Showing posts with label అనుపమ గీతాల తిలక్. Show all posts
Showing posts with label అనుపమ గీతాల తిలక్. Show all posts

Wednesday, September 29, 2010

కమ్యూనిస్టు గాంధి-దెందులూరు పెద్దింటివారి కె.బి.తిలక్ : వనం జ్వాలా నరసింహా రావు

(ఆంధ్ర ప్రభ దినపత్రిక 29-09-2010)
(సూర్య దినపత్రిక 29-09-2010)
వనం జ్వాలా నరసింహా రావు
పాతికేళ్లుగా పరిచయమున్న తిలక్ మరణ వార్త (23-09-2010) తెలిసినప్పటినుంచి, ఆయన జ్ఞాపకాలు పదే-పదే గుర్తుకొస్తున్నాయి. "తిలక్ జ్ఞాపకాలు" శీర్షికతో "ప్రజాతంత్ర" వారపత్రికలో పది సంవత్సరాల క్రితం అయనను గురించి రాసే రోజుల నాటి సంగతులు మరీ గుర్తుకొచ్చాయి. పత్రిక తాజా సంచిక మార్కెట్లోకి వచ్చిన ప్రతిసారీ, ఆ శీర్షికపై కొంత చర్చ జరిగే ది. సినిమాలకు సంబంధించిన "తిలక్ జ్ఞాపకాల"పై కొందరు స్నేహితులు ఏకీభవించడం, మరికొందరు విభేదించడం జరిగే ది. చర్చలో పాల్గొన్న వారిలో దేవులపల్లి అమర్, డి. వెంకట్రామయ్య, చలసాని ప్రసాదరావు, భండారు శ్రీనివాసరావు, ఆర్.వి.వి. కృష్ణారావు...తదితరులుండే వారు. చలసాని తాను చెప్పదల్చుకున్నవి కాగితంపై రాస్తే అందరం చదివేవాళ్లం. ఒకానొక సందర్భంలో ఆయన ఆ జ్ఞాపకాలను "తిలకాష్ట జీవన బంధనం" పేరుతో పుస్తకంలాగా ప్రచురించమని సలహా కూడా ఇచ్చారు. చివరకు, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం వారు దాన్ని ప్రచురించారు. కాకపోతే సీరియల్‌గా రాసినవన్నీ అందులో లేవు. కేవలం సినిమాలకు సంబంధించినంతవరకే ఆ పుస్తకం పరిమితమయింది. వాస్తవానికి తిలక్ ని సినిమాలకు మాత్రమే పరిమితం చేయడం సమంజసం కాదు. ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి.

తిలక్‌ను చూడగానే పదహారణాల కాంగ్రెస్ నాయకుడన్న భావన కలుగుతుంది. ఆయన పార్లమెంటు భవనంలోకి పాస్ లేకుండా వెళ్లగలిగేవారన్న విషయం చాలామందికి తెలియదు. ఆయనలా లోనికి వెళుతుంటే పార్లమెంటు సభ్యుడనుకునేవారు. హైదరాబాద్‌కు వచ్చేంతవరకు ఆయనో సినిమా మనిషి. ఇక అక్కడినుంచి ఒక మానవతావాదిగా, సామాజిక కార్యకర్తగా, ఉద్యమకారునిగా, స్వాతంత్ర సమరయోధుల్లో ఒకడిగా, చిన్నల్లో చిన్నగా, పెద్దల్లో పెద్దగా....ఒక్కొక్కరికి ఒక్కొక్క అవతారంలో కనిపించేవాడు-అనిపించేవాడు. అవతారం ఏదైనా, అనుకున్నది సాధించేంతవరకు అలుపనేది లేకుండా సాగిపోవడం ఆయన నైజం. సినిమా కార్మికుల బాధా మయ గాథలు విని-చలించి, వారికోసం రంగంలోకి దిగిన సందర్భంలోను, "గాంధి" సినిమా విషయంలో భారతీయులకు న్యాయం చేకూర్చడానికి చేసిన న్యాయపోరాటంలోను. రాజభవన్ ప్రాంగణంలో కుముద్ బెన్ జోషి గవర్నర్‌గా వున్నప్పుడు తక్కువ ధర చేసే "డోమ్ హౌజ్" నిర్మాణం చేపట్టడంలోను, ఇండో-పాకిస్తాన్ మైత్రి సంబంధమైన కార్యక్రమాల నిర్వహణలోను, "ట్విన్సీ క్లబ్" స్థాపనలోను, కార్య దక్షతకు తిలక్ పర్యాయపదంగా వుండేవాడు. టీవీ ఛానళ్లు రాక పూర్వమే, ఏ రోజు వార్తలను ఆరోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ప్రయత్నం అద్భుతం. పాతరోజుల్లో తన మేధస్సు మధించిన అపురూపమైన చిత్రాలతో ప్రత్యేకించి తెలుగు చిత్ర రంగాన్ని, కొంత మేరకు హిందీ చలన చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన మహనీయుడాయన. ఆయన్ను మొదట్లో తక్కువ అంచనా వేయడం మా లాంటి వారి అజ్ఞానం.

అనుపమ చలన చిత్ర దర్శక నిర్మాతగా, స్వాతంత్ర్య సమరయోధునిగా, సామాజిక సేవకునిగా తిలక్ చాలామందికి సుపరిచితుడే. కాకపోతే ఆయన్ను గురించి తెలియని విషయాలూ ఎన్నో వున్నాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న తిలక్‍ జైలు జీవితం గడిపినప్పుడు ఎదురైన అనుభవాలు చెప్పినప్పుడు చలించిపోయాడు. దానికి కారణం ఆయన పడ్డ బాధలు కాదు. తోటి ఖైదీల బాధలు తీర్చలేని పరిస్థితిలో తానున్నందున. తిలక్ వున్నది "సింపుల్ ఇంప్రిజన్మెం ట్ సెల్" కాగా, పక్కనే, అచిర కాలంలో ఉరి శిక్షకు గురి కాబోయే వారి నుంచే "కన్డెమ్డ్ ఇంప్రిజన్మెంజట్ సెల్" వుండేదట. అందులో శిక్షను అనుభవించేవారు, తాము ఎదుర్కొన బోయే పరిస్థితిని తలచుకుని, రాత్రిళ్లు భోరున విలపిస్తుంటే, తిలక్ వాపోయేవాడు. ఖైదీలు, విసర్జించిన తమ మూత్రాన్ని కుండల్లో పట్టుకుని, జైలర్ అనుమతిచ్చినప్పుడు బయట పార పోయడం ఘోరంగా వుండేదనేవారు. తాము తినడానికి జైలు భోజనం ఏ మాత్రం అనువైంది కాదని కూడా అనేవారు. విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని వాడ వాడలా ప్రచారం చేసారు.

