Showing posts with label పప్పు నరసింహమూర్తి. Show all posts
Showing posts with label పప్పు నరసింహమూర్తి. Show all posts

Sunday, February 28, 2010

వివాహబంధం-XI: మంగళ సూత్ర ధారణ- శత మానములు-తలంబ్రాలు-బ్రహ్మ ముడి:వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-XI
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

"మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా !”
వనం జ్వాలానరసింహారావు

వివాహం అయినప్పటి నుంచీ, మహిళలు "మంగళ సూత్రం" ధరించడం భారతీయ సంప్రదాయం-హిందువుల ఆచారం. ఈ ఆచారం ఈనాటిది కాదు. పెళ్ళి నాడు వరుడు వధువుకు తాళికట్టే సాంప్రదాయం అనాదిగా వస్తున్నది. మంగళ సూత్రం అనే శబ్దం సంసృతం నుండి పుట్టింది. సంసృతంలో 'మంగళ' అంటే శోభాయమానం అని, శుభప్రదం అనీ అర్ధాలున్నాయి. సూత్రం అంటే తాడు ఆధారమైందని అని అర్థం. సాధారణంగా మంగళసూత్రాన్ని సన్నని పోగులు, దారాలు కలిపి దానికి పసుపు రాసి తయారు చేస్తారు. ఇలా కలపబడిన తొమ్మిది లేదా పదకొండు దారాలతో (లేదా ఎవరెవరి ఆచారం ప్రకారం వారి పద్ధతిలో) తాళిని తయారు చేస్తారు. మంగళ సూత్ర ధారణకు ముందు, విజయలక్ష్మి పెద్ద మేనమామ గారి (భండారు పర్వతాల రావు గారు-ఆయన అత్యవసరమైన అధికారిక పనులుండడం వల్ల పెళ్లికి హాజరు కాలేక పోయారు) భార్య, భండారు సరోజినీ దేవి గారు, పెట్టిన "మధు పర్కం చీరె" ను, వధువుతో ధరింపచేసేందుకు లోనికి తీసుకెళ్లారు. వధూవరులు ఇద్దరూ మధుపర్క ధారణతో మంగళ సూత్ర ధారణ కార్య క్రమానికి సిద్ధమవడం ఆచారం.

సమస్త శుభాలకు, మంగళ ప్రదమైన కర్మలకు నిలయమైంది కాబట్టి, దీనికి, మంగళ సూత్రం అని పేరొచ్చింది. మంగళ సూత్రాలకు గౌరీ దేవి అనుష్టాన దేవత. దీన్నే "శత మానములు" అని కూడా అంటారు. బంగారంతో చేయబడ్తాయివి. రెండు సూత్రాలలో (శత మానములు) ఒకటి అత్తింటి వారు, ఇంకోటి పుట్టింటి వారు చేయించడం ఆచారం. ఏం జరుగబోతుందని ఎదురుచూస్తున్న మాకు మంగళ వాయిద్యాలు మారుమోగుతుంటే, పురోహితుడి గొంతు వినిపించింది: ""మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా ! కంఠే మిద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం !!"". నా చేతికిచ్చిన మంగళ సూత్రాన్ని, వధువు మెడలో ధారణ చేయించారు, పురోహితుడు ఆ మంత్రం చదువుతుండగా. మూడు ముళ్లు వేయమన్నారు-అర్థం చెప్పారు కూడా. మూడు ముళ్లంటే, మూడు లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ-రజ-తమో గుణాలకు సంకేత మన్నారు. చదివిన మంత్రానికీ అర్థముంది-అదీ విడమర్చి చెప్పారు పురోహితులు. "ఓ సుందరీ ! ఈ మంగళ సూత్రాన్ని, నేను నీ మెడలో కడుతున్నాను. ఇది సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. నా జీవితం దీనిపైనే ఆధారపడి వుంది. నీవు శతాయుర్ధాయం కలదానివిగా వుండు" అని మంగళ సూత్ర ధారణ అవుతూనే వేద పండితులు ఆశీర్వదించారు."శతమానం భవతి, శతాయుః పురుష !" అనే మంత్రాన్నీ చదివారు. అందుకే, వీటికి "శత మానములు" అని పేరొచ్చింది.

పుట్టినింటికి, మెట్టినింటికి గౌరవ మర్యాదలు-పరువు ప్రతిష్టలు స్త్రీల వలనే లభిస్తాయి. పుట్టింట్లో పెరిగి, అత్తగారింటికి చేరి, బరువు-బాధ్యతలు స్వీకరించిన స్త్రీకి పుట్టిల్లు-అత్త గారిల్లు రెండు కళ్ల లాంటివి. ఉభయ వంశాలకు మంచి కీర్తిని చేకూర్చి పెట్టగలను అని తెలియ చేసేందుకే రెండు సూత్రాలను మహర్షులు నిర్ణయించారని హిందువుల నమ్మకం. భర్త సుఖ దుఃఖాలు తనవేనని, పుట్టింటి-అత్తింటి వారి మంచి-చెడులు తనవేనని, ధర్మ మోక్షాలు-అర్థ కామాలు తన సంబంధం ద్వారా భర్తకు లభింప చేయనున్నానని, సంపదకు-సంతానానికి తనే కారణమవుతాననే విషయాలు ఎల్లవేళలా గుర్తుండే విధంగా ప్రవర్తించడానికి మంగళ సూత్రాలను వధువు ధరిస్తుందని హిందువుల నమ్మకం.

మాంగల్య ధారణ అనంతరం అత్యంత కోలాహలంగా-ఇరువైపు బంధుమిత్రుల మధ్య పోటీలాగా జరిగే తంతు వధూ-వరులు "తలంబ్రాలు" పోసుకోవడం. ఎందుకంటే, వధూవరులుతో పాటు, బంధుమిత్రులకు కూడా చక్కటి వినోదాన్ని-ఆనందాన్ని కలిగించే కార్యక్రమం ఇది. మంగళ సూత్ర ధారణ పూర్తైన తరువాత తలంబ్రాల అక్షతలు తల మీదుగా పోసుకోవడం హిందూ సాంప్రదాయం. దీనిని అక్షతా రోహణం అని కూడా అంటారు కొందరు. 'క్షత' అంటే విరుగునది- 'అక్షత' అంటే విరగనిది. అంటే, "వివాహ బంధం" విడదీయరాని బంధం కావాలని భావం. "తలన్+బ్రాలు" అంటే తల నుండి క్రిందికి జారేవి అని కూడా అర్థం. అర్థాలు ఏవైనా, ఇదొక ఆనంద ప్రదమైన ఆచారం. వధూవరుల గృహస్థా శ్రమ జీవితం శుభప్రదంగా, మంగళ ప్రదంగా వుండాలని "మంగళ ద్రవ్యాలతో" చేయించే పవిత్రమైన వైదిక ప్రక్రియ ఇది. పసుపు-బియ్యం-నెయ్యి-ఆవు పాలు అనే మంగళ ద్రవ్యాలతో ఈ తంతు జరిపిస్తారు.

