Showing posts with label ప్రణబ్ ముఖర్జీ. Show all posts
Showing posts with label ప్రణబ్ ముఖర్జీ. Show all posts

Sunday, July 5, 2015

సంస్కారం లేని సామాజిక శాస్త్రవేత్త:వనం జ్వాలా నరసింహారావు

సంస్కారం లేని సామాజిక శాస్త్రవేత్త
వనం జ్వాలా నరసింహారావు
(ఒక సామాజిక వేత్త అర్థ రాహిత్యం-ఆంధ్రజ్యోతి 7-7-2015)
          రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గవర్నర్‌కు, రాష్ట్రపతికి పాదాభివందనం చేయడాన్ని వక్రీకరించి భాష్యం చెప్పిన సామాజిక శాస్త్రవేత్త కంచ ఐలయ్యకు ఇలా రాయడం (ఆంధ్రజ్యోతి-ఎడిట్ పేజి 05-07-2015), మాట్లాడడం కొత్తేమీ కాదు. తన వ్యాసాలలో, పుస్తకాలలో అను నిత్యం బ్రాహ్మణ్యాన్ని, బ్రాహ్మణులను "బాపనోడు" అనే పదాలతో కించపరిచే వ్యాఖ్యలు చేయడం, అది తప్పని చెప్పిన వారితో వాగ్వాదానికి దిగడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. హిందూ మతాన్ని అదే పనిగా అర్థం పర్థం లేని వ్యాఖ్యలతో విమర్శించడం కూడా ఆయనకు నిత్య కృత్యం.

మొన్న రాష్ట్రపతి హైదరాబాద్ వచ్చినప్పుడు, హకీం పేట విమానాశ్రయంలో ఆయన విమానం దిగిన తరువాత, రాష్ట్రపతికి స్వాగతం పలికే క్రమంలో, ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చిన వెంటనే, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తలవంచి ప్రణబ్ ముఖర్జీకి పాదాభివందనం చేశారు. వెంటనే రాష్ట్రపతి ఆయనను భుజం తట్టి ఆశీర్వదించారు. ఆ తర్వాత చేతులు జోడించి ముఖ్యమంత్రి రాష్ట్రపతికి నమస్కారం చేసారు. ఇదే రీతిలో కొన్నాళ్ల క్రితం మరో  సందర్భంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు యాదగిరిగుట్టలో చినజీయర్ స్వామి సమక్షంలో ముఖ్యమంత్రి పాదాభివందనం చేశారు. వీటిని ఒక విడ్డూరంగా, ఇదేదో బ్రాహ్మణ్యాన్ని మాత్రమే గౌరవించినట్లు చిత్రీకరించడం కొందరు మేధావుల కుసంస్కారానికి నిదర్శనం. నమస్కారం చేసేటప్పుడు కానీ, పాదాభివందనం చేసేటప్పుడు కానీ, ఎవరికైతే అలా చేస్తున్నామో, ఆ వ్యక్తి బ్రాహ్మణుడా, బ్రాహ్మణేతరుడా అని ఎవరూ చూడరు. నమస్కారానికి అర్హుడా? కాదా? అనేదే చూస్తారు. పాదాభివందనం చేసే విషయంలో  ఆర్హత విషయాన్ని మరింత లోతుగా ఆలోచించడం, బేరీజు వేయడం సమంజసం.

          పాదాభివందనం చేయడం అనేది ఎదుటి వ్యక్తుల వయస్సు, జ్ఞానం, పెద్దరికం, దైవత్వాలకు ఇచ్చే గౌరవం. వారి నిస్వార్థపూరిత ప్రేమ, సమాజం కోసం చేసే త్యాగాలకు గుర్తుగా ఈ పాదాభివందనాన్ని చేస్తాం. ఇలా పాదాభివందనాలను నిత్యం కానీ, లేదా ముఖ్యమైన కొన్ని సందర్భాలలో చేయడం కానీ భారతీయ సంస్కృతి-సంప్రదాయం. ఇలా భక్తితో తలవంచి వారి పాదాలకు నమస్కరించినప్పుడు అనుకూల శక్తి రూపంలో వారి నుంచి మంచి కోరికలు, ఆశీర్వాదాలు అందుకుంటున్నట్లు భావించాలి. కుటుంబంలో, సమాజంలో ప్రజల మధ్య సామరస్యాన్ని, పరస్పర ప్రేమ, గౌరవాలతో కూడిన వాతావరణాన్ని ఈ సంప్రదాయం సృష్టించగలదని గుర్తించాలి. జ్ఞాన వృద్ధులైన వారి పాదాలకు చేసే నమస్కారమే పాదాభివందనం. వయస్సుచే కాని, విద్యచేత కాని అధికు లైనవారికి ఎదురుగా వెళ్లి నమస్కరిస్తే, వారికి ఆయువు, విద్య, కీర్తి, బలం, వృద్ధి లభిస్తాయని మను ధర్మశాస్త్రంలో ఉంది. ఇవన్నీ పక్కన పెట్టి మొత్తం వ్యవహారాన్ని బ్రాహ్మణ్యంతో, బ్రాహ్మణ కులంతో ముడిపెట్టి విమర్శలు చేయడం తగని పని.

