Showing posts with label ప్రజాస్వామ్యం. Show all posts
Showing posts with label ప్రజాస్వామ్యం. Show all posts

Thursday, September 8, 2011

అంతం కాదిది ఆరంభమే(నా) !: వనం జ్వాలా నరసింహారావు

వనం జ్వాలా నరసింహారావు

సూర్య దినపత్రిక (09-09-2011)

ఆలోచింపచేస్తున్న సీబీఐ అరెస్టులు, కొందరికి వందల వేల రెట్ల ఆదాయం ఎలా సాధ్యం?, శిక్షల దాకా వ్యవహారం కొనసాగుతుందా?, ప్రజల్లో కొనసాగుతూనే ఉన్న అపోహలు, విచారణలకు రాజకీయ కారణాలేనా!, నివారణ కంటె నిరోధం ముఖ్యం....ఎడిటర్

స్వతంత్ర భారత దేశంలో, విభజించి-పాలించు అనే ఆంగ్లేయుల పరిపాలనా వారసత్వాన్ని, పోకడలో అవినీతి మయమైన కొన్ని ప్రపంచ దేశాల విధానాన్ని, అక్షరాలా పాటిస్తూ వస్తున్న ఈ దేశ రాజకీయ నాయకుల ఆటలకు మధ్య-మధ్య అంతరాయం కలిగించి, ఆట కట్టించడానికి కారణమైన ప్రజాస్వామ్య వ్యవస్థలను - ఆ వ్యవస్థల పుణ్యమా అని నెల కొన్న సంస్థలను - అందులో (అందరూ కాకపోయినా) నిబద్ధతతో పని చేస్తున్న అధికారులను మనసార అభినందించాలి. వాస్తవానికి ఆ వ్యవస్థలు-సంస్థలు-వ్యక్తులు నిరంతరాయంగా కనుక తమ బాధ్యతలను పరిపూర్ణమైన నిష్ఠతో నిర్వర్తిస్తున్నట్లయితే (అధికారంలో వున్న రాజకీయనాయకులు అడ్డుపడకుండా వుంటే!) అవినీతిపరుల అరెస్టులతో మాత్రమే ఆగకుండా-వారి గుండెల్లో అనుక్షణం గుబులు పుట్టే పరిస్థితులను కలిగించ గలిగే వారు. ఒక వైపు పౌర సమాజం నాయకుడు అన్నా హజారే-ఆయన బృందం గత కొన్ని నెలలుగా అవినీతికి వ్యతిరేకంగా గళం విప్పడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తరతమ భేదం లేకుండా, కాంగ్రెస్-కాంగ్రేసేతర-బీజేపి-బీజేపేతర అవినీతి సామ్రాట్టులను అంచలంచలుగా అదుపులోకి తీసుకుని విచారించడం, సామాజిక-రాజకీయ-ఆర్థిక విశ్లేషకులను ఆలోచింపచేస్తున్నాయి. ఏదేమైనా, స్వతంత్రం వచ్చి అరవై నాలుగు సంవత్సరాలు నిండిన సందర్భంలో తలఎత్తుతున్న ఈ పరిణామాలను సగటు భారతీయ పౌరుడు స్వాగతిస్తుంటే, ఈ దేశ పరిణామాలను ఆసక్తితో యావత్ ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి. భారత దేశ ప్రజాస్వామ్యం ఇంత గట్టిగా పని చేస్తుందా? అని ఆశ్చర్యపోతున్నారు వారంతా.

ఆ సంస్థకు ఎవరిష్టమొచ్చిన పేర్లు వారు పెట్టారు. కొందరేమో "కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్" అన్నారు. అలా అన్నవారు సహితం జగన్మోహన్ రెడ్డిపై అ సంస్థ విచారణను మనసార స్వాగతించారు. మరికొందరేమో అదే సంస్థను "కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూట్" అని సాక్షాత్తు చట్టసభలోనే నామకరణం చేశారు. అలా చేసి వారం రోజులు తిరక్కుండానే, ఎవరిని "బచావ్" చేయడానికి జరిగిందో కాని, ఆమె అనుంగు అనుచరుడు గాలి జనార్థన్ రెడ్డి కటకటాల పాలయ్యాడు. మధ్యలో పేర్లు పెట్టడానికి తామూ తీసి పోమన్న తరహాలో కొందరు మహా నాయకులు, తమ పార్టీని దూషించిన ప్రత్యర్థి పార్టీకి "భారతీయ జగన్ పార్టీ" అని, "బచావో జగన్ పాలసీ" అని మారు పేర్లు తగిలించారు. ఇవేవీ తమకు పట్టదన్న ధోరణిలో, గుట్టుచప్పుడు కాకుండా, తమపని తాము చేసుకుపోతున్నారు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు - ప్రస్తుతం వారికి ఆంధ్ర-కర్నాటకలలో నాయకత్వం వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. ఆ అధికారి మన తెలుగువాడు కావడం, ఆరోపణలొచ్చిన వ్యక్తి ఎంత మహా-మహానుభావుడైనా, ఏ స్థాయిలో అండ-దండలున్నా, కాంగ్రెస్ వారైనా-ప్రతిపక్ష నాయకులైనా, తన కర్తవ్యాన్ని తాను నిర్వహించుకుని పోవడం, ఆబాల గోపాలం అభినందించాల్సిన-ఆనందించాల్సిన విషయం.

అవినీతి సామ్రాట్టులను అదుపులో తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని (వున్నదున్నట్లు చెప్పాలంటే... న్యాయ స్థానాలను-సిబిఐని) అభినందించాల్నా? లేక ఇంతకాలం వారి అవినీతితో ప్రజాధనం కొల్లగొడుతుంటే, ప్రేక్షక పాత్ర వహించినందుకు-సీబీఐ తన కర్తవ్యాన్ని నెరవేర్చకుండా పరోక్షంగానన్నా అడ్డుకున్నందుకు అదే ప్రభుత్వాన్ని అభిశసించాల్నా? ఆలశ్యంగానైనా, మరింత దుర్మార్గం జరగనివ్వకుండా ఆపుదల చేసినందుకు, ప్రస్తుతానికి మెచ్చుకోవడమే మంచిదే మో! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో-సరిహద్దు కర్నాటక రాష్ట్రంలో, ఇంచుమించు ఏక కాలంలో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలకు లింకు వుండే అవకాశాలు చాలానే వున్నాయి. మీడియాలో వస్తున్న కథనాలు వాస్తవమైతే-కనీసం వాస్తవానికి చేరువలో వుంటే (వుండే అవకాశాలే ఎక్కువ అనక తప్పదు), దశాబ్దం కింద వారి సొంతం అనుకున్న ఆస్తిపాస్తులకు, నేటి వారి ఆస్తులకు, నక్కకు-నాగ లోకానికి వున్న తేడా వుంది. ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తి కాని-ఒక వ్యాపార సంస్థ కాని ఆస్తులు సమకూర్చుకోరాదన్న నిబంధన కాని, ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెంపొందించుకోరాదన్న చట్టం కాని లేదన్నది ఒపుక్కోవాల్సిందే. వచ్చిన చిక్కల్లా, ఆ ఆదాయ వనరులు ఎలా సమకూరాయన్న విషయంలో అవలంబించిన మార్గాలే. రూపాయి ఆదాయం-పది రూపాయల ఆస్తులు-పాతిక రూపాయల ఖర్చులున్న వారికి, ఏడాది-రెండేళ్లు-మూడేళ్లు తిరక్కుండానే, వందల-వేల రెట్ల ఆదాయం పెరగడం-దానికి రెట్టింపు ఆస్తులు సమకూరడం, ఖర్చులే మో తగ్గడం ఎలా సంభవమనే దే అంతుచిక్కని ప్రశ్న. అదే జరిగింది-జరుగుతున్నది వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి విషయంలోను, వారికి అత్యంత సన్నిహితుడు-అవునన్నా, కాదన్నా వ్యాపార భాగస్వామి గాలి జనార్థన్ రెడ్డి వ్యవహారంలో.

