Showing posts with label శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం. Show all posts
Showing posts with label శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం. Show all posts

Friday, November 16, 2012

వాసు దాస స్వామి గారి శ్రీరామనుతి: వనం జ్వాలా నరసింహారావు



వాసు దాస స్వామి గారి శ్రీరామనుతి
వనం జ్వాలా నరసింహారావు

(వాసు దాస స్వామి గారు, శ్రీమద్రామాయణంలోని ఏడు కాండలను, అనుక్షణం పారాయణం చేయదల్చుకున్న రామ భక్తులను దృష్టిలో వుంచుకుని, వంద సంవత్సరాల క్రితం రాసిన ఈ శ్రీరామనుతిని, అనువక్త-వాచవిగా నేను ఆయన రచించిన "శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండ మందరం" ను సంక్షిప్తీకరించి లఘు కృతిలో రాసిన "బాల కాండ మందర మకరందం" ఆసాంతం చదివిన పాఠకులకు "ఆయన కానుక" గా సమర్పించుకున్నాను. బాల కాండ మందర మకరందం చదవని వారూ దీన్ని చదవి తరించవచ్చు. ఇది చదవడమంటే, ఒక విధంగా, రామాయణం మొత్తం చదివినట్లే)

బాల కాండ

శ్రీమద్రవికులదీపకరామ--               
శ్రితజనకల్పకసీతారామ--               
రాక్షసకులబలశిక్షకరామ--              
భక్తావనసువిచక్షణరామ--     
మాయాతీతగుణాంచితరామ--          
సత్త్వైకగుణాధిష్ఠితరామ--
యక్షేశ్వరహితపూజితరామ--           
కరధృతధర్మవిరాజితరామ--
నరసురవరదత్తాభయరామ--           
భాషాతీతగుణోజ్వలరామ--    
ధృతమానవరూపాంచితరామ--
నతవిధిశక్రోమాధవరామ--
కౌసల్యావరనందనరామ--               
దశరథతోషణకారణరామ--               
ఘోరాసురయోషాంతకరామ--           
కౌశికలబ్ధాఖిలశరరామ--       
విశ్వామిత్రసవావనరామ--               
మారీచన్మయవారకరామ--
చైతన్యదపటువదనఖరామ--           
గౌతమహృదయానందనరామ--
జనకతపఃఫలరూపకరామ--             
ఖండితభర్గశరాసనరామ--      
క్షోణీతనయాసంగతరామ--               
నిర్జితభార్గవకులమణిరామ--
సాకేతపురీభూషణరామ--                
సీతాహృత్పంజరశుకరామ
రామరామశ్రీరామారామ--                
రామరామజయసీతారామ

అయోధ్యా కాండ

కేకయతనయావంచితరామ--           
పిత్రాజ్ఞాపరిపాలనరామ
సీతాలక్ష్మణసేవితరామ
పరమనుహృద్గుహపూజితరామ
ధృతతాపసవేషాంచితరామ
భారద్వాజముదావహరామ--  
చిత్రకూటతటనివసనరామ--            
కైకేయీతనయార్థితరామ--     
కృతపైతృకజయరాఘవరామ--    
భూమిధవీకృతపాదుకరామ-- 
రామరామశ్రీరామారామ--                
రామరామజయసీతారామ--

రణ్య కాండ

భీకరకాననవిహరణరామ--              
క్రూరవిరాధవిదారణరామ
మునిజనగణదత్తాభయరామ--
తారణకారణదర్శనరామ
దివ్యమహామునిసన్నుతరామ--  
కుంభజదత్తమహాయుధరామ--
పుణ్యసుతీక్ష్ణాభ్యర్చితరామ--             
పరిచితగృధ్రకులాధిపరామ--   
పంచవటీతటవర్తనరామ--           
హృతశూర్పణఖానాసికరామ--
హతఖరదూషణదానవరామ--    
మాయాహరిణోద్వంచితరామ--
దారితమారీచాసురరామ--       
దైత్యేశ్వరహృతభూసుతరామ
దారాన్వేషణతత్పరరామ--               
గృధ్రాధిపసంబోధితరామ
గంధకబందోన్మంథనరామ--             
శబరీదత్తఫలాశనరామ-- 
పంపాలోకనదుఃఖితరామ---   
రామరామశ్రీరామారామ---              
రామరామజయసీతారామ--   

కిష్కింధ కాండ

రవిజని వేదితనిజకథరామ--            
ప్రాప్తావనిజాభూషణరామ--
లీలోత్‍క్షిప్తాసురతనురామ--       
ఖండితసప్తమహీరుహరామ--
ఏకాశుగనిహతేంద్రజరామ--             
అభిషిక్తార్కతనూభవరామ--
గిరిదర్యంతరనివసనరామ--              
వానరసేనాపరివృతరామ--
సీతాలోకనతత్పరరామ--             
ప్రేషితవానరనాయకరామ--
మారుతసుతదత్తోర్మికరామ--           
గృధ్రసుబోధితవానరరామ--
రామరామశ్రీరామారామ--          
రామరామజయసీతారామ—

సుందర కాండ

జలనిధిలంఘనపటుభటరామ--       
లంకాంతకసముపాసితరామ--
సీతానందకరార్చితరామ--                         
విశ్రావితనిజనామకరామ--
దూషితరావణవిక్రమరామ--                       
భస్మీకృతలంకాపురరామ--
ప్రాప్తసతీచూడామణిరామ--                       
జలనిధివేలావాసకరామ--
రామరామశ్రీరామారామ--                         
రామరామజయసీతారామ--

యుద్ధ కాండ

శరణాక్రాంతవిభీషణరామ--              
శయనీకృతదర్భోత్కరరామ--
జలనిధిగర్వనివారకరామ--              
వారిధిబంధనకౌశలరామ--
విపులనువేలాచలగతరామ--           
అహిపాశోత్కరపీడితరామ--
ఖండితఫణిశరబంధనరామ--            
ఘటకర్ణాసురవిదళనరామ--
నిర్మథితేంద్రజిదాహ్వయరామ--        
నాశితమూలబలోత్కరరామ--
రావణకంఠవిలుంఠకరామ--              
అభిషిక్తాహితసోదరరామ--
సీతాలోకనకౌతుకరామ--                
శుచిపరిశోధితభూమిజరామ--
బ్రహ్మేంద్రాదిసమీడితరామ--            
దశరథదర్శనమోదితరామ--
మృతవానరసంజీవనరామ--            
పుష్పకయానారోహణరామ--
భారద్వాజార్చితపదరామ--              
భరతోత్కంఠాపూరకరామ--
జనయిత్రీహర్షప్రదరామ--                
నరవానరదితిజావృతరామ--
అభిషేకోత్సవహర్షితరామ--              
కరుణాముద్రితవీక్షణరామ--
రామరామశ్రీరామారామ--                
రామరామజయసీతారామ--