ముదిగొండ జగ్గన్న శాస్త్రి పరిచయంతో ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడైన తిలక్, అతివాద భావాల కళాకారులతో చేతులు కలిపాడు. నాటకాలు వేయడం, వేయించడం, డప్పులు వాయించడం, ప్రజానాట్యమండలి విప్లవ గీతాలను ఆలపించడం, వూరూరా తిరగడం చేసేవాడు. "పెద్దింటి వాళ్లం-తప్ప తాగి వచ్చి డప్పు కొట్తున్నాం-తప్పుకోండి" అంటూ కొంటెగా జానపద గీతం ఆలపిస్తుంటే, ప్రజల స్పందన విపరీతంగా లభించేదట. మేనమామ ఎల్వీ ప్రసాద్ బొంబాయి లో వుంటున్నందున తిలక్ అక్కడకు చేరుకున్నప్పటికీ, ఆయనలో అంతర్లీనంగా వున్న స్వతంత్ర సమరాభిలాష కొనసాగింది. అక్కడి "పీపుల్స్ థియేటర్" లో చేరి, బాలరాజ్ సహాని, రొమేష్ థాపర్ లాంటి వారితో సాన్నిహిత్యం పెంచుకున్నారు. వామపక్ష భావాల వారి కలయికకు వేదికైన "ఒపేరా హౌజ్" సినిమా టాకీస్ లో జరిగే "ప్రజానాట్యమండలి" సమావేశాలకు హాజరయ్యేవారు. తెలుగు విభాగం ఇన్-చార్జ్ గా కూడా వుండేవారు తిలక్. మిలిటరీ క్లబ్బులకు తంబోలా కూపన్లు అమ్మడం, ఎల్వీ ప్రసాద్ బాతు గుడ్ల వ్యాపారంలో పనిచేయడం ద్వారా నాలుగు డబ్బులు సంపాదించుకునేవారు. బాతు గుడ్ల వ్యాపారం వల్ల బొంబాయి లోని తెలుగు కార్మికులకు, కూలీలకు దగ్గరయ్యారు. ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక "పీపుల్స్ వార్" కు పేపర్ బోయ్ గా పనిచేశారు. అలా కమ్యూనిస్టు పార్టీ వారితో సంబంధాలు పెట్టుకున్నారు. బొంబాయిలో వున్న రోజుల్లోనే, దిన ఖర్చుల కొరకు అదనంగా, నర్సాపూర్ లేసులను మార్కెటింగ్ చేశారు. స్వల్ప మొత్తంలో తనకవసరమైన ఆర్థిక వనరులను కష్టపడి సమకూర్చుకునే తిలక్‌కు ఒకరిపై ఆధారపడి జీవించడం ఎంతమాత్రం ఇష్టముండేది కాదు.

మాజీ మంత్రి స్వర్గీయ పరకాల శేషావతారంతో కలిసి యూత్ లీగ్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, బాలానందం సంఘం స్థాపించారు. యూత్ లీగ్ బృందం సభ్యులతో కలిసి, రైల్వే ప్లాట్ఫాిమ్ల పై దొరికే అశ్లీల సాహిత్యంపై సమర భేరి మోగించారు. అలాంటి పుస్తకాల అమ్మకాలను వ్యతిరేకిస్తూ "అరసం" తరహా ఉద్యమానికి ఆ రోజుల్లోనే నాంది పలికారు. అంతటితో ఆగకుండా, అశ్లీల సాహిత్యం చదవకుండా, తమవంతు కర్తవ్యంగా యూత్ లీగ్ చక్కటి సాహిత్యం సేకరించి చదివించేవారు. పోరాట పటిమను, ఉద్యమ స్ఫూర్తిని నీరు కార్చే ప్రయత్నాలు ఆ రోజుల్లో కూడా జరిగేవనడానికి ఉదాహరణగా, అప్పటి పశ్చిమ గోదావరి కలెక్టర్ శేషాద్రి తనను తోటి సమరయోధుల నుంచి విడదీసే ప్రయత్నం ఎలా చేసింది వివరించారు. ఎక్కడున్నా, ఏం చేసినా, స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రత్యక్ష-పరోక్ష సంబంధాలను కొనసాగించే తిలక్, జైలు నుంచి విడుదలై వస్తుండే ఉద్యమకారులను కలుసుకొని, మూడో కంటికి తెలియకుండా, అజ్ఞాతవాసానికి తరలించేందుకు దోహద పడేవాడు. కమ్యూనిస్టు పార్టీ అజ్ఞాత కార్యకలాపాల కోఆర్డినేటర్ ఎస్వీ నరసయ్య కాంటాక్ట్ పాయింట్‌గా వుండేవారు. ఒక పర్యాయం కామ్రేడ్ మద్దుకూరు చంద్రశేఖర రావును, మరో కమ్యూనిస్టు అభిమాని శాస్త్రి కారులో మద్రాస్ నుండి బెంగుళూరు తీసుకెళ్లి, అక్కడినుంచి మారు పేర్లతో విమానంలో హైదరాబాద్ కు చేర్చారు తిలక్. హైదరాబాద్ రాష్ట్రంలో అప్పట్లో కమ్యూనిస్టు పార్టీపై నిషేధం వుంది. మద్దుకూరును కామ్రేడ్ గోళ్ల రాధాకృష్ణమూర్తికి అప్పగించారు. అదీ ఆయన ఉద్యమ స్ఫూర్తి.
తెలంగాణ విమోచన ఉద్యమం ఊపందుకుంటున్న రోజుల్లో, కమ్యూనిస్టు పార్టీతో సహా, ఉద్యమ నిర్మాణ-నిర్వహణలో కీలకపాత్ర వహిస్తున్న ప్రజానాట్యమండలిపైనా నిషేధం వుండేది. నిషేధం నీలినీడల్లో తిలక్‌తో సహా పలువురు ప్రజానాట్యమండలికి చెందిన వారు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారు. సాంస్కృతిక విభాగానికి చెందిన సుంకర, వాసిరెడ్డి, తుమ్మల, రాంభట్లలు; భవిష్యత్ సినీ దిగ్గజాలైన తాతినేని, వీరమాచనేని, మిక్కిలినేని, చదలవాడ, రాంకోటి, కోగంటి వారిలో ప్రముఖులు. వీరందరికీ తిలక్‍ ద్వారా ఎల్వీ ప్రసాద్ మద్రాస్‌లో కొంత ఆధారం ఏర్పాటుచేయడంతో పాటు, కొంతకాలం ఆంధ్ర ప్రజానాట్యమండలి అధ్యక్షునిగా పనిచేశారు. పీసీ జోషి కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీగా వున్న రోజుల్లో, సర్కారు జిల్లాల్లోని ఎగువ మధ్య తరగతి కుటుంబాల వారు చాలామంది పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. ఒకే ఇంట్లో కాంగ్రెస్, కమ్యూనిస్టు అభిమానులుండడంతో ప్రతి ఇంటిపైనా ఇరు పార్టీల జండాలెగిరేవట. వారిలో చాలామంది ప్రజానాట్యమండలితో సంబంధాలు పెట్టుకుని, మద్రాసుకు వచ్చి స్థిరపడ్డారని చెప్పిన తిలక్, వారిలో పలువురు "క్యాపిటలిస్టులు" గా మారిపోయారని విచారం వ్యక్తంచేశారు. ప్రజానాట్యమండలి కళాకారులందరినీ ఒక వేదికపై తేవడానికి శాంతినికేతన్ లో విద్యనభ్యసించిన సి.వి.వి.ఆర్. ప్రసాద్, ఆయనతో పాటు ఎస్వీ నరసయ్య కృషిచేశారని అనేవారు తిలక్. అలా అభ్యుదయ కళాకారులందరూ ఒకే వేదికపై జమ కూడడం వల్లే, భవిష్యత్‌లో సినీరంగ అభివృద్ధికి పరోక్షంగా ఒక కీలక ఘట్టానికి నాంది పలికిందంటారు తిలక్.