బహిర్గతమైన ఆదాయ-వ్యయ వనరుల లెక్కల ప్రకారం, వీరిరురివురి ఆర్థిక పరిస్థితి దశాబ్దం క్రితం ఎంతనేది జగమెరిగిన సత్యం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాక మునుపు, ఐన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆదాయమెంత? ఆదాయపు పన్నెంత కట్టారు? పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసినప్పుడు ఎన్ని ఆస్తులు అఫిడవిట్ లో చూపించారు? అన్న సంగతి బహిరంగ రహస్యమే కదా? అలానే సుష్మా స్వరాజ్ కర్నాటక నుంచి లోక్ సభకు పోటీ చేసిన రోజుల్లో-అంతకు కొన్నాళ్ల, కొన్నేళ్ళ క్రితం గాలి జనార్థన రెడ్డి ఆస్తులెన్నో మీడియాలో వస్తున్నాయి కదా. వారిరువురూ న్యాయసమ్మతంగా-ధర్మ సమ్మతంగా వ్యాపారాలు చేసి తమ ఆస్తులను పెంచుకున్నారా? లేక రాజకీయాధికారాన్ని (తమది-తమ ఆప్తులది) ఆసరాగా చేసుకుని ఆస్తులను కూడగట్టుకునారా? మైక్రో సాఫ్ట్ బిల్ గేట్స్, గూగుల్-ఒరాకిల్-ఫేస్ బుక్ సంస్థల అధినేతలు కూడా అతి తక్కువ సమయంలోనే ఆస్తులు సమకూర్చుకున్నప్పటికీ వారిపై అవినీతి ఆరోపణలెందుకు రావడం లేదు? బహుశా వారేమో ఫక్తు వ్యాపార సరళిలో మిలియనీర్లు-బిలియనీర్లు అయ్యుండాలి...వీరేమో... అందినంత దండుకో! అన్న చందాన కోటీశ్వరులై వుండాలి. ఐనా, ఇప్పుడిప్పుడే అలా మాట్లాడక పోవడం మంచిదే మో! ఎలాగూ, విచారణ జరుగుతోంది కదా! ఎటొచ్చీ..చిక్కల్లా, విచారణ చేసినంత కాలం చేసి, ఆ తర్వాత, సరైన సాక్ష్యాధారాలు లేవని వదులు తే ఏం కావాలన్నదే సామాన్యుడి మదిలో మెదిలే అంతులేని వింత ప్రశ్న. అరెస్టులు ఆరంభం కావాలే కాని అంతం కారాదు.

న్యాయస్థానాల ఆదేశాల మేరకే, సిబిఐ దర్యాప్తు ప్రారంభమై, త్వరితగతిన సాగుతున్నప్పటికీ, ప్రజల్లో అపోహలు ఇంకా కొనసాగుతూనే వుండడానికి కారణం...ఇన్నాళ్లూ-ఇన్నాళ్లూ, ఇంత అవినీతి జరుగుతున్నా, చేస్తున్న వారినెవరినీ నిలుపుదల చేయలేకపోవడం వెనుకనున్నబలీయమైన కారణాలేంటి? అని. ఏ అధికారులను-అనధికారులనైతే సిబిఐ ప్రస్తుతం విచారణ చేస్తున్నదో, వారితో సహా, చేయని ఇతర అధికారులకు-అనధికారులకు ఈ విచారణ ఒక కనువిప్పు కావాలంటే ఏం చేయాలనేది కూడా ఆలోచన జరగాలి. ఇప్పుడు జరుగుతున్న విచారణ కాని, సోదాలు కాని, రాజకీయ కారణాల వల్ల కానేకాదు అన్న నమ్మకం కూడా ప్రజల్లో కలగాలి. కేవలం విచారణతో ఆగకుండా శిక్షల దాకా వ్యవహారం (తప్పు జరిగిందని తేలితే-తేల్చగలిగితే) కొనసాగాలి. అదెంతవరకు వీలుంటుందోకాని, గత రెండు-మూడు రోజులుగా ఉన్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న పరిణామాలు గమనిస్తుంటే, అవినీతికి పాల్పడినట్లు భావించి విచారణకు గురవుతున్న వారు తమను వేధించడానికి రాజకీయ కారణాలే తప్ప మరేమీకాదన్న అభిప్రాయం బలంగా కలిగించడానికి దేశ రాజధానిలో కాలికి బలపం కట్టుకుని ఎక్కని గడప-దిగని గడప లేకుండా బిజీ-బిజీగా గడుపుతున్నారట.

చివరకు ఈ పరిణామాలు ఎలాంటి రాజకీయ సమీకరణాలకు దారితీస్తా యో కాని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఏ కాంగ్రెస్ పార్టీని కాదని బయటకు వచ్చాడో, ఆ పార్టీ సారధ్యంలోని "యునైటెడ్ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్" పంచన చేరడానికి తన సంసిద్ధతను బహిరంగంగానే-అదీ పేరుపొందిన జాతీయ టెలివిజన్ ఛానల్ ద్వారా తెలియచేయడము విశేషం. తన సచ్ఛీలతను తెలియచేయడానికి, తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడయిన గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టు విషయంలో సహితం మౌనంగా వుండి పోయారు. మరో వైపు, తనను లోక్ సభలో వెనకేసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకురాలు సుష్మ స్వరాజ్ కు కూడా కృతజ్ఞతలు తెలియ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా గాలి జనార్దనరెడ్డి ఆమెకు సన్నిహితుడంటారు. తాను జగన్మోహన్ రెడ్డికి లోక్ సభలో మద్దతిచ్చినా తన సన్నిహితుడి విషయంలో ఆయన ఏమీ తెలియనట్లు మాట్లాడడం వెనుక గూడార్థం ఏమై వుంటుందో?

భారత దేశంలో అపారమైన కోటానుకోట్ల రూపాయల విలువ చేసే సంపద వ్యవసాయ పంటల రూపేణా నెలల తరబడి ఎటువంటి బధ్రత లేకుండా బహిరంగంగానే అందరి కళ్ల ముందర పడేసి వుంటుంది. ఐనా, అందులో కొంచెం కూడా దొంగల పాలవదు-ఎప్పుడో ఒకప్పుడు తప్ప. గాలి లాంటి ఘనులే కనుక అనాదిగా మన వ్యవస్థలో వుండి వున్నట్లయితే, పరిస్థితి వేరే విధంగా వుండేదేమో! ఇక ఇప్పడు అలా కాదు. భూగర్భంలో అనాదిగా నిక్షిప్తమై వున్న అపార సంపదను కూడా కొల్లగొట్టే మహానుభావులు పుట్టుకొచ్చారు. అలాంటివారికి ఆ నిక్షిప్తమైన సంపదను వెలికి తీసేందుకు లైసెన్సులను ఇచ్చిన "ప్రభుత్వ అధికారులను" ప్రధమ ముద్దాయిలుగా పేర్కొనాలి. వారిని అలా చేయమని వారిని ప్రోత్సహించిన అనధికారులను (మంత్రి వర్గ సభ్యులను) రెండవ ముద్దాయిలుగా పేర్కొనాలి. అప్పుడే ఇలాంటివి భవిష్యత్ లో జరగకుండా వుండే ఆస్కారముంటుంది. ఏ విధంగానైతే ఎమ్మార్ ప్రాపర్టీస్ లో స్థలం, విల్లాలు కొనుక్కున్న వారిని విచారణ చేయడానికి నిర్ణయం జరిగిందో, అదే విధంగా, పెద్దా-చిన్నా అన్న భేదం లేకుండా గాలి గనుల విషయంలో కాని, జగన్మోహన్ కంపెనీలలో పెట్టుబడుల వ్యవహారంలో కాని విచారణ జరగాలి.

