Monday, January 29, 2018

రాక్షస స్త్రీల మాటలకు భయపడిన సీతాదేవి ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

రాక్షస స్త్రీల మాటలకు భయపడిన సీతాదేవి
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (29-01-2018)

మందతప్పి, ఒంటరిదైపోయి, తోడేలు పాలపడ్డ జింకలా, సీత రాక్షస స్త్రీల మధ్య చిక్కుకుని వణకసాగింది. మనస్సులోని విషాదాన్ని దూరంచేయడానికి, పూలబరువుకు వొంగిన ఓ పూల చెట్టుకొమ్మను పట్టుకుని, భర్తను తలచుకుని, శోకంతో, కన్నీళ్లతో స్తనాలను తడుపుతూ, భర్తను లోలోపలే స్మరించుకుంటూ, రాక్షస స్త్రీలు ఎప్పుదు ఏంచేస్తారో అన్న భయంతో, అరటిచెట్టు పెనుగాలికి వణికినట్లు వణకసాగింది. "రామా! లక్ష్మణా! అత్తా కౌసల్యాదేవీ! సుమిత్రా! నాపైన దయలేదా ఒక్కరికైనా!" అంటూ భయపడ్తూ గడగడలాతున్న సీతాదేవి కళ్లు వణకుతున్న కలువలను పోలి వున్నాయి. పొడవాటి ఆమె జడ నిలబడ్డ ఆమె భుజాలమీదకు దొర్లుతూ పెద్దపాములా కనిపించింది. (దీని అర్థం: బంధువులెవ్వరూ, ఎంత ఆప్తులైనా, "ఆత్మ" ను వుధ్ధరించలేరనే!)

సీతాదేవి రాముడిని స్మరిస్తూ ధ్యానంలో అనుకుంటుందీవిధంగా: "ఓర్పు నశించిపోయింది. రాక్షసుల బెదిరింపులు బాధిస్తున్నాయి. భర్తను వదిలి వుండాల్సి వచ్చెకద! ఈ మూడు కారణాల వల్ల ప్రాణం ఎప్పుడో పోవాల్సి వుంది. పోలేదంటే, అకాలమృత్యువు, స్త్రీనికాని, పురుషుడినికాని తాకదన్న పండితుల మాట సత్యం కావచ్చు. కాకపోతే, నాశరీరంలో ఇంకా ప్రాణం వుండటమేంటి? గొప్ప వ్రతం చేయబూని, పూర్తిచేయ లేనందువల్లే, వ్రతఫలం దక్కకుండా పోయి, భర్తతో ఎడబాటు కలిగి, నడి సముద్రంలో మునిగిన నావలాగా అయ్యాను. వ్రతం పూర్తిచేస్తే ఆ పుణ్యఫలం వల్ల నాభర్త నన్ను రక్షించేవాడేమో!"(దీన్నిబట్టి, స్త్రీలపాతివ్రత్యం, నోములఫలం, వారి భర్తలు తమను రక్షించేవిగా చేస్తున్నాయనీ, అట్టి ఫలం లేక పోతే, భర్తలున్నా రక్షించలేరనీ అర్ధం చేసుకోవాలి. "ఆడదాని అదృష్టం" అన్న నానుడి ఇందుకే ఏర్పడి వుండవచ్చు. ఆడది నిర్భాగ్యురాలైతే, మగవాడు ఎంత పుణ్యాత్ముడు, సమర్ధుడు అయినప్పటికీ, ఆ స్త్రీకి సుఖం లేదు. లోకంలో కొందరు దరిద్రులుగానూ, కొందరు ధనవంతులుగానూ, దుఃఖంతో కొందరు, సుఖిస్తూ కొందరు వున్నారు. ఇవి వారి-వారి పాప-పుణ్య ఫలాలు. బాగుపడటానికి, చెడిపోవటానికి, వారి-వారి పూర్వ కర్మలే కారణం.)

సీత ఇంకా ఇట్లా అనుకుంటుంది తనమనస్సులో: "శ్రీరామచంద్రుడి దర్శనం లేకపోవడం అటుంచి, రాక్షస స్త్రీలకు వశపడి బాధపడాల్సి వచ్చిందికదా! నదీ ప్రవాహానికి తెగిపోయిన వారధిలా, మరణించక ఎందుకు ప్రాణం నిల్పుకున్నాను? ప్రాణాలకు విభుడు భగవంతుడే! అట్టి భగవత్ సాక్షాత్కారం పుణ్యాత్ములకు కలుగుతుంది. భగవంతుడు నాలో వున్నా నేనెందుకు చూడలేకపోతున్నాను? నాపాపమే కారణమా? విషం తింటే తిన్నవాడి ప్రాణాలు పోతాయి. అట్లానే సమరసన్నిభుడు, భూపతి అయిన నాభర్తకు ఎడబాటైన ఈదేహంలో ప్రాణమెందుకుంది? ఇంత మహా దుఃఖాన్ని అనుభవించడానికి పూర్వజన్మలో నేనెంత ఘోరపాపం చేసానో? ఈవిధంగా మూర్ఖపు రాక్షస స్త్రీలు కావలికాస్తుంటే ఎక్కడో వున్న రాముడు రావడమేంటి? నన్ను రక్షించడమేంటి? కాబట్టి మృత్యుదేవతే నాకు దిక్కు. మనుష్య జన్మ ఎన్తపాపమైంది? అందునా పరవశమైన బ్రతుకేం బ్రతుకు? అనుకున్నప్పుడు చచ్చిపోయే శక్తి ఈయకూడదా?"

(సీతా విలాప రూపంలోని పై ఆలోచనలకర్థం....భగవత్ సాక్షాత్కారమయ్యేంత వరకు సంసార బాధ తొలగదని. ప్రకృతి బంధం మన ప్రయత్నంతో తొలగేది కాదు. భగవదనుగ్రహం తోనే తొలగాలి. ఒక దేహంలో "జీవాత్మ-పరమాత్మ" లిరువురూ వుంటారు. జీవాత్మ సంసారంలో మునిగి, ఈశ్వరుడిని చూడలేక, మోహంతో దుఃఖిస్తుంది. ఎప్పుడైతే, జీవాత్మ, పరమాత్మను దర్శిస్తుందో, అప్పుడే దాని శోకం తొలగిపోతుంది. ఇందు "ఆత్మగుణం, దేహగుణం" కలిపి చెప్పడంవల్ల, "సగుణ బ్రహ్మ" మే సేవించ తగిందనీ, అట్టి దానిని సాక్షాత్కరింప చేసుకొనగలవారే "పుణ్యాత్ములనీ, మోక్షార్హులనీ" అర్థం చేసుకోవాలి. పూర్వ జన్మ పాపంవల్ల కూడా ఇలా అనుభవిస్తున్నానని సీత అంటుందోసారి. అంటే, ఆమె కర్మ వశాత్తు పుట్టిందని కాదు. ఆమాట రాక్షస స్త్రీలను ఉద్దేశించి చెప్పబడింది. భక్తుడు తన సర్వస్వం ధారపోసినా, భగవంతుడు కనపడకపోతే ఆస్తికుడి లాగా భగవంతుడు లేడనుకోకూడదు. తనలోనే ఏదో లోపం వుందనుకోవాలి. మనుష్యులు సుఖమయినా, దుఃఖమయినా, "ప్రారబ్ధాన్ని" అనుభవించాల్సిందే కాని, బలాత్కార మరణంతోనో, ఇంకే విధంగానో దాన్ని తప్పించుకోలేరు.)



కళ్లనీళ్లు విపరీతంగా కారుతుంటే, తలవంచుకుని సీతాదేవి, నేలమీదపడి పొర్లాడే ఆడగుర్రంలా, పిచ్చెత్తినట్లు, పిశాచం పట్టినట్లు, వళ్లుతెలియక, మనస్సు దిగ్భ్రమ చెందిన దానిలా అయ్యి ఏడవసాగింది(ఇదంతా భక్తుల-ప్రపన్నుల స్థితి. భక్తి అతీతంగా పెరిగిపొతే, భక్తుడు దేహాభిమానాన్ని విడిచి నేలపైపడి పొర్లాడుతాడు. పిచ్చి పట్టినట్లు, దయ్యం పట్టినట్లు, వంటిమీద గుడ్డలున్నదీ, లేనిదీ తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఇదే స్థితి సీతాదేవికి కలిగింది). ఏడుస్తూ తనస్థితిని తలచుకుందీ విధంగా:

"రామచంద్రమూర్తి నేను పట్టుదలపట్టడం వలనే ప్రమాదంలోకి పోవడంతో, కోరినరూపం ధరించగల రావణాసురుడు, నేను ఏడుస్తున్నా లెక్క చేయకుండా, బలాత్కారంగా తీసుకొచ్చాడు. ఇక్కడ రాక్షసులచేత చిక్కిన నాకు, రామప్రాప్తిలేకుండా రాక్షసులు భయపెడ్తుంటే నేనెట్లా బ్రతకాలి? నేను బ్రతికేదే రాముడికొరకు. ఆయన సేవకే నా ధనం. రామ కైంకర్యానికే నా సొగసులు. ఇవన్నీ రాముడిని సంతోషపెట్టడానికే అయినప్పుడు, ఆయనలేనందున నేనేడుస్తున్నప్పుడు, నాకెందుకివన్నీ? రాక్షసస్త్రీల మధ్య నేనేడుస్తుంటే నాగుండె పగలకపోవడానికి, అదేమన్నా ఇనుపగుండేమో! లేకపోతే, నాహృదయానికి ముసలితనం, చావూ లేవేమో? ఇది నాదౌర్భాగ్యం".

