Showing posts with label వివాహ వేడుక. Show all posts
Showing posts with label వివాహ వేడుక. Show all posts

Sunday, February 28, 2010

వివాహబంధం-XIII : మూడు నిద్రలు-సత్యనారాయణ వ్రతం-పెళ్ళి సారె : వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-XIII
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

వరుడింట్లో వేడుకలు-వధువింటికి మళ్ళీ ప్రయాణం
వనం జ్వాలానరసింహారావు

ఖమ్మంలోని మా ఇల్లే విడిదిల్లు కూడా కావడం వల్ల, గృహ ప్రవేశం సొంత ఇంట్లో జరిగినట్లే అయింది. మామ గారింటినుంచి మా ఇంటికి రావడానికి ఎక్కువ సమయం పట్ట లేదు. ఆ రోజుల్లో (ఇప్పటికీ ఆ సాంప్రదాయం ఇంకా కొనసాగుతూనే వుంది) కొన్ని ఖర్చులను ఆడ-మగ పెళ్ళి వారు సమానంగా పంచుకునేవారు. ఉదాహరణకు పెళ్ళి ఫొటోలు, సన్నాయి మేళం, రవాణా చార్జీలు నిర్మొహమాటంగా చెరి సగం అనుకునేవారు. రవాణా చార్జీలు పెళ్ళికి వచ్చేటప్పుడు మగ పెళ్ళి వారికి కావాల్సిన సదుపాయాలన్నీ ఆడ పెళ్ళి వారు చేయించేవారు. అంటే పెళ్ళికి తీసుకుని రావాల్సిన బాధ్యత వాళ్లదని అర్థం. ఇక పెళ్ళైన తర్వాత పెళ్ళి కూతురుతో తిరుగు ప్రయాణంలో ఖర్చంతా మగ పెళ్ళి వారిది. సన్నాయి ఖర్చూ అంతే. మాకు గుర్తున్నంతవరకూ, మా పెళ్ళికి ముందు చాలా మందికి వారిళ్లల్లో జరిగిన పెళ్ళిళ్లకు ఫొటోలు తీయించడం ఇంకా అలవాటు కాలేదు. ఖమ్మంలో మాతో పాటే కాలేజీలో చదువుకున్న వెంకట్రావుకు ఫొటో స్టూడియో వుండేది. ఆయనతోనే తీయించారు (బ్లాక్ అండ్ వైట్లోల) ఫొటోలు. బహుశా అప్పట్లో అదొక్కటే స్టూడియో అనుకుంటా. పెళ్ళికి ముందు జరిగిన ఒప్పందం ప్రకారం చెరొక కాపీ ఫొటోలన్నీ ఇవ్వాలని, ఖర్చు చెరి సగమని మా నాన్న-మామ గారు అనుకున్నారు. చివరికి ఎవరిచ్చారో గుర్తులేదు. అసలు ఫొటోలు తీయించిన ప్రధాన ఉద్దేశం, మా మామ గారి పెద్దకొడుకు డాక్టర్ రంగారావు గారు ఇంగ్లాండులో వుండి పెళ్ళికి రాలేకపోయినందున, అక్కడకు పంపించడానికని తర్వాత మా ఆవిడ చెప్పింది.

తిరుగు ప్రయాణం కూడా ఎద్దుల బండ్లలోనే అట్టహాసంగా జరిగింది. మా ఇద్దరిని పల్లకిలో కూర్చొబెట్టారు. ఖమ్మం నుండి తెల్లవారు ఝామున బయలుదేరి, వెంకటగిరి, లక్ష్మీ పురం, చిరు మర్రి మీదుగా మా వూరికి చేరుకున్నాం. దారిలో గ్రామం వచ్చినప్పుడల్లా, వూరు దాటిందాకా, పల్లకి ముందు సన్నాయి వాయించడం సాంప్రదాయంగా జరిగింది. తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలుగుతుందని భావించి, ప్రతి గ్రామంలో అలా చేయొద్దని చెప్పాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలోనూ నేను ధోవతి కట్టుకునే వుండడం కూడా తనకు నచ్చలేదని చాలా కాలం తర్వాత చెప్పింది మా ఆవిడ. మే నెల మొదటి తేదీన, ఉదయం సుమారు పది గంటల సమయంలో మా వూరికి చేరుకున్నాం. సాధారణంగా, సాంప్రదాయం ప్రకారం సాయంత్రం సమయంలో పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును గృహప్రవేశం చేయించడం ఆచారంగావస్తున్నది. అందువల్ల మా ఉభయులను, మా ఇంటికి కాకుండా, నాకు వరుసకు "నాయనమ్మ" అయిన మా పాలివారింటికి (వనం రంగనాయకమ్మ గారు) తీసుకెళ్లారు. స్నానం చేసి అలసటగా వుండడంతో మధ్యాహ్నం వరకూ నిద్ర పోయాం. భోజనానంతరం కూడా మళ్లీ కునుకు తీసిన గుర్తు. మా అవిడతో పాటు, వధువుతో సాంప్రదాయం ప్రకారం రావాల్సిన పుట్టింటి వారు కొందరొచ్చారు. ఆవిడ అక్క గార్లు జ్యోతి, హైమ(కూతుళ్లు చిన పాప, రుక్కు, రాణి); తమ్ముడు వెంకన్న; చెల్లెలు జుబ్బి; వదిన గారు కరుణ (కొడుకు భరత్ బాబు); ఇంట్లో నలబై సంవత్సరాలుగా చేదోడు-వాదోడుగా వుంటున్న చుక్కి వచ్చారు. అలానే మా మేనమామలు-వారి పిల్లలతో సహా, ఇతర బంధువులందరూ మా వెంట వున్నారు. అంతా కోలాహలం-సంబరం.

