Showing posts with label గులాం నబీ ఆజాద్. Show all posts
Showing posts with label గులాం నబీ ఆజాద్. Show all posts

Friday, February 22, 2013

హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల సంఘటనలో ఎవరు తప్పు చేశారు?: వనం జ్వాలా నరసింహారావు


హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల సంఘటనలో 
ఎవరు తప్పు చేశారు?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (24-02-2013)

          రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశం ఉందంటూ కేంద్ర నిఘా సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ముందుగానే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి షిండే పదే-పదే ఎందుకు చెప్తున్నారు? గురువారం నాడు జంటపేలుళ్ళు జరిగిన దిల్‌షుక్‌ నగర్‌ ప్రాంతాన్ని,  హుటాహుటిన ఢిల్లీ నుంచి వచ్చిన షిండే ఆ మర్నాడు సందర్శించారు. ఆ తరువాత ప్రయివేట్-ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కూడా పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌, ముంబాయి, గోవాలతో పాటు మరికొన్ని ప్రాంతాలలో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు కేంద్ర నిఘా విభాగానికి పక్కా సమాచారం అందిందని, తమకందిన సమాచారం ఆధారంగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వాలను-పోలీసులను హెచ్చరించామని చెప్పారు. గురువారం ఉదయం కూడా హెచ్చరికలు జారీ చేశామని ఆయన చెప్పారు. కాకపోతే, పేలుళ్లు జరిగే అవకాశం మాత్రమే ఉందంటూ తాము హెచ్చరించాం కాని, ఫలానా ప్రాంతాలలో జరిగే అవకాశం ఉందని ప్రత్యేకంగా చెప్పలేదని ఆయన అన్నారు. కేంద్రం హెచ్చరికలు రాష్ట్ర పోలీసులు పట్టించుకోలేదన్న భావన ఆయన మాటల్లో వ్యక్తమైంది. రాష్ట్ర పోలీసుల వైఫల్యంపై కూడా ఆయన ఆచి-తూచి స్పందించడమే కాకుండా, ఆ విషయం రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణలో బయటపడుతుందని అన్నారు. ఐతే పార్లమెంట్ ఉభయ సభలలో షిండే ప్రకటన చేస్తూ, పరోక్షంగా, రాష్ట్ర ప్రభుత్వాన్ని-పోలీసులను తప్పు బట్టారు.

          పార్లమెంట్ ఉభయ సభలు హైదరాబాద్ బాంబ్ పేలుళ్ల విషయంలో పలుమార్లు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌లోని ఘటన స్థలాన్ని, ఆసుపత్రులను ఉదయాన్నే సందర్శించిన హోంశాఖ మంత్రి షిండే, మధ్యాహ్నానికల్లా ఢిల్లీకి చేరుకుని, రెండు గంటల ప్రాంతంలో పార్లమెంటుకు హాజరయ్యారు. ఉభయ సభల్లో ప్రకటన చేశారు. నిఘా సంస్థల సమాచారం విషయం, ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకున్న విషయం సభ్యులకు తెలియచేశారాయన. పనిలో పనిగా మరికొన్ని మాటలు చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో మరింత దృఢ నిశ్చయంతో మరిన్ని కఠిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. 16 మంది మరణానికి, 117 మంది గాయపడటానికి కారణమైన హైదరాబాద్ పేలుళ్ల దోషులను పట్టుకునేందుకు సాధ్యమైన అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారాలు లభించాయన్నారు. అజ్మల్ కసబ్, అఫ్జల్ గురు ఉరితీతల నేపథ్యంలో పాకిస్థాన్ కేంద్రంగా గల ఉగ్రవాద గ్రూపులు దాడులకు పాల్పడవచ్చని తమకు ముందస్తు సమాచారం వుందన్నారు. తమ హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా తీసుకోలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన నగరమైన హైదరాబాద్‌లో ఉగ్రవాద గ్రూపులు దాడి చేయవచ్చంటూ ఫిబ్రవరి 16, 19, 20 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం అని కూడా హోంమంత్రి చెప్పారు. ఇంటెలిజెన్స్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వాలు తరచూ తేలికగా తీసుకుంటుంటారు అని పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు బడుతూ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోందని ముగించారు తన ప్రకటనను.