కన్యను దానం చేస్తున్నానని పలికేవాడు అగ్ని. తథాస్తు అనే వాడు వాయువు. దంపతులు చాలా బాగున్నారని అనే వాడు చంద్రుడు. ఇవన్నీ నిజమే అని వంత పలికే వాడు-ఆనందించే వాడు సూర్యుడు. ఇవన్నీ అర్థం వచ్చే రీతిలో పురోహితుడు చెపుతున్న మంత్రాల మధ్య, నా (వరుడి) చేతితో కొబ్బరి చిప్పలో తీయించిన తలంబ్రాలు వధువు తలపైన మొదలు పోయించారు. "నీవలన నాకు సంతానం అభివృద్ధి చెందుగాక" అని నాతో (వరుడితో) అనిపించారు పురోహితుడు. దానికి వధువు సమాధానం చెప్పకుండా, అంగీకార సూచకంగా, పురోహితుడు చెప్పిన పద్ధతిలో, నాలాగనే తలంబ్రాలు తీసుకొని, నా శిరస్సుపై పోస్తుంది. మొదటిసారి అలా పోస్తున్నప్పుడు, "పుట్టబోయే సంతానానికి పాల కొరకు" అన్న అర్థం వచ్చే రీతిలో, "నా పశు సంపద అభివృద్ధి చెందుగాక" అని వధువుతో చెప్పించారు. దీనికి అంగీకార సూచకంగా వరుడు తలంబ్రాలు పోయాలి. ఇలా మూడు పర్యాయాలు ఇలాంటి అర్థస్ఫూర్తిగల మంత్రాల చదువుతుంటే, వధూవరులు తలంబ్రాలు పోసుకుంటారు. చివరికి అదొక పోటీలాగా ఒకరి శిరస్సుపై మరొకరు పోసుకోవడం ఇటీవలి కాలంలో ఆచారంగా మారింది. కొందరు (వరుడు-వధువులలో ఒకరు)దూకుడుగా-ఉత్సాహంగా, తలంబ్రాల పళ్లెం ఎత్తి శిరస్సుపై కుమ్మరించడం కూడా పరిపాటై పోయింది. మేమిద్దరం ఇంకా చిన్నవాళ్ల మే అయినందున, అంతవరకూ రానివ్వలేదని జ్ఞాపకం.

ఈ తంతు ముగిసిన తర్వాత, "బ్రహ్మ ముడి" వేడుక జరిగింది. వధువు చీరె కొంగు అంచును, నా ఉత్తరీయం అంచుకు కలిపి ముడివేశారు. బ్రాహ్మణుల ఆశీర్వచనాలను దంపతుల కొంగులలో ముడి వేయడం అనే భావన వుందిందులో. ఇకనుంచి, ఇరువురం కలిసి-మెలిసి అన్ని కార్యక్రమాలు నిర్వహించాలని, "ఇంటి యజమానురాలు" గా అన్ని బాధ్యతలు స్వీకరించి, నీ ఇంటిని నువ్వే చక్కదిద్దు కోవడానికి రమ్మని, వేద మంత్రాల ద్వారా వధువుని కోరాను. కేవలం పద్నాలుగు సంవత్సరాల వయస్సులోనే, ఇరవై ఒక్క ఏళ్లు కూడా నిండని నేను అప్పగించిన ఆ బరువైన బాధ్యతను, మా ఇంటి పెద్ద కోడలుగా, ఆ నాటినుంచి ఈ నాటి వరకూ, "దాంపత్య ధర్మం" అంటే ఇదీ సుమా !-ఇలా వుండాలనే ఆదర్శ పద్ధతిలో నిర్వహిస్తూ వస్తున్నది ఆ నాటి వధువు వనం విజయలక్ష్మి తన ఆడబిడ్డలు, మరుదులు, అత్తమామలతో సహా ఇద్దరు కూతుళ్లు-ఒక కొడుకు, ఇద్దరు మనుమలు, ముగ్గురు మనుమ రాళ్లతో. (Part XII Next Follows)

Saturday, February 27, 2010

వివాహబంధం-X: చేతిలో కొబ్బరి బోండాతో గంపలో వధువు-మేనమామల ప్రాముఖ్యం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-X
శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

సుముహూర్తం వేళ మహా సంకల్పం-కన్యా దానం
వనం జ్వాలానరసింహారావు

గౌరీ పూజ దగ్గర గోత్రం-ప్రవరల వేడుక ముగిసిన పిదప, వధువు మేనమామలు పెళ్ళి కూతురిని గంపలో కూర్చొబెట్టి వివాహ వేదిక పైకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చాలా సరదాగా వుంటుంది. అప్పటికే-నాకు గుర్తున్నంతవరకు- సీతారాముల కళ్యాణం సినిమాలోని "సీతారాముల కళ్యాణము చూతము రారండీ..." అన్న పాట, రక్త సంబంధం సినిమాలోని "బంగారు బొమ్మ రావేమే, పందిట్లొ పెళ్ళి జరిగేనే..." అన్న పాటలు ప్రతి పెళ్ళిలోనూ వాయించడం తప్పనిసరిగా జరుగుతుండేది. కన్యా దాత స్వగ్రామానికి చెందిన సన్నాయి వాయిద్యం బృందం ఆ జిల్లాలో పేరొందిన వారు. వారీ పాటలను మధురంగా పాడినట్లు జ్ఞాపకం. వధువు విజయలక్ష్మిని గంపలో చేతిలో కొబ్బరి బోండాతో కూచోబెట్టి వివాహ మండపం మీదికి ఆమె మేనమామలు భండారు రామచంద్ర రావు, భండారు శ్రీనివాస రావు తీసుకొచ్చారు. ఇందులోనూ ఒకరకమైన సామాజిక స్పృహ కనిపిస్తుంది. తల్లి తర్వాత మేనమామలు ముఖ్యమని తెలియచేయడమే దీని అర్థం. గంపలో ధాన్యం కూడా పోస్తారు. కొబ్బరి బోండా మానసిక స్వచ్ఛతకు చిహ్నం. అలానే, అందులోని పీచులాగా, ఎల్లవేళలా ఇరువురు విడిపోకుండా, అల్లుకు పోయి జీవిస్తామని-సత్ సంతానం కలవారమవుతామని సంకేతం కూడ ఈ వేడుకలో వుందంటారు పెద్దలు.

కళ్యాణ వేదిక పైన వున్న వరుడి కాళ్లు కడిగే కార్యక్రమం, వివాహంలో, అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న మరో ముఖ్యమైన ఘట్టం. కన్యాదాతేమో వయసులో పెద్ద-వరుడేమో చిన్నవాడు. అయినా కాళ్లు కడిగే ప్రక్రియ వుందంటే దానికి సాంప్రదాయ బద్ధమైన అర్థం వుండి తీరాలి. కన్యా దాత వరుడి కాళ్ళు కడుగుతున్నప్పుడు ఆయన తేజస్సు తరిగి పోకుండా పురోహితుడు ఒక మంత్రాన్ని చెప్పుతాడు. "నా లోని తేజస్సు, శక్తి, కీర్తి, బలం సుస్థిరంగా వుండుగాక" అన్న అర్థం వచ్చే మంత్రం అది. అది కన్యా దాత ఉచ్చరిస్తూ, ఇచ్చిన "అర్ఘ్యాన్ని" (మంచి నీరు) స్వీకరిస్తాడు వరుడు. కన్యా దాత వరుడి కాళ్ళు కడిగి నందువల్ల, చిన్నవాడైన వరుడు, తనలోని కాంతి తరిగిపోకుండా వుండేందుకు, ఆచమనం చేసి, దానికి తగ్గ మంత్రాన్ని చదివిస్తారు. ఆచమనం చేస్తూ, వరుడితో, " ఓ ఉదకములారా, మీరు నాకు గొప్ప కీర్తిని-పాడి పంటలను ఇచ్చి, అందరు ఇష్టపడేవాడిని చేసి, రక్షించండి" అని చెప్పిస్తారు. వధువుని గంపలోనే వుంచి మహా సంకల్పంతో ఆరంభించి, తర్వాత జరగాల్సిన వేడుక మొదలు పెట్టారు పురోహితులు.