చీకటి పడుతూనే పూల పల్లకి సిద్ధం చేశారు. సాంప్రదాయం ప్రకారం వధూవరులను "ఊరేగించి" ఇంటికి తీసుకెళ్లాలి. ఊరేగించడానికి కూడా అర్థం వుంది. దీన్నే "ఊరు ఎరిగించడం" అని అంటారు. ఫలానా వాళ్లు దంపతులయ్యారనీ, భారతీయ సంస్కృతీ-సాంప్రదాయాల ప్రకారం భార్యాభర్తలకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలనీ వారిని ఎరిగిన వూరి వారందరికీ ఎరుక పరచడం కొరకు ఊరేగింపు జరుపుతారని అంటారు. అదలా వుంటే, ఆ వేడుక కూడా ఎంతో సరదాగా జరుపుకునే వేడుక. పూలపల్లకి వెంట బంధుమితృల కోలాహలం వుంటుంది. బాణా సంచా కాల్చారు. కమలాపురంలో వుండే మా బాబాయి వనం నరసింగరావు బాణా సంచా ఏర్పాటు చేసిన సంగతి మాకెవరికీ చివరవరకు తెలియదు. అదో సంబరం మితృలకు. ఐదారు గంటల వూరేగింపు తర్వాత సుమారు రాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఇంటికి చేరాం. ఇంటిముందు నూతన వధూవరులకు "దిష్టి తీయడం" కూడా సాంప్రదాయంలో భాగమే. ఎర్ర నీళ్లు వధూవరుల చుట్టూ తిప్పి దిష్టి తీశారు. మా వూళ్లోని మా ఇల్లు రెండస్థుల భవనం. "లేక్ వ్యూ" భవనం అనొచ్చు. మేడ మీద కూచొని చూస్తే సమీపంలో చెరువు-నిండా ఎప్పుడూ నీళ్లతో దర్శనమిస్తుంది. ప్రస్తుతం ఎవరూ వుండడం లేనందున జీర్ణావస్థలో వుందా ఇల్లు.