ఉత్తర కాండ

సంజీవితవిప్రార్భకరామ--                
స్మరణైకసుతుష్టాత్మకరామ--
అపవాదభయైకార్దితరామ--             
ఆజడమోక్షప్రదపటురామ--
ఏకశిలానగరాలయరామ--               
సుబ్బరాయసంపూజితరామ--
పాహిపాహిరఘునాయకరామ--        
భక్తత్రాణపరాయణరామ--
రామరామశ్రీరామారామ--                
రామరామజయసీతారామ

శ్రీరామార్పణమస్తు

Tuesday, February 9, 2010

"శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం" గ్రంథ ప్రకటన విధానం- గ్రంథ సమర్పణ ప్రకారం

జ్వాలా మ్యూజింగ్స్-25

PUBLISHING THE EPIC BOOK
SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM
EPIC BOOK DEDICATION PROGRAM)

వనం జ్వాలా నరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వకాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించడం పూర్తి చేసిన తర్వాత ఎలా ఆ గ్రంథాన్ని ముద్రించింది, ఎవరి తోడ్పాటుతో జరిగింది, ఎవరికి-ఎప్పుడు-ఎలా అంకితమిచ్చింది వాసుదాసు గారి మాటల్లోనే తెలుసుకుందాం. అలనాటి ప్రముఖ దినపత్రిక రాసిన వార్త కూడా చదవొచ్చు-జ్వాలా

“ఇంత గొప్ప గ్రంథాన్ని ముద్రించడం ఎలాగని నా స్నేహితులు కొందరు నాతో కలిసి ఆలోచన చేశారు. ఈ వార్త తెలుసుకున్న ఒక "స్వదేశీయ ప్రభువు" గారు, తాను ఆ భారమంతా మీదేసుకుంటానని చెప్పి, ప్రతిఫలాపేక్ష లేకుండా, వాగ్దానాన్ని నెరవేర్చుకొని, వేలాది రూపాయలు వ్యయం చేసి, ముద్రింపచేసి, "కృతి" కి, "కృతి కర్త" కు చిరాయువు కలిగించారు. ఏ ప్రభువైనా, ఏ ధనికుడైనా, ప్రతిఫలాపేక్షలేకుండా, ఇంత ధనం ఖర్చుచేసి, తన సంస్థానంలో కాకుండా దూర దేశంలో వుంటూ-తనకేమాత్రం సంబంధం లేనట్టి నా లాంటి అనామకుడి కృతిని ముద్రించడానికి సహాయపడడం లోకంలో విని వుండం. ప్రభువులు ఏ ప్రతిఫలాన్ని కోరుతారని అనుకోవచ్చు. ఆత్మ తుష్టికొరకు తమను పొగిడించుకోకుండా "ఒక వరాటకమేని ఇచ్చిన ప్రభువులు వీరును వీరిమాతులులును కాకుండా మరెవ్వరు?" కాబట్టి, ఇట్టి ప్రభువులు నాకు లభించడం కూడా, శ్రీరాముడి అనుగ్రహమే అని నా నమ్మకం. ఈ విషయంలో తన నిర్వ్యాజ కరుణకు పాత్రులైన ఆ సత్ ప్రభువుగారికి శ్రీరాముడే సర్వ శ్రేయోదాయి అవ్వాలి. "సాత్త్వికదానేఛ్చు" లగు ఆ ప్రభువుగారు, తన పేరును ఇందులో ప్రకటించడానికి నాకు అనుమతి ఇవ్వనందున ఆయనెవరో లోకానికి తెలియచేయలేక పోతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను”.

“గ్రంథ రచన పూర్తవగానే ముగ్గురు స్నేహితులం కూర్చొని, దీన్ని, కృతిపతైన ఒంటిమిట్ట శ్రీకోదండరాముడికి నివేదించి, లోకానికి తెలియచేయడం ఎలాగని ఆలోచన చేశాం. ఆ సమయంలో అనుకోకుండా, నా పాత స్నేహితుడు, కడప మండలం-పొద్దుటూరులో న్యాయవాదిగా పనిచేస్తున్న బ్రహ్మ శ్రీ రాజ శ్రీ వి. వసంత రావు గారు చెన్నపురికి వచ్చి, వార్త తెలుసుకొని, కార్యక్రమాన్ని మంచిగా జరిపించాలని ప్రోత్సహించడమే కాకుండా, సహాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఆయనంతటితో ఆగకుండా, కడప మండలంలోని స్నేహితులతో-హితులతో-భాషాభిమానులతో-దైవ భక్తిగలవారితో ఒక ఆహ్వాన సభను ఏర్పాటు చేశారు. అందులో బ్రహ్మ శ్రీ మహారాజ శ్రీయుతులు నెమలి పట్టాభిరామరావు (కొచ్చిన్ సంస్థానంలో దివానుగా వుండేవారు), ఏ. పరశురామ రావు, వావిలికొలను రామానుజ రావు, సి. నంజుండప్ప, కే. గుండు రావు, కామసముద్రము నరసింహాచార్యులు, ఎన్. నరసింగరావు, సత్యధీరగురురాజప్రియ కౌకూరు రామచంద్రరావు, యమ్మనూరు నాగయ్య, ఆర్. గిరిరావు గార్లు, మహరాజ శ్రీయుతులు కొణదల రామచంద్రారెడ్డి, విఠాయా గంటిసెట్టి గార్లు ఆహ్వాన సంఘ సభ్యులు. వీరికి సహాయపడేందుకు, శ్రీమదాయుర్వేదమార్తండ భిషజ్మణి పండిత డి. గోపాలాచార్యులు గారు, మహారాజ శ్రీ పానుగంటి రామారాయనింగారు, బ్రహ్మ శ్రీ రాజ శ్రీ గుమ్ముడూరు వేంకట రంగారావు గారు, వేంకట సుబ్బయ్య గారు, ఏ. జయరామరావుగారు, క్రొత్తపల్లి వేంకట పద్మనాభ శాస్త్రి గారు ముందుకొచ్చారు”.