వధూవరులు సాక్షాత్తు "లక్ష్మీ-నారాయణ స్వరూపులు" గా భావించుతారు కాబట్టి, అందరి లాగే మాదీ ఆ విధంగానే "లక్ష్మీ నారాయణుల కల్యాణం" లా జరిపించారు. "మహా సంకల్పం" చెప్పడం, సృష్టి క్రమంతో మొదలుపెట్టి, పరమేశ్వరుడి శక్తి-సామర్థ్యాలు అనంతమని-అచింత్యాలని, ఆయన అనుగ్రహంతోనే యావత్ సృష్టి జరిగిందని కొనసాగింది. మానవుడి మేథస్సు ఊహించనలవికాని పరిమాణంలో వున్న ఈ జగత్తు, పరమేశ్వరుడి ఆద్యంతాలు లేని రూపంలో ఒక అతి చిన్నదైందని పురోహితుడంటాడు. అఖిలాండ బ్రహ్మాండంలో, అనేకానేక చిన్న-చిన్న గోళాలున్న ఖగోళంలోని అత్యంత సూక్ష్మమైన భూగోళంలో, భరత ఖండంలో, మారు మూలనున్న మానవుడు, అణు పరిమాణంలో వున్న చిన్న భాగమని తెలియచేసే దే మహా సంకల్పం. ఇది చెప్పడం ద్వారా, పరమాత్మ స్వరూపాన్ని ఎరుక పరిచి, మానవుడి అహంకారాన్ని తగ్గించుకోమని, వినయ సంపదను పెంచుకోమని సూచించడం జరుగుతుంది.

మహా సంకల్పం విశ్వ స్వరూపాన్ని, ఖగోళ స్థితిని చక్కగా వివరిస్తుంది. భూమండలాన్ని పరిపాలించిన షోడశ మహారాజులు, షట్చక్రవర్తులు, సప్త ద్వీపాలు, నవ వర్షాలు, నవ ఖండాలు, దశారణ్యాలు, యాభై కోట్ల విస్తీర్ణం గల జంబూ ద్వీపం, అందులో భరత వర్షం-భరత ఖండం, దానిలో ఈ కన్యాదానం ఎక్కడ చేస్తున్నది కన్యా దాత పేర్కొంటాడు. అలాగే బ్రహ్మ కాలమాన ప్రకారం యాభై సంవత్సరాలు పూర్వార్థం గడవగా, యాభై ఒకటవ సంవత్సరంలో, మొదటి మాసంలో, మొదటి పక్షంలో, మొదటి పగటిలో బ్రహ్మకు ప్రాణాయామ కాలం ప్రస్తుతం జరుగుతున్నట్లు చెప్పి తొమ్మిది కల్పాలలోని శ్వేత వరాహ కల్పంలో, పద్నాలుగు మన్వంతరాలలో ఏడవదైన వైవస్వత మన్వంతరంలో-శాలివాహన శకంలో-ఇరవై ఎనిమిదవ మహా యుగంలో-కలియుగంలో-ఫలానా సంవత్సరంలో-ఫలానా మాసంలో-ఫలానా తిది రోజున, ఈ సుముహూర్త సమయంలో శ్రీ లక్ష్మీనారాయణ ప్ర్రీతి కోసం సర్వాలంకార భూషితైన ఈ కన్యను దానం చేస్తున్నాను అని కన్యా దాత చెప్పే సంకల్పం ఇది. ఈ కన్యాదానం వల్ల తనకు బ్రహ్మ లోకంలో నివసించే యోగ్యత సిద్ధించాలని, అగ్ని,స్తోమ, వాజపేయాది యాగాలు చేసిన పుణ్య ఫలం లభించాలని, తనకు వెనుక- ముందు పది తరాల వాళ్ళు బ్రహ్మ లోకంలో నివసించాలని కన్యా దాత సంకల్పం చేస్తాడు.

ఇక ఆ తర్వాత, "కన్యా దానం" తంతు మొదలయింది. అంటే, ముహూర్తం సమయం దగ్గరపడుతున్నదని అర్థం. "కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం! దాస్వామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగీషియా" !! అన్న వాక్యాలు పురోహితుడి నోటి వెంట వెలువడ్డాయి. దీని అర్ధం-"ఈమె బంగారం వంటి మనస్సు కలది. కనకం వంటి శరీర చాయ కలది. శరీరమంతా ఆభరణాలు కలిగినది. నా పిత్రాదులు సంసారంలో విజయం పొంది శాశ్వత ప్రాప్తి పొందినట్టు శృతి వలన విన్నాను. నేనూ ఆ శాశ్వత బ్రహ్మలోకప్రాప్తి పొందేందుకు విష్ణురూపుడైన నీకు నా పుత్రికను కన్యాదానం చేస్తున్నాను" అని కన్యా దాత అంటారు. ఇంకా ఇలా చెప్పారు కన్యా దాత: " సమస్త ప్రపంచాన్ని, అఖిలాండ బ్రహ్మాండాలను భరించే శ్రీ మహావిష్ణువు-పంచభూతాల-సర్వ దేవతల సాక్షిగా, పితృదేవతలను తరింపచేసేందుకు, ఈ కన్యను దానం చేస్తున్నాను. సౌశీల్యం కలిగి, బుద్ధిమంతుడి వైన నీకు, ధర్మార్థ కామాలు సిద్ధించేందుకు, సాలంకృత సాధ్వియైన ఈ కన్యను సమర్పించుకుంటున్నాను". ఇలా అంటూ, మా మామ గారు (కన్యా దాత) నా (వరుడి) చేతిలో నీళ్లు పోసి మరో మాటంటారు. "నీకు దానం చేసినప్పటికీ, ఈ కన్య నా కుమార్తే సుమా!" అని. ఇలా అంటూనే, "ధర్మేచ, అర్థేచ, కామేచ, ఏషా నాతి చరితవ్యా" అని ప్రతిజ్ఞ చేయించారు కన్యా దాత నాతో. దీనికి సమాధానంగా, "నాతి చ రామి" అని నాతో చెప్పించారు. సుముహూర్తం వచ్చేస్తున్నదన్న మాట.

మా ఇద్దరినీ (వధూ-వరులను) కళ్యాణ వేదికపై, తూర్పు-పడమర ముఖంగా కూచోబెట్టి, మా మధ్య ఉత్తర-దక్షిణ ముఖంగా తెరను అడ్డం పెట్టి, ఇరువురి చేతికి "జీల కర్ర- బెల్లం" కలిపిన ముద్దను ఇచ్చాడు పురోహితుడు. పెళ్ళిచూపుల కార్యక్రమం పూర్తి అయిన పిదప, అమ్మాయి-అబ్బాయిల జాతకాల ననుసరించి జ్యోతిష్యంలో అనుభవమున్న పండితులతో పెళ్ళికి తగిన ముహూర్తం నిర్ణయించ బడుతుంది. వారు నిర్ణయించిన ముహూర్తానికి వరుడు-వధువు ఒకరి తలపై ఇంకొకరు "జీలకర్ర-బెల్లం" పెట్టడం జరుగుతుంది. నిజానికిదే సుముహూర్తం (జీల కర్ర-బెల్లం శిరస్సుపై వుంచడం). మంగళ వాయిద్యాలు మోగిస్తుంటే, పురోహితుడు మంత్రాలు చదువుతుంటే, గౌరీ దేవిని ధ్యానించుకుంటూ వధువు ( విజయలక్ష్మి), నేను (వరుడు) ఏక కాలంలో నిర్ణయించిన ముహూర్తానికి (ఏప్రిల్ 30, 1969 న, ఉదయం సరిగ్గా 9-58 కి), ఒకరి శిరస్సు మీద మరొకరం (బ్రహ్మ రంధ్రం మీద) జీల కర్ర-బెల్లం కలిపిన ముద్దను వుంచాం. సుముహూర్త కాలంలో పెద్దల ఆశీర్వాదాన్ని పొందాం. పురోహితుడి తర్వాత, తల్లి-తండ్రులతో మొదలయ్యి, పెద్దలందరూ అక్షితలు చల్లారు మా దంపతులు మీద.