          సామాజిక శాస్త్రవేత్తగా-విశ్లేషకుడిగా, విద్యాధికుడిగా పేరున్న కంచ ఐలయ్య దృష్టిలో, ఆయన ఆలోచనా ధోరణికి వ్యతిరేకంగా వున్న ప్రతి చిన్నా-పెద్దా విషయం తప్పుగానే కనిపిస్తుంది. ఆయన తన పుస్తకాలలో, వ్యాసాలలో బ్రాహ్మణులను హిందూ మతాన్ని కించపరిచి రాసినట్లే, ఆయన కులాన్ని కాని, ఇతర కులాల వారిని కాని బ్రాహ్మణులు కాని మరెవరైనా కాని విమర్శిస్తే ఆయన వూరుకుంటాడా? తమ పేర్ల పక్కన కులాలను తగిలించుకుని తిరుగుతున్న ఈ రోజుల్లో బ్రాహ్మణుల ఆచార వ్యవహారానికి సంబంధించిన జంధ్యం వేసుకుని పవిత్ర పుణ్య క్షేత్రంలో కనిపించిన గవర్నర్‌ను పరుష పదజాలంతో విమర్శించిన ఆయన్నేమనాలి? ఒక్క బ్రాహ్మణులే కాదు....చాలామంది ఇతర కులస్తులు కూడా దేవుడి గుళ్లోకి వెళ్లేటప్పుడు వంటిపై నున్న అంగీ విప్పి వేయడం అనాదిగా వస్తున్న ఆచారం. జంధ్యం వేసుకునే వారిలో కొందరు బ్రాహ్మణేతరులు కూడా వుంటారనే విషయం ఆ మేధావికి తెలియదా? పబ్లిక్‌గా బట్టలు లేకుండా శరీరం పైభాగాన్ని చూపిస్తూ కులవృత్తులు చేసుకుంటున్న వారెందరు మనకు మన పల్లెల్లో కనిపించరు? వారందరూ ప్రదర్శించని కులాన్ని ఒక్క గవర్నరే ప్రదర్శించారా?

            "1947లో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మొట్ట మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర గవర్నర్, రాష్ట్రపతి కాళ్లను పబ్లిక్‌గా మొక్కగా మనం చూస్తున్న మహత్తర ఘట్టం" అనడం కూడా వాస్తవం కాదు. బ్రాహ్మణేతరుడైన సత్య సాయిబాబాకు దేశ విదేశ ప్రముఖులెందరో పాదాభివందనం చేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యక్తిగత వ్యవహారం కాదని మరో విమర్శ చేశారు ఐలయ్య. అలాగే ఆయన అన్నట్లు, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవంతో ముడిపడి ఉన్న సమస్య అంతకంటే కాదు. ఆత్మవంచన-విశ్వాసాలను ప్రదర్శించడం కూడా కాదు. సభ్యతకు, సంస్కారానికి, ఆచార వ్యవహారానికి, అనాదిగా వస్తున్న నమ్మకానికి, మీదుమిక్కిలి సాంప్రదాయానికి అసలు సిసలైన నిదర్శనం. పెద్దలకు పాదాభివందనం చేయడం ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఆ పదవిలోకి రావడానికి ముందునుంచే అలవాటుందనే విషయం ఆ సామాజిక శాస్త్రవేత్త వ్యాసంలోనే వుంది. కాకపోతే, ఆయన అప్పట్లో పాదాభివందనం చేసిన జయశంకర్ బీసీ అనే విషయం చంద్రశేఖర్ రావుకు తెలియదని చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. బహుశా ఈ రాష్ట్రంలో బ్రాహ్మణులెవరో, బ్రాహ్మణేతరులెవరో ఒక్క ఆ సామాజిక శాస్త్రవేత్తకు తప్ప మరెవరికీ తెలియదేమో! ఆ సామాజిక శాస్త్రవేత్త కుసంస్కారానికి మరో నిదర్శనం, చిన్నతనం నుంచే ఆయనకు పెద్దలకు నమస్కరించాలన్న కనీస అవగాహన కూడా లేకపోవడం. కర్మకాండలు చేయించడానికి పనికొచ్చిన బ్రాహ్మణుడు, కాళ్లు మొక్కడానికి పనికిరాడా? అప్పటినుంచే బ్రాహ్మణత్వంపై తన తిరుగుబాటు మొదలైంది అనడం కన్నా, ఆ విధంగా తన మూర్ఖత్వం, ఇతరులను కించపరచాలన్న భావన మొదలైంది అనడం సబబేమో! హిందూత్వం అనేది మతం అయినా-కాకపోయినా, మనిషి జీవించడానికి తగినటువంటి ఆదర్శమైన జీవనవిధానం అనే సంగతి కంచ ఐలయ్య గుర్తుచేసుకుంటే మంచిదేమో!