వ్యాధి నివారణ కంటే, నిరోధం ఎంత ముఖ్యమో, అవినీతి జరిగిన తర్వాత చర్యలకంటే, ముందస్తుగానే నిరోధించగల వ్యవస్థలుండాలి. కావాల్సింది "పోస్ట్ ఆడిట్" కాదు.."ప్రీ ఆడిట్". లక్ష్మీ నారాయణ లాంటి అధికారులు లక్షలలో-వేలల్లో కాకపోయినా, వందల సంఖ్యలో నన్నా మన దేశంలో వుండే వుంటారు. భారీ కుంభకోణం జరిగేందుకు ఆస్కారముండే వ్యాపారాలకు లైసెన్సులు మంజూరు చేసే ముందర, ఇలాంటి అధికారులతో, లైసెన్సు కోరిన వారి పూర్వా-పరాలు, రాజకీయ సంబంధాల గురించి సమగ్ర దర్యాప్తు చేయించాలి. అంతటితో ఆగకుండా, ఆ లైసెన్సుకు సంబంధించిన వారి వ్యాపారం సాగేంతవరకూ, ఏడాదికో-ఆర్నెల్లకో వారు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారో, లేదో, విచారణ జరగాలి. ఈ రెండూ రహస్యంగానన్నా-బహిరంగానైనా జరిగి తీరాల్సిందే. అప్పటికీ దొరకకుండా తప్పించుకుంటే, ఇక ఎలాగూ పోస్ట్ ఆడిట్ వుండనే వుంటుంది. కనీసం కొంతకాలమైనా, అవినీతి కొంతలో కొంతన్నా అరికట్టడానికి ఈ చర్యలు అమల్లోకి రావాలి. లోక్ సభలో చర్చకు రానున్న లోక్ పాల్ బిల్లులో ఈ అంశాలకూ ప్రాధాన్యతుండాలి. లేకపోతే, గాలి లాంటి వారు తమకున్న పలుకుబడితో అప్రతిహతంగా అవినీతి మార్గాలలో పయనిస్తూనే వుంటారు.

Sunday, June 19, 2011

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీ:వనం జ్వాలా నరసింహారావు

చట్టసభల పనితీరు ప్రశ్నార్థకం

ఆంధ్ర జ్యోతి దిన పత్రిక (26-06-2011)

క్షీణిస్తున్న పార్లమెంట్ జవాబుదారీ

వనం జ్వాలా నరసింహారావు

పౌర సమాజానికి చెందిన కొందరు స్వయం ప్రకటిత నేతల ఒత్తిళ్లకు లొంగి, చట్టాల రూపకల్పనకు సంబంధించి పూర్తి అధికారాలను కలిగున్న పార్లమెంటు పరిధి నుంచి ఆ అధికారాలను పార్లమెంటే తర శక్తులకు బదిలీ చేసే ప్రసక్తి లేదని కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలైన పార్టీ వర్కింగ్ కమిటీ స్పష్టం చేసింది. పార్లమెంటు సార్వభౌమాధికారం విషయంలో సీనియరు కాంగ్రెస్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీ ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయానికి సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు సీతారం ఏచూరి కూడా మద్దతిస్తున్న ధోరణిలో మాట్లాడారు. అదుపులు అన్వయాలకు లోబడి పార్లమెంటు ప్రజాస్వామ్య వ్యవస్థలైన చట్ట సభలు, కార్య నిర్వాహక అధికారి, న్యాయ వ్యవస్థలు పని చేయాలి. ఈ మూడింటి లో ఒకటి ఎక్కువ మరోటి తక్కువ అనలేం. అలాంటప్పుడు, వీటిని అధిగమించి, లోక్ పాల్ పేరుమీద నో, మరే పేరు మీదో, ఇంకో సమాంతర వ్యవస్థ పెత్తనం చేయడం సబబే నా? వాస్తవానికి, రాజ్యాంగానికి లోబడి చట్టాలను చేసే నిర్ణయాధికారం-సార్వభౌమాధికారం, నూటికి నూరుపాళ్లు పార్లమెంటు దే అయినా, ఒక సంస్థగా-వ్యవస్థగా, భారత పార్లమెంటుకు రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలను కార్య నిర్వహణ సంస్థ చేతుల్లో పెట్టడంతో, పరోక్షంగా ఉనికిని కోల్పోతున్న నేపధ్యంలో, భవిష్యత్ లో దాని ప్రధాన బాధ్యతైన జవాబుదారీతనంతో వ్యవహరించడం క్లిష్టమౌతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టయిన పార్లమెంటు ఉభయ సభల, రాజ్యాంగపరమైన శాసనాధికార పర్యవేక్షణా సామర్థ్యం, జవాబుదారీ, క్రమేపీ క్షీణ దశకు చేరుకుంటున్నాయని ఐక్య రాజ్య సమితి సామాజికాభివృద్ధి పరిశోధనా సంస్థ ఆధ్వర్యంలోని, ప్రజాస్వామ్యం-పరిపాలన-మానవ హక్కుల కార్యక్రమ అంశాలకు సంబంధించిన ఒక అధ్యయనంలో పేర్కొనడం జరిగింది. జవాబుదారీకి ప్రతీకలుగా, పార్లమెంటులో ప్రవేశ పెట్టి చర్చించాల్సిన వివిధ తీర్మానాలు, రాజ్యాంగ పరమైన పార్లమెంటు పర్యవేక్షణా బాధ్యతలు, సభా సంఘాల పనితీరు లాంటివి, నిర్వీర్యమై పోతున్నాయి. ప్రపంచీకరణ దిశగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ, పార్లమెంటు అధికారాలను హరించి వేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న పలు అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించి పార్లమెంటుకు సరైన పర్యవేక్షణ లేదు. ఆ ఒప్పందాల విషయంలో పార్లమెంటు వెలుపల తీసుకున్న నిర్ణయాలు తిరుగులేని విగా వుండడంతో, పార్లమెంటు ప్రేక్షక పాత్ర వహించాల్సి వస్తోంది. ఎన్నికల ద్వారా రాకుండా బాధ్యతాయుతమైన విధులు నిర్వహించే పలు వ్యవస్థలకు బదలాయించిన అధికారాలపై కూడా పార్లమెంటు పర్యవేక్షణ బలహీనంగా వుంది. అదుపులు-అన్వయాల విషయంలో పార్లమెంటుతో సమానమైన అధికారాలను కలిగున్న కార్య నిర్వహణ వ్యవస్థ తనను శాసించే దిశగా పార్లమెంటు అడుగులు వేస్తోంది. అలానే న్యాయ వ్యవస్థ కూడా పార్లమెంటును ఆదేశించే సందర్భాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. శాసనాధికారాలున్న చట్టసభల పరిస్థితి ఇలా కావడానికి కారణాలను రాజకీయ విశ్లేషకులు, విద్యావేత్తలు, పార్లమెంటరీ అధ్యయన నిపుణులు అన్వేషించే ప్రయత్నం చేశాయి.

శాసన సంబంధమైన ప్రక్రియలో జాప్యం జరుగుతున్నదనే సాకుతో, చట్టాల రూపకల్పన-నిర్ణయాధికారం కలిగిన పార్లమెంటు, చట్టం స్థానంలో "ఆర్డినెన్సుల" ను తెచ్చేందుకు, కార్య నిర్వహణ వ్యవస్థకు (నిర్వహణాధికారికి-ప్రధానికి), అధికారాలను కట్టబెడుతూ పోవడం, భారత పార్లమెంటుకున్న అతి పెద్ద బలహీనతనాలి. మరో విధంగా చెప్పుకోవాలంటే, ఎగ్జిక్యూటివ్ అధికారాలను సమీక్షించే విషయంలో పార్లమెంటు నిష్ఫలత స్పష్టంగా కనిపిస్తోంది. పెరుగుతున్న సామాజిక అవసరాలకు-ఆధునిక పార్లమెంటరీ పద్ధతులకు అనుగుణంగా వ్యవహరించగల సామర్థ్యం-అభిరుచి చాలామంది పార్లమెంటు సభ్యులలో అంతగా లేకపోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి దోహదపడుతోంది. రోజు-రోజుకు పుట్టుకొస్తున్న రాజకీయ పార్టీలు సంస్థాగతంగా పటిష్ఠంగా వ్యవహరించలేక పోవడం, ఆ పార్టీల ప్రతినిధులు స్థానిక అవసరాల దృష్ట్యా చట్ట సభలకు ఎన్నిక కావడంతో, పార్లమెంటు సమిష్టి కార్యాచరణకు అవరోధాలు కలుగుతున్నాయి. జవాబుదారీ తనం తగ్గడానికి ఇది మరో కారణం.