జీల కర్ర-బెల్లం ముద్దను వధూవరులు పెట్టుతున్న సమయంలో, పురోహితుడు చదివిన మంత్రానికి, "వరుణుడు, బృహస్పతి, మీకు శాశ్వతమైన స్థానాన్ని ఇచ్చెదరు గాక ! అగ్ని దేవతలు మిమ్ములను దీవించెదరు గాక ! పంచభూతాలు స్థిరంగా వుండు గాక ! ఈ సుముహూర్తం మీకు శుభ ముహూర్తం అగుగాక !" అని అర్థం వస్తుంది. జీల కర్ర-బెల్లం మిశ్రమంలో పరస్పరాకర్షణ వుంటుందని మన పెద్దలు చెప్పడమే కాకుండా, శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. ఇక వధూవరులమైన మేమిద్దరం, ఆ తర్వాత, సకల దేవతలకు నమస్కరించి, "నూతన దంపతులమైన మా ఇరువురి ప్రేమానుబంధం చాలా గొప్పది. మా బంధాన్ని పితృదేవతలు కూడా ఆశీర్వదించారు. వారి ఆశీస్సులతోనే మేం భార్యా-భర్తలం అయ్యాం. ఈ శుభ సమయంలో బంధువులైన మీరందరూ ఆనందంగా వుండండి. వధువు బంధువులు కొద్దిగా మానసిక ఆందోళనకు గురికావడం సహజమే" అని మంత్రాల ద్వారా మాతో అనిపించాడు పురోహితుడు. కాళ్ళు తొక్కించడం: కన్యాదానం చేసేది వరుడు వధువుతో కలిసి సహజీవనం చేస్తూ గృహస్థుడై అభివృద్ది చెందవలెనని మంత్రంతో కన్యను వరుడికి అప్పగించే కార్యక్రమం కూడా ముగిసింది.

ఇక ఇక్కడినుంచి మాంగల్య ధారణ తంతు మొదలయింది.(Part XI Next Follows)

Thursday, February 25, 2010

వివాహబంధం-V: నిశ్చితార్థం-లగ్న నిశ్చయం-శుభ లేఖలు-పెళ్లిపనుల ఆరంభం: వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-V
శ్రీ పప్పు లక్ష్మీనరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"

పెళ్లినాటి ప్రమాణాలు అమలుకు ముహూర్త బలం ముఖ్యం
వనం జ్వాలానరసింహారావు

ఖమ్మం మామిళ్ళగూడెంలోని మా ఇంట్లో మాటా-మంతీ అయిపోయి, ఒకరి వంశ క్రమం గురించి మరొకరు అవగాహన కొచ్చిన తర్వాత, ఆచారం ప్రకారం తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని ఖరారు చేసుకున్నారు. రెండు నెలల తర్వాత మార్చ్ 30, 1969న ఆడపిల్ల వారింట్లో కలిసి, ముహూర్తాలు పెట్టుకోవాలని, నిర్ణయించుకున్నారు. బ్రాహ్మణుడిని సంప్రదించి పెళ్లి ఎన్నడు జరుగుతే మంచిగుంటుందో అనే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. వివాహంలో ముఖ్యమైన ఘట్టాలలో మొదటిది వాగ్ధానం. అంటే: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం) తర్వాత వర-వరణం. అంటే: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం. నిశ్చితార్థానికే మరోపేరు "నిశ్చయ తాంబూలం". వైదిక మంత్రాల మధ్య వివాహ ప్రక్రియకు పెద్దల ఆశీస్సులు తీసుకోవడానికే ఈ కార్యక్రమం. అందరికీ ఆమోదయోగ్యమైన శుభ ముహూర్తంలో పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహూర్తాన్ని లగ్న పత్రికగా రాయించిన తదుపరి, వధూవరుల తల్లి-తండ్రులు లగ్న పత్రికలు, తాంబూలాలు మార్చుకుంటారు. పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుక వధువు ఇంటిలోగాని, వారేర్పాటుచేసుకున్న వసతి గృహంలోగాని జరుగుతుంది. దీన్నే ఇప్పుడు "ఎంగేజ్ మెంట్" అంటున్నారు. కొందరు ఇటీవలి కాలంలో ఈ తంతును పెళ్లికంటే ఘనంగా జరుపుకుంటున్నారు. నిశ్చితార్థం రోజున అమ్మాయి, అబ్బాయి ఉంగరాలు మార్చుకోవటంతో సగం పెళ్ళి జరిగినట్టు గానే భావిస్తారు.

సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రుల మధ్యన ఇచ్చి-పుచ్చుకోవడాలు అందరి ఇళ్లల్లో ఒకే రకంగా వుంటాయి. తాహతును బట్టి కొంచెం మార్పులు-చేర్పులు వుండొచ్చు. ఇరుపక్షాల వాళ్ళు మరిచిపోవడానికి ఆస్కారం లేకుండా, అరమరికలు లేకుండా, ఒక కాగితం మీద ఇచ్చి-పుచ్చుకోవడాలకు సంబంధించిన వివరాలన్నీ రాసుకోవడం కూడా సంప్రదాయమే.

సాధారణంగా ఆడ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతక ద్రవ్యాలు, వరుడి ధోవతులు, మధు-పర్కాలు (వరుడుకి ఇవ్వాల్సిన బట్టలు), ఉత్తర జంధ్యాలు, భటువు, కాళ్లుగడిగే పళ్లెం-బిందెలు, కల్యాణ వేదికపై వరుడిని కూచోబెట్టే చిన్న బల్ల, వివాహంలో వివిధ సందర్భాలలో (స్థాళీపాకం, నాగవల్లి, సదశ్యం, అప్పగింపులు, మేజువాణి లాంటివి) వరుడికి పెట్టాల్సిన బట్టలు (ధోవతులు, పట్టు బట్టలు, సూట్, పాంట్-షర్ట్ లు లాంటివి), వరుడివైపు బంధువులకు పెట్టాల్సిన బట్టలు, అప్పగింతల బట్టలు, పెళ్ళైన తర్వాత మగ పెళ్ళివారింట్లో గృహప్రవేశం సందర్భంగా-సత్యనారాయణ వ్రతమప్పుడు వధూ-వరులకు పెట్టవలసిన బట్టలు, ఆడ బిడ్డలకు-అత్తగారికి ఇవ్వదల్చుకున్న లాంఛనాలు, పెళ్ళి కూతురుకు ఇచ్చే సారె (సారె పెట్టెలో పెట్టాల్సిన వస్తువులు-ఏభై ఒక్క కొబ్బరి చిప్పలు, ఐదు రవికె గుడ్డలు, రెండుంపావు కిలోల శనగ-సున్నిపిండి, కిలోంబావు పసుపు-అందులో సగం కుంకుమ, చీరె-ధోవతులు, ఐదు రకాల తీపి పదార్థాలు) ముఖ్యమైనవి.

సాధారణంగా మగ పెళ్లివారిచ్చేవి-విధిగా ఇవ్వాల్సినవి: స్నాతకంలో బావమరిదికి పెట్టాల్సిన బట్టలు, పెళ్ళి కూతురుకు పెట్టాల్సిన పట్టు చీరెలు-ఇతర చీరెలు, నగలు-ఆభరణాలు, నల్లపూసలు, పుస్తె (ఒకటి పుట్టింటి వారు, ఇంకొకటి అత్తగారింటి వారు ఇవ్వాలి), మెట్టెలు, ముత్తవుతల్లి (వధువు అమ్మమ్మ) కిచ్చే కట్నం, వధువు తల్లి కడుపు చీరె-తండ్రికి బట్టలు, ప్రధానపు వుంగరం లాంటివి.