“ఇలాంటి మహనీయుల కలయికతో అలంకరించిన సభ ఎలాంటి కార్యాన్నైనా చేయగలదు కదా ! పైగా, వీరి ప్రార్థనలను అంగీకరించి, గ్రంథ సమర్పణ సమయంలో, సభాధ్యక్షుడిగా వుండడానికి "చిత్రనళీయం" లాంటి అనేక రూపక గ్రంథాలను రచించి, బళ్లారిలో న్యాయవాద వృత్తిలో వున్న, శతావధాని-ఉభయ వేదాంత ప్రవర్తకులు, మహారాజ రాజ శ్రీ శ్రీమద్ధర్మవరము రామ కృష్ణమాచార్యులు గారు ఒప్పుకున్నారు. 1908వ సంవత్సరం అక్టోబర్ నెల 9, 10, 11 తేదీలలో-అంటే, కీలక నామ సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి, బహుళ పాడ్యమి-విదియ తిథులలో "కావ్య సమర్పణ" జరుగుతుందని పత్రికా ప్రకటన ఇచ్చింది ఆహ్వాన సంఘం. ఇలా ఆంధ్ర లోకానికి వెల్లడి చేయడమే కాకుండా, హిత-కవి-పండితులందరినీ ప్రత్యేకంగా "విజ్ఞాపన పత్రికల" ను పంపించి ఆహ్వానించారు. నా పాత స్నేహితులు, ఒంటిమిట్ట దేవాలయ ధర్మకర్త మహారాజ శ్రీ తిప్పన సుబ్బారెడ్డి గారు, గ్రామ మెజిస్ట్రేట్ మహారాజ శ్రీ ఆకేపాటి సుబ్బారెడ్డి గారు, గ్రామంలో కావలసినన్ని వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయించి, దేవాలయాన్ని అలంకరించి కార్యక్రమానికి సిద్ధం చేశారు. సమాచారం తెలుసుకున్న చుట్టు-పక్కల గ్రామ ప్రజలు కార్యక్రమం ఆరంభానికి ఒకరోజు ముందు కల్లా ఒంటిమిట్టకు రాసాగారు. మహాత్ముడైన బమ్మెర పోతన పేరు ఇప్పటికీ (అప్పటికీ) మండలంలో భక్తితో స్మరించబడుతుండం వల్ల, ఆ కవి పట్ట భద్రుడు ఎలాగైతే భాగవతాన్ని అర్పించాడో, అలానే ఎవరో శ్రీ కోదండరామస్వాముల వారికి శ్రీ రామాయణం సమర్పించేందుకు వస్తున్నారని విన్న వారందరు, భక్తి ఆవేశంతో-బాలోన్మత్త పిశాచగ్రస్తులలాగా "రామ-రామ" అంటూ, అన్ని వర్ణాల వారు, చుట్టు-పక్కల పది యోజనాల నుంచి వచ్చారు. అధమపక్షం అలా వచ్చిన వారి సంఖ్య అయిదు వేల పైనే వుంటుంది”.

“ఆహ్వానాలందుకుని వచ్చిన వారిలో చాలామంది గొప్ప కవులు, విద్వాంసులు, అధికారులు, పూజ్యులున్నారు. రాలేక పోయినవారిలో కొందరు గ్రంథావిష్కరణకు తమ ఆమోదం తెలుపుతూ ప్రత్యుత్తరమో-మాట మాత్రంగానో తెలియ పరిచారు. కొందరు సందేశాలను పంపారు. ఇలాంటి వారిలో రాజ శ్రీ రాయ బహదూర్ పి. అనంతాచార్యులవారు, విద్యా వినోద-విశారద-సి. ఐ. ఇ, మహామహోపాధ్యాయ బిరుదాంకితులు బ్రహ్మ శ్రీ కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు, రస్సల్ కొండ డిప్యూటీ కలెక్టర్ మహారాజ శ్రీ జయంతి రామయ్య పంతులు గారు, గుంటూరు జిల్లా కోర్ట్ మునసబు వావిలాల శివావధానులు గారు, పిఠాపురం ప్రధానోపాధ్యాయుడు కూచి నరసింహము పంతులు గారు, వైజాగ్ వకీలు బి. యాజులు గారు, కర్ణాటక పండితులు బ్రహ్మ శ్రీ సిద్ధాంతి శివశంకర శాస్త్రి గారు ప్రముఖులు. చెన్నపురి కళాశాలలనుంచి ఆంధ్ర భాషాభివర్ధనీ సమాజ సభ్యులు, కొందరు విద్యార్థులు వచ్చారు. పూర్వాచార పరాయణుడు-ప్రసిద్ధ పురాతన పుంగనూరు సంస్థాన ప్రభువు, మహారాజ రాజశ్రీ రాజా వీర బసవచిక్కరాయలు యశోవంత బహదూర్ గారు ఆయన సంస్థానంలోని దివాన్-పండితుడు బ్రహ్మ శ్రీ శేషప్ప శాస్త్రి గారిని, ఆస్థాన విద్వాంసుడు బ్రహ్మ శ్రీ వేంకటరామ శాస్త్రి గారిని పంపారు”.

“చెన్నపురి నుంచి శ్రీ శైలాద్దంకి సమయోద్దండ కోలాహల లక్ష్మీ నృసింహ కుమారేత్యాద్యభిజనవ్యపదేశ భాసురులు, అఖిల హరిదంతర విసృత్వర కవితా పరిమళ మహాకవిత్వోచిత సహృదయ సముదయ సాదర సమర్పిత కవిభూషణ బిరుద భూషణుడు, శ్రీమత్కుమార తాతా చార్యులు గారొచ్చారు. శ్రీ కాళహస్తి నుంచి ఆంధ్రీకృత మహాభారతులు, ఉభయ భాషా కవిత్వ తత్వజ్ఞులు బ్రహ్మ శ్రీ శత ఘంటము వేంకట రంగ శాస్త్రి గారొచ్చారు. వేంకటగిరి నుంచి కపిలాచిత్రకాయ ఉపాఖ్యానాది గ్రంథ కర్త శ్రీమదుభయ వేదాంత ప్రవర్తకులు శ్రీమత్కొమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, తిరుపతి నుంచి చుళికీకృత సమస్తాంధ్ర గ్రంథులు-ఉభయ కవివయన్యులు బ్రహ్మ శ్రీ నాగ పూడి కుప్పుసామయ్య గారు వచ్చారు. ఉభయ వేదాంత ప్రవర్తకులు-పండితులు శ్రీమత్కమలాపురము రాఘవాచార్యులు గారు, గోపాలాచార్యులు గారు, తర్క వ్యాకరణ పారంగతులు సీతారామ శాస్త్రి గారు, శ్రీమదష్టావధానం నరసింహాచార్యులు గారు, పార్థసారథి సెట్టి గారు, కోటి రెడ్డి గారు, కె. చెంగయ్య గారి లాంటి కవులు, విద్వాంసులు అనేకమంది వచ్చారు. వచ్చిన వారంతా విద్యావంతులే. అనాహుతులై వచ్చిన వారిలోనూ పెక్కురు విద్యావంతులున్నారు. అపరిచితులైన వారి పేర్లను నమోదు చేసుకునే అవకాశం కలగలేదు”.