అహర్నిశలూ కంచ ఐలయ్య లాంటి వారి నుంచి విమర్శలనెదుర్కునే బ్రాహ్మణుల విషయానికొస్తే, ఒక నాడు సమాజాన్ని ఐక్యంగా వుంచడానికి తమ శాయశక్తులా కృషిచేసిన బ్రాహ్మణులను ఈ రోజుల్లో ప్రతి దానికీ టార్గెట్ చేస్తున్నారు కొందరు.  హైందవ మతంలో, ఆచారంలో, బ్రాహ్మణులు కూడా ఒక భాగం. ఇతర కులాల వారు, వర్ణాల వారూ చేయలేని అనేక పనులను, వైదిక కర్మ కాండలను చేయగల సామర్థ్యం కేవలం ఒక్క బ్రాహ్మణులకే నేటికీ వుందనడంలో అతిశయోక్తి లేదు. పూజారులుగా, అర్చకులుగా, వేద పండితులుగా, కర్మకాండలు నిర్వహించే వారిగా, సంబంధిత కార్యక్రమాల నిర్వాహకులుగా కొనసాగే విషయంలో వారికి ఇప్పటికీ పెద్ద నష్టం జరగలేదు. వివాహాలలో, అంత్యక్రియలలో, ఇతర పూజా పునస్కారాలలో వారు లేకుండా వ్యవహారం నడవడం కష్టమే ఇప్పటికీ. రాజకీయంగా కాని, సామాజికంగా కాని, ఆర్థికంగా కాని ఎదుగుదలకు నోచుకోలేక, బీదరికంలోకి అడుగు పెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది చాలామందికి. దీనికి తోడు, బ్రాహ్మణులకు వ్యతిరేకంగా అనుదినం చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా వారిని కడు ఇబ్బందులకు గురి చేయసాగింది. బ్రాహ్మణ వ్యతిరేకత చివరకు కులాల వ్యతిరేకతకు దారితీసింది. ఒక కులం వారు, మరో కులాన్ని దూషించే పరిస్థితులొచ్చాయి. అగ్ర కులాలని, వెనుకబడిన కులాలని, దళితులని బేధాలొచ్చాయి. బ్రాహ్మణ ద్వేషం బాగా ప్రబలిపోయింది. చివరకు జరిగిందేంటి? ఆర్థికంగా బ్రాహ్మణులు బాగా చితికి పోయారు. వ్యవసాయం మీద, భూమి మీద ఆధారపడిన బ్రాహ్మణులు, చట్టాల పుణ్యమా అని ఆ రకమైన ఉపాధిని కోల్పోయారు. ఒక నాటి పౌరోహిత్యం, పూజారి జీవితం, ఆయుర్వేద వైద్యం బ్రాహ్మణుల బ్రతుకు తెరువుగా కొనసాగడం కష్టమై పోయింది. వీటికి ఒకనాడు లభించిన గౌరవ మర్యాదలు కూడా కరవై పోయాయి. గత కొన్ని దశాబ్దాలుగా, భారత ప్రభుత్వ రిజర్వేషన్ చట్టాల మూలంగా, కనీ వినీ ఎరుగని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎప్పుడో, వేల ఏళ్ల క్రితం, అప్పటి బ్రాహ్మణులు ఏదో చేశారన్న నెపంతో, ఈ తరం బ్రాహ్మణులను ఇలా ఇబ్బందులకు గురి చేయడం భావ్యమా? దోపిడీ చేసిన వారు, దోపిడీకి గురైన వారు అంతరించి పోయారు. ఇప్పుడున్నది సమ సమాజం. అందరూ భారత రాజ్యాంగ కింద సమాన హక్కులు కలవారే అంటున్నాం. అలాంటప్పుడు, సమాజంలోని ఒక వర్గం వారిని బ్రాహ్మణులన్న కారణాన చిన్న చూపు చూడడం సమంజసమా? ప్రత్యేక హక్కులు కావాలని వారనడం లేదు. అడగడమూ లేదు. తమను అందరితో సమానంగా చూడమనే అడుగుతున్నారు. ఆర్థికంగా చితికి పోయిన తాము కూడా వెనుకబడిన వర్గాల వారిమే అంటున్నారు. అందరితో పాటు వారినీ సమానంగా చూడడం సమాజం కర్తవ్యం!


          ఇక "కులం" అంటే ఏమిటో చూద్దాం. జాతులు పెరుగుతూ తరుగుతూ వస్తున్నప్పటికీ, వర్ణాలు మాత్రం నాలుగు గానే వుండిపోయాయి. ఏదేమైనప్పటికీ, చాతుర్వర్ణ వ్యవస్థను ఎవరు-ఎప్పుడు సృష్టించినప్పటికీ, అది ఎలా రూపాంతరం చెందినప్పటికీ, ఒక విషయం మాత్రం వాస్తవం. అది ఒక సామాజిక అవసరాన్ని, బాధ్యతను నిర్వహించింది. అందువల్ల ఎవరు కూడా తాము ఫలానా కులంలో పుట్టామని బాధ పడాల్సిన అవసరం లేదు. గర్వ పడాల్సిన అవసరమూ లేదు. ఒక కులంలో పుట్టినందుకు వేరే కులం వారిని తక్కువగా కాని, ఎక్కువగా కాని చూడాల్సిన అవసరమూ లేదు. బ్రాహ్మణుల విషయానికొస్తే, వారు సమాజంలో దైవ చింతనను పెంచాలని, సమాజ హితం కోరే "పురోహితులు” గా వుండాలనీ, ఒకనాటి వ్యవస్థ నిర్దేశించింది. సమాజం వారికి అప్పగించిన బాధ్యతను చాలా కాలంపాటు, బ్రాహ్మణులు సక్రమంగా నిర్వహించారు కూడా. కాలానుగుణంగా, సమాజంలో వచ్చే మార్పులకు అనుగుణంగా, బ్రాహ్మణులు కూడా మార్పులకు లోనుకాక తప్పలేదు. ఒకటి మాత్రం వాస్తవం. బ్రాహ్మణులు కులవ్యవస్థకు కారకులు కాదు. వారు కుల వ్యవస్థను పెంచి పోషించిందీ లేదు. సమాజం అవసరాల నేపధ్యంలో అదే సమాజం సృష్టించుకున్నవే ఇవన్నీ. తమ పని తాము చేసుకుని పోతున్న బ్రాహ్మణులను, తమ బ్రతుకేదో తాము బ్రతుకుతున్న బ్రాహ్మణులను చీటికి-మాటికీ వేలెత్తి చూపుతూ, వారేదో తప్పు చేశారని చరిత్ర వక్రీకరించి మాట్లాడడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి పాదాభివందనం చేసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గవర్నర్ నరసింహన్ బ్రాహ్మణులు కావడం వల్లనే అలా జరిగినట్లుగా, వాళ్లు బ్రాహ్మణులు కావడం తప్పైనట్లుగా ఐలయ్య రాయడం   అన్నింటికన్నా పెద్ద తప్పు. End

Thursday, July 5, 2012

"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?: వనం జ్వాలా నరసింహారావు


"చేతులు" కాలుతున్న వేళ.... రాహుల్ మంతనాల ఆంతర్యం?
సూర్య దినపత్రిక (06-07-2012)
వనం జ్వాలా నరసింహారావు