పెళ్లికొడుకు ఇంట్లో చేయాల్సిన మూడు నిద్రలల్లా, అనివార్య కారణాల వల్ల-ఆడ పెళ్లి వారి వెంట వచ్చిన వారంతా పల్లెటూరు వాతావరణంలో మరికొంత కాలం గడపాలన్న కోరికున్నందువల్ల, ఐదు నిద్రలయ్యాయి. అలా, ఐదు రోజుల పాటు మా ఇల్లంతా కోలాహలం-సందడి-సంబరంగా నిండిపోయింది. మా మామయ్యలందరి కీ చీట్లపేకల ఆటంటే చాలా ఇష్టం. అందులో "రెమీ" (పదమూడు ముక్కల ఆట) డబ్బులు పెట్టి ఆడడం మరీ ఇష్టం. వారితో పాటు మరికొందరు చేరారు. రెండు-మూడు బృందాలుగా ఐదు రోజులూ వీలున్నప్పుడల్లా ఆట కొనసాగుతూనే వుండేది. కారప్పూస, బూందీ మిశ్రమం, అటుకులు-బొంగు బియ్యం మిశ్రమం, చక్కిలాలతో పాటు ప్రతిరోజూ చేసే వేడి-వేడి పదార్థాలను ఆస్వాదించుకుంటూ, పేకాట ఆడే వాళ్లు. మధ్యలో కోప-తాపాలు కూడా వచ్చేవి-సర్దుబాటయ్యేవి. అదేందోకాని, ఆ అయిదు రోజులూ కొద్దో-గొప్పో వర్షం కురుస్తూనే వుంది. ఆ వర్షంలోనే వూళ్లో వాళ్లందరూ (మహిళలు) రావడం, కాసేపు పెళ్లికూతురితో-వారి బంధువులతో ముచ్చడించడంతో ఆడ పెళ్లి వారందరికీ కూడా సరదాగా గడిచింది. మాకు ఆరోజుల్లో ఇంటి పక్కనున్న తోటలో "మల్లె పూలు" విరివిగా పూసేవి. చీకటి పడుతూనే మల్లె పూల సువాసనతో ఇల్లంతా మరింత ఆహ్లాదకరంగా మారిపోయేది. ఎండాకాలం-ఆరు బయట-ఇంటిముందు తాటాకు పందిళ్లు-మేడపైన-ఎదురుగా చెరువు కనపడుతుంటే, ఆ ఆనందమే ప్రత్యేకం. అదంతా అందరం అనుభవించాం ఆ అయిదు రోజులు. ఐదు రోజుల్లో కనీసం రెండు రోజులు వధూవరులతో కోలాహలం మధ్య "మేజువాణి" చేయించారు.

నాలుగో రోజున మా వూళ్లో అంతర్భాగమైన ముత్తారంలోని రామాలయానికి వెళ్లాం అందరం కలిసి. "ముత్తారం-వనం వారి కృష్ణా పురం-కోదండ రామపురం" అనే మూడు గ్రామాలు ఒకే రెవెన్యూ గ్రామం (ముత్తారం) కింద-ఒకే పంచాయితీ (కృష్ణా పురం) కింద వుంటాయి. ముత్తారంలో నాలుగు వందల ఏళ్లనాటి పురాతన రామాలయం (భద్రాచలం రామాలయాన్ని అన్ని విధాల పోలిన) వుంది. మా పూర్వీకులు (వనం కృష్ణ రాయలు గారు) కట్టించారు. ఆయన భక్తికి మెచ్చిన సాక్షాత్తు భద్రాచల రాముడు, భద్రాచలం గుళ్లో వున్నట్లే ఇక్కడా దర్శనం ఇచ్చే విధంగా, విగ్రహాల రూపంలో ఆయనకు కనిపించి దేవాలయంలో ప్రతిష్టించబడ్డాడు. జీర్ణావస్థలో వున్న ఆలయాన్ని గ్రామస్థులంతా కలిసి, పర్చూరు ప్రసాద్ గారిచ్చిన భారీ విరాళంతో ఇటీవలే పునర్మించారు. మా ఇంటిలో శుభకార్యాలు జరిగినప్పుడల్లా అక్కడకు, సమీపంలోనే మా నాన్నగారు కరిణీకం చేస్తున్న ఆమ్మ పేటలోని వెలగొండ వెంకటేశ్వర స్వామి గుట్టమీద కి దైవ దర్శనానికి వెళ్లడం అనాదిగా వస్తున్నది. ముత్తారానికి కూడా ఎద్దుల బండ్లు కట్టుకొని వెళ్లాం. "కచ్చడం" బండిలో వధూవరులిద్దరం, మా నాచేపల్లి తాతయ్య ముదిగొండ వెంకట్రామ నరసయ్య గారు వెళ్లాం. బండిలో మా ఇంటినుంచి అక్కడకు చేరడానికి పట్టిన అరగంట సమయంలో, ముత్తారం ఆలయం గురించి, వనం కృష్ణరాయల గురించి మా తాతయ్య వివరించారు.

ఐదోరోజు ఉదయం పెళ్లి సారె పట్టుకొని మా బావమరిది డాక్టర్ వేణు మనోహర రావు, తోడల్లుడు జూపూడి హనుమంత్ ప్రసాద్ మా వూరికి ప్రసాద్ కారులో చేరుకున్నారు. ఆడ పెళ్లి వారు సాంప్రదాయంగా తెచ్చిన సారెను ఆ సాయంత్రం లాంఛనంగా రెండు-మూడు ఇళ్లల్లో ఇవ్వడంతో ఆ వేడుకా అయిపోయింది. ఆ తర్వాత సారె తెచ్చిన వాళ్లిద్దరు ఖమ్మం వెళ్లిపోయారు.