పార్లమెంటు నిర్వర్తించాల్సిన విధులను, దానంతటదే పరిత్యజించడం ఆశ్చర్యకరమైన అంశంగా పరిగణించాలి. ఎన్నికల-పార్టీల రాజకీయాల కారణాన తప్పనిసరిగా తలెత్తే పరిస్థితులు, చట్టాల రూపకల్పనలో అలసత్వం-ఆలశ్యం జరగడానికి దోహదపడుతున్నాయి. పార్లమెంటు సభ్యులు, సరైన కారణాలు లేకపోయినా, చట్ట సభలో అవరోధాలు కలిగించి శాసన ప్రక్రియను ఆలశ్యం చేస్తున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, క్రమం తప్పకుండా ఎన్నికలు జరగడం, శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, నిష్పాక్షికంగా వ్యవహరించే స్వతంత్ర న్యాయ వ్యవస్థ రూపు దిద్దుకోవడం, చైతన్యవంతమైన పౌర సమాజం బలీయం కావడం లాంటివి భారత దేశ ప్రజాస్వామ్యాన్ని కొంత మేరకైనా పటిష్టం చేశాయి. తరతరాలుగా, గుత్తాధిపత్యంతో కొందరు మాత్రమే రాజ్యాధికారం చలాయించే స్థితిలో వుండే భారతీయ సమాజంలో, నెమ్మదిగా సామాజిక చైతన్యం-విప్లవం వస్తుందని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాధమిక హక్కులు కాపాడబడతాయని, సార్వజనీన ఓటు హక్కు మార్పుకు సంకేతమని భావించిన దేశ పౌరుల నమ్మకం వమ్మైందని అనాలి. తమ ఓటు హక్కు ద్వారా గెలిపించిన ప్రజా ప్రతినిధులుండే చట్ట సభల (పార్లమెంట్-శాసన సభలు) పని తీరు అసంతృప్తికి గురి చేస్తున్నాయన్న భావన కలుగుతోంది పౌరులకు.

భారత దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో చోటుచేసుకుంటున్న వైఫల్యాలకు-సాఫల్యాలకు, పార్లమెంటు బాధ్యత ఎంతనేది చర్చనీయాంశం. పార్లమెంటు పనితీరుకు సంబంధం లేకుండా, ప్రజాస్వామ్యం మనుగడ సాగే వీలు లేదు. అదే విధంగా పలు ప్రజాస్వామ్య సంస్థల పని తీరు కూడా పార్లమెంటు నిర్వహణా విధానంపైనే ఆధార పడి వుంటుంది. తమకు టికెట్ ఇచ్చి అవకాశం కలిగించిన రాజకీయ పార్టీల ఆలోచనా సరళి-ప్రభావం, పార్లమెంటు సభ్యులపై ప్రస్ఫుటంగా వుంటుంది. ఈ నేపధ్యంలో, తప్పైనా-ఒప్పైనా, అర్హతల-యోగ్యతల దృష్ట్యా కాని, నిబద్ధత దృష్ట్యా కాని, పార్లమెంటేరియన్ పనిలో నాణ్యత క్షీణిస్తున్నదనే నిపుణుల అభిప్రాయం. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లతో పోల్చి చూస్తే, ఈ నాటి పార్లమెంటు సభ్యులలో చాలా మంది విద్యార్హతలు ఉన్నత స్థాయిలో వున్నప్పటికీ, ఎన్నికైన వారిలో గణనీయమైన సంఖ్యలో, నేరచరిత్ర కలిగినవారు కూడా వుండడంతో, దాని ప్రభావం కూడా పార్లమెంటు పనితీరుపై పడుతోంది.

భారతీయ ఓటర్లు తమదైన ప్రత్యేక శైలిలో, వారి-వారి ప్రాధాన్యతలను బట్టి, రాజకీయ అనుబంధాలకు అనుగుణంగా, మారుతున్న పరిస్థితులను ఆకళింపు చేసుకుంటూ, ఎన్నుకునే విభిన్న మనస్తత్వాల కలగూరగంప పార్లమెంటు-అందునా ప్రత్యేకించి లోక్ సభ. మామూలు సాదాసీదా అభ్యర్థులను ఓటర్లు గెలిపించిన సందర్భాలు, యోధానుయోధులను మట్టి కరిపించిన ఉదాహరణలు కోకొల్లలు. ఒక గుర్తింపు పొందిన రాజకీయ పక్షాన పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచిన వ్యక్తి, పార్టీ వీడిన మరు క్షణం ఘోరంగా ఓటమి పాలైన సందర్భాలున్నాయి. ఎన్ని పార్టీలు మారినా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా, అఖండమైన మెజారిటీతో గెలిచిన వారూ వున్నారు. ఎవరిని, ఎప్పుడు ఎందుకు భారతీయ ఓటరు గెలిపించుతాడో-ఓటమి పాలు చేస్తాడో తెలుసుకోవడం అంత సులువైన విషయం కాదు. ఇలాంటి ప్రాధాన్యతలే, పార్లమెంటుకు గెలిచే అభ్యర్థుల సామాజిక కూర్పును ఒక్కో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేసరికి మారుస్తున్నది. ఒక నాడు ఆంగ్ల విద్యను అభ్యసించ గలిగిన లాయర్లు, అగ్రకులాలకు చెందిన విద్యావేత్తలు, ధనవంతులు మాత్రమే పార్లమెంటులో అడుగు పెట్టగల సత్తా వుండేది. కాలం మారింది. ధన బలం, అంగ బలం, కుల బలం వున్న అన్ని సామాజిక వర్గాల వారితో సహా, రిజర్వేషన్ల మూలాన, వెనుక బడిన వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డు తెగలకు చెందిన వారు కూడా పార్లమెంటుకు-చట్ట సభలకు ఎన్నిక కాగలుగుతున్నారు. మహిళలకు ఇంకా రిజర్వేషన్లు కలిగించ లేకపోవడంతో, అనుకున్నంత మంది ఎన్నికవడం లేదు. మొత్తం మీద, మారుతున్న సామాజిక-ఆర్థిక-రాజకీయ పరిస్థితులకనుగుణంగా, వైవిధ్యంతో కూడిన సామాజిక ప్రయోజనాలను ప్రతిబింబించే విభిన్న వ్యక్తులతో పార్లమెంటు ఏర్పాటవుతోందిప్పుడు.

ఇందిరా గాంధి హయాంలో 1975 లో విధించిన అత్యయిక పరిస్థితి, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత విషాద సంఘటనగా పేర్కొనాలి. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా తీసుకున్న దురదృష్టమైన నిర్ణయమది. అంతకు ఐదారు సంవత్సరాల క్రితం నుంచే, కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు బలమైన ముఠా నాయకులు, రాజకీయంగా లబ్ది పొందాలని పట్టుదలతో, జాతి ప్రయోజనాలను భంగం వాటిల్లే విధంగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం మొదలైంది. అదే క్రమంలో, కాంగ్రెస్ పార్టీతో సహా పలు రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలహీన పడడం, పార్లమెంటులోకి అడుగు బెట్టే రాజకీయ పార్టీల సంఖ్య ఒక నాటి ఐదు నుంచి సుమారు నలభైకి పెరగడం, ఒక సారి గెలిచిన వ్యక్తి మళ్ళీ గెలుస్తారో-లేదో అన్న అపనమ్మకంతో, "ఆయారం-గయారాం" రాజకీయాలకు ఒడిగట్టడం, పార్లమెంటు వ్యవస్థ జవాబుదారీ కుదించసాగాయి.