స్వర్గీయ పివి నరసింహా రావు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కూడా, ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరైనా రహస్యంగా అడుగుతే, వచ్చిన సమాధానం, మరొక్క సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వున్నదని అట. దానికి కారణం ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తొలగించడమే. అలానే ప్రణబ్ ముఖర్జీని ఆయన చిరకాల వాంఛ ఏంటని ఎవరన్నా అడుగుతే ఠంఛన్‍గా వచ్చే సమాధానం, ఏ నాటికైనా ప్రధాన మంత్రి పీఠం అధిష్టించాలని వుందని. ఆ కోరిక ఇక తీరే అవకాశం లేదు. ఒక సారి రాష్ట్రపతి ఐన తరువాత ప్రధాని అయ్యేందుకు కుదరదని తెలిసినా, ఆయన ఆ పదవిని ఎంచుకోవడానికి కారణం, ఇప్పట్లో, కాంగ్రెస్ పార్టీ మరో మారు అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు లేనందునే. ఆ విషయం బాగా అర్థం చేసుకున్న ప్రణబ్, కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే, తనకెలాగూ ప్రధాని అయ్యేందుకు వీలు కాదు అని భావించి రాష్ట్రపతి పదవికి అంగీకరించారు. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే, దేశంలోను, రాష్ట్రంలోను 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు లేనట్లే. దీనికి కారణాలు అనేకం. రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి కాయ కల్ప చికిత్స చేసినా, ఆంధ్రప్రదేశ్ చేయి జారిపోయినట్లే!
కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు, ఒక వైపు జబ్బు ముదురుతుండగా, మరోవైపు, రోగ లక్షణాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. రోజు-రోజుకూ ఇన్‌ఫెక్షన్ వేగంగా పాకుతుండడంతో, వ్యాధిని నియంత్రించడం కష్ట తరమై పోతోంది. బహుశా నూట పాతికేళ్ల భారత జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ పరిస్థితిని, ఇంతకంటే మంచిగా ఎవరూ వర్ణించలేరేమో! స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచీ, కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా వుంటూ వస్తోందీ దక్షిణ భారత ప్రాంతం. కాకపోతే మొట్ట మొదటిసారి 1983-89 లో, ఆ తరువాత 1994-2004 మధ్యలో, ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం చేతిలో ఓటమి పాలైనప్పటికీ, అస్తిత్వాన్ని మాత్రం ఏ నాడూ కోల్పోలేదు. 1983-89 లో అధికారాన్ని కోల్పోయినా, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో 1989 ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అదే విధంగా 1994-2004 మధ్య కాలంలో అధికారంలో లేకపోయినా డాక్టర్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో 2004 లో మళ్లీ పూర్వ వైభవాన్ని పొంది 2009 లో మరో మారు ఎన్నికల్లో గెలిచి ఇంతవరకూ అధికారంలో కొనసాగుతోంది. దురదృష్టవశాత్తు అలాంటి రాజకీయ స్టాల్వార్ట్స్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం, ఆద్యతన భవిష్యత్‍లో అలాంటి వారు దొరుకుతారన్న నమ్మకం కుదరకపోవడం, పార్టీని అపజయ పరంపరలకు గురిచేస్తోంది.