వైభవంగా హైదరాబాద్‌లో జరిగిన "రోజులు మారాయి" సినిమా శత దినోత్సవ వేడుకలు, నగరానికి తెలుగు చలన చిత్ర పరిశ్రమ తరలి రావడానికి, మొట్టమొదటి సినీ స్టూడియో నిర్మాణానికి దారితీసిన చారిత్రాత్మక సంఘటన అనేవారు తిలక్. ఆ వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన అప్పటి రాష్ట్ర మంత్రి స్వర్గీయ కొండా వెంకట రంగారెడ్డి, నగరం సాహితీ-సంస్కృత రంగాలలో అభివృద్ధి చెందాలంటే, చలన చిత్ర రంగ ప్రముఖులు కలిసి కట్టుగా కృషిచేయాలని తన ఉపన్యాసంలో చెప్పారట. ఆయన సూచన మేరకు, రోజులు మారాయి యూనిట్ ప్రముఖులందరూ కలిసి కట్టుగా ఆలోచించి సారధీ స్టూడియో నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించడం, అచిర కాలంలోనే అమీర్‌పేటలో అది రూపుదిద్దుకోవడం జరిగింది. స్టూడియో నిర్మాణానికి స్థలం కావాలని (ఇప్పటి లాగా) ప్రభుత్వాన్ని కోరలేదప్పుడు. ప్రయివేట్ వ్యక్తుల దగ్గర కొన్న భూమిలో స్టూడియో నిర్మాణం, దానికి కొంత దూరంలో-ఖైరతాబాద్ సమీపంలో సారధి యూనిట్ కళాకారులందరూ నివసించడానికి ఇళ్ల స్థలాలు కొనుక్కునే ఏర్పాటు జరిగింది. విశ్వ విఖ్యాత నటసార్వభౌములను, నటసామ్రాట్టులను, పద్మశ్రీలను, పద్మభూషణ్‌లను ఆ స్టూడియో అందించినప్పటికీ, సినీ కాల గమనంలో ఎవరికివారే వేరై, ఎవరి "సినీ కుంపటి" వారే పెట్టుకోవడం తననెంతో కలచివేసిందనేవారు తిలక్.

ఆంధ్ర రాష్ట్రం కొరకు మద్రాసులోని మైలావూర్‌లో పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షను గుర్తుచేసుకున్న తిలక్ "ఆయన్ను బలిచేశారు" అనేవారు. అప్పట్లో మద్రాస్ టీనగర్లోని సినీ నటుడు చంద్రమోహన్ మామగారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ గాలి బాలసుందర రావు ఇంట్లో జరిగే రాజకీయ సమావేశాలకు తిలక్ క్రమం తప్పకుండా హాజరయ్యేవారు. అక్కడే పద్మశ్రీ డాక్టర్ పి. తిరుమల రావుతో, బులుసు సాంబమూర్తితో పరిచయమైంది. తిలక్ తన కుర్ర కారు గాంగును వెంట పెట్టుకుని, కనిపించిన ప్రతినాయకుడి ఇంటికి వెళ్లి, శ్రీరాములు నిరాహార దీక్షను విరమింపచేయమని ఒత్తిడి తెచ్చేవారు. ఆయనొక్కరే ఎందుకు బలి కావాలని వాదించేవారు. అప్పట్లో తిలక్ నివాసం టంగుటూరు ప్రకాశం పంతులు పెద్ద కొడుకు ఇంటి ఆవరణ వెనుక నున్న ఒక కారు షెడ్డు. ప్రకాశం భోలా మనస్తత్వాన్ని, ఆయనతో తన భేటీని గుర్తుచేసుకుంటూ, ఒకనాడు ఆయన ఇండియన్ రిపబ్లిక్ పత్రిక కార్యాలయంలో కారు దిగుతుండగా ఘెరావ్ చేసిన విషయం చెప్పారు. అప్పటికి పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగానికి మరి కొన్ని గంటల వ్యవధి మాత్రమే వుందట. తిలక్ తనను పట్టుకుని లాగుతుంటే ప్రశ్నించిన ప్రకాశంకు, పొట్టి శ్రీరాములును అందరూ కలిసి బలిదానం చేస్తుంటే తాను పిచ్చివాడినైపోయానని జవాబిచ్చాడు. ప్రకాశం లాంటి గుండే ధైర్యం వున్న మనిషి కూడా ఆ సమయంలో తనను ఏం చేయకపోవడం ఆయన గొప్పతన మంటారు తిలక్.