రాజ్యాంగ, ఆర్థిక, పాలనా పరమైన అధికారాలున్నప్పటికీ, పార్లమెంటు మౌలిక లక్ష్యం, చట్టాలను రూపొందించడం. రాజ్యాంగాన్ని సవరించే ఏకైక శక్తి పార్లమెంటు. పన్నులు విధించాలన్నా, నిధులు ఖర్చు చేయాలన్నా, పార్లమెంటు ఆమోదం తప్పని సరి. అధికార పార్టీ ప్రతిపాదించిన బడ్జెట్ కు పార్లమెంటు ఆమోద ముద్ర పడటం జరగకపోతే, ఆటోమేటిక్ గా, ఆ ప్రభుత్వం పార్లమెంటు విశ్వాసం కోల్పోయినట్లే. ఇక మంత్రివర్గం యావత్తు పార్లమెంటుకు సమష్టిగా బాధ్యత వహించాలి. ప్రభుత్వం ప్రజలకు నేరుగా కాకుండా పార్లమెంటు ద్వారా జవాబుదారీ. ప్రభుత్వ ప్రప్రధమ జవాబుదారీ సంవిధానం, పార్లమెంటులో ప్రవేశ పెట్టి-చర్చించే అవిశ్వాస తీర్మానం. ప్రతిపక్షాలు ప్రతిపాదించే ఆ తీర్మానం నెగ్గితే, ప్రభుత్వం పడిపోయినట్లే. కాకపోతే, చట్ట సభలో గణనీయమైన మెజారిటీ కలిగున్న ప్రభుత్వానికి ఎప్పుడూ ఢోకా లేదు. ఇంత పటిష్టమైన అధికారాలు కలిగిన పార్లమెంటును, 1975 లో ఎమర్జెన్సీ విధించిన సందర్భంలో, పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకుంది ఎగ్జిక్యూటివ్. ఎమర్జెన్సీ విధింపుతో సమాంతరంగా, ప్రాధమిక హక్కులను హరించి వేసే, రాష్ట్రపతి ఉత్తర్వులకు పార్లమెంటు ఆమోద ముద్ర వేయించుకో కలిగింది ఇందిరా గాంధి. ఎమర్జెన్సీ విధింపును, ప్రాధమిక హక్కుల హరింపును, లోక్ సభ ఆమోదం కొరకు ప్రతిపాదించినప్పుడు, సభలో ఓటింగు చేసిన వారిలో 336 మంది సభ్యులు అనుకూలంగా తల వూపడమంటే, ఎగ్జిక్యూటివ్ అధికారానికి దాసోహం అన్నట్లే కదా! మరో విధంగా చెప్పుకోవాలంటే, సంస్థాగతంగా పటిష్టంగా వున్న పార్టీ గణనీయమైన సంఖ్యాబలంతో వున్నప్పుడు, అవిశ్వాస తీర్మానాలు ఏమీ చేయలేవు.

అవిశ్వాస తీర్మానాల ద్వారా, ఇతర రకాలైన సభా తీర్మానాల ద్వారా, రాజ్యాంగ పరంగా సంక్రమించిన అధికారాలతో ప్రభుత్వాలను ఇబ్బందికి గురిచేయగల పదునైన ఆయుధాలు, తమ చేతులో వుంచుకున్న ప్రతి పక్షాలు సహితం, పార్లమెంటును జవాబుదారీగా వుంచడంలో విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అధికారంలో కొచ్చిన రాజకీయ పార్టీలు కూడా, ప్రతిపక్ష పాత్ర సక్రమంగా పోషించలేక పోవడానికి కారణం, సంస్థాగతంగా సరైన నిర్మాణం లేకపోవడమే. బ్రిటన్ లో మాదిరి, "షాడో ప్రభుత్వం" ఏర్పాటుచేయగల సామర్థ్యాన్ని పెంపొందించుకో లేకపోతున్నాయి. పబ్లిక్ అకౌంట్ కమిటీ, ఎస్టిమేట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ, ప్రత్యేక కారణాలకొరకు ఏర్పాటు చేసే పలు అడ్ హాక్ కమిటీల లాంటి పార్లమెంటరీ కమిటీలున్నప్పటికీ, అవి రూపొందించిన నివేదికలను, సర్వసాధారణంగా పార్లమెంటు పరిగణలోకి తీసుకోక పోవడం కూడా జవాబుదారీ క్షీణించడానికి కారణమౌతోంది.

పార్లమెంటులో శాసన నిర్మాణానికి అంచలంచలుగా ప్రక్రియ వుంది. బిల్లు ప్రవేశ పెట్టిన తర్వాత, ముసాయిదాను చర్చకొరకు పరిశీలించేందుకు తక్షణమే ఓటింగు పెట్టవచ్చు. లేదా, ప్రవేశపెట్టిన సభా సభ్యుల సెలెక్ట్ కమిటీకి కాని, ఉభయ సభల సంయుక్త సెలెక్ట్ కమిటీకి కాని పంపవచ్చు. ప్రజాభిప్రాయ సేకరణకొరకు కూడా పంపవచ్చు. కాకపోతే ఈ ప్రక్రియ అరుదుగా జరుగుతుంటుంది. లోక్ పాల్ బిల్లు విషయంలో, ఈ ప్రక్రియకు అవకాశం వుండొచ్చేమో! సింహభాగం బిల్లులను సెలెక్టు కమిటీలకే పంపి తాత్కాలికంగా చేతులు దులుపుకుంటుంది ప్రభుత్వం. క్లాజు వారీగా బిల్లుపై చర్చ, సవరణల పరిశీలన, సవరణలకు మంత్రివర్గం ఆమోదం-తిరస్కారం, తర్వాత ఓటింగు జరుగుతుంది. సంబంధిత సభలో నెగ్గిన తర్వాత, మరో సభకు పంపి ఇదే ప్రక్రియను అనుసరిస్తారు. ఉభయ సభలలో ఓటింగు తర్వాత, రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపడం జరుగుతుంది. ఆమోదం పొందినంత మాత్రాన యాంత్రికంగా-స్వయం చలనంగా చట్టం కాదు. చాలా సందర్భాలలో (కావాలనే?) మరిచి పోవడంతో, రాజ్యాంగపరంగా జారీ చేయాల్సిన గెజెట్ నోటిఫికేషన్ ఆలశ్యం కావడం, చట్టం కాగితాలకే పరిమితమై పోవడం జరుగుతుంటుంది.

పార్లమెంటు సభా సమావేశాల సమయం క్రమేపీ తగ్గుతోంది. వాయిదా తీర్మానాల సంఖ్య దినదినాభివృద్ధి చెందుతోంది. అనేక సందర్భాలలో సభ్యులు మూకుమ్మడిగా నిల్చొని, ఎవరేం మాట్లాడుతున్నారో తెలియనందున, సభ నిర్వహణకు అంతరాయాలు కలగడం సభా సమయం తగ్గిపోవడానికి మరో కారణం. రాజ్యాంగపరంగా విధిగా కావాల్సిన "కోరం" లేకుండా కూడా సభను నిర్వహించాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఒక్కో సారి. విధి లేని సందర్భాలలో సభాపతి వాయిదా మార్గాన్ని ఎంచుకోవాల్సి వస్తోంది. పార్లమెంటు సభ్యులకు తమ నియోజకవర్గ ఓటర్లతో నిరంతరం సంబంధాలుండడం తప్పనిసరి. నియోజక వర్గానికి పోవడం చేస్తున్నారు కాని, తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను సక్రమంగా ఉపయోగించుకోలేక పోతున్నారు. దురదృష్టవశాత్తు, నియోజకవర్గానికి చెందిన పలువురి దృష్టిలో ఎంపీ అంటే, తమకు కావాల్సిన సొంత పనులు చేసిపెట్టే మనిషి మాత్రమే అన్న అభిప్రాయం వుంది. పార్లమెంటు సభ్యులకు కూడా వారి అవసరం వుండడంతో, వారు కూడా దానికే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వెరసి ఇవన్నీ కూడా, జాతీయ ప్రాముఖ్యత సంతరించుకున్న అంశాలపై వారు శ్రద్ధ వహించకుండా వ్యవహరించేందుకు దోహద పడుతున్నాయి. జవాబుదారీ లోపించడానికి ఇవి కూడా కారణాలవుతున్నాయి.