“కార్యక్రమం మూడు రోజులూ, ఉదయం, శ్రీ సీతారామచంద్రులకు సహస్రనామార్చన యథావిధిగా జరుపబడింది. మొదటిరోజు ఉదయాన సంస్కృత వాల్మీకి రామాయణం, ఆంధ్ర వాల్మీకి రామాయణం పుస్తకాలను శ్రీస్వామివారి పల్లకిలో వుంచి, ఆ పల్లకిని, రాయబహద్దర్ బ్రహ్మ శ్రీ హనుమంత గౌడ్ గారు, నెమలి సుబ్బరావు గారు, మల్లవరపు పెంచలార్య కవి గారు, కాకినాడ సరస్వతీ పత్రికాధిపతి బ్రహ్మ శ్రీ కొత్తపల్లి సూర్యారావు గారు-ఇతర ప్రముఖులు తమ భుజాలపై మోసారు. బ్రహ్మ శ్రీ కొత్తపల్లి పద్మనాభ శాస్త్రి గారు, బ్రహ్మ శ్రీ రాజ శ్రీ కూనపరాజు శేషాద్రి రావు గారు, ఛత్రం-చామర పట్టుకుని తోడురాగా, మంగళ వాద్యాలతో దేవాలయ గ్రామ ప్రదక్షిణగా వూరేగించారు. గ్రంథానికి పూజ చేసిన తర్వాత ముందున్న కొంత భాగాన్ని కవి చదివారు. ఒక్కరే మూడు దినాల్లో పూర్తి గ్రంథాన్ని చదవడం కష్టమని భావించి, చిలుకూరి కృష్ణమూర్తి గారు, వేంకట సుబ్బయ్య గారు, పద్మనాభ శాస్త్రి గారు, కోమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, క్రొత్తపల్లి సూర్యారావు గారు, కూనపరాజు శేషాద్రి రావు గారు, కాళహస్తి శర్మ గారు తోడ్పడి పుస్తక పఠన పూర్తి చేశారు. మొదటిరోజు మధ్యాహ్నం దేవాలయ ముఖ మంటపంలో సభ జరిగింది. సీతారామ శాస్త్రి గారు, అష్టావధానం నరసింహాచార్యులు గారు, ఆర్కాట్ హనుమంతాచార్యులు గారు, అద్దంకి తాతాచార్యులు గారు, వాధూల శ్రీ వేంకట ప్రసన్న యోగీంద్ర స్వాముల (ధర్మకర్త) వారు, శ్రీ రామాయణం గురించి ఉపన్యసించారు. తెలుగు రాని బ్రహ్మ శ్రీ గోపాలసామయ్యర్ కూడా ఉపన్యసించారు”.

“రెండో రోజు మధ్యాహ్నం తిరిగి సభ జరిగింది. ఆహ్వాన సభా సభ్యుడు వి. వసంత రావు గారు సభ ఉద్దేశాన్ని, ఒంటిమిట్ట గ్రామ ప్రసిద్ధిని, కార్యక్రమ అపూర్వత్వాన్ని గురించి వివరించారు. ఆహ్వానితులకు స్వాగతం పలుకుతూ, (మూడు సీస పద్యాలు, ఒక ఉత్పలమాల, ఒక కవిరాజవిరాజితము) "స్వాగత పంచ రత్నాలు" చదివి వినిపించారు. అనంతరం సభాధ్యక్షుడు శ్రీమద్ధర్మవరము కృష్ణమాచార్యులు గారు ఆంధ్రా భాషా విషయాలను గురించి ఉపన్యసించి, సందేశాలను చదివి వినిపించి, గ్రంథోత్పత్తిని గురించి తెలుపమని కోరారు. "భక్తే ఈ గ్రంథ రచనకు కారణం" అని చెప్పిన నేను, ఈ విషయంలో శ్రీరామచంద్రుడు చేసిన సహాయం గురించి వివరించాను. ఆ తర్వాత సభాధ్యక్షుడు పండితులను ఉద్దేశించి, ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని, పరీక్షించవచ్చని కోరారు. అప్పటికప్పుడు కొందరడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం జరిగింది. చాలామంది పండితులు సభానంతరం వారి వసతి గృహాలకు గ్రంథాలను తీసుకొనిపోయి శోధించారు. ఆ రాత్రి పాదుకా పట్టాభిషేకం నాటకం ప్రదర్శించారు. వచ్చిన డబ్బులను దేవాలయానికి విరాళంగా ఇచ్చారు. పిండారబోసినట్లున్న పౌర్ణమి నాటి పండు వెన్నెలలో, నంజుండప్ప గారు, కమలాపురం రాఘవాచార్యులు గారు, నెమలి సుబ్బరావు గారు సీతా కల్యాణం హరి కథా కాలక్షేపం బోధించారు”.

“మూడో రోజు ఉదయం హిందూ మతం గురించి ఉపన్యాసాలయిన తర్వాత గ్రంథ పరీక్ష జరిగింది. పండితులందరూ వారి వారి సంతుష్టిని పద్యంగానో-ఉపన్యాసంగానో వెల్లడిచేసి, కృతిని ప్రశంసించి కవిని ఆశీర్వదించారు. పట్టాభిషేకం భాగం పఠనంతో, సభాధ్యక్షుడి ఉపన్యాసంతో సభ ముగిసింది. కనీ-వినీ ఎరుగని రీతిలో కార్యక్రమం ముగిసి, లోకులెల్లరు కొనియాడుతుంటే. శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం, కృతి భర్తైన ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి వారికి సమర్పించబడింది”.

“దిన త్రయం అన్నదానం జరిగింది. చిన్నా-పెద్దా తేడా లేకుండా అందరూ అందులో పాల్గొన్నారు. హేమా-హేమీలనుకునే వారు నడుం బిగించి వడ్డన చేశారు. వారందరికీ నా సాష్టాంగ నమస్కారాలు. అన్నదానానికి సహాయపడిన యాదాళ్ళ నాగమాంబ గారికి, శ్రీ వేంకట సుబ్బయ్య గారికి, శ్రీ యాదాళ్ల పాపయ్య సెట్టి గారికి, ఇతర పుణ్యాత్ములందరికి శ్రీరాముడు శాశ్వత సౌఖ్యాలను ఇచ్చుగాక”.

“కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణ కృతి ప్రశంస" గా "రత్నావళి పద్య పంచక బహు కృతి" ని చేశారు. అలానే కవిభూషణ అద్దంకి కుమార తాతర్య గారు, నాగ పూడి కుప్పుసామయ్య గారు, వేంకట రంగ శాస్త్రి గారు, మల్లవరపు పెంచలార్య కవి గారు, కొమాండూరు శ్రీనివాసాచార్యులు గారు, నాధముని దాసు గారు పద్య రూపంలో ప్రశంసించగా ఇతరులు ఉపన్యాస రూపంగా ప్రశంసించారు. అలనాటి పత్రికల్లో ఈ కార్యక్రమాన్ని గురించి విశేషంగా వార్తలొచ్చాయి. ప్రశసింస్తూ ప్రసంగం చేసిన వారు-పద్యాలను చదివిన వారు, నన్ను బమ్మెర పోతనతో పోల్చారు”.- వావిలికొలను సుబ్బరావు

అలనాటి సభలో పండితుల ప్రశంసలు-చెన్నపురి "ఆంధ్ర ప్రకాశిక" ప్రచురించిన వార్త:

"మునుపు తెనుగు భాగవతము బమ్మెర పోతరాజు దనకిడె నిపు డిం పెనయ న్వావిలి కొలని సుబ్బరావిడియె నాంధ్రరామాయణమున్..." - కొక్కొండ వేంకటరత్నము పంతులు గారు

"ఆన్ధ్రవాల్మీకి బిరుదం సుబ్బరాయాయ దిత్సితమ్..." - అద్దంకి కుమార తాతార్యః

"...ఆంధ్రభాషను రచించితి వీవు తెలుంగువారి కింపై యెసలారు పల్కులను హారియశోలతకాలవాలమై" - నాగపూడి కుప్పుసామయ్య
"అలవాల్మీకి మహర్షి సంస్కృత.... ... మహాకావ్యమున్ లలితోక్తిం దెనిగించినాడవు బుధుల్ వర్ణించి మే లౌననన్" - వేంకటరంగ శాస్త్రి

"... మౌనికావ్యతత్త్వమ్మును గాండసప్తకము వాసు కవింబలె నిర్వహింపలేమి మ్మనమెల్ల నీసుజన మిత్రుని జెల్లెదె యాంధ్రవాల్మికాఖ్య మ్మనసార బిల్వ... " - మల్లవరపు పెంచలార్యకవి

"ఎనిమిది యేడులలోపల, ఘనమగు రామాయణాంధ్ర కావ్యమును రచించినమేటివి నీ వొక్కడ, వనఘా నిన్నెనయుసుకవుల వనిం గలరే" - శ్రీమత్కొమాండూరు శ్రీనివాసాచార్యులు

"ఈతడే బమ్మెర పోతనాఖ్యుం డన, భాగవతమునకు బ్రతి యనంగ నాంధ్రవాల్మీకి రామాయణకావ్యంబు, రామాంకితంబుగ వ్రాసె నిపుడు.... .... మనకు బమ్మెర పోతనామాత్యుడితడే, యనుచు బల్కితి నమ్ముడీ యార్యులార..." - నాథమునిదాసు

"ఘృతము, క్షీరము, శర్కర కల్పిన నెట్టులుండునో గ్రంథమంతయు నట్టిదిగా నున్నది. ఇట్టి మృదులమైన పాకము శయ్యతోడి యాంధ్రగ్రంథము నేనింతవరకు జూడలేదు" - సీతారామ శాస్త్రి

ఆంధ్ర వాల్మీకి రామాయణాన్ని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామికి అంకితమిచ్చిన కార్యక్రమ విశేషాలను "హూణ పత్రిక" లే కాకుండా కాకినాడకు చెందిన "ఆర్య మత బోధిని" లోను, బొంబాయి నుండి ప్రచురించబడే "ఆంధ్ర పత్రిక" లోను కూడా వివరంగా ప్రకటించబడింది.

"ఆంధ్ర ప్రకాశిక": 17-10-1908

కృతి సమర్పణము: - ఒంటిమెట్ట యనునది చిన్న పల్లెటూరు. కడపకును, నందలూరుకును మధ్యనున్నది. ఇచట శ్రీకోదండరామస్వామి దేవాలయము కలదు. ఏకశిలా నగరమని వాడబడు పవిత్ర స్థాన మిదియే. భగవత్కథామయంబగు భాగవతమును బోతనామాత్యు డాంధ్రీకరించి, తన్మహాగ్రంథమును నీ శ్రీరామచంద్రుని కే యంకితముజేసి కృతార్థుండయ్యెను.

"బాలరసాలసాల నవపల్లవ కోమలకావ్యకన్యకన్
గూళల కిచ్చి యప్పడుపు గూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికు లైననేమి గహనాంతరసీమల కందమూల కౌ
ద్దాలికు లైననేమి నిజ దారసుతోదర పోషణార్థమై"

యని పోతనామాత్యుడు తన దృఢాభినివేశమును విశదీకరించి, తన శ్రీమదాంధ్ర మహాభాగవతమును నరాంకితము సేయనొల్లక భగవదంకిత మొనర్చెను. భగవద్భక్తుడగు పోతనామాత్యుడొనర్చిన సత్కార్యమునే యనుసరించి, బ్రహ్మశ్రీ వావిలికొలను సుబ్బారావు గారు తమ యాంధ్రవాల్మీకి రామాయణమును గోదండ రామస్వామి కంకితమొనర్చిరి. ఈ కృతి సమర్పణ మహోత్సవము గడచిన 9, 10, 11 తేదీలలో నొంటిమెట్టయందు శ్రీ రామస్వామి ప్రత్యక్షమున నిరుపమానముగ నెరవేర్పబడెను. బ్రహ్మశ్రీ సుబ్బారావు గారు చెన్నపురి సర్వ కళాశాలయందు బ్రధానాంధ్రోపాధ్యాయులుగ నున్నారు. శ్రీ సుబ్బారావు గారు వాల్మీకి రామాయణమును యథావిధిగా నాంధ్రీకరించి, యాంధ్రాభాషాప్రపంచమునకు మహోపకారమొనర్చిరి. ఈ మహాకృతి సమర్పణోత్సవమునకు జాలమంది ప్రముఖులును, విద్యార్థులును విచ్చేసిరి. ధర్మవరము కృష్ణమాచార్యులు మొదలగువారు సమయానుకూలముగ బ్రసంగించిరి. డిప్యూటీ కలెక్టమరు మెII టి. వి. గోపాలస్వామి అయ్యర్ గారు కించిత్పరిజ్ఞానము గల తెనుగున నుపన్యసించిరి. బళ్లారి సరసవినోదినీ సభవారు పాదుకాపట్టాభిషేక నాటకమును జయప్రదముగ ప్రదర్శించిరి. ఆంధ్ర వాల్మీకి రామాయణము నుండి కొన్ని భాగములు చదువబడెను. ప్రతిదినమును నొకపండితుడు శ్రీకోదండరామస్వామి సమక్షమున నీనూతన గ్రంథమును బఠించుచుండెను. వచ్చినవారలకెల్ల సంతృప్తిగా విందు లొసంగ బడెను. ఇట్టి సంస్తవనీయం బగు కార్యమొనర్చిన బ్రహ్మశ్రీ ఆంధ్రవాల్మీకి సుబ్బారావు గారికి శ్రీరామచంద్రుం డాయురారోగ్యంబు లొసంగి మనుచుగాత. ఆంధ్రభాషా ప్రపంచమందు విలసిల్లిన నీ యాంధ్ర వాల్మీకి రామాయణమును గనులార జూచి, మనసార బఠించి, పట్టరాని ప్రమదంబున

