అప్పట్లో రాష్ట్ర వార్షిక ప్రణాళిక అంచనా తొమ్మిదివేల కోట్ల రూపాయల లోపే! కాకపోతే అప్పటికే రుణభారం సుమారు ఏబై వేల కోట్ల రూపాయలకు చేరుకునే సూచనలు ప్రస్ఫుటంగా కనిపించాయి. వాస్తవానికి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికే వున్న ఆ రుణ భారం దిన-దినాభివృద్ధి చెంది, నేటికి తీర్చలేని స్థితికి చేరుకుంది. ఆర్థికాభివృద్ధి అంటే ఇదే! దీనికి ఏ ప్రభుత్వం నుంచీ సమాధానం లేదు-రాదు.
మన రాష్ట్రంలో శాసనసభలో ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడానికి సుమారు అరవై ఏళ్ల చరిత్ర-నేపధ్యం వుంది. 1955-56 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి, నేటి వరకు, 57 పర్యాయాలు పలువురు ఆర్థిక మంత్రులు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. వారిలో రోశయ్య లాంటి కొందరు రికార్డు స్థాయిలో పదమూడు సంవత్సరాలు, బెజవాడ గోపాలరెడ్డి లాంటి వారు ఎనిమిది సంవత్సరాలు (మద్రాసు రాష్ట్రంతో కలుపుకుని) బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఘనత వుంది. జులై 8, 1955 న బెజవాడ గోపాలరెడ్డి మొట్టమొదటి సారిగా ఆంధ్ర రాష్ట్ర శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశ పెట్తూ, రెవెన్యూ ఆదాయం కేవలం రు. 2, 198 లక్షలుగా, రెవెన్యూ వ్యయం రు.  2, 564 లక్షలుగా, రెవెన్యూ లోటు రు. 366 లక్షలుగా, నికర లోటు రు.  434 లక్షలుగా చూపించారు. ఇప్పటి లక్షన్నర కోట్ల రూపాయల బడ్జెట్లకు, లక్ష కోట్ల వ్యయానికి, నాటి బడ్జెట్లకు పోలికే లేదు! అలానే ఆయన, మరుసటి సంవత్సరం రాష్ట్ర శాసనసభకు బడ్జెట్ సమర్పిస్తూ చేసిన ప్రసంగం నేటికీ స్ఫూర్తిదాయకమే. దానిని ఎరలా తీసుకున్నా వాస్తవం తెలుసుకోవాల్సిన అవసరం మాత్రం వుంది. మార్చ్ 2, 1956 నాటి ఆ బడ్జెట్ ఉపన్యాసంలో, విశాలాంధ్ర ప్రస్తావన తెచ్చారు బెజవాడ గోపాలరెడ్డి. విశాలాంధ్ర ఏర్పడితే అదే ఆయన ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న చివరి బడ్జెట్ ప్రసంగం అని ప్రారంభించారు. ద్వితీయ పంచవర్ష ప్రణాళిక రూపు దిద్దుకుంటున్న తరుణంలో రాష్ట్రాల పునర్విభజన నివేదికపై జరుగుతున్న చర్చల సారాంశాన్ని సభ్యులకు తెలియచేశారాయన. అలానే, తెలుగు మాట్లాడే వారందరికీ, ఒకే రాష్ట్రం వుంటే బాగుంటుందన్న విషయాన్నీ, వుండాల్సిన అవసరాన్నీ ఆయన స్పష్టం చేసారు (ఆయన భావాలతో నేను ఏకీభవిస్తున్నట్లు అర్థం కాదు). తన సుదీర్ఘ ప్రసంగంలో ఉద్దండ కవులైన అల్లసాని పెద్దన్న, బమ్మెర పోతన్న, రామరాజ భూషణుడు, తిక్కన సోమయాజిల పేర్లను ప్రస్తావిస్తూ, ఆ మహానుభావులు నడిచిన నేలలో నివసించే తెలుగు వారందరూ, వారి అడుగుజాడలలో ఐకమత్యంతో మెలుగుతారన్న విశ్వాసాన్ని బెజవాడ గోపాలరెడ్డి వెల్లడించారు. విశాలాంధ్ర స్థాపనకు కష్టాలు భరించాల్సి వుంటుందనీ, తరువాత బాధ్యతలు పెరుగుతాయనీ, ప్రజలు సర్దుబాటు ధోరణిలో మసలుకుంటేనే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆయన హెచ్చరించారా నాడే!