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ తన పని తాను చేసుకుంటూ పోతుందేమో కాని, ఆ వ్యవస్థకు మూలస్థంభమైన పార్లమెంటు జవాబుదారీ ప్రశ్నార్థకంగా మారిపోతోంది. ఈ నేపధ్యంలో, అన్నా హజారే లాంటి వారు ప్రతిపాదించిన "లోక్ పాల్" వ్యవస్థ, కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ చెప్పినట్లు "జవాబుదారీ తనం లేని సమాంతర ప్రభుత్వం" లాంటిది కాదా? లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్ ల కంటే ఎక్కువ అధికారాలను కలిగుండే వ్యవస్థ కాదా?

Saturday, September 18, 2010

వారసత్వ ప్రజాస్వామ్యం - కుటుంబ రాజకీయాలు : వనం జ్వాలా నరసింహారావు

వారసత్వ ప్రజాస్వామ్యం - కుటుంబ రాజకీయాలు
వనం జ్వాలా నరసింహారావు

ఖమ్మం జిల్లాలో పుట్టి పెరిగిన నాకు రాజకీయాలతో ను, రాజకీయ నాయకులతోను పరిచయాలు అక్కడే మొదలయ్యాయి. అలా పరిచయమైన వాళ్లలో స్థానిక నాయకులనుంచి మంత్రుల స్థాయికి ఎదిగిన వారి దాకా చాలామంది వున్నారు. అయితే వారిలో అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు మాత్రమే వారసత్వంగా ఎదగ గలిగారు. నా లాంటి వారికీ రాజకీయ కుటుంబ నేపధ్యమున్నా ఏ మాత్రం రాణించ లేకపోయాం. కారణాలు అనేకం. ఎన్.టీ రామారావు లాంటి వారు పటేల్-పట్వారీ వ్యవస్థనైతే రద్దు చేయగలిగారు కాని, వారసత్వంగా ఎదుగుతున్న రాజకీయ పటేల్-పట్వారీలను ఆపు చేయలేకపోయారు.

సుమారు ఐదు దశాబ్దాల క్రితం, ఖమ్మం శాసన సభ స్థానం నుంచి ఎన్నికైన కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మహమ్మద్ రజబ్ అలీ, పాలేరు రిజర్వుడు నియోజక వర్గం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థి కత్తుల శాంతయ్య, నేనెరిగిన మొట్టమొదటి ఎమ్మెల్యేలు. ఆ తర్వాత చాలా పర్యాయాలు ఎన్నికైన వారిరువురులో ఎవరు కూడ వారి వారసులెవరినీ రాజకీయాల్లోకి తెచ్చిన దాఖలాలు లేవు. ఖమ్మం జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి-కేంద్ర మంత్రి జలగం వెంగళరావు జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా, పార్లమెంట్ సభ్యుడుగా తన తర్వాత తమ్ముడు కొండల రావును చేశారు. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేసి గెలిచిన స్థానంనుంచి ఒక సారి పెద్ద కొడుకు ప్రసాద రావు, ఇంకొక సారి చిన్న కొడుకు వెంకట్రావు ఎన్నికయ్యారు. ప్రజాస్వామ్యంలో కూడ వారసత్వానికి అవకాశాలు మెండుగా వుంటాయని సోదాహరణంగా చూపించారు. ఇదేదో ఒకరిద్దరి విషయంలోనో-లేక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి విషయంలోనో జరుగుతే ఆశ్చర్యపడాల్నేమో కాని, భారత దేశ రాజకీయాల్లో సర్వ సాధారణ విషయమై పోయి, ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారుతుంటే ఆశ్చర్యపడక తప్పదు. రాజకీయాల్లో కీలకమైన పదవులను పొంది, ఉన్నత స్థాయికి చేరుకున్న వారి బంధుగణం అతి పిన్న వయసులోనే, రాజకీయ ప్రవేశం చేసి, చకచకా ఎదగడం సంప్రదాయంగా మారుతోంది. మొదటి తరం నాయకులు, తమ సంతానాన్ని-సోదరీ, సోదరుల సంతానాన్ని, తమ్ముళ్లను, చెల్లెళ్లను, భార్యలను, వీలున్న బంధువులను వ్యూహాత్మకంగా రాజకీయాల్లోకి దింపి, వారసత్వ సంపదలాగా పదవులను దక్కించుకుంటున్నారు.

అసలు ప్రజాస్వామ్యమే వారసత్వంగా మారుతున్నదా? ఔననక తప్పదు. నెహ్రూ-గాంధీ కుటుంబం జాతీయ స్థాయిలో (మంచికో-చెడుకో) ఈ ప్రక్రియకు బీజాలు నాటితే, దేశవ్యాప్తంగా వాటి మొక్కలు పెరిగి, భారీ వట వృక్షాలుగా వూడలు పెంచి, పెకలించడానికి సాధ్యపడని స్థితికి చేరుకుంది. "వారసత్వం జన్మ హక్కు" అని వాదించే స్థాయికి చేరుకుంది. సుమారు తొంబై సంవత్సరాల క్రితం బ్రిటీష్ ఇండియాలో, న్యూఢిల్లీ నుంచి "సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ" కి ఆ కుటుంబం మొదటి తరం నాయకుడు మోతీలాల్ నెహ్రూ ఎన్నికైన తర్వాత, ఆ కుటుంబానికి సంబంధించిన దాదాపు అందరూ చట్ట సభల్లో అడుగు పెట్టారు. కాకపోతే, అందులో పలువురు వారి-వారి సామర్థ్యాన్ని బట్టే ఆ పదవులకు చేరుకున్నారు.

భారత రాజకీయ కుటుంబ వారసత్వ పరంపరలో మునిగి తేలుతున్నవారు కోకొల్లలు. ఏడాది క్రితం జరిగిన సారస్వత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన-ఓడిన అభ్యర్థుల జాబితా చూస్తే చాలు, రాజకీయ వారసుల జాబితాలో ఎన్ని పేర్లున్నాయో తెలుసుకోవడానికి. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసిన మురళి దేవరా కుమారుడు మిళింద దేవరా, సునీల దత్ కుమార్తె ప్రియా దత్, చగన్ భుజ బల్ అల్లుడు సమీర్ భుజ్ బల్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎస్.బి.చవన్ అల్లుడు-ఇప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ బావమరిది భాస్కర రావ్ పాటిల్, మాజీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొడుకు ముకుల్ వాస్నిక్, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్. ఎన్. బహుగుణ కొడుకు విజయ్ బహుగుణ (ఇతడి సోదరి యు.పి.సీ.సీ అధ్యక్షురాలు రిటా బహుగుణ-మరో కజిన్ బిసి.ఖండూరి ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి), ఆంధ్ర ప్రదేశ్ (దివంగత)ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్. జగన్మోహన్ రెడ్డి వారసులుగా ఎదుగుతున్న మరో తరం ప్రజాస్వామ్య భావితరం నాయకులు. ఆ మాటకొస్తే ఆంధ్ర ప్రదేశ్ మంత్రి బొత్సా సత్యనారాయణ కుటుంబానికి చెందిన నలుగురికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఆయనకు, ఆయన తమ్ముడికి, అల్లుడికి ఎమ్మెల్యే టికెట్లు, భార్యకు ఎంపీ టికెట్ లభించింది. అందరూ గెలవడం విశేషం.