"రామచంద్రమూర్తి నన్ను విడిచి పోయాడంటున్నానేకాని, దానికి కారణం నాపాపమయమైన జీవితమేకదా! నేను పుణ్యాత్మురాలినే అయితే, ఆయన్ను పొమ్మని ఎందుకంటాను? అన్నా ఆయనెందుకు పోవాలి? ఆ నా పాప ఫలమే నన్ను ప్రాణాలు విడవనీయకుండా చేస్తున్నాయి. నేనెప్పుడైతే దేహమంత అభిమానంతో ప్రాణాలు నిలుపుకుంటున్నానో, అప్పుడే నేను అనార్య నయ్యాను....పతివ్రతను కాను.....సదాచారవతిని కాను. ఇట్టి శీలాదులులేని దిక్కుమాలిన బ్రతుకెందుకు? నా పతివ్రతమేమి వ్రతం? రామచంద్రమూర్తి సేవ మళ్లీ లభిస్తుందనే ఆశతో ప్రాణాలు నిల్పుకున్నాను. ఎందుకంటే బలవంతంగా విడువకూడదాయె! రావణుడేమో ఒక్క ద్వీపానికే అధిపతి. రాముడేమో భూమీతలానికంతా అధిపతి. అట్టివాడిని విడిచి శోకంతో బ్రతకలేను. రాక్షసులు నన్ను పీక్కుని తింటే తిననీ! ముక్కలుగా నరికితే నరకనీ! ఈ స్థితిలో నాకు పరుపులు, మంచాలు, సొగసులు కావాల్నా? ఈ పాడు ప్రాణమింత తీపా? (దీన్ని బట్టి భక్తుడి మనస్సు భగవంతుడి మీదుండాలికాని సుఖ-సౌఖ్యాల మీదకాదని అర్ధమౌతోంది)

         "రావణాసురుడిని నేను ఎడమకాలి గోటితోనైనా తాకను. అట్లాంటిది వాడిని ప్రేమించడమేంటి? ఛీ, ఇంత మాత్రం వాడికి అర్థం కావడంలేదు. వాడు సిగ్గులేని దుష్టుడవటమే దీనికి కారణం. చూడటానికే ఇష్టపడని స్త్రీ, మోహిస్తుందని ఎట్లా అనుకుంటున్నాడు? ఆమాత్రం జ్ఞానంకూడాలేదు. అంత ఊహాబలం లేకున్నా, ఛీ అని చీదరించినా తెల్సుకోలేకపోతున్నాడు. ఎటువంటి వంశంలో పుట్టాడు! వాడి గౌరవమేంటి? పిత్రార్జితం, స్వార్జితమైన గౌరవాన్నైనా ఆలోచించాలికద! ఈ ఆడదానిచేత చీవాట్లు పడటమెందుకని కూడా అనుకోవడంలేదు. ఇంకా నన్ను తన క్రూరత్వంతో వశపర్చుకోవాలనుకుంటున్నాడు. ఇదివాడి దోషంకాదు. యమపాశంతో ఈడ్వబడటానికీ, చావుకు సిధ్ధపడటానికీ, ఇటువంటి బుధ్ధికాక మంచి బుధ్ధి, చక్కటి ఆలోచన ఎట్లా కలుగుతుంది? కాల ప్రేరణవల్ల వాడు అలా చేస్తున్నాడు".

Sunday, January 21, 2018

సీతాదేవితో కటువుగా మాట్లాడిన రాక్షస స్త్రీలు ..... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

సీతాదేవితో కటువుగా మాట్లాడిన రాక్షస స్త్రీలు
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (22-01-2018)

సీతాదేవి మాటలకు మిక్కిలి కోపంతో, రాక్షస స్త్రీలందరూ, భయంతో వణకుతూ, ఆమె చుట్టూచేరి, -గొడ్డళ్లు తిప్పుతూ, తొర్రికూతలు కూస్తూ, మీద, మీద పడ్తూ: "నువ్వెవతివే? మమ్మల్నీ, రావణుడునీ ఎదిరించి మాట్లాడటానికి? నీకు రావణుడెందుకు పనికిరాడే? వాడుమగవాడు కాదానే?" అని బెదిరిస్తారు. ఆమాటలకు, శోకంతో కన్నీళ్లు కారుతుంటే, భయంతో లేచి శింశుపావృక్షం చాటుకు పోతుంది సీతాదేవి.

ఆమె వెంటనే వచ్చిన "వినత" అనే వికటరాక్షసి చిర్రు, బుర్రులాడుతూ:"నీమగడిపై ప్రేమచూపిస్తున్నావు, మంచిదే. మెచ్చుకుంటున్నాను. ఏదైనా మితిమీరకూడదు. మగడిపైకూడా ఎంతవరకు ప్రేముండాలో అంతే వుండాలికాని అతిగా వుండకూడదు. మితిమీరిందేదైనా కీడుచేస్తుంది. మనుష్యస్త్రీల పాతివ్రత్యం గురించి చెప్పావు. బాగుంది. అంతకంటే మేలైంది ఇంకోటివుంది. ఇంద్రుడితో సమానమైన పరాక్రమవంతుడు, సుందరుడు, రావణుడిని నీవు భర్తగా స్వీకరించు. కనీసం ఒక్కపూటైనా అలాచేసిచూడు. ఇష్టంలేకపోతే వదిలెయ్యి. రావణుడు మహాదాత, భోగమందు ఆసక్తి వున్నవాడు, నేర్పరి. ఎంతమంది భార్యలనైనా సంతోషపెట్టగల ప్రియమైన ఆకారమున్నవాడు. దరిద్ర రాముడిని కట్టుకుని ఏడ్చే దానికంటే రావణుడుని చేసుకో" అంటుంది.

తన ప్రయత్నాన్ని కొనసాగిస్తూ, బుజ్జగిస్తూ అంటుంది సీతతో: "సువాసనగల గంధాన్ని పులుముకొని, బంగారు రత్నాలతో ప్రకాశిస్తున్న సొమ్ములు ధరించి, ఈక్షణం నుండే లోకాలను ఏలు. శచీదేవి ఇంద్రుడికెట్లానో, స్వాహాదేవి అగ్నికెలానో, నువ్వు రావణాసురుడికి అలానే ప్రియురాలివికా. ఎందుకు రాముడనే లోభిని, అల్పాయుష్కుడిని, తింటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలేనివాడిని, పట్టుకొని ఏడుస్తావు? నామాట వినకుండా ధిక్కరిస్తే, నిన్ను ముక్కలు-ముక్కలుగా నరికి ఫలహారంగా తింటాం".

వినత  మాటలు లక్ష్యపెట్టని సీతతో "అసుర" అనే మరో రాక్షసస్త్రీ వికటంగా నవ్వుతూ, గుద్దుతానని బెదిరిస్తూ, పరుషవాక్యాలతో అంటుంది: "ఓసీ దుర్బుధ్ధీ! మా రాక్షస రాజును నువ్వెన్నో మాటలన్నావు. అయినా, నీపై దయతో, సుకుమారివైన నీపై కోప్పడక నిన్ను చంపలేదు. రాముడొస్తాడు, నిన్ను తీసుకోపోతాడంటున్నావే? అదెలా సాధ్యం? ఆ ఒడ్డున వున్నవారికి సముద్ర తీరంలో వున్న ఈ లంక కనపడనేకనపడదు. ఒకవేళ సముద్రాన్ని దాటివచ్చినా, రావణుడి అంతఃపురంలో వున్న నిన్ను కల్సుకోలేడు. కల్సుకొనే ప్రయత్నం చేస్తే, ఇంతమంది కాపలా కాస్తున్న వారిని కాదని నిన్నెట్లు తీసుకోపోగలడు? పంజరంలో చిలకలా మాకు చిక్కావు. ఆ ఇంద్రుడుకూడా నిన్ను కాపాడేందుకు ఇక్కడకు రాలేడు. నేను వ్యర్థంగా మాట్లాడను. నీకు హితమేకాని, అహితం చెప్పను. నామాటలు చెవికెక్కించుకో. కన్నీళ్లు కార్చవద్దు. శోకం కీడుచేస్తుంది. నీకీ యవ్వనం శాశ్వతంకాదు. అదిపోకముందే విస్తార సౌఖ్యాలను అనుభవించు. అమరారినేతతో క్రీడించడం నీకేమైనా చేదా? రావణుడిని భర్తగా స్వీకరిస్తానని ఒక్క మాటను....ఏడువేల స్త్రీలొచ్చి నీ భజన చేస్తారు. మా మాటలు వినకపోతే, నీ రొమ్ములు చీల్చి, రుచిగల నీ రక్తాన్ని తాగుతా."


ఆ తర్వాత "చండోదరి" అనే మరో రాక్షసి భయంకరంగా త్రిశూలం తిప్పుతూ,"జింక కన్నుల లాంటి కళ్లున్న నిన్ను చూస్తుంటే ఎప్పుడు కొరుక్కుని తనివితీరా తిందామా" అనిపిస్తున్నది అంటుంది సీతతో. "ప్రఘస" అనే ఇంకొకతి:"ఈచర్చ ఎందుకు? సీత గొంతు నులిపేద్దాంచస్తుంది. అదే చచ్చిందని రావణుడితో చెప్పుదాం. తినండిపోయి అంటాడాయన. దీనికెందుకింత ఉపేక్ష?" అంటుంది. అంతా మాటలు చెప్పేవారే కాని చేసేవారెవరూ లేరని సాధిస్తూ "అజాముఖి" అనే రాక్షసి, "సారాయిలో వేసుకుని సీత మాంసం తిందాం. తొన్దరగా వెళ్లి ఊరగాయలు తెండి" అని ఇతరులను పురమాయిస్తుంది. అజాముఖి సత్యం చెప్పిందనీ, కల్లు తెచ్చుకుని, మాంసం కల్లులో నంజుకుంటూ "నికుంబిల" దేవాలయంలో గంతులు పెడ్తూ తిందామని "శూర్ఫణక" అనే రాక్షసి అంటుంది.

ఈ విధంగా రాక్షస స్త్రీలు బెదిరిస్తూ మాట్లాడుతుంటే, సీతాదేవి "రామా" అంటూ గొంతెండగా ఏడ్చింది. (లంకలో వున్న సీతాదేవి రాక్షస స్త్రీలతో పడ్డ బాధల్లాంటివే, దేహంలోని "బధ్ధజీవుడు" సంసారమనే ఇంద్రియాలతో పడే బాధలు. రావణుడు కానీ, రాక్షస స్త్రీలు కానీ, సీతను బెదిరించారే కాని, చంపలేక పోయారు. అదే విధంగా, "జీవాత్మ" ను ఏవీ చంపలేవు. బాధించ గలుగుతాయి. సీతాదేవి లాగా బధ్ధ జీవులు "ప్రారబ్ధ" మని, దృఢ చిత్తంతో, భగవంతుడే రక్షిస్తాడని అమిత విశ్వాసంతో వుండాలి. సీతాదేవి ఇన్ద్రియాలకు లోబడలేదని, భ్హగవన్తుడి మీదే విశ్వాసమ్ వున్చిన్దని దృఢ పడ్తున్నది. తర్వాత జీవుడు చేయాల్సిన భగవధ్యానమ్, సీతా విలాప రూపంలో మున్ముందు విశదమౌతుంది).