ఆ రోజే సత్యనారాయణ వ్రతం జరుపుకున్నాం. వ్రతానికి వూళ్లో పెద్దలను కొందరిని, బంధువులను పిలిచాం. ఆ రోజున అందరి భోజనాలయ్యే సరికి సాయంత్రం అయిదు గంటలయింది. సత్యనారాయణ వ్రతానికి వచ్చిన వారిలో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు చాలామంది వున్నారు. అమ్మ పేట గ్రామానికి చెందిన అలనాటి స్థానిక ప్రముఖ రాజకీయ నాయకుడు కోయ వెంకట రావు, తీవ్రస్థాయిలో మాతో విరోధం వున్నప్పటికీ, ఆ రోజున వచ్చి కొంత సేపు మాతో సరదాగా గడిపాడు. ఒకప్పుడు మా నాన్నకు అత్యంత ఆప్త మితృడు-ప్రాణ స్నేహితుడూ అయిన వెంకట రావు, మా వల్లా పురం పెద్దనాన్న వనం శ్రీరాం రావు గారితో వచ్చిన విభేదాల కారణంగా-పక్క వూరి బాబాయి వనం నరసింగ రావు తో విభేదించిన కారణంగా, అప్పట్లో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో, మాతోనూ విరోధం కావాలనే తెచ్చుకున్నాడు. ఎంతో రాజకీయ భవిష్యత్ కలిగిన వెంకట రావు, తాగుడుకు బానిసై-రాజకీయాలలో నిలకడ లేకుండా పోయి, హత్యా రాజకీయాలకు బలైపోయాడు రెండేళ్ల తర్వాత.

మర్నాడుదయం, మే నెల ఆరవ తేదీన, మళ్ళీ బండి మీద ప్రయాణమయ్యి ముదిగొండ చేరుకున్నాం. అక్కడ రావులపాటి సత్యనారాయణ రావు గారింట్లో కాసేపుండి, కాఫీ-టీలు తాగి, మా మామ గారు పంపించిన కారులో ఖమ్మం చేరుకున్నాం. ఇక ఆ తర్వాత మూడురోజులు మళ్ళీ వధువింట్లో సత్యనారాయణ వ్రతం లాంటి కార్యక్రమాలు జరిగాయి.

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. అదే మా ఇద్దరిమధ్యనా జరుగుతున్నది.(Concluded)

Saturday, February 27, 2010

వివాహబంధం-X: చేతిలో కొబ్బరి బోండాతో గంపలో వధువు-మేనమామల ప్రాముఖ్యం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-X
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

సుముహూర్తం వేళ మహా సంకల్పం-కన్యా దానం
వనం జ్వాలానరసింహారావు

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. అప్పటికే-నాకు గుర్తున్నంతవరకు- సీతారాముల కళ్యాణం సినిమాలోని "సీతారాముల కళ్యాణము చూతము రారండీ..." అన్న పాట, రక్త సంబంధం సినిమాలోని "బంగారు బొమ్మ రావేమే, పందిట్లొ పెళ్ళి జరిగేనే..." అన్న పాటలు ప్రతి పెళ్ళిలోనూ వాయించడం తప్పనిసరిగా జరుగుతుండేది. కన్యా దాత స్వగ్రామానికి చెందిన సన్నాయి వాయిద్యం బృందం ఆ జిల్లాలో పేరొందిన వారు. వారీ పాటలను మధురంగా పాడినట్లు జ్ఞాపకం. వధువు విజయలక్ష్మిని గంపలో చేతిలో కొబ్బరి బోండాతో కూచోబెట్టి వివాహ మండపం మీదికి ఆమె మేనమామలు భండారు రామచంద్ర రావు, భండారు శ్రీనివాస రావు తీసుకొచ్చారు. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు.

కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్టారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, అందరి లాగే మాదీ ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు మొదలయింది. అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వెలువడ్డాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పారు కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మా మామ గారు (కన్యా దాత) నా (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయించారు కన్యా దాత నాతో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని నాతో చెప్పించారు. సుముహూర్తం వచ్చేస్తున్నదన్న మాట.

మా ఇద్దరినీ (వధూ-వరులను) కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మా మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇచ్చాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు ( విజయలక్ష్మి), నేను (వరుడు) ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి (ఏప్రిల్ 30, 1969 న, ఉదయం సరిగ్గా 9-58 కి), ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచాం. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందాం. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లారు మా దంపతులు మీద.

