Showing posts with label రాజ్యాంగం. Show all posts
Showing posts with label రాజ్యాంగం. Show all posts

Monday, May 28, 2012

ఒక్క మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?: వనం జ్వాలా నరసింహారావు


ఒక్క మోపిదేవేనా!: సమిష్ఠి బాధ్యత సంగతేమిటి?
సూర్య దినపత్రిక (27-05-2012)
వనం జ్వాలా నరసింహారావు

మనసులో చెప్పుకోలేని అనుమానంతో, మే నెల 24 గురువారం ఉదయం తన అధికారిక వాహనంలో దిల్‌కుషా అతిథి గృహానికి రెండో రోజు విచారణకు వచ్చిన రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం అందరూ ఊహించిందే. ఆయన ముఖంమీద ఎప్పుడూ కనిపించే చిరునవ్వు... మాయమైంది! ఆ స్థానంలో ఉత్కంఠ కనిపించింది! ఇక అరెస్ట్ తరువాత కధ మామూలే. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, ప్రత్యేక కోర్టుకు తరలించడం, కస్టడీకి తీసుకోవడం, దరిమిలా... మంత్రి పదవికి రాజీనామా చేయడం చకచకా జరిగింది. మోపిదేవి మొదట్లో రాజీనామా చేయడానికి విముఖత వ్యక్త పరిచారని, స్నేహితుల సలహా మేరకు రాజీనామాతో పాటు ఒక సుదీర్ఘమైన లేఖను ముఖ్యమంత్రికి రాశారని వార్తలొచ్చాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒత్తిడి వల్లే తాను వాన్ పిక్ వ్యవహారంలో ప్రభుత్వ ఉత్తర్వులపై సంతకం చేసానని, తనకు ఇష్టం లేకపోయినా అల నాడు నెలకొన్న ప్రత్యేక రాజకీయ నేపధ్యంలో ఫైలుపై సంతకం చేయకుండా వుండలేకపోయానని లేఖలో పేర్కొంటూ, తన నిర్దోషిత్వాన్ని బలపరిచేలా అనేక అంశాలను అందులో ప్రస్తావించారు. సహజంగానే ఆయన చేసిన రాజీనామాను ముఖ్యమంత్రి గవర్నర్ ఆమోదం కొరకు పంపడం, ఆమోదించడం జరిగిపోయింది. ఇదింతటితో ఆగుతుందా? ఇరవయ్యారు జీవోలతో సంబంధం వున్న మిగతా ఐదుగురు మంత్రులకు కూడా ఇది చుట్టుకుంటుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశమై పోయింది. మోపిదేవి అరెస్టు అనంతరం అందుబాటులో వున్న మంత్రులతో సమావేశమైన ముఖ్యమంత్రితో ఈ విషయాన్నే సమావేశంలో పాల్గొన్న పలువురు మంత్రులు ప్రస్తావించినట్లు వార్తలొచ్చాయి. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కన్నేసిన మంత్రుల్లో ప్రత్యేకించి కలవరం పుట్టింది. "ఇలాగైతే మన గతి ఎలా?" అనే ఆందోళన వారంతా ముక్తకంఠంతో వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మంత్రులే అరెస్టయితే, ఇక ప్రభుత్వం పరువు-ప్రతిష్ట ఏం కావాలి? అన్న మీమాంస మొదలైంది. మంత్రులే కటకటాల వెనక్కి వెళితే... సర్కారుకు చేటే అని హెచ్చరించేవరకు వెళ్లారు మంత్రులు. ముఖ్యమంత్రిని నిలదీశారనే అనాలి . పాపం....ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు?