అంతటితో తన బాధ్యత తీరిందనుకోలేదు బెజవాడ గోపాలరెడ్డిగారు. ప్రప్రధమ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను జులై 3, 1957 న రాష్ట్ర శాసన సభలో ప్రవేశ పెట్టిన ఘనత కూడా ఆయనే దక్కించుకున్నారు. సాంప్రదాయానికి భిన్నంగా తన బడ్జెట్ ప్రసంగం వుంటుందని మొదలే విశదపర్చారాయన ఆనాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, ప్రత్యేకించి తెలంగాణ ప్రాంత ఆర్థిక పరిస్థితిని సమగ్రంగా వివరించి, దానిపైన శాసనసభ, పత్రికారంగం, దేశ ప్రజల స్పందన తెలుసుకోవాలనుకుంటున్నట్లు అన్నారు. రెవెన్యూ ఖాతా కింద మితిమీరిన ఖర్చును చూపడం ఆయన ఆనాడే వ్యతిరేకించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికో, విద్యుత్ ఉత్పాదన కొరకో, అప్పులు చేస్తే పరవాలేదని, శాంతిభద్రతలకు-ఆరోగ్య విద్యా సదుపాయాలకు-కమ్యూనికేషన్స్ రంగానికి, ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసి ఆ ఖర్చును భావితరాల వారిని భరించమనడం కన్నా, మనమే ఆ బరువు మోయడం సమంజసమని ఆయన అన్నారు. ఆయన ఉద్దేశం, ఫలితాలు ఇప్పుడు అనుభవించి, భారాన్ని కొడుకులకు, మనుమలకు, ముని మనుమలకు అందచేయడం తప్పుడు విధానమని. అలానే కేంద్ర ప్రభుత్వాన్ని కాని, రిజర్వ్ బాంకును కాని, రాష్ట్ర ఆర్థిక భారాన్ని మొత్తానికి-మొత్తం నెత్తిన వేసుకోమనడం సరైంది కాదని కూడా ఆయన ఆనాడే సూచించారు. ఇక్కడో చక్కటి మాట చెప్పారు. రాష్ట్రాలలో అమలు కావాల్సింది, ఇక్కడి ప్రభుత్వాలు అమలుపర్చే కేంద్ర ప్రణాళిక కాదని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రుణాలతో-నిధులతో-ఆర్థిక సహాయంతో అమలు పరిచే రాష్ట్ర ప్రణాళిక అని స్పష్టం చేసారు. మన ఆర్థిక వనరులతో, మన పన్నుల విధానంతో, పొదుపు చర్యలతో, స్వయంగా రుణాలు సమకూర్చుకోవడంతో, కేంద్ర ప్రభుత్వ సహాయానికి అదనంగా ప్రణాళికను రూపొందించుకోవాలని బెజవాడ గోపాలరెడ్డి అన్నారు.
ఆంధ్ర ప్రాంతంలో సరితూగేలా తెలంగాణ ప్రాంత అభివృద్ధి అచిర కాలంలోనే జరగాలని, ఈ లక్ష్య సాధనకు ఆదిలో అదనంగా వ్యయం చేయాల్సి వుంటుందని, తెలంగాణ ప్రాంతంలో వసూలైన ప్రతి పైసా ప్రత్యేకంగా లెక్క కట్టి, తెలంగాణ నిధులను తెలంగాణకే ఉపయోగించుతామని ఆయన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారప్పుడే! "తెలంగాణ ప్రాంతం వారికిచ్చిన వాగ్దానాలను గుర్తుంచుకోవడమే కాదు అమలు పరుస్తాను" అని బెజవాడ గోపాలరెడ్డి స్పష్టం చేసారు.
 రాజనీతిజ్ఞతతో ఆనాడు బెజవాడ గోపాలరెడ్డి చెప్పిన విశాలాంధ్ర విషయం కాని, తెలంగాణ ప్రాంతానికిచ్చిన వాగ్దానాన్ని కాని, భావితరాల వారిపై రుణభారం మోపడం తప్పన్న విషయాన్ని కాని, రాష్ట్ర ప్రణాళిక విషయం కాని ఈ నాటి నేతలు గుర్తుంచుకుంటే అంతకన్నా ఏం కావాలి?