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా మాతో అనిపించాడు పురోహితుడు. కాళ్ళు తొక్కించడం: కన్యాదానం చేసేది వరుడు వధువుతో కలిసి సహజీవనం చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని మంత్రంతో కన్యను వరుడికి అప్పగించే కార్యక్రమం కూడా ముగిసింది.

ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలయింది.(Part XI Next Follows)

Thursday, February 25, 2010

వివాహబంధం-VI: మంగళ స్నానాలు-మామిడి తోరణాలు స్నాతకం-సమా వర్తనం-కాశీ యాత్ర-అంకురార్పణ: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-VI
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమానికి వరుడు
వధువును పెళ్లికూతురును చేయడం
వనం జ్వాలానరసింహారావు

పెళ్లిరోజుకు ఒకరోజు ముందర "స్నాతకం" అనే ముఖ్యమైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంటిలో గాని, కళ్యాణ మండపంలో గాని లేదా విడిదిలో గాని పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ది కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ "సంస్కారం", ప్రధానంగా, వరుడిని "బ్రహ్మచర్యం" నుండి "గృహస్థాశ్రమం" స్వీకరించడానికి సిద్ధంచేస్తున్న కార్యక్రమం. గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో-అంగీకారంతో "గృహస్థాశ్రమం" స్వీకరించే ఏర్పాటిది. ఆ సమయంలో గురువు చేయాల్సిన హిత బోధ తైత్తిరీయోపనిషత్తులోని "సత్యాన్న..." అన్న ఒక శ్లోక రూపంలో వుంటుంది. "సత్యం విషయంలోను, ధర్మం విషయంలోను, తెలివితేటల విషయంలోను, పొరపాటు పడవద్దు" అన్న ఆదేశం అది. తల్లిని, తండ్రిని, అతిథిని దేవుడులా భావించాలని చెప్తారు. సమాజ శ్రేయస్సే ధ్యేయంగా జీవించమని, దానం చేసేటప్పుడు శ్రద్ధగా చేయమని, తాహతుకు మించి దానం చేయొద్దనీ-ఇంతకంటె ఎక్కువ దానం చేయలేకపోతున్నందుకు సిగ్గుపడుతున్నానని భావించమనీ బోధిస్తాడు పురోహితుడు. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని-వారనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ, "వరుడికి శుభం కలుగుగాక" అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు.

హిందూ వివాహ సంప్రదాయ పద్ధతిలో భారతీయ ఆలోచనా విధానాన్ని తెలియచేశాడు పురోహితుడిక్కడ.

స్నాతకానికి "సమా వర్తనం" అన్న పేరు కూడా వుంది. సమా వర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమా వర్తనం అంటారు. కాశీ యాత్ర, హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం సాంప్రదాయంలో మరో ముఖ్యమైన ఆచారం. కాశీ ప్రయాణం - బాజా భజంత్రీల మద్య నేను (వరుడు) గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావు కోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు, కాశీకి పోతున్నానని చెప్పి బయలు దేరాను. వధువు సోదరుడు (వెంకట గనేష్ కుమార్-వెంకన్న) వచ్చి "అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసుకొని గృహస్థుగా జీవించండి" అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి నన్ను వెనుకకు తీసుకొని వచ్చాడు. ఆచారం ప్రకారం వెంకన్న వెంబడి ఖమ్మం నుంచి వాళ్ల (బుల్లి) బాబాయి రాధా కిషన్ రావు గారు వచ్చారు. శాస్త్రం ప్రకారం బావమరిదైన వెంకన్నకు వరుడిగా నూతన వస్త్రాలను పెట్టాను.

కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధు-మిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మ భద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు. ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిది-మేన మామ-తాత గారు లాంటి వారు) "బంగారు ఆభరణాలతో అలంకరించబడిన వారి "అమ్మాయి" నిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్ని సాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీ యాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది. చాలా కోలాహలంగా పెళ్ళికి "తరలి పోయే ముందర" జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు-మిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరుతారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలుదేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడం – నిందించడం - దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు.

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకం-అంకురార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును-పెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూ-వరుల ఇళ్లలో, ఉదయం తెల-తెలవారుతుండగానే, మంగళ వాయిద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికి, తల్లి-తండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది.