వధూవరుల తారా బలం-చంద్ర బలం చూసి ముహూర్తం నిశ్చయిస్తారు. "పెళ్లినాటి ప్రమాణాలు" భవిష్యత్ లో దంపతులు తు. చ తప్పకుండా అమలు చేయాలంటే "ముహూర్త బలం" ముఖ్యమని హిందువుల నమ్మకం. నిశ్చితార్థంలో ప్రధానంగా విఘ్నేశ్వరుడి పూజ వుంటుంది. వివాహ ప్రక్రియ ఆసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. నిశ్చితార్థానికి ముందు బంధువుల సమక్షంలో-పరోక్షంలో వధూవరుల తల్లి-తండ్రుల మధ్య కుదిరిన ఇచ్చి-పుచ్చుకునే ప్రతి చిన్న అంశం ఒక కాగితం మీద రాసుకోవడం కూడా సాంప్రదాయంలో భాగమే. ఇదంతా "ఆచారం-పద్ధతి". అనుకున్నట్లే బంధు-మిత్రుల సమక్షంలో, ఖమ్మం-మామిళ్లగూడెంలోని అయితరాజు రాంరావు గారింట్లో మార్చ్ 30, 1969న మా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం జరిగింది. వధూ-వరుల తారా బలం, చంద్ర బలం ఆధారంగా, మా పురోహితుడు (లంకా సిద్ధాంతి గారు) వారి పురోహితుడిని సంప్రదించి ఏప్రిల్ 30, 1969 న, ఉదయం 9-58 కి లగ్నం నిశ్చయించారు. వాస్తవానికి మా నాన్నగారు నా పుట్టిన తేదీ-తిథి, వార, నక్షత్రాల వివరాలను రాసిపెట్టారు గాని, మా మామ గారు మా అవిడ పుట్టిన తేదీ-తిథి, వివరాలను ఇవ్వలేకపోయారు. అయితే, ఆయన డైరీలో రాసుకున్న తేదీ ఆధారంగా, కూతురు పుట్టినరోజు నవంబర్ 2, 1954 అని చెప్పడంతో దాని ప్రకారమే లగ్న నిశ్చయం చేశారు పురోహితులు.

పెళ్ళి ముహూర్తం దగ్గర పడుతోంది. పెళ్లి సరంజామా కొనడం అనేది ఇరు పక్షాల వారికి కూడా పెద్దపని. పట్టుచీరలు, బంగారు ఆభరణాలు, నూతన వస్తువులు.. .. ఎన్నో కొంటారు. ఇవన్నీ మా వాళ్లూ, వాళ్ల వాళ్లూ నిశ్చితార్థం జరిగిన మర్నాటినుంచి మొదలు పెట్టారు. అప్పట్లో పెళ్లికి అవసరమైన వస్తువులను కొనేందుకు ఖమ్మం జిల్లా వారంతా సాధారణంగా విజయవాడకు వెళ్ళి కొనుగోలుచేసేవారు. అక్కడ వెరైటీలు ఎక్కువే కాకుండా, ధరలు కూడా కొంచెం తక్కువగా వుండేది. నాకు గుర్తున్నంతవరకు, మా నాన్న-అమ్మలు విజయవాడలోను, ఖమ్మం "గెల్లా లక్ష్మినారాయణ-కుంచకర్ర భక్తవత్సల రావు" బట్టల దుకాణంలోను పెళ్ళి బట్టలు కొన్నారు. "కంసాలి బ్రహ్మయ్య" అనే బంగారం వస్తువులు తయారుచేసే వ్యక్తితో పెళ్ళి ఆభరణాలన్నీ తయారు చేయించారు. హైదరాబాద్‌లో పెళ్లికూతురు ఆభరణంలోకి కావాల్సిన "ముత్యాలు" కొన్నాం. పెళ్ళిలో మా ఇంట్లోవాళ్లందరం వివిధ సందర్భాల్లో ధరించే దుస్తులను ఇంట్లోనే ఒక టైలర్‌ను పెట్టి కుట్టించాం.

నిర్ణయించబడిన ముహూర్తానికి వరుని తరపువారూ, వధువు తరపువారూ వారి వారి కులాచారానుసారం "శుభ లేఖలు"గా పిలువబడే ఆహ్వానపత్రికలు ముద్రించుకుంటారు. మంగళ సూచకంగా లేఖకు నాలుగు వైపులా పసుపు పూస్తారు. బంధుగణాన్ని పిలుచు కోవడం పెళ్లిళ్లలో సర్వ సాధారణం. ఎక్కడెక్కడో ఉంటూ, అరుదుగా కలిసే చుట్టపక్కాలతో సహా బంధువులందరూ కలుసుకోగలిగే "సామాజిక ఏర్పాటు" పెళ్ళిళ్లు. ఆ కలయికలకు వేదికగా పెళ్ళి వారి ఇల్లు (కల్యాణ మంటపం) మారిపోతుంది. మా పెళ్లి శుభలేఖలను ఖమ్మం వై.ఎన్. ప్రెస్లోక వేయించాం. బంధు-మిత్రులకు పోస్టులో పంపించినవాటికంటే కూడా, ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వ్యక్తి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పంచినవే ఎక్కువ. ముహూర్తానికి కనీసం పది-పదిహేను రోజులముందునుంచే ఈ కార్యక్రమం ఆరంభమయింది. ఎంత శ్రద్ధ తీసుకుని, అందరికీ పంపించే ఏర్పాటుచేసినప్పటికీ, ఆఖరు నిమిషంలో, ఒక్కోసారి ముఖ్యమైన వారితో సహా కొందరిని మరిచిపోవడం సహజంగా జరుగుతుంది. వాళ్లకు కోప-తాపాలు కూడా వస్తాయి. కాకపోతే వచ్చినంత త్వరగా తగ్గిపోతాయి కూడ. ఇవన్నీ సర్వసాధారణంగా ప్రతి పెళ్లిలోనూ-ప్రతివారింటిలోనూ జరిగే మామూలు విషయాలే. ఆ చిరు కోపాలు రాకుంటే పెళ్ళి శోభ రానట్లే. ఇవన్నీ మా పెళ్ళిలోనూ జరిగాయి-సర్దుకున్నాయి.(Part VI Next Follows)

Tuesday, February 23, 2010

వివాహబంధం-II: కామాన్ని ధర్మ బద్ధం చేయగల ఏకైక మార్గం వివాహం - వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-II

శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
"పరిణయం"-"పరిణయనం"-"పరి-నయనం"
వనం జ్వాలానరసింహారావు

సీతా కల్యాణ ఘట్టం ముందర, కల్యాణ సమయంలో, ఆ తర్వాత జరిగిన తంతు చదువుతుంటే కొన్ని ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. శివ ధనుస్సును విరిచిన శ్రీరాముడికి తాను చేసిన ప్రతిజ్ఞ ప్రకారం సీతనిచ్చి వివాహం చేస్తానని జనకుడన్నప్పటికీ, తనకు తండ్రి ఆజ్ఞ ముఖ్యమంటాడు రాముడు. అంటే పెద్దల ఆజ్ఞ లేకుండా, వారికి తెలియకుండా వివాహం చేసుకోకూడదనేది తెలుస్తోంది. జనకుడు వెంటనే దశరథుడి సమ్మతి పొందడానికి దూతలను పంపాడు. దశరథుడు కూడా ఆ విషయాన్ని తన సన్నిహితులందరికీ తెలియచేసి, వారి సమ్మతితోనే మిథిలకు బయల్దేరాడు. అంటే వివాహానికి బంధు-మిత్రుల ఆమోదం కూడా ముఖ్యమేనని అర్థం. విదేహనగరం చేరుకున్న దశరథుడికి, ఆయన వెంట వచ్చిన పెద్దలకు జనకుడు స్వాగతం పలికిన విధానం కూడా సందేశాత్మకమైందే.