మోపిదేవి వెంకటరమణ అరెస్ట్ సబబా? కాదా? ఆయన దోషి అవునా?కాదా? అన్న మీమాంస లేవదీసే ముందు మంత్రి మండలికి, వ్యక్తిగతంగా మంత్రులకు ఏ విధమైన బరువు బాధ్యతలు వుంటాయో చర్చించుకోవడం మంచిది.  రాజ్యాంగం ప్రకారం, రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు ముగిసిన వెంటనే, శాసనసభలో మెజారిటీ స్థానాలను పొందిన రాజకీయ పార్టీ-లేదా-సంకీర్ణ కూటమికి చెందిన నాయకుడిని (నాయకురాలిని) ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించడం ఆనవాయితీ. ఆ నాయకుడినే ముఖ్యమంత్రిగా గవర్నర్ నియమిస్తారు. అలా ముఖ్యమంత్రిగా నియమించబడిన వ్యక్తి సూచనమేరకు మాత్రమే, గవర్నర్ ఇతర మంత్రులను, మంత్రి మండలి సభ్యులుగా నియమించడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే, ముఖ్యమంత్రి తనతో "సమాన హోదా కలిగిన ఇతర మంత్రులలో ప్రథముడు" మాత్రమే (First among the equals). ఇక అప్పటినుంచి, విధాన పరమైన ప్రభుత్వ పాలన యావత్తు "మంత్రి మండలి సమిష్టి బాధ్యత" అన్న రాజ్యాంగ ప్రాధమిక సూత్రం ఆధారంగానే జరుగుతుంది-జరిగి తీరాలి. ఈ నిబంధనకు ఎవరూ అతీతులు కాదు. అలా కావడం అంటే రాజ్యాంగ సూత్రాలకు భిన్నంగా నడచుకున్నట్లే! ఇక మంత్రిగా కాబినెట్‌లో చేరిన వ్యక్తికి రెండు రకాల బాధ్యతలుంటాయి. అందులో మొదటిది ఆయనకు అప్పజెప్పిన శాఖాపరమైన దైనందిన బాధ్యత. దానికి పూర్తి బాధ్యుడు స్వయంగా ఆ మంత్రి మాత్రమే. రెండోది విధానపరమైన నిర్ణయాలలో యావత్ మంత్రి మండలి సభ్యులతో పాటుగా సమిష్టి బాధ్యత. అంటే, ఒకటి వ్యక్తిగతమైంది మరొకటి సమిష్టిది. రొటీన్‌గా వెలువడే ప్రభుత్వ ఉత్తర్వుల విషయంలో బాధ్యత మొత్తం తనది, సంబంధిత అధికారి(రులది)ది అవుతుంది. కాబినెట్ నిర్ణయం తీసుకునే ఉత్తర్వుల విషయంలో తనకు, తనతో పాటుగా ఇతర మంత్రులకు బాధ్యత వుంటుంది. దానర్థం, వాన్ పిక్ వ్యవహారంలో, వ్య్తక్తిగతంగాను-సమిష్టిగాను తన బాధ్యత నుంచి మోపిదేవి తప్పించుకునే ప్రసక్తే లేదు. ఆ నిర్ణయం కాబినెట్ నిర్ణయం అవుతే, ఆయనతో పాటు ఇతర మంత్రులకు కూడా బాధ్యత వుండి తీరుతుంది.
          వివరాలలోకి పోతే, స్టాంపులు-రిజిస్ట్రేషన్ చట్టం కింద ఇచ్చిన మినహాయింపులు కాని, వాన్ పిక్ రాయితీల ఆమోదం కాని, భూసేకరణ ముసాయిదాకు అనుమతి కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు కాని, ఇండియా సిమెంట్స్ కు భూమి లీజుల పొడిగింపు కాని-కృష్ణా నదీ జలాల కేటాయింపు కాని, పెన్నా సిమ్మెంట్స్ కు భూ కేటాయింపు-సున్నపు రాయి గనుల లైసెన్స్ మంజూరు కాని, రఘురాం సిమెంట్స్ వ్యవహారం కాని, సరస్వతీ పవర్ లిమిటెడ్ కు సున్నపు రాయి గనుల లీజు కాని, రాంకీ ఫార్మా సిటీ విషంలో కాని, ఈశ్వర సిమెంట్స్ సంగతి కాని, బ్రాహ్మణి ఇన్ ఫ్రా టెక్ కు సీలింగ్ చట్టం నుంచి మినహాయింపు వ్యవహారంలో కాని విడుదలైన వివాదాస్పద ప్రభుత్వ జీవోలు ఒక విధంగా సంబంధిత శాఖా మంత్రిని వ్యక్తిగతంగా బాధ్యుడిని చేస్తే, మరో రకంగా అదే మంత్రిని ఇతర సహచర మంత్రులతో పాటు సమిష్టి గా బాధ్యుడిని చేస్తాయి. "ముఖ్యమంత్రి సంతకం పెట్టమంటే పెట్టాను కాని తనదేం తప్పు లేద" ని వాదించడం సబబు కాదు. ముఖ్యమంత్రితో పాటు, తనది-తనతో పాటు ఇతర మంత్రులది సమిష్టి బాధ్యత కింద తప్పే!