స్నాతకం మా ఇంట్లో చేసుకున్న నాడే, అంతకు ముందుగా పెళ్ళికొడుకును చేసే తంతు జరిగింది. అదే విధంగా, లాంఛనంగా అక్కడ కన్యా దాత ఇంట్లో, వధువుని "పెళ్ళికూతురు" చేసే కార్యక్రమం కూడా జరిగింది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యా దాత దగ్గరి బంధువులందరూ వచ్చారు. నవ ధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని "అంకురార్పణ" లో చేస్తారు. (Part VII Next Follows)

వివాహబంధం-V: నిశ్చితార్థం-లగ్న నిశ్చయం-శుభ లేఖలు-పెళ్లిపనుల ఆరంభం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-V
శ్రీ పప్పు లక్ష్మీనరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్లినాటి ప్రమాణాలు అమలుకు ముహూర్త బలం ముఖ్యం
వనం జ్వాలానరసింహారావు

ఖమ్మం మామిళ్ళగూడెంలోని మా ఇంట్లో మాటా-మంతీ అయిపోయి, ఒకరి వంశ క్రమం గురించి మరొకరు అవగాహన కొచ్చిన తర్వాత, ఆచారం ప్రకారం తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు. రెండు నెలల తర్వాత మార్చ్ 30, 1969న ఆడపిల్ల వారింట్లో కలిసి, ముహూర్తాలు పెట్టుకోవాలని, నిర్ణయించుకున్నారు. బ్రాహ్మణుడిని సంప్రదించి పెళ్లి ఎన్నడు జరుగుతే మంచిగుంటుందో అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం) తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". అనుకున్నట్లే బంధు-మిత్రుల సమక్షంలో, ఖమ్మం-మామిళ్లగూడెంలోని అయితరాజు రాంరావు గారింట్లో మార్చ్ 30, 1969న మా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం జరిగింది. వధూ-వరుల తారా బలం, చంద్ర బలం ఆధారంగా, మా పురోహితుడు (లంకా సిద్ధాంతి గారు) వారి పురోహితుడిని సంప్రదించి ఏప్రిల్ 30, 1969 న, ఉదయం 9-58 కి లగ్నం నిశ్చయించారు. వాస్తవానికి మా నాన్నగారు నా పుట్టిన తేదీ-తిథి, వార, నక్షత్రాల వివరాలను రాసిపెట్టారు గాని, మా మామ గారు మా అవిడ పుట్టిన తేదీ-తిథి, వివరాలను ఇవ్వలేకపోయారు. అయితే, ఆయన డైరీలో రాసుకున్న తేదీ ఆధారంగా, కూతురు పుట్టినరోజు నవంబర్ 2, 1954 అని చెప్పడంతో దాని ప్రకారమే లగ్న నిశ్చయం చేశారు పురోహితులు.

పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు. ఇవన్నీ మా వాళ్లూ, వాళ్ల వాళ్లూ నిశ్చితార్థం జరిగిన మర్నాటినుంచి మొదలు పెట్టారు. అప్పట్లో పెళ్లికి అవసరమైన వస్తువులను కొనేందుకు ఖమ్మం జిల్లా వారంతా సాధారణంగా విజయవాడకు వెళ్ళి కొనుగోలుచేసేవారు. అక్కడ వెరైటీలు ఎక్కువే కాకుండా, ధరలు కూడా కొంచెం తక్కువగా వుండేది. నాకు గుర్తున్నంతవరకు, మా నాన్న-అమ్మలు విజయవాడలోను, ఖమ్మం "గెల్లా లక్ష్మినారాయణ-కుంచకర్ర భక్తవత్సల రావు" బట్టల దుకాణంలోను పెళ్ళి బట్టలు కొన్నారు. "కంసాలి బ్రహ్మయ్య" అనే బంగారం వస్తువులు తయారుచేసే వ్యక్తితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించారు. హైదరాబాద్‌లో పెళ్లికూతురు ఆభరణంలోకి కావాల్సిన "ముత్యాలు" కొన్నాం. పెళ్ళిలో మా ఇంట్లోవాళ్లందరం వివిధ సందర్భాల్లో ధరించే దుస్తులను ఇంట్లోనే ఒక టైలర్‌ను పెట్టి కుట్టించాం.

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. మా పెళ్లి శుభలేఖలను ఖమ్మం వై.ఎన్. ప్రెస్లోక వేయించాం. బంధు-మిత్రులకు పోస్టులో పంపించినవాటికంటే కూడా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పంచినవే ఎక్కువ. ముహూర్తానికి కనీసం పది-పదిహేను రోజులముందునుంచే ఈ కార్యక్రమం ఆరంభమయింది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే. ఇవన్నీ మా పెళ్ళిలోనూ జరిగాయి-సర్దుకున్నాయి.(Part VI Next Follows)