ఇలా గుర్తు తెచ్చుకుంటూ పోతుంటే తిలక్ జ్ఞాపకాలు, తిలక్ తో పరిచయం అయిన తర్వాత జ్ఞాపకాలు ఎన్నో గుర్తొస్తుంటాయి. ఆయన చనిపోయిన నాలుగో రోజున జన చైతన్య వేదిక సంతాప సభ ఏర్పాటుచేసింది. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి డాక్టర్ గీతారెడ్డి, సిపిఎం నాయకుడు బివి రాఘవులు, రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక మండలి అధ్యక్షుడు రమణమూర్తి ప్రభృతులు వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. సమాజంపై తనదంటూ విభిన్నమైన ముద్ర వేసిన తిలక్ భావి తరాల వారికి స్ఫూర్తి దాతగా నిలుస్తారని అంటూ, గీతారెడ్డి, తనకు "రాజకీయ ఆరంగేట్రం" చేయించిన గురువు గారు తిలక్ అని చెప్పారు. ఆయన ఆనాడు రూపొందించిన "భారత రత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో తనకు ఇందిరా గాంధి పాత్రను ఇవ్వడం వల్లే తనకు అమితమైన ప్రాచుర్యం వచ్చిందని, అది తాను రాజకీయంగా ఎదగడానికి దోహద పడిందని అన్నారు. సినీరంగంలో వున్న ప్రతి వ్యక్తి ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. "కామ్రేడ్ తిలక్" అని ఆయనను సంభోదిస్తూ ప్రసంగం చేసిన రాఘవులు, జీవితాంతం ప్రజా ధర్మం కొరకు పోరాడిన తిలక్ తనకు "కమ్యూనిస్టు కోణం" లోనే తెలుసన్నారు. వామ పక్ష ఐక్యత కొరకు అహర్నిశలు కృషిచేసిన తిలక్, ఎప్పుడూ గట్టి ప్రతిపక్షం, అదీ వామపక్ష ప్రతిపక్షం వుండాలని కోరుకునేవారని గుర్తుచేసుకున్నారు.

అన్ని రాజకీయ పార్టీల వారు, తిలక్ తమ వాడే అనడం ఆయన గొప్పదనానికి నిదర్శనం. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో "పెద్దింటివారు" అని పిలువబడే కుటుంబంలో జన్మించిన కొర్లిపర బాలగంగాధర తిలక్ను "కమ్యూనిస్టు గాంధి" అనడం సమంజసమేమో!

Friday, September 24, 2010

మానవతావాది మన కె. బి. తిలక్ : వనం జ్వాలా నరసింహారావు

మానవతావాది మన కె. బి. తిలక్
వనం జ్వాలా నరసింహారావు
("అనుపమ గీతాల తిలక్" పుస్తక రచయిత)
ఖమ్మం నుంచి కారులో వస్తుంటే, పాతికేళ్ళుగా పరిచయమున్న ఆత్మీయుడు తిలక్ మరణించాడన్న వార్త తెలిసింది. నమ్మలేని నిజం. వారం రోజుల క్రితమే, ఎప్పటిలాగా, ఆయనతో ఫోనులో మాట్లాడినప్పుడు, డాక్టర్ రంగారావును తీసుకొని ఒక సారి రమ్మని అడిగారు. ఇంతలో మా బావ గారు చనిపోవడంతో ఖమ్మం వెళ్లాల్సి వచ్చింది. కలవడం ఆలస్యమయింది. నే నొచ్చేటప్పుడు, ఇటీవల స్థానిక దినపత్రికలో ఆయన గురించి వచ్చిన ఆర్టికల్ కాపీని కూడా తీసుకురమ్మని చెప్పారు. ఆయన్ను కలవలేకపోయానని-అడిగిన పని చేయలేకపోయానని విచారపడుతుంటే పలువురు ఉమ్మడి స్నేహితుల దగ్గర్నుంచి ఫోన్లొచ్చాయి. చనిపోయిన తిలక్ గారి మొబైల్ కు ఫోన్ చేస్తే, ఆయన డ్రైవర్ రిసీవ్ చేసుకున్నారు. ఆసుపత్రిలో ఐదు రోజుల క్రితం చేర్పించిన సంగతి చెప్పి, ఎలా చనిపోయింది వివరించారు. శాన్ ఫ్రాన్సిస్కో లో వున్న తిలక్ కుమారుడు లోకేష్ కు ఫోన్ చేసి అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని తెలుసుకున్నాను.

గవర్నర్ కుముద్ బెన్ జోషి ఆధ్యక్ష్యతనున్న "చేతన" స్వచ్చంద సంస్థలో పనిచేస్తున్న రోజుల్లో మొట్టమొదటి సారి రాజ్ భవన్ లో తిలక్ ను కలిసినప్పుడు, ఆయన వ్యవహార శైలి చూసి, అదోరకమైన మనిషి అనిపించాడు. ఆయన అనుకున్న పని సాధించే దాకా, ఆ ఒక్క లక్ష్యం గురించి తప్ప మరేదీ ఆయన ప్రస్తావించడు. అదో రకమైన పిచ్చి అనుకునేవాడిని. పరిచయం పెరిగినా కొద్దీ, ఆయన లాంటి మహా మనిషితో స్నేహం చేస్తున్నందుకు చాలా గర్వంగా వుండేది. ఎల్లప్పుడు, తెల్లటి ఖద్దరు దుస్తులు మాత్రమే వేసుకునే ఆయన్ను చూసి చాలామంది ఆయన్ను కాంగ్రెస్ పార్టీ వాడనుకునేవారు. స్వాతంత్ర్యోద్యమ రోజుల్లో ఆయన పాత్ర తెలిసినవారు మాత్రం ఆయన్ను అసలు-సిసలైన కమ్యూనిస్ట్ అంటారు. అబ్బే...ఇవన్నీ కాదు..ఆయన కేవలం ఒక సినిమా మనిషేనంటారు మరికొందరు. నిజానికి ఇవన్నీ ఆయనకు వర్తిస్తాయి. సీదా-సాదాగా తిరుగుతూ, అందరినీ పలకరిస్తూ, చిన్నల్లో - చిన్నగా, పెద్దల్లో-పెద్దగా అందరితో కలుపుగోలుగా తిరిగే ఆ "కొర్లిపర బాలగంగాధర తిలక్" - కె. బి. తిలక్ మానవతావాది. ఎక్కడ సాంఘిక దురాచారాలున్నాయో... అక్కడ వాటికి వ్యతిరేకంగా, ఏ మాత్రం ప్రచారం లేకుండా, పోరాడేవారిలో ఆయన ముందుండేవారు. సినీ కార్మికుల బాధా మయ గాధలకు స్పందించి ఆయన చేసిన అవిశ్రాంత కృషే అందుకు ఒక చక్కటి ఉదాహరణ.