ఈ నేపధ్యంలో అల నాడు తన జిల్లాకే చెందిన బెజవాడ గోపాలరెడ్డి బడ్జెట్ ప్రసంగాల స్ఫూర్తిని, ప్రవేశ పెట్టిన తీరును, ఈ నాటి ఆర్థిక శాఖమంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఎంతవరకు అనుకరించారనేది నిర్ణయించాల్సింది పాఠకులే! 

Wednesday, February 1, 2012

“సహ చట్టం” కమీషనర్ల ఎంపికలో "సంభావనా విధానం": వనం జ్వాలా నరసింహారావు


 వనం జ్వాలా నరసింహారావు

సమాచార హక్కు చట్టాన్ని అక్షరాలా తు. చ. తప్పకుండా అమలు పరచడానికి, హైకోర్టు ఆదేశాలమీద, ఎట్టకేలకు, ఎనిమిది మంది కమీషనర్లను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన త్రి సభ్య సంఘం ఎంపికచేసింది. ఇంకా మరొకరికి అవకాశం వుంది. ఎవరికోసం దీనిని ప్రస్తుతానికి ఖాళీగా వుంచారో, ఎప్పుడు భర్తీ చేస్తారో, అసలు చేయరో అన్న విషయం మిలియన్ డాలర్ల ప్రశ్న. (లాంఛనంగా గవర్నర్ ఆమోదముద్ర పడింది?). అంటే, ఈ ఎనిమిది మంది కమీషనర్లు, ఐదు సంవత్సరాల పాటు-లేదా వారికి అరవై ఐదు సంవత్సరాల వయసొచ్చేంతవరకు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాతో సమానమైన హోదా కలిగి బాధ్యతలను నిర్వహించుతారు. కమీషనర్లను ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ప్రధాన ప్రతిపక్ష నేత ఎన్‌ చంద్రబాబు నాయుడు భేటీ అయి "ఏకగ్రీవం" గా వారిని ఎంపిక చేశారన్న వార్తలు ఎంతవరకు వాస్తవమోకాని, ఇంతవరకు ప్రతిపక్షనేత నుంచి, ఎలాంటి విమర్శలు అధికారికంగా మాత్రం వెలువడలేదు.

ఈ ఎనిమిదిని మందిని, ఎంతవరకు-ఏ మేరకు, సమాచార హక్కు చట్టంలో సూచించిన విధి-విధానాలకు అనుగుణంగా ఎంపిక చేశారనే విషయాన్ని పక్కన పెడితే, రాజకీయాలకు అనుగుణంగా, "సంభావనా విధానానికి", "పోషక విధానానికి" (అమెరికా దేశంలోని "స్పాయిల్స్ పద్ధతి") నూటికి నూరుపాళ్లు సరిపడే పద్ధతిలో మాత్రం ఎంపికచేసారనడంలో అతిశయోక్తి లేదు. అలానే వివిధ రంగాలకు చెందిన వారూ వున్నారన్న అర్థం స్ఫురించే రీతిలో జరిగిందీ ఎంపిక! అధికారులుగా పనిచేసిన వారు, అనధికారులుగా ముద్ర పడినవారు, సామాజిక కార్యకలాపాలలో పాలు పంచుకున్నట్లు అంతో-ఇంతో గుర్తింపు తెచ్చుకున్న వారు, వ్యవసాయ రంగంలో పేరు గడించినట్లు చెప్పుకో వీలున్న వారు, పాత్రికేయులు; కాపు, మాల, రెడ్డి, బీసీ, మాదిగ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు; ....ఇలా రకరకాలుగా చెప్పుకోదగ్గ విధంగా సవివరంగా-సముచితంగానే ఎంపిక జరిగింది!. రాజకీయాలకు అచ్చు గుద్దినట్లు సరిపోయే విధంగా, రిజర్వేషన్లకు అనుగుణంగా, సామాజిక న్యాయం చేకూర్చే విధంగా, ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సంభావనా విధానానికి, పోషక విధానానికి అద్దం పట్టే దిగా వుందీ ఎంపిక. ఇక సమాచార హక్కు చట్టం అమలు ఆ భగవంతుడికే తెలియాలి. వ్యక్తులుగా ఎవరి మీద సంధించిన విమర్శ ఇది కాకపోయినా, ఆయా రంగాలలో ఎంతో నిష్ణాతులైన వ్యక్తులనే ఎంపిక చేయాల్సిన కనీస బాధ్యతను విస్మరించిందే ప్రభుత్వం అన్న ఆరోపణ మాత్రం చేయకుండా వుండడం కష్టమే. ఏదేమైనా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకిష్టులైన వారిని ఎంపిక చేసుకోవడానికి, తనను ధిక్కరిస్తుండే ఉప ముఖ్యమంత్రిని, సాక్షాత్తు ప్రధాన ప్రతిపక్షనేతను, ఒప్పించ గలగడం అభినందించాల్సిన విషయమే. 