అందుకే జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో కింది నుంచి పైదాకా చాలామందిది-మంత్రులందరిది తప్పే. జగన్ తో పాటు వీరందరిని విచారించాల్సిందే. మోపిదేవి వెంకటరమణను ఏ విధంగానైతే వాన్ పిక్ రాయితీల ఆమోదం విషయంలో కాని, భూసేకరణ ముసాయిదాకు అనుమతి విషయంలో కాని, ప్రకాశం-గుంటూరు జిల్లాలలో వేలాది ఎకరాల భూ కేటాయింపు వ్యవహారంలో కాని, ఆరోపణలకు గురి చేశారో, అదే విధంగా, మిగతా ఐదుగురు మంత్రులను కూడా, అదే బాట పట్టించాలి. వారందరినీ, సిబిఐ దర్యాప్తుకు పిలిచే లోపుగానే మంత్రి మండలి నుంచి తొలగించాలి. సిబిఐ పిలవడం, విచారణ మొదలవడం, అరెస్ట్ పర్వం ఆరంభమవడం, అప్పుడు రాజీనామా కోరడం కన్నా ఇదే సరైన మార్గం. అంతే కాదు... సమిష్టి బాధ్యత కింద, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో పనిచేసిన ఇతర మంత్రులందరిని కూడా తొలగించి, మంత్రి మండలిని పునర్వ్యవస్థీకరించాలి. అప్పుడే దీనికి ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. లేకపోతే, ఒక్క మోపిదేవిని మాత్రమే బలి పశువును చేసినట్లవుతుంది.
ఇదిలా వుండగా...ఇక...జగన్ వ్యవహారం...ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతున్నట్లుంది. "విచారణకు పిలిపించిన సీబీఐ ఈనెల 25 జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయొచ్చు" అన్న ఊహాగానాలు వెలువడ్డాయి. ఐతే, సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు ఒకరోజు క్రితం ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో జగన్‌ను అరెస్టు చేసే పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే ఊహాగానాలూ మొదలయ్యాయి. అనుకున్నట్లు గానే 25వ తేదీన న విచారణకే పరిమితం చేసి, 26న కూడా రమ్మని ఆదేశాలిచ్చింది సిబిఐ. వాస్తవానికి, జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ప్రారంభమై తొమ్మిది నెలలు దాటుతోంది. ఈ కేసులో ప్రథమ ముద్దాయి అయిన జగన్ సీబీఐ ఎదుట హాజరు కావడం ఇదే తొలిసారి. కాకపోతే, ఓబులాపురం మైనింగ్ కేసులో గతంలో సీబీఐ ముందుగా సాక్షిగా ఒక సారి హాజరయ్యారు జగన్. "అరెస్టు తప్పదు" అన్న నిర్ణయానికి వచ్చిన జగన్ ముందస్తు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ అరెస్టు చేస్తుందనే ఆందోళన ఆయన భయం నుంచే పుట్టిందని, ఈ ఆందోళనకు కారణాలేవీ కనిపించడం లేదని తెలిపింది. కేసు దర్యాప్తు కీలక సమయంలో కూడా జగన్‌ను సీబీఐ అరెస్టు చేయలేదని, మే నెల 28న కోర్టుకు హాజరు కమ్మని సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయనను అరెస్టు చేస్తుందని కోర్టు భావించడం లేదని స్పష్టం చేసింది. అంతే కాకుండా, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తే సీబీఐకి జగన్ సహకరించకపోవచ్చేమోనన్న సందేహం కూడా కోర్టు వ్యక్తం చేసింది.