అలనాడు నీలం సంజీవరెడ్డి, ఆయన తరువాత ఆయన వారసుడుగా వచ్చిన బ్రహ్మానందరెడ్డి, 1978-1989 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, 2004-2009 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన డాక్టర్ రాజశేఖర రెడ్డి మినహా, ఈ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య మంత్రులుగా పనిచేసిన వారందరూ, "దిగుబడి సరుకే"!. అధిష్ఠానం నమ్మిన వారో, అధిష్ఠానాన్ని నమ్మించిన వారో, అధిష్ఠానాన్ని ఆ కట్టుకోగలిగిన వారో, లాబీయింగ్ చేయగలిగిన వారో మాత్రమే ముఖ్యమంత్రులు కాగలిగారు. ఆ ఆచారం జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి సోనియా హయాం వరకూ అలాగే కొనసాగుతూ వస్తోంది. దామోదరం సంజీవయ్య గారి నుంచి నేటి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ అదే వరస. వీరిలో సమర్ధులు లేరని కాని, "దిగుబడి" కి సమర్ధత కొలమానం కాదని కాని ఈ వ్యాస రచయిత భావన కాదు. ఇదంతా ఒక ఎత్తైతే, కాంగ్రెస్ ఓట్ బాంక్ వ్యవహారం మరో ఎత్తు. ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఓడినప్పుడు కాని, ఆ తరువాత చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం హయాంలో ఓడినప్పుడు కాని, త్రి ముఖ పోటీ జరిగినప్పుడు కాని, కాంగ్రెస్ ఓటు బాంక్ 35-40 శాతానికి తగ్గకుండా పదిలంగా వుంటూ వస్తుంది. మొట్టమొదటి సారిగా దానికి భారీ గండి పడింది. తెలంగాణ ప్రాంతంలో తెరాస గండి కొడుతుంటే, సీమాంధ్రలో జగన్ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ పని చేసింది. ఓటింగు శాతం ఇరవైకి పడిపోయి ఘోర పరాజయం పాలైంది కాంగ్రెస్ పార్టీ. డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2014 లో ఎదురు కానున్న పరిస్థితి అగమ్య గోచరంగా కనిపించసాగింది. 
2009 ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడానికి కారణ భూతుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణానికి గురైన దరిమిలా పార్టీకి ఈ దుస్థితి క్రమేపీ ఏర్పడ సాగింది. ఒక పక్క తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐ, భారతీయ జనతా పార్టీల సారధ్యంలో ఊపందుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్‌ను మట్టి కరిపిస్తుంటే, మరో పక్క కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ సీపీ సీమాంధ్ర ప్రాంతంలో తిరుగులేని శక్తిగా ఎదగ సాగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సీమాంధ్రలో జగన్ విజయం, తెలంగాణలో తెరాస అభ్యర్థి విజయం కాంగ్రెస్ పార్టీని ఖంగు తినిపించాయి. అధిష్ఠానానికి నెత్తి బొప్పి కట్టించేలా చేశాయి. నెత్తి మీద కుంపటి దించుకున్న చందాన, చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఫలితం శూన్యం. కాకపోతే, చావు తప్పి కన్నులొట్టపోయినట్లుగా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు కాంగ్రెస్‌కు రెండు సీట్లిచ్చాయి. ఇదేదో తన ఘనతగా చాటుకుంటున్నాడు చిరంజీవి. ఆయన తన సినీరంగ పలుకుబడితో జనాలను ఆకర్షించుకోగలడేమో కాని, ఓటర్లను ఆకట్టుకోలేరనేది మరో మారు స్పష్టమైంది. కాంగ్రెస్ పార్టీకి తెలిసో-తెలియకో, ప్రత్యక్ష జోక్యంతోనో-పరోక్ష ఒత్తిడితోనో, ఆ పార్టీ రచించిన ప్రణాళికా వ్యూహం బెడిసికొట్టిందనాలి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్-తదనంతర పరిణామాలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర ప్రతికూలతకు దారి తీశాయి. మరి ఈ దుస్థితి నుంచి గట్టెక్కాలంటే, నాలుగో కృష్ణుడి రూపంలో, జైపాల్ రెడ్డో-జానారెడ్డో-శషిధర రెడ్డో-డి. శ్రీనివాసో-లేదా, మరో వ్యక్తో రావాలి. కాకపోతే ఆ వచ్చే వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురు కాదన్న నమ్మకం లేదు.
"టీ"-"జే" ల ఒత్తిడి మధ్య కొట్టు మిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య వున్నట్లుంది. ఇదే పరిస్థితి దాదాపు జాతీయ స్థాయిలో కూడా నెలకొని వుంది. కళ్ల ముందర, ఈ పరిస్థితిని అధిగమించడానికి, మార్గాలేవీ కనిపించడం లేదు. గత ఎన్నికల్లో యుపిఎ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి దోహదపడేందుకు, దేశంలోనే అధిక సంఖ్యలో-33 మంది ఎంపీలను సమకూర్చిన రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ప్రభావం జాతీయ స్థాయిలో పార్టీ మీద పడక తప్పదు. పార్టీ-యుపిఎ అధికారానికి దూరం కాక తప్పదు. ఈ నేపధ్యంలో, మన్మోహన్ సింగ్ నుంచి అత్యంత అలవోకగా ప్రధాని పదవిని తనయుడు రాహుల్ గాంధీకి బదలాయించాలని తాపత్రయ పడుతున్న సోనియా గాంధీ ముందున్న సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఏ విధంగా అధిగమించగలరు? కాంగ్రెస్ పార్టీ గడ్డు కాలం ఎదుర్కుంటుందన్నది వాస్తవం. సవాళ్లను సోనియా ఎదుర్కునే ముందర, రాష్ట్రంలో అందరికీ అర్థం అవుతున్న కొన్ని నగ్న సత్యాలను అధిష్ఠానం సహితం అర్థం చేసుకుంటే మంచిదేమో! మంచికో-చెడ్డకో రోశయ్యను మార్చి కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిని అంటగట్టిన అధిష్ఠానం, ఏ నాడన్నా ఆయనకు పరిపూర్ణ స్వాతంత్ర్యం ఇచ్చిందా? ఆయన మంత్రి వర్గాన్ని ఆయనే ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిందా? పదవుల పందేరం చేయనిచ్చిందా? ఆయనకిష్ఠమైన వారిని ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎంపిక చేసుకునే వీలు కలిపించిందా? తన మంత్రివర్గంలో అనునిత్యం తనను ఎదిరిస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు కిరణ్ కుమార్ రెడ్డికి అవకాశం వుందా? ముందు వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం అధిష్ఠానానికి ఉంది.
బహుశా, తమిళనాడు తరహాలో, ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో అవగాహన కుదుర్చుకోక తప్పని పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్‌కు తప్పదా? అలాంటప్పుడు, ఆ ప్రాంతీయ పార్టీ ఎలాగూ తెలుగుదేశం కాదు కాబట్టి, తెరాసతోను-వైఎస్సార్ సీపీ తోను అవగాహన వుండే అవకాశాలున్నాయా? రాష్ట్ర విభజన చేయక తప్పదా? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఏదో ఒక నిర్ణయం ప్రకటించక తప్పదా?  
2014 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్ర కాంగ్రెస్‌ను సన్నద్ధం చేసేందుకు-బలోపేతం చేసేందుకు, జాతీయ స్థాయిలో పార్టీ అధి నాయకత్వం-అధిష్జ్ఠానం చేపడుతున్న చర్యల్లో భాగంగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుమారుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, భావి భారత ప్రధానిగా భావించబడుతున్న రాహుల్‌ గాంధీ, ముఖ్య భూమిక పోషించేందుకు సమాయత్తమౌతున్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ కాయ కల్ప చికిత్స మొదలు పెట్టారంటున్నారు. అందులో భాగంగానే, ఢిల్లీలో తల్లిని కలవడానికి వచ్చిన పెద్దా-చిన్నా పనిలో పనిగా రాహుల్ గాంధీని కూడా కలిసి పోతున్నారు. అంతే కాదు. రాహుల్ గాంధీనే స్వయంగా ఎంపిక చేసిన కొందరికి ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. అధిష్ఠానానికి తలనొప్పిగా మారిన తెలంగాణ అంశంపైన, వైఎస్‌ఆర్సీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్‌ దూకుడు పైన రాహుల్‌ ప్రత్యేక దృష్టి సారించనున్నట్టు మీడియా కధనాలొచ్చాయి. రాష్ట్రంలోని సీనియర్‌ నేతలు పలువురితో వ్యక్తిగతంగా మంతనాలు జరిపారు. ఇప్పటికే రాహుల్‌ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ఎంపీలతో విడివిడిగా సమావేశమై పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘంగా చర్చించారంటున్నారు. అధినేత్రి సోనియా ఆదేశాలతోనే రాహుల్‌ రంగ ప్రవేశం చేశారా? లేక స్వయంగా ఆయన తనంతట తానే చొరవ తీసుకుని ఇలా చేస్తున్నారా? అనేది ఇంకా తేలాల్సిన విషయమే.
సీనియర్ పార్టీ నాయకుడు పాల్వాయి గోవర్ధనరెడ్డికి రాహుల్ కబురు పంపి మరీ కలుస్తున్నాడు. ఈ కలయిక వెనుక కాంగ్రెస్ పార్టీని సమూలంగా ప్రక్షాళన చేయాలన్న ఆశయముందా? లేక తాత్కాలికంగా నాయకత్వ మార్పు గురించిన ఆలోచన వుంటుందా? ఇప్పుడిప్పుడే ఏమీ చెప్పలేం. ఇటీవల కాలంలో పాల్వాయి గోవర్ధన రెడ్డిని సంప్రదించడం కొంచెం ఎక్కువైపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వేళ నాయకత్వం మార్చే అవకాశం వుంటే, సీనియర్ నాయకుడైన ఈ తెలంగాణ ప్రాంత వ్యక్తికి కూడా అవకాశాలుండవచ్చేమో! ఏదేమైనా ప్రత్యేక తెలంగాణ విషయంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు మెరుగయ్యాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అందులో భాగంగా, రాయల తెలంగాణాను ఏర్పాటు చేసి, తెరాసతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మిగిలిన సీమాంధ్ర ప్రాంతానికి మొదలు ఢిల్లీ నుంచి ఒక నాయకుడిని దిగుమతి చేసి ముఖ్యమంత్రిని చేయడం, ఆ తరువాత చిరంజీవిని పీఠం ఎక్కించడం జరగొచ్చని భావిస్తున్నారు.