          ఇంతకీ తప్పెవరిది? ఒప్పెవరిది? ఆరేడేళ్లగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోక పోవడానికి మన పోలీసులను అభినందించాలా? నిఘా సంస్థల సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి-పోలీసులకు కేంద్రం చేరవేసినా, బాంబు పేలుళ్లను నిరోధించడంలో విఫలమై నందుకు  వారిని అభిశంసించాలా? ఏదేమైనా అమాయకుల ప్రాణాలు పోయాయి. మరెందరో క్షతగాత్రులయ్యారు. మామూలుగా, ఎప్పటి లాగానే, ప్రభుత్వం సహాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఆరేడు లక్షల రూపాయలు, గాయ పడినవారికి లక్ష రూపాయల వరకు, నష్ట పరిహారం ప్రకటించడంతో తన బాధ్యతను కొంతవరకు తీర్చుకున్నట్లు ప్రభుత్వం భావించింది. దానికి తోడు ఆసుపత్రులలో చికిత్స కయ్యే వ్యయమంతా భరిస్తామని కూడా ప్రభుత్వం చెపుతోంది. కాకపోతే, గతంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు, ఇలానే ప్రకటించిన నష్టపరిహారం ఇంతవరకూ ఎవరికీ అందలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఐతే, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న నష్టపరిహారానికి అదనంగా ప్రధాన మంత్రి కూడా కొంత ఇస్తామని పార్లమెంటులో షిండే ప్రకటన చేయడం కొస మెరుపు.
            ఇలాంటి సందర్భాలలో ఎవరైనా కాని, ముఖ్యంగా, బాధ్యతాయుతమైన వ్యక్తులు ఆచి-తూచి మాట్లాడడం మంచిది. ఎవరికి తోచింది వారు మాట్లాడితే, ఘటనలో గాయపడ్డవారు, మృతుల కుటుంబీకులు ఆవేదనకు గురయ్యే ప్రమాదముంది. ఘటన జరిగీ-జరగక ముందే, ఫలానా వారు దీనికి బాధ్యులంటూ అధికార వర్గాలు తమ దగ్గర సమాచారం వుందని అంటున్నారు. అంత తొందరగా సమాచారం సంపాదించగలిగిన వారు, పేలుళ్లను నిరోధించడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాల్సిన బాధ్యత వుంది. మీడియా కూడా తక్కువేమీ తినలేదు. ఫలానా వ్యక్తులు దీనికి సూత్రధారులంటూ, వారి ఫొటోలతో సహా బయట పెట్తున్నారు. ఒక విధంగా, అదే నిజమైతే, దర్యాప్తుకు విఘాతం కలగవచ్చని వారు ఆలోచించడం లేదు. ఫలానా వ్యక్తి కొన్నాళ్ల క్రితం రెక్కీ నిర్వహించారని తమ దగ్గర సమాచారం వున్నట్లు కొన్ని పత్రికలలో కధనాలొచ్చాయి. అలాంటి సమాచారం ఇప్పుడే వచ్చిందా? ఇంతకు ముందే వారి దగ్గర వుందా? వుంటే ఎందుకు బయట పెట్ట లేదు? తప్పొప్పులను ఎంచడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం కాదు కాని, తప్పొప్పుల బాధ్యత పంచుకోవడంలో బాధ్యతాయుతమైన అధికారులు తప్పటడుగు వేస్తున్నారని చెప్పక తప్పదు. ఆ దిశగా కొన్ని ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

            దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడి ప్రాంతంలో లోగడ ఒక సారి ఇలాంటి దుర్ఘటన జరిగింది. మళ్లీ జరిగే అవకాశాలను పోలీసులు ఎప్పుడైనా నిశితంగా పరిశీలించారా? సర్వసాధారణంగా రద్దీ ప్రాంతాలైన దిల్ షుక్ నగర్ లాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి సంఘటనలు జరిగే వీలుంది కనుక, కేంద్ర ప్రభుత్వ నిఘా విభాగం తమకు హెచ్చరికలు జారీ చేసిన పిదప, ఇలాంటి స్థలాలలో మరి కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేశారా? ఉదాహరణకు, దుండగులు సీసీ కెమేరాల తీగలను కత్తిరించి అవి పని చేయకుండా చేశారని వార్తలొచ్చాయి. అదే నిజమైతే, అవి పని చేయకపోవడమనే విషయం పోలీసులకు ఎందుకు తెలియదు? తెలుసుకోలేక పోయారా? అసలు, సీసీ కెమేరాల పనిని పర్యవేక్షించే అధికారి బాధ్యతలేంటి? మహా వుంటే హైదరాబాద్ మొత్తంలో ఒక వంద వరకు అలాంటివి వుండవచ్చు. వాటిలోంచి నాలుగైదు రోజులుగా ఫుటేజీ రాకపోతే, వాటిని పర్యవేక్షిస్తున్న అధికారికి ఆ విషయం తెలుసుకునే మార్గం లేదా? పోనీ, ఇలాంటి సౌకర్యాన్ని వికేంద్రీకరించి స్థానిక పోలీసు స్టేషన్ పరిధిలోకి తెచ్చి వుండవచ్చు కదా? సరే ఇదంతా జరగక ముందు జాగ్రత్త. అందులో విఫలమైతే, సంఘటన జరిగిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నా సక్రమంగా తీసుకున్నారా? అంటే, అదీ సరిగ్గా లేదు.

          వార్తా పత్రికల్లో వచ్చిన కధనాల ప్రకారం, సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆ ప్రాంతం ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందన్న మీమాంస వచ్చిందట. అదే నిజమైతే, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు. జరిగిందొక దుర్ఘటన. ఉగ్రవాద చర్య. దానికి గురైనవారు అన్ని ప్రాంతాల వారున్నారు. ముందు సహాయక చర్యలు ప్రారంభం కావాలి. అది అన్నింటికన్నా ప్రాముఖ్యత వున్న అంశం. అంతే కాని, ఏ పోలీసు స్టేషన్ పరిధిలోకి ఆ ప్రాంతం వస్తుందన్న విషయం అంత ముఖ్యమైంది కానే కాదు. అసలింతకీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏ నిమిషంలో ఏం చేయాలి అన్న "బ్లూ ప్రింట్" అంటూ ఒకటే మన్నా వుందా? ఉదాహరణకు, ట్రాఫిక్ నియంత్రణే తీసుకుందాం. దిల్ షుక్ నగర్ జాతీయ రహదారిలో ఒక ప్రధాన కూడలి. నిత్యం-ఇరవై నాలుగు గంటలూ, వందలాది వాహనాలు అటు వైపునుంచి విజయవాడ దిక్కుగా, హైదరాబాద్ దిక్కుగా పోతుంటాయి. వీటన్నిటినీ తక్షణమే ఎలా దారి మళ్లించాలి అన్న విషయంలో ఏదన్నా ఒక బ్లూ ప్రింట్ ట్రాఫిక్ పోలీసుల దగ్గర వుందా? వుంటే దానిని ఎందుకు సరిగ్గా అమలు చేయలేదు. ఎవరి పని వారు సక్రమంగా అలాంటి సమయాల్లో చేయాల్సిన బాధ్యత అందరి పైనా వుంటుంది. అసలు వాళ్లేమీ చేయలేదని ఆరోపించడం లేదు కాని, చేయాల్సినంత వేగంగా చేశారా? లేదా? అనేదే ప్రశ్న!

          ఇదిలా వుంటే కొందరు బాధ్యతాయుతమైన వ్యక్తుల ప్రకటనలు అతి జుగుప్సాకరంగా వున్నాయి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వీరిలో ప్రముఖుడు. ఈ దారుణమైన సంఘటనను అత్యంత స్వల్పమైన విషయంగా పోల్చి చూపే ప్రయత్నం చేశారాయన. అలా మాట్లాడడం వలన దెబ్బ తిన్న వారి మనోభావాలు మరింతగా దెబ్బ తింటాయన్న ఆలోచన కూడా ఆయనకు రాకపోవడం శోచనీయం. అలానే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటన కూడా. ఇలాంటి సంఘటనలు జమ్ము-కాశ్మీర్‌లో నిత్యం పరిపాటని, తాను ముఖ్యమంత్రిగా పని చేస్తున్నప్పుడు ఎన్నో చూశానని ఆయన అనడం హాస్యాస్పదం. చారిత్రకంగా-భౌగోళికంగా జమ్మూ-కాశ్మీర్ పరిస్థితి వేరు. ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితి వేరు. అక్కడ తీవ్రవాదం వేళ్లూనుకుని పోయింది. దానిని అంతమొందించడానికి ప్రభుత్వం అహర్నిశలూ కృషి చేస్తుంది. ఇక్కడ చోటు చేసుకున్న సంఘటన దాదాపు ఏడేళ్ల తరువాత మొదటిది. దీనికి-దానికీ లంకె పెట్టి పోల్చి చూపడం ఆజాద్ లాంటి బాధ్యతాయుతమైన పదవుల్లో వున్న వారు చేయాల్సిన పని కాదు.