సీబీఐ విచారణకు జగన్ హాజరైన సందర్భంగా అంతా హై డ్రామానే. జగన్ అనుచరులు సీబీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుంటే, "రాజు వెడలె రవి తేజము వెడలె" అన్న చందాన, జగన్ తన బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియోలో విచారణ జరగాల్సిన దిల్ కుషా అతిధి గృహానికి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానిటీడీపీ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ఎంవి మైసూరా రెడ్డి కూడా జగన్ నివాసానికి వెళ్లారు. తొలి రోజు విచారణ ముగిసిన తర్వాత జగన్ దిల్ కుషా నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. అప్పుడు కూడా పెద్దఎత్తున పార్టీ నేతల వాహనాలు ఆయన వాహన శ్రేణిని అనుసరించాయి. విచారణ అనంతరం బయటికి వచ్చిన జగన్... బయట వేచి చూస్తున్న మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. "సీబీఐ విచారణ చాలా కూల్‌గా జరిగింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు వివరణాత్మక సమాధానాలు ఇచ్చాను. రేపు ఉదయం పదిన్నర కు మళ్లీ వస్తున్నాను'' అని మీడియాకు చెప్పారు. ఇంతకీ సిబిఐ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేస్తుందా? చేయదా? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదమిద్ధంగా సమాధానం ఇదీ అని అనలేం కాని విశ్లేషణ చేయవచ్చు. తొమ్మిది నెలల పాటు అరెస్ట్ చేయని సిబిఐ ఇప్పుడు జగన్‌ను అరెస్టు చేయాల్సిన ఆగత్యం ఏంటి? అన్న ప్రశ్న ఉదయించక మానదు.
ఏదైనా నేరారోపణ మీద ఒక వ్యక్తిని అరెస్టు చేసే ముందర అరెస్టు అనివార్యమా? కాదా? అన్న విషయాన్ని దర్యాప్తు సంస్థ తప్పక ఆలోచిస్తుంది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే, తప్పించుకు పోతాడన్న అనుమానం కానీ, సాక్ష్యాలను తారుమారు చేస్తాడని కానీ, విదేశాలకు పారిపోతాడని కానీ భావించినప్పుడు అరెస్టు చేసి తీరుతుంది. జగన్ కేసు మొదలై తొమ్మిది నెలలు దాటింది. ఆయన మొదటి ముద్దాయి కూడా. ఐనా, ఇంతవరకు ఆయనను, కారణాలేవైనా, అరెస్టు చేయలేదు. పైగా సహ నిందితులను కొందరిని అరెస్టు చేసింది సిబిఐ. వారిలో కొందరిని సుదీర్ఘంగా విచారించింది కూడా. విజయ సాయి రెడ్డి లాంటి వారి బెయిల్ పిటీషన్‌ను కూడా వ్యతిరేకించింది. ఐనా, మొదటి ముద్దాయి జగన్‌ను అరెస్ట్ చేయలేదు. అంటే, అరెస్టు చేయకపోవడానికి బలవత్తరమైన న్యాయపరమైన కారణాలుండి తీరాలి.
ఇదిలా వుంటే, వైఎస్సార్సీపి లోకి వలసల భయం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పరిణామాలు తమకు నష్టమేనని ఇరు పార్టీల నాయకత్వాలు విశ్లేషించు కొంటున్నాయి.
(ఈ వ్యాసం ప్రచురించిన నాడే-ఆదివారం సాయంత్రం-జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఆ మర్నాడు కోర్టు ఆయనను 14 రోజుల జుడిషియల్ రిమాండు విధించి చంచల్‍గుడా జైలుకు పంపింది)

Wednesday, January 26, 2011

కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ అన్యాయమే:వనం జ్వాలా నరసింహారావు

కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ అన్యాయమే
వనం జ్వాలా నరసింహారావు
(సూర్య దినపత్రిక:1-02-2011)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరు ప్రధాన మంత్రిగా పని చేసి వుండవచ్చు. ఇద్దరు రాష్ట్రపతి హోదాకు, ముగ్గురు లోక్ సభ స్పీకర్ పదవికి చేరుకుని వుండవచ్చు. అయినా ఢిల్లీ స్థాయిలో కీలక పదవుల పంపకంలో ఆది నుంచీ తెలుగు వారికి అన్యాయం జరుగుతూనే వుంది.