"ఇమ్మహి మానుషాధముల కిచ్చిపురంబులు వాహనంబులున్
సొమ్ములు గొన్నిపుచ్చుకొని సొక్కి శరీరము బాసి కాలుచే
సమ్మెటవ్రేటులం దినక సమ్మతి శ్రీహరి కిచ్చి చెప్పె నే
మమ్మున సుబ్బరాయకవి మాన్యు డటంచు గవీంద్రు డెంచెడున్”

అని ప్రకటింప బడియున్నది.-- వావిలికొలను సుబ్బారావు


(ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు-వావిలికొలను సుబ్బరావు- గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి- బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మూలం-చదివి అద్భుతమైన మానవాళి జనన-మరణ చక్రబంధం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయమని ప్రార్థన)

http://books.google.com/books?id=jZMJAQAAIAAJ&printsec=frontcover&source=gbs_v2_summary_r&cad=0#v=onepage&q=&f=false

ప్రాతఃస్మరణీయుడి ఆణిముత్యాలు (SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM GENESIS-NEED, CONCEPT AND EVOLUTION

జ్వాలా మ్యూజింగ్స్-24

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-గ్రంథోత్పత్తి
(SREEMATH ANDHRA VALMIKI RAMAYANAM
GENESIS-NEED, CONCEPT AND EVOLUTION-OF THE BOOK)

వనం జ్వాలా నరసింహారావు

1909 వ సంవత్సరంలో నాటి చెన్నపురి (నేటి చెన్నై) లోని "శ్రీ వైజయంతీ ముద్రా శాల" లో ముద్రించబడి, ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు (వావిలికొలను సుబ్బరావు) గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి నుంచి సేకరించిన విషయాలను "అనువక్త-వాచవి" గా నేను రాసిన "ఆంధ్ర వాల్మీకి రామాయణం-బాల కాండ మందరం" లఘుకృతి "మందర మకరందం” లో పొందుపరుస్తున్నాను. అపురూపమైన అలనాటి గ్రంథకర్త అభిప్రాయాలు అక్షర లక్షలు చేసే ఆణిముత్యాలు. ఆ ఆణిముత్యాలను నా బ్లాగ్ ద్వారా సాహితీ ప్రియులకు తెలియచేసే ప్రయత్నమే ఇది. తొలుత గ్రంథాన్ని రాయడానికి ఆయనెందుకు పూనుకున్నారో "విజ్ఞాపన" రూపంలో, పాఠకులను "ఆర్యులారా" అని సంబోధిస్తూ ఇలా తెలియ చేశారు:

“అనంత కల్యాణ గుణ గణ విశిష్టుడు, స్మరణ మాత్ర సంతుష్టుడు, వినత శిష్టుడు, నిహిత దుష్టుడు, దళిత భక్త కష్టుడు, సర్వలోకేష్టుడు, కృపా పూర్ణుడు, సత్యవాక్యోదీర్ణుడు అయిన ఏ సాక్షాత్ భగవంతుడిని సేవించే కాంక్షతో వశిష్టుడు హేయమైన రాజ పౌరోహిత్యాన్ని అంగీకరించాడో; ఏ జగదీశ్వరుడి ఉత్తమ శాశ్వత మోక్ష సౌఖ్య ప్రదమైన దర్శనాన్ని కోరి శరభంగాది మహర్షులు తృణీకృత బ్రహ్మ లోకాది ఉత్తమ లోకులయ్యారో; ఏ మహామహుడి జన్మస్థలమైనందున అయోధ్య ప్రధమ ముక్తి క్షేత్రమైందో; ఏ వేదాంతైక వేద్యుడికి ధనుర్విద్యనిచ్చి అపర బ్రహ్మ కృతార్థుడయ్యాడో; ఏ పర బ్రహ్మ మూర్తిని సేవించి ఆంజనేయుడు భావి బ్రహ్మ అయ్యాడో; ఏ పురాణ పురుష నామాన్ని విష్ణు సహస్ర నామ తుల్యమని సర్వజ్ఞుడి ద్వారా నిజ అర్థాంగి లక్ష్మికి ఉపదేశించబడెనో; ఏ దేవాదిదేవుడి నామాన్ని జపించి వాల్మీకి బ్రహ్మర్షియై శాశ్వత కీర్తిధాముడయ్యాడో; ఏ అద్వితీయునాఖ్యకు తారకంబనే విఖ్యాతి కలిగిందో; ఏ సర్వతంత్ర స్వతంత్రుడి అభిధానం సర్వ మంత్రోత్తమ సారమని కీర్తి వహించిందో; ఏ అమృత స్వరూపుడి నామం అమృతంలా రుచికరమో; ఏ అతిలోకుడి చరిత్ర వేదమో; అట్టి భక్త జన చకోర చంద్రుడైన శ్రీ రామచంద్రుడి పవిత్ర చరిత్రను గుణ సంఖ్యాదుల అన్వర్థ నామధేయంగా, ఆది కావ్యంగా భగవంతుడైన వాల్మీకి మహాముని గీర్వాణ భాషలో, నారదుడు ఉపదేశించిన మార్గంలో, బ్రహ్మోక్తిని అనుసరించి, రచించి, రామచంద్ర తనూజులైన కుశలవులతో, రాముడి సన్నిధానంలో, పఠింపచేసి, ఆయనకే అర్పించి, జగత్తులో వెల్లడిచేసిన విషయం మీకందరికీ తెలిసిన విషయమే కదా. రామచంద్ర తనయుడైన ఈ గ్రంథకర్త కూడా, నిజ జ్యేష్ఠ పితృవైన లక్ష్మణాఖ్యుడు ఉపదేశించినట్లుగా, తప్పక పారాయణం ఆచరిస్తూ, తత్ సుకృత పరిపాక వశాన్న కుశలవుల మాదిరిగా అయ్యి, ఈ కృతిని రచించి, "శీతాంశో రమృతార్పణ" మన్న విధంగా శ్రీరామచంద్రుడికే అర్పిస్తున్నాను”. - - వావిలికొలను సుబ్బరావు

శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం-గ్రంథోత్పత్తిని గురించి వివరిస్తూ: “నా తండ్రి రామచంద్ర రావుగారి గ్రంథాలలో అముద్రితమైన ఒక వచన రామాయణ గ్రంథముండేది. దాన్ని నేను బాల్యంలో చాలా పర్యాయాలు చదివాను. అప్పటినుంచి నాకు రామాయణ కథంటే బాగా అభిరుచి ఏర్పడింది. ఇదిలా వుండగా 1882 వ సంవత్సరంలో, మా బాబాయి లక్ష్మణరావు గారు, కమలాపురంలో డిప్యూటీ తహసీల్దారుగా పనిచేస్తుండే వారు. ఆయన గారికి నిరంతరం రామాయణ పారాయణం చేసే అలవాటుండడంతో, నా పూర్వ పుణ్య సుకృతం వల్లో- వారికి నాపైన కరుణ కలగడం వల్లో, నన్ను కూడా శ్రీ రామాయణాన్ని పారాయణం చేయమని ప్రోత్సహించి, చేసే విధానాన్ని ఉపదేశించారు. నేను పారాయణం చేస్తూ-గ్రంథాన్ని ఒక్కసారి పూర్తిగా చదివేసరికల్లా, దానిమీద భక్తి-శ్రద్ధలు పెరగడం మొదలైంది. ఇలా ఏళ్లు గడిచాయి”.

“కొంతకాలానికి నేను అనారోగ్యానికి గురైనందున, చేస్తున్న రాజకీయ ఉద్యోగాన్ని వదిలి ఉప వేతనం పై ఆధారపడి, నెల్లూరులో వుంటుండేవాడిని. ఆ సమయంలో, ఒక నాడు, బమ్మెర పోతన పలికిన "చెనకి చెరిచినాడు భాస్కరుడు గాకుండిన రామాయణము బండ్ల కెక్కింపనా" అన్న వాక్యాలు నా మనస్సులో జొరబడ్డాయి. ప్రతిరోజు ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నాననిపించింది. నేనెందుకు (మా) బమ్మెర పోతన సంకల్పాన్ని నెరవేర్చ రాదన్న భావన కలిగింది. మిత్రుడు బ్రహ్మ శ్రీ లంకల పల్లె వేంకట సుబ్బార్యులు గారి సలహా తీసుకున్నాను. వారు నా ఆలోచనకు మద్దతిచ్చి, నేననుకున్నట్లే చేయమని ప్రోత్సహించి, కంబ రామాయణంతో సహా, ఇతర భాషల్లోని రామాయణ గ్రంథాల్లోని ఉత్తమ పద్యాల సారాంశాన్ని సందర్భోచితంగా, ఆయన సహాయంతో, నేను రాయదల్చుకున్న రామాయణంలో చేర్చమని బోధించాడు”.

“ఇలా ప్రోత్సాహం లభించడంతో, (వాల్మీకి సంస్కృత రామాయణం) మూలంలోని 24, 000 శ్లోకాలకు, శ్లోకానికి ఒకటి చొప్పున, తెలుగులో 24,000 పద్యాలను రాయాలని సంకల్పించుకున్నాను. అయితే "శ్రేయాంసి బహువిఘ్నాని" అన్నట్లు నేనెక్కడ? నా ఆరోగ్య మెక్కడ? రామాయణ రచనెక్కడ? అనుకొని, వూరి మధ్యలో నున్న శ్రీరామచంద్రుడే ఇక నాకు శరణ్యం అన్న నిర్ణయానికొచ్చాను. ఆయన ఆదేశం ప్రకారం నడుచుకోవాలనుకొని, ఒకనాడు పారాయణం ముగిసిన తర్వాత, భగవత్ సన్నిధానంలో కూర్చొని, ఏం చెయ్యాలనుకుంటూ, శ్రీమద్రామాయణం పుస్తకం ముందుంచుకుని, ప్రశ్న వేసుకున్నాను. ఆశ్చర్యకరంగా వచ్చిన సమాధానం "ఉత్తిష్ఠ హరి శార్దూల, లంఘయస్వ మహార్ణవమ్" ("లెమ్మా హరిశార్దూలా, యిమ్మహితార్ణవము దాటుమీ") అన్న శ్లోక రూపంలో సమాధానం లభించింది. భగవత్ కటాక్షానికి పాత్రుడనయ్యానని, ఆ రోజునే, గ్రంథాన్నంతా రాసానని సంతోషంతో భావించాను. ఆ విషయాన్ని స్నేహితులకు తెలియచేసి, 1900వ సంవత్సరంలో, ఆశ్వయుజ శుద్ధ దశమి నాడు, గ్రంథ రచన ఆరంభించాను”.

“భద్రాద్రి రామభద్రుడికి అంకితమిచ్చిన నా రచన శ్రీకౌసల్యాపరిణయం నేటికీ (అప్పటికి) ఆయనకు అర్పించలేకపోయినందువల్ల, "ఒంటిమిట్ట" నేను పుట్టిన మండలంలోనే వుండడం వల్ల, శ్రీమదాంధ్ర భాగవతానికి ఇది జన్మస్థలం కావడంవల్ల, పోతనామాత్యుడు ఒకవేళ రామాయణం రాసి వుంటే ఆ రామభద్రుడికే అంకితం ఇచ్చి వుండేవాడైనందువల్ల, ఆయన సంకల్పం నెరవేరుస్తున్న నేను ఆయన ఉద్దేశం నెరవేర్చడం అభిలషణీయమై నందువల్ల, "ఇంటి ముందరున్న పారిజాతం" ఒంటిమిట్ట కోదండ రాముడికే ఈ కృతిని అంకితం చేశాను. గ్రంథ రచనను కొనసాగిస్తూ, కొంచెం-కొంచెం రాసుకుంటూ పోతూ, ఆ వూళ్ళో వుండగానే, 20-12-1900 కల్లా 29 సర్గలు తెలిగించాను. ఇందులో మూలంలో వున్నదంతా వుంచడమే కాకుండా, వర్ణనలు మరింత పెంచడంతో, మూలాతిక్రమణం జరిగిపోయి, వందల సంఖ్యలో ఎక్కువ పద్యాలు రాశాను. 1901వ సంవత్సరం-ఫిబ్రవరి నెలలో చెన్నపురికి (చెన్నై) వచ్చిన తర్వాత 11-10-1902 వరకు, అనారోగ్యంతో బాధపడుతున్నందువల్ల రచన సాగలేదు. కోలుకున్న తర్వాత మరల గ్రంథ రచనకు పూనుకుంటుండగా, స్నేహితుడు బ్రహ్మ శ్రీ క్రొత్తపల్లె పద్మనాభ శాస్త్రుల వారు ఒక సలహా ఇచ్చారు. వాల్మీకి రామాయణానికి "యథా మూలం” గా వున్న గ్రంథం ఇంతవరకు (అప్పటి వరకు) లేదనీ, మూలాన్ని అనుసరించి గ్రంథముంటే ఎక్కువ పూజించబడుతుందనీ, సాధ్యమైనంత వరకు మూల గ్రంథాన్ని అతిక్రమించకుండా-విషయం లోపించకుండా రచించమని సూచించారు. సంస్కృతంలో "వాల్మీకి రామాయణం" ఎలాగో, తెలుగులో నా రచన అలానే వుండేలా-అనుకునేలా, దీనికి "ఆంధ్ర వాల్మీకి రామాయణం" అని పేరు పెట్టమని కూడా చెప్పారు. గతంలో అనుభవంలోకి వచ్చిన విఘ్నాలను, నా ఆరోగ్య పరిస్థితిని, బ్రహ్మ శ్రీ వేంకట సుబ్బార్యుల సహాయం దుర్లభం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, క్రొత్తపల్లె వారి సూచనను అంగీకరించి రచనను కొనసాగించాను”.