ఇక దశరథుడి పక్షాన వశిష్టుడు, జనకుడి పక్షాన స్వయంగా ఆయనే, వారి-వారి వంశ క్రమాన్ని వివరించారు. కన్యను ఇచ్చుకొనేటప్పుడు, పుచ్చుకొనేటప్పుడు, అధమ పక్షం మూడు తరాల వంశ జ్ఞానం ప్రధానంగా తెలుసుకోవాలి. నేపధ్యం తెలుసుకోకుండా కన్యను ఇవ్వకూడదు-తీసుకొననూ కూడదు. వివాహంలో వధూవరుల నేపధ్యం అవశ్యంగా తెలియాలి. తొలుత తల్లి నేపధ్యం-తర్వాత తండ్రి నేపధ్యం పరీక్షించాలి. ధన ధాన్యాలు ఎంత సమృద్ధిగా వున్నప్పటికీ, వివాహ విషయంలో పది రకాల వంశం వారిని గురించి తెలుసుకోవాలని శాస్త్రం చెపుతున్నదన్న సంగతి విదితమవుతుందిక్కడ. వివాహ మంటపం దగ్గర కొచ్చిన దశరథుడిని జనకుడు ఆహ్వానించిన రీతినీ గమనించాలి. అలానే వశిష్టుడొక్కడే వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించకుండా, జనకుడి పురోహితుడైన శతానందుడు సహాయం తీసుకుంటాడు. మంటపాన్ని ఎలా అలంకరించాలి, ఏమేమి వస్తువులెక్కడ వుంచాలనే విషయాలు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే కల్యాణ ఘట్టమంతా నిశితంగా పరిశీలిస్తే పాణి గ్రహణం చేసుకొనేటప్పుడు జరగాల్సిన విధి విధానాలన్నీ అర్థమవుతాయి. కల్యాణమంతా అయింతర్వాత మగపెళ్ళివారిని సాగనంపే విధానం కూడా అర్థం చేసుకోవచ్చు.

ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని, ధర్మ బద్ధం చేయడానికి పెద్దలు, ఋషులు ఎంచుకున్న ఏకైక మార్గం వివాహం. ధర్మం ప్రాతిపదికగా, అర్థం-కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం "వివాహం". వివాహ ప్రక్రియతో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది. ఈ ప్రక్రియ భవిష్యత్ జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది. ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై, సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంటుంది. వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయ బద్ధమైన విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది. ఉదాహరణకు, హిందూ సంప్రదాయంలో, బారసాల నుండి వివాహం వరకు ఏ కార్యక్రమం జరిపించాలన్నా, వివాహం కానివారు, వివాహానంతరం అనేక కారణాలవలన ఒంటరిగా మిగిలిన స్త్రీ పురుషులు అనర్హులు. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధినిర్వహణకు అర్హులౌతారు కనుక హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞ-యాగాదులు లాంటివి నిర్వహించటానికి గృహస్థుడు ధర్మపత్ని సమేతంగా జరపాలని నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్ది తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే ఉంటాయి.

వివాహానికి మరో పేరు "పరిణయం". దీనిని అసలు "పరిణయనం" - "పరి-నయనం" అనికూడా అంటారు. వధూవరులిద్దరు ఒకరి దృష్టిలో మరొకరు పడి, భవిష్యత్ దంపతులుగా, కష్ట-సుఖాలను సమంగా పంచుకుంటూ, జీవితాంతం కలిసి-మెలిసి వుందామని-వుంటామని కంటి సైగల ద్వారా తెలియపర్చుకోవడమే పరిణయం (పరి+నయనం) అని చెప్పుకోవచ్చు. పెళ్లి పీటల పైకి వచ్చేంతవరకు, వధూవరులకు పరిచయం లేకపోయినా, ఒకరి గురించి మరొకరికి ఏ మాత్రం తెలియకపోయినా, కనీసం ఒకరినొకరు చూడకపోయినా, "వివాహబంధం" వారిద్దరి మధ్యా విడదీయరాని బంధాన్ని ఏర్పడేటట్లు చేస్తుంది. ఈ అసాధారణ చర్యకు ఎన్ని అర్థాలు చెప్పుకున్నా తక్కువేనేమో !

వివాహం కేవలం ఇద్దరు వ్యక్తులను మాత్రమే కలపదు. రెండు కుటుంబాలను-ఇరు కుటుంబాల సంబంధీకులను, రెండు వంశాలను-ఇరు వంశాల సంబంధీకులను, గతంలో లేని సంబంధంతో నిమిత్తం లేకుండా బంధించి వేస్తుంది. ఇక ఆ బంధం విడదీయరాని అనుబంధమే. క్రమేపీ పిల్లలు పుట్టడం, వంశాభి వృద్ధి చెందడం, ఇరు వంశాలకు చెందిన వారి మధ్య సంబంధ బాంధవ్యాలు పెరగడం, వీరికి-వారికి చెందిన వ్యక్తుల మధ్య మరిన్ని వివాహ సంబంధాలు కుదరడం, ఇలా ఒక నిరంతర ప్రక్రియలాగా సాగుతూ, ఆ బంధం మరింత దృఢ పడుతుంది. ఆ బంధం తెంచుకోవడమంటే సంప్రదాయాలను ధిక్కరించడమే.

పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం ఎంతో తీవ్రంగా భారతీయుల మీద-హిందూ వివాహ వ్యవస్థ మీద పడుతున్నప్పటికీ, తప్పనిసరి తంతుగానో-కుటుంబ నేపధ్య ఒత్తిడుల వల్లనో-ఇరు పక్షాలలో కనీసం ఒకరైనా సంప్రదాయం పాటించాల్సిందేనని పట్టుదలతో వుండడం వల్లనో-స్వయంగా వధూవరులిద్దరూ కోరుకుంటున్నందువల్లనో, ఇంకా హిందూ వివాహ సంప్రదాయం కొనసాగుతూనే వుంది. అయితే సంప్రదాయాన్ని పాటించి, వివాహం చేసుకున్నవారిలో, కనీసం నూటికి-కోటికి ఒక్కరైనా, ఆ ప్రక్రియను ఆసాంతం అర్థంచేసుకొనే ప్రయత్నం చేసి, దాని వెనుకనున్న అంతరార్థాన్ని గ్రహించి - ఇతరులకు తెలియ చేయగలిగితే, ఈ సాంప్రదాయిక వేడుక అజరామరంగా సూర్య-చంద్రులున్నంత వరకూ కొనసాగు తుందనడంలో అతిశయోక్తి లేదు.

సాధారణంగా వధువు తనకు కాబోయే భర్త అందంగా వుండాలని కోరుకుంటే, ఆమె తల్లి ధనవంతుడై వుండాలనుచుంటుంది. తండ్రికేమో కాబోయే అల్లుడు, ఉత్తమ గుణాలుండి, చదువు-సంస్కారం కలిగి, సత్ సంప్రదాయాలున్న కుటుంబానికి చెందిన వాడై వుండాలనుకుంటాడు. ఇక చుట్ట-పక్కాలు, బంధు మిత్రులు పెళ్లికొడుకు కలుపుగోలుగా వుండాలనుకుంటారు. ఇంతమంది కోరిక తీరడానికి, హిందూ వివాహ వ్యవస్థలో, అంచలంచల ఏర్పాట్లు చేసారు పూర్వీకులు. పెళ్ళి చూపులతో వివాహ ప్రక్రియ మొదలవడానికి పూర్వ రంగంలో, ఇరు పక్షాలకు చెందిన-ఇరువురికీ కావాల్సిన "పెళ్లి పెద్దలు" సంధాన కర్తలుగా వ్యవహరించి, కాబోయే వియ్యంకుల మధ్య రాయభారాలు చేసి, ఒప్పించి, కార్యక్రమానికి నాంది పలుకుతారు. సాంప్రదాయం ప్రకారం అబ్బాయికి చెందిన వారు బంధు-మిత్ర-సపరివార సమేతంగా అమ్మాయి ఇంటికి వెళ్ళి, అమ్మాయిని చూస్తారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు. పరస్పర సంప్రదాయాలు-కుటుంబ పద్ధతులు-ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి-పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.(Part-III Next)