          ఏదేమైనా, ఇది తప్పొప్పులు ఎంచుకునే సమయం కాదు. షిండే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి వుండవచ్చు. కాని దానిని ఆయన పదే పదే ఉచ్చరించడం భావ్యం కాదు. అలానే రాష్ట్ర ప్రభుత్వం తన తప్పును కప్పి పుచ్చుకోవడమూ సమంజసం కాదు. తమ బాధ్యతలను తాము గుర్తుంచుకోవడం బాధ్యతాయుతమైన స్థానాల్లో వున్న ప్రతి వారికీ మంచిది!

Friday, July 15, 2011

తెలంగాణ ఇచ్చుడేమో కాని..శాశ్వతంగా తెలుగోళ్లను విడగొడుతున్న ఆజాద్:వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ ఇచ్చుడేమో కాని..

శాశ్వతంగా తెలుగోళ్లను విడగొడుతున్న ఆజాద్

అగ్గికి ఆజ్యం ఆజాద్‌ వ్యాఖ్యలు

సూర్య దినపత్రిక (16-07-2011)

వనం జ్వాలా నరసింహారావు

తెలంగాణ ప్రజల మాటే మో కాని, అఖిలాంధ్ర ప్రజలకు సైతం బద్ధ శత్రువుగా, ప్రధాన విలన్ గా ఆజాద్ వ్యవహరించడానికి కారణం అర్థం చేసుకోలేని స్థితిలో పడిపోయారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాష్ట్ర శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం-పోనీ ఏకాభిప్రాయం తప్పనిసరి అని ఆజాద్ నొక్కి చెప్పడం-అదీ దేశం కాని దేశంలో, అక్కడ కూడా మరీ ప్రత్యేకంగా పనిగట్టుకుని చెప్పడంతో , రాజీనామా చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులతో సహా, అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ వాదులు, ఆజాద్‌పై నిప్పులు చెరుగుతున్నారు. దామోదర్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆజాద్ ను రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ ఛార్జీ పదవి నుంచి తొలగించాలని కూడా డిమాండ్‌ చేశారు. తెలంగాణపై అధిష్టానం సానుకూలంగా స్పందిస్తుందని అంతా ఆశిస్తున్న తరుణంలో ఆజాద్‌ చాలా దుర్మార్గంగా మాట్లాడారని ఆయనతో సహా, పలువురు కాంగ్రెస్ నేతలు, బహిరంగంగానే ఆజాద్ ను దుయ్యబట్టారు. ఆయనను అధిష్ఠానమైనా తొలగించాలి లేదా ఆయనే స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ గా దిగన్నా పోవాలని ఎంపీ వివేక్‌ హెచ్చరించారు. వంద మంది ఆజాద్‌లు వచ్చినా తెలంగాణను ఆపలేరని ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, ఆజాద్‌ వ్యాఖ్యలు అర్థ రహితం-అ నైతికం అని ఎంపీ మధు యాష్కీ...ఇలా అందరూ ఆజాద్ మీద నిప్పులు కక్కారు. గులాంనబీ ఆజాద్ కొత్త మాట మాట్లాడుతున్నాడని, అసెంబ్లీలో తీర్మానం పెడితే తెలంగాణ ఇస్తామని మోసపూరిత మాటలు చెపుతున్నాడని, తాము చేతగానోళ్లంకాదని, పార్లమెంటులో బిల్లు పెట్టి తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఉరికిచ్చికొడతారని, తెలంగాణ టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌ రావు సహితం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ మరో కపట నాటకం ఆడుతోందని కూడా ధ్వజమెత్తారు.