అతి కొద్ది రోజుల్లోనే ఆయనలోని అరుదైన వ్యక్తిత్వం, పట్టుదల, ఏకాగ్రత అర్థం కాసాగాయి. ఇందిరాగాంధి హత్యా మరణం తర్వాత, ఆయన రూపొందించి, హైదరాబాద్ తో సహా పలు నగరాల్లో ప్రదర్శించబడిన "భారతరత్న ఇందిరమ్మ" రూప వాణి కార్యక్రమంలో ఆయన చేసిన "మేథా పరమైన కృషి” ని గమనించిన నాకు ఆయనొక అసామాన్యుడనిపించింది. ఆయన్ను గురించి తెలిసిన వారికి-తెలియని వారికి, మరింత తెలియచేయాలన్న కోరిక కలిగింది. వారానికి ఒక్క సారి మార్నింగ్ వాక్లోవ మా ఇంటికి వచ్చిన తిలక్‌ను మాట్లాడించి, ఆయన స్వయంగా వెల్లడించిన ఆయన జ్ఞాపకాలను, కాగితం పై పెట్టాను. 2006లో, తిలక్ గారి "అనుపమ" సంస్థ ఏభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, విలక్షణమైన వ్యక్తిత్వం కలిగిన తిలక్ జ్ఞాపకాలను, "అనుపమ గీతాల తిలక్" పేరుతో హాసం ప్రచురణలు పుస్తక రూపంలో తీసుకొచ్చారు.

పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించిన తిలక్ పిన్న వయస్సులోనే చదువుకు స్వస్తిచెప్పి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుగ్గా పాల్గొన్నారు. చిన్నతనంలో ఏలూరు మునిసిపల్ పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లడానికి, ప్రతి దినం ఆరు మైళ్లు నడవాల్సి వచ్చేది. సైకిల్ కొనేంత వరకు నడకే. ప్రతి వారం ఒక్కసారన్నా సైకిల్ ప్రతి పార్టునూ వేరుచేసి, మళ్లీ చేర్చడం తనకో హాబీ అనేవారు తిలక్. ఆయన స్వగ్రామంలోని మోతుబరి రైతు కొర్లిపర సుబ్బయ్య మనుమరాలు అన్నపూర్ణ, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వర రావు సతీమణి. దెందులూరులో అతివాద భావాల "యువజన సంఘం" స్థాపించినప్పుడు, దాని అనుబంధ సంస్థ "బాలానందం సంఘం" లో అన్నపూర్ణ గారిని సభ్యురాలిగా చేర్పించానని చెప్పారు. దత్తత వెళ్ళిన ఆమె బాబాయి వటపర్తి రామమోహన్ రావు దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పుస్తకాల సేకరణ అలవాటున్న తిలక్ అలా సంపాదించిన వాటితో వూళ్ళో గ్రంధాలయం కూడా ఏర్పాటుచేశారు చిన్నతనంలో. చిన్నతనంలో భక్త ప్లహాద నాటకంలో "నరసింహుడి" పాత్ర వేశారు తిలక్.

క్విట్ ఇండియా ఉద్యమంలో భీమడోలు దగ్గర రైలును ఆపడానికి పట్టాలను తొలగించేందుకు సిద్ధపడుతున్న ఆయన్ను-ఆయన మిత్ర బృందాన్ని నిర్బంధంలోకి తీసుకుంది ప్రభుత్వం. కొంతకాలం ఏలూరు సబ్-జైలులో వుంచి, తర్వాత రాజమండ్రి జైలుకు తరలించారు. జైలు జీవితం వివరించినప్పుడు, తన కష్టాల కన్నా, తోటి ఖైదీల బాధలు చెప్పి కంట తడి పెట్టే వారు తిలక్. ఆయన్ను నిర్బంధించిన సెల్ పక్కనే, ఉరి శిక్ష విధించబడి త్వరలో దాని అమలుకు గురి కాబడే ఖైదీల గురించి ఎన్నో విషయాలు చెప్పారాయన. ఆయన రోజులకు-ఆ తర్వాత రోజులకు, ఖైదీల పట్ల ప్రభుత్వ వైఖరిలో పెద్దగా మార్పు రాలేదని కూడా అనేవారు. ఆయన తోటి ఖైదీలలో గద్దె విష్ణుమూర్తి ఒకరు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కూడ. తిలక్ కుటుంబానికి చెందిన వారిని, వాళ్ల గ్రామంలో "పెద్దింటి వారు" అని పిలిచేవారట. తిలక్ జైలులో వుండగానే, వారి ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది అలనాటి బ్రిటీష్ ప్రభుత్వం. చిన్న నాటి విషయాలను గుర్తు చేసుకుంటూ, తిలక్, "విభజించి పాలించే ఆంగ్లేయుల సిద్ధాంతాన్ని" గ్రామ పెద్దలు-భూస్వాములు, తన వూళ్లో ఎలా ఆచరణలో పెట్టింది వివరిస్తూ, దళితుల మధ్య వివాదాలు పెట్టి పెత్తనం చేశేవారని అన్నారు. అందుకే, స్వతంత్ర భారతావనిలో, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా, కేవలం అలాంటి ఇతివృత్తాలే కథా వస్తువుగా అనేక చిత్రాలను నిర్మించారు-దర్శకత్వం వహించారు తిలక్. ఆ పరంపరలోనే, ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఏ, ఉయ్యాల జంపాల, భూమికోసం, కొల్లేటి కాపురం, ఛోటిబహు, కంగన్ లాంటి చిత్రాల రూపకర్తయ్యారాయన.