మెరికా దేశ రాజకీయాలలో అనాదిగా అనుసరిస్తున్న సాంప్రదాయిక-చట్టబద్ధ విధానాలలో "స్పాయిల్స్ సిస్టం" అత్యంత ప్రాధాన్యమైంది. దీన్నే అక్కడ "సంభావనా విధానం" గా, "పోషక విధానం" గా (పాట్రనేజ్ సిస్టం) పిలుస్తారు. ఈ విధానం ప్రకారం, అధ్యక్ష-ఇతర ఎన్నికలలో గెలిచిన అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికలలో వారి విజయానికి కృషిచేసిన తమ పార్టీకి చెందిన ఓటర్లలో కొందరికి, వివిధ స్థాయి ప్రభుత్వ ఉద్యోగాలలో నియమిస్తారు. ఒక్కోసారి తమకు వ్యతిరేకంగా పనిచేసినా, తమతో పోటీ చేసి ఓడిపోయినా, తమ-తమ అవసరాలకు అనుగుణంగా భవిష్యత్‍లో పనిచేస్తారన్న నమ్మకంతో, పదవులను కట్టబెడతారు. ఇలా పదవులను తమ వారికి కట్టబెట్టడంలో "మెరిట్" విధానానికి స్వస్తి పలకడం, తమకు అనుకూలురని భావించినవారికి మాత్రమే ఒక "బహుమానం" గా, ఇవ్వడం సాంప్రదాయం. ఇది అక్కడ అందరూ చేస్తుండే పనే. ఏ పార్టీ కూడా దీనిని ఆక్షేపించదు. "స్పాయిల్స్" అంటే "దోపిడీ ధనం" అని అర్థం. "గెలిచిన వాడిదే ఓడిపోయిన శత్రువుకు చెందిన దోపిడీ ధనం"  అని ఈ విధానానికి నిర్వచనం చెప్తూ, 1828 అధ్యక్ష ఎన్నికలలో డెమొక్రాట్ అభ్యర్థి జాక్సన్ విజయాన్ని పురస్కరించుకుని నాటి న్యూయార్క్ సెనేటర్ విలియం మెర్సీ వ్యాఖ్యానించారు. వారసత్వ పరంపరగా అధికారంలోకి వచ్చే ఆటవిక జాతుల, రక-రకాల నియంతృత్వ పోకడల ప్రభుత్వాలున్న దేశాలలో కూడా ఈ విధానం అమలులో వుంది. ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే అమెరికాలో ఇదెందుకు అమల్లో వుందో అర్థంకాదు. అమెరికాలో అమల్లో వున్న ఈ పోషక విధానం, కేవలం చిన్న ఉద్యోగాలకే పరిమితం కాకుండా, అత్యంత ఉన్నత స్థాయి ఉద్యోగాల విషయంలో కూడా జరుగుతుంటుంది. ఇప్పుడదే జరిగింది సమాచార హక్కు చట్టం కమీషనర్లుగా ఎంపిక చేసిన వారి విషయంలో.