అంతకు ఒకరోజు క్రితమే, కాంగ్రెస్ అధిష్టానం అనుమతి వున్నదన్న అర్థం స్ఫురించే రీతిలో, అధికార ప్రతినిధి, తెలంగాణ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనే దిశగా, మూడు-నాలుగు రకాల ప్రతిపాదనలు చేశారన్న వార్తలకు ప్రింటు-ఎలెక్ట్రానిక్ మీడియాలో విశేషంగా ప్రచారం లభించడంతో, ఆశావహులై వున్న తెలంగాణ కాంగ్రెస్-టిడిపి-బిజెపి-టి ఆర్ ఎస్ శ్రేణుల్లో, ఆజాద్ వ్యాఖ్యలు ఒక్క సారిగా కలకలం కలిగించాయి. ఇంతకూ ఏం జరగొచ్చు? ఏం జరిగే అవకాశాలున్నాయి? తెలంగాణ ఇచ్చినా-ఇవ్వక పోయినా, కనీసం తెలుగు మాట్లాడే వారందరినీ, భౌగోళికంగా విడదీసినా-తీయక పోయినా, సన్నిహిత-స్నేహ-బంధుత్వాలన్నా కొనసాగనిస్తుందా యుపిఎ కేంద్ర ప్రభుత్వం? అజాదొక మాట, సింఘ్వీ మరొక మాట, అహ్మద్ పటేల్ ఇంకొక మాట, సీమాంధ్రులు కలిసినప్పుడొక వ్యాఖ్యానం, తెలంగాణ వారు కలిసినప్పుడు మరో విధమైన స్పందన చేయడం తగునా? అన్నీ భేతాళ ప్రశ్నలే!

ఈ నేపధ్యంలో, కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తేవడానికి, తెలంగాణ సెంటిమెంటు ఎంత తీవ్రంగా వుందో తెలియచేయడానికి, రాజీనామాలు చేసిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ నాయకులలో-అందునా రాజీనామా చేసిన వారిలో, కొందరికై నా చిత్తశుద్ధి లేదని, సీమాంధ్ర నాయకులు పదే-పదే చెపుతున్న (పోనీ ప్రచారం చేస్తున్న) విధంగా, దీక్షా శిబిరానికి రాజీనామా చేసిన తెలంగాణ మంత్రులలో 11 మంది హాజరైనప్పటికీ, వీరిలో, కారణాలేవైనప్పటికీ, శ్రీధర్‌ బాబు, సుదర్శన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, డీకే అరుణ దీక్షకు మద్దతు తెలిపినట్లే తెలిపి మధ్య లోనే జారుకోవడం చాలా మందిని నిరాశకు గురి చేసిందనాలి. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వేదికపై ప్రసంగించడానికి కూడా ఒప్పుకోక పోవడం వెనుక కారణాలే మై వుండవచ్చో? అంతే కాదు..రాజీనామా చేసిన మంత్రులందరూ-కనీసం చాలా మందైనా, అధికారిక సౌకర్యాలన్నీ అనుభవిస్తూ, ముఖ్య మంత్రి వద్దకు తరచుగా వెళ్ళి మాట్లాడుతూ, అడపదడప తమ శాఖలకు చెందిన అంశాలకు సంబంధించి, అధికారులకు ఆదేశాలూ జారీ చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదెంతవరకు సమంజసమో తేల్చుకోవాల్సింది, రాజీనామా చేసిన మంత్రులే తప్ప మరెవరూ కాదు.