కేంద్ర మంత్రివర్గం ఏర్పాటులో కాని, విస్తరణలో కాని, పునర్ వ్యవస్తీకరణలో కాని, రాజ్యాంగపరమైన నిబంధనలు, పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతులు, పటిష్ఠమైన సాంప్రదాయాలు ఎన్ని వున్నప్పటికీ, అవన్నీ రాజకీయ అనుకూలతలు-వెసులుబాటుల ముందు దిగదుడుపే. వాటి విస్తృత పరిధులకు లోబడి పాటించాల్సిందే. అక్షర క్రమంలోను, కేంద్రంలో అధికారం చెలాయించే రాజకీయ పార్టీలకు అత్యధిక సంఖ్యాక పార్లమెంటు సభ్యులను గెలిపించడంలోను, ఢిల్లీ స్థాయిలో పెత్తనం సాగించే కీలకమైన రాజకీయ నాయకులకు "చేదోడు-వాదోడుగా" వుండడంలోను అగ్రభాగాన వుండే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కేంద్రంలో పలుకుబడి ఉపయోగించడానికి దోహదపడే కీలక స్థాయికి ఎదగడంలో మాత్రం వెనుకబడే వుంటూ వస్తుంది. కేంద్ర స్థాయిలో పాలనలో సరైన భాగస్వామ్యం లభించకపోవడంతో, అక్కడినుంచి నిధులను పొందడంలో కూడా విఫలమవుతూనే వుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచి, ఇంతవరకూ, కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందిన సుమారు 300 మందికి పైగా వున్న కాబినెట్ స్థాయి మంత్రులలో, ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారి సంఖ్య కేవలం 20 లోపే...అంటే 6% మాత్రమే. అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీకి ఆంధ్ర ప్రదేశ్ నుంచి 42 లోక్ సభ స్థానాలు దక్కినప్పుడైనా, ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వాములైన తెలుగు దేశం-బిజెపి పార్టీలకు అత్యధిక స్థానాలు దక్కినప్పుడైనా, ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం నామ మాత్రమే. అదే విధంగా ఇప్పటి వరకు సుమారు 500 మందికి పైగా సహాయ మంత్రుల పదవులు పొందగా, అందులో ఆంధ్ర ప్రదేశ్ కోటా 25 కు మించలేదు..అంటే కేవలం 5% మాత్రమే. 64 సంవత్సరాల స్వతంత్ర భారత వర్తమాన రాజకీయ చరిత్రలో, రాష్ట్రానికి చెందిన కనీసం 50 మంది నాయకులు (అధిక శాతం అగ్ర కులాలకు చెందిన వారే!) కూడా, జాతీయ స్థాయి నాయకులుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోలేక పోయారంటే...అంటే..సగటున ఏడాదికి ఒక్కరైనా లేరంటే, ఇంతకంటే అన్యాయం ఇంకోటి లేదనే అనాలి. కాకపోతే, ఇంత అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా, వాటిని అధిగమించి, ఇదే రాష్ట్రానికి చెందిన పీవీ నరసింహారావు, ప్రప్రధమ దక్షిణ భారత ప్రాంత పౌరుడుగా, ప్రధాన మంత్రి పదవిని పొందగలిగారు. మొట్టమొదటి సారి, నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందని వాడిగా, అయిదేళ్ల పూర్తి కాలం అధికారంలో వుండగలిగి, దేశ దేశాల మన్ననలను పొందిన ఆర్థిక సంస్కరణలను అమలు పరచగలిగాడు ఆయన. కేంద్ర మంత్రివర్గంలో తెలుగు వారికి ఆది నుంచీ ఇలా అన్యాయం చేయడంలో, కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వమైనా, బిజెపి సారధ్యంలోని ప్రభుత్వమైనా కొద్ది తేడాతో ఒకే పద్ధతిని అవలంబించాయి.