సామాన్యుల, ఆ మాటకొస్తే, అసామాన్యుల చేతికి సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధం లాంటిది. 2005 లో భారత పార్లమెంటు తెచ్చిన ఈ చట్టం అమలులో కొన్ని అవకతవకలున్నా, కొన్ని రాష్ట్రాలలో కొంత నిర్లిప్తత వున్నా, దేశవ్యాప్తంగా దాని పనితీరు గమనిస్తే, అంత నిరాశాజనకంగా అనిపించదనే అనాలి. భారతదేశంలోని ప్రతి పౌరుడి కీ, "పబ్లిక్ అథారిటీ" గా నిర్వచించిన ప్రతి సంస్థ-వ్యవస్థ నుండి, ఆచరణాత్మకంగా-అనుభవ పూర్వంగా, తమకు కావాల్సిన ఎలాంటి సమాచారాన్నైనా, ఒక క్రమపద్ధతి ప్రకారం రాబట్టుకొనే హక్కు కలిగించిందీ చట్టం. ప్రతి పబ్లిక్ అథారిటీ పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేసేందుకు వీలు కలిగించిందీ చట్టం. సమాచార హక్కు చట్టం అమలును సులభతరం చేయడానికి నిర్దేశించిన అనేక విధై విధానాలలో అత్యంత ప్రాముఖ్యమైంది కేంద్ర స్థాయిలో, రాష్ట్రాల స్థాయిలో "సమాచార కమీషన్ల" ఏర్పాటు. వాటితో నిబద్ధతతో పని చేయించడానికి పది మందికి మించకుండా సమాచార కమీషనర్ల-ఒక ప్రధాన సమాచార కమీషనర్ నియామకం. చట్టంలో పబ్లిక్ అథారిటీ అంటే ఏమిటో, సమాచారం అంటే ఏమిటో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ప్రజాస్వామ్య-లౌకిక-సామ్యవాద-సార్వభౌమాధికార గణతంత్ర దేశంలో ఇవన్నీ పది కాలాల పాటు మనుగడ సాగించడానికి, భారత పౌరుడికి, తాను కోరుకున్న ప్రభుత్వ సమాచారం అందుబాటులోకి తేవాలన్న ఆకాంక్షే సహ చట్టం తేవడానికి కారణం. అవినీతి తొలగాలంటే, పాలితులకు ప్రభుత్వం బాధ్యతాయుతంగా పాలన అందివ్వాలంటే, సహ చట్టం, త్రి కరణ శుద్ధిగా అమలు కావాలి. ఈ నేపధ్యంలో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, సహ చట్టం రాక ముందు-వచ్చిన తరువాత ప్రభుత్వేతర పరంగా గణనీయమైన ప్రగతి సాధించినప్పటికీ, ప్రభుత్వ పరంగా, కుంటి నడక నడుస్తుందనడంలో సందేహం లేదు. అల నాడు దివంగత ముఖ్యమంత్రి ఒక రిటైర్డు ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా, రాజకీయాలతో ప్రత్యక్షంగానో-పరోక్షంగానో సంబంధం వున్న మరో ఇద్దరిని కమీషనర్లుగా, ఒక యువ పాత్రికేయుడిని ఇంకో కమీషనర్‌గా నియమించింది. వారి పని తీరు గురించి ఎవరి విశ్లేషణ వారే చేసుకోవచ్చు. మొత్తం మీద అంతో-ఇంతో సహ చట్టం అమలు మాత్రం జరిగిందనాలి.

రాజశేఖర రెడ్డి నియమించిన వారి పదవీ కాలం ముగిసిన తరువాత ఇంకా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ అధికారిగా, బాధ్యతాయుతమైన పదవిలో వున్న మరో ఐఏఎస్ అధికారిని ప్రధాన కమీషనర్‌గా నియమించింది ప్రభుత్వం. అప్పట్లో అది వివాదాస్పదమైంది కూడా. ఆయనకు తోడుగా మరెవ్వరినీ నియమించక పోవడంతో గత కొద్ది కాలంగా కుంటి నడక నడుస్తున్న కమీషన్‌కు పూర్తి స్థాయిలో కమీషనర్ల నియామకం జరగాలని హైకోర్టు సూచించడంతో, ఆ ప్రక్రియను లాంఛనంగా పూర్తి చేసింది ప్రభుత్వం. ఒక రిటైర్డ్ ఐఎఫ్ఎస్‌ అధికారిని, మరో రిటైర్డ్ ఐపిఎస్‌ అధికారిని, అంతంత మాత్రంగా అతి కొద్ది సర్క్యులేషన్‍తో నడుస్తున్న ఒక దినపత్రిక సంపాదకుడిని, ఒక న్యాయవాదిని, (రాజకీయ) సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూన్న మరొకరిని, మరో (రాజకీయ) న్యాయవాదిని,  (రాజకీయాలలో వున్న) రిటైర్డ్ సివిల్‌ జడ్జిని,  విద్యావేత్తగా పిలిపించుకుంటున్న ఇంకొకరిని, పదవిలో వున్న ఒక ఐపిఎస్‌ అధికారిని  కమిషనర్లుగా నియమించారు. దీనికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. వ్యక్తిగతంగా వీరందరూ పలుకుబడి కలిగిన వారే. కాని, సమాచారహక్కు చట్టం ఇలాంటి వారిని ఎంపిక చేయమని చెప్పలేదే! మరెందుకిలా జరిగింది? అందుకే దీనిని "అమెరికా తరహా స్పాయిల్స్ సిస్టం" అనాలి.