ప్రజా ప్రతినిధులందరూ రాజీనామా చేస్తే రాజ్యాంగ సంక్షోభం వస్తుందని, కాంగ్రెస్ అధిష్టానం-యుపిఎ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం మెట్టు దిగి ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటిస్తుందని భావించిన తెలంగాణ నాయకుల ఆశలు నెరవేరడం లేదు. అలా అని అడియాసలూ కావడం లేదు. అంతా నాన్చుడు ధోరణే. కాంగ్రెస్ పార్టీ సంస్కృతే అంత. అందుకే ఆ పార్టీ వారే నిరసన దీక్షలు చేపట్టారు. అలాంటప్పుడు, నిరసన దీక్షలో రాజీనామా చేసిన వారందరూ చిత్త శుద్ధితో పాల్గొనక పోవడం ఎంతవరకు సమంజసం? వీరిలా చేయడం, అధిష్టానానికి ఎటువంటి సంకేతాలనిస్తుందో తెలియదు. మంత్రులు అంతగా పట్టించుకోక పోయినా, ఎమ్మెల్యేలందరన్నా సంఘీభావంతో వుంటే చాలన్న అభిప్రాయానికి వస్తున్నారు కొందరు. మరో వైపు, తెలుగు దేశం పార్టీకి చెందిన రాజీనామా చేసిన ప్రజా ప్రతినిధులు బస్సు యాత్ర పేరిట జనంలోకి చొచ్చుకు పోతూ, సభలు, సమావేశాలు జరపడం-ప్రజల నుంచి స్పందన కూడా లభించడం, కాంగ్రెస్ శ్రేణులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎవరు ముందు-ఎవరు వెనుక అనే మీమాంసలో పడుతున్నారందరూ. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు దీక్షకు దిగడానికి రెండు రోజుల ముందర, తెలంగాణ ఉద్యమంలో భాగంగా, ఉస్మానియా విద్యార్థి నాయకుల సామూహిక నిరవధిక నిరాహార దీక్ష ఉస్మానియా యూనివర్సిటీ పరిసరాలలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. పోలీసుల దిగ్బంధాన్ని చేదించుకొని, వందల సంఖ్యలో విద్యార్థులు నిరాహార దీక్షకు దిగడం రాబోయే రోజుల్లో, తెలంగాణా ఉద్యమం దాల్చనున్న తీవ్రతకు హెచ్చరికగా భావించాలి. విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపేందుకు అసెంబ్లీ నుంచి బయలుదేరిన నాయకులను అసెంబ్లీ వద్దే అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో, వారు అక్కడే ధర్నాకు దిగారు. తమను అరెస్టు చేయడం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఎమ్మెల్యేలు మండిపడ్డారు. జిల్లాల నుంచి హైదరాబాద్ తరలి వస్తున్న విద్యార్థులను మార్గమధ్యంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనేక చోట్ల కేసులు పెట్టారు.

ఇంతకూ ఏం జరుగుతోంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వున్న తెలుగు ప్రజలను భౌగోళికంగా విడదీసినా తీయక పోయినా, అనుక్షణం, ఇరు ప్రాంతాల తెలుగు మాట్లాడే వారి మధ్య, వైషమ్యాలు దినదినాభి వృద్ధి చెందడానికి కాంగ్రెస్ పార్టీ-దాని సారధ్యంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, ఎంత చేయడానికి వీలుంటుందో అంతా చేసి చూపిస్తున్నది. యుపిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వేసిన ముసుగును అదే కొంచెం సేపు తొలగించడం, ఆ తర్వాత సరిచేసి మళ్లీ వేయడం, తెలుగు మాట్లాడేవారి ఆత్మగౌరవాన్ని కించపరచడమే. మంత్రివర్గ విస్తరణ ముగిసిన వెంటనే తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కాంగ్రెస్ తనదైన శైలిలో ఒక్కో నాయకుడితో ఒక్కో రకమైన చిలక పలుకులు అనిపిస్తోంది. ఏఐసీసీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వీ వెల్లడి చేసిన ప్రతిపాదనలను, ఇరవై నాలుగు గంటలు గడవక ముందే, ఆజాద్‌ ఖండించకపోయినా, అంతకంటే ఘోరంగా మరో ప్రకటన చేశారు. దీనిద్వారా రెండేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అల జడులకు ముగింపు ఇచ్చే ఆలోచన చేస్తోందా? లేక రాష్ట్రాన్ని రావణా కాష్టంలాగా ఏళ్ల తరబడి మండించే ఆలోచనలో వుందా కాంగ్రెస్-దాని నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనే అనుమానంలో పడ్డారందురు. లేదా, ఇరు ప్రాంతాల ప్రజలను మానసికంగా క్షోభకు గురి చేసి, కేంద్రం ఏది చెప్పినా వినేందుకు సన్నద్ధం చేస్తున్నారా?