నీచ రాక్షసులకు, మనుష్యస్త్రీలకు పొత్తంటే, అది భూలోకంలోనే విపరీతంగా భావించాలనీ, ఆలోచనలేక రాక్షసస్త్రీలు చెప్తున్న మాటలను తాను వినే ప్రసక్తే లేదనివాళ్ళేం చేయదల్చుకుంటే అదే చేయొచ్చుననీ, వాళ్లిష్టమొచ్చినట్లు తినదల్చుకుంటే తినవచ్చనీ, ఎక్కెక్కి ఏడుస్తూ జవాబిస్తుంది సీత రాక్షసమూకకు. (రాక్షస స్థానంలో "ప్రకృతి", మనుష్య స్థానమ్లో "జీవాత్మ" వుందని గ్రహించడమే! మనుష్యులకు, రాక్షసులకు విజాతీయ భేదమున్నట్లే, అచేతనమైన "దేహాని" కీ, చేతనమైన "ఆత్మ" కు తారతమ్యం వుంటుంది). 

Thursday, January 18, 2018

నా కుటుంబం అంటేనే తెలంగాణ...ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే : ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

నా కుటుంబం అంటేనే తెలంగాణ...ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే
ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

“రాష్ర్టాన్ని నంబర్‌వన్ చేయడమే నా లక్ష్యం.. కార్యస్థలి తెలంగాణే.. ఢిల్లీపై ఆసక్తి లేదు; అభివృద్ధిలో ఏపీతో పోలికే అనవసరం.. గుజరాత్, తమిళనాడులకన్నా ముందున్నాం; రాష్ట్రాలతోనే కేంద్రానికి బలం.. సహకార సమాఖ్యను బలోపేతం చేయాలి; హైదరాబాద్‌ను రెండో రాజధానిగా చేస్తామంటే స్వాగతిస్తాం; 50 శాతం రిజర్వేషన్లు నిరుపేదలకు సరిపోవడం లేదు; రాష్ట్రాలకే నిర్ణయాధికారం ఇవ్వాలి.. పార్లమెంటులో పోరాడుతాం; ప్రగతిభవన్ నా ఇల్లు కాదు.. తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం; నా కుటుంబసభ్యులకు పదవులు.. ప్రజల తీర్పుతోనే వచ్చాయి; అవినీతి ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్; మేం స్వతంత్రం.. స్వతంత్రంగానే ముందుకు వెళ్తాం” అని  వివిధ అంశాలపై ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో ముఖాముఖి ఇంటర్వ్యూలో చెప్పారు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.

“నా కుటుంబం అంటేనే తెలంగాణ. ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే. తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం” అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. తన కార్యస్థలి తెలంగాణేనని, ఢిల్లీపై ఆసక్తి లేదని విస్పష్టంగా చెప్పారు. తెలంగాణ ఆర్థికవ్యవస్థ వేగంగా ముందుకుపోతున్నదని, ఇప్పుడు గుజరాత్, తమిళనాడులకన్నా ముందున్నదని చెప్పారు. రాష్ట్రాలు బలంగా ఉన్నపుడే కేంద్రం బలంగా ఉంటుందని, హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తామంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా స్వాగతిస్తామని తెలిపారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల పెంపుదల అనేది వివాదాస్పదమో,  విభేదించే అంశమో కాదని, 50% రిజర్వేషన్లు అనేవి దేశంలోని నిరుపేదలకు సరిపోవడం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన ప్రమాదకరమైనదేమీకాదని, ఎవరైతే తనతో ఏకీభవించరో వారే ప్రమాదంలో పడుతారని వ్యాఖ్యానించారు.

ఇండియాటుడే సంస్థ తొలిసారిగా హైదరాబాద్‌లో కాంక్లేవ్ సౌత్ పేరుతో హోటల్ పార్క్ హయత్‌లో నిర్వహిస్తున్న సదస్సు లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వివిధ అంశాలపై ప్రముఖ జర్నలిస్టు, ఇండియాటుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వారి సంభాషణ ఇలా సాగింది.....

రాజ్ దీప్......“రాష్ట్ర ఏర్పాటునాటికి అనేక భయాలు, అనుమానాలు ఉండేవి. మీరు కొంత నిరాశతో కూడా ఉండేవాళ్లు.. మూడేండ్లలో వాటిని ఎలా అధిగమించగలిగారు?

సీఎం....“థాంక్యూ రాజ్‌దీప్. మీరు మా గురించి మంచి మాటలతో ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటన్నది ఏడున్నర దశాబ్దాల కల. తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఒక్కరే ప్రారంభించింది కాదు. నాకన్నముందున్నవారు కూడా సిన్సియర్‌గానే తెలంగాణ ఏర్పాటు కోసం ప్రయత్నం చేశారు. కానీ, అప్పుడున్న పరిస్థితుల్లో వారు విజయం సాధించలేకపోయారు. మేం ఉద్యమాన్ని మొదలుపెట్టేముందు అనేక రకాలుగా అధ్యయనం చేశాం. పరిస్థితులను అర్థం చేసుకున్నాం. 2001లో నేను టీఆర్‌ఎస్‌ను స్థాపించడానికి ముందే కనీసం మూడునాలుగువేల గంటలపాటు రాష్ట్ర సాధనోద్యమం నడుపడంపై మేధోమథనం చేశాం. ఆ తర్వాతనే క్షేత్రస్థాయి కార్యాచరణ ప్రారంభించాం. మా దశాబ్దంన్నర ఉద్యమంలో ఎక్కడా హింసకు తావులేదు. రక్తం చిందకుండా రాష్ట్రాన్ని సాధించగలిగాం. మా ఉద్యమం తమ లక్ష్యాల కోసం పనిచేసేవారికి ఒక పాఠంలా ఉంటుంది (లర్నింగ్‌పాయింట్). ఉద్యమ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే మేం నంబర్‌ వన్ క్యాటగిరీ రాష్ట్రంగా ఉంటామన్నాం. జాతి నిర్మాణంలో కూడా పాలుపంచుకుంటామని చెప్పాం. మూడున్నరేండ్లలో మేం చెప్పినట్లు చేయగలిగాం. ఈ మూడున్నరేండ్లుగా జాతినిర్మాణానికి మా వంతు సహాయం కూడా అందిస్తున్నాం. నేను ఎక్కడా నర్వస్‌గా ఫీల్ కాలేదు. భయపడలేదు. రాష్ట్ర పునర్నిర్మాణం నాకు సవాలు కాదు. నాకో అవకాశం. దీంట్లో మేం నూటికి నూరుపాళ్లు విజయం నమోదు చేశాం. కావాలంటే మీరు కాగ్ నివేదికలను పరిశీలించండి. మా రాష్ట్ర గ్రోత్ రేట్ దేశంలోనే నంబర్‌ వన్. గతేడాది మేమే నంబర్‌ వన్‌ గా ఉన్నాం. ఇప్పుడు కూడా మేమే నంబర్ వన్. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభివృద్ధికి 16 రకాల కొలమానాలను అనుసరిస్తున్నది. వీటిలో కూడా మేమే తొలి స్థానంలో ఉన్నాం. ఈవోడీబీలో, గ్రీన్‌పవర్‌లో నంబర్‌ వన్‌ గా ఉన్నాం. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 10 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేది. కానీ మూడేండ్లలో దీన్ని 3,500 మెగావాట్లకు పెంచుకున్నాం”.

రాజ్ దీప్....“2014 జూన్ 2 నాటికి తెలుగు ఐడెంటిటి విభజన అవుతున్నదన్న ఆందోళన, బాధ ఉండేది. ఆంధ్ర ఉద్యోగులు రాజధాని నుంచి విడిపోతున్న ఆవేదనతో ఉన్నారు. దీనిపై మీరేమైనా చింతిస్తున్నారా?

సీఎం.....”మీరు చెప్తున్నట్లు తెలుగు ఐడెంటిటి అన్నదేమీలేదు. ఆ వాదన సరికాదు. ఆంధ్ర వేరు. తెలంగాణకు ఉన్న గుర్తింపు వేరు. మా భాష, యాస, పండుగలు వేర్వేరు. 1956లో ఆంధ్రలో విలీనం చేసే సందర్భంగా కూడా తెలంగాణవారు వ్యతిరేకించారు. ఆ విలీనం ఓ చారిత్రక తప్పిదం. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటే బ్లండర్ మిస్టేక్. అదో దురదృష్టం.. విఫలప్రయత్నం. ఈ ఏడాది మా బడ్జెట్ ప్రతిపాదనలే లక్షా 49వేల కోట్లు. మేం లక్షా 25వేల కోట్లు ఖర్చుచేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నపుడు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ 15-20 వేల కోట్లు దాటేది కాదు. అదే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్ తెలంగాణలో 50వేల కోట్లు దాటింది”.

రాజ్ దీప్.....”హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టిన ఆంధ్రవారు, గుంటూరు, విజయవాడవారు తమ పెట్టుబడులను వెనుకకు తీసుకెళ్లలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితికి వారికి క్రెడిట్ ఇస్తారా?

సీఎం.....”తెలంగాణ చరిత్ర గురించి అవగాహన ఉన్నవారికి ఫ్యాక్ట్ తెలుస్తుంది. తెలంగాణలో వెల్త్ మేకింగ్ నిజాంకాలం నుంచే ఉన్నది. రాజస్థాన్, గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాల నుంచి మార్వాడీలు తదితరులు వందల ఏండ్ల క్రితమే హైదరాబాద్‌కు వచ్చారు. మీరు ఓల్డ్‌సిటీకి వెళ్తే గుల్జార్‌హౌజ్ అనే ప్రాంతం ఉన్నది. అక్కడ మార్వాడీలు 300 ఏండ్లుగా ఉంటున్నారు. వారు తెలంగాణ మా రాష్ట్రం అని చెప్తున్నారు. ఆంధ్రవారిలోని కొందరు వెస్టెడ్ ఇంట్రెస్ట్‌తో మాట్లాడుతుంటారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మా విజయం చూడండి. 150 సీట్లలో 144 స్థానాలను మేం, మా మిత్రపక్ష పార్టీ ఎంఐఎంతో కలిసి గెలుచుకున్నాం. మిగిలిన అన్ని పార్టీలు కలిపి ఆరుసీట్లు గెలుచుకున్నాయి. హైదరాబాద్ ప్రజల సంపూర్ణ మద్దతు టీఆర్‌ఎస్ పార్టీకి, మా ప్రభుత్వానికి ఉన్నదని స్పష్టమవుతున్నది కదా?