“లోగడ రాసిన పద్యాలలో వందల కొలది తొలగించి, అతి-గణ-ప్రాస-భాష నియమాల్లో నాకు స్వాతంత్ర్యం కలిగిన రీతిలో-నా శక్తి కొలది యధా మూలంగా రచన చేయసాగాను. "మూలచ్ఛేదం" కలిగించిన ప్రక్షిప్తాలను తొలగించాల్సిన చోట తొలగించాను. రచనాకాలంలో మధ్య-మధ్య మూడు-నాలుగు సంవత్సరాల పాటు ఆనారోగ్యంవలన-అనివార్య కారణాల వలన వ్యర్థమైంది. దీర్ఘ విఘ్నాలకు భయపడి నిరుత్సాహం పొందినప్పుడు, "హేత్వంతరముల" విసుగు చెందినప్పుడు, శ్రీరామచంద్రుడే నాకు ఉత్సాహం కలిగించడంతో, శాలివాహన శకం ౧౮౩౦ (1830) అంటే 1908వ సంవత్సరంలో, శ్రావణ పౌర్ణమి నాడు, భగవదనుగ్రహం వల్ల కావ్యం పూర్తయింది. నాతో రామాయణ రచనను పూర్తి చేయించి, శ్రీ రామచంద్రుడే తన సత్య సంధత్వాన్ని ప్రపంచానికి తెలియపర్చాడు”.

“సంస్కృతం నుంచి తెలుగుకు భాషాంతరీకరణం చేస్తున్నప్పుడు, మూలంలోని ప్రతి అక్షరానికి అలాంటి మారక్షరం వేయాలన్న ఉద్దేశం నాకు లేదు. అలా రాయడమంటే, గ్రంథం తెలుగులో వున్నా, రాసేవాడికి-చదివేవాడికి సులభంగా వుండదు. మూలాన్ని వదిలిపెట్టి, "శాఖాచంక్రమణం" కూడా చేయలేదు. "పరికర-పరికరాంకురాది" అలంకారాలను, నాకు చేతనైనంతవరకు తత్ సమానమైన అక్షరాలతో పోషిస్తూ, తెనిగించాను. అక్కడక్కడ, అర్థం చేసుకోలేక పోతేనో, మతి హీనత వల్లో, సారస్యం తెలుసుకోలేనప్పుడు కొన్ని సరైన పదాలలో లోపముండవచ్చు. శ్లోక భావాన్ని మించి పద్యం మిగిలిపోయిన సందర్భంలో, పాదాన్ని పూర్తిచేయడానికి కొన్ని పదాలను ఎక్కువగా ఉపయోగించి వుండవచ్చు కూడా. శ్లేషాలంకారాలున్న శ్లోకాలను తెనిగించేటప్పుడు, వాటికున్న అర్థాలన్నీ, ఒకే పద్యంలో వచ్చేట్లు వీలైనంతవరకు ప్రయత్నం చేశాను. "తే వనేన వనం గత్వా" లాంటి వాటిలోని శ్లేషాన్ని పోషించడం కష్టమని భావించి ఆ ప్రయత్నం మానుకున్నాను. ఒక్కోసారి, శ్లోకానికి పద్యం కాకుండా, రెండు-మూడు శ్లోకాల భావాన్ని ఒక్క పద్యంలోనే చొప్పించే ప్రయత్నం కూడా చేశాను. రాసేది లోకోపకారమైన గ్రంథం కాబట్టి సార్వజనీనంగా వుండాలన్నదే నా అభిప్రాయం. ఈ కారణం వల్ల, మూలంలో గూఢంగా వున్న సందర్భాలలో, దాని అర్థాన్ని విడమర్చి కొంచెం పెంచి రాసాను. ఏ కారణం వల్ల వాల్మీకి తన కావ్యాన్ని "నిర్వచనం" గా రాసారో, అదే కారణం వల్ల నేనుకూడా తొలుత దీన్ని నిర్వచనంగానే రచించాను. నేను సర్వజ్ఞుడను కానందున, అల్పజ్ఞుడైనందున, శక్తిహీనుడను కూడా అయినందున, మీరు ఆలోచించి, నా సాహసానికి క్షమించి, మీ పిల్లల మాటలలాగా నా రచనను అనుగ్రహించి నన్ను ధన్యుడిని చేయమని ప్రార్థిస్తున్నాను. నా దోషాలను మన్నింతురుగాక” !-- వావిలికొలను సుబ్బరావు

(ఒక అజ్ఞాత మహానుభావుడి ద్వారా "కాలిఫోర్నియా (అమెరికా) విశ్వ విద్యాలయం" కు చెందిన "బర్క్ లీ" గ్రంథాలయంలో చేరుకుని, "గూగుల్ సంస్థ" డిజిటలైజ్ చేసి నందువల్ల నాకంట పడిన వాసు దాసు-వావిలికొలను సుబ్బరావు- గారి అలనాటి "శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం" మొదటి సంపుటి- బాల, అయోధ్య, అరణ్య, కిష్కింధ కాండలు మూలం-చదివి అద్భుతమైన మానవాళి జనన-మరణ చక్రబంధం గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయమని ప్రార్థన)