ఇంతకూ సహ చట్టం ఈ విషయంలో ఏం చెప్తోంది? మొదటిది: కేంద్రంలోను, రాష్ట్రాలలోను సమాచార కమీషన్ల ఏర్పాటు జరగాలి. రెండోది: ఆయా స్థాయిలలో ఒక ప్రధాన కమీషనర్‌ను, పది మందికి మించకుండా కమీషనర్లను నియమించాలి. మూడోది: ఈ సమాచార కమీషన్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి వుండాలి. మరే ప్రభుత్వ సంస్థ నుంచి కూడా ఎలాంటి అధికారిక ఆదేశాలను-నిర్దేశాలను పాటించాల్సిన అవసరం లేదు. నాలుగోది: ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి, పేరు-ప్రఖ్యాతులు తెచ్చుకుని ప్రసిద్ధి చెందిన వారే కమీషనర్ల పదవులకు అర్హులు. అదనంగా, న్యాయ శాస్త్రంలో, విజ్ఞాన-సాంకేతిక శాస్త్రాలలోసామాజిక రంగంలో, యాజమాన్య రంగంలో, పాత్రికేయ వృత్తిలో, మాస్ మీడియా రంగంలో, పరిపాలనా రంగంలో, గవర్నెన్సులో నిష్ణాతులై వుండాలి. ఆయా రంగాలలో కేవలం "ప్రవేశం" కాకుండా, "ప్రావీణ్యం" వుండి తీరాలి. ప్రసిద్ధి చెందిన వారై వుండాలి. పార్లమెంటు ఉభయ సభలలో సభ్యులై వుండరాదు. ఏ "రాజకీయ పార్టీతో ను" సంబంధం వుండకూడదు.
అలాంటప్పుడు కేవలం ఒక పునరావాస కేంద్రంగా, ఏదో ఇతర నామినేటెడ్ పోస్టులను కట్టబెట్టినట్లుగా, సమాచార హక్కు చట్టంతో ఎలాంటి సంబంధం ఎన్నడూ ఏ విధంగా లేనటువంటివారిని, పదవీ విరమణ చేసిన వారిని, చేయడానికి సిద్ధంగా వున్న వారిని, రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం వున్న వారిని, రక-రకాల ఒత్తిడులకు లొంగి ఇలా సమాచార కమీషనర్లను నియమించడం ప్రభుత్వానికి ఎంతవరకు సమంజసం?. కిరణ్ కుమార్ రెడ్డి చేస్తుంటే ఎలా ప్రతి పక్ష నాయకుడు అంగీకరించాడు? విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల ఎంపిక ఎంతో రసాభాస చేసిన గవర్నర్ ఆమోద ముద్ర  ఎలా వేశారు? End
(Added on 22-02-2012: (ఎనిమిదిని సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఎంపిక చేయగా, ఆ నిర్ణయానికి ప్రతిపక్షనేత మద్దతు ఇచ్చీ-ఇవ్వనట్లు వుండగా, వారిలో నలుగురు ఈ పదవులకు అర్హులు కాదంటూ గవర్నర్ నరసింహన్ ఫైలును తిప్పి పంపారు. తాంతియా కుమారి, ముత్తంశెట్టి విజయ నిర్మల, వర్రె వెంకటేశ్వర్లు, ఇంతియాజ్ అహ్మద్‌ల నియామకం విషయంలో పునః పరిశీలన అవసరమని స్పష్టం చేశారు. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రతన్, మాజీ ఐఎఫ్ఎస్ మధుకర్‌రాజు, సీనియర్ జర్నలిస్టు విజయబాబుల ఎంపిక విషయంలో గవర్నర్ అభ్యంతర పెట్టలేదు. సమాచార కమిషన్‌లో పార్టీలతో సంబంధం ఉన్న వారికి చోటు దక్కడంపై విమర్శలు వెల్లువెత్తిన నేపధ్యంలో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు).