Monday, February 29, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-64 : విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయబోయిన రంభ : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-64
విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయబోయిన రంభ
వనం జ్వాలా నరసింహారావు

          "యోగి పుంగవుల ప్రయత్నాలను ఫల హీనంగా రంభ చేస్తుందనీ, ఆమె నేర్పును ప్రదర్శించే సమయమొచ్చిందనీ, విశ్వామిత్రుడి తపస్సు భంగం చేయాలనీ, అది దేవతా కార్యమనీ, నమ్మకంగా చేయగలిగింది రంభనీ ఇంద్రాది దేవతలు రంభతో అంటారు. ఆ పని చేయడం కష్టమని భావించిన రంభ, చేయలేనని చెప్పడానికి సిగ్గుపడి-దీనంగా రెండు చేతులు జోడించి ఆ విషయాన్నే చెప్తుంది. విశ్వామిత్రుడి సమీపంలోకి పోవాలన్న ఆలోచనే గుండెలు జల్లు మనేలా చేస్తున్నదని అంటుంది. ఆయన భయంకరుడని, కోపిష్టని, నోటి దురుసుతనం వున్న వాడని అంటూ, అలాంటి వాడి దగ్గరకు పోవాలంటే దేహం గడగడలాడుతుందని చెపుతుంది. తెలిసి-తెలిసీ కొరివితో తల గోక్కోవడమెందుకని ప్రశ్నిస్తుంది. వజ్రాయుధం ధరించే ఇంద్రుడు, నిరాయుధైన ఆడదానిపై దయతలచమంటుంది. ఆయన వజ్రాయుధంతో కానిపని, ఆడదానితో ఎలా అవుతుందని, తనమీద దయచూపి ఆ పనికి తనను పంప వద్దని దీనంగా ప్రార్థించింది రంభ. ఆమెను భయపడ వద్దనీ, ఆమెలాంటిది అలా మాట్లాడరాదని, ఆమెకు మేలుకలుగుతుందనీ, ఆమె సౌందర్యాన్ని మరింత మెరుగుగా చేసుకుని రావాలనీ, మన్మథుడుతో సహా ఆమె పక్కనే తానూ వుంటాననీ-వుండి కోకిలనై కూస్తుంటానని, చెట్ల కొమ్మల్లో వసంతుడుంటాడనీ-వుండడంవల్ల చెట్లన్ని వికసించి మనస్సును ఆకర్షిస్తాయని ఇంద్రుడంటాడు రంభతో. ఇంద్రుడి ఆదేశం ప్రకారమే రంభ కొత్త సొగసులతో, విశ్వామిత్రుడి సమీపంలోకి పోయి మనోహరమైన పాట పాడింది. వినగా-వినగా, ఇంపు-సొంపు కలిగిస్తూ, అంతకంతకూ అతిశయించే పంచమ ధ్వనితో రంభ పాడుతుంటే, ముని కళ్లు తెరిచి చూసి, తన ముందర పాడుతున్న దేవతా స్త్రీని సందేహించాడు. అది ఇంద్రుడి మాయని గ్రహించాడు. కోపంతో కళ్లెర్రచేశాడు".


          "తాను కామ-క్రోధాలను జయించాలన్న ప్రయత్నంతో తపస్సు చేస్తుంటే, పాపకార్యమనికూడా అనుకోకుండా, తన తపస్సు భంగం చేయడానికి వచ్చిన రంభను ’దాసీ’ అని దూషించి, పదివేల సంవత్సరాలు రాయిగా పడి వుండాలని శపించాడు. (కామాన్ని జయించాలనుకుంటున్న విశ్వామిత్రుడికి కోపం పోలేదింకా). తానిచ్చిన శాపాన్ని గొప్ప తపోబలం, బుద్ధిబలం, విస్తారమైన తేజస్సున్న బ్రాహ్మణుడు పోగొట్టి ఆమెను రక్షిస్తాడని శాపవిమోచనం గురించి కూడా చెప్పాడు. తటాలున శపించాడు గానీ, తొందర పడ్డందుకు చింతించాడు విశ్వామిత్రుడు. ఓర్పు లేకపోయినందుకు పరితపించాడు. అక్కడేవుండి ఇదంతా గమనిస్తున్న ఇంద్రుడు, మన్మథుడు భయంతో పారిపోయారు".


          "కొంచెం కూడా తనకు శాంత గుణం లేకపోయిందని విచారపడ్డాడు విశ్వామిత్రుడు. రంభ తనను మోసగించేందుకు వచ్చిందని అనవసరంగా కోపగించుకున్నానని, తననామె ఏం చేయలేదని ఎందుకు గ్రహించ లేకపోయానని, తన సమ్మతి లేకుండా ఆమె తనను చెరచలేదుకదానని, ఛీ పొమ్మంటే పోయేదిగదానని, అకారణంగా తపస్సు నాశనం చేసుకుంటినిగదానని, కామ క్రోధాలను జయించానని బ్రహ్మను అడగాల్సిన పని లేకుండా తనకే తెలిసిందని, కామాన్ని జయించినా-క్రోధాన్ని జయించలేకపోతినిగదానని పరిపరి విధాల విచారించాడు. ఎలాగైనా కోపాన్ని జయించి తీరాలని నిశ్చయించుకుంటాడు. మనస్సులో కోపం రానీయనని, నోరు విప్పి ఒక్క మాటైనా పలకనని, దేహాన్ని సన్నగిల్ల చేయాలని, ఇంద్రియాల పొగరు అణచాలని, కామాన్ని పూర్తిగా చంపాలని, ఒకరు మొక్కినా-తొక్కినా ఒక్క విధంగానే వుంటానని నిర్ణయించుకుంటాడు. ఆహారం తినకూడదని, ఊర్పు విడవద్దనీ, కోపం అనేదాన్ని మనస్సుతో కూడ స్పృశించ వద్దనీ, తనకు బ్రాహ్మణత్వం లభించిందాక వుండితీరుతాననీ నిశ్చయించుకున్నాడు విశ్వామిత్రుడు". 

Sunday, February 28, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-63 : మేనకను మోహించిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-63
మేనకను మోహించిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

          "వెయ్యేళ్లు విశ్వామిత్రుడిలా ఘోరమైన తపస్సు చేయడంతో, బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి మునీశ్వరుడిని చూసేందుకొచ్చి, అతడు చేసిన తపస్సు వలన-తప ఫలంగా ఆయన ఋషి అయినాడని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆ మాటలకు తృప్తి చెందని విశ్వామిత్రుడు, అంతకంటే ఘోరమైన-కఠోరమైన తపస్సు చేయసాగాడు. అలా చేస్తున్న సమయంలో, సమీపంలోని తీర్థంలో స్నానమాడేందుకు, అతి మనోహరమైన సౌందర్యంతో-మన్మథుడి ఆయుధమేమోనని అనుకుండే విధంగా కనిపిస్తున్న ఒక అప్సరస, విశ్వామిత్రుడిని మోసగించే ఉద్దేశంతో వచ్చింది. కమలాల లాంటి కళ్లతో, పూవువలె మనోహరమైన మెచ్చుకోవాల్సిన శరీరంతో, రతిక్రీడలో ఆసక్తితో, మేఘాలలాంటి నల్లటి కురులతో, మొగ్గలలాంటి దంతాలతో, చంద్రుడిలాంటి ముఖంతో అందంగా వున్న ఆ అప్సరస, మేఘాల మధ్య మెరుపుతీగలాగా నీళ్లల్లో స్నానం చేస్తుంటే విశ్వామిత్రుడు చూశాడు. చూసి, కామ బాణ పీడితుడై, మనస్సు కలవరపడగా, తామరాకుమీద పడిన నీళ్లు చలించినట్లు మనస్సు చలించడంతో, ఆ అందగత్తెను సమీపించాడు. ’అప్సరసకు శోభనమగు కాక’ అని అంటూ, ఆమెను చూసినప్పటినుండి మన్మథుడు దయ లేకుండా బాణాలతో తనను తూట్లుపడేటట్లు పొడుస్తున్నాడని, ఆ వేదనను సహించలేనని, మనసార ఆమె అక్కడే వుండి ప్రేమాతిశయంతో తనను పాలించమని కోరతాడు. ఆమెకు నమ్మిన బంటులాగా ప్రవర్తిస్తానని, తన మాట నమ్మమని, మోసం చేయనని విశ్వామిత్రుడు అప్సరసను ప్రార్థించాడు".


          "విశ్వామిత్రుడి అభ్యర్థనను సరేనని అంగీకరించిన అప్సరస, ఋషీశ్వరుడి ఆశ్రమంలో వుండిపోయింది. వారిద్దరూ భార్యా-భర్తలలాగా పది సంవత్సరాలు గడిపారు. అప్పటికి, విశ్వామిత్రుడి మదన తాపం తగ్గి, తను చేసిన పనిగురించి ఆలోచించసాగాడు. ఎట్లైనా బ్రాహ్మణ్యం సంపాదించాలని ఆశతో వైరాగ్యం పూనిన విశ్వామిత్రుడెక్కడ-వ్యాకులపడక జితేంద్రియుడై మహా తపస్సు చేయడమేంటి-ఇప్పుడీ బోగందిలా తోడుగా వుండడమేంటి? బ్రాహ్మణులు వింటే ఫక్కున నవ్వరా అని ఆలోచించాడు. చపల మనస్సుతో మన్మథుడి బారిన పడితినేనని, పది సంవత్సరాలు వృధాచేసానేనని బాధపడ్డాడు. సుఖాలు వదిలిన రాజని, విరాగి అని, బ్రాహ్మణ్యం కొరకు అడవుల్లో ఏళ్లతరబడి తపస్సు చేస్తున్నాడని తనను గురించి అనుకునే వారందరూ ఇప్పుడు, బోగందానికి వశపడ్డాడనీ-వీడికి బుద్ది లేదని అనుకుంటారని విచారపడ సాగాడు. ఈ జంజాటానికి కారణం, తన తపస్సు నాశనం చేసేందుకు ఇది దేవతలు పన్నిన పన్నాగంగా అర్థంచేసుకుంటాడు. దేవతలవల్ల మోసపోయాను కదా అని ఆలోచిస్తున్న విశ్వామిత్రుడిని చూసి భయపడింది అప్సరస మేనక. తను శపిస్తాడేమోనని భయపడుతున్న దేవకన్య మేనకతో, ఆమె తప్పులేదని, దోషం ఆమెదికాదని, బుద్ధిలేనివాడినైన తాను కామానికి దాసుడనై ఆమె సాంగత్యంతో చెడిపోయానని అంటాడు. ఆమెను దూషించి ప్రయోజనం లేదని చెప్పి ఇక వెళ్లమంటాడు. అమెను పంపి కామాన్ని జయించేందుకు విశ్వామిత్రుడు హిమవత్పర్వతం దగ్గరున్న కౌశికీ తీరంలో కఠినమైన తపస్సుచేసేందుకై పోయాడు".

మహర్షి ఐన విశ్వామిత్రుడు


"అక్కడ ఉత్తరానున్న మంచు కొండమీద వెయ్యి సంవత్సరాలు నిశ్చలుడై-నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు. ఆయన తపస్సుకు లోకాలన్నీ కలవరపడుతున్నాయని, సజ్జన శ్రేష్ఠుడైన విశ్వామిత్రుడు మహర్షి కావడానికి సరిపడేంత తపస్సు చేశాడని, ఆ మాటతడికి చెప్పి ఆయన్ను సమాధానపర్చాలని దేవతలందరు బ్రహ్మను కోరారు. బ్రహ్మదేవుడు వారు చెప్పినట్లే విశ్వామిత్రుడి దగ్గర కొచ్చి, ఆయన మహర్షి అయ్యాడని అంటాడు. ఆయన మాటలకు విశ్వామిత్రుడు పొంగిపోలేదు. తను జితేంద్రియుడనయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు. ఆయనింకా జితేంద్రియుడు కాలేదని, దానికొరకు ఇంకా ప్రయత్నంచేయాలని, ఆయన మనస్సు వికారం పొందేందుకు అవకాశమున్నప్పటికీ అలా కానీయకుండా చేయగలిగినప్పుడే జితేంద్రియుడవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మ. అల్ప కారణంతో కొడుకులను శపించినవాడు జితేంద్రియుడెలా అవుతాడనంటూ బ్రహ్మ వెళ్లిపోయాడు. విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడంకొరకు, రెండు చేతులు పైకెత్తి, గాలినే ఆహారంగా తీసుకుంటూ, నిరాహారంగా కదలక-మెదలక ఆశ్చర్యకరమైన తపస్సు చేశాడు. మండుటెండల్లో పంచాగ్నుల మధ్య, జోరుగా వానలు కురుస్తున్నప్పుడు ఆరుబయట, మంచులాంటి శీతాకాలంలో చల్లటి నీళ్లల్లో నిలిచి రాత్ర్రింబగళ్లు తపస్సు చేశాడు. విశ్వామిత్రుడిలా ఘోర తపస్సు చేస్తుంటే, ఆ వేడికి ప్రపంచమంతా తల్లడిల్లింది. దేవతలు-ఇంద్రుడు ఆయన తపస్సు భంగం చేయడానికి ఈ సారి రంభను ఉపయోగించుకోవాలనుకుంటారు".

Saturday, February 27, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-62 : విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-62
విశ్వామిత్రుడి శరణుజొచ్చిన శునస్సేపుడు
వనం జ్వాలా నరసింహారావు

            "ఎండవేడికి తాళలేక మార్గమధ్యంలో ప్రయాణం ఆపు చేసి, రాజు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, శునస్సేపుడు పరుగెత్తుకుంటూ, సమీపంలో ఋషీశ్వరుల మధ్యనున్న మేనమామ విశ్వామిత్రుడి దగ్గరకు పోయాడు. అలసటతోనూ, ఎండవేడివల్లనూ, పరుగెత్తుకుంటూ రావడం వల్లా, తటాలున వస్తూనే మామ విశ్వామిత్రుడి ఒళ్లో వాలాడు. తనగతి ఏమని చెప్పాలని, తనను మన్నించి అతడే కాపాడాలని, తల్లితండ్రులున్నా వారు తనను రక్షించలేరని, వారున్నా లేనట్లేనని, ఏదో విధంగా ఆలోచించి రాజు కోరిక నెరవేరేటట్లు-తను తపస్సు చేసి స్వర్గానికి పోయేటట్లు చేయమని విశ్వామిత్రుడిని ప్రార్థించాడు శునస్సేపుడు. తను అర్థాయువుతో చనిపోకుండా, దీర్ఘాయువుగా జీవించేటట్లు చేయమంటాడు. తను బతకదల్చుకుంది కామంకోసం కాని, భోగంకోసం గాని కాదని, స్వర్గానికి పోవడానికి కావల్సినంత తపస్సుచేయడానికేనని అంటూ, తను ఆపదపాలుకాకుండా, ఆయన బిడ్డలను కాపాడినట్లే తనను కూడా రక్షించమని కోరాడు.

అల్లుడి మాటలు విన్న విశ్వామిత్రుడు తన కొడుకులతో, అతడు బాలుడనీ-రక్షించమని అర్థిస్తున్నాడని-భయపడి తన శరణుజొచ్చాడని అంటూ, వాళ్లల్లో ఎవరైనా ఒకడు అతడి బదులుగా రాజువెంట పోయి, అతడికి ప్రాణబిక్ష పెట్టమని అంటాడు. తన మాట గౌరవించాలని కూడా అంటాడు. వారిలో ఎవరన్నా అతడి బదులుగా వెళ్తే రాజు యజ్ఞం నెరవేరుతుందని, దేవతలు సంతోషిస్తారని, అతడి ప్రాణం నిలుస్తుందని, తన మాటా దక్కుతుందని, కాబట్టి తను చెప్పినట్లు చేయమని కోరతాడు. విశ్వామిత్రుడి కొడుకులందరూ ముక్తకంఠంతో ఆయన కోరికను తిరస్కరించారు. తన బిడ్డలను బలిపెట్టి ఇతరుల బిడ్డను కాపాడడమంటే, స్వార్జిత మధురా హారం మాని, నిషిద్ధమైన కుక్క మాంసం తినడమేనని అహంకారంగా జవాబిచ్చారు వారు తండ్రికి".


"కొడుకులందరు ఒక్క మాటగా, తన కోరికను మన్నించక పోవడంతో, విశ్వామిత్రుడికి కోపమొచ్చింది. తను అవునన్నది వారెలా కాదంటారని, కొంచెమైనా వారికి భయం లేకుండా పోయిందనీ, తండ్రి మాట జవదాటడం ధర్మ విరుద్ధమనీ, తన మాట అతిక్రమించి వారింక బతకలేరని అంటూ, వశిష్ఠుడి కొడుకులలాగానే వాళ్లు కూడా కుక్క మాంసం తింటూ-నీచమైన మనస్సుతో, వెయ్యేళ్లు అల్లాడమని శపించాడు. అలా పట్టరాని కోపంతో కొడుకులను శపించి, విశ్వామిత్రుడు మంత్రించిన విబూదిని శునస్సేనుడికి పెట్టి అతడిని భయపడొద్దని చెప్పాడు. యజ్ఞంలో అతడిని విష్ణు సంబంధమైన యూపానికి కట్టినప్పుడు, అగ్నిని చూస్తూ-ఆలస్యం చేయకుండా, ’ఇమ మ్మే వరుణ’ అనే రెండు మంత్రాలను జపించమంటాడు. (ఒక మంత్రం ఇంద్రస్తుతి-ఇంకొకటి ఉపేంద్రస్తుతి).


మంత్రాలను ఉపదేశించి, తని చెప్పిన ప్రకారం అవి చదివితే, రాజు యజ్ఞం సఫలమవుతుందనీ, ఆయన జీవితాశయం నెరవేరుతుందని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మంత్రాలను గ్రహించి, శెలవు తీసుకుని వెళ్లాడు శునస్సేపుడు. అంబరీషుడి దగ్గరకు పోయి, అతడిని యజ్ఞ దీక్ష వహించమని కోరాడు. పురోహితుడు చెప్పినట్లే దీక్ష వహించాడు అంబరీషుడు. బ్రాహ్మణులు శునస్సేపుడి మెడలో పూదండలు వేసి, ఎర్రటి వస్త్రాలను కట్టి, దర్భలతో అల్లిన తాళ్లతో అతడిని యూపస్తంబానికి కట్టారు. అతడేమాత్రం భయపడకుండా తనలోలోన మంత్రాలను స్మరించాడు. తనను ఆశ్రయించిన వారిని రక్షించే విష్ణువు, రాజుకు యజ్ఞ ఫలం-బాలుడికి దీర్ఘాయువు ఇమ్మని ఇంద్రుడికి చెప్పగా ఆయన ఆజ్ఞానుసారం ఇంద్రుడు మెచ్చి, శునస్సేనుడికి దీర్ఘాయువునిచ్చి, రాజుకు యజ్ఞ ఫలాన్నిచ్చాడు. అగ్నితేజుడైన విశ్వామిత్రుడు వెయ్యేళ్లు, ప్రపంచమంతా పొగిడే విధంగా, గాఢమైన తపస్సు చేశాడు".

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-X : వనం జ్వాలా నరసింహారావు

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-X
వనం జ్వాలా నరసింహారావు

ధర్మపురి క్షేత్ర నరసింహ స్వామికి మహా భక్తుడైన శేషప్ప కవి రచించిన నరసింహ శతకంలోని పద్యాలను యధాతధంగా నా బ్లాగ్ పాఠకులకు అందించే ప్రయత్నం ఇది. పదిరోజులకొకసారి పది పద్యాల చొప్పున వంద రోజులయ్యేసరికి వీటన్నింటినె నా బ్లాగ్ లో చదవ వచ్చు. (ఇవి పదవ-చివరి విడత పది పద్యాలు). పదిరోజులకొక సారి బ్లాగ్ లో పోస్ట్ చేసిన ఈ పద్యాలను పాఠకులు డౌన్ లోడ్ చేసుకుని భద్రపరుచుకో వచ్చు. నిరంతరం-నిత్యం, వీలున్నప్పుడల్లా పఠించవచ్చు.  

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-91

సీII నీ కథల్ చెవులలో సోకుట మొదలుగా
బులకాంకురము మేన బుట్టువాడు,
నయమైన నీ దివ్యనామకీర్తనలోన
మగ్నుడై దేహంబు మరచువాడు,
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకు
బ్రేమతో దండమర్పించువాడు,
హా! పుండరీకాక్ష; హా రామ! హరి! యంచు
వేడ్కతో గేకలు వేయువాడు,
తేII చిత్తకమలంబునను నిన్ను జేర్చువాడు,
నీదు లోకంబునందుండు నీరజాక్ష!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-92

సీII నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు
లెస్సగా బూజింపలేను సుమ్మి;
నాకు దోచిన భూషణములు పెట్టెదనన్న
గౌస్తుభమణి నీకు గలదు ముందె;
భక్ష్యభోజ్యముల నర్పణము జేసెదనన్న
నీవు పెట్టితి సుధ నిర్జరులకు;
గలిమికొద్దిగ గానుకల నొసంగెదనన్న
భార్గవీదేవి నీ భార్యయయ్యె;
తేII నన్ని గలవాడ నఖిలలోకాధిపతివి,
నీకు భూషాదులను బెట్ట నెంతవాడ?
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-93

సీII నవసరోజదళాక్ష నన్ను బోషించెడి
దాతవు నీవంచు ధైర్యపడితి;
నామనంబున నిన్ను నమ్మినందుకు దండ్రి!
మేలు నా కొనరింపు నీలదేహ!
భళి భళి! నీయంత ప్రభువు నెక్కడజూడ
పుడమిలో నీ పేరు పొగడవచ్చు;
ముందు జేసిన పాపమును నశింపగ జేసి,
నిర్వహింపుము నన్ను నేర్పుతోడ
తేII బరమ సంతోషమాయె నా ప్రాణములకు
నీ రుణము దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-94

సీII ఫణుల పుట్టల మీద బవ్వళించినయట్లు
పులుల గుంపున జేర బోయినట్లు,
మకరి వర్గంబున్న మడుగు జొచ్చినయట్లు,
గంగదాపున నిండ్లు గట్టినట్లు,
చెదలభూమిని జాప చేర బరచినట్లు,
తోలుతిత్తిని బాలు పోసినట్లు,
వెర్రివానికి బహువిత్త మిచ్చినయట్లు,
కమ్మగుడిసె మందు గాల్చినట్టు,
తేII స్వామి! నీ భక్తవరులు దుర్జనులతోడ
జెలిమిజేసిన యటులైన జేటువచ్చు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-95

సీII దనుజ సంహార! చక్రధర! నీకు దండంబు
లిందిరాధిప! నీకు వందనంబు,
పతితపావన! నీకు బహునమస్కారముల్,
నీరజాత దళాక్ష నీకు శరణు,
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు,
మందరధర! నీకు మంగళంబు,
కంబుకందర! శార్జ్ఞకర! నీకు భద్రంబు;
దీనరక్షక! నీకు దిగ్విజయము;
తేII సకల వైభవములు నీకు సార్వభౌమ!
నిత్య కళ్యాణములు నగు నీకు నెపుడు;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర




శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-96

సీII మత్సావతారమై మడుగులోపల జొచ్చి
సోమకాసురు ద్రుంచి చోద్యముగను;
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల
బ్రహ్మకిచ్చితి వీవు భళి యనంగ;
నా వేదముల నంది యాచారనిష్ఠల
ననుభవించుచు నుందు రవనిసురులు;
సకల పాపంబులు సమసిపోవు నటంచు
మనుజులందరు నీదు మహిమ దెలియ
తేII కుందు, రరవిందనయన! నీ యునికి దెలియు
వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-97

సీII కూర్మావతారివై కుధరంబు క్రిందను
గోర్కెతో నుండవా కొమరు మిగుల
వారాహమూర్తివై వనభూములం జొచ్చి
శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య
కశిపుని ద్రుంచవా కాంతిమీర?
వామనరూపివై వసుధలో బలిచక్ర
వర్తి నణంపవా వైరముంచి?
తేII యిట్టి పనులెల్ల జేయగా నెవ్వరికిని
దగును నరసింహ! నీకిది తగునుగాక;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-98

సీII లక్ష్మిశ! నీ దివ్య లక్షణగుణముల
వినజాల కెప్పుడు వెర్రినైతి;
నా వెర్రి గుణమును నయముగా ఖండించి
నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితర దైవముల నే
నమ్మలే దెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె;
నీ పాదకమలముల్ నిరతి నేను
తేII నమ్మియున్నాను; నీపాద నళినభక్తి
వేగ దయచేసి రక్షింపు వేదవేద్య!
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-99

సీII అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు
ముక్తి బొందిరి వేగ ముదముతోడ
నీపాద పద్మముల్ నెర నమ్మియున్నాను
నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాచి రక్షించునన్ గడతేర్చు వేగమే
నీ సేవకునిజేయు నిశ్చయముగ
గాపాడినను నీకు గైంకర్యపరుడనై
చెలగి నీ పనులను జేయువాడ;
తేII ననుచు బలుమారు వేడెద నబ్జనాభ
నాకు బ్రత్యక్షమగు నిన్నె నమ్మినాను;
భూషణవికాస ! శ్రీ ధర్మపురనివాస
దుష్టసంహార ! నరసింహ ! దురితదూర

శేషప్ప కవి రచించిన నరసింహ శతకం-100

సీII శేషప్పయనుకవి చెప్పిన పద్యముల్
చెవుల కానందమై చెలగుచుండు;
నేమనుజుండైన నెలమి నీ శతకంబు
భక్తితో విన్న సత్ఫలము గలుగు;
జెలగి ఈ పద్యముల్ - చేర్చి వ్రాసినవారు
కమలాక్షు కరుణను - గాంతు రెపుడు
నింపుగా బుస్తకం - బెపుడు బూజించిన
దురిత జాలంబులు - దొలగిపోవు
తేII నిద్దిపుణ్యాకరంబని - యెపుడు జనులు
కష్టమనక పఠించినం గలుగు ముక్తి
భూషణవికాస శ్రీ ధర్మ - పురనివాస
దుష్టసంహార  నరసింహ - దురితదూర!
(సమాప్తం)

Friday, February 26, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-61 : శునస్సేపోఖ్యానం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-61
శునస్సేపోఖ్యానం
వనం జ్వాలా నరసింహారావు

"ఇలా అందరూ వెళ్లిపోగానే, తనింతవరకు తపస్సు చేస్తున్న వనంలో విఘ్నాలు కలుగుతున్నాయని, ఆ ప్రదేశాన్ని వదిలి మరింకెక్కడికైనా పోతానని అక్కడున్న వారితో అంటాడు విశ్వామిత్రుడు. ఏ దిక్కుకు పోతే బాగుంటుందని ఆలోచించి, విశాలమైన పడమటిదిక్కున మంచివనాలు, పుష్కరం వున్నందువల్ల, తీవ్రమైన తపస్సు చేయడానికి అక్కడకు పోతే తపస్సిద్ధికలుగుతుందని భావిస్తాడు. త్వరగా అక్కడకు పోవాలని, పోయి కేవలం ఫలాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటూ, భయంకరమైన తపస్సు చేయాలనీ, అలా చేయడంద్వారా తపస్సిద్ధన్నాకలగాలి-లేదా-మరణమన్నా రావాలి, అని నిశ్చయించుకుంటాడు. ఉత్కృష్ట మార్గంలో, ఇతరులకు కనీసం అనుకోడానికైనా సాధ్యపడని, అతిగొప్పదైన-కఠినమైన నిష్ఠలతో తపస్సు చేయడం ఆరంభించాడు విశ్వామిత్రుడు.

విశ్వామిత్రుడు తపస్సు చేస్తున్న రోజుల్లోనే, అయోధ్యా నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. మనువు మునిమనుమడు, నభగుడి మనుమడు, నాభాగుడి కొడుకైన అంబరీషుడు పెద్దల మన్ననలుపొందేవిధంగా మాట్లాడుతాడని, క్రోధాన్ని జయించినవాడని, శ్రేష్ఠమైన న్యాయ మార్గంలో దోషాలను జయించినవాడని, సద్గుణాలే భూషణాలుగా కలవాడని, రాజశ్రేష్టుడనీ ప్రసిద్ధికెక్కాడు. అలాంటి అంబరీషుడు ఒక యాగాన్ని చేయాలని అనుకొని, చేస్తున్న సమయంలో, ఇంద్రుడు యజ్ఞ పశువును దొంగిలించాడు. యజ్ఞ పశువు పోతే, పోకుండా రక్షించుకోలేక పోతే, యజ్ఞాన్ని చేసేవాడికి దోషం తగులుందని చెప్పాడు ఋత్విజుడు. యజ్ఞపశువునన్నాతెమ్మని, దొరక్కపోతే యజ్ఞం కొరకు బలి కావడానికి ఒక మనిషినైనా తెమ్మని అంబరీషుడిని ఆదేశించాడు ఋత్విజుడు. యజ్ఞపశువును వెతికేందుకు అన్ని ప్రదేశాలలో వెతకసాగాడు అంబరీషుడు. కనీసం యజ్ఞం పూర్తి చేయించేందుకు ఒక మనిషైనా దొరకకపోతాడానని స్వయంగా వెతకనారంభించాడు".


"ఇలా తిరుగుతూ, ఎవరినీ బలాత్కారంగా తేవడానికి ఇష్టపడని అంబరీషుడికి ఒకనాడు, భార్యా-పిల్లలున్న ఋచీకుడనే ముని (విశ్వామిత్రుడి తోబుట్టువు భర్త) కనిపిస్తాడు. అతడికి లక్ష ఆవులిస్తానని, తన యజ్ఞాన్ని రక్షించేందుకు ఆయన కొడుకుల్లో ఒకడినిఇవ్వమని ఆయనకు నమస్కరించి, ప్రార్తించాడు. పోయిన యజ్ఞపశువుకొరకు ప్రపంచమంతా గాలించినా ఫలితం లేకపోయిందని, దానికి బదులుగా మనిషిని వుంచాల్సి వచ్చిందనీ, తన ముగ్గురి కొడుకుల్లో ఒకడిని ఇవ్వమని అంటాడు. ఆయనేమిచ్చినా తన ప్రేమకు పాత్రుడైన పెద్దకొడుకునివ్వలేనని ఋచీకుడనగానే, ఆయన భార్య, శునకుడనే తమ కనిష్ట పుత్రుడంటే తనకెంతో ఇష్టమని కాబట్టి వాడినీ అమ్మమని అంటుంది. ఆ మాటలను విన్న వారి నడిమి కొడుకు శునస్సేపుడు, తన ప్రాణమిచ్చి రాజు యజ్ఞాన్ని కాపాడుదామనుకుంటాడు. తనను తీసుకొని పొమ్మని, ఆయనిస్తానని చెప్పిన లక్ష ఆవులను తండ్రికివ్వమని శునస్సేపుడనగానే, ఆలస్యం చేయకుండా, ధర్మ ప్రీతితో తన వెంట అతడిని తీసుకునిపోయాడు అంబరీషుడు. మార్గమధ్యంలో మధ్యాహ్నమైనందున వారిరువురు ఒక పుష్కర తీరం దగ్గర కాసేపు ఆగారు".



(లోకంలో సాధారణంగా పెద్దకొడుకుపై తండ్రికి, పిన్న వాడిపై తల్లికి ప్రేముంటుంది. నడిమి కొడుకుపై తల్లితండ్రులకిద్దరికీ ప్రీతి వుండదంటారు. ఈ విషయంలో ఋషీశ్వరులు కూడా అందరివలెనే ప్రవర్తిస్తారనడానికి ఇదొక ఉదాహరణ).

Thursday, February 25, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-60 : త్రిశంకుడిని స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-60
త్రిశంకుడిని స్వర్గానికి పంపిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

          "ఈ విధంగా వశిష్ఠుడి కొడుకులను శపించిన విశ్వామిత్రుడు, తన పిలుపు మేరకు యజ్ఞం చూసేందుకొచ్చిన మునుల సమూహంతో, ఇక్ష్వాక వంశం రాజైన త్రిశంకుడనే ధర్మాత్ముడిని-మహాభాగ్య సంపన్నుడిని-దేహంతో స్వర్గానికి పోదల్చి తన సహాయం కోరినవాడిని వారికి పరిచయం చేస్తున్నానంటాడు. తమందరం కలిసి, ఆలోచించి, ఏ యజ్ఞం చేస్తే అతడి కోరిక నెరవేరుతుందో ఆ యజ్ఞాన్నే చేద్దామంటాడు. పరమ కోపిష్టైన విశ్వామిత్రుడికి భయపడిన వారందరూ, ఆయన మాట ఎందుకు కాదనాలని-ఆ మూర్ఖుడికెందుకు అడ్డు చెప్పాలని-ఆయన రాజు కోరిక నెరవేరుస్తుంటే తమ కొచ్చే నష్టమేంలేదని అనుకుని, ఆయన చెప్పినట్లే కార్య నిర్వహణకు పూనుకున్నారు. విశ్వామిత్రుడు యాజకుడై యాగం నిర్వహిస్తుండగా, మునులందరు తమకప్పచెప్పిన పనులను కడు హెచ్చరికతో చేసారు. యజ్ఞం సాగుతున్నప్పుడు, హవిర్భావాలను తీసుకెళ్లాల్సిందిగా విశ్వామిత్రుడు దేవతలను కోరినప్పటికీ, పిలిచిన వారెవరూ రాలేదక్కడికి. దాంతో ఆయన కోపంతో కళ్లెర్రచేశాడు. వెంటనే యజ్ఞం దగ్గరున్న కొయ్యగరిటను చేత్తో తీసుకుని, ప్రస్తుతానికి ప్రయోజనంలేని యజ్ఞంతో నిమిత్తం లేకుండా, తన తపశ్శక్తితో, దేహంతో స్వర్గానికి పంపిస్తానని త్రిశంకుడితో అంటాడు విశ్వామిత్రుడు".

          "తను సంపాదించిన తపఃఫలంలో, వశిష్ఠాదుల శాపంవల్ల ఖర్చయింది పోగా ,ఇంకా మిగలనున్నదాని బలంతో, బొందితో ఎవరికీ వెళ్లడానికి సాధ్యపడని స్వర్గానికి పొమ్మని త్రిశంకుడినంటాడు. విశ్వామిత్రుడలా అంటుండగానే, ఋషులందరు చూస్తుండగా, త్రిశంకుడు ఆకాశ మార్గంలో స్వర్గం చేరువలోకి పోయాడు. అప్పుడు దేవతా సమూహంతో వున్న ఇంద్రుడు, త్రిశంకుడిని చూసి, అతడు స్వర్గంలో వుండతగినవాడు కాదని, తిరిగి భూమిమీదకే పొమ్మని అంటాడు. గురువు శాపంతో చండాలుడైనవాడనీ, మూఢుడనీ, ఏ లోపంలేని మానవుడికే స్వర్గప్రాప్తిలేనప్పుడు వాడెలా స్వర్గంలోకి రాగలుగుతాడనీ కోపంతో, త్రిశంకుడిని తలకిందులుగా భూమిమీద దొర్లమని అంటాడు ఇంద్రుడు.



తనను రక్షించమని వేడుకుంటాడు కిందకు పడుతున్న త్రిశంకుడు. అతడి దీనాలాపాలను విన్న విశ్వామిత్రుడు తీవ్రకోపంతో విజృంభించి, పడిపోతున్న త్రిశంకుడిని, ఆకాశం మధ్యలోనే నిలవమని-కింద పడొద్దని అంటూ, తన తపశ్శక్తితో ఆపు చేస్తాడు. అంతటితో ఆగకుండా, ఆకాశంలో దక్షిణదిక్కున సప్తర్షులను (నక్షత్రాలు) సృష్టించి, అక్కడో స్వర్గలోకాన్ని, మరో ఇంద్రుడిని-దేవతలను సృష్టించేందుకు సిద్ధమవుతాడు. తననుకునే విధంగా సృష్టించడం కుదరకపోతే, లోకంలో ఇంద్రుడే లేకుండా చేసేందుకు పూనుకుంటున్న సమయంలో దేవతలు, మునులు విశ్వామిత్రుడిదగ్గరకొచ్చి ప్రార్థించారు. తన తపశ్శక్తిని లోకోపకారానికి ఉపయోగించాలేగాని అలా చేయడం తగదనీ, గురు శాపంతో నిహతుడయినవాడిని స్వర్గానికి పంపడం తగదనీ, స్వర్గం పాడైపోకూడదనీ, అలా జరిగితే శాస్త్రాలన్నీ ధ్వంసమైపోవాల్సిందేననీ, అలా కావడానికి అతడు కారణం కారాదనీ అంటూ, విశ్వామిత్రుడిని శాంతించమని వేడుకుంటారు. రాజర్షైన వాడే ఇంత పనికి పూనుకుంటే, బ్రహ్మర్షులు కూడా శాస్త్ర  మర్యాద మీరితే ఏం కావాలని అడుగుతూ, శాస్త్ర మర్యాదను ఉల్లంఘించవద్దని అంటారు దేవతలు. అలా చెప్పిన వారితో, త్రిశంకుడిని స్వర్గానికి పంపిస్తానని తను మాటిచ్చానని, ఇచ్చిన మాటెలా తప్పాలని ప్రశ్నించి, తనొక ఉపాయం చెప్తానంటాడు. తాను సృష్టించిన నక్షత్రాలను ధ్వంసం చేయొద్దనీ-శాశ్వతంగా వుండనియ్యాలనీ, త్రిశంకుడు తలకిందుగా-అతడిని అనుసరించి ఆ నక్షత్రాలను అక్కడే వుండనివ్వాలని వారికి చెప్పాడు. వారొప్పుకోగానే, విశ్వామిత్రుడు శాంతించాడు. త్రిశంకుడు స్వర్గంలో లాగానే అక్కడే సుఖపడే వీలు కలిగించారు దేవతలు".

Wednesday, February 24, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-59 : వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-59
వశిష్ఠుడి కుమారులను శపించిన విశ్వామిత్రుడు
వనం జ్వాలా నరసింహారావు

"దీనాలాపనలతో మాట్లాడుతున్న త్రిశంకుడిని చూసి విశ్వామిత్రుడు, అతడికి మేలు జరుగుతుందని ధైర్యం చెప్పాడు. అతడిని భయపడ వద్దనీ, అతడు మంచి నడవడిగలవాడని తనకు తెలుసనీ, అతడి మనస్సులో వున్న కోరికను తాను నెరవేరుస్తానని అంటాడు విశ్వామిత్రుడు. యజ్ఞం చేసేందుకు శీఘ్రంగా మునీశ్వరులందరినీ పిలుస్తానని చెప్పి, వశిష్ఠుడి పుత్రుల శాపాన్ని తప్పించడం సాధ్యపడనందున, చండాల రూపంలోనే త్రిశంకుడిని స్వర్గానికి పంపించి కీర్తిమంతుడిని చేస్తానని అభయమిస్తాడు. తనను శరణుజొచ్చిన కారణాన స్వర్గం అతడికి అరచేతిలో ఉసిరికాయ సమానంగా చేస్తానని హామీ ఇస్తాడు. తన కొడుకులను పిల్చి యజ్ఞానికి కావాల్సిన సామాగ్రిని సమకూర్చమని చెప్పాడు. తన ఆజ్ఞగా-తనపై గౌరవంతో, మునీశ్వరులందరు శిష్యులతో-ముఖ్య హితులతో-బహుశ్రు తులతో-ఋత్విజులతో రమ్మని పిలవాల్సిందిగా శిష్యులకు చెప్పాడు. ఎవరన్నా తన మాటను వినకపోతే, వారి సంగతి తనకు తెలియచేయాలన్న గురువు ఆజ్ఞానుసారం, శిష్యులు దేశ దేశాల్లో తిరిగి, బ్రహ్మ వాదులందరినీ పిలిచారు. విశ్వామిత్రుడికి భయపడి, ఇష్టమున్నా-లేకపోయినా అందరూ యజ్ఞాన్ని చూడడానికి వచ్చారు".



"ఇదిలా వుండగా వశిష్ఠుడి కుమారులకీ విషయం తెలిసి కోపంతో యజ్ఞాన్ని తప్పుబట్టారు. యజ్ఞం చేసేవాడు చండాలుడనీ, చేయించేవాడు రాజర్షైన క్షత్రియుడనీ, సద్బ్రాహ్మణులందరు చండాలుడి అన్నం ఎలా తింటారనీ, దేవతలెలా సంతోషంతో వస్తారనీ, చండాలుడు స్వర్గానికెలా పోతాడనీ, వాడుపోయే స్వర్గం ఎలాంటిదనీ మహోదయుడు-మిగిలిన వశిష్ఠుడి కుమారులన్నారని శిష్యులు గురువుతో చెప్పడంతో విశ్వామిత్రుడి కోపం తారాస్థాయికి చేరింది. విశేష ధ్యానంతో ధర్మాసక్తుడైన తనను పాపపు పలుకులతో దూషించిన వారందరూ మసైపోవాల్సిన వారని, వారందరూ చచ్చి నరకానికి పోయి-యమభటుల కఠిన పాశాలకు వశ పడి, ఏడొందల జన్మలవరకు పీనుగులుతినేవారిగా పుట్టాలని శపించాడు. కుక్క మాంసం తింటూ, దిక్కులేకుండా-దయాహీనులైన దుర్జాతివారిగా, నీచులుగా, వికార వేషాలతో భూమ్మీద అపూజ్యులై తిరగాలని కూడా శపించాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడి కొడుకులను. తిట్టగూడని తిట్లు తిట్టిన మహోదయుడిని, బోయవాడిగా పుట్టి-భూమ్మీద తిరిగి, ఆత్మహత్య చేసుకుని, చివరకు తన కోపకారణాన దుర్గతులలో కూలిపోవాలని శపించాడు". 

Tuesday, February 23, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-58 : త్రిశంకుడనే పేరు రావడానికి కారణం- దైవ పౌరుష బల విచారం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-58
త్రిశంకుడనే పేరు రావడానికి కారణం-
దైవ పౌరుష బల విచారం
వనం జ్వాలా నరసింహారావు

          "ఇలా మాట్లాడుతున్న రాజు చెప్పిందంతా విన్న వశిష్ఠుడి నూర్గురు కొడుకులకు విపరీతమైన కోపమొచ్చింది. ’ఓరీ వివేక హీనుడా, సత్యం పలికిన గురువుగురించి ఇలా మాట్లాడవచ్చా? ఆయన్ను కాదని ఇంకొకరిని ఆశ్రయించవచ్చా? కుల గురువును విడవడం మర్యాదేనా? సూర్య వంశపు రాజులందరికి పురోహితుడే ఆచార్యుడు.ఆయన మాట జవదాటవచ్చా? ఆయన అబధ్ధాలాడుతున్నాడనుకుంటున్నావా? ఏమనుకుని ఆయన్ను వదిలావు? నిన్నొకిడినేకాదు-లోకాలన్నిట్లో ఏ యాగమైనా, ఎవరితోనైనా చేయించగల శక్తి ఆయనకుంది. వశిష్ఠుడు కాదంటే మేమెలా చేయిస్తామనుకున్నావు? చేయిస్తే ఆయన్ను అవమానించినట్లేకదా? అలాంటి పని మేం చేయొచ్చా’ అని అంటారు. కఠినంగా మాట్లాడిన వారితో, గురువుతో అవమానించబడ్డానని-ఆయన కుమారులతో కూడా అవమానించబడ్డానని, ఇంకొకరి శరణువేడి తన కార్యం సాధించుకుంటానని వెళ్లడానికి సిద్ధమవుతాడు. నిష్కారణంగా గురు ధిక్కారానికి పాల్పడ్డ త్రిశంకుడిని, చండాలుడు కమ్మని శపించి తమ ఆశ్రమానికి పోయారు వశిష్ఠుడి కొడుకులు. రాజు తన నగరానికి పోయాడు".

          "ఉదయం నిద్రలేచి తన ముఖం-శరీరం చూసుకుంటాడు రాజు. అందంగా సుతిమెత్తగా వుండే శరీరం నల్లబడిపోయింది.బంగారుకాంతితో అతిశయిస్తుండే అందమైనదేహం వానాకాలంమబ్బులా నల్లబడింది. మెత్తగా-నిడువుగావుండే తలవెంట్రుకలు, బిరుసుగా - చింపిరిగామారాయి. మణులుచెక్కిన బంగారు సొమ్ములన్నీ ఇనుపముక్కలై పోయాయి. మెడలో వేలాడే జందెంపోగు, ఇనుప తాడయింది. సహించనలవికాని మునుల శాపంవల్ల సర్వనాశనమైంది. అలా తయారైన తమ రాజును చూసిన పురప్రజలందరు దూరంగా పోసాగారు. అందరూ తన్నొదిలిపోయినా, ధైర్యం కోల్పోని రాజు దుఃఖంతో పరితపిస్తూ, విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు. తనవద్దకొచ్చిన వాడు త్రిశంకుడనే రాజని గ్రహించిన విశ్వామిత్రుడు, అతనెందుకలా శాపవశాన మాలవాడయ్యాడనీ-ఎందుకు తన దగ్గరకు వచ్చాడని దయతో అడుగుతాడు. తనను తనగురువు-గురుపుత్రులు ఉపేక్షించారని, తన కోరిక తీరకపోగా ఇలా తయారయ్యానని, అవమానపడ్డానని, దేహంతో స్వర్గానికి పోవాలని వందలాది యజ్ఞాలు చేసినా ఫలితం కలగలేదని అంటాడు".


"తనింతవరకు ఎన్నడూ అసత్యం పలకలేదని, ఇప్పుడిలాంటి దశ వచ్చినా-మున్ముందు అసత్యమాడబోనని క్షత్రియ ధర్మంపై ప్రమాణం చేసి చెప్పుతున్నానన్నాడు. తాను రాజధర్మం విడవక ప్రజాహితమైన కార్యాలను చేసానని, కష్ఠకాలంలో కూడా సత్యమే పలుకుతానని అంటాడు త్రిశంకుడు. తానెన్నో యజ్ఞాలు చేసానని, మంచి నడవడితో గురువులను సంతోషపెట్టానని, కీర్తి సంపాదించానని, ఇంతచేసినా ఇప్పుడు తనుచేయదల్చిన యజ్ఞం చేయించడానికి వారు ఒప్పుకోవడంలేదని, తన పౌరుషం వ్యర్థమనీ-దైవమే శ్రేష్ఠమనీ తలుస్తున్నానని, సర్వం దైవానికి లోబడేవుంటుందని, ఉత్తమ గతికూడా దైవానుగ్రహమేనని, దైవం కరుణించకపోతే పౌరుషం ఫలించదని అంటూ, విశ్వామిత్రుడిని తప్ప ఇతరులను ఆశ్రయించననీ-అతడే నిశ్చయంగా తనకు రక్షకుడనీ, తను తలపెట్టిన కార్యాన్ని పురుష ప్రయత్నంతో సఫలం చేయమనీ ప్రార్తించాడు త్రిశంకుడు విశ్వామిత్రుడిని".

            (ఆంధ్ర వాల్మీకిరామాయణం బాల కాండ మందరంలో, అవసరమైన ప్రతిచోటా, మనుష్యులు ఆచరించాల్సిన ధర్మాలను సందర్భోచితంగా వివరించబడింది. త్రిశంకుడి కోరిక వక్రబుద్ధిగల శిష్య లక్షణంగా అర్థంచేసుకోవచ్చు. సరైన శిష్యుడు, తనకేది హితమో-పథ్యమో, అది చెప్పమని గురువులను కోరాలి గాని, నిర్భంధించి-తన ఇష్టప్రకారం, అసాధ్యమైన పనులు చేయించమని అడిగి-ఆయన చేయించనన్నాడని గురువును త్యజించడం దోషం. గురు శుశ్రూష చేసి, అతడి మనస్సును సంతోషపర్చి, తన కార్యాన్ని సాధించుకోవాలి శిష్యుడు. అలాచేయనందువల్లే త్రిశంకుడి ఆ గతి పట్టింది. వశష్ఠుడి కొడుకులు త్రిశంకుడి కోరిక తిరస్కరించడమంటే, పుత్రులు తండ్రి మార్గాన్ని అనుసరించి ప్రవర్తించాలని, ఆయనకు అవమానకరమైన పనులు చేయకూడదని అర్థం. గురువును నిందించినవాడు చండాలుడవుతాడన్న అర్థం కూడా స్ఫురిస్తుంది.


            త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. ఆయన భార్య సత్యవ్రత-కేకయ రాజు కూతురు. సత్యవ్రతుడు సూర్యారుణుడి కొడుకు. అతడు సత్యవ్రతను పెళ్లి చేసుకున్న తర్వాత, అయోధ్యా నగరంలో నివసిస్తున్న ఒక బాలికను-వివాహితను, రాజకుమారిడినన్న అదికా గర్వంతో, చెరిచాడు. రాజుకీవిషయం తెలిసి, కోపించి, తనదగ్గర వుండొద్దని సత్యవ్రతుడిని ఆజ్ఞాపించాడు. కుక్క మాంసం తిని బతకమని కూడా తండ్రి ఆదేశించాడు. తన పక్షాన పురోహితుడైన వశిశ్ఠుడు తండ్రితో మాట్లాడలేదని సత్యవ్రతుడికి ఆయనపై కోపమొస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి, సత్యవ్రతుడి తండ్రి అడవికి పోయి తపస్సు చేయసాగాడు. రాజ్యం, నగరం, అంతఃపురం ఇబ్బందులకు గురి కావద్దని, వశిష్ఠుడు స్వయంగా కాపాడసాగాడాసమయంలో. ఆ సమయంలోనే, విశ్వామిత్రుడు, భార్యా పిల్లలను వదిలి పశ్చిమ సముద్ర తీరంలో తపస్సు చేస్తుండేవాడు. ముగ్గురు పిల్లల్ని, తన్ను పోషించుకోలేక విశ్వామిత్రుడి భార్య, నడిమికొడుకు మెడకు పలుపు తగిలించి, వంద ఆవులిస్తే అమ్మడానికి బేరం పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న సత్యవ్రతుడు, ఆమెను వారించి, వారందరినీ తన రక్షణలో వుంచుకున్నాడు. ప్రతిదినం జంతువులను వేటాడి వారందరికీ మాంసాహారం పెట్టి పోషించేవాడు. ఒక రోజున వేటాడేందుకు ఒక్క జంతువుకూడా దొరకలేదు. సమీపంలోనే వున్న వశిష్ఠుడి ఆవును చంపి దాని మాంసం తిన్నారారోజున. తండ్రికి అప్రియమైన పనులు చేయడంపాలిచ్చే గురువు గోవును చంపడం, అప్రోక్షిత మాంసాన్ని తినడం అనే మూడు చెడు కార్యాలను చేసినందున త్రిశంకుడు అనే పేరుతో వ్యవహరించమని-లోక నిందితుడైన అతడిని తనింకేమీ చేయనని అంటాడు కోపించిన వశిశ్ఠుడు. అప్పటినుండి సత్యవ్రతుడు త్రిశంకుడయ్యాడు. తపస్సు పూర్తయిన తర్వాత వచ్చిన విశ్వామిత్రుడు, తన భార్యా పిల్లలను కాపాడిన త్రిశంకుడితో, ఆయన కోరుకున్నప్పుడు కావాల్సిన సహాయం చేస్తానని హామీ ఇచ్చినందువల్లనే ఇప్పుడు యజ్ఞం చేయించేందుకు పూనుకుంటున్నాడు).

Monday, February 22, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-57 : త్రిశంకూపాఖ్యానం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-57
త్రిశంకూపాఖ్యానం
వనం జ్వాలా నరసింహారావు

            "వశిష్ఠుడితో తనకు కలిగిన విరోధం-పరాభవం, ఓటమికి కుమిలిపోతూ, శోకంతో ఏమీ చేయలేక లోలోపలే విశ్వామిత్రుడు బాధపడుతుండేవాడు. భార్యతో దక్షిణ దిక్కుగా పోయి, తీవ్రమైన తపస్సు చేస్తున్న సమయంలో, హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడనే నలుగురు కొడుకులు కలిగారు. అలానే వేయి సంవత్సరాలు తపస్సుచేసింతర్వాత, బ్రహ్మ ప్రత్యక్షమై, విశ్వామిత్రుడు తన తపస్సుతో రాజర్షులందరినీ మించిపోయాడని-ఆయన గూడా రాజర్షిగా  అయ్యాడని వరమిచ్చి తన లోకానికి వెళ్లిపోతాడు. తనింతకాలం తపస్సు చేసింది రాజర్షికావడానికానని పరితపించి, విచారపడి, సిగ్గుతో తలవంచుకుని దుఃఖంతోనూ-శోకంతోనూ కుమిలిపోయాడు. తనింతగా చేసిన తపస్సు వ్యర్థమయిందని భావించిన విశ్వామిత్రుడు, మునుపటికంటే గొప్పగా తపస్సు చేయాలని నిశ్చయించుకుని, అనుకున్న విధంగా చేయసాగాడు".



"అలా విశ్వామిత్రుడు ఘోర తపస్సు చేస్తున్న సమయంలో, అయోధ్యలో త్రిశంకుడు అనే రాజు, దేహంతో స్వర్గానికి పోవాలని-అక్కడ స్వర్గ సుఖాలనుభవించాలని అనుకొని, వశిష్ఠుడిని పిలిచి తన కోరిక తెలిపి, దానికొరకు తనతో యాగం చేయించమని అడుగుతాడు. వశిష్ఠుడు, అది సాధ్యపడదని అనగానే, త్రిశంకుడు ఆయన్ను వదిలి దక్షిణ దిక్కుగా వశిష్ఠుడి నూర్గురు కొడుకుల వద్దకు వెళ్తాడు. కీర్తితో ప్రసిద్ధికెక్కిన అసమాన తేజోవంతులైన ఆ గురుపుత్రులందరికీ చేతులు జోడించి నమస్కరించాడు త్రిశంకుడు. వారి శరణుజొచ్చానని, వారే తన రక్షకులని, దేహంతో స్వర్గానికి పోవాలన్న తన కోరికను తీర్చుకునేందుకు యజ్ఞం చేయించమని అడిగితే వారి తండ్రి ఒప్పుకోనందున అవమాన పడ్డానని అంటాడు. ’గురు పుత్రులారా, మీ పాదాలపై నా శిరస్సుంచి మొక్కుతాను. పరమ తపస్వులారా నన్ను రక్షించండి. నేను ఈ దేహంతో స్వర్గానికి పోయే యాగాన్ని నాతో చేయించండి. మీ తండ్రి నేను రాజునని మరిచి-రాజుల కార్యం నెరవేర్చడం పురోహితుల ధర్మమని ఆలోచించకుండా నన్ను ధిక్కరించాడు. ఇక మీరే నాకి దిక్కు. ఇక్ష్వాకుల రాజ వంశానికి పురోహితులైన మీరే ఈ కార్యం నాతో చేయించకపోతే, మీరు పురోహితులా వుండి ఏం ప్రయోజనం’ అని వశిష్థుడి కొడుకులతో నిష్టూరంగా మాట్లాడుతాడు త్రిశంకుడు".

Sunday, February 21, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-56 : వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-56
వశిష్టుడి విజయం గాయత్రీ విజయమే
వనం జ్వాలా నరసింహారావు

అయినా ఆగని విశ్వామిత్రుడు పొగరుబోతు మాటలాడుతూ-అక్కడే నిలబడమని-ఇంకెక్కడికీ పోలేవని అంటూ, తనదగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు. తనపైకొస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని నీచ క్షత్రియుడా అని సంబోధిస్తూ: తనక్కడే నిలుచున్నాననీ-ఆతడి బలమెంతో, చలమెంతో, శస్త్రాస్త్రాల పాండిత్యమెంతో చూపమని-ముందు వాటన్నిటినీ భస్మం చేసి ఆతర్వాత ఆతడిని భూమి మీద లేకుండా చేస్తానని-క్షత్రియ బలానికి, బ్రాహ్మణ బలానికి తేడా అతడికి తెలియదని-దివ్యమైన బ్రాహ్మణ బలాన్ని ఇక చూపబోతున్నానని, అంటూనే, విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మ దండంతో చల్లార్చాడు".

          "అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు, వారుణాస్త్రం-రౌద్రాస్త్రం-పాశుపతం-ఐషీకం-స్వాపనం-గాంధర్వం-మోహనం-మానవం-జృంభణం-మాదనం- సంతాపనం- విలాపనం- శోషణం- దారణం- జయించలేని వజ్రశరం – బ్రహ్మపాశం – కాలపాశం – వారుణపాశం - దండం-పైశాచం-దయితం-రెండశనులు-క్రౌంచాస్త్రం-శుష్కం-ఆర్థ్రం – పైనాకం - ధర్మచక్రం - భయంకరమైన కాలచక్రం – విష్ణుచక్రం – మథనం – వాయవ్యం – హయశిరం - రెండు శక్తులు – ముసలం - కంకాళం-కాలాస్త్రం-వైద్యాధరం-కాపాలం-త్రిశూలం-కంకణాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు. వీటన్నిటినీ బ్రహ్మ సుతుడైన వశిష్ఠుడు తన బ్రహ్మ దండంతో హరించివేశాడు. తన అస్త్రాలన్ని వ్యర్థమై పోవడంతో, దీర్ఘమైన కోపంతో, భయంకరాకారుడై, దేవతా గణం-ముల్లోకాలు భయపడుతుండగా, బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు.

తనమీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు, చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకొని, దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే, దాన్ని మింగాడు.బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలిభయంకరంగా కనిపిస్తుంటే, ఆయన రోమకూపాలనుండి, అగ్నిజ్వాలలు ప్రవహించసాగాయి. ఆ మహా ఋషి శ్రేష్టుడిని, ఋషీశ్వరలందరు ప్రార్థించారు. వశిష్ఠుడి తపో బలమింతని చెప్పలేమని, సత్కీర్తిగల ఆయన తన తేజస్సును శమించజేయాలని, బ్రాహ్మణోత్తముడైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా. ఇలా తనను ఋషీశ్వరులందరు కోరడంతో, వశిష్ఠుడు శాంతించాడు. ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏంచేయాల్నో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు. తన క్షాత్రం వ్యర్థమయిందని, అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని, వాటితో తనకింక అవసరం లేదని, బ్రాహ్మణుడై-శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించినందువలనే కదా వశిష్ఠుడికింత మహాత్మ్యం కలిగిందని అనుకుంటాడు. తనుకూడా శాంత చిత్తుడై, ఇంద్రియాలను జయించి, బ్రాహ్మణుడు కావడానికి ప్రయత్నించాలని అనుకొని, తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు".