రాజమండ్రి జైలునుండి విడుదలైన తిలక్ "ఉషా మెహతా" స్వతంత్ర రేడియో ఉద్యమంలో పాల్గొని, అతివాద భావాల ప్రజానాట్యమండలి వైపు ఆకర్షితుడై నారు. తన జీవిత గమనానికి తానే బాధ్యుడని అప్పటికీ-ఇప్పటికీ నమ్మే తిలక్, తన పూర్వీకుల ఆస్తితో తనకు సంబంధం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టిచ్చి, మేనమామ ఎల్.వీ. ప్రసాద్ వద్దకు, మేనత్త వెంట బొంబాయికి చేరుకున్నారు. వెళ్లేటప్పుడు, కమ్యూనిస్ట్ యోధుడు చండ్ర రాజేశ్వరరావు నుంచి శ్రీపాద అమృత డాంగేకు తనను పరిచయం చేస్తూ రాసిన వుత్తరం పట్టుకెళ్లారు ముందు చూపుగా. సినీ పరిశ్రమలో అడుగిడేందుకు ప్రయత్నం చేస్తూనే, "పీపుల్స్ థియేటర్" ప్రముఖులైన బాలరాజ్ సహానీ, రొమేష్ థాపర్ లతో సాన్నిహిత్యం చేసుకున్నారు తిలక్. ఒపేరా హౌజ్ సినిమా టాకీసులో ప్రజానాట్యమండలి సమావేశాలకు హాజరయ్యేవారు. అలా తన స్వాతంత్ర్య సమరాభిలాషను కొనసాగించా రక్కడ. నేపధ్య గాయకుడు "డబ్ల్యు. ఎం. ఖాన్" తో, సింధీ కమెడియన్ "గోపి" తో పరిచయం చేసుకున్నాడు. ఆ పరిచయాలే ఆయన్ను సినీరంగంలోకి తెచ్చాయి. తన కాళ్లమీద తాను నిలబడేందుకు ఎల్వీ. ప్రసాద్ వ్యాపారంలో ఉద్యోగిగా చేరి, "బాతు గుడ్ల" ను కూడా అమ్మారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రచురించే "పీపుల్స్ వార్" పత్రికకు పేపర్ బోయ్ గా పనిచేశారు. కె.ఎల్.ఎన్. ప్రసాద్ సోదరుడి సినీ పంపిణీ సంస్థలో సేల్స్ బోయ్ గా కూడా పనిచేశారు. నర్సాపూర్ లేస్ ను అమ్ముకుంటూ కొంత సంపాదించుకునేవారు. ఇవన్నీ కలిపి ఆయన జీవించడానికి పనికొస్తే, వుండడానికి మేనమామ ఇల్లుండేది. ఒకరిపై ఆధారపడడం ఆయన సిద్ధాంతానికి వ్యతిరేకం.

ఎల్వీ. ప్రసాద్ మద్రాసుకు వెళ్లడంతో తిలక్ కూడా అక్కడకు మకాం మార్చారు. ఎల్వీ సన్నిహితుడైన సినీ ఎడిటర్ ఎం. వీ. రాజన్ తో పరిచయం చేసుకున్నారు. ఎడిటింగ్ లైన్ లో ప్రావీణ్యం పొంద సాగారు. కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం విధించడంతో, దాని ప్రభావం ప్రజానాట్యమండలి కార్యకలాపాలపై పడి, దానికి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరు మద్రాసు చేరుకున్నారప్పట్లో. వారిలో "భవిష్యత్ సినీరంగ దిగ్గజాలు" అందరూ వున్నారు. వారందరికీ ఎల్వీ. ప్రసాద్ మద్రాసులో ఆధారం కలిపించారు. అప్పట్లో కొంతకాలం ఎల్వీ కూడా ప్రజానాట్యమండలి అధ్యక్షుడిగా వున్నారు. ఎడిటింగ్ లైన్లో ప్రవేశించిన తిలక్, రాజన్ కాంబినేషన్ తో , "శ్రీమతి", "అంతామనవాళ్ళే", "రోజులు మారాయి", "మంత్రదండం" , "సువర్ణమాల", "రాధిక", "ధర్మాంగద", "జ్యోతి" లాంటి సినిమాలకు ఎడిటర్ గా పనిచేశారు. "శ్రీమతి" చిత్రానికి నూతన ఆర్టిస్టులను ఎంపికచేసే ప్రక్రియలో భాగంగా, రాజన్-తిలక్ లతో డైరెక్టర్ ఎల్వీ. ప్రసాద్ మూవీ టెస్ట్, స్టిల్ల్ టెస్ట్, మేకప్ టెస్ట్ చేయించిన వారిలో, దశాబ్దాల పాటు సినీరంగాన్ని, దశాబ్దం పైగా రాజకీయ రంగాన్ని శాసించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఒకరు.

నవయుగ బ్యానర్ కింద నిర్మించిన "జ్యోతి" చిత్రం తిలక్ సినీ జీవితంలో మైలురాయి. ప్రజానాట్యమండలికి చెందిన పలువురు కళాకారులతో సహా ఈ చిత్రంలో జి. వరలక్ష్మి నటించారు. దర్శకత్వం బాధ్యత తిలక్ మీద పడింది. ఎడిటర్ గా తనకున్న అనుభవాన్ని మేళవించి, దర్శకత్వానికి వన్నె తెచ్చారాయన ఆ చిత్రంలో. నిరక్షరాస్యతను సామాజిక సమస్యగా వర్ణిస్తూ కొండేపూడి పాటకు అభినయించిన నాటి బాల నటి జోగమాంబ, నేటి ఎమ్మెల్యే జయసుధ తల్లి-నిడదవోలు వెంకటరావు కూతురు. పెండ్యాల ఆ సినిమాకు సంగీత దర్శకుడు. ఆ సినిమాతో తిలక్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. శకుంతలను "ఆదర్శ వివాహం" చేసుకుని మద్రాసులో కాపురం పెట్టారు. ఇటీవలే ఆమె మరణించారు. బహుశా తిలక్ ని సరిగ్గా అర్థం చేసుకున్నది ఆయన శ్రీమతి ఒక్కరేనేమో ! తిలక్ కుమారుడు లోకేష్ కాలిఫోర్నియాలో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అనుపమ ఫిలిమ్స్ స్థాపించి, శరత్ నవల ఆధారంగా ఆరుద్ర రూపొందించిన స్క్రిప్ట్ తో, స్వీయ దర్శకత్వంలో, తన తొలి ప్రయత్నంగా " ముద్దుబిడ్డ" సినిమా తీశారు తిలక్. సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నప్పుడు నవలా రచయిత గోపీచంద్, ఆకాశవాణిలో పనిచేస్తున్న కొంగర జగ్గయ్యను తిలక్ కు పరిచయం చేశారు. జగ్గయ్యతో పాటు ఆ సినిమాలో ప్రధాన భూమికకు "గర్వం"-"స్వాభిమానం" సమపాళ్లలో నటించగల జమునను ఎంపికచేశారు తిలక్. ఆ పాత్ర కావాలని ఆశపడ్డ జి. వరలక్ష్మిని (రిలీజ్ చేయని మొదటి ఎనిమిది రీళ్లలో నటించిన) జమున వదిన పాత్రకు ఎంపికచేశారు. జమున కళాకారిణిగా స్థిరపడి పోయేందుకు ముద్దుబిడ్డ సినిమా కారణమనాలి. తాపీ ధర్మారావు, ఆరుద్రల "కలెక్టివ్‌ స్పిరిట్" తో సినిమా డైలాగులు రూపుదిద్దుకున్నాయని చెప్పారు తిలక్. ఆరుద్ర పాటలకు పెండ్యాల దర్శకత్వం వహించారు. ముద్దుబిడ్డలో తిలక్ పరిచయం చేసిన నూతన డాన్సర్ జ్యోతి ఇప్పటి పాపుల హీరో సాయికుమార్ కు, అయ్యప్ప శర్మకు తల్లి. "బాంబే మీనాక్షి" ని కూడా డాన్సర్ గా పరిచయం చేశారు. ఈ సినిమాతో ప్రారంభమైన తిలక్, ఆరుద్ర, పెండ్యాల కాంబినేషన్ "అనుపమ" కు హాల్ మార్క్ అయింది.