రాజ్యాంగం ప్రకారం భారత ప్రధాన మంత్రిని, ఆయన సలహా మేరకు మంత్రివర్గ సభ్యులందరినీ, నియమించే అధికారం రాష్ట్రపతి కుంది. కాకపోతే, ప్రధాన మంత్రిగా నియమితులు కాబోయే వ్యక్తికి, పార్లమెంటు దిగువ సభకు ఎన్నికైన సభ్యుల్లో మెజారిటీ సభ్యుల మద్దతు తప్పనిసరిగా వుండాలి. అలా వున్న వ్యక్తిని-వుందని రాష్ట్రపతి భావించిన వ్యక్తినే ప్రభుత్వం ఏర్పాటు చేయమని రాష్ట్రపతి కోరుతారు. ఇది మనం అనుసరిస్తున్న బ్రిటీష్ పార్లమెంటరీ సాంప్రదాయం. పాలనా సౌలభ్యం కొరకు మంత్రులకు పోర్టుఫోలియోలు ప్రధాన మంత్రి సూచన మేరకు రాష్ట్రపతి కేటాయించినప్పటికీ, మంత్రులందరూ, వ్యక్తిగతంగా-సామూహికంగా ప్రధానికి, ప్రధాని ద్వారా రాష్ట్రపతికి-పార్లమెంటుకు బాధ్యులవుతారు. దీన్నే "మంత్రివర్గ ఉమ్మడి బాధ్యత" అంటాం. ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు చేసుకునే అధికారం, పోర్టుఫోలియోలను కేటాయించే అధికారం, పూర్తిగా ప్రధానిదేనని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ, వాస్తవానికి, ఆ అధికారం కొన్ని హద్దులకు లోబడి వుంటుందని సాంప్రదాయాలు చెపుతున్నాయి. ప్రధాని, అధికార పార్టీ అధినేత వేర్వేరు వ్యక్తులైనప్పుడు, ఆ హద్దు స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా సంకీర్ణ ప్రభుత్వాలకు సారధ్యం వహించిన ప్రధాని కూడా ఇష్టానుసారంగా మంత్రివర్గం ఏర్పాటు కాని, విస్తరణ కాని, పునర్ వ్యవస్తీకరణ కాని చేయలేరు. ప్రస్తుతం ఈ రెండు రకాలైన పరిస్థితులు నెలకొని వుండడంతో ప్రధాని మన్మోహన్ సింగ్ సర్వ స్వతంత్రుడు కాదనే విషయం అర్థం చేసుకోవడానికి ఇటీవల జనవరి 19, 2011 న చేసిన విస్తరణే నిదర్శనం.

14 వ ప్రధాన మంత్రిగా, తొలి యూపీయే మంత్రులతో కలిసి, మే 22, 2004 న ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్, మొదటి ఐదేళ్ల కాలంలో ఒకటి-రెండు పర్యాయాలు మాత్రమే మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు చేశారు. రెండో తడవ, సరిగ్గా ఐదేళ్ల తర్వాత, మే 22, 2009 న ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, 29 మంది కాబినెట్ మంత్రులతో, 48 మంది సహాయ మంత్రులతో మంత్రి మండలిని ఏర్పాటు చేశారాయన. ఇటీవలి విస్తరణలో, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వారెవరూ లేకుండానే, కొత్తగా ముగ్గురి కి స్థానం కలిగించి, మొత్తం 37 మంది కాబినెట్ స్థాయి, 43 మంది స్టేట్ స్థాయి మంత్రులతో పునర్ వ్యవస్తీకరించారు. ప్రస్తుత మంత్రి మండలి సభ్యులతో కలుపుకుని, కేంద్ర మంత్రి మండలిలో జవహర్లాల్ నెహ్రూ కాలం నుండి ఇంతవరకు, 300 మందికి పైగా కాబినెట్ మంత్రి హోదా, సుమారు 70 మంది వరకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సహాయ మంత్రుల హోదా, మరో 360 మంది దాకా సహాయ మంత్రుల హోదా, 70 మందికి డిప్యూటీ మంత్రుల హోదా లభించింది. మొదట్లో మంత్రి మండలి మూడంచెల పద్దతిలో, కాబినెట్-సహాయ-డిప్యూటీ మంత్రులతో, ఏర్పాటు చేసే ఆనవాయితీ వుండేది. అయితే రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలంటూ ఏదీ లేదు. కేవలం బ్రిటీష్ సాంప్రదాయాన్ని అనుకరించే ఇది కూడా జరిగింది. పాలనా సౌలభ్యం కొరకు కూడా ఆ ఏర్పాటు పనికొచ్చింది. వాస్తవానికి, మంత్రులందరూ మంత్రి మండలి సభ్యులే. జీత భత్యాల విషయంలోనే కొంత తేడాలున్నాయి. కాకపోతే, ప్రధాన మంత్రి సమాన స్థాయి మంత్రులందరిలో ప్రథముడుగా పేర్కొంటారు. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా వున్నప్పుడు డిప్యూటీ మంత్రుల స్థాయికి స్వస్తి పలికారు. రాజీవ్ గాంధి మళ్లీ పునరుద్ధరించినప్పటికీ, అనతి కాలంలోనే, వారందరినీ సహాయ మంత్రులుగా పదోన్నతి కలిగించారు. ఇక ఆ తర్వాత అందరూ అదే పద్ధతిని అవలంబిస్తున్నారు. కాకపోతే, సహాయ మంత్రులలో కొందరికి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగించే ఆనవాయితీ మొదలైంది.