రాజ్ దీప్.....”హైదరాబాద్‌ను అంబేద్కర్ సూచించినట్లు దేశానికి రెండోరాజధానిగా చేయాలన్న వాదనపై మీరేమంటారు?

సీఎం.....”70 ఏండ్ల ప్రజాస్వామ్యం తర్వాత.... బాధ్యతతో చెప్తున్నాం....మేం గుజరాత్, తమిళనాడులకన్నా ముందున్నాం. మా సొంత ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకుపోతున్నది. అభివృద్ధిలో మేం ముందువరుసలో ఉన్నాం. వెల్త్ ఆఫ్ ఏ స్టేట్ ఈజ్ వెల్త్ ఆఫ్ ఏ నేషన్. రాష్ట్ర ఆదాయం పడిపోతే దేశ ఆదాయం కూడా పడిపోతుంది. అన్ని రాష్ట్రాల సమాహారమే రాష్ట్రం. రాష్ట్రాలు బలంగా ఉన్నపుడే కేంద్రం బలోపేతంగా ఉంటుంది. ఇక హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా చేస్తామంటే మాకేం అభ్యంతరంలేదు. మేం స్వాగతిస్తాం. దేశం మొత్తం హైదరాబాద్‌కు వస్తే మాకేం అభ్యంతరంలేదు”.

రాజ్ దీప్.....”అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటును మీరు సమర్థిస్తున్నారా? గుజరాత్ మోడల్ అనేది దేశవ్యాప్తంగా ప్రచారం పొందింది కదా? తెలంగాణ మోడల్ గుజరాత్ కంటే ఎలా సుపీరియర్?

సీఎం.....”ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు. దేశంలో 17 రాష్ట్రాలు తెలంగాణ కంటే చిన్నవి. ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు. పశ్చిమ బెంగాల్, బీహార్.. ఇలా చాలా రాష్ట్రాలు తెలంగాణ కంటే చిన్నవి. జనాభా ప్రాతిపదికన కూడా తెలంగాణ చిన్నది కాదు. 12వ స్థానంలో ఉంది. ఉద్యమ సమయంలో ప్రధాని, సోనియాతో సహా ఎంతోమందికి వివరించాను. వాస్తవాలు చూపించాను. అభివృద్ధి విషయం గురించి అరుణ్‌ పురితో మాట్లాడాను. హైదరాబాద్ రావాలని ఆహ్వానించాను. ప్రత్యేకంగా హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేస్తానన్నాను. క్షేత్రస్థాయిలో తెలంగాణలో ఏం జరుగుతున్నదో చూడండి అని చెప్పాను. గుజరాత్ కంటే తెలంగాణ ఏ మాత్రం తీసిపోదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగుపరిచేందుకు విభిన్న రీతిలో కృషిచేస్తున్నాం. ఇప్పటి అవసరాలు, ట్రెండ్‌కు అనుగుణంగా మానవ వనరులను సిద్ధంచేస్తున్నాం. తెలంగాణ అవసరాల నిమిత్తం ప్రతి రోజు 650 లారీల గొర్రెలను దిగుమతి చేసుకునేది. రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి వీటిని తీసుకువచ్చేవారు. దీంతో మేము ఒక అద్భుతమైన పథకాన్ని రూపొందించాం. మిషన్ మోడ్లో రూ.5000 కోట్ల సెక్యూరిటీ లోన్‌ తో గొర్రెల పంపిణీ పథకం తీసుకువచ్చాం. సక్సెస్‌ ఫుల్‌ గా నడుస్తున్నది అని గర్వంగా చెప్తున్నా. 38లక్షల గొర్రెలు పంపిణీ చేసి అనుకున్న లక్ష్యం దిశగా పోతున్నాం. ఈ గొర్రెలను ఇతర ప్రాంతాలకు తరలించడం నిషేధం. మాంసాన్ని ప్రాసెస్ చేసి రాష్ట్రాలు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తాం. అది కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం”.

రాజ్ దీప్....”గుజరాత్ సింహం అయితే తెలంగాణ గొర్రె అన్నమాట..??

సీఎం.....”నో ప్రాబ్లమ్.. సింహమా, గొర్రెనా అనేది పెద్ద విషయం కాదు.. ఎవరు సంపదను సృష్టిస్తున్నారు.. ఎవరు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నారన్నదే ముఖ్యం. తెలంగాణలో ఒకప్పుడు విద్యుత్ సమస్యలు ఎక్కువగా ఉండేవి. రాష్ట్రం ఏర్పడ్డాక మాకు అదో పెద్ద సవాలుగా నిలిచింది. ఒక పద్ధతి ప్రకారం, సరైన వ్యూహంతో ఆ సమస్య నుంచి బయటపడ్డాం. ఆరునెలల సమయంలోనే పరిశ్రమలకు 24 గంటల కరంట్ సరఫరా చేశాం. 9 గంటల కరంట్ వ్యవసాయానికి, 24 గంటల కరంట్ గృహాలకు సరఫరా చేశాం. తెలంగాణ ఏర్పడేనాటికి కేవలం 6000 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండేది. అందులో కేవలం 2800 మెగావాట్లు హైడల్ పవర్. ఇలాంటి పరిస్థితుల్లో ఉక్కు సంకల్పంతో ముందుకు వెళ్లి కృషిచేశాం. అలా ప్రస్తుతం తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 14000 మెగావాట్లకు చేరింది. 2020నాటికి 28000 మెగావాట్లకు చేరబోతున్నదని సగర్వంగా చెప్తున్నాను”.

రాజ్ దీప్....”వ్యాపారం, వాణిజ్యం, నీటిపారుదల, విద్యుత్, ఐటీ తదితర రంగాల్లో గణనీయమైన ప్రగతిని సాధించారు. కానీ సీఎం కేసీఆర్ ఎందుకు అంతగా వాస్తును నమ్ముతారు? వాస్తుకోసమే సచివాలయాన్ని మారుస్తున్నారని విన్నాం. అందుకోసం రూ.100 కోట్లకుపైగా ఖర్చుపెట్టనున్నారని అంటున్నారు. అంతా బాగా జరుగుతున్నప్పుడు ఎందుకు వాస్తును నమ్ముతున్నారు?

సీఎం....”చిన్న సవరణ.....రూ.100 కోట్లు కాదు.....రూ.250 కోట్లను కొత్త సచివాలయం నిర్మాణంకోసం ఖర్చు పెట్టబోతున్నాం. కావాలంటే సచివాలయంకు వెళ్దాం.. మీకు చూపెడతాను.. అదెంత వంకరటింకరగా, ఇబ్బందికరంగా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుత సచివాలయం 25 ఎకరాల్లో ఉంది. విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు చాలామంది నాతో అన్నారు. మలేషియాకు చెందిన సీనియర్ మినిస్టర్ వేలు నా మొహంమీదే అడిగారు.....కేసీఆర్ ఈ స్థలాన్ని అమ్మేయవచ్చుకదా.....పుత్రజయ లాంటి కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చుకదా అని అన్నారు. ఇక్కడి ప్రజలు సెంటిమెంట్‌ తో ఉంటారు. ముఖ్యమంత్రి సచివాలయాన్ని అమ్ముకున్నారని అపార్థం చేసుకుంటారని, స్థలాన్ని అమ్మనని చెప్తూ, కొత్త సచివాలయాన్ని నిర్మిస్తామని మాత్రం చెప్పాను. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలి. మొదటినుంచి తెలంగాణ ధనవంతమైన రాష్ట్రమని, పేద రాష్ట్రం కాదని చెప్తూ వస్తున్నాం. అది నిజంకూడా.. అందుకే దానిని నిరూపిస్తున్నాం. దేశంలోనే అత్యంత ధనవంతమైన రాష్ట్రంగా త్వరలోనే నిరూపించబోతున్నాం. మీరే చూస్తారు. ఆ నమ్మకంతో చెప్తున్నా....రాష్ర్టానికి అన్నిహంగులు, వసతులతో ఉండే అద్భుతమైన ఆధునిక సచివాలయం ఉండాలి. ఉంటుంది కూడా”.

రాజ్ దీప్.....”కానీ చాలామంది అంటుంటారు....కొత్త సచివాలయం ఎందుకు....నూతన గృహం ఉంది కదా అని.....తెలంగాణ సీఎం హైదరాబాద్ నిజాం లాగా ఉంటున్నారనే విమర్శలున్నాయి.”

సీఎం.....”కొందరు పిచ్చివాళ్ళు అలా అర్థం చేసుకుంటే నేను ఏమీ చేయలేను. అది నా ఇల్లు కాదు. అది సీఎం నివాసం. నేను నిర్మించిన ప్రగతిభవన్‌ లో సీఎం నివాసం, కార్యాలయం, వివిధ వర్గాలు, సమాజంలోని వివిధ రకాల సంస్థలు, ప్రజలతో సమావేశం అయ్యేందుకు అద్భుతమైన సమావేశ మందిరం నిర్మించాం. అది కేవలం కేసీఆర్ ఇల్లు కాదు. అది తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం. అది మన రాష్ట్ర గౌరవానికి చిహ్నం వంటిది. రానున్న వందేండ్ల వరకు ఆ భవనం ఉంటుంది. అందులో రానున్న ఎంతోమంది తెలంగాణ ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు”.

రాజ్ దీప్.....”రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండోస్థానంలో ఉంది. దీని గురించి ఏమంటారు? ఇది మీకు మచ్చలా మారబోతున్నదా? రైతు ఆత్మహత్యలను నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు ఫలితాలనిస్తాయా?