తిలక్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సమస్యాత్మక చిత్రం "ఎమ్మెల్యే" అనేక నూతన ప్రయోగాలకు నాంది పలికింది. "బ్యాక్ సీట్ డ్రైవింగ్, బంతి వడ్డన రాజకీయాలు" ఎమ్మెల్యే సినిమా కథాంశం. జమీందారులు, భూస్వాములు, ధనికులు స్వయంగా చట్టసభలకు పోటీ చేయకుండా, ప్రజల నాడికి అనుగుణంగా వుండేవారిని తమ పలుకుబడితో గెలిపించి, తమ పనులను వారిద్వారా చక్కబెట్టుకునే దోపిడీ విధానాన్ని ఎద్దేవా చేసే సినిమా ఇది. తిలక్ ఈ సినిమాలో రమణమూర్తిని నటుడిగా, నేపధ్య గాయనిగా "జానకి" ని పరిచయం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లో భూసంస్కరణల చట్టం తేవాలన్న ఆలోచన ప్రభుత్వానికి రావడానికి స్ఫూర్తి ఎమ్మెల్యే సినిమానే అనాలి. సెప్టెంబర్ 19, 1957న ఎమ్మెల్యే సినిమా రిలీజ్ అయిన తర్వాత 1958లో లాండ్ సీలింగ్ చట్టం నామమాత్రంగా రూపొందించినప్పటికీ, వాస్తవానికి 1961లో మాత్రమే చట్టంగా వచ్చింది. హైదరాబాద్ మెహందీలో నివసిస్తున్న "చోటీ ఖుర్షీద్" అనే అందమైన అమ్మాయితో సినిమాలో కవ్వాలీ నాట్యం చేయించారు. మనమంతా ఇప్పడు రుచిగా తింటున్న "ఎమ్మెల్యే పెసరట్టు" తిలక్ సృష్టే !

కుటుంబ పరమైన మరో సమస్యాత్మక చిత్రం "అత్తా ఒకింటి కోడలే". ఆరుద్ర "ద్విపద" రచనకు బాపు వేసిన "బొమ్మల కథ" తో వెలువడిన ప్రచార కార్టూన్లు మరో నూతన ఒరవడి. ఆంధ్ర పత్రికలో పనిచేస్తున్న రమణ, మితృడు బాపుని, ఒప్పించారు. అందరు కలిసి సినిమా వీక్షించారు. చూస్తూనే బాపు ఓ కాగితం మీద బొమ్మలు గీసి చూపించారు. అందరికీ నచ్చాయి. వెంటనే "అనుపమ చిత్రం అత్తా ఒకింటి కోడలే బొమ్మల కథ" రూపుదిద్దుకుంది. వారం వారం ఆరుద్ర సామెతలు రాయడం, బాపు ఇల్లస్ట్రేషన్ వేయడం, ఆంధ్ర పత్రికలో ప్రింట్ కావడం జరిగేది. స్టూవర్ట్ పురం సెటిల్‌మెంట్ థీమ్ తో చిట్టి తమ్ముడు సినిమా తీశారు. అందులో ఒకనాటి మేటి నటి "విజయ లలిత" బాల నటిగా సినీరంగానికి పరిచయం చేశారు. జయలలిత తల్లి సంధ్య చిట్టి తమ్ముడి సినిమాలో రమణారెడ్డి భార్యగా నటించింది. సామాజిక స్పృహకు ఉదాహరణగా తీసిన మరో చిత్రం "ఈడూ జోడూ".

మృదుమధురమైన పాటల ఆసరాతో, ఆబాలగోపాలం మన్ననలందుకున్న అపురూప చిత్రం తిలక్ "ఉయ్యాల జంపాల". "ఓ పోయే పోయే చినదానా...", "ఉంగరాల జుట్టు వాడు...", కొండగాలి తిరిగిందీ-గుండె వూసులాడిందీ...", "అందాల రాముడు ఇందివర శ్యాముడు.." అప్పటికీ-ఇప్పటికీ-ఎప్పటికీ మరిచిపోలేని "అనుపమ మధుర గీతాలు". అప్పటికే సినీరంగాన్ని వదిలి రాజకీయాల్లో చురుగ్గా వున్న కోన ప్రభాకర రావుతో తిలక్ ఇందులో మళ్లీ వేషం వేయించారు. అట్లతద్దినాడు "ఇస్తినమ్మా వాయినం-పుచ్చుకుంటినమ్మా వాయినం" అనే డైలాగులతో వాయినాలిచ్చే సన్నివేశం వుందిందులో. పెద్దాపురం మేజువాణి తరహా ప్రక్రియైన మరాఠీ "తమాషాల" పై తిలక్ కి కలిగిన ఆసక్తి పర్యవసానమే "పంతాలు పట్టింపులు" సినిమా. మరాఠీ మేటి నటిగా పేరు తెచ్చుకున్న లీలా గాంధీ ఇందులో నటించింది. సినిమాలో పాటలన్నీ ప్రశ్న-జవాబులో, అర్థవంతంగా-భావగర్భితంగా-తమాషాగా-పొడుపుకథల్లా వుంటాయి. ఆయనకు అఖిలభారత స్థాయిలో అవార్డ్ తెచ్చిపెట్టిన మ్యూజికల్ హిట్ పిక్చర్ ఇది. తిలక్ "ముద్దుబిడ్డ" హిందీ వర్షన్ "ఛోటీబహు" రాజేషఖన్నా-షర్మిలా టాగూర్ కాంబినేషన్ లో తీశారు. "ఛోటీబహు" లో ముద్దుబిడ్డ పాత్రను పోషించిన ’బేబీ సారిక’ కమల్‌హాసన్ ను వివాహం చేసుకుంది. "ఛోటీబహు" తిలక్ కు హిందీలో ఒక బ్రేక్. తర్వాత ఈడూజోడూ హిందీ వర్షన్ "కంగన్" ను మాలా సిన్హా, సంజీవకుమార్, అశోక కుమార్, మహమూద్ లతో తీశారు.