ఒకప్పుడు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఉమాశంకర్ దీక్షిత్ కోడలు శీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా దశాబ్దం పైగా పనిచేస్తుంది. ఆమె తనయుడు సందీప్ దీక్షిత్ ను ఆమె అప్పుడే రాజకీయాల్లోకి తేవడం పార్లమెంట్ సభ్యుడుగా చేయడం జరిగిపోయింది. హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా నాలుగు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా కూడా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు దీపీందర్ సింగ్ హుడా ఆయన వారసుడుగా ఎదుగుతున్నాడు. ఆయనిప్పుడు పార్లమెంటు సభ్యుడు. భూపిందర్ కన్నా ముందున్న ముఖ్యమంత్రి దేవీ లాల్ తనయుడు ఓం ప్రకాష్ చౌతాలా కూడా ముఖ్యమంత్రి అయ్యాడు. సమాజ్ వాది పార్టీ నాయకుడు, మాజీ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ కుటుంబ సభ్యులంతా వారసులుగా ఎదుగుతున్నవారే. కొడుకు అఖిలేష్ యాదవ్ మొన్న జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేసి గెలవడం, ఒకటి రాజీనామా చేయడం, ఆ స్థానంలో కోడలు పోటీకి దిగడం తెలిసిందే.

నెహ్రూ-గాంధి కుటుంబ వారసుడిగా ఐదో తరం నాయకుడు-భావి భారత ప్రధానిగా పలువురు భావిస్తున్న రాహుల్ గాంధి, ఆయన తల్లి సోనియా గాంధి కాంగ్రెస్ అభ్యర్థులుగా వారసత్వ పరంపరలో పోటీ చేయగా, సంజయ్ గాంధి కొడుకు వరుణ్-భార్య మేనకా గాంధి భారతీయ జనతా పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచారు. ఒరిస్సా ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ తనయుడు దిప్ గొగోయ్, మరో మాజీ ముఖ్య మంత్రి బిజూ పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్, మనీష్ తివారి, రవ్నీత్ సింగ్ బిట్టు, కుమారి షెల్ జా, నాధు రాం మిర్ధా మనుమ రాలు జ్యోతి మిర్ధాలు కూడా వారి-వారి కుటుంబాలకు వారసులే. మోతీలాల్ ఓరా కొడుకుకు, అజిత్ జోగి భార్యకు, రాజస్థాన్ లో జగన్నాధ పహాడియా-సిస్ రామ్ ఓలా-నావల్ కిశోర్ శర్మ-గోవింద్ సింగ్ గుర్జార్ వాళ్ల పిల్లలకు వారసత్వ నాయకులుగా ఎదిగే అవకాశాలు దొరికాయి. జాతీయ స్థాయిలో నెహ్రూ-గాంధి కుటుంబ అడుగు జాడల్లోనే, ప్రాంతీయ స్థాయి నాయకులు కూడా నడుచుకోవడం విశేషం.

వారసత్వ కుటుంబ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్.సీ.పీ వ్యవస్థాపక నాయకుడు శరద్ పవార్ కూతురు తండ్రికి వారసురాలిగా ఎదగసాగింది. ఆమె ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు. కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప పెద్దకొడుకు రాఘవేంద్ర, మాజీ ప్రధాని దేవెగౌడ ఇద్దరు కుమారులు (ఒక కొడుకు హెచ్. డి. కుమార గౌడ ఈ ఈపాటికే జె. డి-ఎస్ నాయకుడు మాత్రమే కాకుండా, కర్నాటక ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు), తమిళ నాడు ముఖ్యమంత్రి సంతానం: కొడుకు అజహగరి, కూతురు కణిమొజిహి, కొడుకు స్టాలిన్, మురసోలి మారన్ కొడుకు దయానిధి మారన్, మాజీ లోక సభ స్పీకర్ పీ. ఏ. సంగ్మా కూతురు అగాథ చురుగ్గా ఎదిగిన కొందరు కాంగ్రేసేతర వారసులు. వీరంతా చట్ట సభల్లో రంగ ప్రవేశం చేశారీపాటికే. జమ్ము-కాశ్మీర్ లో షేక్ అబ్దుల్లా తనయుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన తనయుడు ఒమర్ అబ్దుల్లా...అందరూ నాయకులే. అంతా ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులైన వారే. కేంద్రంలో కీలక పదవులను అనుభవించిన వారే. వారి ప్రత్యర్థి పీ.డీ.పీ నాయకుడు ముఫ్టి మహమ్మద్ సయీద్ కూతురు మెహబూబా అప్పుడే నాయకురాలైంది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టీ రామారావు అల్లుళ్లిద్దరు, ఒక కొడుకు, కూతురు రాజకీయాల్లో కీలకమైన స్థానాల్లో వున్నారు. చంద్రబాబు నాయుడు తమ్ముడు నాయకుడే. కొడుకు కూడా ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్నాడు. మహారాష్ట్ర శివసేన నాయకుడు బాల్ థాకరే కొడుకు నాయకుడే. అలానే కరుణాకరన్, నందినీ సత్ పథి, జగ్జీవన్ రాం వారసులూ ఎదిగారు. ఆర్.జే.డీ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్, జెఎంఎం పార్టీ మహితో, మాజీ గుజరాత్ సీ. ఎం చిమన్ భాయ్ పటేల్ తమ అర్థాంగులను అందలం ఎక్కించారు.

ఒక తరం నుంచి మరో తరానికి రాజకీయాధికారం బదిలీ అవుతోందిలా. వారసత్వ రాజకీయాలు-కుటుంబ రాజకీయాలు దేశ భవిష్యత్ ను శాసించే దిశగా కదులుతున్నాయి. రాచరిక వ్యవస్థకు సంబంధించిన రాజకీయాలకు అలవాటు బడిన భారతీయులకు, అనాదిగా, రాజులు-మహారాజులు-చక్రవర్తులు తమ తమ కొడుకులను-కూతుళ్లను తమ తదనంతరం సింహాసనం అధిష్టింప చేసేందుకు పన్నే వ్యూహాల గురించిన కథలను విన్నారు. ప్రజాస్వామ్య మౌలిక సిద్ధాంతాలను ఇంకా సరిగ్గా అవగాహన చేసుకోలేని అమాయక భారతీయులు, బహుశా వర్తమాన రాజకీయాలలోనూ, వారసత్వంగా సంతానం నాయకత్వం చేపట్టడంలో తప్పులేదని భావిస్తుండవచ్చు. అలా మొదటి తరం నాయకులు తమ వారసులుగా సంతానాన్ని తేవడంలో అ నైతికం లేదనే వారి భావన కావచ్చు. అందుకే, స్థానిక సంస్థల నుంచి, ప్రధాన మంత్రి స్థాయి వరకు, వంశ పారంపర్యంగా కొన్ని కుటుంబాలకు చెందిన వారికే రాజకీయాధికారం లభిస్తోంది. ఒక్క సారి అధికారంలోకి రావడంతోనే, తమ సర్వ శక్తులను ఒడ్డి, బయట వారెవరినీ రాకుండా, తమ వారినే తమ వారసులుగా చేసే ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ వేళ్లూనుకోసాగింది. దీని పర్యవసానం ఏంటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. దీనికి అడ్డు కట్ట వేయడం సాధ్యమేనా?