ఆజాద్‌ చేసిన ప్రకటన అనేక మతలబులతో కూడుకున్నదనే విషయం ఏ మాత్రం ఇంగిత జ్ఞానం వున్న వారికైనా అర్థమవుతూనే ఉంది. తెలంగాణ సెంటిమెంటుపై కేంద్రం సానుభూతితో ఉందని చెబుతూ నే, రాష్ట్ర విభజనను సీమాంధ్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, తెలంగాణలో రాష్ర్టం కోసం ఎంత బలంగా ఉద్యమిస్తున్నారో, సీమాంధ్రలో తెలంగాణకు అంత బలమైన వ్యతిరేకత ఉందని ఆజాద్ అనడంలో కొత్తే మన్నా వుందా? ఆయన ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నారా? సీమాంధ్రుల మద్దతు లేకుండా తెలంగాణ ఏర్పాటు చేయడం అసాధ్యమనే సంగతి ఇప్పుడెందుకు ప్రస్తావించాలి? ఏకాభిప్రాయ సాధన ఒక్కటే మార్గమని ఆజాద్‌ చెప్పడంతో సరిపోదు. ఆ ఏకాభిప్రాయ సాధనకు ఆయన గాని, ఆయనతో ఆ మాటలనిపిస్తున్న అధినేత్రి సోనియా గాంధీ కాని, ఏం చర్యలు తీసుకున్నారు-తీసుకోబోతున్నారనేది కూడా స్పష్టం చేయాలి. మూడు ప్రాంతాలు కొత్త రాష్ట్రానికి అంగీకరిస్తేనే తెలంగాణ సాధ్యమవుతుందని చెపుతున్న పెద్దమనిషికి, ఆ మూడు ప్రాంతాల అంగీకారంతోనే ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిందా? లేదా? అన్న సంగతి తెలుసోలేదో! ఏదేమైనా, రాయలసీమ, కోస్తా నేతలు అంగీకరించరు కాబట్టి, తెలంగాణ ఏర్పాటు అసాధ్యమని ఆయన మనసులో మాటైతే, ధైర్యంగా-అధికారికంగా-ప్రభుత్వ పరంగా ఆ ప్రకటన చేసి, దానికి కట్టుబడి, సంభవించ బోయే పర్యవసానాలను ఎదుర్కోవాలి. ఒక వేళ తెలంగాణ సమస్య మొత్తంలో హైదరాబాద్ నగరం విషయం అత్యంత క్లిష్టమైన అంశంగా కాంగ్రెస్ హైకమాండ్ గాని, మన్మోహన్ ప్రభుత్వం కాని, ఆజాదు లాంటి వారు కాని భావిస్తే, అది పక్కన పెట్టి, మిగతా విషయాలకు సంబంధించిన స్పష్టమైన ప్రతిపాదనతోనన్నా ప్రభుత్వం ముందుకు రావచ్చు కదా?

వంద మందికి పైగా శాసన సభ్యులు రాజీనామా చేశారు మన రాష్ట్రంలో. మంత్రులలో పలువురు రాజీనామా చేసి విధులకు సరిగ్గా హాజరవడం లేదు. కేంద్రంలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగినట్లే రాష్ట్రంలో జరుగుతుందో-లేదో తెలియదు. పాలన మొత్తం స్తంభించి పోయింది. ఐనా, రాజకీయ సంక్షోభం లేదని ఒకరు, రాజ్యాంగ సంక్షోభం లేదని ఇంకొకరు అంటున్నారు. పాలన సజావుగా సాగక పోవడం కన్నా ఇంకేం సంక్షోభం కావాలో మరి! ప్రభుత్వ విధులకు హాజరవ్వాల్సిన మంత్రులు, నిరాహార దీక్షలో కూచోడం కన్నా సంక్షోభం ఇంకేముంటుంది? ఏదేమైనా, సమస్యను పరిష్కరించుకో దలిస్తే, సంక్షోభం వుందో-లేదో అర్థమవుతుంది కాని, నిర్లిప్తతతో వుండే వారికి అంతా "ఆల్ ఈజ్ వెల్"!