Sunday, October 9, 2011

కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు! : వనం జ్వాలా నరసింహారావు

కళ్లున్న కబోదులకు ఏదీ కనిపించదు!

వనం జ్వాలా నరసింహారావు

మూసుకున్న ఢిల్లీ కాంగ్రెస్-యుపిఎ సారధ్య నాయకుల (నాయకీమణుల) కళ్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అవును మరి! ఇంకా కొద్ది రోజులు మూసుకునే వుంటే, వారింక ఎప్పటికీ తెరవలేమోనన్న భయం పట్టుకుంది. అప్పుడో మాట, ఇప్పుడో మాట - అక్కడో మాట, ఇక్కడో మాట - అమ్మ ముందో మాట, వెనుకో మాట - సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులతో ఒక మాట, తెలంగాణ వారితో మరొక మాట - తమ పార్టీ రాష్ట్ర నాయకులతో చెప్పేదొకటి, ఇతర పార్టీల వారితో చెప్పేదొకటి - ఇలా ఎప్పటికప్పుడు పబ్బం గడుపుకుంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చిన ఢిల్లీ (కాంగ్రెస్ అధిష్టానం బృందగానం ఆలాపించే) నాయకులకు సకల జనుల సమ్మె వేడి నపాళానికెక్కింది. మింగలేక, కక్క లేక, అధినేత్రి సోనియాకు మొర పెట్టుకుని వుండవచ్చు. జ్ఞానోదయం కలగడం ఆమె దగ్గర నుంచి ఆరంభమైందా? లేక ఆమె సూచనతో బృందగాన భజన పరులకు స్వయానా కలిగిందా? అర్థం చేసుకోవడం కష్టమే! కాని, రాదనుకున్న కదలిక కనపడడం (కనీసం వినపడడం) మాత్రం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవడం తధ్యమనే విషయం, దాంతో పాటే, మూడు వారాలకు పైగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సకల జనుల సమ్మె ప్రభావం నుండి బయటపడే అవకాశాలు మటుకు ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. అలా జరగకపోతే, ముఖ్యమంత్రి మొదట్లో చెప్పినట్లు, సమ్మె ప్రభావం ఒక్క తెలంగాణ ప్రాంతం పైనే కాకుండా, యావత్ ఆంధ్ర ప్రదేశ్ తో సహా, భారత దేశంలోని పలు రాష్ట్రాలపై పడే అవకాశాలున్నాయనే సంగతి కేంద్రం ఈ పాటికే గ్రహించి వుండాలి.