సీఎం....”ప్రజలకు ఇక్కడ ఏం జరుగుతున్నదో తెలుసు. రైతు ఆత్మహత్యలు అనేవి చాలా బాధాకరం. ఎందుకు చనిపోతున్నారనేది ఒక కోణంలో చూస్తే సరిపోదు. దీనికి అనేక కారణాలున్నాయి. మూలాల నుంచి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. అందుకే వీరిలో మనోైస్థెర్యం, ధైర్యాన్ని నింపి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతుతోపాటు చేనేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఈ ఆత్యహత్యలను అరికట్టి వారిని ఆదుకోవడమే మా ప్రాథమిక విధి. వీరందరిని అన్నివిధాలా ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సంక్షేమానికి పెద్దపీట వేశాం. ఆసరా పెన్షన్లను రూ.200 నుంచి రూ.1000కు పెంచాం. దివ్యాంగులకు రూ.1500 ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు పీడీఎస్ కింద పరిమితి విధించి 4 కిలోల బియ్యం ఇస్తే.. మేం పరిమితి ఎత్తివేసి కుటుంబసభ్యులు ఎంతమంది ఉంటే అందరికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇస్తున్నాం. ఒకప్పుడు తెలంగాణలోని గోదాముల సామర్థ్యం 4 లక్షల టన్నుల వరకు మాత్రమే ఉంటే.. మా ప్రభుత్వంలో 23 లక్షల టన్నులకు పెంచాం. ఎరువుల, విత్తనాల సమస్యలు లేకుండా చూస్తున్నాం”. 

“దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి పెట్టుబడి అందించబోతున్నాం. ఏడాదికి రెండు పంటలకుగాను ఎకరానికి రూ.8000 ముందస్తుగా ఇవ్వబోతున్నాం. అంతేకాదు మద్దతు ధర, ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రైతు సమన్వయ సమితులను ప్రారంభించాం. హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కు వీటి గురించి వివరించాను. రైతులకు ఇస్తున్న మొత్తాన్ని తిరిగి ఎప్పుడు చెల్లించాలని అడిగారు. చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పాను. ఇది ఎలా సాధ్యపడుతుందని ఆశ్చర్యపోయారు. ఆనందం వ్యక్తంచేశారు. ఇలా అనేక కార్యక్రమాలు అమలుచేస్తున్నాం. దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా అమలు చేయనివి ఇక్కడ చేస్తున్నాం. ఏడాదికి రూ.40 వేల కోట్లు సబ్సిడీల రూపంలో చెల్లిస్తూ పేద వర్గాలను, సంక్షేమానికి దూరంగా ఉన్నవాళ్లను పైకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఆత్మహత్యలు తగ్గించడం, వారిలో మనోధైర్యం ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతున్నది. వ్యవసాయంలో తెలంగాణ త్వరలో నంబర్ వన్ కాబోతున్నది. దేశ వ్యవసాయరంగానికి ఒక రోల్‌ మోడల్‌ గా నిలువబోతున్నదని గర్వంగా చెప్తున్నాను”.

“సాగునీటిరంగంలో తెలంగాణకు ఎప్పుడూ అన్యాయమే జరిగింది. ప్రాజెక్టులన్నీ పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యేవి. ప్రారంభించిన కొన్ని ప్రాజెక్టులు కూడా మధ్యలోనే నిలిచిపోయేవి. ఇవన్నీ ఆధారాలతో సహా ఉన్నాయి. ఎన్నోసార్లు ఈ విషయాలు వివరించాను. తెలంగాణ ఏర్పడ్డాక యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టులు ప్రారంభించాం. తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేశాం. గోదావరి, కృష్ణా నుంచి 1350 టీఎంసీ నీళ్లు మాకు కేటాయించారు. వీటిని కాపాడుకునేందుకు, సాగునీటిరంగాన్ని పటిష్ఠపరిచేందుకు నిరంతరం శ్రమిస్తున్నాం. సాగునీటిరంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నాం. కేంద్ర జల సంఘం కూడా మొన్ననే తెలంగాణకు వచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణపనులు పరిశీలించి ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ప్రశంసలతో ముంచెత్తింది. ఇలాంటి గొప్ప ప్రాజెక్టును ఎక్కడా చూడలేదు అని పొగిడింది. మేం చేపట్టిన ప్రాజెక్టులన్నీ అనుకున్నట్లుగా సాగుతున్నాయి. దేవాదుల, నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఇవన్నీ సకాలంలో పూర్తవుతున్నాయి. వలసల జిల్లా మహబూబ్‌నగర్ ఇప్పుడు మారిపోయింది. అక్కడ నుంచి జిల్లాలోని సగం జనాభా ఒకప్పుడు వలసలు వెళ్లేది. 15 నుంచి 20 లక్షల మంది ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లేవారు. ప్రస్తుతం అక్కడ ఆరున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతున్నది. ఈ ఫలితాలన్నీ మా ప్రభుత్వ కష్టం వల్ల సాధ్యమయ్యాయి. వీటన్నింటితో కచ్చితంగా రైతు ఆత్మహత్యలు తగ్గుతాయి. పేదలకు, అణగారిన వర్గాలకు లాభం జరుగుతుంది. రూ.లక్షన్నర కోట్ల అంచనాలతో మేం తలపెట్టిన 3 మేజర్ ప్రాజెక్టులు తెలంగాణ వ్యవసాయరంగం తలరాతను మార్చబోతున్నాయి. గోదావరి, కృష్టాజలాలను ఒడిసి పట్టేందుకు కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ఎత్తిపోత పథకాలను నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కోటి ఎకరాలు సాగులోకి వస్తాయి. 2020లో తెలంగాణ దశ, దిశ మారబోతున్నది. 2020లో మిమ్మల్ని (రాజ్‌దీప్) తెలంగాణకు ఆహ్వానిస్తాను. మీరు రావాలి. ఇక్కడి అభివృద్ధిని చూడాలి”.

రాజ్ దీప్....”మీరు, చంద్రబాబు పోటీపడుతున్నారు. మీరు హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అమరావతి కోసం శ్రమిస్తున్నారు. ఈ విషయంలో పోటీపడుతున్నారా?

సీఎం....”ఈ విషయంలో విభేదిస్తున్నాను. తెలంగాణను ఆంధ్రతో పోల్చలేం. హైదరాబాద్ వల్ల లాభం పొందామా అన్నది కాదు. సింగపూర్‌లో ఏం జరిగింది? అక్కడ అంత అభివృద్ధి ఎలా సాధ్యమైంది? అక్కడి డాలర్‌కు విలువ ఎంత ఉంది? ప్రపంచం మొత్తానికి తెలుసు. భూములు, అడవులు, గనులు.. ఇలా అక్కడ ఏం లేవు. ఒక మానవ మేధస్సు మాత్రమే ఉన్నది. అదే ఆక్కడి సంపదను సృష్టించింది. లీ కా యూ సింగపూర్‌ను అంతగా అభివృద్ధి చేశారు. అది అభివృద్ధికి అత్యుత్తమమైన మోడల్.. దయచేసి తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో పోల్చకండి. మాది ముందునుంచి మిగులు రాష్ట్రం. ఇదొక ప్రత్యేక రాజ్యంగా ఉండేది. తెలంగాణ ఇప్పుడు దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. నేను చెప్పడం లేదు ఈ విషయాలు. భారత ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఉన్నాయి. ఆంధ్ర, తెలంగాణ మధ్య ఎలాంటి పోటీ లేదు. ఉండదు కూడా. ఎందుకంటే మేం ఇప్పటికే చాలా చాలా ఉన్నతస్థితిలో ఉన్నాము. పాజిటివ్‌గా ముందుకు వెళుతూ కష్టపడితే తప్పకుండా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది”.

రాజ్ దీప్....”మీరు తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు, ఉపవాస దీక్ష, ఇతర ఉద్యమాలు చేసినప్పుడు నేను చూశాను. అందులో ఎన్నో భావోద్వేగాలు ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత అవి ట్రెడిషనల్ రాజకీయాలుగా మారాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ ప్రైడ్ కాస్తా ఫ్యామిలీ ప్రైడ్‌గా మారిందన్న విమర్శలు ఉన్నాయి. మీ కూతురు ఎంపీ, మీ కుమారుడు మంత్రి, మీ అల్లుడు మంత్రి.. కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణను నడిపిస్తున్నదన్న విమర్శలు ఉన్నాయి!”

సీఎం....”రాజ్‌దీప్.. మీరు ఒక్కటి తెలుసుకోవాలి. కేసీఆర్ కొడుకు, ఆయన కుటుంబం తెలంగాణ ఉద్యమాన్ని నడిపాయి. ఎన్నోసార్లు పోలీసు కేసుల్లో జైళ్లకు వెళ్ళింది. వీధుల్లో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేసింది. ఆ విషయం మొత్తం రాష్ర్టానికి తెలుసు. కేసీఆర్ పిల్లలు తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. వారిని నేను ఏ పదవికీ నామినేట్ చేయలేదు. వాళ్లు ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారు. అది ప్రజల తీర్పు. రాజ్‌దీప్.. మీకు ఒక్క విషయం చెప్పాలి. నా కుటుంబం అంటేనే తెలంగాణ. ప్రతి తెలంగాణ వ్యక్తి నా కుటుంబంలోని వ్యక్తే. ప్రతి ఒక్కరు దీన్ని అంగీకరిస్తారు. ఇంక, మేం అనేక ఎన్నికలు గెలుస్తున్న తీరు మీరు చూస్తే....గత మూడున్నరేండ్లుగా అన్ని ఉప ఎన్నికలు మేము చాలా అద్భుతమైన మెజార్టీతో గెలిచాం”.

రాజ్ దీప్.....”హైదరాబాద్‌పై మీ ప్రణాళికలేమిటి? ఒకప్పుడు దీని భవిష్యత్తుపై అనేక అనుమానాలుండేవి కదా?

సీఎం....”ఈరోజు హైదరాబాద్ అంటే....అనేక అంతర్జాతీయ సదస్సులు, సమావేశాలు జరిగే నగరం. మీకు తెలుసు హైదరాబాద్ ఎంత అందమైన నగరమో. ఇది అత్యంత నమ్మకమైన కాస్మోపాలిటన్ సిటీ. హైదరాబాద్ అంటే మినీ భారతం. దేశంలోని అన్ని ప్రాంతాలవారు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. అన్ని రకాల ఆహారపు అలవాట్లు, అన్ని రకాల సంస్కృతులు, అన్ని రకాల సంప్రదాయాలు, అభిరుచులు ఇక్కడ కనపడతాయి. అంతటి అందమైన నగరాన్ని సమైక్యపాలనలో విధ్వంసం చేశారు. అంతెందుకు.. మద్రాసుకు కరంటు రానప్పుడే హైదరాబాద్‌లో కరంటు ఉంది. 1915లో హైదరాబాద్‌లో కరంటు ఉంటే...మద్రాసులో 1927లో వచ్చింది. అంటే హైదరాబాద్‌లో విద్యుత్ అందుబాటులోకి వచ్చిన 12 సంవత్సరాల తరువాత మద్రాసుకు వచ్చింది. మౌలిక వసతుల విషయంలోనూ ఎంతో ముందుండేది. అప్పటికే విమానాశ్రయం, టెలిగ్రాం, రైల్వేలు, రోడ్డు రవాణా వ్యవస్థతోపాటు దక్కన్ ఎయిర్‌లైన్స్ కూడా ఉండేది”.

“అప్పటికి దేశంలో ఎక్కడా అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ లేదు. కానీ హైదరాబాద్‌లో భూగర్భ మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేశారంటే ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. తాగునీరు, విద్యుత్, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం....వీటన్నింటితో ఎంతో అద్భుతంగా ఉండేది హైదరాబాద్. కానీ సమైక్యపాలనలో మరింత సొబగులు అద్దాల్సిన పాలకులు.. విధ్వంసం సృష్టించడానికి ఇతోధికంగా తోడ్పడ్డారు. హైదరాబాద్ ముత్యాలనగరమే కాదు.. సరస్సుల నగరంకూడా. హైదరాబాద్ నగరాన్ని కులీ కుతుబ్‌షా నిర్మిస్తున్న సమయంలో ఎవరో అడిగారట.. ఏం నిర్మిస్తున్నావని.. దానికి ఆయన సమాధానం జన్నత్ అని. జన్నత్ అంటే....పబ్లిక్‌గార్డెన్ అని అర్థం. ప్రజల కోసం తోటను నిర్మిస్తున్నానని చెప్పారట. అందుకే సిటీ ఆఫ్ గార్డెన్స్ అని కూడా అంటారు. కానీ సమైక్యపాలనలో వీటన్నింటినీ ధ్వంసం చేశారు. చెరువులు, సరస్సులను ధ్వంసం చేశారు. వాటిని ఆక్రమించారు. వర్షం నీరు ప్రవహించే నాలాలను ధ్వంసం చేశారు. వాటిని ఆక్రమించారు. ఈ మధ్య నేను చైనాలో పర్యటించినప్పుడు బ్యాంకు దగ్గరికి వెళ్ళాను. చైర్మన్‌తో మాట్లాడాను. హైదరాబాద్ పునర్నిర్మాణానికి, పునరుద్ధరణకు రూ.20 వేల కోట్లు రుణంగా ఇస్తామని ఆయన వాగ్దానం చేశారు. ఆ నిధులతో నిజమైన విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం. మీరు చెప్పిన సమస్యలకు పరిష్కారం చూపెట్టడానికి రూ.20-25 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది”.

రాజ్ దీప్....”అంటే బెంగళూరులాగే జనాభా విపరీతంగా పెరిగి సమస్యలతో సతమతమయ్యేలా హైదరాబాద్ తయారవుతుందంటారా?

సీఎం....”మేము అలాంటిదానికి ఒప్పుకోం. హైదరాబాద్‌ను సిటీ ఆఫ్ లేక్స్, సిటీ ఆఫ్ గార్డెన్స్ లాగే తీర్చిదిద్దుతాం. అందంగా పునరుద్ధరిస్తాం”.

రాజ్ దీప్....”మీరు తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇక్కడ ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరు చాలా అరుదుగా ఢిల్లీకి వస్తున్నారు? మీ లక్ష్యం బలమైన తెలంగాణ నిర్మాణమేనా? మీరు ఢిల్లీకి రారా? మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు మాకు తెలంగాణ వంటకాలు రుచిచూపించేవారు.. మేము ఇప్పుడు ఆ రుచిని మిస్ అవుతున్నాం?

సీఎం...”నేను మీకు అద్భుతమైన తెలంగాణ రుచులతో డిన్నర్ బాకీ ఉన్నాను. నేను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు తరచూ డిన్నర్‌కు పిలుస్తుండేవాడిని.. కచ్చితంగా మళ్లీ ఒకరోజు డిన్నర్‌పెట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తాను. తెలంగాణ అంత స్పైసీగా ఉండే వంటకాలు రుచి చూపిస్తాను. మీకు హైదరాబాద్ బిర్యానీ ఎంత స్పైసీగా ఉంటుందో తెలిసిందే. బిల్‌క్లింటన్ ఇండియాకు వస్తే, హైదరాబాద్ బిర్యానీ అడిగి మరీ తినేవారు. అందరికీ హైదరాబాద్ బిర్యానీ అంటే అంత ఇష్టం. నా ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ తెలంగాణే. మేం ఇంకా ఎన్నో చేసుకోవాల్సి ఉంది. కాబట్టి నాకు ఢిల్లీపై ఆసక్తి లేదు. మేం స్వతంత్రంగానే ఉంటాం. నాకు ఇక్కడ ఉండటమే ఇష్టం. తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రం చేయడమే నా లక్ష్యం”.

రాజ్ దీప్....”ఈమధ్య మీరు తీసుకున్న వివాదాస్పద 12 శాతం రిజర్వేషన్ నిర్ణయం.... ముస్లింలకు ఉద్యోగాలు, విద్య లాంటి వాటిల్లో ఈ రిజర్వేషన్లు ఉంటాయని ప్రకటించారు. కానీ చాలామంది ఇది కోర్టుల్లో నిలిచిపోయేదనే అంటున్నారు. మీరేమంటారు? ఇది ఓటు బ్యాంకు రాజకీయాలేనా?

సీఎం....”మనం ఇక్కడ ఒకటి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. తెలంగాణలో గిరిజనుల జనాభా 10 శాతంగా ఉంది. కానీ సమైక్యరాష్ట్రంలో 6 శాతంగా లెక్కించారు. మైనారిటీ జనాభా విషయంలో 14 శాతంగా లెక్కించారు. ఈ విషయంలో నేను ప్రధానమంత్రిని కలిశాను. సమస్యను వివరించాను. ఈ సమస్య విభిన్న కోణాలతో ఉంది. అది అర్థంచేసుకునేవారిపై ఆధారపడి ఉంది. నిజానికి కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకుని.. రిజర్వేషన్ల విషయాన్ని రాష్ర్టాలకు వదిలిపెట్టాలి. ఆయా రాష్ర్టాల్లో ఉన్న జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉండేలా నిర్ణయం తీసుకొమ్మని రాష్ర్టాలకు స్వేచ్ఛ ఇవ్వాలి. లేకపోతే నష్టం కలుగుతుంది. ఉదాహరణకు జార్ఖండ్‌నే తీసుకుందాం. 50% మాత్రమే రిజర్వేషన్ అంటే... అక్కడ అత్యధికంగా ఉన్న గిరిజనులు ఏం కావాలి? అక్కడ నిజంగా వారికి న్యాయం జరుగుతుందా? ఇక్కడ తెలంగాణ విషయం తీసుకుంటే.. 90% ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలున్నారు. 10% మాత్రమే ఉన్నతవర్గాలున్నాయి. 50% రిజర్వేషన్లతో... ఇక్కడి ప్రజలను ఎలా సంతృప్తిపర్చగలను? అది సాధ్యమా? స్పష్టంగా చెప్పాలంటే ఇది కేంద్రం ముందున్న సరైన సమయం. ప్రజలు ఎంతమేర రిజర్వేషన్లను కోరుకుంటున్నారో.....అంతమేర పెంచేలా దానిపై సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది”.

రాజ్ దీప్....”మీరు చాలా వివాదాస్పదమైన అంశంపై మాట్లాడుతున్నారు....50% రిజర్వేషన్లు సరిపోవని అంటున్నారు....”

సీఎం....”అవును అదే చెప్తున్నాను. ఇది వివాదాస్పదమో? విభేదించే అంశమో కాదు. 50 శాతం రిజర్వేషన్లు అనేవి దేశంలోని నిరుపేదలకు సరిపోవు. నిరుపేద వర్గాలకు అన్యాయం జరుగుతున్నది. ఇదే అంశాన్ని నొక్కివక్కాణిస్తున్నాం. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై గొంతు వినిపించబోతున్నాం. పోరాటం చేయబోతున్నాం. పార్లమెంట్‌లో ఏం జరుగుతుందో మీరే చూస్తారు”.

రాజ్ దీప్....”మీరు చాలా ప్రమాదకరమైన అంశంలోకి చొరపడుతున్నారేమో....రేపు ఎవరైనా 90% రిజర్వేషన్లు కావాలంటే?

సీఎం...”అలాంటిదేమీ లేదు....ఎవరైతే నాతో ఏకీభవించరో వారే ప్రమాదంలో పడుతారు కానీ కేసీఆర్ కాదు. రాజ్‌దీప్ గారు....కొంతసేపు నేను చెప్పేది వినండి. ఇది ఏదో ఒక రాష్ర్టానికి సంబంధించిన సమస్య కాదు. జాతీయస్థాయి సమస్య. ప్రస్తుతం తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమవుతున్నది? మా పక్క రాష్ట్రం....దక్షిణాది రాష్ట్రంలోనే అమలు చేస్తున్నారు కదా! నేను మా ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? మీ రాష్ట్రం.. మహారాష్ట్రలో 52% రిజర్వేషన్లు అమలుచేస్తున్నారు. అదెలా? రిజర్వేషన్లను....మతం, కులంవారీగా చూస్తున్నారు....రిజర్వేషన్ల అంశాన్ని మతం, కులంవారీగా చూడకూడదు. ఆర్థిక స్థాయినిబట్టి అమలుచేయాలి”.

రాజ్ దీప్...”12 శాతం ముస్లింలకు రిజర్వేషన్లు అని అంటున్నారు కదా?

సీఎం....”అది సరికాదు. మేము ఎక్కడా ముస్లింలకు రిజర్వేషన్లు అని చెప్పలేదు. మా బిల్లులో కూడా ఎక్కడా ముస్లింలకు అని చెప్పలేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవర్గాలని చెప్పాం. దేశం కానీ, రాష్ట్రం కానీ.. ప్రజల పరిస్థితులను పూర్తిగా తెలుసుకుని, ఒక స్పష్టమైన అవగాహనతో, ప్రణాళికతో రిజర్వేషన్లు ఎవరికి అవసరమో వారికి అందించాలి”.

రాజ్ దీప్.....”మీరు ప్రధానిని కలిశామని, పలు అంశాలను చెప్పామని అంటున్నారు. అసలు కేంద్రంతో, ప్రధానితో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. కానీ మీరు సొంతంగా ఎన్నికలకు వెళ్ళారు. మోదీ ప్రధాని కాగానే, మీరు ఆయనతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్నారు. అటు మోదీతోనూ వ్యవహారాలు చేస్తున్నారు.....ఇటు సోనియాతోనూ మీ తరహాలో వ్యవహారాలు నడిపారు. ఎవరిని ఎప్పుడు ఎలా సంతృప్తిపరుచాలో కేసీఆర్‌కు బాగా తెలుసనుకుంటా! హైదరాబాదీ తరహాలో వ్యవహారం నడుపుతున్నారు!”

సీఎం....”మాకు కావాల్సిన మార్గంలో నేను వ్యవహారాలను నడుపకపోతే అది తార్కికం కాదు. కేసీఆర్ ఎప్పుడైనా తార్కికంగానే (లాజికల్) వెళుతాడు. నాకు నా ప్రజలు, నా రాష్ట్రమే ముఖ్యం. ఇందులో చిల్లర రాజకీయాలు ఏమీలేవు. కొందరు అలా అర్థం చేసుకుంటారు. అది అప్రధానం. దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు నెరుపాల్సి ఉంటుంది. కేంద్రం, రాష్ర్టాల మధ్య సంబంధాలు రాజ్యాంగపరమైనవిగా ఉండాలి. అలాగే మేముకూడా రాజ్యాంగపరమైన సత్సంబంధాలు నెరుపుతున్నాము. మోదీ ఎలా చూస్తారనేది ఆయన ఇష్టం”.

రాజ్ దీప్....”మీరు బీజేపీ, కాంగ్రెస్ ఇరువురితోనూ సమానదూరాన్ని పాటిస్తున్నారా? కొద్ది నెలల క్రితం అమిత్‌షా హైదరాబాద్‌కు వచ్చి ఒకరోజు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని అన్నారు. అలాగే అవినీతి విషయంలో ఆరోపణలు చేశారు”

సీఎం....”అటాకింగ్, కరప్షన్.. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు. ఇలాంటి ఆరోపణలు చేయడం కాంగ్రెస్‌కు ఫ్యాషన్. ఈ రాష్ట్రంలోని ప్రజలకు తెలుసు ఎవరు అవినీతిపరులు.. ఎవరు నిజాయితీపరులో. మీకు ఒక విషయం చెప్తాను. టీఎస్‌ఐపాస్‌ను పకడ్బందీగా, నిజాయతీగా అమలుచేస్తున్నాం. స్పష్టమైన నమ్మకంతో చెప్తున్నా....గతంలో మన దేశంలోగానీ, ప్రపంచంలోగానీ సింగిల్ విండో పద్ధతిలో ఇలాంటివి అమలు చేసి ఉండవచ్చు. కానీ ఆ సింగిల్‌విండోకు ఇనుప చువ్వలున్నాయి. కానీ తెలంగాణలో మేము అలాంటి చువ్వలు లేకుండా చూశాం. దానిని నిరూపించాం కూడా. దాదాపు ఐదువేల పరిశ్రమలకు సంబంధించి కేవలం 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులు, కేటాయింపులు వచ్చేలా చేయగలిగాం. ఇందులో ఇప్పటికే రెండువేల పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. మరో మూడువేల పరిశ్రమలు త్వరలోనే ప్రారంభించనున్నాయి. ఇదంతా ఒక్క నయాపైసకూడా అధికారులకుగానీ, ప్రైవేటువారికిగానీ ఇవ్వకుండానే సాధించాం”. 

రాజ్ దీప్....”అది సరే.. మీరు అటు బీజేపీతో కలిసి ముందుకు వెళ్ళడంలేదు. ఇటు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌తో పోరాడుతూ, టీఆర్‌ఎస్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది. మీ పార్టీ అటు ఎన్డీయే.. ఇటు యూపీఏ.. ఎవరితో కలువకుండా స్వతంత్రంగా ముందుకు వెళుతుందా?

సీఎం....”మేము స్వతంత్రం. స్వతంత్రంగానే ముందుకు వెళుతాం. ఎవరితోనూ కలిసి వెళ్ళాల్సిన అవసరం కూడా మాకు లేదు. వాళ్లు మాతో వస్తే రావచ్చునేమో....కానీ మేము ఎవరితోనూ కలిసి వెళ్ళం”.

రాజ్ దీప్....”మీరు మున్సిపల్ ఎన్నికలు, జిల్లా ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నారు. ఇవి మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతున్నాయా? నేను ఇప్పుడు మీలో చూస్తున్న ఆత్మవిశ్వాసం, మీరు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా చూడలేదు!

సీఎం....”ఏ రాజకీయ పార్టీకైనా, నాయకుడికైనా ప్రజల మద్దతుతోనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ మధ్యే జరిగిన పంచాయతీ ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది”.

రాజ్ దీప్....”భారతదేశం ఢిల్లీ నుంచి పాలించబడటం లేదని, రాష్ర్టాల అభివృద్ధి లేకుండా భారత్ అభివృద్ధి లేదని, దేశం ప్రగతి రాష్ర్టాల రాజధానుల్లో, రాష్ర్టాల ముఖ్యమంత్రుల వద్ద ఉందని నమ్మడంతోనే చాలామంది పారిశ్రామికవేత్తలు ఢిల్లీ కంటే రాష్ర్టాల రాజధానులకు వస్తున్నారని మీరు విశ్వసిస్తారా?

సీఎం...”ఈ అంశాన్ని కొందరు అంగీకరిస్తారు. దీనితో కొందరు విభేదిస్తారు. కానీ భారతదేశం అనేది రాష్ట్రాల్లోనే ఉందన్నది వాస్తవం. భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు ఇది ఫెడరల్ విధానం. ఈ ఫెడరల్ విధానం కొనసాగాల్సి ఉంటుంది”.

రాజ్ దీప్.....”ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ, ఒకప్పుడు గుజరాత్ సీఎంగా ఉండటం వల్ల ఈ అంశాన్ని అర్థం చేసుకున్నారనుకుంటున్నారా?

సీఎం....”నేను కచ్చితంగా నరేంద్రమోదీని ఈ విషయంలో అభినందిస్తున్నా. రాష్ర్టాలకు పన్నుల కేటాయింపును 30% నుంచి 42 శాతానికి పెంచారు. ప్రధాని కో-ఆపరేటివ్ ఫెడరలిజం నినాదాన్ని ముందుకు తెచ్చారు. దానిలో భాగంగానే నీతిఆయోగ్‌ను ఏర్పాటుచేశారు. నీతిఆయోగ్ సమావేశంలో మోదీ స్పష్టంగా చెప్పారు.....పాఠశాలలు నడుపాల్సింది, దవాఖానలు నడుపాల్సింది....ఇతర అన్ని పనులు చేయాల్సింది మీరు (రాష్ర్టాలు). ఇందులో ఢిల్లీ పాత్ర ఏమి ఉంటుంది అని. అది వాస్తవం. కానీ దాన్ని ఆయన కచ్చితంగా అమలుచేయాలి”.

రాజ్ దీప్....”కో-ఆపరేటివ్ ఫెడరలిజాన్ని నరేంద్రమోదీ పూర్తిగా పాటిస్తున్నారని అనుకుంటున్నారా?

సీఎం.....”ప్రస్తుతానికి కొంతవరకు అమలవుతున్నది. ఇంకా పూర్తిగా అమలుచేయాల్సి ఉంది”.

రాజ్ దీప్.....”ప్రధాని మోదీ ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే ఆయనకు ఈ వేదిక నుంచి మీరు ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?

సీఎం....”ప్రధాని మోదీ ఇప్పుడు ఈ కార్యక్రమం చూస్తున్నారంటే నేను ఎంతో సంతోషిస్తాను. కచ్చితంగా సానుకూల సందేశాన్ని ఇస్తాను. అది ఆయనకు ఉపయోగపడుతుంది. ఈ అంశాలను ఆయన సానుకూల దృక్పథంతో తీసుకోవాలి”.

రాజ్ దీప్.....”కో ఆపరేటివ్ ఫెడరలిజం పూర్తిగా అమలుపరుచాలంటే ప్రధాని ఇంకా ఏం చేయాలని మీరు సూచిస్తారు?

సీఎం.....”రాష్ర్టాలకు ఇంకా చాలా నిధులు కేటాయించాలి. రాష్ర్టాలకు ఇంకా అధికారాలు పెంచాలి. అది జరిగినప్పుడే కో-ఆపరేటివ్ ఫెడరలిజం అన్న నినాదం నిజమవుతుంది. రాష్ర్టాలు బలోపేతం కాకుండా దేశం బలోపేతం కాదు. నేను ముందుగా చెప్పినట్టు ఏ రాష్ట్రం ఆదాయమైనా దేశ ఆదాయంగానే పరిగణించబడుతుంది. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్న విషయం మరువొద్దు. నేను కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నప్పుడు తమిళనాడులో సునామీ వచ్చింది. అప్పుడు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా నేను 300 మంది డాక్టర్లను యుద్ధప్రాతిపదికన అక్కడకు పంపాను. ఆ తర్వాత విషయాన్ని ప్రధానమంత్రికి చెప్పాను. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న డాక్టర్ మన్మోహన్‌సింగ్....చాలా మంచిపనిచేశారని నన్ను అభినందించారు. దేశంలో కొన్ని ప్రాం తాలు వేగంగా.....మరికొన్ని కాస్త నెమ్మదిగా అభివృద్ధి చెందుతుండొచ్చు. కానీ సంపద అన్ని రాష్ట్రాలకు పం చబడాలి. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలను మరింత సంపద సృష్టించేలా కేంద్రం ప్రోత్సహించాలి”.

రాజ్ దీప్.....”దేశ అభివృద్ధి రాష్ర్టాల్లోనే ఉందని, నిజమైన ఫెడరలిజం స్ఫూర్తి అదేనని చాలా బాగా చెప్పారు. లక్ష్యం ఉంటే ఎలాంటి విజయాలు సాధించవచ్చో దేశంలోనే నూతన రాష్ట్రమైన తెలంగాణలో మీరు చేసి చూపారు”.
(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)
18-01-2018 

Sunday, January 14, 2018

బెదిరించిన రాక్షస స్త్రీలకు తన మనో నిశ్చయం తెల్పిన సీత ...... ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి? : వనం జ్వాలా నరసింహారావు

బెదిరించిన రాక్షస స్త్రీలకు తన మనో నిశ్చయం తెల్పిన సీత
ఆంధ్రవాల్మీకి వాసుదాసు సుందరకాండ ఎందుకు చదవాలి?
వనం జ్వాలా నరసింహారావు
సూర్య దినపత్రిక (15-01-2018)

రావణుడి ఆజ్ఞానుసారం, కోపంతో, ఎర్రటి కళ్లతో వున్న రాక్షస స్త్రీలు, సీత దగ్గరకు చేరి, అనేక రకాలైన కఠినమైన మాటలన్నారు. తెలివిలేనిదానివన్నారు. రావణుడిని భర్తగా ఎందుకొప్పుకోవని అడుగుతారు. రావణుడంటే ఎవరనుకుంటున్నావని నిలదీస్తారు. కులానికి తక్కువా అంటే, బ్రహ్మకుమారుడైన పులస్త్య మహాముని వంశంలో పుట్టినవాడని చెప్తారు. లోకంలో అందరికీ ఒకే తల వుంటే, వీడికి పది తలలున్నాయనీ, మూడులోకాల్లో వీడిని మించిన వాడు లేడనీ, గర్వించిన శత్రువులందరినీ జయించాడనీ, ఇట్టివాడు కాకపోతే మగడు ఎట్లాంటివాడై వుండాలని ప్రశ్నిస్తారు.

"ఏకజట" అనే రాక్షసి నచ్చచెప్తూ: "సీతా! రావణుడిని నీవు అల్పుడనుకుంటున్నావు. వాడి పుట్టు-పూర్వోత్తరాలు నీకు తెలియదు. బ్రహ్మ మానసపుత్రుడు. నాల్గవ ప్రజాపతైన పులస్త్యుడి సంకల్పంతో కలిగిన విశ్రవసుడి కొడుకు రావణుడు. బలంలో శత్రువులను ఏడిపిస్తాడు. ఇంత గొప్పవాడు తనంతట తనే వచ్చి నిన్ను ప్రార్ధిస్తుంటే ఎందుకు బిగుసుకుంటావు? వాడు మక్కువ చూపిస్తున్న కొద్దీ నీకు నిక్కువెక్కుతున్నదెందుకు?". పిల్లికళ్లు తెరిచి, గుడ్లు గిరగిరా తిప్పుతూ "హరిజట" అనే రాక్షసి: "ముఫ్పైమూడు కోట్ల దేవతలను జయించాడు రావణుడు. ఇంద్రుడుని చెరపట్టాడు. అలాంటి జగజ్జెట్టే నీకుతగిన మొగుడు....వరించు" అంటుంది. కోపంతో వళ్లుమరిచి కఠినంగా మాట్లాడుతూ "ప్రఘస" అనే మరో రాక్షసి: "తన ప్రియురాలిని, సుందరిని, పుణ్యాత్మురాలిని విడిచి నిన్ను కోరుతున్న శూరుడికి, పరాక్రమవంతుడికి, బలవంతుడికి భార్యకావాలని నీ అంతట నీవే పోయి అడగాలికాని, నిన్నింత బలవంతం చేయాల్నా? అందరు ఆడవాళ్లు అక్కడుండగా, వారందరు చూస్తుండగా వాడితో ఎలా రమించాలనుకుంటావేమో! పరవాలేదులే! అంతఃపురాన్ని వదిలేసి రావణుడే ఇక్కడకు వస్తాడు ఒంటరిగా. పిలుచుకుని రమ్మంటావా?" అని అడుగుతుంది.

"వికట" అనే రాక్షసి చనువుగా, దగ్గరకొచ్చి, కూర్చుని: "సీతమ్మా! రావణుడు యుద్ధంలో అవలీలగా నాగులను, గంధర్వులను, యక్షులను, పన్నగులను, దానవులను ఎన్నోసార్లు గెలిచాడు. అంతటి మహాత్ముడికి నీమీద మనస్సు కలిగింది. ఎందుకు ఇల్లాలివై సంతోషించవు?"అని ప్రశ్నించి, నిర్భాగ్యురాలివని నిందిస్తుంది. "దుర్ముఖి" అనే మరో రాక్షసి, రావణుడి పేరు చెప్తే సూర్యుడు లంకపై ఎండ కాయడు, గాలి వీయడానికి భయపడ్తాడు, చెట్లు భయపడి వాడొచ్చినప్పుడు పూలవాన కురిపిస్తాయి, కోరినప్పుడు మేఘాలు వర్షిస్తాయి, అంటుంది. అలాంటి మహిమగలవాడిని, రారాజును, దేవతల విరోధిని, రావణుడిని భర్తగా చేసుకుని సుఖపడమని హితబోధ చేస్తుంది.

నయవాక్యాలతో సీతను ఒప్పించ లేకపోయిన రాక్షస స్త్రీలు, ఒక్క గుంపుగా చేరి, క్రూరంగా గర్జిస్తూ, బెదిరింపు మాటలనసాగారు. "సీతా! మనస్సు హరించే అంతఃపురంలో పరుపుల మీద పడుకోవడానికి ఎందుకు ఒప్పుకోవు? ఏల పడుకోనంటున్నావు? మనిషివైనందున, మనిషి భార్య కావడమే గొప్పనుకుంటున్నావు. ఇంకెక్కడి రాముడు? నీవేమో ఇక్కడ, ఆయనెక్కడో? ఆయన మీద మనసుంచి ఏడవడమెందుకు? రాముడిని చూడడం అసత్యం. రాక్షసరాజు రావణుడే నీకు తగిన భర్త. స్వీకరించు. నీవు మనిషివైనందున, పనికిమాలిన మనిషిని, రాజ్యం లేనివాడిని, ఏడుస్తున్న దరిద్రుడిని, బలహీనుడిని, భర్తగా తలుస్తున్నావు. ఈ రావణుడు మనుషులను తినేవాడు. జనుల దృష్టిలో గొప్పవనుకున్న పదార్ధాలన్నింటినీ అనుభవిస్తున్న వాడు. రాక్షసరాజు. ఇటువంటివాడిని మగడిగా చేసుకుని యధేచ్ఛగా సుఖించకూడదా?" అంటూ తననీవిధంగా పరుష వాక్యాలతో బాధిస్తున్న రాక్షసస్త్రీలతో, కారుతున్న కన్నీళ్లను, కొనగోటితో తుడుచుకుంటూ, మెల్లగా తన మనసులోని మాటలను చెప్పసాగింది సీత.

"ఓరాక్షస స్త్రీలారా! నామాట మీ చెవికెక్కడం లేదా? మీరు చెప్తున్న మాటలు లోకం మెచ్చేవికావు. మీకు ఘోరపాపాన్ని కలిగిస్తాయి. మనుష్య స్త్రీ, రాక్షసుడి భార్యకావడం ఎక్కడైనా జరిగిందా? కావాలంటే నన్ను చంపి తినండి. చెడుమాటలు మానేయండి. దరిద్రుడు, రాజ్యహీనుడు, మరెట్టివాడైనా, సువర్చలకు సూర్యుడిలా, నామగడే నాకుగొప్ప" అంటుంది సీత రాక్శస స్త్రీలను వుద్దేశించి. (కల్పాదిలో బ్రహ్మకు కొడుకు పుట్టి, తనపేరేంటో చెప్పమని ఏడుస్తాడు. "రుద్రుడు" అని నామకరణం చేస్తాడు బ్రహ్మ. మళ్లా ఏడుసార్లు ఏడుస్తాడు రుద్రుడు. అప్పుడు: "భవ-శర్వ-ఈశాన-పశుపతి-భీమ-ఉగ్ర-మహదేవ" అని ఏడుపేర్లు పెట్తాడు. ఆ ఎనిమిదిమందికి "సూర్య - జల - మహి - వాయు - వహ్ని - ఆకాశ దీక్షిత బ్రాహ్మణ - సోమ" దేహాలను ఇచ్చి, "సువర్చల-ఉష-సుకేశి-శివ-స్వాహా-దిశ-దీక్ష-రోహిణి" అనే ఎనిమిదిమందిని భార్యలుగా ఇచ్చాడు. ఇక్కడ చెప్పబడిన సువర్చలే ఆమె. సూర్యుడు తన వేడితో ఎంతో తపించేట్లు చేస్తున్నా సువర్చల అతన్ని విడిచిపోలేదు).


సీతాదేవి అన్న మాటలకు ప్రత్యుత్తరంగా, రావణుడిచే ఆజ్ఞాపించబడిన రాక్షస స్త్రీలు, కఠినవాక్కులనే బాణాలతో ఆమెను నొప్పించసాగారు. ఎటూకదలకుండా, పెదవి విప్పకుండా, శింశుపావృక్షం మీదనుండి రాక్షస స్త్రీలు జానకిని బెదిరిస్తూ అన్న మాటలన్నీ విన్నాడు హనుమంతుడు. రావణుడు రాకముందే తాను చూసిన స్త్రీని సీతాదేవిగా నిర్ణయించుకున్న హనుమంతుడు, సీతా-రావణుల సంభాషణవల్ల, తన నిర్ణయాన్ని స్థిరపర్చుకున్నాడు. అన్ని దుర్భాషలాడిన వారిమీద, హనుమంతుడు లంఘించి బుధ్ధి చెప్పొచ్చునుకాని, అలాచేయడం దూతలక్షణం కాదని వూరుకున్నాడు. దూతకృత్యం సీతాదేవిని చూడడం, మాట్లాడి రామ ముద్రికను ఇవ్వడమే. ఇదిముఖ్యం. దీన్ని పాడుచేయకూడదు. పైగా యుద్ధంచేసే సమయంకాదిది. ఆ స్థలంలో యుద్దం జరిగితే సీతాదేవి బెదరవచ్చు. వచ్చిన పని అయిపోతే యుధ్ధమెప్పుడైనా చేయవచ్చునని ఓర్పువహిస్తాడు హనుమంతుడు