వివాహబంధం-I: బాల కాండ మందర మకరందం-సీతా కల్యాణ ఘట్టం - వనం జ్వాలానరసింహారావు

జ్వాలానరసింహారావు-విజయలక్ష్మిల వివాహం-I

శ్రీ పప్పు లక్ష్మీ నరసింహమూర్తి చెప్పిన
"హిందూ సాంప్రదాయ వివాహ వేడుక"
వనం జ్వాలానరసింహారావు

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం బాల కాండను, "బాల కాండ మందర మకరందం" గా రాస్తున్న సందర్భంలో, సీతా కల్యాణ ఘట్టం చదువుతున్నంతసేపూ, నలబై సంవత్సరాల క్రితం జరిగిన మా వివాహం పదే-పదే గుర్తుకొచ్చింది. నాకే కాదు అది చదివిన వారికెవరికైనా అలా గుర్తుకు రావడం సహజం. ఒక్క మా పెళ్ళి విషయాలే కాకుండా, మేం జరిపించిన మా ఇద్దరమ్మాయిల పెళ్లి, అబ్బాయి పెళ్లి కూడా గుర్తుకొచ్చాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక వివాహం జరగాలన్నా, జరిపించాలన్నా పెళ్ళికి ముందు, పెళ్ళిలో, పెళ్లైన తర్వాత చోటుచేసుకునే ప్రతి విషయానికి సంస్కృతీ-సాంప్రదాయ పరంగానే కాకుండా శాస్త్రీయ కోణంలో ఆలోచించినా ఎన్నో అర్థాలు స్ఫురిస్తాయి. నేను బాల కాండలో సీతా కల్యాణ ఘట్టం చదివి-రాసిన తర్వాత, హ్యూస్టన్ కు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగు సాహితీ సమితివారు ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమానికి హాజరయ్యాను. అందులో శ్రీయుత పప్పు నరసింహమూర్తి గారు "హిందూ సాంప్రదాయ వివాహ వేడుక" గురించి మాట్లాడినప్పుడు మరొక్క సారి మా పెళ్ళి నాటి సంగతులు జ్ఞప్తికొచ్చాయి. ఆయన చెప్పిన విషయాలను, సీతా కల్యాణ ఘట్టంలోని విషయాలను మా వివాహానికి అన్వయం చేసుకుంటూ, "వివాహబంధం" గురించి రాద్దామన్న ప్రయత్నమే ఇది.

విశ్వామిత్రుడి ఆదేశం ప్రకారం శ్రీరాముడు అవలీలగా జనక మహారాజు దగ్గరున్న శివ ధనుస్సు వింటిని అరచేత్తో పట్టుకొని, అల్లెతాటిని బిగువుగా లాగుతుంటేనే, విల్లు ఫెల్లుమని రెండుగా విరిగిపోతుంది. ఇది చూసిన జనకుడు, సీత దశరథ కుమారుడు శ్రీరామచంద్రుడిని భర్తగా పొందడంవల్ల తమ జనక కులానికి కీర్తి సంపాదించిపెట్టినట్లైందని అంటాడు విశ్వామిత్రుడితో. "నా కూతురు వీర్య శుల్క అని నేను చేసిన ప్రతిజ్ఞ ఫలించింది. నేనన్న మాట ప్రకారం, నా ప్రాణంకంటే ప్రియమైన భూపుత్రి సీతను గొప్ప గుణాలున్న శ్రీరామచంద్రమూర్తికిచ్చి వివాహం చేస్తాను" అని జనకుడు సీతను రాముడికి ధారాదత్తం చేసే ప్రయత్నం చేయగా, వివాహమాడడానికి తనకు తండ్రి ఆజ్ఞలేదని అంటాడు రాముడు. విశ్వామిత్రుడి ఆదేశం మేరకు, మిథిలకు రమ్మని ఆహ్వానిస్తూ, దశరథుడి దగ్గరకు దూతలను పంపాడు జనకుడు. దూతలు అందించిన వార్తను విన్న దశరథ మహారాజు వామదేవ-వశిష్ఠాదులను, మంత్రులను పిలిపించి "మన శ్రీరామచంద్రుడి బల పరాక్రమం చూసి-మెచ్చిన జనకుడు, తనకూతురునిచ్చి వివాహం చేయనున్నాడు. జనకుడు తలపెట్టిన కార్యం మీకు సమ్మతమైతే, ఆలస్యం చేయకుండా పయనమై పోదాం" అనగా మంత్రులందరు ఇది తగిన కార్యమేనని, మంచి సంబంధమేనని అన్నారు.

మర్నాడు దశరథుడు చతురంగ బలాలతో, వాసుదేవుడు-వశిష్టుడు-జాబాలి-కాశ్యపుడు- మార్కండేయుడు-కాత్యాయనుడు లాంటి పెద్దలతో కలిసి బయలుదేరి ఐదవ రోజు పగటిపూట కల్లా విదేహనగరం చేరుకుంటాడు. ఆయన రాకను తెలుసుకున్న జనకుడు స్వాగతం పలికి, "నా పుణ్యం మంచిదైనందున, సూర్య వంశపు రాజులతో వియ్య మాడే అవకాశం కలిగింది. మిక్కిలి బలవంతులైన మీతో బంధుత్వం కలుస్తున్నందువల్ల మా వంశం అతి పూజ్యమైంది" అంటాడు. వివాహానికి సన్నాహాలు మొదలయ్యాయి. మర్నాడుదయం, జనకుడి ఆహ్వానాన్ని అందుకుని దశరథుడు ఋషులతో బంధువులతో కలిసి జనకుడున్న చోటికి పోయి, ఆయనకు వశిష్టుడిని చూపించి, ఇక్ష్వాకువంశానికి ఆయన కులగురువనీ, తమ గురించి చెప్పాల్సిన విషయాలన్ని ఆయన చెప్తాడనీ అంటాడు.

హితులతో-మంత్రులతో-పురోహితులతో కూడి వున్న జనకుడితో వశిష్టుడు సూర్యవంశక్రమాన్ని వివరించాడు. "అవ్యక్తసంభవుడు-నిత్యుడు-అవ్యయుడైన చతుర్ముఖ బ్రహ్మకు మరీచి జన్మించాడు. మరీచికి కశ్యపుడు-ఆయనకు వివస్వంతుడు-ఆయనకు మనువు-ఆయనకు ఇక్ష్వాకుడు కలిగారు. ఇక్ష్వాకుడి రాజధాని అయోధ్య" అంటూ మొదలుపెట్టి, చివరలో అంబరీషుడుకి నహుషుడు, అతడికి యయాతి, అతడికి ఆభాగుడు, అతడికి అజుడు, అతడికి బలశాలైన దశరథుడు కొడుకులుగా పుట్టారు" అని సూర్యవంశ క్రమాన్ని సవివరంగా తెలియచేశాడు. దశరథుడి కుమారులే శ్రీరామ లక్ష్మణులనీ, వీరి వంశం ఆదినుండి పరిశుద్ధమైందనీ, వీరందరు అసమాన ధర్మరతులు-వీరులనీ, సత్యమంటే ప్రీతికలవారనీ అంటూ, శ్రీరామచంద్రుడికి-లక్ష్మణుడికి సరితూగే గుణగణాలుగల తన ఇరువురు పుత్రికలను ప్రేమపూర్వకంగా ఇచ్చి వివాహం చేయమని, ఇది తన మనవి అని కోరాడు జనకుడిని.