తిలక్ తమ్ముడు రామ నరసింహారావుకు సామాజికన్యాయం సాధించాలన్న పట్టుదల వుండేది. ఆ క్రమంలోనే నక్సలైట్ ఉద్యమానికి ఆది పురుషుడైన చారు మజుందార్ తో పరిచయం చేసుకున్నాడు. హఠాత్తుగా జనజీవన స్రవంతినుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన ఆయన ఎన్‌కౌంటర్లో చనిపోయిన సంగతి తెలుసుకున్నారు తిలక్. తమ్ముడు చనిపోయిన తర్వాత వామపక్షాలన్నీ ఐకమత్యం కావాలన్న థీమ్ తో "భూమికోసం" సినిమాను తీశారు తిలక్. తమ్ముడికే అంకితం చేశారు దాన్ని. "భూమికోసం, భుక్తికోసం సాగే రైతుల పోరాటం, అనంత జీవిత సంగ్రామం" అని నమ్మిన తిలక్, ఆ సుదీర్ఘ పోరాటానికి "ఆరంభమే కాని అంతం వుండదు" అని తెలియచేసే విధంగా తీసిన విప్లవాత్మక-సామాజిక దృక్ఫద చిత్రమే "భూమికోసం". ఇందులో ఆయన వామపక్ష ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. శ్రీ శ్రీ రచించిన అపురూప విప్లవ గేయం నేపధ్యంలో కనిపిస్తాయి టైటిల్స్ ఆసాంతం. మేటి నటీమణి, ప్రస్తుతం పార్లమెంట్ సభ్యురాలు జయప్రదను "కాబోయే కథానాయిక - కుమారి జయప్రద" గా భూమికోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు తిలక్. "చెల్లి చంద్రమ్మ" పాత్ర పోషించారు జయప్రద. సినిమాలో ఆమె పాడిన పాటను ప్రముఖ నక్సలైట్ నాయకుడు సత్యమూర్తి రచించారు. తెలుగులో మొట్ట మొదటిసారి ప్రఖ్యాత హిందీ నటుడు అశోక్ కుమార్ భూమికోసం లో పాత్రను పోషించారు. సినిమాలో శ్రీ శ్రీ రాసిన "తూర్పు దిక్కున వీచే గాలి" అనే పాటను గురించి సినిమా చూసిన రష్యన్ బృందం ప్రస్తావిస్తూ, అది చైనాను దృష్టిలో పెట్టుకుని రాశారా అని అడిగారు తిలక్ ను. చిత్రం ఆరంభంలోనే "దున్నేవాడికే భూమి హక్కు" అన్న నినాదాలు వినిపిస్తాయి.

కొల్లేటి ప్రాంతంలోని పరిస్థితులను గమనించిన తిలక్, పలువురి అభిమానాన్ని చూరగొన్న "కొల్లేటి కాపురం" సినిమా తీశారు. బాహ్య ప్రపంచంలోని "జమీందారు" వ్యవస్థ లాంటి కొల్లేటి ప్రాంత "ఇంజన్ దార్" వ్యవస్థ దోపిడీ విధానాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారు. సినిమా తీసే ప్రయత్నంలో "కొల్లేటి పడవల" లో తిరిగి స్క్రిప్ట్ తయారు చేశారు తిలక్. ఈ సినిమాలో ’సుగుంబాబు’ ను గేయరచయితగా పరిచయం చేశారు. ఆయన్ను తిలక్ కు పరిచయం చేసింది శ్రీ శ్రీ. కొత్తదనానికి కొల్లేటి కాపురం సినిమా ఒక మచ్చుతునక. ప్రముఖ గజల్ సింగర్ పూర్ణచంద్ర రావును నేపధ్య గాయకుడిగా పరిచయం చేశారిందులో. సినిమాలోని ప్రతి పాట, మాట ఆ ప్రాంతానికి-సంస్కృతికి-జీవన విధానానికి సంబంధించినవే. అనుపమ చలనచిత్ర బ్యానర్ కింద కాకుండా నిర్మించిన "ధర్మ వడ్డీ" సినిమాకు కూడా తిలక్ దర్శకత్వం వహించారు.

తిలక్ మంచి గాయకుడు. "లేవరా...లేవరా..కార్మికుడా" అనే దేశ భక్తి గీతాన్ని, బొంబాయ్ లో వుంటున్నప్పుడు, తెలుగు కార్మికులు నివసిస్తుండే వాడల్లో పలుమార్లు పాడి వాళ్లను ఉత్తేజ పరిచేవారు తిలక్. అలా ఆయన పాడుతున్న పలు సందర్భాల్లో కమ్యూనిస్ట్ వ్యతిరేకులు రాళ్ళు వేసిన విషయాన్ని, ఆయన దెబ్బలు తగలకుండా తప్పించుకున్న విషయాన్ని వివరించారొకసారి. అదే రోజుల్లో బిటి రణదివే, వైద్య, అధికారి, విమల రణదివే, కానూరు రామానంద చౌదరి, మోహన్ కుమార మంగళం లాంటి వారితో పరిచయాలు కూడా చేసుకున్నారు తిలక్. ఆయన మద్రాసుకు వెళ్లింతర్వాత, మోహన్ కుమార మంగళం తండ్రి డాక్టర్ సుబ్బరాయన్ తోను పరిచయం చేసుకున్నారు. పలు ప్రపంచ శాంతి సంస్థలతో సంబంధమున్న రమేశ్ చంద్ర కూడా తిలక్ కు బాగా పరిచయం.

ఈ ఏడాది ఉగాది పర్వదినాన, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రధమంగా ఏర్పాటుచేసిన "బి. ఎన్. రెడ్డి జాతీయ అవార్డ్" ను, కె. బి. తిలక్ కు, "నంది" బహుమతుల ప్రదానోత్సవంలో అందచేశారు. ఆరు దశాబ్దాలకు పైగా తెలుగు-హిందీ వెండి తెరతో సంబంధమున్న తిలక్ ని, కనీసం, ఎనభై నాలుగేళ్ల వయసు వచ్చిన తర్వాతైనా ప్రభుత్వం గుర్తించ గలగడం అదృష్టమే !