అరవై ఏళ్లుగా - పోనీ నలభై ఏళ్ళుగా - కనీసం గత పదకొండేళ్లు గా నన్నా - అధమ పక్షం రెండేళ్లకు పైగా - ఇవేవీ కాకపోయినా ఇటీవల మూడు వారాలకు పైగా జరుగుతున్న సకల జనుల సమ్మె ప్రభావం నేపధ్యంలోనైనా, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కళ్ళున్న కబోదుల మాదిరిగా, చూసీ చూడనట్లు -అంటీ ముంటనట్లుగా వ్యవహరించిన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ (నాటి నుంచి నేటి వరకున్న) అధిష్ఠానం, ఆ పార్టీ ఈ నాటి అధినేత్రి, ఆమె భజన బృందం, కనీసం ఇప్పటికైనా తెలంగాణ సమస్యపై సముచిత స్థాయిలో దృష్టి పెట్టడం ఆహ్వానించ దగ్గ పరిణామం. దాని పర్యవసానమే, బహుశా, తమలో తాము విస్తృతంగా చర్చించుకోవడం, రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ ను ఢిల్లీకి రమ్మనడం - ప్రదాన మంత్రితో భేటీకి పిలవడం, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహను, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను, మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ ను కూడా రమ్మనడం కావచ్చు. కోర్ కమిటీలు, మినీ కోర్ కమిటీలు ఎడతెరిపి లేకుండా సమావేశమవుతున్నాయి. ఏం జరుగబోతుందోనన్న అంశం ఇంకా అస్పష్టంగా వున్నప్పటికీ, ఏదో జరుగడం ఖాయం అన్న విషయంలో మాత్రం స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఎవరి (కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ) నోటి నుండి తెలంగాణ విషయంలో ఒక అసంబద్ధమైన మాటలు రెండు రోజుల క్రితమే వెలువడ్డాయో, ఆ వ్యక్తికే కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను అధినేత్రి సోనియా గాంధి అప్ప చెప్పడం విశేషం. దసరా పండుగ (తెలంగాణ ప్రాంతానికి చెందిన ఏ ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఈ ఏడాది జరుపుకోని పండుగ!) పూర్తయిన వెంటనే కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించడమంటే, కనీసం దీపావళి కానుకగా నన్నా, ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను భౌగోళికంగా విడదీసి - రాబోయే తర తరాల తెలుగు వారు కలిసి మెలిసి సహజీవనం సాగించే విధంగా, చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించవచ్చన్న ఆశలు ఇరు ప్రాంతాలలో చిగురిస్తున్నాయనవచ్చు.

తెలంగాణ సమస్యకు పరిష్కారం అంత సులభమైంది కాదని, ఐనా అందుకు తామందరం యత్నిస్తున్నామని, ఎప్పటి లోపు సమస్య తేలుతుందోనని, అసలు ఏ దిశగా అది పరిష్కరించబడుతోందని, చూద్దాం - చేద్దాం అని, క్లిష్టమైన సమస్యను మరింత సంక్లిష్టంగా - భూతద్దంలో చూపించే ప్రయత్నం "రాజనీతిజ్ఞుడు" అని అందరూ భావించే ప్రణబ్ ముఖర్జీ కూడా చేశాడంటే, ఏదో జరుగబోతుందోనన్న సంకేతం ఇచ్చినట్లే! భారతదేశంలో, రాష్ట్రాల ఏర్పాటులో, ఒక పద్ధతిని అనుసరించలేదని, అలా అలవోకగా చరిత్ర -భూగోళం కలిపి కలగాపులగంగా ఓ ప్రైవేట్ చానల్ ఇంటర్వ్యూలో, ప్రణబ్ ఏదేదో మాట్లాడడం వెనుక అనేకానేక గూడార్థాలుండే వుండాలి. యాదృచ్చికంగానే జరిగిందో? లేదో? కాని, సరిగ్గా అదే సమయంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఇచ్చిన జవాబులో (ఆయన రాసిన లేఖకు ప్రతిగా) తెలంగాణ అనే సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన అంశంపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం చేయ దగ్గ కృషి అంతా చేస్తున్నది అని సంజాయిషీ ఇచ్చుకున్నారు. ప్రధాని ఈ విషయాన్ని తెలంగాణ విషయంలో ఏ అభిప్రాయం చెప్పని ఒక పార్టీ నాయకుడికే ఎందుకు రాశారో అర్థం కాని అంశం.

తెలంగాణ అంశం సున్నితమైనదని, సంక్లిష్టమైనదని, దాన్ని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించలేమంటూ ప్రణబ్ ముఖర్జీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపాయి. కాంగ్రెస్‌లోని తెలంగాణ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఐనా, ఆ వ్యాఖ్యలలో తప్పేమీ లేదని సర్దుకుపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రణబ్ వ్యాఖ్యలలో తెలంగాణ అనుకూలమైన అర్థాలను వెతికే ప్రయత్నమే చేశారు. దీంతో.. అసలు ఆ వ్యాఖ్యలు కావాలని చేసినవా? లేక నోరు జారి చేసినవా? అన్న సంశయం కూడా కలిగింది. ప్రణబ్ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేమని ఇదంతా వ్యూహాత్మకమేనని మెజారిటీ నేతలు అంటున్నారు. తెలంగాణ అంశంపై త్వరలో నిర్ణయం వెలువడుతుందంటూ కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాన్ని కట్టడి చేసే వ్యూహంలో భాగంగానే ప్రణబ్ ఇలా మాట్లాడి ఉంటారని కొందరు విశ్లేషకులు భావిస్తుంటే, మరి కొందరు తెలంగాణ ఏర్పాటు కొరకే ఆయన ఈ వ్యాఖ్యలు చేసారని ఘంటాపథంగా చెప్తున్నారు. ఏదేమైనా, ఆ వ్యాఖ్యలు చేసిన అతి కొద్ది సమయంలోనే ఢిల్లీలో చర్చల ప్రక్రియకు శ్రీకారం చుట్టడం శుభపరిణామాలకు దారితీయవచ్చని అందరి ఆశగా చెప్పుకోవచ్చు. తెలంగాణ ఇవ్వడం - ఇవ్వకపోవడం కాదు సమస్య. సకల జనుల సమ్మె ప్రభావంగా దినదినం దుర్భరమవుతున్న సామాన్య-అసామాన్య పౌరుల జీవనం ఒకింత కుదుట బడే వీలుంటుందన్న నమ్మకం కలుగుతోంది.