సర్దార్ వల్లభాయి పటేల్, అంబేడ్కర్, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సీడి దేశ్ ముఖ్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, రాజగోపాలాచారి, బాబు జగ్జీవన్ రాం, కృష్ణ మీనన్, బహుగుణ, ఎంసీ చాగ్లా, కే ఎం మున్షి, అద్వాని, వీ వీ గిరి, వైబి చవాన్, రఫీ అహ్మద్ కిద్వాయ్, టీ టీ కృష్ణమాచారి, గోబింద్ వల్లభ్ పంత్, మోహన్ కుమార మంగళం, ఉమా శంకర్ దీక్షిత్, శంకర్ దయాళ్ శర్మ, జార్జ్ ఫెర్నాండెజ్, సుబ్రమణ్యం స్వామి, రామ్ జీత్మలాని, కరణ్ సింగ్, జస్టిస్ హెచ్ ఆర్ ఖన్నా, ఆర్ వెంకటరామన్, గ్యానీ జైల్ సింగ్, అశోక మెహతా, ప్రణబ్ ముఖర్జీ లాంటి ప్రముఖులు కాబినెట్ మంత్రులుగా పనిచేశారు. కేఆర్ నారాయణన్, సంతానం, షీలా దీక్షిత్, ఓం మెహతా, ఎం జీకే మీనన్, నందినీ సత్పతి లాంటి ప్రముఖులకు మంత్రి మండలిలో స్థానం లభించినా, సహాయ మంత్రులుగానే పనిచేయాల్సి వచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కొత్త రఘురామయ్య, జలగం వెంగళ రావు, బెజవాడ గోపాల రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయ భాస్కర రెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నీలం సంజీవ రెడ్డి, దామోదరం సంజీవయ్య, శివశంకర్, వెంకట స్వామి, కే చంద్ర శేఖర రావు, ఉపేంద్ర, వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ, ఎర్రం నాయుడు, జైపాల్ రెడ్డిలకు కాబినెట్ హాదా లభించింది. టీ అంజయ్య, రేణుకా చౌదరి, మల్లికార్జున్, బంగారు లక్ష్మణ్, ఎస్ బీ పట్టాభి రామారావు, రంగయ్య నాయుడు, జగన్నాథరావు, కె ఎల్ రావు, విద్యాసాగర్ రావు, అంకినీడు ప్రసాద రావు, ఎస్ బీపిబికే సత్యనారాయణ రావు, కేవి రఘునాథ రెడ్డి, వెంకట సుబ్బయ్య, కృష్ణం రాజు, వేణుగోపాలాచారి, పనబాక లక్ష్మి, పళ్లంరాజు, సాయిప్రతాప్, పురంధరేశ్వరి లకు సహాయ మంత్రుల హోదా లభించింది. డిప్యూటీ మంత్రులుగా జేబీ ముత్యాల రావు, ఎం సంజీవ రావు, ఎం తిరుమల రావు, పీ వెంకట రెడ్డి లకు స్థానం లభించింది.