(వశిష్టుడి గురించి చెప్పేటప్పుడు వాసుదాసుగారు రాసిన పద్యాల్లో, ఆయన్ను "జపివర్యుడు", "జపశీలుడు" అనే విశేషణాలను ప్రయోగించారు. ఇలా ప్రయోగించడంలో వక్త-వ్యాఖ్యాత వుద్దేశం, వశిష్ఠుడి మహాత్మ్యానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే. ఆయన జపించే మంత్రం "గాయత్రి" యే. గాయత్రీ మంత్రమే బ్రహ్మాస్త్రం. అది జపించడం వల్లే, వశిష్ఠుడింతటి మహాత్మ్యంగలవాడయ్యాడు. ఇంకో క్షత్రియుడయితే, బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే. ఒకవేళ అతడికి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రువు అస్త్రాన్ని అణచి వేయొచ్చు.ఇవేవీలేకుండా,వశిష్ఠుడు దాన్నిమింగి జీర్ణించుకున్నాడు. తపోబలంతో, జపబలంతో, బ్రాహ్మణ్యంతో వశిష్థుడి దేహమే బ్రహ్మమై వుండగా, ఆయన్నెవరేం చేయగలరు? కార్చిచ్చుమీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదేజరిగింది వశిష్ఠ-విశ్వామిత్రుల మధ్య జరిగిన "ఆత్మ-అనాత్మల" యుద్ధంలో. వశిష్ఠ విజయం నిజానికి గాయత్రీ విజయమే. అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే, శ్రీమద్రామాయణం-శ్రీ మధాంద్ర వాల్మీకిరామాయణం. అందుకే ఇవి సర్వోత్కృష్ట  గ్రంథాలని వేరే చెప్పాల్సిన పనిలేదు.


గాయత్రీ బీజసంయుతమైన వాల్మీకిరామాయణంలో, ప్రతి అక్షరానికి, గాయత్రీ మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో, అంతే మహిముంది. వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం, బ్రాహ్మణ క్షత్రియ యుద్ధం మాత్రమేకాదు. ఆత్మవిద్యకు, అనాత్మవిద్యకు మధ్యజరిగిన యుద్ధం.సంపూర్ణంగా అనాత్మవిద్య నేర్చుకున్నప్పటికీ, వాడు,ఆత్మవంతుడిని గెలవలేడు. విద్యావంతుడి దౌష్ట్యం, ఆత్మవంతుడి సాధుస్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది. వశిష్ఠుడు, ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడుకాని, తన ఉప్పుతిని-కృతఘ్నుడై-దివిటీ దొంగలా తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్నవాడినీ, తన ఆశ్రమాన్నంతా పాడుచేసి తనను చంపే ప్రయత్నం చేసినవాడినీ, దెబ్బకు-దెబ్బ అనిగూడా కీడుతలపెట్టలేదు. ఇదే ఆత్మవంతుడైన బ్రాహ్మణుడి లక్షణం. బ్రాహ్మణుడు ఇతరులవల్ల నష్టపడినాగాని, పరులకు హానితలపెట్టడు. వశిష్ఠుడు ఇంతజరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు).

Saturday, February 20, 2016

బాలకాండ మందరమకరందం సర్గ-55 : వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం : వనం జ్వాలా నరసింహారావు

బాలకాండ మందరమకరందం
సర్గ-55
వశిష్ఠ విశ్వామిత్రుల యుద్ధం
వనం జ్వాలా నరసింహారావు

          "విశ్వామిత్రుడి భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు, యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు. వెంటనే హుంకరించిన కామధేనువు తన పొదుగులోంచి కాంభోజ సేనలను, యోనినుండి పప్లవ సమూహాలను, పేడ పుట్టే ప్రదేశంనుండి యవనులను, రోమ కూపాల (వెంట్రుక గూళ్లు) నుండి శకులను, మ్లేచ్ఛులను, కిరాతులను సృజించింది. వారందరు శత్రు సేనలపై పడి, వారి రథాలను-ఏనుగులను-గుర్రాలను-సైన్యాన్ని నాశనం చేసారు. అది చూసిన విశ్వామిత్రుడి నూర్గురు కొడుకులు, మితిమీరిన కోపంతో, ఒకేసారి వశిష్ఠుడిమీదకు దూసుకొచ్చారు. ఆయన వెంటనే హుంకరించి నిమిషంలో వంద మందినీ బూడిద రాసులుగా చేశాడు. తన నూర్గురు కొడుకులు ఒకేసారి మరణించడంతో-సైన్యమంతా నుగ్గుకావడంతో, సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడిని గెలిచేదెలానని మధన పడి, విషాదంతో భూమిపై వాలాడు. వేగంలేని సముద్రంలా, కోరలు పీకిన సర్పంలా, గ్రహణం నాటి సూర్యుడిలా, రెక్కలూడిన పక్షిలా కాంతీహీనుడై-గర్వభంగమై, ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో, రాజ్యభారాన్ని కొడుకుకప్పగించి, వీరుడైన విశ్వామిత్రుడు హిమవత్పర్వతానికి పోయి, శివుడికొరకు తపస్సు చేశాడు.


శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాల్నో కోరుకొమ్మన్నాడు. భక్తజనుల సంకటాలను హరించేవాడని, పార్వతీ ప్రియుడని, కఠినాత్ములైన రాక్షసులను సంహరించేవాడని, హరా-త్రిపుర సంహారా అని, మన్మథుడి గర్వం హరించినవాడని, దేవతల పూజలందుకునే చరణాలుగలవాడని శివుడిని స్తోత్రం చేసి, నమస్కరించి, విలువిద్యనంతా అంగాలతో-ఉపాంగాలతో-మంత్రాలతో-వాటి రహస్యాలన్నిటితో తనకు ఉపదేశించమని చేతులు జోడించి ప్రార్థించాడు విశ్వామిత్రుడు. రాక్షసుల వద్ద, మునుల వద్ద, గంధర్వుల వద్ద, యక్షుల వద్ద, దేవతల వద్ద వున్న అస్త్రవిద్యలన్నీ తనకుపదేశించమని కోరాడు. ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి పోయాడు. అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో-గర్వంతో విశ్వామిత్రుడు పున్నమినాటి సముద్రిడిలా పొంగిపోతూ, దూరపుటడుగులు వేసుకుంటూ, వశిష్ఠుడున్న ఆశ్రమానికి వచ్చాడు"


          "సకల శత్రువులను జయించిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడి తపోవనమంతా, స్వల్ప వ్యవధిలో, బలిష్టమైన తన దివ్యాస్త్రాల జ్వాలల్లో కాల్చి బూడిద చేశాడు. అది సహించలేని అక్కడి మునులందరు, నలు దిక్కులా పరుగెత్తారు. పక్షులన్నీ ఆకాశానికి ఎగిరిపోయాయి. శిష్యులు భయంతో వణికిపోయారు. రెప్పపాటులో ఆ వనమంతా అలా కావడంతో కోపగించిన వశిష్ఠుడు, సూర్యుడు మంచును కరిగించినట్లు, అవలీలగా విశ్వామిత్రుడిని రూపుమాపుతాననీ, ఎవరూ పోవద్దనీ అన్నా, ఆగకుండా వారంతా పరుగెత్తారు. ఎవరుకూడా అక్కడ నిలవకుండా పారిపోతుండడంతో, రోషావేశంతో కనుబొమలదురుతుంటే, విశ్వామిత్రుడిని మందలించాడు వశిష్ఠుడు. ఆతడి విజృంభణాన్ని ఆపలేనివాడిననుకొని, చిరకాలంనుండి పెంచుకుంటున్న తన తపోవనాన్నంతా కాల్చివేసిన చెడుబుద్ధిగల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ, సాధ్యంకాని తేజస్సుతో అతన్ని తేరిపార చూశాడు వశిష్ఠుడు. ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా, అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో, వశిష్ఠుడు తనదగ్గరున్న రెండవ యమదండంలాంటి-కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మ దండాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడకుండా నిలబడ్డాడు