ఈ నేపధ్యంలో గత వారం రోజులుగా ఢిల్లీలో నాటకీయంగా జరిగిన పరిణామాలు రాజకీయ విశ్లేషకులకు, రాజకీయాలలో వున్న నాయకులకు, రాజకీయం చేసే వారికి, ఆసక్తి కలిగించినప్పటికీ, చిత్తశుద్ధితో తెలంగాణ సమస్యకు పరిష్కారం త్వరలో లభించాలని కోరుకుంటున్న ప్రజానీకానికి మాత్రం అసహ్యంగా, అతి జుగుప్సాకరంగా వున్నాయనక తప్పదు. సమస్య పరిష్కారానికి ఇంకా కొంత సమయం ఎందుకు కావాలి? ఎవరి కొరకు కావాలి? ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నందున సకల జనుల సమ్మెను విరమించమని అడిగే వారికి వారెందుకు సమ్మె చేస్తున్నారో అర్థం కావడం లేదా? సమస్యకు పరిష్కారం కావాలంటే ఇచ్చిపుచ్చుకొనే ధోరణితో వ్యవహరించాలంటున్న వారి ఉద్దేశం ఒక ప్రాంతం వారికే ఈ సూత్రం వర్తిస్తుందా? ఎప్పటికీ ఒకరే ఇచ్చుకోవాల్నా? పుచ్చుకోవాల్నా? ఎవరూ నష్టపోని రీతిలో విన్-విన్ సిచ్యువేషన్ పరిస్థితి వుండాలనడం ఎంతవరకు సమంజసం? "విన్" అంటే ఒకరి "విన్నా"? ఇద్దరి "విన్నా"? భాగస్వాములందరూ కలిసి నిర్ణయం తీసుకోవాలంటున్నారు. తెలంగాణ విషయంలో "భాగస్వాములు" (స్టేక్ హోల్డర్స్) అంటే ఆ ప్రాంతంలో వుండే ప్రజలు -ప్రజా ప్రతినిధులు - రాజకీయ పార్టీల నాయకులు - పౌర సమాజం నాయకులు - ప్రభుత్వ, ప్రభుత్వేతర సిబ్బంది, సిబ్బంది నాయకులే కాని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ససేమిరా ఇష్టపడని పొరుగు వారు, పొరుగు రాష్ట్రాల వారు, ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు ఎలా అర్హులవుతారు? ఇంకా నయం...సరిహద్దు దేశాల వారిని, ఐక్య రాజ్య సమితి సభ్యులను కూడా "స్టేక్ హోల్డర్స్" చేద్దామని అనడం లేదు!

అన్నింటికన్నా వింతైన వార్తలను గత వారం కొన్ని పత్రికలు ప్రచురించాయి. వాటిలో నిజా-నిజాలెంతవరకో కాని, అందులో ఏ మాత్రం వాస్తవం వున్నా, పరిస్థితి గందరగోళం అనక తప్పదు. తెలంగాణ సమస్యను వేగంగా పరిష్కరించమని, లేకపోతే, తాము తమ-తమ నియోజక వర్గాల్లో తిరగడం కష్టమని, తమ మనుగడ - కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలిపోతుందని, మొర పెట్టుకోవడానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు-ప్రజా ప్రతినిధులకు, మన్మోహనే తన మొర వినిపించాడట. అదో వింత అనుభవం అంటున్నారు కాంగ్రెస్ నాయకులు కొందరు. తానూ-తన సంకీర్ణ కేంద్ర ప్రభుత్వం మనుగడ సాగడం ఇబ్బందికరంగా వుందని, ప్రధాని వ్యాఖ్యానించినట్లు సమాచారం. కాకపోతే, తన మొర ఎలా వున్నా, తెలంగాణ నాయకుల మొరను అధినేత్రి సోనియా దృష్టికి, కోర్ కమిటీ దృష్టికి తీసుకెళ్తానని మంచి మనసుతో అన్నారు పాపం ప్రధాని! తాను, తన పార్టీ కేంద్ర స్థాయి నాయకులు, తన సారధ్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు, తెలంగాణ ఏర్పాటు విషయంలో తీసుకుంటున్న చొరవకు సంబంధించిన అన్ని సంగతులు వివరించారట ప్రధాని.

హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎలా వచ్చారో, అలానే తిరుగు ప్రయాణం కట్టారు కేసీఆర్ అని కొందరనడం హాస్యాస్పదం. ఆయన వెళ్లి వచ్చిన తర్వాతే ఈ తతంగం అంతా జరుగుతుందంటే, ఆయన ప్రమేయం ఏదీ లేకుండా ఎలా వుంటుంది? తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమైన నిర్ణయం రాని పక్షంలో, రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, కాంగ్రెస్ తెలంగాణ నాయకులు, తెలుగుదేశం తో సహా ఇతర పార్టీ నాయకులు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో, కారణాలేవైనా, తెలంగాణ సమస్యకు ఒక పరిష్కారం కనుగొనక తప్పదని కాంగ్రెస్ అధిష్ఠానం ఓ స్పష్టమైన అంచనాకు వచ్చిందనేది స్పష్టం. ఇక ఎంతమాత్రం నాన్చడం మంచిది కాదని నిర్ణయించుకుంది. రాష్ట్రంలో పరిస్థితి రోజురోజుకు తీవ్రంగా మారుతోందని అర్థమవుతోంది కాంగ్రెస్ అధిష్టానానికి. కళ్లున్న కబోదులకు, మూసిన కళ్లను తెరవక తప్పలేదు. ఒకరి వెంట మరొకరిని ఢిల్లీకి రమ్మని కబురు పెట్టారు. గవర్నర్ నరసింహన్ ప్రధానిని, రక్షణ మంత్రి ఆంటోనీని కల్సినట్లు సమాచారం. మరోపక్క, ముఖ్యమంత్రి కిరణ్, ఉపముఖ్యమంత్రి రాజనర్సింహ, ఇతర నాయకులు ఆజాద్ ను, ఇతర ప్రముఖులను కలుస్తున్నారు. ఉక్కు పిడికిలితో ప్రజాభిప్రాయాన్ని అణచి వేయడం అసాధ్యం అనే సంగతి స్పష్టమైంది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందనాల్సిందే. ఆటకు ముగింపు రానున్నది.