అత్యధిక కాలం-సుమారు 32 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రి హోదాలో పని చేసిన ఘనత బాబూ జగ్జీవన్ రాంకు దక్కింది. అతి తక్కువ కాలం-కేవలం ఐదు రోజులు మాత్రమే కాబినెట్ మంత్రిగా వుంది జస్టిస్ హెచ్ అర్ ఖన్నా. మన రాష్ట్రానికి సంబంధించి నంతవరకు ప్రధానిగా పని చేసిన పీవీ నరసింహారావు, కొత్త రఘురామయ్యలు సుమారు 15 సంవత్సరాల పాటు కాబినెట్ మంత్రులుగా వున్నారు. రఘురామయ్య అదనంగా మరో ఐదేళ్లు సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. ఉప ప్రధానులుగా సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, వై బి చవాన్, జగ్జీవన్ రాం, దేవీ లాల్, అద్వానీలు పని చేశారు. వీరిలో మొరార్జీ, చరణ్ సింగ్ ప్రధానులు కాగలిగారు. మంత్రిగా పనిచేసిన అనుభవం ఏ మాత్రం లేని రాజీవ్ గాంధి, చంద్ర శేఖర్ నేరుగా ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగారు.

ఆగస్ట్ 15, 1947 న స్వతంత్రం వచ్చిన తర్వాత, ఇప్పటి వరకు 14 మంది ప్రధాన మంత్రి పీఠాన్ని అధిష్టించారు. ప్రప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ అత్యధిక కాలం-సుమారు 16 సంవత్సరాల 9 నెలలకు పైగా పదవిలో వుండి, 63 పర్యాయాలు మంత్రి మండలి విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ఆయన కూతురు ఇందిరా గాంధి కూడా దాదాపు కొంచెం తక్కువగా, రెండు విడతలుగా, సుమారు 16 సంవత్సరాల కాలం ప్రధానిగా పనిచేసి, 67 సార్లు విస్తరణలు-భారీ మార్పులు చేపట్టారు. ఇక ఆ కుటుంబ వారసుడు, ఇందిరా గాంధి అనంతరం ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధి, కేవలం ఐదేళ్ల కాలంలోనే, 36 సార్లు మంత్రి మండలిలో మార్పులు చేయాల్సి వచ్చింది. అటల్ బీహారీ వాజ్ పాయ్ ఆరేళ్ల పాటు ప్రధానిగా వుండి, 27 పర్యాయాలు విస్తరణలు-భారీ మార్పులు చేశారు. ప్రధాన మంత్రులుగా పని చేసిన మొరార్జీ దేశాయ్ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో, లాల్ బహదూర్ శాస్త్రి ఏడాదిన్నర కాలంలో చెరి పది సార్లు; చరణ్ సింగ్ ఆరు నెలల్లో ఆరు సార్లు; దేవె గౌడ పది నెలల పదవీ కాలంలో నాలుగు పర్యాయాలు; గుజ్రాల్ పది నెలల్లో రెండు సార్లు; వీపి సింగ్ 11 నెలల్లో, చంద్రశేఖర్ ఏడు నెలల్లో ఒకే ఒక్క సారి మంత్రి మండలిలో మార్పులు-చేర్పులు చేశారు. పీ వీ నరసింహారావు ఐదేళ్ల కాలం ప్రధానిగా వున్నప్పటికీ, కేవలం తొమ్మిది పర్యాయాలు మాత్రమే విస్తరణ చేపట్టారు. వీరందరితో పాటు, గుల్జారీలాల్ నందా రెండు సార్లు తాత్కాలిక ప్రధానిగా పనిచేశారు.

మంత్రి మండలిలో మార్పులు చేసినప్పుడల్లా, విస్తరణ చేపట్టినప్పుడల్లా, అది జరిగిన వెంటనే, ప్రధాని మంత్రి సన్నిహిత వర్గాల నుంచి మీడియాకు ఒక సందేశం రావడం ఆనవాయితీ. అతి త్వరలో, మంత్రివర్గ విస్తరణ వుండబోతున్నదని, కొత్త వారికి అవకాశం కలిగిస్తామని, దాని సారాంశం. ఆశావహుల ఆశలు అలా సజీవంగా వుంచడం అనాదిగా జరుగుతున్నదే! అలా జరిగిన నాడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సరైన న్యాయం జరుగుతుందని ఆశించడం తప్ప చేసేదేమీ లేదు!