భారత దేశంలోని రాజకీయ పార్టీలన్నీ, అవినీతిని ఉత్పత్తిచేసే, వంశపారంపర్య కుటుంబ వ్యవస్థలు. వీటిని పెంచి పోషించే వ్యక్తులు, తమ కుటుంబీకులను తప్ప, వెలుపల వారిని తమ గుప్పిట్లో వుంచుకున్న పార్టీలోకి అడుగుబెట్టనివ్వరు. లోపలున్న వారి గొంతు నొక్కేసి, అసమ్మతి రాగాన్ని వినిపించకుండా జాగ్రత్త పడతారు. ఫలితంగా అవాంఛనీయ పరిణామాలు చోటుచేసుకోవడం, ధన బలం-కండ బలం-కుల, మత బలం ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. ప్రజ్ఞా పాటవాలు-శక్తి సామర్థ్యాలున్న సాటి-తోటి పౌరులు, సమాజానికి ఎంతో సేవ చేయాలని వున్నా, దానికి కావాల్సిన రాజకీయ కుటుంబ నేపధ్యం లేకపోవడంతో, ఎన్నికల్లో పోటీ చేయలేక పోవడం, చేసినా, గెలిచి చట్ట సభల్లో ప్రవేశించలేక పోవడం కష్టమై పోతోంది. ఈ పరిస్థితి ఇలా కొనసాగితే, భారత ప్రజాస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం లేనిది గాను-ప్రజల సాధికారత కొరవడేదిగాను కావడం తథ్యం. ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల సారధ్యంలో ఆయా రాజకీయ నాయకుల కుటుంబ పాలన కొనసాగి, "ప్రజాస్వామ్య సంస్థానాలు" ఆవిర్భవించే ప్రమాదం పొంచి వుంది.

ఈ ప్రమాదానికి, వారసత్వ సంస్కృతికి కారకులెవరంటే, జవాబుగా కాంగ్రెస్ పార్టీ అని ఎవరైనా వెంటనే చెప్తారు. స్వాతంత్ర్యం రావడానికి పూర్వమే, తండ్రి మోతీలాల్ నుంచి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వారసత్వంగా పొందిన జవహర్లాల్ నెహ్రూ, చాలా వ్యూహాత్మకంగా-పకడ్బందీగా కుటుంబ వారసత్వ పాలనకు, ఆయన ప్రధానిగా వున్న కాలంలోనే పునాదులు వేశారు. వర్తమాన చరిత్రకారులెందరో దీన్ని ధృవీకరించారు. తన తదనంతరం కూతురు ఇందిర ప్రధాని కావాలని నెహ్రూ భావించారు. ఆయన కోరిక నెరవేరింది. ఇందిరా గాంధీ కూడా తండ్రి-తాత బాటలోనే పయనించింది. మొదట పెద్ద కొడుకు సంజయ్ గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని తెర పైకి తెచ్చింది తన వారసుడిగా. ఎమర్జెన్సీ ముందర, తర్వాత సంజయ్ గాంధీ ప్రభావం ఇందిరపై బాగా పనిచేసింది. అధికారిక హోదా లేకపోయినా, రాజ్యాంగేతర శక్తిగా ఆయన ఎదగసాగాడు. భావి భారత ప్రధానిగా, "దేశ్ కీ నేతా" గా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాల మధ్య ఆయన బలీయమైన శక్తిగా పెరిగిపోయాడు. ఇంతలో జనతా చేతులో ఇందిర ఓటమి, కొన్నాళ్లకు అఖండమైన విజయం, సంజయ్ పార్లమెంటులో ప్రవేశం, మరి కొన్నాళ్లకు విమాన ప్రమాదంలో ఆయన దుర్మరణం ఒకటి వెంట మరొక టి సంభవించాయి. ఇక ఆ తర్వాత చరిత్ర అందరికీ తెలిసిందే. సంజయ్ వస్తాడనుకున్న స్థానాన్ని రాజీవ్, ఇందిర మరణం తర్వాత భర్తీ చేశాడు. ఆయన హత్యకు గురైంతర్వాత, కొంత విరామం తర్వాత, మకుటం లేని మహారాణిగా, సోనియా వారసత్వం స్వీకరించారు. ఇక ముందుంది రాహుల్ పర్వం. ఇదంతా ఒక పథకం ప్రకారం జరగింది కాదా? ఏమో!

ఇలా...మోతీలాల్...దేవీ లాల్...భజన్ లాల్...కైరాన్...కరుణానిధి..కరుణాకరన్..చరణ్ సింగ్...అర్జున్ సింగ్..బిజూ పట్నాయక్...దేవెగౌడ..శరద్ పవార్...బాల్ ఠాక్రే..బహుగుణ..నందిని సత్పజథి...ఎవరైనా ఒకటే ! అందరి కోరికా తమ కుటుంబీకులే, తమ స్థానాల్లో పదవులలంకరించాలని. రాచరికంలో లేని వారసత్వం ప్రజాస్వామ్యంలో సుసాధ్యం చేసిన ఘనత మనదే! ప్రజాస్వామ్యాన్ని మించిన పాలనా విధానం లేనే లేదు. అలాంటి విధానాన్ని ఆచరణలో పెట్తున్న దేశాల్లో అతి పెద్ద దేశం మన దేశం. దురదృష్టవశాత్తు, అధికారంలో తమ వాళ్ళే వుండిపోవాలన్న కాంక్షతో, కొందరు వ్యక్తులు "ప్రజాస్వామ్యాన్ని" "వారసత్వ స్వామ్యం" గా మలిచేశారు. తమ కుటుంబ సభ్యుల లాంటి వారనేకమంది వుండే అవకాశం గురించి తెలిసి కూడా, వారు, అధికారాన్ని తమ వారికే ధారాదత్తం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అలా చేయడం వల్ల, ప్రజాస్వామ్యాన్ని-రాజకీయ వ్యవస్థను గేలి చేసి, హాస్యాస్పదం చేశారు. ప్రపంచంలో మనను చిన్న చూపు చూసే పరిస్థితి కలిగించారు. ఈ పాపంలో అన్ని రాజకీయ పార్టీలకు-నాయకులకు అంతో, ఇంతో భాగం వుంది. వారసత్వంగా ఎదిగిన-ఎదుగుతున్న వారిలో ఏ కొద్ది మందో తప్ప, చాలా మంది అలా ఎదగడానికి కేవలం రాజకీయ-కుటుంబ నేపధ్యమే కారణం అనక తప్పదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్థకంగా మారిపోయిందీ కారణాన.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వారసత్వ స్వామ్యంగా మార్పుచెందుతుందనడానికి సజీవ సాక్ష్యాలెన్నో--ఎన్నెన్నో వున్నాయి. ఆదిలో ముఖ్యమంత్రి పీఠాన్నెక్కిన బూర్గుల, నీలం, బెజవాడల తర్వాత మిగిలిన వారందరి వారసులు పదవులను పొందిన వారే. బ్రహ్మానందరెడ్డికి చెందిన కాసు కృష్ణారెడ్డి; పీవీ నరసింహా రావుకు చెందిన ఇద్దరు రాజేశ్వర రావులు, రంగారావు, మరో ఒకరిద్దరు కజిన్లు; జలగం వెంగళ రావు తమ్ముడు, కొడుకులు; మర్రి చెన్నారెడ్డి కొడుకు శశిధర రెడ్డి; అంజయ్య సతీమణి మణెమ్మ; ఎన్. జనార్ధన రెడ్డి సతీమణి రాజ్య లక్ష్మి; కోట్ల విజయభాస్కర రెడ్డి కొడుకు సూర్య ప్రకాశ్ రెడ్డి-కోడలు సుజాత; డాక్టర్ వై. ఎస్. రాజశేఖర రెడ్డి కొడుకు, భార్య; నాదెండ్ల భాస్కర రావు కొడుకు మనోహర్; ఎన్ టీ రామారావు కొడుకు, కూతురు, అల్లుళ్లు; చిరంజీవి తమ్ముళ్లు, బావమరిది; తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే సీ ఆర్ అల్లుడు, కొడుకు; ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఇంకా మిగిలి పోతారు. ఎంపీల, ఎమ్మెల్యేల, జిల్లా పరిషత్ అధ్యక్షుల, పార్టీల అధ్యక్షుల కుటుంబీకులనేక మంది వారసత్వ వరుసలో వున్నారు.

ఆశ్చర్యకరమైన విషయం, ఇప్పటి ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం ఇంతవరకు నీలం, బెజవాడ, బూర్గుల బాటలోనే నడుస్తున్నారు. ఆయన తన వారసులను రంగంలోకి దింపకపోవడం అభినందనీయమే!