ఇక్ష్వాకుల వంశ క్రమం వివరించిన వశిష్టుడితో జనక మహారాజు తనవంశక్రమాన్ని కూడా వినిపించాడు. తమ వంశానికి పూర్వీకుడు ధర్మాత్ముడైన "నిమి" అనీ, అతడి కొడుకు మిథి అనే మహాత్ముడే ఈ మిథిలా పురాన్ని కట్టించాడనీ, ఆయనే మొదటి జనకుడనీ, ఆ పేరే తమ వంశంలో "జనకుడు" అని రాసాగిందనీ, అదే వంశ నామం అయిందనీ అంటాడు. మిథి కొడుకు దగ్గరనుంచి మొదలెట్టి, మహారోముడికి స్వర్ణరోముడు, అతడికి హ్రస్వరోముడు , హ్రస్వరోముడికి తను తన తమ్ముడు కుశధ్వజుడు కొడుకులమని వంశ క్రమాన్ని వివరించిన జనకుడు దశరథుడితో, ముమ్మాటికి తన ఇద్దరు కూతుళ్లను ఆయన ఇద్దరు కుమారులకిస్తానని చెప్పాడు. మూడు రోజుల తర్వాత ఉత్తర ఫల్గుని నక్షత్రం వస్తుందనీ, ఆ రోజున వివాహం చేద్దామనీ అంటాడు.

ఆ రాత్రి కొడుకులతో వినోదంగా గడిపి దశరథుడు, మర్నాడు ఉదయం తూర్పు తెల్లవారుతుండగానే, కాల కృత్యాలు తీర్చుకొని పెళ్లిజరిపించేందుకై ఏర్పాటుచేసిన ఉత్సవ శాలకు చేరుకున్నాడు. అందమైన ఆభరణాలను ధరించి, కంకణం కట్టుకొని, రామచంద్రమూర్తి మంచి ముహూర్తంలో తమ్ములతో కలిసి వచ్చాడక్కడకు. వశిష్టుడు-ఇతర మునీంద్రులు ముందుండి తమ వెంట వస్తుంటే అందరూ కలిసి లోపలికి వెళ్లారు. అలా ప్రవేశిస్తుండగానే వశిష్టుడు జనక రాజును చూసి, దాత కొరకు దశరథుడు వేచి వున్నాడని చెప్పాడు. ఇచ్చేవాడు-పుచ్చుకునేవాడు ఒకచోట వున్నప్పుడే తదుపరి తతంగం జరుగుతుందని అంటూ, ఆయన స్వధర్మమైన-దాత చేయాల్సిన కార్యమైన పెళ్లి జరిపించమని వశిష్టుడు జనకుడికి తెలియచేశాడు.

వశిష్టుడితో జనకుడు, ఇతర ఋశీష్వరులతో కలిసి త్రిలోకాభిరాముడైన రామచంద్రమూర్తికి శీఘ్రంగా-సంతోషంగా వివాహ సంబంధమైన కార్యాలన్నీ జరిపించమని అన్నాడు. అలానే జరిపిస్తామన్న వశిష్టుడు, తనకు సహాయంగా విశ్వామిత్రుడు, శతానందుడు (జనకుడి పురోహితుడు) తోడుండగా వివాహ సంబంధమైన కార్యక్రమం చేపట్టాడు. చలువ పందిరిలో శాస్త్ర ప్రకారం వేదిని తీర్చి, పూలతో-పరిమళ ద్రవ్యాలతో దానిని అలంకరించి, మెరుస్తున్న బంగారు పాలికలతో-మొలకెత్తిన శుభకరమైన అడుగులేని పాత్రలతో-జిగుళ్లుగల మూకుళ్లతో-ధూపమున్న ధూప పాత్రలతో-స్రుక్కులు, స్రువాలు, అర్ఘ్యం పేలాలతో నిండిన స్వచ్ఛ పాత్రలతో-పచ్చని అక్షతలతో వేదిని నింపాడు వశిష్టుడు. మంత్రాలు పఠిస్తూ, పరిశుద్ధమైన దర్భలను పరిచి, శాస్త్రోక్తంగా వేదిలో అగ్నిని వుంచి, వశిష్టుడు హోమం చేశాడు.

సీతా కల్యాణ ఘట్టం

" సీతను సర్వాభరణో, పేతను దా నిలిపి నగ్ని కెదురుగ గౌస
ల్యా తనయున కభిముఖముగ, క్ష్మాతలనాథుండు రామచంద్రున కనియెన్ "

అన్ని విధాలైన అలంకారాలతో ప్రకాశిస్తున్న సీతను, అగ్నికి ఎదురుగా-శ్రీరామచంద్రమూర్తికి అభిముఖంగా, నిలువ బెట్టి, జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తితో:

“ఈ సీత నాదుకూతురు, నీ సహధర్మచరి దీని నిం గై కొనుమా
కౌసల్యాసుత, నీకును భాసురశుభ మగు గ్రహింపు పాణిం బాణిన్ "

" కౌసల్యా కుమారా, ఈ సీత నా కూతురు. నీ సహధర్మచారిణి. ఈమెను పాణి గ్రహణం చేసుకో. నీకు జగత్ ప్రసిద్ధమైన మేలు కలుగుతుంది. నీకు శుభం కలుగుతుంది. మంత్రపూర్వకంగా ఈమె చేతిని నీ చేత్తో పట్టుకో. రామచంద్రా, పతివ్రత-మహా భాగ్యవతి అయిన నీ సీత, నీ నీడలా ఒక్కసారైనా నిన్ను విడిచి వుండదు" అని అంటూ, మంత్రోచ్ఛారణతో పవిత్రవంతములైన జలధారలను రామచంద్రమూర్తి చేతుల్లో జనక మహారాజు ధారపోశాడు.

తర్వాత, జనక మహారాజు లక్ష్మణుడివైపు చూసి, "లక్ష్మణా ఇటు రా. దానంగా ఊర్మిళను స్వీకరించు. ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. ఈమె చేతిని ప్రేమతో గ్రహించు" మని కోరాడు. ఊర్మిళను లక్ష్మణుడికిచ్చిన తర్వాత, భరతుడిని మాండవి చేతిని, శత్రుఘ్నుడిని శ్రుతకీర్తి చేతిని గ్రహించమని ప్రేమతో పలికాడు జనకుడు. ఇలా నలుగురు కన్యలను దశరథుడి నలుగురు కొడుకులకు ధారపోసి, జనకుడు రాజకుమారులతో, దోష రహితమైన మనసున్న వారందరు సుందరులైన భార్యలతో కలిసి, సౌమ్య గుణంగలవారిగానూ-సదాచార సంపన్నులుగానూ కమ్మని అంటాడు. జనక మహారాజు మాటలను విన్న దశరథుడి కుమారులు-రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు, తండ్రి అనుమతితో భార్యల చేతులను తమ చేతుల్లో వుంచుకొని, సంతోషాతిషయంతో, మలినంలేని భక్తితో, అగ్నికి-వేదికి-మౌనీశ్వరులందరికి-రాజులకు భార్యలతో కలిసి ప్రదక్షిణ చేసారు. వివాహం శాస్త్ర ప్రకారం ప్రసిద్ధంగా జరిగింది. పూలవాన కురిసింది. ఆకాశంలో దేవ దుందుభులు ధ్వనించాయి. దేవతా స్త్రీలు నాట్యం చేసారు. గంధర్వ కాంతలు పాడారు. మంగళ వాద్యాలు మోగుతుంటే, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణ చేయడంతో పెళ్లి తంతు ముగిసింది. తమ భార్యలతో దశరథ కుమారులు విడిది ఇళ్లకు పోవడంతో, వారివెంట దశరథుడు, వశిష్ఠ విశ్వామిత్రాది మునీశ్వరులతో, బందువులతో విడిదికి పోయారు.

వివాహమైన మర్నాటి ఉదయం, అయోధ్యకు పోయేందుకు తమకు అనుమతినివ్వమని జనకుడిని కోరాడు దశరథుడు. సరేనన్న జనకుడు, దశరథ మహారాజుతో కలిసి, తాను కొంతదూరం ప్రయాణంచేసి-వారందరిని సాగనంపి, ఆయన అనుమతితో తన ఇంటికి తిరుగు ప్రయాణమై పోయాడు.(Part II Next)